అమరావతికి బ్యాంకులు, వ్యాపార సంస్థలు క్యూ

  ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం రాష్ట్ర ప్రభుత్వం రచిస్తున్న భారీ ప్రణాళికలు చూసి అప్పుడే బ్యాంకులు, పెద్దపెద్ద ప్రభుత్వ సంస్థలు, దేశ విదేశీ వ్యాపార సంస్థలు, పరిశ్రమలు రాజధానిలో తమ కార్యాలయాలను స్థాపించుకొనేందుకు తగిన స్థలం కేటాయించామంటూ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకొంటున్నాయి. వాటిలో నాబార్డ్ (ద నేషనల్ బ్యాంక్ ఆఫ్ అగ్రికల్చర్ యండ్ రూరల్ డెవలప్మెంట్), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా మరో అరడజను బ్యాంకులు ఉన్నాయి.   ఇక రాజధాని అమరావతిలో రూ.600 కోట్ల వ్యయంతో దాదాపు 5లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన భవనంలో టైర్-4 డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతున్నారు. ప్రత్యేకంగా దీనికోసమే 60 మెగావాట్స్ విద్యుత్ సబ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న నబార్డ్ ప్రాంతీయ ప్రధాన కార్యాలయాన్ని తాము అమరావతికి తరలించాలనుకొంటున్నామని, అందుకోసం రాజధానిలో తగినంత స్థలం కేటాయించవలసిందిగా తాము చేసిన విజ్ఞప్తికి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని నబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ జీజి మమ్మేన్ తెలిపారు.   అదేవిధంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 900 శాఖలు, తెలంగాణా రాష్ట్రంలో 433 శాఖలు గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తమ ప్రధాన కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లుగా బ్యాంక్ (ఏపీ) చీఫ్ జనరల్ మేనేజర్ సి.ఆర్. శశికుమార్ తెలిపారు.   ఇవి కాక చిత్తూరులో శ్రీ సిటీ, నెల్లూరులో కృష్ణ పట్నం వద్ద నెలకొల్పిన లేదా నెలకొల్పబడుతున్న పరిశ్రమలు, రాష్ట్రంలో వివిద ప్రాంతాలలో ఏర్పాటవుతున్న వ్యాపార సంస్థలు, ఐటీ కంపెనీలు కూడా ఇంకా రాజధానికి శంఖుస్థాపన కూడా చేయకముందే తమ ప్రధాన కార్యాలయాలను రాజధాని అమరావతిలోనే ఏర్పాటు చేసుకొనేందుకు తగిన స్థలం కేటాయించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఆంద్రప్రదేశ్ రాజధాని గురించి ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని అక్షేపిస్తున్నప్పటికీ, పెద్దపెద్ద సంస్థలు మాత్రం దాని వలన రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి జరగబోతోందని పసిగట్టినందునే త్వరలో నిర్మించబోయే రాజధానిలో తమ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడానికి తొందరపడుతున్నాయని అర్ధమవుతోంది.

