కేంద్రానికి వర్తించిన సూత్రమే చంద్రబాబుకి కూడా?

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు నిన్న డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ “కేంద్రానికి ఆర్ధిక ఇబ్బందులు ఉండి ఉండవచ్చు. కానీ, ఆ కారణంగా రాష్ట్రానికి నిధులు విడుదల చేయలేమని చెప్పడం భావ్యం కాదు. ఏవిధమయిన ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్రానికి తక్షణ సహాయం చేయాలి. మేమేమీ అధనంగా కోరడం లేదు. ఇదివరకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను, విభజన బిల్లులో రాష్ట్రానికి ఇచ్చిన హామీలనే నేరవేర్చమని అడుగుతున్నాము,” అని అన్నారు.   ఆయన కేంద్రం నుండి రాష్ట్రానికి రావలసిన నిధులు రాబట్టడంలో వైఫల్యం చెందారని రాష్ట్రంలో ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. అదీగాక రాష్ట్ర ఆర్దికపరిస్థితులు కూడా నానాటికీ క్షీణిస్తున్నాయి. బహుశః అందుకే ఆయన కేంద్రాన్ని అంత గట్టిగా నిలదీసి ఉండవచ్చును. అందుకు ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ కూడా సానుకూలంగానే స్పందిస్తూ త్వరలోనే రాష్ట్రానికి మరిన్ని నిధులు విడుదల చేస్తామని మీడియా సమక్షంలో హామీ కూడా ఇచ్చారు.   అయితే, కేంద్రం వద్ద నిధులు ఉన్నా లేకున్నా ఇస్తానని హామీ ఇచ్చింది గనుక ఇవ్వవలసిందేనని ఆయన గట్టిగానే అడిగారు. కానీ ఇప్పుడు అదే మాటని పట్టుకొని ఆయన కేంద్రాన్ని ఏవిధంగా నిలదీసి అడిగారో అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్, వైకాపాలు కూడా ఆయన ఎన్నికలలో చేసిన అన్ని హామీలను అమలుచేయమని నిలదీయవచ్చును. తెలంగాణా ఉద్యోగులతో సమానంగా తమకూ 43శాతం వేతన సవరణ చేయాలని కోరుతున్న ఆంధ్రా యన్జీఓ సంఘాలు కూడా అదే మాటను పట్టుకొని ఆయనని నిలదీసినా ఆశ్చర్యం లేదు. ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయగా లేనిదీ తాం ఆయనని నిలదీస్తే తప్పేమిటని ప్రతిపక్ష పార్టీలు, ఉద్యోగ సంఘాల నేతలు భావిస్తే చంద్రబాబు నాయుడికి ఇబ్బందులు తప్పకపోవచ్చును.

డబ్బులున్నాయా లేవా అనేది కాదు ప్రశ్న

  కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీలో భాగంగా క్రిందటి వారం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 850 కోట్లు నిధులు విడుదల చేసింది. కానీ దాని వలన రెండు రాష్ట్రాల నుండి కూడా విమర్శలు మూటగట్టుకోవలసి వచ్చింది. ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి అంత భారీగా నిధులు ఇచ్చిన కేంద్రం తెలంగాణా రాష్ట్రానికి మాత్రం చిల్లి గవ్వ విదిలించకుండా మళ్ళీ సవతి తల్లి ప్రేమ చూపించిందని తెలంగాణా ప్రజలు భావిస్తుంటే, ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.16, 000 కోట్ల లోటు బడ్జెట్ ఉంటే కేవలం రూ.500 కోట్లు మాత్రమే విడుదల చేసినందుకు సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అసంతృప్తి వ్యక్తం చేసారు. అదే విషయాన్ని కుండబ్రద్దలు కొట్టినట్లు ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీతో చెప్పారు కూడా.   పార్లమెంటు సాక్షిగా అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ తదితరులు ఇచ్చిన అన్ని హామీలను, విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను కేంద్రం వీలయినంత త్వరగా అమలుచేయాలని ఆయన గట్టిగా కోరారు. కేంద్రానికి ఆర్ధిక సమస్యలుంటే ఉండవచ్చును. అయినా కూడా కేంద్రం తన హామీలను నిలబెట్టుకోవలసిందేనని ఆయన అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు తగ్గిన కారణంగా కేంద్రానికి రూ.45,000 కోట్ల ఆదాయం సమకూరిందని కనుక రాష్ట్రానికి నిధుల మంజూరు విషయంలో వెనకాడటం సరికాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేసారు. ఆ కారణంగానే ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ మీడియా ముందుకు వచ్చి రాష్ట్రానికి ఇచ్చిన అన్నిహామీలను అమలుచేస్తామని ప్రకటించారు.   ఇంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు అనేకసార్లు డిల్లీ వెళ్లి ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని, ప్రధాని మోడీని కలిసి నిధుల విడుదల కోసం పదేపదే అభ్యర్ధించారు. కానీ ఏనాడూ కూడా ఇంత కటువుగా మాట్లాడలేదు. కానీ మార్చి 31తో ఆర్ధిక సంవత్సరం ముగిసే సమయంలోగా కేంద్రం నుండి నిధులు రాబట్టుకోలేకపోతే ఆ ప్రభావం రాష్ట్ర బడ్జెట్ పై కూడా తీవ్రంగా ఉంటుంది. అదీగాక ప్రతిపక్షాలు కూడా ఈ అంశాన్ని అందిపుచ్చుకొని ఆయనను ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుండటంతో ఇంత కటువుగా మాట్లాడవలసి వచ్చిందని చెప్పవచ్చును. కానీ గత కాంగ్రెస్ ప్రభుత్వంలా కాకుండా మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన అన్ని హామీలను అమలుచేసేందుకు కట్టుబడి ఉందని, నిధులు ఇస్తామని గట్టిగా హామీ ఇస్తోందని కనుక అప్పుడే తొందరపడి అపోహలు పెంచుకోవడం మంచిది కాదని చంద్రబాబు నాయుడు అన్నారు.

అన్ని హామీలు అమలు చేస్తాం: జైట్లీ

  ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈసారి తన డిల్లీ పర్యటనలో కేంద్రంతో కొంచెం కటువుగానే మాట్లాడారు. నిన్న డిల్లీలో జరిగిన ‘నీతి ఆయోగ్’ సమావేశానికి హాజరయిన ఆయన, ప్రధాని మోడీని, ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని కలిసి రాష్ట్రానికి సహాయం చేయడంలో జరుగుతున్న జాప్యం పట్ల రాష్ట్ర ప్రజలలో నానాటికి పెరుగుతున్న అసంతృప్తి గురించి వారికి వివరించి తక్షణమే రాష్ట్రానికి నిధులు విడుదల చేయాలని ఆయన కోరారు. ప్రజాభీష్టానికి విరుద్దంగా గత యూపీయే ప్రభుత్వం రాష్ట్ర విభజన చేసినప్పుడు, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండూ కూడా ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాల ఆదుకొంటామని పార్లమెంటులో, విభజన చట్టంలో కూడా పేర్కొన్నాయని, గానీ ఇప్పుడు ఆర్దిక సమస్యలున్నాయని చెపుతూ జాప్యం చేయడం ఎవరికీ మంచిది కాదని ఆయన తెలిపారు. ఈ అంశంపై ప్రజలు, మీడియా, రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఏవిధంగా స్పందిస్తున్నదీ కూడా ఆయన వారికి వివరించారు.   ఆయన ఒత్తిడి కారణంగానే ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ, రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను, విభజన చట్టంలో పెర్కొన్నవీ అన్నిటినీ తమ ప్రభుత్వం తప్పకుండా అమలుచేస్తుందని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం ఏర్పడి కొన్ని నెలలే అయ్యిందని, కనుక ఒక్కొక్కటిగా రాష్ట్రానికిచ్చిన అన్ని హామీలను అమలుచేస్తామని ఆయన తెలిపారు. ఇటీవల రాష్ట్రానికి మంజూరు చేసిన ఆర్ధిక ప్యాకేజీ కేవలం ఆరంభం మాత్రమేనని మున్ముందు ఇంకా విడుదల చేస్తామని, ఈ ఆర్ధిక సంవత్సరం ముగిసేలోగానే మరికొంత విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు. ప్రత్యేకహోదా విషయంలో కూడా తమ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదని స్పష్టం చేసారు.   ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి నిధులు తేవడంలో విఫలమయ్యారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ, ప్రజలను ఆకట్టుకొని రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్న కారణంగా ఆయన నేరుగా ఆర్ధికమంత్రి చేతనే ఈవిధంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడింపజేయడం వలన తన ప్రయత్నలోపం ఏమి లేదనే సంగతి స్పష్టం చేయగలిగారు. ఆ విషయం ప్రజలకి కూడా తెలుసు గానీ, రాష్ట్రానికి నిధులు మంజూరులో ఎక్కడ, ఎందుకు జాప్యం జరుగుతోందనే విషయాన్ని ఆయన ఆర్ధిక మంత్రి జైట్లీ ద్వారానే చెప్పించడం ద్వారా ఈ అంశంపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు ఆయన జవాబు చెప్పినట్లయింది.

