ఉగ్ర నరసింహన్..రెండో వైపు చూడొద్దు

  "నాన్నా.. సింహం.. సింగిల్ గానే వస్తుంది. పందులే గుంపులు గుంపులుగా వస్తాయి" అని రజనీ కాంత్ సినిమాలో బాగా క్లిక్ అయిన డైలాగ్ ఒకటుంది. రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ విషయంలో ఇది అక్షరాలా నిజమైంది.  రాష్ట్ర పరిపాలనపై గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ముద్ర రెండో రోజు నుంచే స్పష్టంగా కనిపించింది.   కిరణ్‌కుమార్‌రెడ్డి నామినేట్ చేసిన పదవుల్లోని వారిపైనా గవర్నర్ దృష్టి సారించారు. రాజ్యాంగ, చట్టబద్ధత కాని నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారి జాబితాలను పంపాలని గవర్నర్ కార్యాలయం నుంచి అన్ని శాఖలకు నోట్ అందింది. దీంతో అన్ని శాఖలు తమ పరిధిలోని నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారి జాబితాలను సిద్ధంచేసి పంపే పనిలో పడ్డాయి. ఈ దిశలోనే రాజీవ్ యువకిరణాల చైర్మన్‌ కె.సి.రెడ్డి సోమవారం రాజీనామా చేశారు. అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి, ఆర్‌టీసీ చైర్మన్ ఎం.సత్యనారాయణరావు, 20 సూత్రాల పథకం అమలు చైర్మన్ తులసిరెడ్డిలతో పాటు ఇటీవల సీఎం పలు దేవాలయాలకు నియమించిన పాలక మండళ్ల చైర్మన్లు, ప్రెస్ అకాడమీ చైర్మన్‌తో పాటు ఇతర నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతున్న వారినీ రాజీనామా చేయాల్సిందిగా గవర్నర్ కార్యాలయం ఆదేశించనున్నట్లు సమాచారం. తుడా, వీజీడీఎంఏ చైర్మన్ , పాలకమండళ్లను కూడా రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించనున్నట్లు చెబుతున్నారు. సీఎంగా కిరణ్ చివరి రోజుల్లో తీసుకున్న నిర్ణయాలపై వివరాలను పంపాలని గవర్నర్ కార్యాలయం నుంచి సీఎస్‌కు నోట్ అందింది. అయితే ఎప్పటి నుంచి తీసుకున్న నిర్ణయాలో ఆ నోట్‌లో పేర్కొనలేదు. దీంతో.. ఎప్పటినుంచి ఎప్పటివరకు తీసుకున్న నిర్ణయాల వివరాలను పంపాలో తెలియజేయాలని గవర్నర్ కార్యాలయాన్ని సీఎస్ కోరారు. అనూహ్యంగా మొదలైన పెట్రోల్ బంకుల బంద్‌ను గంటల వ్యవధిలో ఆయన ఉపసంహరింపజేశారు. అంతకుముందు సమ్మె సాకుతో లీటరు పెట్రోలు ఏకంగా 220 వరకు అమ్ముడైంది. దీంతో గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకుని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో, తూనికలు, కొలతల డెరైక్టర్ జనరల్‌తో మాట్లాడారు. సాయంత్రానికల్లా పెట్రోల్ బంకులు తెరుచుకునేలా చర్యలు తీసుకోవాలని, లేదంటే చర్యలు తీవ్రంగా ఉంటాయనే సంకేతాలను గవర్నర్ ఇచ్చారు. దీంతో పెట్రోల్ బంకుల యజమాన్యాలతో అధికారులు చర్చలు జరిపారు. గంటల వ్యవధిలోనే బంద్‌ను యాజమాన్యాలు ఉపసంహరించుకున్నాయి. అంతేకాదు, సర్కారుతో కాళ్లబేరానికి కూడా వచ్చాయి. ఇంతకాలంగా అందరూ గవర్నర్ ని ఒకవైపే చూసారు. రెండో వైపు చూడలేదు. చూస్తే తట్టుకోలేరని ఇప్పుడు ఉగ్ర నరసింహన్ స్పష్టం చేస్తున్నారు.

మున్సిపల్ ఎన్నికలు- రాజకీయ పార్టీలకు సెమీ ఫైనల్స్

  రాష్ట్రం రెండు ముక్కలయ్యి సార్వత్రిక ఎన్నికలకి సిద్దపడుతున్నవేళ మధ్యలో మునిసిపల్ ఎన్నికల వచ్చిపడుతున్నాయి. మునిసిపల్ ఎన్నికలకు షెడ్యుల్ కూడా విడుదలైంది. మార్చి 30వ తేదీన ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మొత్తం 146 మునిసిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతాయి. వీటి ఫలితాలు ఏప్రిల్ 2వ తేదీన వెల్లడిస్తారు. నామినేషన్ల ప్రక్రియ ఈనెల 10వ తేదీన ప్రారంభమై 14వ తేదీ వరకు ఉంటుంది. పార్టీ గుర్తులపైనే జరిగే ఈ ఎన్నికలలో మొత్తం 11వేల ఈవీఎంలు ఉపయోగిస్తారు.   సాధారణంగా అధికార పార్టీ తనకు అనుకూలంగా పరిస్థితులు లేవాణి భావిస్తే ఇటువంటి ఎన్నికలను వాయిదా వేసుకొంటూ పోతుంది. కానీ, కీలకమయిన సార్వత్రిక ఎన్నికలకు ముందు మున్సిపల్ ఎన్నుకలు రావడం, అది కూడా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనలో ఉన్నపుడు రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ సమయంలో ఎన్నికలు రావడం యాద్రుచ్చికమో లేక ముందుగానే నిశ్చయమైందో తెలియకపోయినా, సార్వత్రిక ఎన్నికలకు ముందు వస్తున్న ఈ మున్సిపల్ ఎన్నికలు అన్ని పార్టీలకు సెమీ ఫైనల్ వంటివని భావించవచ్చును. ఆంధ్ర తెలంగాణా ప్రాంతాలలో రాజకీయ పార్టీల బలాబలాలకు అద్దం పడతాయి.

కుర్చీ పోయే..పరువు పోయే...