తొమ్మిది నెలలలోనే చంద్రబాబుకి దేశ ప్రజల గుర్తింపు

  ఆమాద్మీ పార్టీ ప్రస్తుతం ఎంత సంక్షోభం ఎదుర్కొంటున్నా ఆ పార్టీ అధినేత మరియు డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ యొక్క పాపులారిటీ గ్రాఫ్ ఏ మాత్రం తగ్గలేదు పైగా ఆయనే ఇప్పుడు దేశంలో ‘మోస్ట్ పాపులర్ ముఖ్యమంత్రి’ గా గుర్తింపు పొందగలిగారు. ప్రసిద్ద ఇంగ్లీషు పత్రిక ఇండియా టుడే మరియు సిసిరో సంస్థలు రెండూ కలిసి దేశంలో బాగా గుర్తింపు పొందిన ముఖ్యమంత్రులను తెలుసుకొనేందుకు ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ అనే ఒక సర్వే నిర్వహించాయి. అందులో అరవింద్ కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా 16 శాతం (డిల్లీలో 55 శాతం) ఓట్లు సాధించి నెంబర్ వన్ స్థానంలో నిలిచారు. ఆ తరువాత వరుసగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ 8 శాతం ఓట్లతో రెండవ స్థానంలో, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 6శాతం ఓట్లతో మూడవ స్థానంలో నిలిచారు. పశ్చిమ బెంగాల్, ఓడిషా ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ వరుసగా 4,5వ స్థానంలో నిలిచారు.   డిల్లీ ఎన్నికలలో జాతీయపార్టీలయినా కాంగ్రెస్, బీజేపీలను ఎదుర్కొని ఆమాద్మీ పార్టీకి అఖండమయిన విజయం సాధించిపెట్టిన అరవింద్ కేజ్రీవాల్ దేశప్రజల దృష్టిని ఆకర్షించడంలో పెద్ద వింతేమీ లేదు. కానీ పదేళ్ళపాటు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు, మళ్ళీ అధికారం చేప్పట్టిన 9నెలలలోనే దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షించగలగడం విశేషం. రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన అధికారం చెప్పట్టారు. కానీ ఈ తొమ్మిది నెలల కాలంలోనే రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన చేస్తున్న విశేష కృషి, తత్ఫలితంగా రాష్ట్రంలో క్రమంగా వస్తున్న మార్పుల కారణంగానే ఆయన దేశ ప్రజల దృష్టిని ఆకర్షించగలిగారని భావించవచ్చును. ఆయన అనుకొన్నట్లుగా రాష్ట్రానికి ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేసి, రాష్ట్రంలో ఉన్నత విద్యాసంస్థలు, మెట్రో రైల్ ఏర్పాటు, పారిశ్రామికాభివృద్ధి చేసి చూపినట్లయితే దేశంలో ఆయనే నెంబర్ వన్ స్థానం ఆక్రమించినా ఆశ్చర్యం లేదు.

హైకోర్టు విభజనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభ్యంతరమా?

  ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుని విభజించేందుకు తెలంగాణా ప్రభుత్వం, కేంద్రప్రభుత్వం, సుప్రీంకోర్టు సంసిద్దత వ్యక్తం చేసాయి. ఉమ్మడి హైకోర్టులో ప్రస్తుతం 49మంది న్యాయమూర్తులు ఉండగా వారిని ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలకు 60:40 నిష్పత్తిలో పంచేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా వారిలో ఎవరు ఏ రాష్ట్ర హైకోర్టులో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారనే వివరాలు కూడా సేకరించారు.   ప్రస్తుతం ఉన్న హైకోర్టు హైదరాబాద్ లో ఉంది కనుక అది తెలంగాణా రాష్ట్రానికే చెందుతుందనే ఉద్దేశ్యంతో రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే కొత్తగా హైకోర్టు ఏర్పాటు చేయాలని పేర్కొనబడింది. కనుక తెలంగాణా రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు చేయడం అంటే విభజన చట్టాన్ని ఉల్లంఘించడమేనని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. దానితో ఉమ్మడి హైకోర్టుని విడదీసి తెలంగాణా రాష్ట్రానికి కొత్తగా హైకోర్టు ఏర్పాటు చేద్దామనే తెలంగాణా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది.   ఈ సమస్యను వేరే విధంగా పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో, ఇంతకు ముందు తెలంగాణా హైకోర్టు కోసం కేటాయిద్ధామనుకొన్న భవనాన్ని ఆంధ్రా హైకోర్టుకోసం కేటాయించడానికి తెలంగాణా ప్రభుత్వం సంసిద్ధమయింది. కానీ అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిన్న మెలిక పెట్టింది. హైకోర్టు విభజనకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని కానీ తుళ్ళూరు వద్ద నిర్మించబోయే రాజధాని కోసం తమ ప్రభుత్వం ఇప్పటికే 30వేల ఎకరాల భూసేకరణ చేసి ఉన్నందున అక్కడ హైకోర్టు కోసం భవనం నిర్మించుకొన్నాక నేరుగా అక్కడికే తరలిపోవాలనుకొంటున్నట్లు తెలిపింది. అంటే తెలంగాణా ప్రభుత్వం ఇవ్వదలచుకొన్న భవనంలోకి మారేదిలేదని చెప్పకనే చెప్పినట్లయింది.   కనుక ఉమ్మడి హైకోర్టు నుండి ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టును విడదీస్తే తప్ప తెలంగాణా రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పడే అవకాశం కనబడటం లేదు. కానీ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అందుకు ససేమిరా అంటోంది. తెలంగాణా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు చేసుకొనేందుకు హైదరాబాద్ లో వేరే భవనం కేటాయించేందుకు సంసిద్ధంగా ఉంది. ఒకవేళ ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వానికి అది కూడా ఇష్టం లేకపోతే, ప్రస్తుతం ఉన్న భవనంలోనే రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా హైకోర్టులు ఏర్పాటు చేసుకొందామని తెలంగాణా రాష్ట్ర అడ్వకేట్ జనరల రామకృష్ణ రెడ్డి ప్రతిపాదించారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఆ మూడు ప్రతిపాదనలకు అంగీకరించలేదు.   రాష్ట్రాలు విడిపోయిన తరువాత నేడు కాకపోతే రేపయినా హైకోర్టులు కూడా విడివిడిగా ఏర్పాటుచేసుకోక తప్పదు. అటువంటప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు విభజనకు ఎందుకు అభ్యంతరం చెపుతోందో తెలియదు గానీ మళ్ళీ ఈ అంశంపై కూడా ఇరు రాష్ట్రాల మధ్య కొత్త తగాదా మొదలయ్యే అవకాశం ఉంది.ఇప్పటికే రెండు రాష్ట్రప్రభుత్వాలు అనేక అంశాలతో కుస్తీపట్లు పడుతున్నాయి. అటువంటప్పుడు మళ్ళీ మరో కొత్త సమస్యని సృష్టించుకోవడం వలన ప్రజల మధ్య, ప్రభుత్వాల మధ్య మరింత దూరం పెరుతుంది.