తిరుపతి టీడీపీ గుండెల్లో టీటీడీ రాయి

  ఈనెల 13వ తేదీ తిరుపతి అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతోంది. తిరుపతి ఎమ్మెల్యేగా వున్న వెంకట రమణ మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుపుతున్నారు. దివంగత ఎమ్మెల్యే భార్య సుగుణమ్మ ఈ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా వున్నారు. ఈ స్థానాన్ని ఏకగ్రీవం చేయాలని టీడీపీ ప్రయత్నించడంతో కాంగ్రెస్, లోక్‌సత్తా, కొంతమంది ఇండిపెండెంట్లు పట్టిన పట్టు విడవకపోవడం వల్ల పోలింగ్ జరపడం అనివార్యమైంది. అయినప్పటికీ ఈ స్థానంలో టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ గెలుపు ఖాయమన్న ధీమాలో మొన్నటి వరకూ స్థానిక టీడీపీ వర్గాలు వున్నాయి. అయితే కొద్ది రోజుల క్రితం జరిగిన పరిణామాలు ఆ వర్గాల గుండెల్లో రాళ్ళు పడేలా చేశాయి.   తిరుపతిలో ఒక మఠానికి చెందిన స్థలంలో అనేకమంది ఎప్పటి నుంచో ఇళ్ళను నిర్మించుకుని వున్నారు. ఆ స్థలం దశాబ్దాల క్రితం టీటీడీకి స్వాధీనం అయింది. ఆ స్థలంలో నిర్మించిన ఇళ్ళను తొలగించాలని టీటీడీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. అయితే రాజకీయ వత్తిడుల కారణంగా అది సాధ్యపడలేదు. అయితే ఆ స్థలంలో ఎప్పటి నుంచో ఇళ్లు కట్టుకుని నివసిస్తున్నారు కాబట్టి చూసీ చూడనట్టు వదిలేస్తే బావుంటుందన్న అభిప్రాయాలు కూడా వున్నాయి. గత పది సంవత్సరాలుగా రెండు మూడుసార్లు ఆ ఇళ్ళను తొలగించాలని ప్రయత్నాలు జరిగాయి. కానీ, వీలు కాలేదు. ఇది ఎప్పటి నుంచో తెగని పంచాయితీలా వుంది. గత ప్రభుత్వాలు కూడా ఈ ఇళ్ళ జోలికి వెళ్ళకపోతేనే మంచిదని భావించాయి. అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం హయాంలో ఈ తేనెతుట్టెని మళ్ళీ కదిల్చారు. ఈ ఇళ్ళను ఖాళీ చేసి వెళ్ళిపోవాలని, ఇంతకాలం తమ స్థలంలో ఇళ్ళు నిర్మించుకుని నివసించారు కాబట్టి తమకు అద్దె చెల్లించాలని టీటీడీ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. దాంతో స్థానిక తెలుగుదేశం వర్గాలు గతుక్కుమన్నాయి.   దశాబ్దాలుగా ఏ పార్టీ అయినా టచ్ చేయడానికి జంకిన అంశాన్ని ఇప్పుడు టచ్ చేయడం, అది కూడా తిరుపతి ఎన్నికలు జరగబోతున్న సమయంలో నోటీసులు జారీ చేయడం ఇక్కడ తెలుగుదేశం పార్టీని ఇబ్బందుల్లో నెట్టే అంశమని స్థానిక టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నోటీసుల కారణంగా 15 వేల ఓట్లు ఖాయంగా గల్లంతైనట్టేనని, ఇలా కూల్చివేతల కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్న అభిప్రాయం తిరుపతి నియోజకవర్గ ప్రజల్లో బలంగా కలిగితే దానివల్ల ఎంత నష్టం జరుగుతుందోనని భయపడుతున్నారు. ఈ నోటీసులు జారీ చేసేముందు చంద్రబాబు నాయుడు స్థానిక తెలుగుదేశం నాయకులనుగానీ, కార్యకర్తలను గానీ ఎంతమాత్రం సంప్రదించకుండా అధికారుల మాటల్ని నమ్మడం బాగాలేదని అనుకుంటున్నారు. కనీసం ఆ నోటీసులేవో జారీ చేసేముందు తమను ఒక్క మాట అడిగినా దానివల్ల వచ్చే సమస్యలేమిటో వివరించేవాళ్ళమని, ఇప్పుడు తీరా నోటీసులు జారీ చేశాక తాము ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చేశామని చెబుతున్నారు.   అధికారంలో లేనప్పుడు కార్యకర్తల నాయకుడిగా వుండటం, అధికారం వచ్చిన తర్వాత అధికారులు చెప్పినట్టు వినే ముఖ్యమంత్రిగా మారిపోవడం చంద్రబాబుకు పరిపాటిగా మారిందని తెలుగుదేశం కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తల విషయంలో చంద్రబాబు తీరు ఓడ మల్లన్న... బోడిమల్లన్న తరహాలో వుండటం పట్ల వారు బాధపడుతున్నారు.అధికారుల మాటలు నమ్మి తిరుపతిలో జారీ చేసిన నోటీసుల వల్ల తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికలలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే ఆ బాధ తమకే వుంటుంది తప్ప అధికారులకు కాదని వారు అంటున్నారు. ఏది ఏమైనా అధికారుల అత్యుత్సాహం కారణంగా తిరుపతిలో తలెత్తిన పరిస్థితులు పార్టీకి ఇబ్బంది కలిగించకూడదనే వారు కోరుకుంటున్నారు.

