రాజకీయాలలో విజయ్ సినిమా ఫ్లాపేనా?.. తాజా సర్వేలో టీవీకే పార్టీకి వచ్చే సీట్లెన్నంటే?

తమిళ తళపతి విజయ్ పొలిటికల్ మూవ్ పెద్ద డిసాస్టర్ గా మారనుందా? రాజకీయ పార్టీ స్థాపించి ఆయన సాధించేదేమీ లేదా? అంటే తాజాగా ఒక ప్రముఖ చానల్ నిర్వహించిన సర్వేలో అదే తేలింది. 2026 అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ పార్టీ టీవీకే అధికార డీఎంకే పార్టీకి గట్టి పోటీదారుగా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే తాజా సర్వేలో ఎన్నికలలో టీవీకే నామమాత్రపు ప్రభావాన్ని మాత్రమే చూపుతుందని తేలింది. వచ్చే ఎన్నికలలో అధికార డీఎంకే 105 స్థానాలతో సునాయాసంగా మెజారిటీ సాధించి మరో సారి అధికార పగ్గాలు చేపడుతుందని సర్వే పేర్కొంది. ఇక ఏఐడీఎంకే 90 స్థానాలతో బలమైన ప్రతిపక్షంగా నిలుస్తుందనీ సర్వే ఫలితం తేల్చింది. అయితే ఎన్నో అంచనాలున్న విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం మాత్రం కనీసం ఒక్క స్థానంలో కూడా విజయం సాధించే అవకాశం లేదని సర్వే పేర్కొంది. తమిళనాడులోని 234  అసెంబ్లీ స్థానాలలో టీవీకే ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా విజయం సాధించే అవకాశం లేదని సర్వే పేర్కొనడంతో విజయ్ ను తమిళ జనం ఇప్పటికీ విజయ్ ను మాస్ హీరోగానే తప్ప   రాజకీయనాయకుడిగా గుర్తించడం లేదని అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్.. హీరో ఇమేజ్ నుంచి పొలిటికల్ లీడర్ గా తన ఇమేజ్ ను మేకోవర్ చేసుకోవడానికి ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతారన్నది ఆసక్తిగా మారింది.  

మద్యం కుంభకోణంలో చట్టం తన పని తాను చేసుకుంటుంది : మంత్రి గొట్టిపాటి

  గత వైసీపీ ప్రభుత్వానికి ఉన్నంత ప్రచార పిచ్చి కూటమి ప్రభుత్వాన్నికి లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యార్థులకు కావాల్సిన వస్తువులన్నీ మంచి నాణ్యతతో ఇచ్చాం. రాజకీయ నాయకుల ఫొటోలు వేయకుండా విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశాం. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది.’’ అని గొట్టిపాటి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తల్లికి వందనం కింద రూ. 10 వేల కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశామన్నారు.  జగన్ హయాంలో నాసిరకం మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన అందరికీ శిక్ష పడుతుందని అన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో చట్టం తన పని తాను చేస్తోందని చెప్పారు. వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు బిగించడం లేదని మంత్రి స్పష్టం చేశారు.‘‘రైతుల వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించబోమని గతంలో చెప్పాం. వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించడం లేదు. ఎక్కువ విద్యుత్ బిల్లులు వస్తున్నాయని దుష్ప్రచారం చేస్తున్నారు. వైసీపీ హయాంలో 9 సార్లు విద్యుత్ బిల్లులు పెంచారని ఆయన తెలిపారు.  

పాఠశాలపై కూలిన విమానం..19 మంది మృతి

  బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని మైల్‌స్టోన్ స్కూల్ అండ్ కాలేజీ క్యాంపస్‌లో బంగ్లాదేశ్ ఎయిర్‌ఫోర్స్ శిక్షణ విమానం  కుప్పకూలింది. దీంతో క్యాంపస్‌లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చేలరేగాయి. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. వెంటనే అక్కడి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కూలిన విమానం F-7 BGI గా బంగ్లా సైన్యం పేర్కొన్నాది. విమానం కూలడంతో ఘటనా స్థలంలో పొగలు ఎగసిపడుతున్నాయి. రెస్క్యూ టీములు సహాయక చర్యలు చేపట్టాయి. విమానం బంగ్లాదేశ్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందినదిగా ఆర్మీ అధికారికంగా ధృవీకరించింది.  ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు.  

కోనేరు హంపికి ఆల్ ది బెస్ట్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

  జార్జియాలో జరుగుతున్న ఫిడే మహిళల చెస్ వరల్డ్ కప్‌లో సెమీస్‌కు చేరిన తెలుగు తేజం, భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపికి సీఎం రేవంత్‌రెడ్డి  ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా హంపి నిలవడం తెలుగు ప్రజల గర్వకారణమని పేర్కొన్నారు. వరల్డ్ కప్‌లో ఆమె ఘన విజయం సాధించాలని మనసారా కోరుకుంటున్నాని ముఖ్యమంత్రి హంపికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.  ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా హంపి నిలవడం తెలుగు ప్రజలకు గర్వకారణమని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్లో కోనేరు హంపి చైనాకు చెందిన యుక్సిన్ సాంగ్ పై 1.5-0.5 తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో ఆమెకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.మరోవైపు ద్రోణవల్లి హారిక, దివ్య దేశ్ ముఖ్ మధ్య జరిగిన క్వార్టర్స్ టైబ్రేకర్ కు వెళ్లింది. తొలి గేమ్ ను డ్రా చేసుకున్న వీరిద్దరూ... రెండో గేమ్ లోనూ పాయింట్స్ పంచుకున్నారు. ఈ క్రమంలో, వీరి టైబ్రేకర్ నేడు జరగనుంది.  