రాహుల్ గాంధీ అదృశ్యం... ఊహాగానాలు...

  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కుమారుడు, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, గిట్టనివాళ్ళు ‘మొద్దబ్బాయి’ అని పిలిచే వ్యక్తి, ఈ దేశానికి ప్రధానమంత్రి అవ్వాలని బోలెడన్ని ఆశలు పెట్టుకుని చివరికి విఫలమైన వ్యక్తి... ఇంకెవరూ.. రాహుల్ గాంధీ. ఈయన గారు ఈమధ్య పార్లమెంట్ సమావేశాలకు కూడా హాజరు కాకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. మీ అమ్మాయి ఎక్కడికెళ్ళాడని వాళ్ళ అమ్మని అడిగితే ఆమె ఎక్కడికి వెళ్ళాడో చెప్పకుండా ప్రస్తుతం లీవులో వున్నాడని మాత్రమే చెప్పింది. ఆ తర్వాత మొన్నీమధ్య లీవ్ ఎక్స్‌టెండ్ చేశాడని వివరించింది. అయితే ఇంతకీ రాహుల్ గాంధీ ఎక్కడకి వెళ్ళాడో, ఎందుకు వెళ్ళాడో మాత్రం ఎవరూ చెప్పడం లేదు. దాంతో దేశంలో రాహుల్‌గాంధీ అదృశ్యం కావడం మీద అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ ఊహాగానాల్లో కొన్ని... * రాహుల్ గాంధీ తన గర్ల్ ఫ్రెండ్‌తో కలసి షికార్లు కొట్టడానికి వెళ్ళాడు. * రాహుల్ గాంధీని ఆయన గర్ల్‌ఫ్రెండ్ విడిచిపెట్టి వెళ్ళిపోయింది.. అందుకే ఆమెని వెతకడానికి వెళ్ళాడు. * రాహుల్ గాంధీకి తన గర్ల్‌ఫ్రెండ్‌తో ఎప్పుడో పెళ్ళయిపోయింది. ప్రస్తుతం ఆమె ఏదో దేశంలో పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. రాహుల్ గాంధీ ప్రస్తుతం అక్కడే వున్నాడు. * రాహుల్ గాంధీ అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఎక్కడకి వెళ్ళాడో సోనియా గాంధీకి కూడా తెలియదు. * రాహుల్ గాంధీ తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. ఆయనకి ఇటలీలో చికిత్స జరుగుతోంది. * రాహుల్ గాంధీని చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. అందుకే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. * ప్రధానమంత్రి అవ్వాలనే కల చెదిరిపోయేసరికి రాహుల్ గాంధీకి మతిస్థిమితం తప్పింది. అందుకే ఎటో వెళ్ళిపోయాడు. * రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి గొడవ జరిగింది. అందుకే ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. * రాహుల్ గాంధీ పెళ్ళి చేసుకోకపోతే ఇంట్లో వుండటానికి వీల్లేదని సోనియాగాంధీ బయటకి తరిమేసింది. * రాహుల్ గాంధీ ఇంట్లోనే వున్నాడు. అందరూ చులకనగా చూస్తూ వుండేసరికి బయటకి రావడం లేదు.

సీబీఐకి ఏపీ ప్రజల లేఖ...