చంద్రబాబు రేపు డిల్లీకి పయనం

  ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు మళ్ళీ డిల్లీ ప్రయాణం అవుతున్నారు. కారణం పాతదే. రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టుల గురించి ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీకి, ప్రధాని నరేంద్ర మోడీకి విన్న వించుకోవడానికి వెళుతున్నారు. మూడు రోజుల క్రితం కేంద్రం ప్రకటించిన రూ.850 కోట్ల ఆర్ధిక ప్యాకేజీ పట్ల ప్రతిపక్షాలే కాదు, అధికార పార్టీకి చెందిన మంత్రులు కూడా పెదవి విరుస్తున్నారు. బడ్జెట్ లోటు రూ.16, 000 కోట్లు ఉంటే, కేంద్రం కేవలం రూ.500 మాత్రమే విడుదల చేసింది. తెదేపా-బీజేపీ మిత్ర పక్షాలయినప్పటికీ తెదేపా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు రాబట్టడంలో విఫలమయిందని విమర్శలు గుప్పిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బలమయిన శక్తిగా ఎదగాలని భావిస్తున్న బీజేపీకి కూడా ఇటువంటి వ్యతిరేక ప్రచారం ఎంత మాత్రం మంచిది కాదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ విషయాన్ని రాష్ట్ర బీజేపీ నేతలే తమ అధిష్టానికి చెప్పుకొంటారు కనుక చంద్రబాబు నాయుడు ఆ ప్రసక్తి తేకపోవచ్చును. కానీ రాష్ట్ర విభజన కారణంగా తీవ్ర ఆర్ధిక లోటుని ఎదుర్కొంటున్న రాష్ట్రాన్ని అన్ని విధాల ఆదుకొంటామని నరేంద్ర మోడీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినందున, అదే విషయం ఆయనకు మరో మారు గుర్తుచేసి బడ్జెట్ లోటును పూడ్చుకోనేందుకు కేంద్ర సహాయం కోరవచ్చును. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయినా అందుకు సరిసమానంగా రాయితీలు, నిధులు విడుదల చేయమని అభ్యర్ధించవచ్చును. అదేవిధంగా రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, తిరుపతి, విజయవాడ మరియు వైజాగ్ నగరాలలో మెట్రో రైల్ ప్రాజెక్టులు, వివిధ ఉన్నత విద్యాసంస్థల స్థాపనకు అవసరమయిన అనుమతులు, నిధులు కోరవచ్చును. మార్చి నెలాఖరుతో ముగిసే ఈ ఆర్ధిక సం.లో కేంద్రం నుండి వీలయినంత ఎక్కువ నిధులు రాబట్టుకోలేకపోయినట్లయితే, ఆ ప్రభావం వచ్చే ఆర్ధిక సం.కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ పై కూడా ఉంటుంది. కనుక ఈసారి చంద్రబాబు నాయుడు కేంద్రంపై మరింత ఒత్తిడి చేయవచ్చును. మరి కేంద్రం ఆయన ఒత్తిడికి లొంగి నిధులు విడుదల చేస్తుందో లేదో త్వరలోనే తెలిసిపోతుంది.

విగ్రహాల తొలగింపుతో ప్రభుత్వానికి కొత్త సమస్యలు?

  హైకోర్టు, సుప్రీం కోర్టు రెండూ కూడా రాజకీయ పార్టీలు రోడ్లమీద ఎక్కడబడితే అక్కడ తమ నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేయడాన్ని ఖండిస్తున్నాయి. అంతేకాక వాటిని తొలగించమని ఆదేశాలు కూడా జారీ చేసాయి. కానీ వాటి జోలికి వెళ్తే కొత్త సమస్యలు ఆహ్వానించినట్లవుతుందనే భయంతో ఏ ప్రభుత్వమూ కూడా ఈవిషయంలో దైర్యం చేయలేకపోయింది. అందువలన మన రాష్ట్రంలో వైకాపా పుణ్యమాని గత పదేళ్ళ కాలంలో వెలిసిన విగ్రహాలకు లేక్కేలేదు. ఇంకా కొత్తగా అనేకం వెలుస్తూనే ఉన్నాయి కూడా. అనుమతి లేకుండా పెడుతున్న విగ్రహాలన్నిటినీ తొలగించమని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. కానీ జాతీయ నాయకుల విగ్రహాల జోలికి మాత్రం పోవద్దని సూచించారు.   ఇక నేడో రేపో అధికారులు రాజశేఖర్ రెడ్డి విగ్రహాల తొలగింపు మొదలుపెడితే వైకాపా చూస్తూ ఊరుకొంటుందని భావించలేము. కనుక అది కక్ష సాధింపు చర్యలేనంటూ ధర్నాలు, నిరసనలు చెప్పట్టవచ్చును. రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి కూడా చెందినవారు కనుక ఆ పార్టీ నేతలు కూడా వైకాపాతో గొంతు కలుపుతారేమో? ఇక రాష్ట్రంలో యన్టీఆర్ విగ్రహాలు కూడా అనేక చోట్ల ఉన్నాయి. కానీ వాటిని తాకేందుకు అధికారులకు ప్రభుత్వం అనుమతిస్తుందో లేదో? ఇస్తే వాటిని తాకేందుకు అధికారులు సాహసిస్తారో లేదో? సాహసించకపోతే వైకాపా తమకో న్యాయం తెదేపాకొ న్యాయమా? అంటూ ప్రశ్నించక మానదు.   ఇది చాలా సున్నితమయిన అంశం గనుక అధికారులు చాలా జాగ్రత్తగా ఈ వ్యవహారాన్ని చక్కబెట్టాల్సి ఉంటుంది. లేకుంటే ప్రభుత్వానికి కొత్త సమస్యలు వస్తాయి. దాని వలన వారికి అక్షింతలు తప్పవు. ఇప్పుడు విగ్రహాలు తొలగించడమే కాకుండా మున్ముందు ఎవరూ ఎక్కడబడితే అక్కడ విగ్రహాలు ప్రతిష్టించకుండా కటినమయిన నిబంధనలు రూపొందిస్తే బాగుంటుంది.

కేసీఆర్ దెబ్బకి ప్రతిపక్షాలు ఠా!

  తెలంగాణాలో తెరాస పార్టీ అధికారం చేప్పట్టిననాటి నుండి నేటివరకు కూడా విద్యుత్ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు వంటి అనేక క్లిష్ట సమస్యలు, పొరుగు రాష్ట్రంతో వివాదాలు, కేసీఆర్ వివాదాస్పద నిర్ణయాలు ఆకారణంగా ప్రభుత్వానికి కోర్టుల చేత అక్షింతలు, ప్రతిపక్షాల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది. అందువలన ఈ తొమ్మిది నెలల్లో ఒక్క రోజు కూడా పూర్తి సంతోషంగా, సంతృప్తికరంగా పాలన సాగిందని చెప్పుకోవడానికి లేకుండా పోయింది.   ఇప్పుడు సచివాలయాన్ని ఎర్రగడ్డకు తరలించి అక్కడ ఉన్న చాతి వ్యాధులు మరియు మానసిక వ్యాధుల ఆసుపత్రులను వేరే చోటికి తరలించాలనే కేసీఆర్ నిర్ణయంతో ఆందోళనలు, వాదోపవాదాలు మొదలయ్యాయి. పరిస్థితులు అనుకూలించే వరకు జి.హెచ్.యం.సి.ఎన్నికలను వాయిదా వేయాలనుకొంటే తక్షణమే షెడ్యుల్ ప్రకటించమని హైకోర్టు ఆదేశించడంతో అవీ వెంటనే నిర్వహించక తప్పడం లేదు.   ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన ఒకే ఒక ఎత్తుతో ప్రతిపక్షాలన్నీ చిత్తయిపోయాయి. ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచడంతో ఆయాన ఒకేసారి ఏకంగా కొన్ని లక్షలమంది ఉద్యోగులను, వారి కుటుంబాలను ప్రసన్నం చేసుకొని తనవైపు త్రిప్పుకోగలిగారు. ఇప్పుడు ప్రతిపక్షపార్టీలు ఎంత అరిచి గ్గీ పెట్టినా ఆయనకు పోయేదేమీ లేదు. ఇకపై ఉద్యోగులు ఆయనపై ఈగ వాలకుండా చూసుకోవచ్చును. కనుక ఆయన నిర్భయంగా తన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగవచ్చును. కాకపోతే వివాదాస్పద నిర్ణయాలు తీసుకొంటే కోర్టు భారి నుండి ఆయనను ఎవరూ కాపాడలేరు. ప్రస్తుతం సచివాలయం, ఛాతి మరియు మానసిక వ్యాధుల ఆసుపత్రుల తరలింపు వ్యవహారంలో మొండిగా ముందుకు వెళ్ళినట్లయితే ఆయనకు గవర్నరు నుండి అభ్యంతరాలు, కోర్టులో ఎదురు దెబ్బలు తప్పకపోవచ్చును.

