అసంతృప్తి వర్గంలోకి పొన్నాల జంప్?

  అధికారంలో ఉన్నా లేకున్నా పదవుల కోసం కీచులాడుకోవడం కాంగ్రెస్ పార్టీ నేతలకు అలవాటే. పొన్నాల లక్ష్మయ్యని తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు నియమించిన మరునాటి నుండే ఆయనకు వ్యతిరేకంగా పార్టీలో కుమ్ములాటలు మొదలయ్యాయి. ఎన్నికల సమయంలో టీ-కాంగ్రెస్ నేతలందరూ కలిసి పార్టీని గెలిపించుకొనే ప్రయత్నం చేయకుండా పొన్నాలను ఆ కుర్చీలో దింపేందుకే చాలా అంకితభావంతో పనిచేసారు. ఎట్టకేలకు వారి సమిష్టి కృషి ఫలించింది. పొన్నాలను కుర్చీలో నుండి దింపేసి అందులో హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూర్చోబెట్టేందుకు రంగం సిద్దమవుతోంది.   ఉత్తమ్ కుమార్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించబోతున్నట్లు తెలిసి మళ్ళీ షరా మామూలుగానే ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు పొన్నాలతో బాటు మాజీ అధ్యక్షులు డి.శ్రీనివాస్, వి.హనుమంతరావు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు అప్పుడే ఆయనపి కారాలు మిరియాలు నూరుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ నేతలకు తమ పార్టీ భవిష్యత్ గురించి ఆలోచించే తీరిక లేకపోయినప్పటికీ, ఇటువంటి కుమ్ములాటలకు మాత్రం అందరూ తీరిక చేసుకోవడం విశేషమే. అందువల్ల కొత్తగా ఎన్నికయిన అధ్యక్షుడు కూడా పార్టీ భవిష్యత్ కంటే ముందు తనను వ్యతిరేకిస్తున్న వారినందరినీ సముదాయించుకొంటూ, వారి నుండి తన కుర్చీకి ఎటువంటి ముప్పు కలగకుండా కాపాడకుండా చూసుకోవడానికే తన సమయం వెచ్చించక తప్పదు. కాంగ్రెస్ పార్టీ అంటే మరి అలాగే నడుస్తుంది. నడవాలి కూడా. అప్పుడే అది కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు కూడా తేలికగా గుర్తించగలుగుతారు.

హామీలన్నీ నీటి మీద రాతలేనా?

  ఈరోజు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా ఆ పార్టీ నేతలందరూ అసంతృప్తి చెందినట్లు బహిరంగంగానే చెప్పారు. అయినప్పటికీ వారెవరూ కూడా మిత్రపక్షమయిన బీజేపీకి, తాము భాగస్వామిగా ఉన్న ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి తీవ్ర విమర్శలు చేయలేదు. తమ ప్రయత్నలోపం లేకుండా మళ్ళీ మరొకసారి ప్రధాని మోడీని, ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కలిసి రాష్ట్ర పరిస్థితి మరోమారు వివరించి అధనపు నిధుల విడుదలకు కృషి చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు. కానీ చంద్రబాబు ఒత్తిళ్ళకి మోడీ ప్రభుత్వం ఎంతమాత్రం తలొగ్గబోదని ఇప్పటికే నిరూపితమయింది. ఆయన ఎన్నిసార్లు డిల్లీ ప్రదక్షిణాలు చేసినప్పటికీ కేంద్రం తను ఈయదలచున్నదే ఇస్తోందే తప్ప అధనంగా ఎటువంటి హామీలు ఇవ్వడం లేదు.   రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్, అరుణ్ జైట్లీ తదితరులు ఇంతవరకు హామీలు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఇవ్వలేమని తేల్చి చెప్పారు. అందుకు ప్రత్యమ్నాయంగా రాష్ట్రానికి మంచి ప్యాకేజి ఇస్తామన్నారు. ఏదో మొక్కుబడిగా ఇచ్చేరు కూడా. కానీ అది రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ఏవిధంగా కూడా ఉపయోగపడదని చంద్రబాబు నాయుడే స్వయంగా కుండబ్రద్దలు కొట్టినట్లు ప్రకటించారు. కనుక ఈ విషయంలో కేంద్రం మాట తప్పినట్లయింది.   రాష్ట్రానికి రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని కేంద్రం పదేపదే హామీలు ఇచ్చింది. మొన్న ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ లో ఆ ప్రసక్తి ఎందుకు లేదో రైల్వే మంత్రి వివరణ ఈయలేదు. రాష్ట్రాన్ని అన్ని విధాల ఆదుకొంటామని మోడీ స్వయంగా ఎన్నికల ప్రచార సమయంలో పదేపదే హామీ ఇచ్చేరు. రాజధాని నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని విధాల సహాయపడతామని హామీ ఇచ్చేరు. కానీ వేల కోట్లు వ్యయం అయ్యే పోలవరం ప్రాజెక్టుకి కేవలం రూ.100కోట్లు మాత్రమే కేటాయించడంతో చంద్రబాబు నాయుడే ఆశ్చర్యపడ్డారు. వచ్చే ఎన్నికల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తానని ఆయన రాష్ట్ర ప్రజలకు పదేపదే హామీ ఇచ్చేరు. కానీ కేంద్రం మొక్కుబడిగా నిధులు విడుదల చేస్తే ఈ ప్రాజెక్టు ఎప్పటికయినా పూర్తి చేయగలమా? అని ఆయన ప్రశ్నించారు.   రాజధాని నిర్మాణం కోసం తొలివిడతగా కనీసం రూ.20, 000 కోట్లు ఈ బడ్జెట్ లో కేటాయించాలని ఆయన కోరితే బడ్జెట్ లో అసలు ఆ ప్రసక్తే లేదు. రాష్ట్ర బడ్జెట్ లోటును పూడ్చమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే వేడుకొన్నా మోడీ కనికరించలేదు. హూద్ హూద్ తుఫాను వల్ల రాష్ట్రానికి సుమారు రూ.61, 000 కోట్ల నష్టం జరిగిందని అంచనా వేస్తే కేంద్రం రూ.1,000 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చిన మోడీ మళ్ళీ అందులో సగం మాత్రమే ఇచ్చేరు.   రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రైల్వే జోన్ ఏర్పాటు, బడ్జెట్ లోటు పూడ్చుకొనేందుకు, రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయింపులు వంటి హామీలను కేంద్రం పట్టించుకొన్నట్లు లేదు. కేంద్రం ఇక మున్ముందు కూడా ఇటువంటి వైఖరే అనుసరించేమాటయితే దాని వల్ల తెదేపా-బీజేపీల మధ్య సంబంధాలు ఎలాగూ దెబ్బతినే అవకాశం ఉంటుంది. రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాల తోడ్పడుతామని హామీ ఇచ్చి ఇప్పుడు ఈవిధంగా వ్యవహరిస్తే రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి కూడా ప్రశ్నార్ధకంగా మారే అవకాశం ఉంటుంది. కనుక బీజేపీ అధిష్టానం రాష్ట్రంలో తన పార్టీ భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించవలసి ఉంటుంది.