సీబీఐ అధికారులకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాసుకుంటున్న లేఖ. ఈమధ్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయింది. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా వెలుగుతూ వుండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేదరాష్ట్రంగా మిగిలింది. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆపదల నుంచి గట్టెంక్కించగల నాయకుడనే సంపూర్ణ నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి మేం అధికారం అప్పగించాం. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెంక్కించడానికి, రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడానికి నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఆయన శ్రమను చూస్తుంటే అతి కొద్దికాలంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందన్న నమ్మకం పెరుగుతోంది. ఇలాంటి శ్రామికుడికి అధికారం అప్పగించినందుకు మమ్మల్ని మేమే అభినందించుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మా రాష్ట్రంలోని ఒక వ్యక్తి తీరు మమ్మల్ని ఎంతో బాధిస్తోంది. ఆ బాధతోనే మేం మీకు ఈ లేఖ రాసుకుంటున్నాం. పేరు చెబితే ఏడిచి చస్తాడని మేం ఆ వ్యక్తి పేరు చెప్పడం లేదు. ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసు, అతనికి తెలుసు, దేశం మొత్తానికీ తెలుసు. ఇప్పటికీ ఆ వ్యక్తి ఎవరో కొంతమందికి తెలియకపోతే ఈ లేఖ మొత్తం చదివినతర్వాత వారికి కూడా ఆ వ్యక్తి ఎవరో స్పష్టంగా అర్థమైపోతుంది. రాష్ట్రాభివృద్ధి బాధ్యత ఆ వ్యక్తి భుజాల మీద కూడా వుంది. రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రితో సహకరించాల్సిన కనీస ధర్మం అతనికి వుండాలి. అయితే అతను సహకరించకపోగా సాధ్యమైనంత న్యూసెన్స్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. రైతుల రుణమాఫీకి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే, ఆ అంశం మీద నానా యాగీ చేశాడు. చివరకి ఫెయిలైపోయి నోరు మూసుకున్నాడు. ప్రపంచం అబ్బురపడే రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం భూ సమీకరణ చేస్తుంటే దానికి ఆ మహానుభావుడు ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేశాడో మాటల్లో చెప్పలేం. రాజధాని గ్రామాల్లో వాతావరణం ప్రశాంతంగా వుంటే కావాలని కొంతమంది రైతులను రెచ్చగొట్టడం, తన విష పుత్రికల్లో ఘోరంగా రాతలు రాయడం. కూతలు కూయడం. తన స్వార్థం కోసం కొంతమంది రైతుల్ని పావుల్లా వాడుకోవడం... ఇదే అతని పని. చివరికి రాజధాని రైతులు అతన్ని దూరంగా పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. రాజధాని విషయంలో ఫెయిల్ అయిపోయిన ఆ వ్యక్తి ఇప్పుడు పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల మీద న్యూసెన్స్ చేస్తున్నాడు. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణం జరగడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడటం ఆ గ్రహానికి ఎంతమాత్రం ఇష్టం లేనట్టుంది. అందుకే రకరకాల పావులు కదుపుతూ, ఇతర రాష్ట్రాల వారికి లేనిపోని ఐడియాలు ఇస్తూ నాశనం దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌కి చెందినవాడు కావడం మమ్మల్ని సిగ్గుపడేలా చేస్తోంది. ఇక అతను ఇక్కడ వుండటానికి ఎంతమాత్రం అనర్హుడు. అందుకే మీకు ఈ లేఖ రాస్తున్నాం. సాధ్యమైనంత త్వరగా అతన్ని ఓ ఇరవై, పాతికేళ్ళపాటు లోపల వేసే విధంగా చర్యలు తీసుకోండి. ప్లీజ్... అతను బయటే వుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇక బాగుపడినట్టే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఆ ఒక్కడు చాలు. అందుకే నాలుగు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలంటే ఆ ఒక్కడు లోపల వుండాలి. అది మీ చేతుల్లోనే వుంది. అంచేత సీబీఐ అధికారులూ... కాస్త ఆయన సంగతి త్వరగా తేల్చండి.. మా తెలుగు ప్రజలందరూ మీకు రుణపడి వుంటారు.

మిత్రధర్మం అంటే ఇదేనా వీర్రాజుగారు?