శభాష్ అసదుద్దీన్ జీ!

  తాలిబాన్ ఉగ్రవాదుల కంటే అతి భయంకరమయిన, కిరాతకమయిన ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నారు. సిరియా, ఇరాక్, జోర్డాన్ దేశాలలో ముస్లిం మరియు క్రీస్టియన్ మతాలకు చెందిన అనేకమంది యువతులను, పెళ్ళయిన మహిళలను, అభంశుభం తెలియని బాల, బాలికలను చెరపట్టి సెక్స్ బానిసలుగా ఉపయోగించుకొంటున్నారు. అందుకు నిరాకరిస్తున్న వారిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేస్తున్నారు. కొందరిని బజారు వస్తువుల్లా అమ్మేస్తున్నారు. ఎందుకూ పనికి రారనుకొన్నవారిని సజీవంగా భూస్థాపితం చేసేస్తున్నారు. చిన్నారి పసిపిల్లల పట్ల కూడా వారు చాలా కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు. వారిలో చెరలో చిక్కిన అనేకమంది చిన్నారులు, బాల బాలికలు, వృద్ధులు ఆకలి దప్పులతో అలమటించి చనిపోతున్నారని, ఉగ్రవాదుల నుండి వారినందరినీ తక్షణమే కాపాడలేకపోతే వేలాదిమంది బలయిపోతారని ఐక్యరాజ్యసమితికి చెందిన మానవ హక్కుల సంఘం తన తాజా నివేదికలో ప్రకటించింది.   ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు ఇంతవరకు అనేకమంది విదేశీయులను అతి కిరాతకంగా గొంతు కోసి చంపారు. తమకు బందీగా చిక్కిన జోర్డాన్ దేశానికి చెందిన ఒక పైలట్ ని అంతకంటే అతి కిరాతకంగా ఒక ఇనుప బోనులో బందించి అతనిపై పెట్రోల్ పోసి సజీవదహనం చేసి, దానిని తమ అధికారిక వెబ్ సైట్లో పెట్టడం యావత్ ప్రపంచాన్ని కలవరపరిచింది. వారు అతనిని సజీవ దహనం చేస్తున్న సమయంలో అతను కళ్ళు మూసుకొని అల్లాను ప్రార్దిస్తూ మరణించడం యావత్ ముస్లిం సోదరులను తీవ్రంగా కలచివేసింది.   వారి ఆకృత్యాలను చూస్తున్న ఎంఐఎం అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ దీనిపై స్పందిస్తూ “జీహాద్ అంటే రక్తపాతం, విధ్వంసం కాదనీ, యువత తమ బస్తీలలో ఉన్న సమస్యలపై పోరాటం చేసి వాటిని పరిష్కరించడమే జిహాద్ గా భావించాలని హితవు పలికారు. నిన్న ఆయన హైదరాబాద్ లోని జామియా నిజామియాలో మీడియాతో మాట్లాడుతూ, ఇస్లాంకు ఐఎస్‌ఐఎస్ ప్రధాన శత్రువన్నారు. దానితో ఇస్లాం మతానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. జిహాద్ పేరిట ఉగ్రవాదులు చేస్తున్న అకృత్యాలు, సృష్టిస్తున్న రక్తపాతాన్ని ఇస్లాం మతం అంగీకరించదని ఆయన అన్నారు.   జిహాద్ పేరిట ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు చేస్తున్నఆకృత్యాలను యావత్ ముస్లిం సోదరులు ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. జీహాద్ పేరిట ఇంటర్నెట్, మొబైల్‌లలో కనిపించే సమాచారం చూసి యువత దారితప్పుతోందనీ, ఉగ్రవాది హఫీజ్ సయీద్ లాంటి సంఘ విద్రోహ శక్తులు పొందుపరచిన సమాచారమే అందులో ఉంటుందన్నారు. ముస్లిం యువత అటువంటి వారికి దూరంగా ఉంటూ సమాజ శ్రేయస్సు కొరకు కృషి చేయాలని ఆయన కోరారు.   జీహాద్‌కు అసలయిన అర్ధం, నిర్వచనం తెలుసుకోవలంటే యువత ముస్లిం మతగురువులు మౌలానాలను సంప్రదిస్తే తెలుస్తుందన్నారు. నిజంగా జీహాద్ చేయాలనుకుంటే యువత తమ తమ బస్తీ పరిసరాల్లోని చెడు సమస్యలపై దృష్టి సారించాలని అసదుద్దీన్ కోరారు. ప్రజాస్వామిక దేశమయిన భారతదేశంలో ప్రజల మత స్వేచ్ఛను ఆపడం ఎవరి తరం కాదన్నారు.   యంపీ అసదుద్దీన్ ఒవైసీ అందరికంటే ఈ సమస్యను గుర్తించి ఈవిధంగా మీడియా ముందుకు వచ్చి ఉగ్రవాదుల చర్యలను ఖండించడం చాలా అభినందనీయం. రాష్ట్రంలో మరియు దేశంలో మతగురువులు, ముస్లిం ప్రముఖులు, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి ప్రముఖ సినీ నటులు, మేధావులు, రచయితలు అందరూ కూడా ఇదేవిధంగా ముందుకు వచ్చి దేశంలో ముస్లిం యువత దారి తప్పకుండా కాపాడుకొంటే, దేశానికి, యువతకి కూడా చాలా మేలు చేసినవారవుతారు.

ఆంద్రప్రదేశ్ కి సిరులు కురిపించే శ్రీ సిటీ

  చెన్నై నగరానికి కేవలం 55కిమీ దూరంలో ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులో చిత్తూరు వద్ద ఏర్పాటు చేసిన శ్రీ సిటీ పారిశ్రామికవాడలో 25 దేశాలకు చెందిన 104 చిన్నాపెద్దా పరిశ్రమలు గత ఐదేళ్ళుగా పనిచేస్తున్నాయి. వాటిలో పిల్లలు ఆడుకొనే ఆట వస్తువులు మొదలుకొని ట్రక్కులు, భారీ యంత్రసామాగ్రి వరకు తయారవుతున్నాయి. జపాన్ దేశానికి చెందిన ఆటోమొబైల్ పరికరాలు తయారు చేసే సంస్థ ‘ఐసన్’ అక్కడే తమ పరిశ్రమను స్థాపించబోతున్నట్లు ప్రకటించింది.   “మొదట మేము బెంగళూరులో మా సంస్థను స్థాపించాలని అనుకొన్నప్పటికీ మా వినియోగదారులయిన నిస్సాన్ మరియు టొయోటా కంపెనీలు తమిళనాడులో శ్రీపెరంబూరులో ఉన్నందున వాటికి దగ్గిరగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ఇక్కడే మా సంస్థను స్థాపించాలని నిర్ణయించుకొన్నాము,” అని ఆ సంస్థకి చెందిన జే. సెంథిల్ కుమార్ తెలిపారు.   ఈ ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించేందుకు సువిశాలమయిన ఖాళీ స్థలాలు ఉండటమే కాక అన్ని విధాల అభివృద్ధి చేయబడి ఉండటం, నిరంతర విద్యుత్ సరఫరా కలిగి ఉండటం, ఆంధ్ర, తెలంగాణా, తమిళనాడు, కర్ణాటక, రాష్ట్రాలకు వేగంగా సరుకు రవాణా చేసుకొనే అవకాశం కలిగిఉండటం వంటి కారణాల వల్ల ఇక్కడ పరిశ్రమలు స్థాపించడానికి అనేక మంది ఆసక్తి చూపిస్తున్నారు. ద్విచక్ర వాహన తయారీలో దేశంలో ప్రసిద్ది చెందిన హీరో మొటోకార్ప్ సంస్థ త్వరలోనే ఇక్కడ ఉత్పత్తి మొదలుపెట్టబోతోంది.   ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన విదేశీ పర్యటనలలో అక్కడి పారిశ్రామికవేత్తలకు ఈ శ్రీసిటీ ప్రత్యేకతలను వివరించి అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పించగలిగారు. జపాన్ కి చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ ఇసుజు శ్రీసిటీలో తన ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించేందుకు సిద్దమయింది. జపాన్, అమెరికాలతో సహా మరో మూడు దేశాలకు చెందిన సంస్థలు ఈ శ్రీసిటీలో దాదాపు రూ.19,000 కోట్ల పెట్టుబడితో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చినట్లు శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సనారెడ్డి చెప్పారు. వాటిలో కొన్ని సంస్థలతో చర్చలు తుది దశలో ఉంటే, మరి కొన్ని నిర్మాణానికి సిద్దంగా ఉన్నాయని అయన తెలియజేసారు. కేంద్రప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి కోసం నిన్న ప్రకటించిన రాయితీల వల్ల ఇక్కడకి మరిన్ని పరిశ్రమలు తరలిరావచ్చని ఆశించవచ్చును.