కీలక దశకు చేరుకొన్న రాజధాని భూసేకరణ

  రాజధాని నిర్మాణం కోసం కొన్ని గ్రామాలలో రైతులు తమ భూములను ఇచ్చేందుకు నిరాకరిస్తునందున ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా కలుగుజేసుకొని మరికొంత అదనపు పరిహారం ఇచ్చేందుకు అంగీకరించడంతో తుళ్ళూరు, మంగళగిరి మండలాలకు చెందిన మరికొంతమంది రైతులు నిన్న ఒక్కరోజునే 2,700ఎకరాల పంట భూమిని ప్రభుత్వానికి అందజేసేందుకు అంగీకరపత్రాలు సమర్పించారు. ఈ రోజుతో భూసమీకరణ గడువు ముగుస్తుంది. ప్రభుత్వ లక్ష్యం 30,000 ఎకరాలు కాగా నిన్నటి వరకు మొత్తం 26,000 ఎకరాల భూమిని ప్రభుత్వం సమీకరించగలిగింది. అంటే ఇంకా మరో 4,000ఎకరాల భూమిని సేకరించ వలసి ఉంది. కానీ ఈసారి ప్రభుత్వం గడువు పెంచకపోవడం విశేషం. ఇంత వరకు ల్యాండ్ పూలింగ్ విధానం క్రింద ప్రభుత్వం భూమిని సేకరించింది. ఇప్పుడు ప్రభుత్వం ముందు మూడు మార్గాలున్నాయి.   1. మళ్ళీ మరికొంత పరిహారం పెంచడం ద్వారా రైతులను ఒప్పించి మిగిలిన భూసేకరణ చేయడం. 2. ఇటీవల మోడీ ప్రభుత్వం చేత సవరణ చేయబడిన భూసేకరణ చట్టం ప్రయోగించడం. 3. ఇంతవరకు సేకరించిన భూమిలోనే రాజధాని నిర్మించడం.   1. ఒకవేళ మరికొంత పరిహారం పెంచేందుకు ప్రభుత్వం సిద్దపడినట్లయితే, నిన్నటిలాగే మరికొంత రైతులు తమ భూములను ఇచ్చేందుకు ముందు రావచ్చును. కానీ ఈసారి కూడా మిగిలిన 4000 ఎకరాల భూసేకరణ జరుగకపోయినట్లయితే, దాని వలన ప్రభుత్వం అనుకొన్న ఉద్దేశ్యం నెరవేరకపోగా ఇంతవరకు సేకరించిన భూములకు కూడా అదే పరిహారం వర్తింపజేయమని రైతులు డిమాండ్ కొత్త చిక్కులు వచ్చిపడతాయి. అంతేగాక ప్రభుత్వంపై ఆర్ధిక భారం పెరుగుతుంది.   2. ఇక 95 శాతం భూసేకరణ దాదాపు సజావుగా పూర్తిచేసి మిగిలిన 5 శాతం భూసేకరణకు కటినమయిన చట్టాన్ని ప్రయోగిస్తే రైతులందరిలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. కనుక ఈ ఆఖరి అస్త్రాన్ని ప్రభుత్వం ప్రయోగించకపోవచ్చును.   3. ఈ సమస్యలేవీ వద్దనుకొంటే ఇంతవరకు సేకరించిన 26,000 ఎకరాల భూమిలోనే రాజధాని నిర్మాణం చెప్పట్టడం. కానీ మరొక మూడు రోజుల్లో సింగపూర్ సంస్థ వారు మాష్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ (నకలు) తయారుచేసి తీసుకువస్తున్న ఈ సమయంలో ఏకంగా 4000 ఎకరాలలో ప్లాను మార్పులు చేయడం సాధ్యమో కాదో ప్రభుత్వానికే తెలియాలి. ఈమూడు మార్గాలలో ప్రభుత్వం దేనిని అనుసరిస్తుందో తెలుసుకోవాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడవలసి ఉంటుంది.

జగన్ ఆస్తులు.. లేటెస్టు జప్తులు...

జగన్ ఆస్తులు జప్తు కావడం అనేది మామూలు విషయం అయిపోయింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) నెలకో రెండు నెలలకో ఓసారి జగన్‌కి చెందిన వందల కోట్ల ఆస్తులను జప్తు చేయడం మామూలైపోయింది. పుట్ట తవ్వేకొద్దీ పాములు బయటపడుతున్నట్టు కేసులను తవ్వేకొద్దీ జగన్ ఆస్తులు బయటపడుతున్నాయి. తాజాగా 232.28 కోట్ల జగన్ ఆస్తులను ఇ.డి. జప్తు చేసింది. జగన్‌కి చెందిన భారతీ సిమెంట్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, జననీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇండియా సిమెంట్స్‌ లిమిటెడ్‌, కార్మెల్‌ ఏషియా హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, జగతీ పబ్లికేషన్స్‌కు చెందిన ఆస్తులివి. ఇ.డి. జప్తు చేసిన తాజా ఆస్తుల వివరాలు ఇలా వున్నాయి...   * కడప జిల్లాలో జననీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు చెందిన 90 లక్షల విలువైన 2.11 ఎకరాల భూమి.   * విశాఖపట్టణం జిల్లాలోని జననీ ఇన్‌ఫ్రాకు చెందిన కోటి 32 లక్షల విలువైన 1.97 ఎకరాల భూమి.   * బెంగళూరులోని 73 లక్షల విలువైన 2 ఎకరాల 3 గుంటల భూమి.   * హైదరాబాద్‌లోని పంజగుట్టలో 2.12 కోట్ల విలువైన 886 చదరపు గజాల ప్లాట్‌.   * అనంతపురం జిల్లాలో 1.23 కోట్ల విలువైన 245.86 ఎకరాల భూమి.   * హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని విజయా బ్యాంకులో భారతీ సిమెంట్‌ కార్పొరేషన్‌కి చెందిన 95.33 కోట్ల రూపాయల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు.   * ఇండియా సిమెంట్స్‌ లిమిటెడ్‌ దగ్గర ఉన్న త్రినేత్ర సిమెంట్స్‌ లిమిటెడ్‌కు చెందిన 86.67 కోట్ల విలువైన 86,67,097 షేర్లు.   * ఇండియా సిమెంట్స్‌ దగ్గరున్న 20.32 కోట్ల విలువైన 20,32,260 కోరమాండల్‌ షుగర్స్‌ లిమిటెడ్‌ డిబెంచర్లు.   * జగతి పబ్లికేషన్స్‌ ఖాతాలో ఉన్న 10.20 కోట్ల విలువైన 1,02,00,000 ఇందిరా టెలివిజన్‌ లిమిటెడ్‌ ఈక్విటీ షేర్లు.   * ఇండియా సిమెంట్స్‌ లిమిటెడ్‌ దగ్గరున్న 10 కోట్ల విలువైన త్రినేత్ర సిమెంట్స్‌ లిమిటెడ్‌ 10,00,000 షేర్లు.   * కార్మెల్‌ ఏషియా హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ దగ్గర ఉన్న 25 లక్షల రూపాయల విలువైన 2,50,000 ఇందిరా టెలివిజన్‌ లిమిటెడ్‌ ఈక్విటీ షేర్లు,   * 3.2 కోట్ల రూపాయల విలువైన సరస్వతి పవర్‌, రక్షణ ఇండస్ట్రీస్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ షేర్లు.

పాపం...జగన్మోహన్ రెడ్డిని ఓదార్చేదెవరు?

  సాధారణంగా ఎన్నికలలో ఓడిపోయి రాజకీయ పార్టీలు, తమను ఓడించి అధికారంలోకి వచ్చిన అధికార పార్టీని ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఒకే ఒక్కసారి అభినందిస్తాయి. ఆ మరునాటి నుండి అధికార పార్టీ ప్రభుత్వాన్ని, దాని ముఖ్యమంత్రిని విమర్శించడం ద్వారానే తమ ఉనికిని కాపాడుకొంటూ, మళ్ళీ వచ్చే ఎన్నికల కోసం చకోర పక్షుల్లా ఎదురు చూస్తుంటాయి. కానీ ఓ రెండు మూడు నెలలు కాగానే ఇక అంతవరకు ఆగలేక ఏదో కారణంతో అధికార పార్టీకి రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు లేదు కనుక ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని సన్నాయి నొక్కులు నొక్కడం మొదలుపెడుతుంటాయి. కానీ ముఖ్యమంత్రి అవుదామని తెగ తహతహలాడిపోతున్న జగన్మోహన్ రెడ్డి వంటి నేతలు మాత్రం తమ ఆత్రాన్ని మరో విధంగా బయటపెట్టుకొంటుంటారు.   రైతు భరోసా యాత్రలకి బయలుదేరిన ఆయన తన రోడ్ షోకి వచ్చిన జనాలని చూసి వారందరూ ఏవో తీరని కష్టాలలో ఉన్నట్లు ఊహించేసుకొంటూ, “మీరెవరూ అధైర్యపడకండి...త్వరలోనే మంచి రోజులు వచ్చేస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రభుత్వం కూలిపోబోతోంది,” అంటూ చిలక జోస్యం చెపుతుంటారు. తను ముఖ్యమంత్రి అయ్యేందుకు ఐదేళ్ళపాటు పరిపాలించేందుకు ప్రజలు ఎన్నుకొన్న ప్రజాప్రభుత్వం కూలిపోవాలని కోరుకోవడం చూసి ప్రజలు కూడా విస్మయం చెందుతున్నారు. అసలు త్వరలో ఈ ప్రభుత్వం కూలిపోతుందని ఆయన ఏవిధంగా చెపుతున్నారో, కూలిపోతే ఆయన ఏవిధంగా ముఖ్యమంత్రి అయిపోతారో కూడా కాస్త ప్రజలకు వివరించి ఉండి ఉంటే బాగుండేది.   ఆయన చేస్తున్నది రైతు భరోసా యాత్ర...కానీ కంటున్న కలలు వేరే..నిజానికి ఆయన గత ఐదేళ్ళుగా చేస్తూన్న ఓదార్పు యాత్రల పరమార్ధం కూడా ఇదే. సమైక్యాంధ్ర ఉద్యమాల పరమార్ధం కూడా ఇదేనని ఆయన తన నోటితోనే తనే ప్రతీసారి చెప్పుకొంటుంటారు. అందుకే ప్రజలు ఆయనను తిరస్కరించారు. చనిపోయిన రైతుల కుటుంబాలను ఓదార్చేందుకు వెళ్ళినప్పుడు ఆ పని చక్కబెట్టుకొని తిరిగి రావాలి. కానీ ఆయన ఇలా వ్యానెక్కి ప్రభుత్వం కూలిపోతుందని శాపనార్ధాలు పెట్టినంత మాత్రాన్న ప్రభుత్వాలు కూలిపోవు..మారిపోవు.   ఆయన ముఖ్యమంత్రి అవలేకపోవడానికి ఇతరులను ఆడిపోసుకోవడం కంటే అందుకు తనను తనే నిందించుకోవడం మంచిది. తను అవలంభిస్తున్న ఇటువంటి ద్వంద వైఖరి, పార్టీలో సీనియర్ నేతలను సంప్రదించకుండా, వారి సలహాలను ఖాతరు చేయకుండా తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళన్నట్లు ముందుకు సాగుతుండటం చేతనే ఆయన పార్టీ ఎన్నికలలో ఓడిపోయింది. అయినా జగన్మోహన్ రెడ్డి నేటికీ తన మూడు కాళ్ళ కుందేలుతోనే పార్టీని నడిపిస్తున్నారు. అటువంటప్పుడు ఆ పార్టీ ఎప్పటికయినా అధికారంలోకి వస్తుందని ఎవరు మాత్రం అనుకొంటారు? ఈ సంగతి జనాలకి, వైకాపా నేతలకి అర్ధం అయింది కానీ జగన్మోహన్ రెడ్డికే అర్ధమయినట్లు లేదు. ఏడ్చే వారిని, ఏడవని వారిని ఏడ్పించి మరీ ఓదార్చుతున్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేకపోతే ఓదార్చేదెవరు?

ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్ కాపీ సిద్దం

  ఆంద్రప్రదేశ్ రాజధాని నగర నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ అందిస్తున్న సింగపూర్ కి చెందిన సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్ (సి.యల్.సి.) ప్రతినిధులు వచ్చేనెల 3వ తేదీన హైదరాబాద్ రాబోతున్నారు. వారు మాస్టర్ ప్లాన్ తాలూకు డ్రాఫ్ట్ (నకలు) కాపీని తయారుచేసి తీసుకొని వస్తున్నారు. దానిని రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కొరకు సమర్పిస్తారు. అదే సమయంలో వారు రాష్ట్రానికి చెందిన పట్టణాభివృద్ధి సంస్థకు చెందినా అధికారులకు హైదరాబాదులో మూడు రోజుల పాటు శిక్షణా తరగతులు కూడా నిర్వహిస్తారు. తాము గీసిన మాస్టార్ ప్లాన్ లో సాంకేతిక అంశాలన్నిటినీ వారికి వివరించి దానిని నిర్మాణ సమయంలో యధాతధంగా ఏవిధంగా అమలుచేయాలో శిక్షణ ఇస్తారు. ఇంతకు ముందు పట్టణాభివృద్ధి సంస్థకు చెందిన 20 మంది అధికారులకు సింగపూరులో శిక్షణ పొందారు.   ఇక మరో తాజా విశేషం ఏమిటంటే, రాజధాని నిర్మాణం కోసం కేంద్రం తొలివిడతగా రూ.1600 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని మునిసిపల్ శాఖా మంత్రి పి. నారాయణ మీడియాకు తెలిపారు. అందులో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ రూ.1,000 కోట్లు, కేంద్ర ఆర్ధిక శాఖ రూ.600 కోట్లు విడివిడిగా మంజూరు చేశాయని, అవి మరొక వారం పది రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తొలివిడతలో రూ.20, 000 కోట్లు నిధులు విడుదల చేయాలని కోరగా కేంద్రం కేవలం రూ.1600 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ కాపీని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన తరువాత దానిని పరిశీలించి, అవసరాన్ని బట్టి తగినన్ని నిధులు విడుదల చేస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి యం.వెంకయ్య నాయుడు హామీ ఇచ్చారు. మాస్టర్ ప్లాన్ కాపీ ఎలాగూ త్వరలోనే చేతికి అందబోతోంది కనుక దాని ఆధారంగా మరిన్ని నిధులు విడుదల చేయమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరే అవకాశం ఉంది.   మే నెల రెండవ వారంలో రాజధాని నిర్మాణానికి శంఖు స్థాపన చేయాలనుకొంటున్నట్లు మంత్రి నారాయణ ఇదివరకే తెలిపారు. తగినన్ని నిధులు, మాస్టర్ ప్లాన్ చేతికి వచ్చినట్లయితే శంఖు స్థాపన కార్యక్రమం పూర్తి చేసి వెంటనే రైతుల నుండి సేకరించిన భూములలో నగర నిర్మాణానికి అనువుగా అభివృద్ధి చేయడం మొదలుపెట్టే అవకాశం ఉంది. రానున్న మూడేళ్ళలో రాజధాని ప్రధాన నగరంలో సచివాలయం, అసెంబ్లీ, కౌన్సిల్, రాజ్ భవన్, ముఖ్యమంత్రి మరియు ఇతర మంత్రులు, అధికారుల కార్యాలయాలు, నివాస సముదాయాల నిర్మాణం పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

పవన్ కళ్యాణ్ మాట మన్నిస్తే మేలు కదా!

  ఇంతవరకు మౌనంగా ఉన్న జనసేన ఏకవీరుడు పవన్ కళ్యాణ్ కూడా మోడీ ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకోవాలని ఈరోజు మొట్ట మొదటిసారిగా ఒక చిన్న ట్వీట్ బాణం సంధించారు. ఆయన జనసేన పార్టీతో ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ, రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పోటీ నుండి తప్పుకొని మొదట మోడీకి, బీజేపీకి ఆ తరువాత తెదేపాకి కూడా బేషరతుగా తన మద్దతు ప్రకటించడమే గాక వారి తరపున రెండు రాష్ట్రాలలో ప్రచారం కూడా చేసారు. అంతే కాదు తను ఎంతో అభిమానించే, గౌరవించే తన అన్న చిరంజీవికి వ్యతిరేకించారు. “కాంగ్రెస్ హటావ్ దేశ్ కో బచావ్” అని ప్రజలకు పిలుపునిచ్చారు కూడా. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చిరంజీవి స్వయంగా ప్రచారం చేసినప్పటికీ, ఒక్కరు కూడా గెలవలేకపోవడానికి, పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారం కూడా ఒక కారణమని అందరికీ తెలుసు.   మోడీపై పూర్తి నమ్మకం ఉంచి ఎన్డీయే కూటమికే ప్రజలు ఓట్లు వేసి అధికారం కట్టబట్టినట్లయితే ఆయన రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని తప్పకుండా అమలుచేస్తారని ఆయన తరపున పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా ప్రజలకు చెప్పారు. మోడీపై ప్రజలు ఎంతటి నమ్మకం ఉంచారో అంతకంటే ఎక్కువే పవన్ కళ్యాణ్ కూడా ఉన్నందునే ఆయన మాట మన్నించి ఎన్డీయే కూటమికి ఓట్లు వేసి గెలిపించారు. ఎన్డీయేకు ఎంతో కీలకమయిన ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన ఆ త్యాగాన్ని, అందించిన సహకారాన్ని మోడీ ఎన్నడూ మరిచిపోరని ప్రజలు కూడా ఆశిస్తారు.   ఒకవేళ మోడీ ప్రభుత్వం మాట తప్పినట్లయితే, ఆయన తరపున హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ న్నే ప్రజలు ముందుగా నిలదీస్తారు. కనుక ప్రధాని మోడీ పవన్ కళ్యాణ్ ప్రజల నుండి విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి కల్పించకుండా, ఆయన ఎన్డీయే తరపున చేసిన హామీలను నెరవేర్చే ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది.

రాహుల్ గాంధీకి సెలవు!!!

  రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా పగ్గాలు చేప్పట్టినప్పట్టిననాటి నుండి నేటి వరకు జరిగిన అన్ని ఎన్నికలలో పార్టీకి శల్య సారధ్యం చేసిచేసి అలసిపోయున్నారు. ఆయన సారధ్యంలో కాంగ్రెస్ రధం రివర్స్ గేరులో అన్ని పార్టీల కంటే చాలా వేగంగా వెనక్కి దూసుకుపోతూ వరుస అపజయాలతో ఒక సరికొత్త రికార్డు కూడా క్రియేట్ చేసింది. అధికారం ఉంటే ప్రజాసేవ చేయడానికి అలుపుసొలుపు ఉండదు. కానీ ప్రతీ ఎన్నికలలో ఓడిపోతుంటే చాలా నీరసం, నిరుత్సాహం కమ్ముకోవడం సహజం. ఎవరయినా బాగా నీరసించిపోతే బాగా రెస్టు తీసుకోమని డాక్టర్లు చెపుతుంటారు. యువరాజవారికి పార్టీ రధాన్ని ఒడుపుగా రివర్స్ గేరులో ఎలా వెనక్కి నడపాలో నేర్పించిన గురు సమానుడయిన దిగ్విజయ్ సింగ్ వంటి వారెవరో బహుశః ఆయనని కొన్ని వారాలు సిక్-లీవ్ పెట్టేసి రెస్టు తీసుకోమని చెప్పినట్లున్నారు. అందుకే ఆయన కొన్ని వారాలు శలవు తీసుకొంటున్నారుట.   అయితే ఈ శలవులో ఆయన ఏ స్విట్జర్ ల్యాండుకో, ఇటలీకో వెళ్ళిపోవాలని అనుకోకుండా, కాంగ్రెస్ పార్టీ ప్రతీ ఎన్నికలలో ఎందుకు ఓడిపోతోంది? ఇకపై ప్రతీ ఎన్నికలలో గెలవాలంటే ఏమి చేయాలి? పార్టీని ముందుకు నడిపించాలా లేకపోతే లెఫ్టుకో, రైటుకో టర్నింగ్ తీసుకోవాలా? ఈ ‘యల్ బోర్డు’ తగిలించుకొని పార్టీని తనే నడపాలా? లేకపోతే స్టీరింగ్ మరెవరికయినా అప్పగించేసి వెనక సీటులో కూర్చొని కునుకు తీస్తే బెటరా? వంటి అనేక క్లిష్టమయిన సమస్యల గురించి మేధోమధనం చేయబోతున్నారు.   అంతే కాదు అసలు ఈ దేశంలో ఏమి జరుగుతోంది? ఎందుకు జరుగుతోంది? ఏమి జరుగబోతోంది? ఏమి జరగాలి? అనే బేతాళ ప్రశ్నలకు కూడా ఆయన ఈ లీవ్ పీరియడ్ లోనే సమాధానాలు తెలుసుకొనే ప్రయత్నాలు చేస్తారుట! ఆ తరువాత మళ్ళీ వచ్చి తను కనుగొన్న ఆ గొప్పగొప్ప విషయాల గురించి ప్రజలకు చెప్పబోతున్నారుట! అంటే తను సంపాదించుకొనే ఆ...జ్ఞానాన్ని లోకానికి కూడా ఫ్రీగా పంచబోతున్నారన్న మాట.   ఇది వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన తను సముపార్జించిన ఆ..జ్ఞానాన్ని అంతా స్కూలు పిల్లలకి, రోడ్డు మీద రిక్షా వాళ్ళకి, తన భజనలో తరించేపోయే కాంగ్రెస్ జీవులకీ అడగనివారిదే పాపం అన్నట్లు అందరికీ చాలా ఉదారంగా ఉచితంగా ఎడాపెడా పంచి పెట్టేసారు. ఒకప్పుడు కర్ణుడు తన గోల్డెన్ కవచ కుండలాలను అపాత్రాధానం చేసేసినట్లే, యువరాజవారు కూడా తన జ్ఞాన్నాని అందరికీ దానం చేసేయడంతో ఆయన అకౌంటు జీరో బ్యాలన్స్ కి వచ్చేసింది. అందుకే మళ్ళీ జ్ఞానోదయం కోసం లీవ్ పెట్టవలసి వచ్చింది. కనుక దేశ ప్రజలందరూ ఆయనకు జ్ఞానోదయం అయ్యే వరకు కొంచెం ఓపిక పట్టక తప్పదు మరి.   ఆయన అపర దానకర్ణుడిలా తనకున్న జ్ఞానాన్ని అంతా అందరికీ పంచి పెట్టేసారు, కానీ అదంతా ఏట్లో పిసికిన చింత పండే అయిపోయింది. ఆయన చెప్పిన ప్రతీ ముక్కకీ భూమ్యాకాశాలు దద్దరిల్లి పోయేలా జనాలు చప్పట్లు కొట్టారు. గానీ ఆ మైమరపులో కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం మరిచిపోయారు. దానితో కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడి రధం క్రుంగిపోయినట్లే, సార్వత్రిక ఎన్నికల మహాసంగ్రామంలో కాంగ్రెస్ రధం కూడా క్రుంగిపోయింది. ఆయన కాంగ్రెస్ పార్టీకి సారధ్యం వహిస్తే, ఆయన రధానికి ఎవరు సారధ్యం వహించారు? అనే ప్రశ్నకి ఇండియన్ జనాలందరికీ బాగానే తెలుసు.   గతం గతః అన్నారు పెద్దలు. అందుకే యువరాజవారు మళ్ళీ రీ చార్జ్ చేసుకొని వచ్చేందుకు లీవ్ పెట్టారు. లీవ్ నుండి తిరిగి వచ్చిన తరువాత యువరాజావారు పట్టాభిషేకానికి అంగీకరించినట్లయితే, ఏప్రిల్ నెలలో రాజమాత సోనియా గాంధీగారు వాలంటరీ రిటైర్ మెంటు తీసుకోవచ్చును. లేదా లేట్ అత్తగారు ఇందిరమ్మకి అసలు సిసలయిన వారసురాలని కాంగ్రెస్ జీవులచేత సర్టిఫై చేయబడుతున్న ప్రియాంకా గాంధీని తన కుర్చీలో కూర్చోబెట్టే అవకాశం లేకపోలేదు. కనుక ఆ సోదరసోదరీమణుల్లో ఎవరో ఒకరు ఆ కుర్చీని ఆక్యుపై చేయవచ్చును. కానీ ఎవరు ఆక్యుపై చేస్తారో తెలుసుకోవాలంటే యువరాజవారి లీవ్ పూర్తయ్యే వరకు జనాలందరూ కొంచెం ఓపిక పట్టక తప్పదు.   కానీ ఆయన దేశం కోసమే అలా రాత్రనక పగలనక ఆలోచిస్తూ పెళ్లి గురించి ఆలోచించకుండా ఉండిపోవడమే చాలా బాధ కలిగిస్తోంది. ఒకవేళ దేశ ప్రజలు ఆయనను ప్రధానమంత్రిగా చూసుకొనే భాగ్యానికి నోచుకోకపోయినా, ఆయన త్వరగా పెళ్ళిచేసుకొని దేశానికి మరో యువరాజును ప్రసాదించినా చాలు. జనాలు నిశ్చింతగా గుండెల మీద చేయ్యేసుకొని నిద్రపోతారు కదా! కనుక ఈ లీవ్ పీరియడ్ లోనే ఈ విషయం గురించి యువరాజవారు ఆలోచిస్తే బాగుంటుంది.

కాంగ్రెస్ కపట నాటకాలు నమ్మేదెవరు?

  ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కపట నాటకాలు చూస్తుంటే, ఇంత నీచమైన పార్టీనా దేశ ప్రజలు ఇంతకాలం గద్దె మీద కూర్చోబెట్టిందనే ఆవేదన కలుగుతోంది. ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ మీద ప్రజలకు కలగనంత అసహ్యం కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడు దేశ ప్రజలకు కలుగుతోంది. అందుకే ఆ పార్టీకి దేశవ్యాప్తంగా కర్రు కాల్చి వాత పెడుతున్నారు. మొన్న ఢిల్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీ సర్వ నాశనం అయిపోయిందనే అంశానికి పూర్తి స్పష్టత ఇచ్చినా, కాంగ్రెస్ పార్టీకి ఎంతమాత్రం బుద్ధి రాలేదు.. తన కపట నాటకాలు మానడం లేదు... ఆ కపట నాటకాలకు ప్రత్యక్ష ఉదాహరణ ఆంధ్రప్రదేశ్‌ విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు.   కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ప్రజాస్వామ్య చరిత్రలో లేని విధంగా అత్యంత దుర్మార్గంగా విభజించింది. మాజీ కాంగ్రెస్ నాయకుడు జేసీ దివాకరరెడ్డి చెప్పినట్టు.. దుర్మార్గులందరూ చుట్టూ చేరి అభిమన్యుడిని ఎలా చంపేశారో... కాంగ్రెస్ పార్టీలోని దుష్టగ్రహాలన్నీ చేరి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అలా చంపేశాయి. సదరు గ్రహాలన్నిటినీ తన చుట్టూ తిప్పుకునే పెద్ద గ్రహం సోనియాగాంధీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద లేనిపోని ప్రేమ ఒలకబోయటం ఆ పార్టీ గుంటనక్క వైఖరికి ఒక పెద్ద ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో, ఇతర సౌకర్యాలు కల్పించే విషయంలో కేంద్రంలోని బీజేపీ అలసత్వంగా వ్యవహరిస్తోందట. అందుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌లో బీజేపీని నిలదీస్తుందట... ఆంధ్రప్రదేశ్‌ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇలాంటి ఎన్ని కపట నాటకాలు ఆడినా లాభం లేదు. ఇలాంటి నాటకాలతో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడితే పెట్టొచ్చేమోగానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న ఏహ్య భావాన్ని చిటికెడు కూడా తగ్గించలేదు.   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావచ్చు... విభజన చట్టంలోని ఇతర హామీల విషయంలో కావచ్చు.. ఇలాంటి విషయాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద రాష్ట్ర ప్రజలకు సంపూర్ణ నమ్మకం వుంది. ఆయన త్వరలోనే ఇవన్నీ సాధించగలరని ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. ఆయన కూడా తనవంతు కృషి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పానకంలో పుడకలాగా కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగి ఆంధ్రప్రదేశ్‌ని ఏదో ఉద్ధరించబోతున్నట్టు నానా కంగాళీ చేయడం వల్ల జరిగేది చెడే తప్ప మంచి కాదు.. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌కి చేసిన చెడు చాలు... ఇప్పటికైనా తన కపట నాటకాలను ఆంధ్రప్రదేశ్ విషయంలో ఆడటం మానుకోవాలి.

జగన్ మీద రైతులకు భరోసా లేదు

  పొలిటికల్ కామెడీ చేయడంలో వైసీపీ అధినేత జగన్ తర్వాతే ఎవరైనా. తాను చేస్తున్నది రాజకీయం కాదని.. పొలిటికల్ కామెడీ అని ఆయనకు స్పష్టంగా తెలిసినా, అదే బాటలో పయనించడం మానుకోని నిబద్ధత ఆయన సొంతం. అదే ఆయన్ని ప్రజలకు దూరం చేసింది. ఆయన అలాగే వుంటే ఎప్పటికీ అధికారానికి దూరంగా వుంటారు. ప్రజలకు కూడా అదే మంచిది. ఆర్థిక ఇబ్బందుల్లో వున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమస్యల నుంచి బయటపడాలంటే ప్రతిపక్ష నాయకుడి హోదాలో వున్న జగన్ తనవంతు సహకారాన్ని అందించాలి. అయితే ఆయన అలాంటి మంచి పనుల జోలికి వెళ్ళకుండా, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా బద్నామ్ చేయాలా అనో ఆలోచనతోనే నిరంతరం వుంటున్నారు. ఏదో ఒక సందర్భాన్ని సృష్టించుకుని సీఎం చంద్రబాబు మీద విమర్శలు కురిపిస్తున్నారు. అయితే చాలా తెలివైన వారైన ప్రజలు ఆయన్ని ఇప్పటికే అధికారానికి దూరంగా వుంచారు. అదే బుద్ధి కుశలతను ప్రదర్శిస్తూ ఆయన చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మడం లేదు. అయినప్పటికీ జగన్ తన దుష్ప్రచారాన్ని మానలేదు.   తాజాగా ఆయన రైతు భరోసా యాత్రల పేరితో మరో దుష్ప్రచార యాత్రకు శ్రీకారం చుట్టారు. ఊరూరా తిరుగుతూ అందరి నుదుట ముద్దులు పెడుతూ, చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ తిరుగుతున్నారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు రైతు రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇస్తే, అదే మాట చెప్పడానికి జగన్‌కి నోరు రాలేదు. ఇప్పుడు అదే జగన్ చంద్రబాబుకు రైతులకు అన్యాయం చేస్తున్నారని, రైతులకు తాను భరోసాగా నిలుస్తానని చెప్పుకుంటున్నారు. అయితే జగన్ చేస్తున్నది తమకు భరోసా ఇవ్వడానికి చేస్తున్న యాత్ర కాదని, వచ్చే ఎన్నికలలో తమ నుంచి ఓట్లు వేస్తామని భరోసా పొందడానికి చేస్తున్న యాత్రేనని రైతులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇది రాజకీయ యాత్రే తప్ప నిజంగా రైతుల మీద ప్రేమ వుండి చేస్తున్న యాత్ర కాదని అంటున్నారు. కొన్నిచోట్ల అయితే జగన్ ఏర్పాటు చేసిన సభలకు సొంత పార్టీ రైతులు కూడా హాజరు కావడం లేదు. ఇదిలా వుంటే సోమవారం నాడు జగన్ అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం కొత్తకోటలో రైతు భరోసా యాత్ర చేశారు. అయితే ఆయన యాత్రకు ఆ గ్రామస్తుల నుంచి నిరసన వ్యక్తమైంది. జగన్ వచ్చిన సమయానికి రైతులందరూ ఇళ్ళలోంచి బయటకి రాకుండా తలుపులు వేసుకుని లోపలే వుండిపోయారు. దాంతో జగన్ నోరు తెరవాల్సి వచ్చింది. ఇలాంటి ఘటనలను చూసైనా జగన్ తన యాత్రలను మానుకుంటే బాగుంటుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

డిల్లీలో కాల్పులు! ఉగ్రవాదుల పనేనా?

  డిల్లీలో హోంశాఖకు చెందిన వాహనంపై గుర్తు తెలియని దుండగుడు ఈరోజు ఉదయం కాల్పులు జరిపినట్లు తాజా సమాచారం. రైల్వేకి చెందిన ఐ.ఆర్.సి.టి.సి. సంస్థ వాహనంలో వచ్చి కాల్పులు జరిపి వెంటనే పారిపోయినట్లు పోలీసులు కనుగొన్నారు. ఆ దాడిలో హోమ్ మంత్రిత్వ శాఖ వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. గత కొన్ని వారాలుగా డిల్లీ మరియు దేశంలో ఇతర నగరాలపై ఉగ్రవాదులు దాడులు చేయవచ్చని ఇంటలిజన్స్ శాఖ పదేపదే హెచ్చరిస్తున్నందున ఇది ఉగ్రవాదుల పనేనా లేకపోతే వేరే ఇతర కారణాలున్నాయా అనే సంగతి పోలీసుల దర్యాప్తులో తేలవలసి ఉంది. ఒకవేళ గాయపడిన డ్రైవర్ కి ఇతరులెవరితో వ్యక్తిగత ద్వేషాలు, గొడవలున్నప్పటికీ, ఆ కారణంగా హోమ్ మంత్రిత్వ శాఖకు చెందిన వాహనం నడుపుతున్న సమయంలో అతనిపై కాల్పులు జరిపే సాహసం ఎవరూ చేయబోరు కనుక ఇది ఉగ్రవాదుల పనే అయి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కాల్పులలో గాయపడి, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకొంటున్న డ్రైవర్ ని కూడా పోలీసులు ప్రశ్నించి అతనిని నుండి సమాధానాలు రాబడితే ఈ దాడికి పాల్పడింది ఎవరనే సంగతి బయటపడవచ్చును. లేదా ఈ కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకొంటే తప్ప పరిస్థితి తీవ్రత అర్ధం చేసుకోలేము. నేటి నుండి పార్లమెంటు సమావేశాలు మొదలవుతున్న తరుణంలో డిల్లీలో కాల్పులు జరగడంతో డిల్లీ పోలీసులు చాలా ఆందోళనకు గురయి ఉండవచ్చును.