  బీజేపీ నేత సోము వీర్రాజు నిన్న డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తాము మిత్రధర్మం పాటిస్తున్నప్పటికీ, తెదేపా నేతలు మాత్రం తమ పార్టీపై, మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. గత తొమ్మిది నెలలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూనే ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. నేటికీ ప్రత్యేక హోదా పరిశీలనలోనే ఉంది. రైల్వే జోన్ ఇంకా మంజూరు కావలసి ఉంది. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు ఎన్నడూ పరుషంగా మాట్లాడలేదు. తన పార్టీ నేతలను, మంత్రులను కూడా మాట్లాడనీయలేదు.   కేంద్రబడ్జెట్ లో రాష్ట్రానికి ఎటువంటి నిధులు కేటాయించకపోయినప్పటికీ ఆయన తొందరపడి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించలేదు. కానీ తెదేపా ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ రాష్ట్రానికి నిధులు సాధించలేకపోయిందని రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఆయనను విమర్శించడం మొదలుపెట్టి ఆయనను ప్రజల దృష్టిలో దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఆయన తప్పనిసరిగా నోరువిప్పవలసి వచ్చింది. కానీ ఆ తరువాత మళ్ళీ తన పార్టీ నేతలెవరూ బీజేపీకి, కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండేలా ఆయన చాలా కట్టడి చేసారు. ఆ విషయం బీజేపీ నేతలకి కూడా తెలుసు.   కేంద్రప్రభుత్వంతో తనకున్న అవసరాలవల్లనయితేనేమి లేదా మిత్రధర్మంవల్లనయితేనేమి చంద్రబాబు నాయుడు తన పార్టీ నేతలని అదుపు చేస్తున్నారు. అయినప్పటికీ తెదేపా మిత్రధర్మం పాటించడం లేదని సోము వీర్రాజు ఆరోపించడం హాస్యాస్పదం. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ ఇరువురూ కూడా తమ మిత్ర పక్షమయిన తెదేపా, దాని అధినేత చంద్రబాబు నాయుడుకి రాజకీయ శత్రువయిన జగన్మోహన్ రెడ్డికి అడిగిన వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా, ఆయన చంద్రబాబు నాయుడుపై పిర్యాదులు చేస్తుంటే వారు చాలా ఆసక్తిగా వినడాన్ని ఏవిధంగా భావించాలి? మిత్రధర్మం అంటే ఇదేనా?

రాజధానికి వెళ్లేందుకు ప్రవేశపన్ను చెల్లించక తప్పదా?

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణాలోకి ప్రవేశించే ఆంధ్రాకు చెందిన వాహనాలపై రేపటి నుండి తెలంగాణా ప్రభుత్వం ప్రవేశ పన్ను వసూలు చేయబోతోంది. అందుకు ఒక జీ.ఓ. కూడా జారీ చేసింది. గతేడాది కూడా ఇదే విధమయిన జీ.ఓ. జారీ చేసినప్పుడు హైకోర్టు తీవ్రంగా మందలించడంతో ప్రభుత్వం దానిని వెనక్కు తీసుకోక తప్పలేదు. కానీ హైకోర్టు విధించిన గడువు మార్చి 31వ తేదీతో ముగుస్తుంది గనుక రేపటి నుండి ఆంధ్రా నుండి రాష్ట్రంలోకి ప్రవేశించే అన్ని రకాల వాహానాలపై ప్రవేశపన్ను వసూలు చేసేందుకు తెలంగాణా రవాణాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. సహజంగానే ఆ నిర్ణయాన్ని ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సరుకు రవాణా మరియు ప్రైవేట్ బస్సుల యజమానులు తప్పు పడుతున్నారు. తెలంగాణా ప్రభుత్వం తన నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని గట్టిగా కోరుతున్నారు. ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాల మధ్య ముఖ్యంగా ఆంధ్రాలో వివిధ జిల్లాలనుండి హైదరాబాద్ కి రోజుకి దాదాపు 800 ప్రైవేట్ బస్సులు నడుస్తున్నాయి. తెలంగాణా ప్రభుత్వం నిర్ణయాన్ని నిరసిస్తూ ప్రైవేట్ ట్రావల్స్ సంస్థలు ఈరోజు అర్ధరాత్రి నుండి ఆ బసులన్నిటినీ నిలిపివేయాలని నిర్ణయించుకొన్నాయి. ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలకు మరో పదేళ్ళపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటున్నప్పుడు, తమ రాష్ట్ర రాజధానిలో ప్రవేశించడానికి తామెందుకు ప్రవేశపన్నుచెల్లించాలని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర వాహన యజమానుల సంఘాలు ప్రశ్నిస్తున్నారు. అందువలన కనీసం మరో ఐదేళ్ళపాటు తమకు ప్రవేశపన్ను నుండి మినహాయింపునివ్వాలని వారు కోరుతున్నారు.   కానీ రాష్ట్ర విభజన జరిగి రెండు ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడిన తరువాత కూడా ఇంకా ఇటువంటి వితండవాదనలు చేయడాన్ని తెలంగాణా ప్రభుత్వం తప్పు పడుతోంది. ఈ తొమ్మిది నెలలలో తమ ప్రభుత్వం భారీగా పన్ను నష్టపోయిందని, ఇంకా నష్టపోయెందుకు అంగీకరించబోమని తెలంగాణా ప్రభుత్వం తెగేసి చెపుతోంది. రేపటి నుండి రాష్ట్రంలోకి ప్రవేశించే అన్ని ఇతర రాష్ట్రాల వాహనాలపై పన్ను విదిస్తున్నట్లే ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాహనాలపై కూడా పన్ను విధిస్తామని తెలంగాణా ప్రభుత్వం తేల్చి చెప్పింది. కనుక నేడో రేపో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలంగాణాకు చెందిన వాహనాలపై ప్రవేశపన్ను విధించినా ఆశ్చర్యం లేదు. ఈ సమస్యతో తమకు ఏమీ సంబంధం లేదని ఇరు రాష్ట్రాల ప్రజలు భావించవచ్చును. కానీ వాహనదారులు తమపై పడే ఈ అదనపు భారాన్ని ప్రజలకే బదలాయించడం తధ్యం. కనుక అంతిమంగా నష్టపోయేది ప్రజలే. అటు తెలంగాణా ప్రభుత్వ వాదనలు, ఇటు వాహన యజమానుల వాదనలు రెండూ సమంజసంగానే ఉన్నాయి గనుక ఈ సమస్యను మళ్ళీ కోర్టులే పరిష్కరించవలసి ఉంటుందేమో?