  అయ్యయ్యో జేబులో డబ్బులు పోయెనే.. ముఖ్యమంత్రి పదవి ఆశలు ఆవిరాయెనే .. ఇదీ సీమాంధ్ర సీనియర్ కాంగ్రెస్ వీరవిధేయుల తాజా సాంగ్. ఎప్పుడెప్పుడు నల్లారి వారు దారి ఇస్తారా... అని ఎదురు చూస్తూ ఆయన కుర్చీ చుట్టూ తిరుగుతున్న గ్యాంగ్ .. విభజన ప్రక్రియ చివరి దశలో ఉన్నపుడే డిల్లీలో మకాం వేషి లాబీయింగ్ మొదలు పెట్టేసారు. తెలంగాణా బిల్లుకు మద్దతు కూడగట్టే పేరుతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. సీమాంధ్రకు న్యాయం, బిల్లులో సవరణలు చేయిస్తామంటూ మరో బృందం టెన్ జనపథ్ అమ్మ కరుణా కటాక్ష వీక్షణాల కోసం నిరీక్షించారు. హైకమాండ్ దృష్టిలో పడేందుకు స్థాయికి మించి బీజేపీ. టీడీపీ నేతలను తిట్టిపోసేశారు. రాష్ట్ర విభజన విషయంలో అధిష్టానం నిర్ణయాన్ని తప్పుబట్టే సొంత పార్టీ నేతలను టార్గెట్ చేసుకుని ఆరోపణలు గుప్పించారు. అటు బిల్లు ఆమోదం పొందడం.. ఇటు కిరణ్ రాజీనామా చేయడంతో ఆశావహుల జాబితా పెరిగిపోయింది. కనీసం ఐదు రోజులైనా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొంటే చాలు... అదే ఐదేళ్లని తృప్తిపడి సర్దుకుపోతామని అంటూ కనిపించిన కాంగ్రెస్ పెద్దలందరినీ వేడుకున్నారు. పన్లో పనిగా ‘అధిష్టానం ఆదేశిస్తే ఏ ముఖ్యభాద్యతలు స్వీకరించడానికయినా సిద్ధం’ అంటూ ఎవరినో ఉద్దరించడానికి త్యాగం చేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తూ ప్రకటించేశారు.   హైకమాండ్ కు మరో బిస్కెట్ కూడా వేశారు. ఎన్నికలు 6 నెలలు పొడిగించి ..తమకు పార్టీ, ప్రభుత్వ భాద్యతలు అప్పగిస్తే అంటా ‘సెట్ రైట్’ చేసేస్తామని నమ్మబలికారు. అదీ వీలుపడేలా కన్పించక పోవడంతో సీఎం ఎవరైనా ఫర్వాలేదు, ప్రభుత్వం ఏర్పాటయితే అదే మాకు పదివేలు... అంటూ ఆంధ్ర, తెలంగాణా కాంగ్రెస్ నేతలందరూ కలిసి బృందగానం కూడా చేశారు. అంతా అనుకున్నట్టే జరిగింది. హైకమాండ్ తమలో ఎవరో ఒకరికి అవకాశం ఇస్తుంది అని.. సూట్ కేసంత ఆశతో అందరూ అమ్మగారి గుమ్మం వద్ద అంత చలిలోనూ గజగజా వణుకుతూ పడిగాపులు కాశారు. కానీ అమ్మగారి ఆంతరంగికులు ఆమె చెవిలో ఏదో ఊదేసారికి అమ్మగారి ఆలోచనలు కూడా ఒక్కసారిగా మారిపోయాయి. దానితో సీను పూర్తిగా మారిపోయింది.   రాష్ట్ర విభజనకు ముందే ప్రాంతాలవారీగా నేతలు విడిపోయికొట్టుకొన్న ఈ నేతల మాటల నమ్మి వారిలో ఎవరినో ఒకరిని ముఖ్యమంత్రిని చేసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, ఆ తరువాత ఆంధ్ర, తెలంగాణా అంటూ కీచులాడుకొంటే ఉన్న పరువు కూడా గంగలో కలిసిపోతుందని, పైగా ఎవరికి పగ్గాలు అప్పగించినా ప్రతిపక్షాలు అందులో ‘లా పాయింటు’ తీసి రెండో ప్రాంతం వారికి అన్యాయం జరిగిపోయిందని ఎన్నికల ముందు కాకి గోల చేస్తే ఇక తమ పార్టీకి ఎన్నికలలో డిపాజిట్లు కూడా రావని అంతరంగికులు అమ్మగారికి నూరిపోసారుట! ఇప్పటికే సీమాంధ్రలో కాంగ్రెస్ కి మూడిపోయింది. మూడు రోజుల ముచ్చట కోసం మళ్ళీ ఎవరినో ఒకరిని ముఖ్యమంత్రిని చేస్తే...ఇక తెలంగాణాలో కూడా మూటాముల్లె సర్దుకోవాల్సి వస్తుందని భయపెట్టేసారుట! వీళ్ళని వేరే పార్టీలో ఎలాగూ చేర్చుకోరని తెలిసినందునే మన కాళ్ళవద్ద పడిఉన్నారని లేకుంటే వీళ్ళు కూడా మిగిలిన వాళ్ళలాగే ఎప్పుడో వేరే పార్టీలోకి జంపయిపోయేవారని అమ్మ చెవిలో ఎవరో ఊదేరుట. రానున్న ఎన్నికలలో డిపాజిట్లు కూడా దక్కవని ఒకపక్క ‘సర్వేస్వర్లు’ ఘోషిస్తుంటే, పార్టీని బలోపేతం చేసేసి సీమాంధ్రలో విజయడంకా మ్రోగించేస్తామని చెపుతున్న వారి మాటలు నమ్మి కాలిన చేతులను ఇంకా కాల్చుకోవద్దని శ్రేయోభిలాషులు హెచ్చరించారుట! ఆంధ్రా వాళ్ళకంటే అంతరంగికులను నమ్ముకోవడమే బెటర్ అని భావించిన హైకమాండ్ వారు రాష్ట్రపతి పాలనే అన్ని విధాల సేఫ్ అని దానికే కమిట్ అయిపోయారుట!   అమ్మగారు చెప్పుడు మాటలు విని తమను నమ్మకుండా రాష్ట్రపతి పాలన విదించేసారని కుమిలిపోతూ ఆంధ్ర, తెలంగాణా నేతలందరూ ఒకరినొకరు ఓదార్చుకొంటూ హైదరాబాద్ తిరిగి వచ్చేసారు. అటు అధిష్టానం అనుమానపు చూపులు.. ఇటు ప్రజల నుండి ఛ్చీదరింపులతో తమ పరిస్థితి రెంటికీ చెడిన రేవడిలా తయారయిందని వాపోతున్నారు. పదవీ పోయే...పరువూ పోయే... పైసలూ ఖర్చై పాయె....అని లబో దిబోమంటున్నారట!

కిరణ్ తప్పటడుగు వేసారా?

  మాజీ సీయం.కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానాన్ని దిక్కరిస్తూ తన సమైక్య వాదనలతో సీమాంధ్ర ప్రజలను చాలా బాగా ఆకట్టుకొన్నారు. అగ్నికి వాయువు తోడయినట్లుగా ఆయనకు ఏపీ యన్జీవో నేత అశోక్ బాబు, ఆయన వెనుక లక్షలాది ఉద్యోగులు కూడా తోడవడంతో ఇక ఆయన చెలరేగిపోయారు. కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలతో సహా ఎవరూ కూడా ఆయనను వేలెత్తి చూపే దైర్యం చేయలేకపోయారు. ఆ ఊపులోనే ఏపీఎన్జీజీవోలు హైదరాబాదులో ‘సేవ్ ఆంధ్ర ప్రదేశ్’ సభను విజయవంతంగా నిర్వహించారు. కిరణ్ కుమార్ రెడ్డి ఆ సమయంలో తన పదవికి, పార్టీకి రాజీనామా చేసి ఉండి ఉంటే, ఆయనకు ఇక సీమాంధ్రలో తిరుగే ఉండేది కాదు. కానీ, ఆయన ఉదృతంగా సాగిన ఏపీయన్జీవోల సమ్మెకు బ్రేకులు వేసి, డిల్లీలో జీ.ఓ.యం. రాష్ట్ర ప్రక్రియను చకచకా పూర్తి చేస్తుంటే, ఆయన శాసనసభకు టీ-బిల్లు వచ్చేవరకు గోళ్ళు గిల్లుకొంటూ కూర్చోవడంతో ఆయనపై ప్రజలలో అనుమానాలు మొదలయ్యాయి. ఆసమయంలో ఆయన దూకుడు కూడా బాగా తగ్గడంతో అయన కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల ప్రకారమే విభజనకు సహకరిస్తున్నారనే అనుమానాలు బలపడ్డాయి.   టీ-బిల్లు శాసనసభకు వచ్చినపుడు ఆయన ఏ ప్రళయం సృష్టించలేదు కానీ, ఆయన బిల్లుని తిరస్కరిస్తున్నట్లు తీర్మానం ప్రవేశపెట్టి చర్చను మూడు రోజుల ముందే ముగించి భద్రంగా డిల్లీకి చేర్చారు. రాష్ట్ర శాసనసభ బిల్లుని తిరస్కరించినంత మాత్రాన్న వచ్చిన నష్టమేమిఉండబోదని దిగ్విజయ్ సింగ్ పదే పదే చేపుతున్నపటికీ, ఆయన బిల్లుని తిరస్కరించడమే ఓ ఘన కార్యంగా చేసిచూపారు.   ఆ తరువాత డిల్లీలో దీక్షకు కూర్చొని మళ్ళీ ప్రజలలో కొంత పేరు సంపాదించుకొన్నారు. కనీసం అప్పుడయినా రాజినామా చేసి బయటకు వచ్చిఉంటే ఆయనకు ఎంతో కొంత విలువ ఉండేది. కానీ, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టేక, ఆ తరువాత, అధికారికంగా దృవీకరించుకొన్న తరువాత అంటూ పదవి పట్టుకొని వ్రేలాడుతూ ఉన్న పరువుని కూడా పోగొట్టుకొన్నారు. ఎట్టకేలకు ఆయన రాజీనామా చేసి బయటకి వచ్చి వెనక్కి తిరిగి చూసుకొంటే సగం మంది కాంగ్రెస్ లోనే మిగిలిపోగా, మరికొంతమంది ఇతర పార్టీలలోకి వెళ్లిపోవడంతో ఆయన వెనుక అశోక్ బాబు, ఓ గుప్పెడు మంది యం.యల్యేలు, ఒకరిద్దరు యంపీలు తప్ప మారెవరూ కనబడలేదు. ఆయనకు గట్టిగా మద్దతు పలికిన లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం తీసుకోగా, గంటా, ఏరాసు, టీజీ వంటి వారు తెదేపాలో తేలారు.   ఈ పరిస్థితుల్లో కొత్త పార్టీ పెట్టడం, దానిని ప్రజలలోకి తీసుకువెళ్ళడం ఆయన వెనుక ఉన్న గుప్పెడు నేతల వలన అయ్యే పనికాదు. అందుకే ఆయన మీనమేషాలు లెక్కిస్తున్నారు. చాలా మంది రాజకీయ నేతలు “సరయిన సమయంలో సరయిన నిర్ణయం తీసుకొంటామని” చెపుతూ ఉంటారు. కిరణ్ సరయిన సమయంలో సరయిన నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడం వలననే ఇప్పుడు ఆయన ఒంటరివారయ్యారు. ఇంతకాలం ఒక వెలుగు వెలిగి పార్టీలో, ప్రభుత్వంలో అందరినీ ఆడించిన కిరణ్ కుమార్ రెడ్డికి ఇప్పుడు తన భవిష్యత్ ఏమిటో తనకే తెలియని పరిస్థితి ఏర్పడింది.

కర్నూలు తెలుగుదేశం పిలుస్తోంది రా..

