అయితే అన్నామలై.. కాదంటే నిర్మలమ్మ!
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ఒక ప్రహసనంగా మారింది. బీజేపీ నూతన అధ్యక్షుడు ఎవరు? అన్న ప్రశ్నకు సమాధానం ఇటు పార్టీ నేతలకు, అటు రాజకీయ పండితులకు కూడా చిక్కడం లేదు. చిక్కు ముడి వీడడం లేదు. ఎందుకనో ఏమో కానీ పార్టీ జాతీయఅధ్యక్షు ఎన్నిక చాలా జటిలంగా మారిందనే అభిప్రాయం అయితే అంతటా వినిపిస్తోంది.
అవును పార్టీ అగ్ర ద్వయం, ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా కూడా ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేక పోతున్నారు. అందుకే ఇటీవల లోక్ సభలో సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని చెప్పుకునే బీజేపీ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోలేక పోతోందని వ్యంగంగా అన్నప్పుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సరదా సమాధానంతో, అసలు విషయాన్ని దాట వేశారు. అయితే అక్కడికది సరిపోయినా.. ఈ ప్రశ్న బీజేపీని వెంటాడుతోందని అంటున్నారు. అయితే ఇక అట్టే కాలం ఈ సస్పెన్స్ కొనసాగదని.. కొనసాగించడం కుదరదనీ కూడా అంటున్నారు.
బీజేపీ ప్రస్తుతఅధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ఇటు పార్టీ అధ్యక్షుడు, అటు కేంద్ర మంత్రిగా జోడు పదవుల్లో కొనసాగడం విమర్శలకు తావిస్తోంది. సో.. జేపీ నడ్డా స్థానంలో నూతన అధ్యక్షుడి ఎన్నిక ఇక వాయిదా వేసే అవకాశం లేదని అంటున్నారు. అలాగే రేపో మాపో బీజేపీ జాతీయ అధ్యక్షుని ప్రకటన వెలువడుతుందన్న విశ్వాసంతో పార్టీ వర్గాలు ఉన్నాయి. ఏప్రిల్ 18,19, 20 తేదీల్లో బెంగుళూరులో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి.ఈలోగా నూతన అధ్యక్షుడి ప్రకటన ఖాయంగా ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
అదొకటి అలా ఉంటే, నూతన అధ్యక్షుడి ఎంపిక విషయంలో బీజేపీ అనేక కోణాల్లో ఆలోచిస్తోందని అంటున్నారు. ముఖ్యంగా ఈ సారి అధ్యక్ష పదవిని దక్షిణాది రాష్ట్రాలకు ఇవ్వాలనే కోణంలో బీజేపీ అగ్ర ద్వయం ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా తో పాటుగా ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే తొలి సారిగా పార్టీ పగ్గాలు మహిళా నేతకు అప్పగించే ఆలోచన కూడా చేస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు కేంద్రంగా దక్షిణాది రాష్ట్రాల రాజకీయ రచన చేస్తున్న బీజేపీ జాతీయ నాయకత్వం తమిళనాడు నుంచే జాతీయ అధ్యక్షుడిని ఎంచుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు చెపుతున్నారు.
అదే నిజంమైతే, తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పేరు పరిశీలనలో ఉన్నట్లు ప్రముఖంగా వినిపిస్తోంది. తమిళనాడులో పార్టీని బలోపేతం చేయడంతో పాటుగా, చదవు, సంస్కారం, పార్టీ విధేయత, సిద్దాంత నిబద్దత ఉన్నఅన్నామలై’కి పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి అవసరమైన అర్హతలు అన్నీ ఉన్నాయని అంటున్నారు. అలాగే, అన్నాడీఎంకేతో పొత్తు నేపథ్యంలో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న అన్నామలైకి జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగిస్తామని అమిత్ షా చెప్పారు. సో.. దక్షణాదికి అధ్యక్ష పదవి పదవి ఖాయం అయితే అన్నామలైకి అధ్యక్ష పదవి ఖాయం అంటున్నారు. ఇంకా కొన్ని పేర్లు వినిపిస్తున్నా.. మోదీ, షా ఇద్దరూ అన్నామలై వైపే మొగ్గుచూపుతున్నారని అంటున్నారు. అందుకే, దక్షణాదికి దక్కితే, అన్నామలై అధ్యక్ష పదవిని చేపట్టడం ఖాయమని అంటున్నారు.