జగన్ ఢిల్లీ టూర్ వెనుక సీక్రెట్టేంటి?

  వైసీపీ అధినేత జగన్ అర్జెంటుగా ఢిల్లీ టూరు పెట్టుకున్నారు. ఇంత అర్జెంటుగా ఢిల్లీ టూర్ ఎందుకయ్యా అంటే, ఢిల్లీకి వెళ్ళి, ప్రధాని నరేంద్రమోడీని కలిసి, పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాల్సిందిగా కోరబోతున్నానని చెబుతున్నారు. ఇంతకాలం ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధికి ఆటంకంగా నిలిచిన జగన్ రాత్రికి రాత్రే మారిపోయి ఇలా రాష్ట్రానికి పనికొచ్చే పని చేయబోతున్నాడేంటా అని కొంతమందికి సందేహం రావడం సహజం. మరికొంతమంది అమాయకులకైతే పోలవరం నిధుల కోసం ప్రధానిని కలుస్తున్న జగన్ సారు ఎంత మంచోడో అని అనిపిస్తుంది. అయితే జగన్ ఢిల్లీ టూర్ వెనుక అసలు సీక్రెట్ వేరే వుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.   జగన్ ఢిల్లీ వెళ్ళడం, ప్రధానిని కలవటం, పోలవరం కోసం నిధులు అడగటం... యాజ్‌టీజ్ ఇలాగే జరిగితే అది రొటీన్. జగన్ ఢిల్లీకి వెళ్ళడం, ప్రధానిని కలవటం, తాను జైల్లో పడకుండా సహకరిస్తే, ఏపీలో బీజేపీ బలపడటానికి ఏం చేయాలో అది చేస్తానని నరేంద్రమోడీకి చెప్పి, ఒప్పించడం... ఇదీ జగన్ టూర్ వెనుక వున్న అసలు ప్లాన్ అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలను చూస్తే జగన్ త్వరలో జైల్లోకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. నిన్నగాక మొన్నే మరికొన్ని వందల కోట్ల జగన్ సంబంధీకుల ఆస్తులను ఇ.డి. జప్తు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ జనతాపార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో ‘బంపర్ ఆఫర్’ ఇవ్వడం ద్వారా తనకు మరోసారి జైలుయోగం పట్టకుండా చేసుకోవాలన్నది జగన్ ప్లాన్ అని పరిశీకులు చెబుతున్నారు.   బీజేపీ తెలంగాణలో పుంజుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో భాగస్వామిగా వుంది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎదగాలని భావిస్తోంది. అందుకే ఏపీలోని కొంతమంది బీజేపీ నాయకులు జగన్ పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నారు. కొన్ని కొన్ని సందర్భాలలో జగన్‌ని ప్రేమగా లాలిస్తున్నారు. జగన్ అసెంబ్లీకి రానని మొండికేస్తే ఆయన్ని లాలించి, బుజ్జగించిన బీజేపీ నాయకులు ఆయన తిరిగి అసెంబ్లీకి వచ్చేలా చేశారు. స్పీకర్ మీద జగన్ పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకునేలా చేసి, స్పీకర్‌కి సారీ చెప్పించిన బృహత్కార్యం వెనుక వున్నది బీజేపీ ఎమ్మెల్యేలన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా దినదిన ప్రవర్ధమానమైన వైసీపీ - బీజేపీ దోస్తీ ఇప్పుడు జగన్ ఢిల్లీకి వెళ్ళి ప్రధాని నరేంద్రమోడీని కలిసే ప్రయత్నం చేయడం వరకూ వెళ్ళింది. ఈ కలయిక కోసం పోలవరం ప్రాజెక్టుని ఉపయోగించుకుంటున్న జగన్ తెలివితేటలకి హేట్సాఫ్. మరి వైసీపీ, బీజేపీల మధ్య ఈ ఇన్‌స్టెంట్ స్నేహం భవిష్యత్తులో మరెన్ని మలుపులు తిరుగుతుందో, ఈ స్నేహం కారణంగా ఏపీ రాజకీయాల్లో మరెన్ని వింతలు చూస్తామో...