  రాజులు.. రాజ్యాలు పోయినా .. ప్రజాస్వామ్యం పుణ్యమా అని నేతల కోటలు .. పార్టీల కంచు కోటలు మిగిలాయి. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట అయిన కర్నూలు జిల్లా వైఎస్ హయాంలో పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది.   సీనియర్ నేత ఎస్వీ సుబ్బారెడ్డి రాజకీయాలనుంచి విరమించుకున్నారు. భూమా, బైరెడ్డి వంటి నాయకులు పార్టీని వీడారు.ఎస్వీ సుబ్బారెడ్డి తనయుడు ఎస్వీ మోహనరెడ్డి కాంగ్రెస్ లో చేరి అట్నుంచి ఆటే బావ భూమా బాటలో వైసీపీలో చేరారు. అనారోగ్యంతో మాజీ మంత్రి బీవీ మోహనరెడ్డి మృతి చెందారు. తనకు ప్రాధాన్యం దక్కలేదనే అక్కసుతో మాజీ మేయర్ బంగి అనంతయ్య .. టీడీపీ అధినేతకు వ్యతిరేకంగా నిరసనల భంగిమలు ప్రదర్శించి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. 14 నియోజకవర్గాలలో 4 టీడీపీ చేతిలోనే ఉన్నా కంచుకోటకు శిధిలావస్థకు చేరుకుంది.   రాష్ట్ర విభజనను షురూ చేయడం సీమాంధ్రలో కాంగ్రెస్ ఖాళీ కావడం ఆరంభమైంది. వైసిపీ, టీడీపీల వైపు కాకలు తిరిగిన కాంగ్రెస్ వాదులు వలస ప్రారంభించారు. కర్నూలు లో జగన్ పార్టీ వైపు కన్నెత్తి చూసేందుకే నేతలు భయపడుతున్నారు. జగన్ పార్టీలో కీకకంగా వ్యవహరిస్తున్న ఆ నేత.. ఒకప్పుడు టీడీపీ గూటి పక్షె.. చిరు చెంతకు చెరి.. అంతలోనే యువనేత వైపు తిరిగిపోయిన ఆ ప్రముఖుడు యువనేతకు బంధువు కూడా. వైసిపీలో చేరితే ఆ నేత కనుసన్నల్లో పని చేయాల్సి వస్తుందని భయపడే టీడీపీ గూటికి చేరుతున్నారని కర్నూలు వాసులు గుసగుసలాదుకున్తున్నారు.   సీనియర్ టీడీపీ నేత, గ్రీన్సిగ్నల్ ఇస్తే చాలు టీడీపీ లోకి రూట్ క్లియర్ అవుతుందని కాంగ్రెస్ అన్నయ్యలు ..తెలుగు తమ్ముల్లుగా మారిపోయేందుకు తెగ ఉబలాట పడిపొతున్నారు. మాజీ మంత్రులైన టీజీ, ఏరాసు తెలుగుదేశంలో గూటికి చెరారు. అన్నీ అనుకూలిస్తే నేడే రేపో మాజీ మంత్రి శిల్పా కూడా బాబు చెంతకు చేరనున్నారు. జగన్ అసలు స్వరూపం ఏంటో తెలిసిందని మీడియాకు ఎక్కినా మాటల మాంత్రికుడు మాజీ మంత్రి మారెప్ప కూడా పసుపు పచ్చ జెండా కోసం నిరీక్షిస్తున్నారని రాజకీయ వర్గాల సమాచారం. సీనియర్ కాంగ్రెస్ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే గంగుల, ఆలూరు తాజా మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి, తిక్కారెడ్డిలు కాంగ్రెస్ ను వీడెందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఎవరిని చేర్చుకుంటారు? ఎవరిని వద్దంటారు? అనేది ఇంకా సస్పెన్సే.. ఇప్పటికే వలసలను ప్రోత్సహించడంపై సీనియర్ టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. కర్నూలు కాంగ్రెస్ లీడర్లను హోలేసేల్ గా చేర్చుకుంటే టీడీపీ లోనూ కుమ్ములాటలు ఎక్కువయ్యే ప్రమాదం ఉందని ఆందోళనలు ఎక్కువవుతున్నాయే

41 ఏళ్ల తరువాత ..అదే భస్మాసుర "హస్తం"

  41 ఏళ్ల తరువాత ..అదే భస్మాసుర "హస్తం"   రాష్ట్రగతి..  రాష్ట్రపతిపాలనకు చేరింది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండటంతో యుపీఏ ప్రభుత్వం రాష్ట్రపతిపాలనకే మొగ్గు చూపుతోంది. కేబినెట్లో నిర్ణయం తీసుకున్న తరువాత  రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడమే తరువాయి.. 41 సంవత్సరాల తరువాత ఆంధ్రప్రదేశ్ లో ప్రెసిడెంట్ రూల్ అమలు కానుంది. రాష్ట్ర విభజన నేపధ్యంలో ఏపీలో అనిశ్చితి పరిస్తితి ఏర్పడింది. కిరణ్ రాజీనామాను అంత సీరియస్ గా తీసుకోని కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. న్యాయ సలహాలు.. పార్టీకి ఒనగూడే ప్రయోజనాలను బేరీజు వేసుకుంది. ఏపీలో ఇరు ప్రాంతాల వారిని వార్ రూంకి పిలిచి బేరాలు సాగించింది. చివరి వరకూ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకే ప్రయత్నాలు చేసింది. ఏమైందో ఏమో గానీ సడన్ బ్రేక్ వేసి ప్రెసిడెంట్ రూల్ టర్న్ తీసుకుంది. నలబై ఒక్క ఏళ్ళ కింద జై ఆంధ్ర ఉద్యమం సందర్భంగా తలెత్తిన ఉద్రిక్తతలు, రాజకీయ అనిశ్చితి నుంచి బయటి పడేందుకు 1973 జనవరి 11న రాష్ట్రపతి పాలన విధించారు. విచిత్రంగా నాలుగు దశాబ్దాల తరువాత తెలంగాణా, సమైక్యాంద్ర ఉద్యమాలతో ఏపీలో ఉద్రిక్తత పరిస్తితులు నెలకొన్నాయి. మళ్ళీ అదే విధంగా  రాష్ట్రపతి పాలన విధించనున్నారు. అప్పుడు...ఇప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్  ప్రభుత్వమే అధికారంలో ఉండడం విశేషమే కాదు... విచిత్రం కూడా. తమ ప్రభుత్వాలున్న చోటే తప్పనిసరై  ఆనాడు ప్రధానిగా ఉన్న ఇందిరా, నేడు ప్రధానిగా ఉన్న మన్మోహన్ (సోనియాగాంధీ అనుమతితో) ప్రెసిడెంట్ రూల్ కు సిఫారసు చేసారు. జై ఆంధ్ర ఉద్యమానికి తెలంగాణా ప్రాంతానికి చెందిన  పీవీ నరసింహారావు రాజీనామా చేస్తే .. నేడు తెలంగాణా ఉద్యమ ఉదృతికి సీమాంధ్రకు చెందిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. నాడు..నేడు  తమ సొంత రాష్ట్ర ప్రభుత్వాలపై భస్మాసుర "హస్తం" మోపి రాష్ట్రపతిపాలనకు విధించిన ఘనత మళ్లీ కాంగ్రెస్సే దక్కించుకుంది.

కొండను త్రవ్వి ఎలుకని పట్టిన సీఐడీ

  నాలుగు నెలల క్రితం పాలెం వద్ద జరిగిన వోల్వో బస్సు ఘోర అగ్ని ప్రమాదంలో 45 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. అప్పటి నుండి భాదితులు ప్రభుత్వానికి విన్నపాలు, న్యాయం కోసం ధర్నాలు చేస్తున్నా అటు ప్రభుత్వం కానీ, ఇటు బస్సు యాజమాన్యం గానీ మానవతా దృక్పదంతో స్పందించకుండా తీవ్ర నిర్లక్ష్యం వహించాయి. కనీసం భాదితుల మోర ఆలకించేందుకు కూడా వారికి ఓపిక, శ్రద్ధ లేకుండాపోయాయి. ప్రమాదానికి కారణమయిన దివాకర్ ట్రావెల్స్ కు చెందిన వోల్వో బస్సులతో బాటు పలు ప్రైవేట్ బస్సులను రవాణాశాఖ అధికారులు నిలిపివేసి కేసులు నమోదు చేసారు. దాని వలన భాదిత కుటుంబాలకి ఒరిగిందేమీ లేకపోయినా, ప్రైవేట్ బస్సులపై ఆధారపడి జీవిస్తున్న వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దూర ప్రయాణాలు చేసే ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఇక బస్సు ప్రమాదం తరువాత మేల్కొన్న ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశిస్తే అది కాస్త కొండను త్రవ్వి ఎలుకను పట్టినట్లు బస్సు యాజమాన్యం, డ్రైవర్ నిర్లక్ష్యం, ప్రమాదానికి కారణమయిన కల్వర్టుని నిర్మిస్తున్న కాంట్రాక్టరు, వివిధ ప్రభుత్వ శాఖల బాధ్యతా రాహిత్యం వలననే ఈ ప్రమాదం జరిగిందని, అదీగాక వోల్వో బస్సు డిజైన్‌లోనే అనేక లోపాలున్నాయని తన నివేదికలో పేర్కొన్నారు.   ప్రమాదం జరిగిన మొదటి మూడు రోజులలలోనే ఈ లోపాలన్నిటినీ మీడియా ఎత్తి చూపింది. కానీ ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా ప్రైవేట్ బస్సులపై దాడులకు, సిఐడీ విచారణకు ఆదేశించి చేతులు దులుపుకొంది తప్ప మీడియా ఎత్తిచూపిన లోపాలను సవరించే విధంగా బస్సు యాజమాన్యాలపై ఎటువంటి ఒత్తిడి తేలేదు. అందువల్ల నేటికీ రాష్ట్రంలో అవే వోల్వో బస్సులు తిరుగుతూనే ఉన్నాయి. ఈ దుర్ఘటనపై ఇంతవరకు దర్యాప్తు జరిపిన సీఐడీ చీఫ్ కృష్ణ ప్రసాద్ ఆ వోల్వో బస్సు డిజైన్‌లోనే అనేక లోపాలున్నాయని నిర్దారించడమే గాక వాటిని నిషేదించాలని సిఫారసు చేసారు.   అత్యున్నత నాణ్యతా ప్రమాణాల కారణంగా ప్రపంచంలో అత్యాధారణ పొందుతున్న వోల్వో బస్సు డిజైన్‌లోనే అనేక లోపాలున్నాయని ఒక సిఐడీ అధికారి చెప్పడం విడ్డూరంగా ఉంది. ఒకవేళ ఆయన చెప్పిన ప్రకారం వోల్వో బస్సులోనే లోపాలున్నాయని అనుకొంటే, ఇక నిత్యం ప్రజలు తిరిగే సాధారణ ఆర్టీసీ బస్సుల సంగతేమిటి? అని ఆలోచిస్తే ఇంతకాలంగా ప్రభుత్వము, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సు యాజమాన్యాలు ఎంత నిర్లక్ష్యంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుకొంటున్నాయో అర్ధమవుతుంది.అదేదో సామెత చెప్పినట్లు మన వ్యవస్థలలో ఇన్ని లోపాలు, అధికారులలో, బస్సు యాజమాన్యంలో ఇంత నిర్లక్ష్యం, ఎవరికీ జవాబుదారీతనం లేకపోవడం, మానవతా దృక్పదం లోపించడం వంటి సవాలక్ష తప్పులను ఉంచుకొని బస్సులో సాంకేతిక లోపాలున్నాయని వాటిని నిషేదించాలనుకోవడం ఇంట్లో ఎలుకలు చేరాయని ఇల్లు తగులబెట్టుకొన్నట్లు ఉంటుంది.