తమిళనాడు సీఎం స్టాలిన్ కు అస్వస్థత.. అపోలో ఆస్పత్రిలో చికిత్స

తమిళనాడు ముఖ్యమంత్రి  స్టాలిన్‌ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. సోమవారం (జులై 21) మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆయనను   అపోలో హాస్పిటల్‌ కు తరలించారు. అక్కడ వైద్యుల బృందం ఆయనకు చికిత్స చేస్తున్నది. మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆయన కళ్లు తిరుగుతున్నాయని చెపపడంతో ఆస్పత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో స్టాలిన్ ఉన్నారు.  సీఎం స్టాలిన్ కు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అపోలో వైద్యులు తెలిపారు. ఈ మేరకు హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. 

అజ్ఞాతంలోకి పేర్ని నాని.. హైకోర్టులో మాజీ మంత్రికి చుక్కెదురు

కృష్ణా జిల్లా పామర్రులో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని రప్పా రప్పా అంటూ కొట్టిన డైలాగులు ఆయన్ని మరో కేసుల ఉచ్చులో బిగుసుకునేలా చేశాయి. ఓ కల్యాణ మండపంలో  జులై 8న జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రప్పా రప్పా అని చెప్పడం కాదు.. కన్ను కొడితే రాత్రికి రాత్రి చేసేయాలంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. లోకేష్‌ రెడ్ బుక్ అంటున్నాడు.. మీరు కూడా రప్పా.. రప్పా అంటున్నారు.. ఏదైనా పని చేయాలంటే చీకట్లో కన్నుకొడితే పని అయిపోవాలని పేర్నినాని వ్యాఖ్యానించడం ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. పని చేయాలంటే అనవసరమైన మాటలు...అల్లరి కాదని... పనిచేయడమే ముఖ్యమని హింసను ప్రేరేపించేలా వైసీపీ క్యాడర్‌ను ఉద్దేశించి పేర్ని నాని వ్యాఖ్యానించడం పొలిటికల్‌ హీట్‌ను పెంచేశాయి. ఆ క్రమంలో పేర్ని నానిపై మచిలీపట్నంలో కేసు నమోదైంది. ఆర్‌.పేట పీఎస్‌లో పోలీసులు జీరో ఎఫ్ఐఆర్‌ నమోదు చేశారు. పామర్రు మీటింగ్‌లో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలతో కేసు నమోదు చేశారు.  కృష్ణా జిల్లా అవనిగడ్డ పోలీస్ స్టేషన్‌లోనూ పేర్ని నానిపై కేసు నమోదైంది. పేర్ని నానిపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ రాష్ట్ర నేత కనపర్తి శ్రీనివాసరావు  అవనిగడ్డ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  గుడివాడలో వైసీపీ నాయకుల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనడానికి ముఖ్యఅతిధిగా హాజరైన పేర్నినానికి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. వరుసగా రెండు రోజుల నుంచి పేర్ని నాని చేస్తున్న వివాదాస్పద కామెంట్స్‌పై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్ని నాని వ్యాఖ్యలకు నిరసనగా వైసీసీ ఫ్లెక్సీలను చించి వేశారు. వైసీపీ అధ్యక్షుడు జగనే రప్పరప్ప డైలాగులో తప్పు లేదనడంతో.. మనం మాత్రం ఎందుకు తగ్గాలన్నట్టు పేర్ని నాని వంటి నేతలు తమ శ్రేణులను మరింత రెచ్చగెట్టేలా స్టేట్ మెంట్లు ఇస్తుండటంపై ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా వరుసగా నమోదవుతున్న కేసులతో హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పేర్నినాని ప్రయత్నించారు. అయితే, హైకోర్టు పేర్ని నాని విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. అరెస్టు నుంచి ముందస్తు రక్షణ దక్కకపోవడంతో కంగుతిన్న పేర్ని నాని సైలెంట్‌గా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.  పేర్ని నాని ఈనెల 22న హైకోర్టు విచారణ తరువాత బయటకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 

ఈట‌ల కొత్త పార్టీ బీజేఎస్?