అధికార, ప్రతిపక్షాల ఐక్యరాగం

  ఈ నెల 23 నుండి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. దానిని దృష్టిలో పెట్టుకొని దేశంలో అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీలన్నీ వ్యూహ రచనలో మునిగి తేలుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకి ప్రత్యేక వ్యూహాలు సిద్దం చేసింది. ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు ఇప్పటికే రాష్ట్రానికి ‘ప్రత్యేక హోదా’ పల్లవి ఎత్తుకొన్నారు. అదికాక విభజన బిల్లులో రాష్ట్రానికి ఇచ్చిన హామీలను, నిధుల విడుదలలో జాప్యం గురించి వారు కేంద్రాన్ని పార్లమెంటులో నిలదీయనుంది. తెదేపా దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వైకాపా కూడా అదే అంశాలు లేవనెత్తవచ్చును. కనుక రాష్ట్ర చరిత్రలో మొట్ట మొదటిసారిగా అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి రాష్ట్ర ప్రయోజనల కోసం పార్లమెంటులో మాట్లాడబోతున్నాయి.   అయితే కాంగ్రెస్, వైకాపాలు నేరుగా ఎన్డీయే ప్రభుత్వాన్ని పార్లమెంటులో నిలదీస్తుంటే, బీజేపీకి మిత్ర పక్షంగా ఉన్న తెదేపా వాటికి వంతపాడలేదు. అలాగని అవి పోరాడుతుంటే సభలో తెదేపా మౌనంగా కూర్చొన్నా ఆ తరువాత విమర్శలకు గురికాక తప్పదు. చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం శనివారం నాడు జరిగింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన విధానంపై ఎంపీలతో చంద్రబాబు చర్చించి దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్యాకేజీలు రాబట్టుకోవడానికి ప్రయత్నిచాలని అన్నారు. కానీ అదే సమయంలో కాంగ్రెస్ ట్రాప్ లో పడకుండా జాగ్రత్తగా మసులుకోమని చంద్రబాబు నాయుడు తన యంపీలను ముందే హెచ్చరించారు. కనుక తెదేపా యంపీలకు ఈసారి సభలో చాలా లౌక్యంగా, జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.   ఇక తెలంగాణా రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రానికి రావలసిన నిధులు, కేంద్రం నుండి అధనపు విద్యుత్ సరఫరా, ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుకి జాతీయ హోదా, విభజన సందర్భంగా ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న సమస్యల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వ నిర్లిప్త వైఖరి తదితర అంశాలను కాంగ్రెస్ లేవనెత్తవచ్చును. మోడీ ప్రభుత్వం భూసేకరణ చట్టానికి ఆర్డినెన్స్ ద్వారా సవరణ చేయదాన్ని తీవ్రంగా తప్పుపడుతూ రాజ్యసభ సభ్యుడు వీ. హనుమంత రావు శనివారంనాడు ఇందిరాపార్క్ వద్ద ఒక్కరోజు నిరాహార దీక్ష చేసారు. దానికి టీ-కాంగ్రెస్ నేతలు అందరూ తరలి వచ్చేరు. అంటే ఈ టీ-కాంగ్రెస్ యంపీలు ప్రధానంగా ఈ అంశాన్ని ఆయుధంగా చేసుకొని మోడీ ప్రభుత్వంపై సభలో యుద్ధం ప్రకటించబోతున్నారని స్పష్టం అవుతోంది.

సచివాలయంలోకి మీడియా ప్రవేశంపై ఆంక్షలు !

  ఒకప్పుడు తెలంగాణా ఉద్యమాలలో ఆ తరువాత మళ్ళీ ఎన్నికల సమయంలో మీడియాను విరివిగా ఉపయోగించుకొన్న తెరాస అధ్యక్షుడు కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత అదే మీడియాతో ఘర్షణ వైఖరి అవలంభిస్తున్నారు. మీడియా వాళ్ళెవరూ సచివాలయంలోకి ప్రవేశించడానికి వీలులేదని ఆంక్షలు విధించారు. సచివాలయంలో మీడియా వ్యక్తులు తిరుగుతుండటం వలన అధికారుల పనికి ఆటంకం కలుగుతున్నందునే మీడియాను అనుమతించడం లేదని చెప్పారు. అందుకు మీడియా ఆయనను చాలా తీవ్రంగా ఆక్షేపించింది. దానితో ఆయన కొంచెం వెనక్కి తగ్గి సచివాలయంలో మీడియా ప్రవేశాన్ని నిషేధించలేదని, కొంత నియంత్రణ అవసరమనే ఉద్దేశ్యంతో వారి రాకపోకలకు ఎటువంటి పద్ధతి ఏర్పాటు చేయాలనే అంశం గురించి చర్చించామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. మీడియా మిత్రులతో కూడా ఈ విషయం గురించి చర్చించిన తరువాతనే ఒక నిర్ణయం తీసుకొంటామని అన్నారు. ఆయన ఇదేపని ముందే చేసి ఉండి ఉంటే మీడియా నుండి ఈవిధంగా నిరసనలు ఎదుర్కోవలసి వచ్చేదే కాదు. కానీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని, మళ్ళీ ఇప్పుడు ‘తూచ్! మీడియాపై నిషేధం విధించలేదు’ అని సర్ది చెప్పుకోవలసి రావడం ఆయనకి ఎంతమాత్రం గౌరవం కాదు.   అలాగే మీడియా కూడా కొంత స్వీయ నియంత్రణ పాటించడం చాలా అవసరం. మంత్రులు అధికారుల నుండి సమాచార సేకరణ లేదా ఇంటర్వ్యూల కోసం యధేచ్చగా సచివాలయంలో తిరుగుతుంటే ఉద్యోగులు, అధికారుల పనికి ఆటంకం కలుగుతుంది. కనుక మీడియా కూడా ప్రభుత్వంతో సహకరించితే వారికీ గౌరవంగా ఉంటుంది.   ప్రతీ రాజకీయ పార్టీ మీడియాతో మాట్లాడేందుకు ప్రత్యేకంగా అధికార ప్రతినిధులను ఏర్పాటు చేసుకొంటునట్లే, ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు మీడియాకు అవసరమయిన సమాచారం ఇచ్చేందుకు ఒక అధికార ప్రతినిధిని నియమించుకోవచ్చును. మీడియా వాళ్ళు సమాచార సేకరణ కోసం మంత్రుల, అధికారుల కార్యాలయాల గేట్ల దగ్గర ఎండనకా, వాననకా పడిగాపులు కాస్తుండటం అందరికీ చాలా సహజంగా కనిపిస్తుండవచ్చును. కానీ మంత్రులు అధికారులు చెప్పే మాటలను ప్రజలకు చేర్చే గురుతరమయిన బాధ్యతను నిర్వహిస్తున్న మీడియాకు అటువంటి పరిస్థితి కల్పించడం చాలా అవమానకరం. కనుక సచివాలయంలో, అసెంబ్లీలో, ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ వంటి ముఖ్యమయిన చోట్ల ప్రభుత్వమే మీడియా కోసం అన్ని సౌకర్యాలతో కూడిన సమావేశ మందిరాలు ఏర్పాటు చేసి అక్కడే వారికి అవసరమయిన సమాచారం అందించే విధంగా ఏర్పాట్లు చేసినట్లయితే ఇటువంటి ఘర్షణ వాతావరణం, సమస్యలని నివారించవచ్చును. ప్రభుత్వానికి, ప్రజలకి మధ్య వారధిగా నిలిచే మీడియాకు అవసరమయిన సమాచారం అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది.

రైతుల ఆత్మహత్యలకి పరిహారం సమంజసమేనా?

  వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ‘రైతు భరోసా యాత్ర’ పేరుతో అనంతపురం జిల్లాలో పర్యటించబోతున్నారు. ఆయన తన ఐదురోజుల పర్యటనని హిందూపురం నుండి ఈనెల 22వ తేదీన మొదలుపెట్టబోతున్నారు. ఆర్ధిక సమస్యల కారణంగా ఆత్మహత్యలు చేసుకొన్న రైతు కుటుంబాలను ఆయన కలవబోతున్నారు. ఆయన తన ఈ పర్యటన ద్వారా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రైతుల పరిస్థితి తెలంగాణా రాష్ట్రంలో రైతుల పరిస్థితికి ఏ మాత్రం భిన్నంగా లేదని నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నట్లుంది.   వారి దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం మంచి ఆలోచనే కానీ ఆ వంకతో ఆయన ప్రజలను ఆకర్షించి తన పార్టీని బలపరుచుకోవాలనుకోవడం, ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయాలనుకోవడం మాత్రం మంచి ఆలోచన కాదు. ఆయన తన తండ్రి రాజశేఖరెడ్డి చనిపోయినప్పటి నుండి నిన్న మొన్నటివరకు కూడా ఓదార్పుయాత్రలతో ఇటువంటి ప్రయాత్నాలే చేసారు. కానీ అవేవీ వైకాపాకు అధికారం, ఆయనకి ముఖ్యమంత్రి పదవి దక్కించలేకపోయాయి. అయినా నేటికీ ఆయన ఓదార్పునే కోరుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.   అయితే ఆయన చేప్పట్టే ఈ ఓదార్పుయాత్రలను చూసి రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమయినట్లే ఉంది. ఆర్ధిక సమస్యలతో చనిపోయిన రైతు కుటుంబాలకు ఇంతకు ముందు ప్రభుత్వం రూ.1 లక్ష పరిహారం ఇచ్చేది. దానిని ఇప్పుడు రూ.3 లక్షలకి పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ దీనివలన తీవ్ర ఆర్ధికసమస్యలతో సతమతమవుతున్న రైతులను ఆత్మహత్యలు చేసుకోకుండా నివారించే బదులు, ప్రోత్సహించే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ప్రకటించిన ఈ ఆర్ధిక సహాయంతో కనీసం తమ కుటుంబాలయినా సమస్యల ఊభిలో నుండి బయటపడతాయనే ఆలోచనతో రైతులు ఆత్మహత్యలు చేసుకొనే ప్రమాదం ఉంది. కనుక ఇది అంత మంచి ఆలోచన కాదని చెప్పవచ్చును.   అయితే ఈ సమస్యకు శాశ్విత పరిష్కారం లేదని రైతుల ఖర్మకు రైతులను వదిపెట్టనక్కర లేదు. ప్రస్తుతం తీవ్ర ఆర్ధిక సమస్యలతో బాధలు పడుతున్న రైతులను గుర్తించి వారికి తక్షణ, తాత్కాలిక సహాయం అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే గ్రామ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసినట్లయితే ఈ సమస్యకు శాశ్విత పరిష్కారం లభిస్తుంది. కానీ రైతులను కాపాడుకొనే బదులు వారు ఆత్మహత్యలు చేసుకొన్న తరువాత నష్టపరిహారం అందించడం మొదలుపెడితే తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా తీవ్ర అప్రదిష్ట పాలయిందో అదేవిధంగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అప్రదిష్ట పాలయ్యే ప్రమాదం పొంచి ఉంది.

త్వరలో చంద్రబాబు నాయుడు కరీంనగర్ పర్యటన

  ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్ళీ త్వరలోనే తెలంగాణాలో పర్యటించబోతున్నారు. వచ్చే నెల మార్చి 3వ తేదీన ఆయన కరీంనగర్ పర్యటించి అక్కడ పార్టీ సమావేశం నిర్వహించబోతున్నారు. ఆయన కుమారుడు నారా లోకేష్ అధ్యక్షతన నిన్న పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయిన తెదేపా సీనియర్ నేతలు యల్. రమణ, ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నరసింహులు, రేవంత్ రెడ్డి, పెద్దిరెడ్డి తదితర తెలంగాణా నేతలు ఈ విషయాన్నీ ప్రకటించారు. ఇటీవల హన్మకొండలో పార్టీ నిర్వహించిన సభ విజయవంతం కావడంతో అదేవిధంగా కరీంనగర్ సభను కూడా అందరూ సమిష్టిగా పనిచేసి విజయవంతం చేయాలని నిర్ణయించుకొన్నారు. ఈసారి కూడా చంద్రబాబు రోడ్డు మార్గాన్నే పయనించి కరీంనగర్ చేరుకొంటారని వారు ప్రకటించారు. తద్వారా దారి పొడవునా ఆయన ప్రజలను, పార్టీ కార్యకర్తలను, నేతలను కలిసే అవకాశం కలుగుతుందని వారి ఆలోచన.   ఈ విషయం తెలియగానే తెదేపా తెలంగాణా నేతల కంటే ముందుగా తెరాస నేతలే స్పందించవచ్చు. ఇంతకు ముందులాగే ఈసారి కూడా ఆయన రాష్ట్రంలో పర్యటించడాన్ని వారు ఆక్షేపించవచ్చు. వారికి తెదేపా నేతలు కూడా ధీటుగానే సమాధానం చెప్పవచ్చును. చంద్రబాబు నాయుడు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తెలంగాణాలో తన పార్టీకి సమయం కేటాయించలేకపోతున్నారు. పైగా అదే సమయంలో అనేకమంది తెదేపా సీనియర్ నేతలను తెరాసలోకి ఆకర్షించడంతో తెలంగాణాలో తెదేపా కొంత బలహీనపడింది.   ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న నారా లోకేష్, తెలంగాణాలో పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకొనేందుకు ప్రణాళికలు సిద్దం చేసారు. అందులో భాగంగానే పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభించి తెలంగాణాలో కొత్తగా 10 లక్షల మంది సభ్యులను పార్టీలో చేర్పించగలిగారు. ఆ తరువాత చంద్రబాబు నాయుడు వరంగల్ పర్యటన, ఇప్పుడు మళ్ళీ కరీంనగర్ పర్యటనకు కూడా రంగం సిద్దం చేస్తున్నారు. మున్ముందు ఇటువంటివి అనేక పర్యటనలు, సభలు, సమావేశాలకు లోకేష్ ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆంధ్రాలో అయినా తెలంగాణాలో అయినా పార్టీ అధ్యక్షుడు మీదే పూర్తిగా ఆధారపడకుండా స్థానిక నేతలు కూడా తరచూ ఇటువంటి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లయితే పార్టీ బలంగా ఉండగలదనే విషయం పార్టీ నేతలు కూడా గ్రహిస్తే మంచిది.

హుస్సేన్ సాగర్‌ జోలికెళ్తే కొంప మునిగినట్టే...