తెలంగాణాలో తెదేపా పరిస్థితి చక్కదిద్దేదెన్నడు?

  రాష్ట్ర విభజన చేసి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని తుడిచిపెట్టేయాలని కాంగ్రెస్ అధిష్టానం కుట్ర పన్నిందని ఇంతకాలంగా చంద్రబాబు నాయుడు చెపుతున్నమాటలు ఇప్పుడు క్రమంగా వాస్తవ రూపం దాల్చుతున్నాయి. తెలంగాణా ఉద్యమం పతాక స్థాయిలో జరుగుతున్న సమయంలో కూడా పార్టీని వీడని తెదేపా తెలంగాణా నేతలు, విభజన ప్రకటన వెలువడిన తరువాత నుండి క్రమంగా తెరాసవైపు మళ్ళుతున్నారు. ఇప్పుడు రాష్ట్ర విభజన కూడా జరిగిపోయింది గనుక మరికొంతమంది తెలుగు తమ్ముళ్ళు విజయోత్సాహంతో ఉన్న తెరాస వైపు మళ్ళుతున్నారు. మహేందర్ రెడ్డి (తాండూరు శాసనసభ్యుడు) కే.యాన్. రత్నం(చేవెళ్ళ);నరేంద్ర రెడ్డి (యంయల్సీ)లు ఇటీవల తెరాసలో చేరేందుకు సిద్దం అయ్యారు. వీరు గాక వరంగల్, మెహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన తెలుగు తమ్ముళ్ళను కూడా పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ కాంగ్రెస్-తెరాసల విలీనం లేదా పొత్తులు ఖరారవగానే మరికొందరు తెలుగు తమ్ముళ్ళు తెరాస వైపు దూకేయవచ్చును.   చంద్రబాబు నాయుడు తెలంగాణాలో కూడా తమ పార్టీయే విజయం సాధిస్తుందని ఎంత ధీమా వ్యక్తం చేస్తున్నా పరిస్థితి ఇలాగే కొనసాగితే తెలంగాణాలో పార్టీ ఖాళీ అయిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయన ఇటీవల తెలంగాణా తెలుగు తమ్ముళ్ళతో సమావేశమయ్యి వారికి దిశా నిర్దేశం చేసారు. కానీ, తెలంగాణాలో తెదేపాను పూర్తిగా తుడిచిపెట్టేయాలని చూస్తున్న కాంగ్రెస్-తెరాసలను ఎదుర్కొనేందుకు ఆయన తన సీనియర్ నేతలతో కలిసి చాలా గట్టి ప్రయత్నాలు వెంటనే చేయవలసి ఉంది. లేకుంటే తెదేపాకు ఇప్పుడున్న సీట్లు దక్కడం కూడా కష్టమవుతుంది. పైగా ఈలోగా పార్టీ ఖాళీ అయిపోయే ప్రమాదం కూడా ఉంది.   పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదం పొందిన తరువాత టీ-కాంగ్రెస్, తెరాస, బీజేపీలు తెలంగాణాలో విజయోత్సవాలు నిర్వహిస్తూ దూసుకుపోతూ, తెలంగాణా తెచ్చిన ఖ్యాతిని స్వంతం చేసుకొనే ప్రయత్నాలు చేస్తుంటే, తేదేపాకు చెందిన సీనియర్ తెలంగాణా నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి, రేవంత్ రెడ్డి వంటివారు అడుగు ముందుకు వేయలేని పరిస్థితిలో పార్టీ కార్యాలయానికే పరిమితమయిపోయారు. తెలంగాణా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీయే స్వయంగా “తెలుగుదేశం పార్టీ లేఖ ఇచ్చినందునే తెలంగాణా రాష్ట్రం ఏర్పడిందని” ప్రకటిస్తున్నపటికీ, తెదేపా తెలంగాణా నేతలు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశః ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వెనక్కి తగ్గినట్లున్నారు. కానీ, వారు ఇంకా ఇదే సంకట స్థితిలో మరికొంత కాలం కొనసాగినట్లయితే, ఈలోగా వారికి, పార్టీకి కూడా కోలుకోలేనంత నష్టం జరిగే అవకాశం ఉంది.   కాంగ్రెస్ పార్టీ ఏవిధంగా ఇప్పుడు సీమాంధ్రపై దృష్టి కేంద్రీకరించి పార్టీని బ్రతికించుకోవాలని ప్రయత్నిస్తోందో అదేవిధంగా సీమాంధ్రలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పటికయినా మేల్కొని తెలంగాణాపై దృష్టి కేంద్రీకరించవలసి ఉంది. లేకుంటే చంద్రబాబు జోస్యం నిజమయ్యే అవకాశం ఉంటుంది.

కాంగ్రెస్ పార్టీని ‘కాపు’ కాయగలవారెవరు?

  ప్రజల చేతిలో ఎన్నిమొట్టికాయలు తిన్నపటికీ మన రాజకీయ పార్టీల, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచనా విధానం ఎన్నటికీ మారకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. పదేళ్ళ పాలనలో ఎన్ని తప్పులు చేసినపటికీ వాటిని మరిపించేందుకు ఎన్నికల ముందు ప్రజలకు ఏవో కొన్ని తాయిలాలు విసిరేస్తే గలగలా ఓట్లు రాలిపోతాయనే అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలో చాలా బలంగా నాటుకుపోయుంది.ఈ మూడు నెలలోగా సీమాంధ్రలో మళ్ళీ పార్టీని బలోపేతం చేసుకొని మళ్ళీ అధికారం చేజిక్కించుకోవడం కోసం, కాంగ్రెస్ పార్టీ తన నేతలకి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్ష పదవులను ఎరగా వేస్తోంది.   ఇంతకాలం పార్టీకి అండగా నిలబడిన రెడ్లు ఇప్పుడు దూరం కావడంతో, కాంగ్రెస్ అధిష్టానం పార్టీలో కాపు సామాజిక వర్గాన్ని దువ్వుతోందిపుడు. వారు కూడా అందివచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొంటూ తమకే ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్ష పదవులు ఇచ్చినట్లయితే తమ కులస్తుల ఓట్లను గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకే పడేలా చేయగలమని హామీలివ్వడం విశేషం. ప్రజలను మనుషులుగా కాక కేవలం ఓట్లుగానే చూసే అలవాటు కాంగ్రెస్ పార్టీ నేతలకి ఎన్నడూ పో(లే)దని ఇది స్పష్టం చేస్తోంది. రాష్ట్ర విభజన చేసినందుకు సీమాంధ్రలో తెలుగు ప్రజలందరూ కుల, మతాలకు అతీతంగా ఉద్యమించారు. తెలుగు జాతిని రెండుగా చీల్చిన కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు సీమాంధ్ర ప్రజలను కులాలవారీగా చీల్చి ప్రలోభపెట్టి తిరిగి అధికారంలోకి రావాలని అర్రులు చాస్తోంది. సదరు కులానికి చెందడమే ప్రధాన అర్హతన్నట్లు భావిస్తున్నముగ్గురు నేతలు ఈ పోటీలో ఉన్నారు. అయితే వారిలో ఏ ఒక్కరయినా , ఇంతకాలంగా వారి కులస్తులకు ఏమయినా మేలు చేసారా? అని ఆలోచిస్తే లేదనే సమాధానం వస్తుంది. వారు రాష్ట్రంలో కాపు కులస్తులందరికీ తామే అసలు సిసలయిన ప్రతినిధులమని భావించవచ్చును. కానీ సదరు కులానికి చెందిన ప్రజలు కూడా ఆవిధంగా భావిస్తున్నారా? అనేదే ప్రశ్న.   అయినా కుల, మత, రాగ ద్వేషాలకి అతీతంగా ప్రజలకు సేవ చేస్తామని రాజ్యాంగం మీద ప్రమాణం చేసే ఈ నేతలకు ఆ సంగతి ఎన్నడూ ఎందుకు గుర్తుకు రాదో తెలియదు. కానీ, ఇప్పుడు కేవలం తమ కులస్థుల మీదే అవ్యాజమయిన ప్రేమ ఎందుకు పొంగి పొరలి పోతోందో మాత్రం అందరికీ తెలుసు. తమకు పదవులు ఇస్తే కాంగ్రెస్ పార్టీని కాపాడుతామని, తమ కులాన్ని బీసీ వర్గంలో చేర్చినట్లయితే తమ వాళ్ళను కూడా పడేయగలమని హామీలీయడం ప్రజలంటే వారికి ఎంత చులకనో తెలియజేస్తోంది. నిజంగా తమ కులస్థుల పట్ల సదరు నేతలకి అభిమానమే ఉండి ఉంటే గత పదేళ్లుగా వారికోసం ఏమి చేసారు? వారిని బీసీలలో ఎందుకు చేర్చలేకపోయారు? అని ప్రశ్నించుకొంటే వారి తపన దేనికో అర్ధమవుతుంది. అధికారం తమ కుటుంబసభ్యుల మధ్య తప్ప తమ కులస్థుల మధ్య ఎన్నడూ పంచుకోవడానికి ఇష్టపడని నేతలు ఏ కులానికి చెందిన వారయితే మాత్రం ప్రజలకు ఒరిగేదేమీ ఉంటుంది? అని ఆలోచిస్తే ప్రజలు ఇటువంటి నేతలకు ఓట్లు వేయరు. అప్పడు వారు కూడా ఇటువంటి ఆలోచనలు చేసేందుకు దైర్యం చేయరు.