మాజీ మంత్రి, బీఆర్ఎస్ మాజీ నాయకుడు.. ప్ర‌స్తుత బీజేపీ నాయ‌కుడు ఈట‌ల రాజేంద‌ర్ కొత్త పార్టీ పెడుతున్న‌ట్టుగా  వార్త‌లు జోరుగా విన‌వ‌స్తున్నాయి. ఆ పార్టీ పేరు బహుజన జనతాసమితిగా   ప‌లువురు సోష‌ల్ మీడియాలో పోస్ట‌ర్లు వేసి మ‌రీ ప్ర‌చారం చేస్తున్నారు. ఈటల కొత్త పార్టీ పెట్టడం, దాని పేరు బహుజన జనతా సమితి (బీజెఎస్ గా పలువురుు ధృవీకరణలు కూడా చేసేస్తున్నారు. ఈటల ప్రస్తతం ఉన్న బీజేపీ,  గతంలో ఉన్న  బీఆర్ఎస్ రెంటినీ స్ఫురింప చేసేలా బీజెఎస్  అనే పేరును ఈటల ఫిక్స్ చేసినట్లుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.   రాష్ట్రంలో ఇప్ప‌టికే బీసీల ఓటు బ్యాంకు కోసం పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉంది.  ఒక ప‌క్క అధికార  కాంగ్రెస్ బీసీల రిజ‌ర్వేష‌న్ల కోసం ఆర్డినెన్స్ తీసుకువస్తుంటే.. ఈ ఆర్డినెన్స్ బ‌హు బాగున్న‌దంటూ బీఆర్ఎస్ తిరుగుబాటు నేత కల్వకుంట్ల క‌విత కాంప్లిమెంట్ ఇచ్చేశారు. అస‌లు బీసీల‌కూ నీకూ ఏం సంబంధం? నీకూ బీసీల‌కు కంచం పొత్తా- మంచం పొత్తా అంటూ మ‌ల్ల‌న్న స్ట్రాంగ్ కౌంట‌ర్లు ఇస్తుంటే.. ఈటల నేతృత్వంలో మ‌రో కొత్త బీసీల వేదిక త‌యారైందంటూస‌మాచారం.  అచ్చం వైసీపీలా స‌న్నిహితుల పేరిట ఈ బీజెఎస్ రిజిస్ట్రేష‌న్ ప్రాసెస్ పూర్తి చేసిన‌ట్టు తెలుస్తోంది. అందుకే ప్ర‌తి వార్డు మెంబ‌రూ మ‌న‌వాళ్లే అంటూ మెసేజ్ లు పంపుతున్న‌ట్టు చెబుతున్నారు. అయితే ఈట‌ల వ‌ర్గం మాత్రం అలాంటిదేం లేదని చెబుతున్నాయి.  అయితే ఈట‌ల అభిమానుల నుంచి అయితే కొత్త పార్టీ పెట్టాల్సిందే అన్న ఒత్తిడి వ‌స్తున్న‌ట్టు స్వ‌యానా ఈట‌ల వ‌ర్గ‌మే చెబుతోంది. ఒక వేళ  ఈట‌ల  పార్టీ పెడితే లాభ‌న‌ష్టాల బేరీజు ఎలాంటిది? కులాల ఈక్వేష‌న్ల‌ను క‌లుపుకుపోవ‌డం ఎలా? బ‌హుజ‌న శ‌బ్ధం తో పార్టీ పెడితే ఎలాంటి ఫ‌లితాల‌ను ఇస్తుంది? అన్న విషయంపై ఈటల టీమ్ సీరియస్ గా  పని చేస్తున్నట్లు తెలుస్తోంది.  మ‌రి చూడాలి ఈ పార్టీ పుట్టుక- మ‌నుగ‌డ- రాణింపు అనే  అనే అనుమానాలు, సందేహాలను ఈటల ఎలా నివృత్తి చేస్తారో. 

సినీ ఫక్కీలో భారీ స్కాం.. దళితులు, గిరిజనుల పేర్లతో రుణాలు

నెల్లూరు జిల్లాలో సినీ ఫక్కీలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. నెల్లూరు, ముత్తుకూరు యాక్సిక్ బ్యాంకు బ్రాంచీల్లో నిరుపేద దళితులు, గిరిజనుల పేర్లతో రుణాలు తీసుకుని కుబేరా సినిమా తరహాలో ఘరానా మోసానికి కొంతమంది వ్యక్తులు పాల్పడ్డారు. ఇటీవల శేఖర కమ్ముల డైరక్షన్‌లో నాగార్జున, ధనుష్ ప్రధానపాత్రల్లో పాన్ ఇండియా మూవీగా కుబేరా విడుదలైంది.   బిక్షగాళ్లని విదేశాలకు తీసుకెళ్లి పెద్దపెద్ద కంపెనీల యజమానులుగా మార్చేసి, వారి అకౌంట్ల ద్వారా లక్షల కోట్ల రూపాయలని బదిలీ చేయడం..   కుబేర సినిమా స్టోరీ. ఈ మూవీ రిలీజ్‌కు ముందే నెల్లూరు జిల్లాలో ఆ తరహా స్కాం చేసి చూపించారు క్రమినల్స్. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకి లోన్స్ ఇస్తామని చెప్పి వారి ఆధార్ కార్డులు సేకరించారు. వారిని అలా ఆధార్ కార్డులు సేకరించి ఆ గిరిజనులను సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా చూపించి.. వారి పేరు మీద రుణాలు తీసుకుని బోగస్ కంపెనీలు క్రియేట్ చేసి.. గిరిజనులను ఉద్యోగులుగా చూపి.. కోట్లకు కోట్లు రుణాలు మంజూరు చేయించుకున్నారు. నెల్లూరుకి చెందిన ఐదుగురు ఈ స్కామ్ చేశారు.  ఇందులో బ్యాంకు ఉద్యోగుల పాత్ర కూడా వుండటం గమనార్హం. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి 8 నెలలు గడుస్తున్నా.. విచారణ ముందుకు కదల్లేదు.  తెలుగు రాష్టాలతో పాటు చెన్నై లో కూడా ఈ స్కామ్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాసుదేవ నాయుడు, అల్లాబక్షు, శివ, వెంకట్‌తో పాటు మరికొందరి పాత్ర ఉందని గిరిజన సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. యాక్సిస్ బ్యాంకు లో జరిగిన స్కామ్ పై సీఐడీ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు, ముత్తుకూరు యాక్సిక్ బ్యాంకు బ్రాంచీల్లో నిరుపేద దళితులు, గిరిజనుల పేర్లతో రుణాలు తీసుకుని భారీ స్కాంకు పాల్పడ్డారు.  రూ.15కోట్ల నుంచి రూ.20కోట్ల మేర అమాయకులకి టోకరా వేశారు.   రుణాలు చెల్లించాల్సిందిగా బ్యాంకుల నుంచి పేదలకి నోటీసులు రావడంతో ఈ బాగోతం బయటపడింది. ఈ మాఫియా కాజేసిన సొమ్ముతో సినిమాలు తీశారు. గతంలోనూ జర్నలిస్టు యూనియన్ పేరుతోనూ జాలే వాసుదేవనాయుడు భారీ మొత్తాలు వసూలు చేశాడు . గిరిజనుల పేరుతో స్కాంపై ఏడు నెలల క్రితం నెల్లూరు పోలీసులకి ఫిర్యాదులు చేసి గోప్యంగా ఉంచారు బ్యాంకు అధికారులు.  2021 నుంచి 2024 మధ్య ఈ వ్యవహారం భారీఎత్తున   జరిగినట్లు తెలుస్తోంది‌.