రాహుల్ బాబు వచ్చేస్తున్నాడు కాసుకోండి

  రాజకీయాలలో ఉన్నవాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళడం అంటే ఆత్మహత్యతో సమానంగా భావిస్తారు. అందుకే వారు నిత్యం ఏదో ఒక అంశం దొరకబుచ్చుకొని మీడియాముందుకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడుతూ జనాలు తమని మరిచిపోకుండా జాగ్రత్తపడుతుంటారు. కానీ దేశానికి ప్రధానమంత్రి అవుదామనుకొన్న రాహుల్ గాంధీ, కనీసం తన స్వంత పార్టీ మీద కూడా పట్టు సాధించలేకపోవడంతో, పార్టీ మీద అలిగి ఎక్కడికో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కీలకమయిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆయన ఈవిధంగా మాయమయిపోవడంతో మీడియా ప్రశ్నలకు, ప్రతిపక్షాల వెక్కిరింతలకు సమాధానం చెప్పుకోలేక కాంగ్రెస్ నేతలు సతమతమవుతున్నారు. కానీ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మాత్రం ఇంతకాలంగా మీడియాను తప్పించుకొని తిరుగుతున్నప్పటికీ శనివారంనాడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పూరే దేవ్ బధే గ్రామానికి వెళ్లినప్పుడు ఆమె కూడా మీడియాకు దొరికిపోయారు.   ఆమెను చూడగానే మీడియావాళ్ళు అందరూ అడిగిన మొట్ట మొదటి ప్రశ్న ‘రాహుల్ గాంధీ ఎప్పుడు తిరిగివస్తారనే.’ కానీ ఆమె కూడా వారికి ఫలానా తేదీన తిరిగి వస్తాడని ఖచ్చితంగా చెప్పలేకపోయారు. త్వరలోనే తిరిగివచ్చి రాజకీయాలలో చురుకుగా పాల్గొంటాడని మాత్రమే చెప్పారు.   ఇంతకు ముందు ఆయన మరో రెండు, మూడు వారాలపాటు తన శలవు పొడిగించారని మీడియాలో వార్తలు వస్తే అప్పుడు కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం పెట్టి మరీ ఆ వార్తలను ఖండించారు. కానీ మూడు కాదు నాలుగు వారాలవుతున్నా ఆయన అయిపూ జాడా లేదు. కనీసం ఆమె కూడా తన కొడుకు అసలు ఈవిధంగా అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళిపోయాడో, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో, ఏమి చేస్తున్నాడో, మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తాడో చెప్పలేకపోవడం చూస్తుంటే రాహుల్ గాంధీ అజ్ఞాతంలో వెళ్ళడానికి చాలా బలమయిన కారణాలే ఉన్నట్లు అనుమానించవలసి వస్తోంది. ఎలాగూ రాహుల్ బాబు తిరిగి వచ్చేస్తున్నాడని రాజమాత ప్రకటించేశారు గనుక ఒకవేళ యువరాజవారు మళ్ళీ తన లీవ్ పొడిగించకుండా నిజంగా తిరిగి వచ్చేస్తే అప్పుడు ఆయన నోటితోనే ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు తెలుసుకోవచ్చును.