జగన్ ఫ్యాన్స్ ఆందోళన

  ఎలాంటి వారికైనా కొంతమంది ఫ్యాన్స్ వుంటారు. దానికి కారణం వారి దగ్గర వున్న డబ్బు కావచ్చు.. వారి వల్ల గతంలో పొందిన లాభం కావొచ్చు.. భవిష్యత్తులో ఉపయోగపడతాడన్న ఆశ కావొచ్చు... ఇతనూ మనలాంటివాడేనన్న అభిమానం కావచ్చు... ఎలాంటి వ్యక్తిత్వం వున్నవారినైనా అభిమానించేవారు కొందరు ఉంటారన్నది ఖాయం. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే మన వైసీపీ నాయకుడు జగన్. తన తండ్రిని అడ్డుగా పెట్టుకుని ఈయన లక్షల కోట్ల రూపాయలు సంపాదించారన్న ఆరోపణలున్నాయి. ఆ ఆరోపణలకు బలం చేకూర్చే లక్షల కోట్ల ఆస్తులున్నాయి. సీబీఐ కేసులున్నాయి... అన్నిటికీ మించి 16 నెలల జైలు జీవితం వుంది... ఇంకా చెప్పాలంటే బోలెడన్ని సాక్ష్యాధారాలున్నాయి. మొత్తమ్మీద జగన్ వైట్ కాలర్ నేరస్తుడన్న విషయం దేశంలో ఎవర్ని అడిగినా తడుముకోకుండా చెబుతారు. అయితే అలాంటి జగన్‌ని కూడా కొంతమంది అభిమానిస్తారు. అందుకే ఆయనకు గత ఎన్నికలలో కొన్ని స్థానాలు వచ్చాయి. అవి ఏ మార్గంలో వచ్చాయన్నది ప్రస్తుతానికి అప్రస్తుతం. అలా జగన్ని అభిమానించేవారు ఇప్పుడు చాలా ఆందోళనకు గురవుతున్నారు. ఎలాంటి ఫ్లాష్‌బ్యాక్ ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ పార్టీని కొద్ది స్థానాల్లో అయినా గెలిపించారు. 16 నెలలో జైల్లో వున్నా చివరికి బెయిల్ దొరికింది. ఇప్పుడు ప్రశాంతంగా ఉంటూ, నిర్మాణాత్మక ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తే బాగుంటుంది కదా అని ఆయన అభిమానులు అనుకుంటున్నారు. అయితే జగన్ మాత్రం ప్రతిక్షణం అధికార పార్టీ మీద విరుచుకుపడుతూ, అయిన దానికీ కానిదానికీ ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేయడానికి తంటాలు పడుతున్నాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు విషయంలో ప్రభుత్వాన్ని ఏదోరకంగా బద్నామ్ చేయడానికి జగన్ పడుతున్న తంటాలు చూసి ఆయన అభిమానులు బాధపడుతున్నారు. అద్భుతమైన రాజధాని నిర్మాణానికి సహకారం అందిస్తే జగన్ సార్ పేరు కూడా చరిత్రలో నిలుస్తుంది కదా.. అలా కాకుండా అడ్డం తగులుతూ చరిత్ర లేకుండా అయిపోతాడే అని బాధపడుతున్నారు. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో వున్న రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి కృషి చేస్తున్న ప్రభుత్వానికి తనవంతు సహకారం అందిస్తే జనంలో కాస్తయినా సానుభూతి వస్తుంది కదా అనుకుంటున్నారు. జగన్ వ్యవహార శైలి ఇలాగే కొనసాగితే, రేపు ఎప్పుడైనా జగన్ జైల్లో పడితే కనీసం అయ్యోపాపం అనుకునేవాళ్ళు కూడా జనాల్లో మిగలరని జగన్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

మళ్ళీ ఓదార్పు యాత్రలకి జగన్ సిద్దం?

  వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మరో ఓదార్పు యాత్రకి సిద్దం అవుతున్నట్లు తాజా సమాచారం. ఆయన ఈనెల 11వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన రైతుల కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు బయలుదేరుతున్నట్లు వైకాపా చెపుతోంది. గత తొమ్మిది నెలల్లో రాష్ట్రంలో 85 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వైకాపా వాదిస్తోంది. వారి కుటుంబాలకు ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందలేదు కనుక జగన్మోహన్ రెడ్డి వారిని పరామర్శించి వారికి కొంత ఆర్ధిక సహాయం చేయబోతున్నట్లు సమాచారం.   ఆయన తన తండ్రి రాజశేఖర్ రెడ్డి మరణించిన నాటి నుండి తన పార్టీని బలపరుచుకొనేందుకు ఓదార్పు యాత్రలు చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణా నుండి బయటపడిన వైకాపా మళ్ళీ తెలంగాణాలో అడుగుపెట్టేందుకు కూడా ఓదార్పుయాత్రలనే సురక్షితమయిన మార్గంగా ఎంచుకొంది. కానీ అక్కడ అధికారంలో ఉన్న తెరాసతో సంబంధాలు చెడగొట్టుకోవడం ఇష్టం లేకనో లేకపోతే తెలంగాణాలో అడుగుపెట్టే సాహసం చేయలేకనో ఆయన స్వయంగా తెలంగాణాలో పర్యటించకుండా తన సోదరి షర్మిలను పరామర్శ యాత్రల పేరిట పంపిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఆయన రైతు కుటుంబాలను ఓదార్చే మిషతో యాత్రలకు ఎందుకు బయలుదేరుతున్నారంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు జేసేందుకేనని చెప్పవచ్చును. కానీ ఇటువంటి డొంకతిరుగుడు ప్రయత్నాల ద్వారా రాష్ట్రంలో ప్రజలను ఆకట్టుకొని ఎన్నికలలో గెలవడం సాధ్యం కాదని రెండు రాష్ట్రాలలో ప్రజలు స్పష్టంగా తెలియజేసారు. కానీ జగన్ తన ఓటమి నుండి ఎటువంటి గుణపాటం నేర్చుకోకుండా పాత పద్దతులలోనే ముందుకు సాగాలనుకోవడం విశేషమే.  

డిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నేడే చివరి రోజు

  డిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఈరోజే చివరి రోజు. కనుక దాదాపు నెలరోజులుగా డిల్లీలో బీజేపీ, ఆమాద్మీ పార్టీల మధ్య హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల ప్రచార యుద్ధం ఈరోజు సాయంత్రం ఆరుగంటలకు ముగియబోతోంది. క్రితం సారితో పోలిస్తే, ఈసారి బీజేపీ, అమాద్మీ పార్టీ రెండూ కూడా ఈ ఎన్నికలలో ఎలాగయినా విజయం సాధించాలానే పట్టుదలతో చాలా తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఎంతో ఘన చరిత్ర ఉందని చెప్పుకొనే కాంగ్రెస్ పార్టీ, ఆ రెండు పార్టీల మధ్య జరుగుతున్న పోరాటాన్ని ప్రేక్షక పాత్ర వహించి చూస్తూ ఉండిపోవలసి వచ్చింది. ప్రచారం కీలక దశకు చేరుకొంటున్న కొద్దీ బీజేపీ, ఆమాద్మీ పార్టీలు రెండూ కూడా తమ వద్ద ఉన్న అన్ని అస్త్ర శస్త్రాలు బయటకి తీసి ఒకదానిపై మరొకటి ప్రయోగించుకొంటున్నాయి. బీజేపీ ఈవిధంగా పోరాడటం ఎవరికీ ఆశ్చర్యం కలిగించకపోయినా, ఆమాద్మీ పార్టీ విజయమో వీరస్వర్గమో అన్నట్లుగా తన సర్వశక్తులు ఒడ్డి బీజేపీతో పోరాడటం చాలా ఆశ్చర్యంగానే ఉంది. అందుకు బలమయిన కారణమే ఉంది. ఈసారి ఆమాద్మీ పార్టీ ఎన్నికలలో గెలవలేకపోతే మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు ఆ పార్టీని సజీవంగా నిలుపుకోవడం చాలా కష్టమవుతుంది. అందుకే ఇదే తన అంతిమ పోరాటంగా భావించి బీజేపీతో యుద్ధం చేస్తోంది. మరి డిల్లీ ప్రజలు ఏ పార్టీకి ఓటు వేసి గెలిపించుకొంటారో మరి కొన్ని రోజుల్లోనే తేలిపోతుంది. ఫిబ్రవరి 7వ తేదీన డిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.

అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టుకి జగన్ హాజరు

  అక్రమాస్తుల కేసుల్లో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై సీబీఐ మొత్తం 11 చార్జ్ షీట్లు దాఖలు చేసింది. అన్ని చార్జ్ షీట్లలో ఏ-1 నిందితుడిగా ఉన్న ఆయనపై ప్రస్తుతం మొదటి మూడు చార్జ్ షీట్లలో సీబీఐ చేసిన ఆరోపణలపై సీబీఐ కోర్టులో విచారణ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డిత్ బాటు ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న విజయసాయిరెడ్డి, అయోధ్యరామిరెడ్డి తదితరులు కూడా బుధవారం నాడు జరిగిన విచారణకు హాజరయ్యారు. వారు ఈ కేసుల విచారణకు హాజరయినప్పుడు తమను ఈ కేసుల నుండి విముక్తి చేయమని కోరుతూ డిశ్చార్జ్ పిటిషన్లు వేసారు. వాటిని స్వీకరించిన కోర్టు ఈనెల 9వ తేదీకి వాయిదా వేసింది. అక్రమాస్తుల కేసు విచారణను మార్చి 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ 11 చార్జ్ షీట్లపై విచారణ పూర్తవడానికి ఇంకా ఎన్ని ఏళ్ళు పడుతుందో, అంతిమంగా ఎటువంటి తీర్పు వస్తుందో తెలియడం లేదు. బహుశః మరో నాలుగేళ్లయినా పడుతుందేమో?

కేసీఆర్ అభద్రతాభావంతో ఉన్నారా?

  తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే ఎన్నికల సమయానికి రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు 154కి పెరుగుతాయని అందులో కనీసం 134 సీట్లు తెరాసయే గెలుచుకొంటుందని జోస్యం చెప్పారు. తెలంగాణాలో తెరాసకు వేరే ప్రత్యామ్నాయం లేదని కుండ బ్రద్దలుకొట్టినట్లు ప్రకటించారు.   తెరాస పార్టీ ఏకంగా 134 సీట్లు గెలుచుకోగలదని ఆయనకి అంత విశ్వాసం ఉన్నపుడు ఇతర పార్టీల నేతలని, యం.యల్యే.లని పార్టీలోకి ఆకర్షించేందుకు అంత ముమ్మరంగా ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు? చంద్రబాబు నాయుడు ఒక్కరోజు వరంగల్ పర్యటించేందుకు వస్తుంటే తెరాస మంత్రులు అంత తీవ్రంగా ఎందుకు ప్రతిస్పందిస్తున్నట్లు? వైకాపా నేత షర్మిల రాష్ట్రంలో పరామర్శ యాత్రలు చేస్తుంటే బొత్తిగా పట్టించుకోని తెరాస నేతలు, చంద్రబాబు నాయుడు పర్యటిస్తారంటే మాత్రం ఎందుకు కంగారు పడుతున్నారు? అని ప్రశ్నించుకొంటే కేవలం అభద్రతాభావం వల్లనేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.   ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ కి వచ్చినప్పుడు తన పార్టీ నేతలకు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకొంటే ఈ అనుమానం నిజమనేననిపిస్తుంది. తెరాస పార్టీ కేవలం ఒకరిద్దరు నేతల వ్యక్తిగత బలంపైన, తెలంగాణా సెంటిమెంటుపైనే ప్రధానంగా ఆధారపడి నిలబడి ఉందని, ఆ పార్టీకి సరయిన పునాదులు లేవని ఆయన అన్నారు. ఒకవేళ గ్రామ స్థాయి నుండి తెరాస పార్టీని బలంగా నిర్మించుకొని ఉంటే, కేసీఆర్ ఈవిధంగా ఇతర పార్టీలను చూసి అభద్రతాభావానికి గురి అవనవసరం లేదు. ఇతర పార్టీల నేతలకు గాలం వేయవలసిన అవసరం అంతకంటే ఉండదు. ఇదంతా కేసీఆర్ కి తెలియదనుకోలేము. తెలిసినా ఆయన తన పంధాలోనే ముందుకు సాగుతున్నారంటే ఆయనలో అభద్రతాభావమే అందుకు కారణమని చెప్పవచ్చును.   ఆ కారణంగానే ఆయన అప్పుడప్పుడు హోమాలు, యాగాలు చేస్తుంటారు. ఆ కారణంగానే దేవుళ్ళకు మొక్కులు చెల్లించుకోవాలనుకొంటున్నారు. ఆ కారణంగానే ఆయన ఇప్పుడు మళ్ళీ వాస్తును ఆశ్రయిస్తున్నారు. మనసులో ఇన్ని భయాలు పెట్టుకొని పైకి మాత్రం నూటికి నూటొక్క మార్కులు నాకే అనుకొంటే దాని వలన తెరాసయే నష్టపోతుంది తప్ప ప్రతిపక్షాలు కాదు.

తెరాస పట్ల వైకాపా వైఖరి మారుతోందా?

  ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణా ప్రభుత్వానికి, తెరాసను వెనకేసుకు వచ్చే సాక్షి మీడియాలో ఈ మధ్య వాటికి వ్యతిరేకంగా వార్తలు, విశ్లేషణలు రావడం చూస్తుంటేతెరాస పట్ల వైకపా వైఖరిలో క్రమంగా మార్పు వస్తోందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. రాష్ట్ర విభజనకు ముందు ఆంద్ర ప్రయోజనాలు కాపాడుకోవాలి అంటూ గొంతు చించుకొన్న వైకాపా, ఎన్నికల తరువాత తెలంగాణా ప్రభుత్వం ఆంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని విమర్శలు చేస్తున్నా, యుద్ధాలు చేస్తున్నా ఏనాడూ నోరువిప్పిన దాఖలాలు లేవు. పోలవరం, ఫాస్ట్ పధకం, నీళ్ళు, విద్యుత్ వంటి అనేక అంశాల మీద రెండు ప్రభుత్వాల మధ్యన యుద్ధం జరుగుతుంటే ఏనాడు కూడా వైకపా ఆంద్ర ప్రయోజనాల గురించి మాట్లాడలేదు. కానీ ఆంద్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబుపై యుద్ధం ప్రకటించింది కూడా.   కానీ ఈమధ్యన సాక్షి మీడియా ద్వారా తెరాసను, తెలంగాణా ప్రభుత్వాన్ని విమర్శిస్తోంది. కేసీఆర్ సచివాలయాన్ని ఎర్రగడ్డకు తరలించాలనే నిర్ణయంపై సాక్షి మీడియాలో ఒక చర్చ నిర్వహించడం ద్వారా కేసీఆర్ పై బాణాలు సందించింది. కాంగ్రెస్ నేతలు, ప్రతిపక్షాలు, ఎర్రగడ్డ ఆసుపత్రి ఉద్యోగులు అందరూ కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేస్తున్న ప్రకటనలు, నిరసన ర్యాలీల గురించి వార్తలు ప్రచురిస్తోంది. ఇదంతా చూస్తుంటే వైకాపా తెరాసకు దూరం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. కానీ బహుశః జి.హెచ్.యం.సి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే పనిగట్టుకొని కేసీఆర్ మరియు ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోందేమో? ఆవిధంగా హైదరాబాద్ జంట నగరాలలో స్థిరపడిన ఆంద్రప్రజలను ఆకట్టుకోవచ్చని భావిస్తోందేమో? అని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు.

మోడీ విదేశీ విధానం సత్ఫలితాలు ఇస్తున్నట్లే ఉంది

  ఇంతకు ముందు శ్రీలంక అధ్యక్షుడిగా ఉన్న మహేంద్ర రాజపక్స చిరకాలంగా ఆ దేశానికి పెద్ద సమస్యగా తయారయిన యల్.టి.టి. ఉగ్రవాదుల సమస్యను పరిష్కరించారు. కానీ ఉగ్రవాదులను మట్టుబెట్టే ప్రయత్నంలో నిర్వహించిన మిలటరీ ఆపరేషన్ లో వేలాదిమంది అమాయకులయిన తమిళ మహిళలు, వృద్ధులు, చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుండే తమిళనాడులో ప్రజలు, రాజకీయ పార్టీలు కూడా రాజపక్సేని తీవ్రంగా వ్యతిరేకించేవి. ఆయన ప్రతీ ఏడాది విధిగా తిరుపతి వెంకన్న దర్శనానికి వస్తుండటం, ఆయన వచ్చినప్పుడు తమిళ పార్టీలు నిరసనలు తెలపడం ఆనవాయితీగా మారిపోయింది.   ఆయన తమిళ ప్రజలకే కాక భారతః ప్రభుత్వానికీ పెను సవాలుగా మారారు. భారత్-శ్రీలంక మధ్య సముద్రజలాలలో చేపలు పట్టుకొనే తమిళ జాలారులని తరచూ అరెస్ట్ చేసి జైల్లో పడేస్తుండటం, దానిపై తమిళ పార్టీలు నిరసనలు తెలపడం, ఆనక భారత్, శ్రీలంక ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి విడిపించుకోవడం కూడా ఆనవాయితీగా మారిపోయింది. ఇక వీటన్నిటి కంటే మరింత తీవ్రమయిన విషయం ఏమిటంటే రాజపక్సే చైనాకు దగ్గరవుతూ దానిని మంచి చేసుకొనే ప్రయత్నాలలో భారత్ అభ్యంతరాలను త్రోసిపుచ్చి చైనాకు చెందిన రెండు అణుజలాంతర్గాములను శ్రీలంక పోర్టులో నిలిపి ఉంచేందుకు అనుమతించారు.   కానీ ఇప్పుడు మైత్రీపాల నేతృత్వంలో భారత్-శ్రీలంకల మధ్య మళ్ళీ మైత్రీ బంధాలు పునరుద్దరించబడినట్లయితే, బహుశః చైనా తన రెండు అణుజలాంతర్గాములను వెనక్కి తీసుకోవలసిందిగా ఆ దేశాన్ని శ్రీలంక కోరవచ్చును. కనుక ఈ పరిణామాలు చైనాకు చాలా ఆగ్రహం కలిగించవచ్చును. కానీ భారత్ చైనాతో సహా అన్ని దేశాలతో మిత్రత్వమే తప్ప శత్రుత్వం కోరుకోదనే విషయం చైనాకు కూడా తెలుసు. అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా భారత్ పర్యటన ముగిసిన వెంటనే భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చైనా పర్యటనకు బయలుదేరడమే అందుకు ఒక ప్రత్యక్ష ఉదారణ.   త్వరలోనే ప్రధాని మోడీ కూడా చైనా పర్యటనకు వెళ్ళబోతున్నారు. ఆయన పర్యటనలో భారత్-చైనా దేశాల మధ్య చిరకాలంగా ఉన్న సరిహద్దు వివాదాలను శాశ్విత ప్రాతిపాదికన పరిష్కారం చేయాలని భావిస్తున్నారు. ఆ ప్రయత్నాలలో భాగంగానే ప్రస్తుతం సుష్మా స్వరాజ్ చైనాలో పర్యటిస్తున్నారు.అంతకంటే ముందుగా ఆయన శ్రీలంకలో పర్యటిస్తారు. ఆ సందర్భంగా ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపడే విధంగా అడుగులు వేయవచ్చును. ఈ విధంగా ఒకే సమయంలో అటు అమెరికాతో, దానిని వ్యతిరేకించే చైనాతో, చైనా వ్యతిరేకించే జపాన్ దేశంతో, చైనాకు దగ్గరయిన శ్రీలంకతో సత్సబందాలు నెలకొల్పుకొనే ప్రయత్నాలు చేయడం హర్షణీయం.      