మిథున్ రెడ్డి అరెస్టులో జ‌నం గొంతు ఎక్క‌డుంది జ‌గ‌న్?

క్విడ్ ప్రో కోలాంటి కొత్త కొత్త విధానాల‌తో స్కాములు చేసిన జ‌గ‌నేంటి? ఇంత అడ్డంగా బుక్ అయిపోయారు? ఆయ‌న‌కు స్కాములు చేయ‌డం కూడా చేత కావ‌డం లేదా? అన్న‌దిప్పుడు కొత్తగా మొదలైన చ‌ర్చ‌.  ఆ పార్టీ మాజీ ఎంపీ భ‌ర‌త్  జ‌గ‌న్ కి మందుబాబుల క‌ష్టాలు తెలీవు. దీంతో తాము దారుణంగా దెబ్బ తిన్నామ‌ంటున్నారు. నిజానికి నాణ్య‌మైన మ‌ద్యం ఎందుకంటే, అది ఆరోగ్యానికి సంబంధించిన విష‌యం. నాటు సారా ఎందుకు బ్యాన్  చేశారు? అది కూడా ఒక ర‌క‌మైన మందే. కానీ కొన్ని ప్రామాణికాల‌ను పాటించ‌డం వారి వ‌ల్ల కాదు. అదే మెక్ డెవ‌ల‌స్, కింగ్ ఫిష‌ర్, బ‌డ్ వైజ‌ర్ వంటి కంపెనీలు.. ఈ ప్రామాణికాలు పాటించ‌డం అంద‌రికీ తెలిసిందే. వీటి రెప్యుటేష‌న్ ఈనాటిది కాదు.  అలాంటి కంపెనీల‌ను ప‌క్క‌న పెట్టి.. దారిన బోయే దాన‌య్య‌ల‌కు టికెట్లు ఇచ్చినంత ఈజీగా ఈ లోక‌ల్ స‌రుకు జ‌నం  నెత్తికేసి రుద్ద‌డం అన్న‌ది జ‌గ‌న్ చేసిన అతి పెద్ద త‌ప్పిదం. బైక్ తోలేస్తున్నాం క‌దాని విమానం న‌డ‌ప‌టం సాధ్యం కాదు క‌దా? ఇదీ అంతేనంటారు ఒక సామాన్యుడికి పార్టీ టికెట్ ఇవ్వ‌డం మంచి విష‌యం అయ్యింది  క‌దాని.. ఒక లోక‌ల్ కంపెనీకి రాష్ట్ర ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని ప‌ణంగా పెట్టేలాంటి చ‌ర్య‌లు చేపట్ట‌డం త‌ప్పు గా చెబుతారు వీరంతా. ఈ విష‌యంలో జ‌గ‌న్ కి పెద్ద‌గా అనుభ‌వం లేద‌ని చెప్పాలంటారు నిపుణులు. అందుకే   టీడీపీ ఎమ్మెల్యే ద‌గ్గుబాటి ప్ర‌సాద్.. మిథున్ రెడ్డి అరెస్టుతో క‌ల్తీ మ‌ద్యం తాగిన వారి ఆత్మ‌లు శాంతిస్తాయ‌ని అన్నారని చెబుతారు. జ‌గ‌న్ కి మంచి చెడుల విశ్లేష‌ణ అస్సులు తెలీద‌ని అంటారు. పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం ఎలా ప‌ని చేస్తుంది? ఇక అస‌లు మేట‌ర్లోకి వ‌స్తే.. ఈయ‌న‌క‌స‌లు స్కాములు చేయ‌డం కూడా చేత‌కావ‌డం లేద‌న్న మాట వినిపిస్తోంది. ఒక్క రిమాండ్ రిపోర్ట్ లో సిట్ ఇన్నేసి త‌ప్పిదాల‌ను బ‌య‌ట ప‌డేస్తుంటే ఇంకా జ‌గ‌న‌న్న బుకాయింపులేంటో అర్ధం కావ‌డం లేదంటున్నారు కొంద‌రు. అదేమంటే మిథున్ జ‌గ‌న్ కి ఫ్రెండ్ కాబ‌ట్టి క‌క్ష సాధించార‌ని పెద్దిరెడ్డి అన‌డం పూర్తి త‌ప్పిదంగా చెబుతున్నారు. ప్ర‌జ‌ల గొంతు వినిపించే వారి వాయిస్ నొక్క‌డమే ఇదంతా అని జ‌గ‌న్ చేస్తున్న కామెంట్ల‌లో కూడా అర్ధం లేదంటారు. ఒక వేళ అదే నిజ‌మైతే మిథున్ రెడ్డి జ‌గ‌న్ వాయిస్ వినిపించ‌చే ర‌కం గానీ,  జ‌నం వాయిస్ వినిపించే వాడు కాడ‌ని అంటోంది సిట్ నివేదిక‌.  మొత్తం మూడు వేల కోట్ల‌కు పైగా ఉన్న ఈ లిక్క‌ర్ స్కామ్ లో ఇటు జ‌గ‌న్ కి అటు మిడిల్ మేన్ కి ఆ పై కింది స్థాయిలో ఉన్న లిక్క‌ర్ సిండికేట్ కి జ‌గ‌న్ గొంతుక వినిపించింది మిథున్ రెడ్డే. ఇక్క‌డ జ‌నం గొంతుక క‌న్నా జ‌గ‌న్ గొంతుకే ఎక్కువ వినిపించింది. నిజానికి జ‌నం గొంతుక ఏంటి? మ‌నుషుల‌ను చంపేసే ఈ క‌ల్తీ మ‌ద్యం వ‌ద్ద‌ని. ఈ మాట ఏ కోశానా  కూడా త‌న చెవికి ఎక్కించుకోలేదు  జ‌గ‌న్ రెడ్డి అని అంటారు అధికారులు. ఒక స‌మ‌యంలో ఒక అధికారికి ఐఏఎస్ హోదా క‌ల్పిస్తాన‌ని బూట‌కు హామీ ఇచ్చి.. త‌న వైపున‌కు తిప్పుకోవ‌డంలో ప్ర‌జ‌ల గొంతుక ఎక్క‌డుందో త‌మ‌కు అర్దం కావ‌డం లేదంటున్నారు కొంద‌రు. ఇలా  చెప్పుకుంటూ పోతే.. జ‌గ‌న్ లిక్క‌ర్ స్కామ్ లీల‌లు చాలానే. ఈ డ‌బ్బులు కేవ‌లం ఇక్క‌డే కాదు దేశాంత‌రం దాటాయ‌ని.. వీటిని ఎలాగైనా  క‌క్కిస్తామ‌ని అంటారు మంత్రి కొల్లు ర‌వీంద్ర‌. మ‌రి చూడాలి.. కొల్లు చెప్పిన‌ట్టు పెద్ద తిమింగ‌లం ఎప్పుడు బ‌య‌ట‌కొస్తుందో?.