హరికృష్ణ ఆవేదనకి అర్ధం ఉందా

  తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి నందమూరి హరికృష్ణ పార్టీలోనే ఉన్నపటికీ ఇంతవరకు పార్టీతో మమేకం కాలేకపోతున్నారు. కనీసం పార్టీలో ఇమడలేకపోయారు. అప్పుడప్పుడు పార్టీ సమావేశాలకు వచ్చి రభస చేయడం లేదా పార్టీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించడం తప్ప ఆయన పార్టీకి చేసిందేమీ లేదు. తెదేపా తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ గనుక తనకు ఎల్లపుడు కూడా తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకొంటూ, అది దక్కకపోవడంతో భంగపడి రచ్చ చేయడం ఆయనకు అలవాటుగా మారింది. సినిమాలలో ఆయన హీరో వేషాలు వేసి తన పాత్రలను గొప్పగా రక్తి కట్టించి ఉండవచ్చును. కానీ, రాజకీయాలలో రక్తి కట్టించాలంటే ఆ నటనతో బాటు లౌక్యం, కలుపుగోరుతనం, సర్దుబాటు గుణం కూడా చాలా అవసరమే. ఆ గుణాలేవీ ఆయనకు లేకపోవడం వలననే ఆయన నేటికీ తెదేపాలో ఇమడలేక, గౌరవం పొందలేక అత్మన్యూనతతో బాధపడుతున్నారు.   ఆయన పార్టీ ద్వారానే రాజ్యసభకు పంపబడినప్పటికీ కనీసం మాటమాత్రంగానయినా చెప్పకుండా సమైక్యాంధ్ర కోసం అంటూ రాజీనామా చేశారు. అనేక ఆటుపోటులను ఎదుర్కొంటూ చంద్రబాబు తన పార్టీని రెండు ప్రాంతాలలో బ్రతికించుకోవాలని తిప్పలు పడుతుంటే, హరికృష్ణ మాత్రం అదేమీ అర్ధంకాకనో లేక పార్టీ సమస్యలతో తనకు సంబంధం లేదనో రాజీనామా చేసి ‘చైతన్య యాత్ర’కి కూడా సిద్దపడి, ఆయన తమ పార్టీ విధానానికి అనుగుణంగా కాక, తన నిర్ణయానికి అనుగుణంగా పార్టీ మారలన్నట్లు వ్యవహరించడం పార్టీ అధిష్టానానికి ఆగ్రహం కలిగించడం సహజమే. అయితే ఆ తరువాత ఆయన తన యాత్రను మళ్ళీ ఎందుకో విరమించుకొన్నారు.   ఆయన పార్టీకి ఏమీ చేయలేకపోయినా కనీసం రాజ్యసభ సభ్యుడిగా ప్రజలకయినా ఏమీ చేయలేకపోయారు. కానీ తెదేపా రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి రాష్ట్ర విభజన బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొంటూ కాంగ్రెస్ అనుసరించిన తీరుని ఎండగడుతూనే, సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలకు, వారి వేదనకు తన ప్రసంగంలో అద్దం పట్టారు. అదే సమయంలో తమ పార్టీ విధానాన్ని కూడా గట్టిగా వినిపించి పార్టీకి అండగా నిలబడ్డారు. ఆయన సభలో చేసిన ప్రసంగం సభ్యులందరినీ, సీమాంధ్ర ప్రజలని కూడా ఆకట్టుకొంది. కానీ హరికృష్ణ ఆవేశంలో అనాలోచితంగా తన పదవికి రాజీనామా చేసి పార్టీనీ, ప్రజలనీ కూడా కించపరిచారు. సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేసానని చెప్పుకొన్న ఆయనే మళ్ళీ మొన్న జరిగిన రాజ్యసభ ఎన్నికలలో తనను తిరిగి రాజ్యసభకు నామినేట్ చేయమని కోరడం ఒక తప్పయితే, భంగపడి మళ్ళీ పార్టీపై నిప్పులు కక్కడం మరో తప్పు.   ఇటీవల జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశాలకు తనను ఆహ్వానించలేదని, పార్టీ కార్యక్రమాల గురించి టీవీలలో చూసి తెలుసుకోవలసిన దుస్థితి తనకు ఏర్పడిందని, అసలు తాను పార్టీలో ఉన్నానా లేదా? అనే అనుమానం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేసారు. పార్టీకి చెప్పకుండా రాజ్యసభకు రాజీనామా చేసినందునే తనను పార్టీ దూరం పెడుతున్నట్లు భావిస్తున్నానని అన్నారు. ఆయన ఆవేదన అర్ధం చేసుకోదగ్గదే. కానీ తనని పార్టీ ఎందుకు దూరం పెడుతోందో కూడా ఆయనే స్వయంగా గ్రహించినపుడైనా తన వెనుక పార్టీని నడవాలని కోరుకోకుండా, తన అహాన్నిపక్కన బెట్టి తనే పార్టీతో కలిసి నడిచే ప్రయత్నం చేసినట్లయితే ఆయనకీ ఇటువంటి దుస్థితి, ఆవేదన ఎదుర్కోవలసిన అవసరం ఉండదు. ఆయన ప్రజల కోసం, పార్టీ కోసం తన అహం పక్కన పెట్టలేనని భావిస్తే రాజకీయాల నుండి తప్పుకోవడం మేలు.

జగన్ ఓదార్పు తెలంగాణా ప్రజలకి అవసరమా?

  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేయబోతున్నట్లు ప్రకటించగానే తెలంగాణాను, అక్కడ పార్టీని కూడా వదులుకొని బయటపడిన వైకాపా, సమైక్యాంధ్ర నినాదం అందుకొని సీమాంధ్రపై పట్టుకోసం గట్టిగా కృషి చేసింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం కాకపోయినా సీమాంధ్రపై పట్టు కోసం జగన్మోహన్ రెడ్డి నిరాహార దీక్షలు, ధర్నాలు, సమైక్య సభలు, శంఖారావాలు వగైరా అంటూ చాలానే చేసారు. రాష్ట్రపతిని కలిసి విజ్ఞప్తులు చేసారు. ఆ తరువాత విభజనకు వ్యతిరేఖంగా దేశమంతా పర్యటించి వివిధ పార్టీల నేతలని కలిసారు. కానీ, రాష్ట్ర విభజన జరిగిపోయింది. అయినా తెలంగాణా కాళీ చేసేసి సీమంధ్రకు తరలివచ్చేసిన పార్టీ, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని ఇంతగా ఆరాటపడటం విడ్డూరంగా ఉన్నా, సీమాంధ్ర ప్రజల మనోభావనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ అక్కడ గట్టి పట్టు సాధించడానికి చాలానే కష్టపడ్డారు.   వెనకటికి ఓ దేవుడెవరో తన భక్తుడితో “నైవేద్యం పెడితే నా మహిమ చూపిస్తానన్నాడుట.” అలాగే ఒకపక్క రాష్ట్ర విభజన ప్రక్రియ చకచకా జరిగిపోతుంటే, జగన్మోహన్ రెడ్డి సమైక్య శంఖారావం చేసుకొంటూ “నాకు ముప్పై యంపీ సీట్లు ఇచ్చి చూడండి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే డిల్లీ కుర్చీలో కూర్చోబెడతానని” చెపుతూ అధికారం కోసమే ఈ తిప్పలన్నీ అనే తన మనసులో మాటను తానే బయటపెట్టుకొన్నారు. ఇప్పుడు రాష్ట్ర విభజన కూడా జరిగిపోయింది గనుక ముప్పై కాదు ఆయనకు మూడొందల సీట్లు ఇచ్చినా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచలేరనే సంగతి స్పష్టమయింది.   అన్ని రకాల సానుభూతి పవనాలు క్రమంగా తగ్గిపోతునపుడు, అందరి దృష్టి ఆకర్షించేందుకు ఏదో ఒక అంశం పట్టుకొని ముందుకు సాగవలసి ఉంటుంది గనుక జగన్మోహన్ రెడ్డి ఈ సమైక్యాంధ్ర నినాదంతో ఇన్ని రోజులు నెట్టుకొచ్చేసారు. ఇక రాష్ట్ర విభజన జరిగిపోయి ఎన్నికలను ఎదుర్కొనే సమయం ఆసన్నమవుతోంది గనుక, అటక మీద పడేసిన తెలంగాణా జెండాలని క్రిందకు దింపి, దుమ్ము దులిపి మళ్ళీ తెలంగాణాలో పార్టీ నేతలను వెతుకొంటూ జగన్ త్వరలో అంటే మార్చి15 నుండి నల్గొండలో ఓదార్పు యాత్రలు చెప్పట్టబోతున్నారు. కానీ తెలంగాణా ఏర్పడినందుకు సంభరాలు చేసుకొంటున్న తెలంగాణా ప్రజలు ఇంకా ఆయన ఓదార్పుని కోరుకొంటున్నారో, లేదో వారే నిర్ణయించుకోవలసి ఉంది.