  అదేమీ విచిత్రమో కానీ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపని మొదలుపెట్టాలనుకొన్నా వెంటనే ఎవరో ఒకరు అభ్యంతరాలు లేవనెత్తుతుంటారు. ఒకప్పుడు స్వచ్చమయిన మంచినీళ్ళతో నిండి ఉండే హుస్సేన్ సాగర్ ఇప్పుడు ఒక పెద్ద మురికి చెరువుగా మారిపోయింది. దానిలో నీటిని, వ్యర్ధ పదార్ధాలను పూర్తిగా తొలగించి మళ్ళీ స్వచ్చమయిన నీళ్ళు నింపుతామని ఆయన ప్రకటించినప్పుడు ప్రజలందరూ హర్షించారు. కానీ ఇప్పుడు దానిపై కూడా కొందరు పర్యావరణవేత్తలు,నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు.   “సేవ్ అవర్ అర్బన్ లేక్స్” అనే హైదరాబాద్ కి చెందిన సంస్థ ప్రతినిధి యల్. శర్వాత్ మీడియాతో మాట్లాడుతూ “ముందు హుస్సేన్ సాగర్ లోకి చుట్టుపక్కల కర్మాగారాల నుండి ప్రమాదకర రసాయనాలతో కూడిన నీటి విడుదల ఆపకుండా చెరువులో నీళ్ళు తోడి బయట పోయడం వలన ఏమి ప్రయోజనం ఉంటుంది? మంచి నీటి వనరులను కలుషితం చేసేవారికి చట్టంలో చాలా కటినమయిన శిక్షలు పేర్కొనబడ్డాయి. అనేక దశాబ్దాలుగా చుట్టుపక్కల పరిశ్రమలు ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తూ హుస్సేన్ సాగర్ నీటిని కలుషితం చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం కూడా పట్టించుకొంటున్నట్లు లేదు. ముందు అటువంటి వారిపై చర్యలు తీసుకొని మళ్ళీ హుస్సేన్ సాగర్ లోకి రసాయన వ్యర్ధాలు విడుదల చేయకుండా నిరోధించిన తరువాతనే ఈ శుద్ధి కార్యక్రమం చేపడితే ఏమయినా ఫలితం ఉంటుంది. లేకుంటే అది ఏట్లో చింతపండు పిసికినట్లే అవుతుంది. మేము త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసి ఒక విజ్ఞప్తి పత్రం ఇవ్వబోతున్నాము. హుస్సేన్ సాగర్ ని కలుషితం చేస్తున్న వారిని ఇక ఎంతమాత్రం ఉపేక్షించ రాదని మేము కోరుతాము.” అని అన్నారు.   ఆయన మరొక అంశం కూడా ప్రస్తావిస్తున్నారు. “అనేక దశాబ్దాలుగా ప్రక్షాళనకు నోచుకోని కారణంగా హుస్సేన్ సాగర్ గర్భంలో కొన్ని వేల క్యూబిక్ మీటర్ల ఘన రసాయనిక వ్యర్థ పదార్ధాలు పోగుపడి ఉన్నాయి. కొన్ని లక్షల గ్యాలన్ల ప్రమాదకర రసాయనిక నీళ్ళు బయటకు తోడిపోయవలసి ఉంటుంది. ఘన వ్యర్ధ పదార్ధాలను మూసీ నది సమీపంలో పడేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. దానివలన అక్కడ వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. దానివలన ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు రోగాల భారిన పడే ప్రమాదం ఉంది. ఇక హుస్సేన్ సాగర్ నుండి తోడి బయటపోసే ప్రమాదకరమయిన నీళ్ళు ఎటు పోతాయి? ఎందులో కలుస్తాయి? అవి ఎందులో కలిసినా ఎక్కడ నిలిచినా ఆ ప్రాంతంలో ఉండే జలవనరులన్నీ కలుషితమయ్యే ప్రమాదం ఉంది. అంటే ఒక సమస్యను పరిష్కరించబోయి ఇంకో సమస్యను సృష్టించుకొన్నట్లే అవుతుంది,” అని అన్నారు.   నిజమే కదా! వారి వాదనలో కూడా అర్ధం ఉంది. మరి వారు లేవనెత్తిన ఈ సమస్యలను ప్రభుత్వం ఏవిధంగా పరిష్కరిస్తుందో తెలియదు. కానీ నగరానికే చెందిన బీవీ. సుబ్బారావు అనే జలవనరుల నిర్వహణ నిపుణుడు దీనిలో మరో కోణం కూడా ఎత్తి చూపుతున్నారు.   “ఇంతవరకు హుస్సేన్ సాగర్ గర్భంలో ఉన్న రసాయన వ్యర్ధాలు నీళ్ళతో కలిసి మెదేయిన్ అనే విషయవాయువు తయారవుతోంది. కానీ హుస్సేన్ సాగర్ లో ఉన్న నీళ్ళు ఆ విష వాయువుని ఒక ఫిల్టర్ మాదిరిగా పట్టి ఉంచి గాలిలో కలవకుండా నిరోధిస్తోంది. ఇప్పుడు ఆ నీళ్ళనన్నిటినీ ఒక్కసారిగా తోడేస్తే ఆ విష వాయువులు గాలిలోకి వ్యాపించడం మొదలవుతుంది. దాని వలన చుట్టుపక్కల నివసించే ప్రజలు, ట్యాంక్ బండ్ మీదుగా నిత్యం రాకపోకలు సాగించేవారు తీవ్ర అనారోగ్యానికి గురవుతారు. కనుక హుస్సేన్ సాగర్ ప్రక్షాళనను ఆషామాషీగా కాకుండా శాస్త్రీయ పద్దతుల ప్రకారమే చేయవలసి ఉంటుంది. లేకుంటే చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది,” అని హెచ్చరించారు.   హుస్సేన్ సాగర్ లో నుండి నీళ్ళు తోడితేనే ఇంత ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నప్పుడు, ఆ ఘన వ్యర్ధాలను మూసీ నది ఒడ్డునో మరొక నిర్జన ప్రాంతంలోనో పోగుపెడితే ఏమవుతుందో ఎవరయినా ఊహించగలరు. కనుక ఈ అంశాలన్నిటినీ కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని అడుగు ముందుకు వేయవలసి ఉంటుంది.

రఘువీరారెడ్డి ఎందుకు సిగ్గుపడాలంటే....

తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తగుదునమ్మా అంటూ పోటీ చేసింది. అక్కడ ఎలాంటి ఫలితం రావాలో అలాంటి ఫలితమే వచ్చింది. కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కూడా దక్కనంత ఓటమిని మరోసారి చవిచూసింది. ఓటర్లు చెప్పిన తీర్పుని గౌరవిస్తూ తల వంచుకుని నిలబడితే కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ నాయకులకు మర్యాదగా వుండేది. అయితే తమ సహజమైన శైలిలోనే తమ ఓటమికి, టీడీపీ గెలుపుకు వక్రభాష్యాలు చెబుతున్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటిదంటే... ఒక్క మాటలో చెప్పాలంటే ఒక శవం లాంటిది. ఆ శవానికి ప్రాణం తీసుకురాలేమని తెలిసినా ఏదో చికిత్స చేస్తున్నట్టు నటించే డాక్టర్‌ గారు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. సదరు శవానికి తాను చేస్తున్న ట్రీట్‌మెంట్ నటనను రక్తికట్టించే ప్రయత్నాల్లో భాగంగా అప్పుడప్పుడు అధికార తెలుగుదేశం పార్టీ మీద విరుచుకుపడుతూ వుంటారు. పసలేని ఆరోపణలు చేస్తూ వుంటారు. తాజాగా తిరుపతిలో ఘోరంగా ఓడిపోయిన తర్వాత రఘువీరారెడ్డి ఒక గొప్ప కామెంట్ చేశారు. తిరుపతిలో ఎన్నిక జరిగిన తీరు చూసి తాను సిగ్గుపడుతున్నాడట. అయితే రఘువీరా గారు సిగ్గుపడాల్సింది తిరుపతి ఎన్నిక విషయంలో కాదు... ఆయన సిగ్గుపడాల్సిన విషయాలు వేరే వున్నాయి. వాటిలో కొన్నిటిని చూద్దాం. 1. కాంగ్రెస్ పార్టీ పదేళ్ళపాటు దేశాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అత్యంత దారుణంగా పరిపాలించినందుకు... 2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించినందుకు... 3. ఆంధ్రప్రదేశ్‌ని ఏకపక్షంగా విభజిస్తుంటే రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేతులు ముడుచుకుని కూర్చున్నందుకు... 4. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక కాంగ్రెస్ పార్టీకి స్థానం లేదని తెలిసినా ఇంకా ఏదో బావుకుందామని తాపత్రయపడుతున్నందుకు... 5. మీ పార్టీకి ఇంకా ఉనికి ఉందని భ్రమపడుతూ తెలుగుదేశం పార్టీ మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నందుకు.... 6. ఓడిపోతామని తెలిసినా తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేసినందుకు.... 7. మీ పార్టీ చేసిన అడ్డగోలు విభజన కారణంగా నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొనాల్సి వచ్చినందుకు... 8. ఇంత జరిగినా ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతమాత్రం సిగ్గుపడనందుకు... 9. ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో నాయకత్వం వహించే దుర్గతి పట్టినందుకు.... .... ఇలా ఇన్ని కారణాలతో సిగ్గుపడాల్సిన అవసరం రఘువీరారెడ్డి గారికి వుంది.. మరి ఇప్పటికైనా సిగ్గుపడతారా...? సిగ్గుపడాల్సిన చోట సిగ్గు పడకపోవడం సిగ్గు సిగ్గు...

ప్రత్యేక హోదా లేకుండా పొరుగు రాష్ట్రాలతో పోటీపడగలమా?

  ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లాలో తంబళ్ళపల్లిలో నీరు-చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఆ తరువాత అక్కడి నుండి బెంగుళూరు వెళ్లి అక్కడ రక్షణ మరియు విమాన రంగాలకి యంత్ర సామాగ్రి తయారుచేసే పారిశ్రామిక వేత్తలతో సమావేశమవుతారు. ఆయన వారికి తన ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు సౌకర్యాల గురించి వివరించి వారు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సహిస్తారు. ఒకవేళ వారిలో ఏ కొందరు సముఖత వ్యక్తం చేసినా రాష్ట్రానికి మరికొన్ని భారీ పరిశ్రమలు వాటితో బాటే అనుబంధ పరిశ్రమలు తరలివచ్చే అవకాశం ఉంది.   ఇప్పటికే అనేకమంది పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఉండి ఉంటే మరిన్ని పరిశ్రమలు తరలివచ్చేవి. కానీ ఇప్పుడు ఆ హోదా దక్కుతుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. రాష్ట్రానికి తప్పకుండా ప్రత్యేక హోదా వస్తుందని ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా హామీ ఇవ్వలేని పరిస్థితి. రాష్ట్ర విభజన తరువాత ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా లేకుండా పూర్తిగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీపడి రాష్ట్రానికి పరిశ్రమలను ఆకర్షించడం కత్తిమీద సామువంటిదే.