ఏపీ మద్యం కుంభకోణం.. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్.. తేడా ఏంటి?

  ప్రైవేటు వారు మద్యం అమ్మితే ఆ సొమ్ము.. ప్రైవేటు వారికే పోతుంది. అదే ప్ర‌భుత్వం వారు అమ్మితే ఆ సొమ్ము ప్ర‌భుత్వానికే నేరుగా వ‌స్తుంది క‌దా? ఇదీ జ‌గ‌న్ స‌ర్కార్ నాడు ఫాలో అయిన‌ అస‌లు సిస‌లు నికార్స‌యిన లిక్క‌ర్ కాన్సెప్ట్  జ‌గ‌న్ స‌ర్కార్ ఎంత‌కు బ‌రి తెగించిందంటే.. ప్ర‌భుత్వ ఉపాధ్యాయుల‌ను మ‌ద్యం షాపుల ముందు మోహ‌రించేంత‌గా చెల‌రేగిపోయింది. అదేమంటే టీచ‌ర్స్ బ్రాండ్స్ అమ్మే క‌దా టీచ‌ర్ల‌కు జీతాలివ్వాల్సింది అన్న వితండ వాద‌న చేసి మరీ జగన్ సర్కార్ ఏపీ లిక్క‌ర్ స్కామ్ చేసింది.  ఇక ఢిల్లీలో ఇందుకు రివ‌ర్స్ లో జ‌రిగింది. అక్క‌డి పాల‌కులు ఎలా ఫీల‌య్యారంటే.. మ‌ద్యాన్ని ప్ర‌భుత్వం అమ్మ‌డ‌మేంటి? అస‌హ్యంగా.. ప్రైవేటు వ్య‌క్తులు క‌దా? అమ్మాల్సిందంటూ ఒక మ‌ద్యం పాల‌సీ తెచ్చారు. దీంతో మొత్తం బొమ్మ తిర‌గ‌బ‌డింది. ఇక్క‌డ ప్ర‌భుత్వానికి రావ‌ల్సిన సొమ్ము కాస్తా  ప్రైవేట్ పార్టీలు ప‌ట్టుకుపోవ‌డంతో మొద‌లైంది అస‌లైన  లిక్క‌ర్ స్టోరీ. అదిలా ఉంచితే వైసీపీ మ‌ధ్ద‌తుదారులు చేస్తున్న కామెంట్ ఎలాంటిదంటే.. ఢిల్లీలా త‌మ ప్ర‌భుత్వం ఖ‌జానాకి న‌ష్టం వ‌చ్చేలాంటి ప‌నులేవీ చేయ‌లేద‌నీ. ఆ మాట‌కొస్తే.. గ‌త చంద్ర‌బాబు పాల‌న‌కంటే త‌మ పాల‌న‌లోనే మ‌ద్యం అమ్మ‌కాల ద్వారా వ‌చ్చిన ఆదాయం భారీ ఎత్తున ఉంటుంద‌ని.. దీని ప్ర‌కారం చూస్తే ఇక్క‌డ స్కామే లేద‌ని అంటారు వారు. అయితే ఏపీ మంత్రి కొల్లు ర‌వీంద్ర మాట‌ల‌ను అనుస‌రించి చెబితే..  అస‌లు ఇది ప్ర‌పంచంలోనే అతి పెద్ద లిక్క‌ర్ స్కామ్. దీని  విలువ ఏకంగా 3 వేల కోట్ల‌కు పైబ‌డి. ఇప్ప‌టి వ‌ర‌కూ ప‌ట్టుబ‌డ్డ‌వి చిన్న చిన్న చేప‌లు. వ‌చ్చే రోజుల్లో భారీ తిమింగ‌లం ప‌ట్టుబ‌డే అవ‌కాశ‌ముంద‌ని ఇన్ డైరెక్టుగా జ‌గ‌న్ పేరు ప్ర‌స్తావించ‌కుండానే అదే అర్ధ‌మొచ్చే మాట‌ల‌న్నారు. ఇక ఫైన‌ల్ గా సిట్ అధికారులు రూపొందించిన రిమాండ్ రిపోర్టును అనుస‌రించి చెబితే.. అస‌లు ఈ స్కామ్ ద్వారా ఎలాంటి త‌ప్పిదాలు జ‌రిగాయో చూస్తే.. పెద్ద పెద్ద బ్రాండ్ల‌ను త‌ప్పించి లోక‌ల్ బ్రాండ్ల‌కు అవ‌కాశ‌మివ్వ‌డం. అది కూడా కిక్ బ్యాక్ ల రూపంలో ఒక మ‌ద్యం కేసుకు రూ. 150 నుంచి రూ. 600 వ‌ర‌కూ అమ్మ‌డం. ఇక రెండోది ఈ సొమ్మ బంగారు దుకాణాల వంటి వాటికి రూ. 300 కోట్ల నుంచి రూ. 