నటి త్రిషకు కాబోయే భర్తకు బెదిరింపు కాల్స్

  ప్రముఖ సినీనటి త్రిషకు కాబోయే భర్త వరుణ్‌మణియన్‌ తనకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లు చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ చెన్నైలోని తేనాంపేటలో గల పోలీసుస్టేషన్‌లో నిన్న ఫిర్యాదు చేశారు. ఐపీఎల్ క్రికెట్ పోటీలో చెన్నై సూపర్‌కింగ్స్ ఫ్రాంచైజ్ ను తీసుకోమని త్రిష కోరినట్లు మీడియాలో ప్రచారం జరిగింది కానీ అవన్నీ ఒట్టి ఊహాగానలేనని కొట్టిపడేశారు. ఒకవేళ ఆయన అటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే చంపేస్తామని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ ద్వారా ఆయనను బెదిరించడంతో ఆయన పోలీసులను ఆశ్రయించవలసి వచ్చింది. సినీ తారలు రాజకీయాలు, క్రికెట్ రంగాలపై మోజు పెంచుకొని వాటిలో ప్రవేశించడం చాలా రోజులుగా జరుగుతూనే ఉంది. ఇక ఐ.పి.యల్. సంగతి చెప్పనే అక్కరలేదు. అనేకమంది బాలివుడ్ నటీనటులు, రాజకీయనాయకులు అందులో పెట్టుబడులు పెట్టడం ద్వారా పేరుకి పేరు డబ్బుకి డబ్బు ఆర్జించాలని ఆరాటపడుతున్నారు.   నిప్పు లేనిదే పొగ రాదన్నట్లు సినీ, వ్యాపార రంగాల నేపద్యం నుండి వచ్చిన త్రిష, వరుణ్‌మణియన్‌ కూడా ఐ.పి.యల్. మోజు పెంచుకొని ఉండి ఉంటే ఆశ్చర్యమూ లేదు. అది నేరమూ కాదు. కానీ ఐ.పి.యల్. ఫ్రాంచైజ్ కొనేందుకు ప్రయత్నిస్తే చంపేస్తామని బెదిరింపులు రావడమే ఆశ్చర్యంగా ఉంది. దానిని బట్టి ఐ.పి.యల్. వ్యాపారం ఎంత పెద్ద ఎత్తున జరుగుతోందో? దానికి ఎంత పోటీ ఉందో అర్ధమవుతోంది. ప్రజలను రంజింపజేయడానికి సృష్టించిన ఐ.పి.యల్. క్రికెట్ పోటీలలో ఇటువంటి అనారోగ్యకరమయిన ఆలోచనలు, ప్రయత్నాలు ఇప్పటికే చాలా జరగడంతో క్రమంగా దాని ప్రతిష్ట మసకబారుతోంది. ఇప్పుడు అది ఒకరినొకరు చంపుకోనేంత వరకు వెళ్లిందంటే అది ఎంత దిగజారిపోయిందో, ఎంత వికృత స్థాయిలో జరుగుతోందో అర్ధమవుతోంది.

నరేంద్ర మోడీ ప్రచార స్టయిలే వేరు

  ఈరోజు డిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ మళ్ళీ తన మాటల మాయాజాలంతో డిల్లీ ప్రజలను కట్టిపడేశారు. ఒకవైపు వారిని తన మాటలతో ఆకట్టుకొంటూనే, తన ప్రభుత్వ పనితీరుపై విమర్శలు గుప్పిస్తూ మళ్ళీ తనతో కలిసి పనిచేస్తానని చెపుతున్న ఆమాద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ కి చురకలు వేసారు. మోడీ మార్క్ ప్రచారం అంటే ఎలా ఉంటుందో డిల్లీ ప్రజలకు మరొకమారు రుచి చూపించారు.   ముందుగా ఆమాద్మీ పార్టీ ఆయువు పట్టు మీదే దెబ్బ తీసారు. డిల్లీ ప్రజలు ఎంతో నమ్మకంతో ఆ పార్టీకి ఓటేస్తే, అరవింద్ కేజ్రీవాల్ కేవలం 49 రోజుల్లోనే పదవిలో నుండి దిగిపోయి ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ఆక్షేపించారు. కనుక ఈసారి డిల్లీ ప్రజలు ఆమాద్మీని దూరంపెట్టి సుస్థిరమయిన పాలన అందించగల బీజేపీకే ఓటువేసి గెలిపిస్తే, ఇంతకు ముందు కనీవినీ ఎరుగని విధంగా డిల్లీని అభివృద్ధి చేస్తూ ప్రజలకు మంచి పరిపాలన అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.   “డిల్లీ మన దేశానికి ముఖచిత్రం వంటిది. అటువంటి డిల్లీ గురించి, ప్రజల సమస్యల గురించి అన్నీ క్షుణ్ణంగా తెలిసిన కిరణ్ బేడీ వంటి మంచి సమర్దురాలయిన మహిళా పోలీస్ అధికారిణి చేతిలో డిల్లీని పెడితే ప్రజలు కూడా నిశ్చింతగా ఉండవచ్చని అన్నారు. ఆమాద్మీ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ, “ఉట్టికి ఎగురలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లుగా డిల్లీని పరిపాలించలేని ఆమాద్మీ పార్టీ, ఏకంగా దేశాన్నే ఏలేద్దామనుకొంది. కానీ డిపాజిట్లు కూడా దక్కించుకోలేక సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది.”   "మా పార్టీ నేతలు అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా పర్యటన విజయవంతం అయ్యిందని చెప్పుకొంటే దానిని ప్రతిపక్షాలు తప్పు పట్టాయి. ఒకవేళ ఆయన పర్యటనలో ఎక్కడయినా అపశ్రుతి జరిగితే, అప్పుడు ప్రతిపక్షాలు దానిని అందిపుచ్చుకొని ఎన్నికలలో లబ్ది పొందే ప్రయత్నం చేయవా? ఒకవేళ ఒబామా గణతంత్రదినోత్సవ వేడుకలలో పాల్గొని ఏ ఒప్పందాలు చేసుకోకుండా వెళ్ళిపోయినా ప్రతిపక్షాలు మా ప్రభుత్వాన్ని విమర్శించకుండా వదిలిపెడతాయా?" అని ఆయన నిలదీశారు.   తనతో భుజం భుజం కలిపి కలిపి పనిచేయగల బీజేపీకి ఓటువేసి గెలిపించినట్లయితే కేంద్రం, డిల్లీ ప్రభుత్వం రెంటి మధ్య మంచి సయోధ్య ఉంటుంది కనుక, చక్కగా పనిచేస్తూ డిల్లీని మరింత అభివృద్ధి చేయగలమని ఆయన చెప్పారు. ఆమాద్మీ పార్టీ తన పరిధిలో లేని అంశాలయిన భూసేకరణ చట్టాలను మార్పు, డిల్లీకి రాష్ట్ర హోదా వంటివి అనేక హామీలు ఇస్తోంది. ఆ సంగతి విద్యావంతులయిన ప్రజలకు తెలుసు. కానీ డిల్లీ మురికివాడలలో నివసించే ప్రజలకు తెలియదు. ఆమాద్మీ పార్టీ ఇస్తున్న ఆచరణ సాధ్యం కాని హామీలను నమ్మి మళ్ళీ మోసపోవద్దని డిల్లీ ప్రజలకు మోడీ హితవు పలికారు. ఒకవేళ ఆయన ఎన్నికల ప్రచారానికి మరింత సమయం కేటాయించగలిగి ఉండి ఉంటే, బహుశః బీజేపీకి భారీ మెజార్టీ సాధించి పెట్టేవారేమో?

మాజీ పోలీస్ ఆఫీసర్ అధికారిణికి కూడా అది తప్పదా?

  డిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశకి చేరుకొంటున్నకొద్దీ ప్రధానంగా పోటీ పడుతున్న బీజేపీ, ఆమాద్మీ పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రం అవుతోంది. మాజీ ఐ.పి.యస్. అధికారిణి, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి అయిన కిరణ్ బేడి ఈరోజు ఆమాద్మీ పార్టీకి చెందిన కుమార్ విశ్వాస్ కొన్ని అసభ్యమయిన మాటలన్నాడంటూ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు.   కానీ తన చుట్టూ పదిమంది మీడియావాళ్ళు, ఎన్నికల సంఘానికి చెందిన ఒక అధికారి ఉండగా తాను అసభ్యంగా మాట్లాడనని పిర్యాదు చేయడం కేవలం తనపై బురద జల్లడానికేనని, ఆమె తన ఆరోపణలను రుజువు చేసినట్లయితే తాను రాజకీయ సన్యాసం చేస్తానని ప్రతిసవాలు విసిరారు. కనుక ఇప్పుడు బంతి ఆమె కోర్టులోనే ఉన్నట్లు భావించవలసి ఉంటుంది. ఒకవేళ ఆమె తన ఆరోపణలను రుజువు చేయగలిగినట్లయితే ఆమాద్మీ పార్టీకి గట్టి ఎదురు దెబ్బే తగులుతుంది.