తెలంగాణాపై పట్టు కోసం పార్టీల తిప్పలు

  ఇక రాష్ట్రవిభజన జరిగిపోయినట్లే గనుక, అన్ని పార్టీలు ఎన్నికల వైతరిణిని దాటేందుకు రాజకీయాలకు ఉపక్రమించుతున్నాయి. తెలంగాణా తెచ్చిన కారణంగా మంచి ఊపుమీదున్న కాంగ్రెస్, తెరాసలు అది తమ ఘనతేనని చెప్పుకోవడం సహజమే. కానీ, చివరి వరకు రెండు నాల్కలతో మాట్లాడిన బీజేపీ కూడా అది తమ గొప్పదనమేనని టముకు వేసుకొంటూ మరికొన్ని సీట్లయినా పెంచుకోవాలని తిప్పలు పడుతోంది.   తెదేపా తెలంగాణాకు అనుకూలంగా లేఖ ఇచ్చినప్పటికీ, సీమాంధ్రలో పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇంతవరకు ఆలేఖ గురించి, తమ చిత్తశుద్ధి గురించి గట్టిగా చెప్పుకోలేకపోయింది. కానీ, ఇప్పుడు విభజన అయిపోయింది గనుక ఇప్పుడు చంద్రబాబు కూడా తమ పార్టీ ఇచ్చిన లేఖ గురించి మీడియా ముందు దైర్యంగా ప్రస్తావించి, మిగిలిన అన్ని పార్టీలు మాటమార్చినా, ఇంతవరకు తెలంగాణా ఏర్పాటు చేయమని కోరుతూ ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోకపోవడం తమ నిబద్దతకు అద్దంపడుతోందని ఆయన అన్నారు. తాము రాష్ట్ర విభజన జరుగుతున్న తీరునినే వ్యతిరేఖించామే తప్ప తెలంగాణా కాదని మరో మారు పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో కూడా తెదేపాను దెబ్బ తీయాలనే ఆత్రంలో కేవలం తెదేపా లేఖ ఇచ్చినందునే రాష్ట్ర విభజన చేసి తెలంగాణా ఏర్పాటు చేయవలసి వచ్చిందని ప్రకటించడం కూడా తెదేపాకు కలిసి వచ్చింది. అందువలన త్వరలోనే తెదేపా కూడా రంగంలో దిగడం ఖాయం.   కాంగ్రెస్-తెరాసలు చేతులు కలపడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కానీ, తెదేపా-బీజేపీల పొత్తులు అనుమానమే. ఆ పరిస్థితిలో కాంగ్రెస్-తెరాస-సీపీఐ-మజ్లిస్ కూటమి ఒకవైపు, తెదేపా, సీపీయం, బీజేపీలు వేర్వేరుగా మరో వైపు ఎన్నికల బరిలో నిలుస్తాయి. కానీ, కాంగ్రెస్-తెరాసలు చేతులు కలిపితే వారిని ఈ పార్టీలు ఒంటరిగా ఎదుర్కోవడం చాల కష్టమే అవుతుంది. అందువల్ల మరి తెదేపా-బీజేపీలు పొత్తులకు సిద్దపడతాయా లేదా అనేది ఇంకా తేలవలసి ఉంది. ఒకవేళ తెదేపా దైర్యం చేసి బీజేపీతో ఎన్నికల పొత్తులకి సిద్దపడినప్పటికీ, విజయోత్సాహంతో ఉన్న బీజేపీ తెలంగాణా నేతలు తెదేపాతో పోత్తులకు అంగీకరించవు గనుక ఆ రెండు పార్టీలకి ఒంటరి పోరు తప్పకపోవచ్చును. అదే జరిగితే కాంగ్రెస్-తెరాస కూటమి అందుకు చాలా సంతోషిస్తుంది.

బీజేపీపై విమర్శల వర్షం కురిపిస్తున్న తెదేపా

  తెలుగుదేశం పార్టీ నేతల విసుర్లు చూస్తుంటే ఆ పార్టీ బీజేపీతో ఎన్నికల పొత్తులపై పునరాలోచనలోపడినట్లే కనిపిస్తోంది. మొన్న తెదేపా సీనియర్ నేత నన్నపనేని రాజకుమారి, బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ ని తీవ్రంగా విమర్శిస్తే, ఈరోజు యనమల రామకృష్ణుడు బీజేపీని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీతో ప్యాకేజి కుదుర్చుకొన్నందునే బీజేపీ విభజన బిల్లుకి మద్దతు ఇచ్చిందని విమర్శించారు. రెండు పార్టీలు పక్షపాత వైఖరితో వ్యవహరించి సీమాంద్రులకు తీరని అన్యాయం చేసి, మళ్ళీ వారినేదో ఉద్దరిస్తున్నట్లుగా ప్యాకేజీలు మేమిప్పించామంటే మేమే ఇప్పించామని గొప్పలు చెప్పుకొంటున్నాయని విమర్శించారు. అయితే ఇంతవరకు చంద్రబాబు బీజేపీ గురించి మాట్లాడలేదు. శంఖంలో పోస్తే కానీ నీరు తీర్ధం కాదన్నట్లుగా శాస్త్రప్రకారం ముందుగా తన నేతలతో ఈ తెగతెంపుల కార్యక్రమం మొదలుపెడితే, బీజేపీ కూడా ఏ నాగం జనార్ధన్ రెడ్డి ద్వారానో చంద్రబాబుని ఓ నాలుగు ముక్కలు తిట్టించకపోదు. అప్పుడు చంద్రబాబు రంగంలో దిగి పొత్తులు గురించి మేమెన్నడూ ఆలోచించనేలేదని ముక్తయిస్తారేమో!   ఒకవేళ ఈ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకోకపోయినట్లయితే రెండు పార్టీలు ఎంతో కొంత మేర నష్టపోవచ్చును. బీజేపీ సీమాంధ్రలో నష్టపోతే, తెదేపా తెలంగాణాలో పోవచ్చును. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తమ వల్లనే సాధ్యమయిందని ప్రచారం చేసుకొంటున్న కాంగ్రెస్ పార్టీతో పోటీపడుతూ బీజేపీ కూడా తెలంగాణా ఏర్పాటు తమ సహకారం వలననే సాధ్యపడిందని మొదలుపెట్టిన ప్రచారం, తెదేపా ఆ పార్టీతో ఎన్నికల పొత్తులు పెట్టుకొనే అవకాశాలను క్రమేపి తగ్గించి వేస్తోంది. బహుశః మరొకమూడు నాలుగు రోజుల్లో ఆ రెండు పార్టీల నేతలు తమ మధ్య పొత్తుల ఆలోచనలేవీ లేవని ప్రకటిస్తారేమో. ఆ తంతు కూడా ముగిస్తే ఇక ఆ రెండు పార్టీలు ఒకదానిపై మరొకటి నిప్పులు చెరుగుకోవడం మొదలు పెడతాయేమో!

రాజధాని నిర్మాణానికి ప్రాతిపాదిక ఏది?

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఎక్కడ నిర్మించాలనే అంశం మళ్ళీ కొత్త సమస్యలకు, సరికొత్త రాజకీయాలకు రాజకీయ పార్టీలు, నేతల మధ్య పోరాటాలకి తెరతీయవచ్చును. రాజధాని ఎక్కడ నిర్మిస్తే భౌగోళీకంగా, సాంకేతికంగా, పరిపాలనకు సౌలభ్యంగా ఉంటుందనే అంశాల కంటే , రాజకీయ పార్టీలు తాము ఏ ప్రాంతంలో చాలా బలంగా ఉన్నాయని భావిస్తున్నాయో అక్కడే రాజధాని నిర్మాణం చేయమని పట్టుబట్టవచ్చును గనుక ఇది కూడా మరో వివాదాస్పద అంశంగా మారె అవకాశం ఉంది. అయితే, ఇప్పటికే రాష్ట్ర విభజన వ్యవహారంలో రాజకీయ పార్టీల తీరుపట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు కనుక, రాజకీయ పార్టీలు వారి సహనాన్ని మరోసారి పరీక్షించే సాహసం చేయకపోవచ్చును. అదే జరిగితే నిపుణుల కమిటీ సూచనల ప్రకారం అన్ని విధాల అనువయిన ప్రాంతంలోనే రాజధాని నిర్మాణం జరుగవచ్చును.