400 కోట్ల వ‌ర‌కూ పంప‌డం. త‌ప్పుడు జీఎస్టీ ఇన్వాయిస్ ల ద్వారా ఈ మొత్తం డ‌బ్బు రాజ్ కేసిరెడ్డి వ‌యా మిథున్ రెడ్డి ద్వారా జ‌గ‌న్ కి చేరిన‌ట్టు గుర్తించ‌డం. వీటితో పాటు ప‌లు రియ‌ల్ ఎస్టేట్, అడ్వ‌ర్టైజింగ్ ఏజెన్సీల ద్వారా ఈ సొమ్ము యూఎస్, అర‌బ్ ఎరిమేట్స్ త‌దిత‌ర దేశాల్లోని షెల్ కంపెనీల‌కు వెళ్ల‌డం. ఇక ఈ స్కాములోని అతి పెద్ద మిస్టేక్ ఏంటంటే తెలుగుదేశం ఎమ్మెల్యే ద‌గ్గుబాటి  ప్ర‌సాద్ చెప్పిన‌ట్టు ఈ క‌ల్తి మ‌ద్యం ద్వారా.. కొంద‌రు చ‌నిపోవ‌డం. వీట‌న్నిటినీ తాము గుర్తించాం కాబ‌ట్టే ఇందులో మిథున్ రెడ్డి వంటి వారి  పాత్ర‌ను గమ‌నించ‌గ‌లిగాం కాబ‌ట్టే తామిలాంటి అరెస్టులు చేయాల్సి వ‌స్తోంద‌ని అంటుంది సిట్. అంతే కాదు ఛార్జ్ షీట్ లో జ‌గ‌న్ పేరు ప‌దే ప‌దే ప్ర‌స్తావించిందీ ద‌ర్యాప్తు బృందం. అస‌లీ మొత్తం వ్య‌వ‌హారం.. పార్ల‌మెంటులో చ‌ర్చించ‌ద‌గిన‌ది అంటారు ఎంపీ  లావు కృష్ణ‌దేవ‌రాయ‌లు.  అయితే మిథున్ జ‌గ‌న్ కి స‌న్నిహితుడు కాబ‌ట్టే క‌క్ష సాధింపు చ‌ర్య‌లో భాగంగా ఇలా అక్ర‌మ అరెస్టులు చేస్తున్నార‌ని అంటారు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి. ప్ర‌జ‌ల త‌ర‌ఫు వాయిస్ వినిపించే వారి నోరు నొక్క‌డ‌మేనంటారు జ‌గ‌న్. కానీ ఇక్క‌డింత మేట‌ర్ పెట్టుకుని పైపై రాజ‌కీయ కామెంట్లు చేయ‌డం వ‌ల్ల ఎలాంటి యూజ్ లేదంటారు విచార‌ణాధికారులు. మ‌రి చూడాలి.. ఈ లిక్క‌ర్ స్టోరీ ఇంకెన్ని మ‌లుపులు తీసుకుంటుందో తేలాల్సి ఉంది.

ప్రధాని నరేంద్రమోడీ వెనకడుగు.. వ్యూహాత్మకమేనా?

ప్రధాని నరేంద్రమోడీ వెనకడుగు వేశారా? ప్రతిపక్షాల డిమాండ్ మేరకు పార్లమెంటులో   ఆపరేషన్ సిందూర్ పై చర్చించేందుకు  అంగీకరించడాన్ని వెనకడుగుగానే భావించాల్సి ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే గత 11 ఏళ్లుగా మోడీ విపక్షల డిమాండ్ కు అంగీకరించడం ఇదే తొలి సారి అని అంటున్నారు.  పార్లమెంటు వర్షాకాల సమావేశాల ముంగిట ప్రధాని మోడీ ఇలా వెనకడుగు వేయడానికి సభలో ఆమోదం పొందాల్సిన కీలక బిల్లులు ఉండటమే కారణమని పరిశీలకులు భావిస్తున్నారు. సోమవారం (జులై 21) నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు ఆదివారం (జులై  20) నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో విపక్షాలు ప్రధానంగా ఆపరేషన్ సిందూర్ అర్థంతరంగా నిలిపివేయడం, ప‌హ‌ల్గాం దాడికి ఒక రోజు ముందు ప్ర‌ధాని మోడీ విదేశీ ప‌ర్య‌ట‌న‌ను అర్థంతరంగా  నిలుపుద‌ల, ఆప‌రేష‌న్ సిందూర్‌పై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్ర‌క‌ట‌న‌లపై చర్చించాలని డిమాండ్ చేశాయి. ఇప్పటి వరకూ ఇవే డిమాండ్లను విపక్షాలు పలుమార్లు చేసినా పెదవి విప్పని మోడీ పార్లమెంటు వేదికగా వీటిపై చర్చించేందుకు అంగీకరించారు.   ఇందుకు ప్రధానంగా ఈ శీతాకాల సమావేశాలలో ఎలాగైన ఆమోదింప చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న 12 బిల్లుల కోసమే మోడీ ఒక అడుగు వెనక్కు వేసి విపక్షాల డిమాండ్  మేరకు ఆ మూడు అంశాలపైనా చర్చించేందుకు ఓకే చెప్పారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