అలాగే పార్టీ జాతీయ అధ్యక్ష పదవి మహిళా నేతకు ఇవ్వాలనే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతవరకు బీజేపీలో ముఖ్య మంత్రులు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, అయిన మహిళలు ఉన్నారు, అలాగే, లోక్ సభలో ప్రతిపక్ష నేత, లోక్ సభ స్పీకర్, రాష్ట్రాల గవర్నర్లు వంటి రాజ్యాంగ పదవులను అందుకున్న మహిళలు ఉన్నారు. కానీ, పార్టీ జాతీయ అధ్యక్ష పీఠం మాత్రం మహిళా నేతకు ఇంతవరకు దక్కలేదు. అందుకే ఈ సారి తొలిసారిగా, మహిళా నేతకు పార్టీ పగ్గాలు అప్పగించే ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నారని అంటున్నారు.
అదే జరిగితే, ఇప్పటికే, ఫస్ట్ విమెన్ డిఫెన్స్ మినిస్టర్, ( ప్రప్రథమ మహిళా రక్షణ మంత్రి ) ఫస్ట్ ఫుల్ టైమ్ ఫైనాన్సు మినిస్టర్ తో పాటుగా వరసగా ఎనిమిది సార్లు వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన తొలి అర్హిక మంత్రిగా రికార్డులు సొంతం చేసుకున్న నిర్మలా సీరామన్ ఖాతాలో బీజేపీ తొలి మహిళా ప్రెసిడెంట్ మకుటం కూడా చేరుతుందని అంటున్నారు.
అయితే ఆమె ప్రధానంగా రాజకీయ నాయకురాలు కాదు. ఎకడమిక్ పర్సన్ . ఎకనమిక్ లేడీ. (ఒక విధంగా ఆమె లేడీ మనోహన్ సింగ్ అనుకోవచ్చును. ఇద్దరి మధ్య ఒకటే తేడా, ఇద్దరి దారులు వేరు, పార్టీలు వేరు) అదీ గాక ఆమె ప్రత్యక్ష ఎన్నికలలో ఇంతవరకు పోటీ చేసి గెలవలేదు. అంతే కాదు, 2024ఎన్నికలకు ముందు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసే స్థోమత, సామర్ధ్యం తనకు లేదని, పోటీ చేసేందుకు విముఖత చూపారు. అదొకటి అయితే ఆర్ఎస్ఎస్ గ్రీన్ సిగ్నల్ విషయంలోనూ అనుమానాలు ఉన్నాయి..
అయితే దక్షణాది కోణంలో చూసినప్పుడు ఆమెకు డబుల్ అర్హతలున్నాయని అంటున్నారు. ఆమె తమిళనాడు ఆడ బిడ్డ, ఆంధ్రా/తెలంగాణ కోడలు, ఏపీ, కర్నాటక రాష్ట్రాల నుంచి రాజ్య సభకు ఎన్నికయ్యారు. సో.. ఒక్క కేరళ మినహా మిగిలిన అన్ని దక్షణాది రాష్ట్రాలతో ఆమెకు వ్యక్తిగత, రాజకీయ సంబంధాలున్నాయి. హిందీ అంతగా రాక పోయినా, తమిళ్, తెలుగు భాషలతోపాటు ఇంగ్లీష్ లో నూ మాట్లాడ గలరు. సో .. బీజేపీ నాయకత్వం నిజంగా దక్షిణాదికి పార్టీ పగ్గాలు అప్పగించాలని, మహిళా నేతకు అధ్యక్ష పదవి ఇవ్వాలనే జంట ఆలోచనలు చేస్తున్నదే నిజం అయితే, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు రెండు అర్హతలూన్న నిర్మలమ్మకు అధ్యక్ష పదవి ఖాయం అంటున్నారు.అయితే.. ఫైనల్ గా పేరు బయటకు వచ్చే వరకు సస్పెన్స్ తప్పదు.