తెలుగు ప్రజలతో చెలగాట మాడుతున్న కాంగ్రెస్, బీజేపీలు

  ఎన్నికల తరువాత కేంద్రంలో అధికారం దక్కించుకోవడమే పరమావధిగా కాంగ్రెస్, బీజేపీలు సున్నితమయిన రాష్ట్ర విభజన వ్యవహారంపై వికృత రాజకీయ క్రీడ ఆడుతున్నాయి. ఆ రెండు పార్టీలు ఈ మొత్తం వ్యవహారంలో తమకే పూర్తి రాజకీయ లబ్ది కలగాలనే కోణంలోనే ఆలోచిస్తూ ఎత్తులు పైఎత్తులు వేస్తూ రాష్ట్ర విభజనకు సహకరించుకొంటూనే, ఒకదానిపై మరొకటి కత్తులు దూసుకొంటున్నాయి. ఒకవైపు రాష్ట్ర విభజన చేసి తెలంగాణాలో తమ పార్టీలకి ప్రయోజనం కలిగేలా జాగ్రత్తపడుతూనే, మరో వైపు తామే సీమాంధ్ర ప్రజల మేలు కోసం (ఎక్కువ) పరితపించిపోతున్నట్లు ఆయా పార్టీల నేతలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు.   కాంగ్రెస్ అధిష్టానానికి చెక్కభజన చేస్తున్న కేంద్రమంత్రులు జేడీ.శీలం వంటివారు తాము గట్టిగా పట్టుబట్టడం వలననే సీమాంధ్రకు స్వతంత్ర ప్రతిపత్తి, ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చేందుకు సోనియా, రాహుల్ గాంధీలు చాల దయతో అంగీకరించారని, అందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నామని చెప్పడం చూస్తుంటే, వారిరువురు రాష్ట్రవిభజన చేస్తున్నపటికీ, వారు దయతో ప్యాకేజీలు విదిలించినందుకు సీమాంధ్ర ప్రజలు కూడా ఎంతయినా ఋణపడి ఉండాలన్నట్లు సూచిస్తున్నట్లుంది. అంతేకాక కేవలం తాము, తమ అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ మాత్రమే సీమాంధ్రకోసం పరితపించిపోతున్నట్లుగా మాట్లాడుతూ, తమ కాంగ్రెస్ పార్టీయే రాష్ట్ర విభజన చేసిన విషయాన్ని మరుగునపరిచే ప్రయత్నం కూడా చేస్తున్నారు. పనిలోపనిగా తాము కోరిన ప్యాకేజీలనే బీజేపీ కాపీ కొట్టి, అది తమ ప్రతాపమే అన్నట్లు మాట్లాడుతోందని ఎద్దేవా చేసారు.   ఇక బీజేపీ నేతలు కూడా వారికి తీసిపోనట్లు తాము కాంగ్రెస్ అధిష్టానం మెడలువంచి సీమాంధ్రకు స్వతంత్ర ప్రతిపత్తి, ప్రత్యేక ప్యాకేజీలు ఇప్పించేందుకు ఒప్పించామని, అందువల్ల ఈ ‘టోటల్ ఖ్యాతి’ మొత్తం తమకే పూర్తిగా చెందాలని బిగ్గరగా వాదిస్తోంది.   ఈవిధంగా కాంగ్రెస్, బీజేపీలు రెండూ రాష్ట్ర విభజన చేసేందుకు ఒకదానికొకటి పరస్పరం సహకరించుకొంటూ అటు తెలంగాణాలో తమ తమ పార్టీ ప్రయోజనాలు కాపాడుకొనే ప్రయత్నం చేస్తూనే, మరోవైపు రెండూ కూడా సీమాంధ్రపై కపట ప్రేమ ఒలకబోస్తున్నాయి. అయితే రెండు ప్రాంతాలలో ప్రజలను ఆకట్టుకోవాలనే ప్రయత్నంలో అవి ఆడుతున్నఈ నాటకాలను చూసి రెండు ప్రాంతాలలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా వాటిని అసహ్యించుకొంటున్నారనే సంగతి అవి గ్రహించలేకపోవడం విచిత్రం. సున్నితమయిన ఈ అంశంతో కోట్లాది తెలుగు ప్రజల భావోద్వేగాలు ముడిపడిన సంగతిని ఏ మాత్రం పట్టించుకోకుండా రెండు పార్టీలు ఆడుతున్న నాటకాలతో అవి ఆశిస్తున్నట్లు ఏమాత్రం రాజకీయలబ్ది కలుగకపోగా సరిగ్గా అదే అంశంతో ఘోరంగా దెబ్బ తినే ప్రమాదం ఉందని గ్రహించలేకపోవడం మరీ విచిత్రం.

తెదేపా ఆంధ్ర, తెలంగాణా శాఖలకు శ్రీకారం?

  రాష్ట్ర విభజన అనివార్యమని తెలియడంతో తెలుగుదేశం పార్టీ రెండు రాష్ట్రాలకు విడివిడిగా పార్టీ శాఖలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు మొదలుపెట్టక తప్పలేదు. నిన్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన పార్టీ నేతలతో సమావేశమయ్యి ఈ విషయమపై చర్చించారు. కాంగ్రెస్ అధిష్టానం తన రాజకీయ ప్రత్యర్ధులను అన్నివిధాల దెబ్బతీసేందుకే ఎన్నికలు దగ్గిరపడేవరకు ఈ విభజన వ్యవహారాన్ని సాగదీసుకొంటూ వచ్చిందని, ఇంకా ఆలస్యం చేసినట్లయితే, ఒకవేళ కాంగ్రెస్ మరేదయినా నక్కజిత్తులు ప్రదర్శిస్తే ఎన్నికలకు సిద్దం అవడానికి కూడా ఇక సమయం మిగలకపోవచ్చని, అందువలన వెంటనే ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాలకు ప్రత్యేక శాఖల ఏర్పాటు చేయవలసిందిగా తెదేపా నేతలు ఆయనను కోరినట్లు సమాచారం. అందుకు కోసం మొదట రెండు కమిటీలను నియమించేందుకు చంద్రబాబు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం.   పార్టీకి చెందిన ఆంధ్ర, తెలంగాణా నేతలతో మళ్ళీ త్వరలోనే విడివిడిగా సమావేశమయ్యి కమిటీలో సభ్యుల పేర్లను, కమిటీల విధివిధానాలను ఖరారుచేసే అవకాశాలున్నాయి. నిన్న జరిగిన సమావేశంలో ఉభయ ప్రాంతాలకు చెందిన సీనియర్‌ నేతలు అందరూ పాల్గొన్నారు. ఒకవేళ తెలుగుదేశం రెండు రాష్ట్రాలలో ప్రత్యేక శాఖలు ఏర్పాటు చేసుకోవాలంటే, ముందుగా ఆ పార్టీని జాతీయపార్టీగా మార్చుకొని ఎన్నికల సంఘం వద్ద నమోదు చేయించుకోవలసి ఉంటుంది. ఆ తరువాత రెండు రాష్ట్రాలలో శాఖలకు విడివిడిగా పార్టీ అధ్యక్షులను, కార్యవర్గాలను ఏర్పాటు చేసి, చంద్రబాబు ఆ రెండింటికి జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చెప్పట్టవలసి ఉంటుంది.   ఈ సమావేశంలో వారు బీజేపీతో పొత్తుల వ్యవహారంపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. వారిలో బీజేపీతో ఎన్నికల పొత్తులకు మొదట సానుకూలంగా ఉన్న సీమాంధ్ర నేతలు ఇప్పుడు వ్యతిరేఖించగా, తెలంగాణా నేతలు పొత్తులు పెట్టుకోవాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈరోజు బీజేపీ రాజ్యసభలో టీ-బిల్లుపై వ్యవహరించిన తీరుని బట్టి ఆ పార్టీతో ఎన్నికల పొత్తులు పెట్టుకోవాలా లేదా? అనే సంగతి నిర్ణయించుకోవడం మేలని వారు భావించినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ వ్యూహంతో తెదేపా-బీజేపీలు కటీఫ్