మెరుగైన చికిత్స కొసం హైదరాబాద్ కు ముద్రగడ ఎయిర్ లిఫ్ట్

కాపు ఉద్యమ నేత, వైసీపీ సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు మెరుగైన చికిత్స అందించేందుకు ఆయనను హైదరాబాద్ లోని యశోదా అస్పత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ముద్రగడ ప్రస్తుతం కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం (జులై 19) ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే మరింత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించాలని అప్పుడే భావించినప్పటికీ, సామర్లకోటలోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు డయాలసిస్ చేసిన తరువాత కొంత కోలుకున్నారు. ఇదే విషయాన్ని ఆదివారం (జులై 20) ఆయన కుమారుడు శశి తెలిపారు. తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉందనీ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ ఆయన పేర్కొన్నారు. అయితే ఆదివారం రాత్రికి ఆయనకు మరింత మెరుగైన చికిత్స అవసరమని వైద్యులు సూచించడంతో హైదరాబాద్ యశోదా ఆస్పత్రికి తరలించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆయనను తొలుత రోడ్డు మార్గం ద్వారా రాజమహేంద్రవరంకు తీసుకువచ్చి అక్కడ నుంచి హైదరాబాద్ కుఎయిర్‌ లిఫ్ట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తుస్తున్నారు.  ఇలా ఉండగా ముద్రగడ కుమార్తె క్రాంతి తండ్రి ఆరోగ్యం విషయం తెలిసిన వెంటనే  ఆయన చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వచ్చారు. తండ్రిని పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అయితే క్రాంతి రావడంపై ముద్రగడ శశి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. క్రాంతిని ముద్రగడ వద్దకు పంపించడంపై శశి ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎవరినీ తన తండ్రివద్దకు పంపవద్దని ఆదేశించినా వారు వినకపోవడంపై తీవ్ర ఆసహనం వ్యక్తం చేశారు.  గత కొంత కాలంగా ముద్రగడ కుటుంబంలో విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. తన సోదరుడు శశి తండ్రి ముద్రగడకు సరైన వైద్య చికిత్స అందించడం లేదంటూ క్రాంతి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే క్రాంతి ముద్రగడను పరామర్శించడంపై శశి ఆగ్రహం వ్యక్తం చేయడంతో కుటుంబంలో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. 

హోమం టికెట్లతో తిరుమల దేవుడి దర్శనం

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆ దర్శనం సులువుగా అయ్యేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం మరో వెసులుబాటు కూడా కల్పించింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి తిరుమల దేవుడి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే. కాగా భక్తులు ఎక్కువగా శ్రీవారి దర్శనం కోసం  300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లపైనే  ఆధారపడతారు. ఆ టికెట్లు దొరకకపోతే తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటుంటారు. అన్ని కుదిరి తిరుమల పర్యటనకు ఏర్పాట్లు చేసుకున్న భక్తులు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు దొరకక ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటే.. మళ్లీ ఎప్పుడు కుదురుతుంది? సెలవలు దొరుకుతాయా అన్న సందిగ్ధంలో  ఉంటారు. భక్తులకు ఈ బాధ తప్పించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం హోమం టికెట్లతో కూడా శ్రీవారి దర్శనం  చేసుకోవచ్చన్న వెసులుబాటును కల్పించింది.  300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ కు ప్రత్యామ్నాయంగా ఈ నెల   25న  శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం' పేరిట ప్రత్యేక దర్శన టికెట్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ టికెట్ ధర ఒక్క 1600 రూపాయలు. ఒక టికెట్ పై   ఇద్దరు హాజరు కావడచ్చు.  ముందుగా టికెట్ బుక్ చేసుకున్న వారు, దర్శనానికి ముందే అలిపిరిలోని సప్తగృహ వద్ద రిపోర్ట్ చేయాలి. అనంతరం అక్కడ నిర్వహించే హోమం పూర్తి అయిన తరువాత.. అదే రోజు మధ్యాహ్నం 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ ద్వారా స్వామి వారి దర్శనం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.   

ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. 45 నిముషాల పాటు త్రిశంకు స్వర్గంలో ప్రయాణీకుల ప్రాణాలు

ఇండిగో విమానంలో ఏర్పడన సాంకేతిక లోపం కారణంగా ప్రయాణీకులు దాదాపు 45 నిముషాల సేపు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని భయాందోళనలతో నరకం అనుభవించారు. తిరుపతి నుంచ హైదరాబాద్ వెడుతున్న విమానం టేకాఫ్ అయిన వెంటనే సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ విమానం దాదాపు 45 నిముషాల పాటు గాలిలోనే చక్కర్లు కొట్టింది. అంత సేపూ విమానంలోని ప్రయాణీకులు ప్రాణాలు గిప్పిట పట్టుకుని నరకం అనుభవించారు.  అయితే ఎట్టకేలకు తిరుపతి విమానాశ్రయంలో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన జరిగిన సమయంలో విమానంలో 180 మంది ఉన్నారు.   

తెలంగాణకు అతి భారీ వర్ష సూచన.. 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణ వ్యాప్తంగా గత మూడు నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే రానున్న రెండు రోజులూ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు తోడు దక్షిణ కర్ణాటక నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంద్ర వరకు ఉపరితలంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్న వాతావవాతావరణ శాఖ  సోమ, మంగళ, బుధవారాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హోచ్చరించింది.   రాష్ట్రంలోని 12 జిల్లాలకు వాతావరణ  ల్లో అలర్ట్  జారీ చేసింది.  ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలలో  రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 

నాన్నను జైల్లో చూసి తట్టుకోలేకపోయా : లోకేశ్

  ఏపీ మంత్రి నారా లోకేశ్ ఇండియా టుడే పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టినప్పుడు  కన్నీళ్లు పెట్టుకున్నట్లు లోకేశ్ తెలిపారు.  జైల్లో నాన్నను చూసి గుండె తరుక్కుపోయిందని ఆయన తెలిపారు. జైలులో చూడగానే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అక్కడ రెండు చోట్లు చంద్రబాబు అని పేరు చూశాను. ఆ కారాగారాన్ని అభివృద్ధి చేసింది. ఆయన ఉన్న భవనాన్ని కట్టించింది నాన్నే. అలాంటి వ్యక్తిని అక్కడ చూసి చాలా బాధవేసిందని లోకేశ్ తెలిపారు.  ఇంట్లో, ఆఫీస్‌లో తన తండ్రి చంద్రబాబును ఎలా పిలుస్తారనే విషయంపై స్పందించారు. "కింద ఫ్లోర్‌లో ఉంటే ఆయన నా బాస్. పై ఫ్లోర్‌లో ఉంటే ఆయన నా నాన్న. రాజకీయాలు ఇంట్లోకి రావు, ఆఫీస్‌లోకి పర్సనల్ మేటర్స్ రావు. అవి మేము గీసుకున్న కచ్చితమైన హద్దులు. ఇంట్లో ఉన్నప్పుడు ఆయనను నాన్నా అని పిలుస్తాను. తన కెరీర్ లో తల్లి నారా భువనేశ్వరి పాత్రను కూడా ప్రస్తావించారు. "మా అమ్మ నా పట్ల చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించింది.  నా ఎదుగుదల కోసం అన్ని రకాలుగా త్యాగం చేసింది. నా చదువు, కెరీర్ మరియు ఇతర అంశాల్లో నాకు మార్గదర్శనం చేసింది" అని వివరించారు. ఇక తమ కుటుంబ వ్యాపారంలో ఐదు సంవత్సరాలు పనిచేసిన తర్వాతే తాను రాజకీయాల్లోకి వచ్చానని లోకేశ్ చెప్పారు. అప్పటినుంచి ఫుల్ టైమ్ రాజకీయవేత్తగా కొనసాగుతున్నానని తెలిపారు. 

ఫారెస్ట్ సిబ్బందిపై పోడు రైతుల రాళ్లదాడి

  ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మొక్కలు నాటేందుకు వెళ్లిన ఫారెస్ట్ సిబ్బంది, పోలీసులపై పోడు రైతులు దాడి చేశారు. తమ గ్రామంలోకి రావొద్దంటూ రాళ్లతో​ దాడికి పాల్పడ్డారు. దీంతో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఆందోళనకారుల దాడిలో పోలీస్ వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఫారెస్ట్, పోలీస్, మీడియా సిబ్బందికి గాయాలవ్వగా వారిని ఇచ్చోడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. దాడిలో 13 మంది అటవీ అధికారులు, పోలీసులకు తీవ్రగాయాలయ్యాయి.గాయపడిన వారిని మెరుగైన చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.

మిథున్ రెడ్డికి 14 రోజుల రిమాండ్

  ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి  విజయవాడ ఏసీబీ కోర్టు ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించింది. ఆయను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. మద్యం పాలసీ రూపకల్పన, కుంభకోణంలో ఆయన కీలకమని సిట్ అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లి పలు ఆధారాలు సమర్పించింది. మిథున్‌ను విచారించాల్సి ఉందని రిమాండ్ కోరగా కోర్టు అంగీకరించింది. ఈ కేసులో మిథున్‌రెడ్డి ఏ4గా ఉన్న విషయం తెలిసిందే.  అంతకు ముందు వాదనల సందర్భంగా తనను నెల్లూరు జైలు కు పంపించాలని  మిథున్‌రెడ్డి కోర్టుకు అభ్యర్థించారు. తనకు వై ఫ్లస్ సెక్యూరిటీ ఉందని తనకు బ్లడ్ క్లాట్స్ ఆరోగ్య సమస్యలు ఉన్నాయనీ, అవసరాన్ని బట్టి హాస్పిటల్ లో చికిత్స సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు. 409 సెక్షన్ వర్తించదని మిథున్ రెడ్డి తరపు లాయర్ వాదనలు వినిపించారు.  హైకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించిందనీ కోర్టు కు తెలిపిన సిట్ తరపు లాయర్.   మిథున్ రెడ్డి అరెస్ట్ అవసరానికి సంబంధించి 29 కారణాలను కోర్టుకు చూపించిన సిట్ తరపు న్యాయవాదులు. చివరికి సిట్ న్యాయవాదుల వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. సెక్షన్ 409, 420, 120 (B), రెడ్‌విత్ 34,37, ప్రివెన్షన్ ఆప్ కరరెప్షన్ యాక్టు 7,7ఏ, 8, 13(1)(B), 13(2) సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు.కాసేపట్లో మిథున్‌రెడ్డిని రాజమండ్రి జైలుకు పోలీసులు తరలించనున్నారు.