  లోక్ సభలో నిన్న తెలంగాణా బిల్లు ఆమోదం పొందింది గనుక ఇక ఈరోజు రాజ్యసభకు వెళుతుంది. బీజేపీ కూడా బిల్లుకి మద్దతు ఇస్తునందున ఇక రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందడం కేవలం లాంచనప్రాయమే. కాంగ్రెస్ పార్టీలో తెరాస విలీనానికి ఆ పార్టీ అధినేత కేసీఆర్ అంగీకరించినట్లు సమాచారం. కనుక కాంగ్రెస్, తెరాస నేతలమధ్య పదవులు, టికెట్స్ పంపకాలు పూర్తి చేసుకొనగానే, అందరూ కాంగ్రెస్ కండువాలు కప్పుకొని తమ ప్రధాన ప్రత్యర్దులయిన తెదేపా, బీజేపీలపై యుద్ధం ప్రకటిస్తారు. బీజేపీ విషయానికి వస్తే విభజనకు సహకరించినప్పటికీ ఆ ప్రయోజనమంతా తెరసకి అది కాంగ్రెస్ లో విలీనమయితే కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది తప్ప బీజేపీకి ఒరిగేదేమీ ఉండదు.   రాష్ట్ర విభజన దెబ్బతో తెలంగాణాలో డీలాపడిన తెదేపా, అందుకు సహకరించిన బీజేపీతో పొత్తులు పెట్టుకొంటే ఆ ప్రభావం సీమాంధ్రలో తీవ్రంగా ఉంటుంది గనుక ఒంటరిపోరుకే సిద్దపడవచ్చును. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్, తెరాసలు చేతులు కలిపినట్లయితే విజయోత్సాహంతో ఉన్నవారిని ఎదుర్కొని ఓడించడం తెదేపా, బీజేపీల వల్ల కాదు.   కాంగ్రెస్ విసిరిన గాలానికి చిక్కుకొన్న బీజేపీ రెండు ప్రాంతాలలో నష్టపోవడమే కాకుండా, తెదేపాను కూడా పోగ్గోట్టుకొనే అవకాశం ఉంది. ఎన్నికల తరువాత కేంద్రంలో అధికారం దక్కించుకోవాలని ఉవ్విళ్ళూరుతున్న బీజేపీ, ఇటువంటి కీలక సమయంలో దక్షిణాదిన ఉన్న ఏకైక మిత్రపార్టీ తెదేపాను పోగొట్టుకొంటే ఆ నష్టం తిరిగి ఎన్నడూ పూడ్చుకోలేదు. ఒకవేళ చంద్రబాబు థర్డ్ ఫ్రంట్ కి మొగ్గు చూపినట్లయితే, ఇక బీజేపీకి ఎదురీత తప్పకపోవచ్చును. బహుశః విభజన ద్వారా కాంగ్రెస్ ఆశించిన అనేక ప్రయోజనాలలో తెదేపా-బీజేపీలను దూరం చేయడం, తద్వారా రాష్ట్రంలో తెదేపాను, జాతీయ స్థాయిలో బీజేపీని బలహీనపరచడం కూడా ఒకటయి ఉండవచ్చును.   అయితే ఇంతవరకు చంద్రబాబు కానీ, ఆ పార్టీ సీనియర్ నేతలు గానీ బిల్లు ఆమోదంలో బీజేపీ పాత్రపై పెదవి విప్పలేదు. బహుశః ఈ రోజు రాజ్యసభలో బిల్లుపై బీజేపీ వ్యవహరించిన తీరు చూసిన తరువాత చంద్రబాబు బీజేపీతో పొత్తులపై విస్పష్టమయిన ప్రకటన చేయవచ్చును. అయిది, బీజేపీ ఇప్పుడు రాజ్యసభలో బిల్లుని ఎంతగా వ్యతిరేఖించినప్పటికీ బిల్లు ఆమోదం పొందడం లాంచనమే గనుక, బహుశః తెదేపా ఆ పార్టీతో ఎన్నికల పొత్తులను నిరాకరించవచ్చును.

బీజేపీ కూడా మూల్యం చెల్లించుకోక తప్పదా

  సీమాంధ్ర తరపున పోరాడుతామని, మూజువాణి ఓటుకి ఒప్పుకోమని వాదించిన బీజేపీ నిన్న లోక్ సభలో బిల్లుని అడ్డుకొనే ప్రయత్నం చేయకుండా ప్రేక్షకపాత్ర వహించి సహకరించింది. తెలంగాణాకు కట్టుబడి ఉన్నందునే బిల్లుకి మద్దతు ఇచ్చామని సమర్దించుకొంది. తృణమూల్ కాంగ్రెస్, జేడీ(యూ) వంటి పార్టీలు సైతం బిల్లుని వ్యతిరేఖిస్తూ సభ నుండి వాకవుట్ చేసి నిరసన తెలుపగా, కనీసం బీజేపీ ఆపని కూడా చేయలేకపోయింది. కాంగ్రెస్-బీజేపీల బండారం బయటపడుతుందనే భయంతోనే సభలో తలుపులు, కిటికీలు మూయించి, లోక్ సభ ప్రసారాలు నిలిపివేయించి రెండు పార్టీలు కలిపి రహస్యంగా బిల్లుని ఆమోదింపజేసి ఉంటాయి. బహుశః గత రెండు మూడు రోజులుగా ఆ రెండు పార్టీల మధ్య జరుగుతున్నా చర్చలన్నీ ఈ వ్యూహం కోసమే తప్ప సవరణల కోసమో లేక బిల్లుకి మద్దతు కోసమో మాత్రం కాదనిపిస్తోంది.   కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యక్షంగా కపట నాటకాలు ఆడితే, బీజేపీ తెర వెనుక నిలబడి కనబడకుండా ఆడింది. కాంగ్రెస్ కత్తితో సీమాంధ్ర ప్రజల గొంతులు కొస్తే, బీజేపీ అంతకంటే దారుణంగా తడిగుడ్డతో వారి గొంతు నులుమింది. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనకు పూనుకొన్నపుడే సీమాంధ్రలో తన పార్టీని పణంగా పెట్టుకొని జూదం మొదలుపెట్టింది గనుక అందుకు అది పశ్చాతాపపడబోదు. ఎందుకంటే తెలంగాణాలో తెరాసని విలీనం చేసుకొని, 15 యంపీ సీట్లు సాధించి ఆ లోటుని అది భర్తీ చేసుకోగలదు. కానీ, బీజేపీ చేసిన పనివల్ల సీమాంధ్రలో తుడిచిపెట్టుకుపోవడమే కాక తెలంగాణాలో కాంగ్రెస్-తెరాసలు చేతులు కలిపినప్పుడు అక్కడ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకు పోవడం ఖాయం.   సోనియా, రాహుల్ గాంధీలు రాష్ట్రంలో పర్యటించలేరని దుస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేసిన నరేంద్ర మోడీ, ఇప్పుడు తను, తన అగ్ర నేతలు కూడా సీమాంధ్రలో కాలుపెట్టలేని దుస్థితి చేజేతులా కల్పించుకొన్నారు. నిన్నటి వరకు మోడీకి బ్రహ్మ రధం పట్టిన సీమాంధ్ర ప్రజలు, బీజేపీ చేసిన పనికి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన ఫోటోలున్న బ్యానర్లను చింపి తగులబెట్టారు. ఆపార్టీ కార్యాలయాలపై దాడులు చేసారు.   సీమాంధ్ర ప్రజాగ్రహానికి గురయిన బీజేపీతో ఎన్నికల పొత్తులు పెట్టుకొనేందుకు తెలుగుదేశం పార్టీ కూడా నిరాకరించవచ్చును. తన రాజకీయ ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీకి సహకరించి బీజేపీ ఏమి బావుకొంటుందో తెలియదు కానీ ఎన్డీయే కూటమిని బలోపేతం చేయగల తెలుగుదేశం పార్టీ మద్దతుని, చంద్రబాబు సహకారాన్ని పోగొట్టుకోవడం తధ్యంగా కనిపిస్తోంది.

చిదంబర మాయతో ఓట్లు రాలుతాయా?

  ఆర్ధికమంత్రి చిదంబరం నిన్న లోక్ సభలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ గమనిస్తే, అది పూర్తిగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రూపొందించినదేనని అర్ధమవుతుంది. మధ్యతరగతి ప్రజలను మభ్యపెట్టగలిగితే చాలు ఎన్నికలలో ఓట్లు గలగలా రాలిపోతాయనే భ్రమలో నుండి కాంగ్రెస్ పార్టీ బహుశః ఎన్నటికీ బయటపడలేదేమోనని ఈ బడ్జెట్ చూస్తే అర్ధమవుతుంది. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా కొనుగోలుచేసే సెల్ ఫోన్లు, ఫ్రిజ్జులు, స్కూటర్లు, మోటార్ సైకిల్సు, కంప్యూటర్లు , ప్రింటర్లు, చిన్న కార్లపై సుంకాలు తగ్గించడం ద్వారా చిదంబరం వారిని ప్రసన్నం చేసుకొనే ప్రయత్నం చేసారు. ఇక గంపగుత్తగా లక్షలాది మంది సైనికులను, వారి వెనుక ఉండే వారి కుటుంబాల ఓట్లను రాల్చుకొనే ప్రయత్నంలో ఒకే ర్యాంక్-ఒకే పెన్షన్ పధకానికి కూడా లాంచనంగా ఆమోదముద్ర వేసారు. ఎన్నికలే కనుక లేనట్లయితే ఈ బడ్జెట్లో ప్రజల గోళ్ళూడగొట్టి మరీ బలవంతంగా పన్నులు వసూలు చేసేవారు. కానీ, ఎన్నికలను ఎదురుగా పెట్టుకొని అటువంటి సాహసం చేయడంమెందుకని ఈసారికి ప్రజలను కనికరించారు. అందువల్ల ఈ బడ్జెట్లో కొత్తగా పన్నులు లేవు. ఉన్న పన్నులు పెరుగలేదు. అదేవిధంగా వేటి ధరలు కూడా పెంచే ప్రయత్నం చేయలేదు.   దేశంలో ప్రజలందరూ అల్ప సంతోషులు, ‘మెమొరీ లాస్’ వ్యాధితో బాధపడుతున్నారని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఈ తాయిలాలతో వారందరూ సంబరపడిపోతూ గత పదేళ్ళలో తను వెలగబెట్టిన నిర్వాకాలన్నిటినీ కూడా మరిచిపోయి, గుడ్డిగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేసేస్తారని కాంగ్రెస్ అధిష్టానం దృడంగా విశ్వసిస్తోంది. అందుకే ఎన్నికల ముందు తాయిలాలు పంచిపెడుతోంది. ఇది ఆ పార్టీకి ప్రజల విజ్ఞత పట్ల ఎంతటి చులకన భావం ఉందో అద్దం పడుతోంది. ఇంతవరకు వెలువడిన సర్వే నివేదికలన్నీ కూడా రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం తప్పదని పదే పదే హెచ్చరిస్తున్నా కూడా మేల్కొనకపోగా తను భ్రమలో ఉంటూ ప్రజలను కూడా భ్రమింపజేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే కధ క్లైమాక్సుకు చేరుకొన్న తరువాత దానికి ఇంతకంటే వేరే గత్యంతరం లేదు కూడా.