రచ్చ చేయనేల.. సారీ చెప్పనేల?

  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నానా రచ్చ చేయడమే కాకుండా గౌరవనీయమైన సభాపతి స్థానాన్ని కూడా అవమాన పరిచేవిధంగా వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించారు. గంటలు గంటలు సుదీర్ఘ ప్రసంగాలు చేస్తూనే తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ప్రతిపక్ష నాయకుడు జగన్ మొత్తుకోవడం ఏపీ ప్రజలు గమనించారు. అధికార పక్షం మీద లేనిపోని ఆరోపణలు, హద్దూ అదుపూ లేని విమర్శలు వ్యాఖ్యలు చేయడానికి వైసీపీ నాయకుడు జగన్, ఆయన అడుగు జాడల్లో నడిచే ఇతర సభ్యులు ఎంతమాత్రం వెనుకాడలేదు. వైసీపీ సభ్యురాలు రోజా అయితే కర్ణకఠోరమైన వ్యాఖ్యలతో తన పరువును తానే దిగజార్జుకున్నారు. అలాగే మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కినట్టుగా అంత అల్లరి చేసిన వైసీపీ చివరికి సభాపతి మీదే అన్యాయమైన ఆరోపణలు చేసింది. చివరికి ఆయన మీద అవిశ్వాస తీర్మానం కూడా పెట్టింది. అయితే, అయితే అసెంబ్లీలో వైసీపీ సభ్యుల అనుచిత ప్రవర్తన మీద సభాపతి చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తూ వుండటంలో ఎట్టకేలకు దారికొచ్చిన వైసీపీ నాయకుడు జగన్ సారీ చెప్పుకున్ని వివాదానికి ముగింపు పలికారు. ఇప్పుడు సారీ చెప్పకపోతే పరిస్థితి చెయ్యిదాటిపోయే ప్రమాదం వుందని గ్రహించిన జగన్ సారీ చెప్పి గండం నుంచి బయటపడ్డారు. .   అసెంబ్లీకి సంబంధించినంత వరకూ జగన్ సారీతో ఈ వివాదం ముగిసిపోయి వుండొచ్చు. కానీ జనం దృష్టిలోంచి మాత్రం ఈ గొడవంతా తొలిగిపోయే అవకాశం లేదు. ప్రస్తుతం ఏపీ ప్రజలు ఈ అంశం విషయంలో ‘‘రచ్చ చేయనేల.. సారీ చెప్పనేల’’ అనుకుంటున్నారు. అనవసరంగా అయిన దానికీ కానిదానికీ రచ్చ చేసి చివరికి సారీ చెప్పుకునే పరిస్థితిని వైసీపీ నాయకులు చేతులారా తెచ్చుకున్నారని అనుకుంటున్నారు. సారీ చెప్పిన తరువాత జగన్ మాట్లాడిన మాటలు విని జనం అవాక్కయిపోతున్నారు. సభాపతి మీద కోపంతోనో, ఆయన్ని పదవినుంచి దించేయాలనో జగన్ అండ్ కో అవిశ్వాస తీర్మానం పెట్టలేదట. ప్రజా సమస్యల ప్రభుత్వాన్ని నిలదీయాలనే ఉద్దేశంతోనే అవిశ్వాస తీర్మానం పెట్టారట. అవిశ్వాస తీర్మానం మీద జగన్ చెబుతున్న రీజన్ ఏమైనా అతికేట్టు వుందా? ఇలాంటి లేనిపోని రాద్ధాంతాలు చేయడమెందుకు, ఆ తర్వాత సారీ చెప్పడం ఎందుకు, విలువైన అసెంబ్లీ సమయాన్ని వృధా చేయడం ఎందుకు? అందుకే జగన్ తన వైఖరిని మార్చుకునే విషయాన్ని తీవ్రంగా ఆలోచించుకోవాలి.

సంస్థాగత నిర్మాణం లేనందునే ఓడిపోయాము: తుమ్మల

  ఇదివరకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు తెరాస పార్టీకి బలమయిన పునాది కానీ, సంస్థాగత నిర్మాణం గానీ లేదని,కేవలం తెలంగాణా సెంటిమెంటు మీద ఆధారపడే పార్టీ నడుస్తోందని అటువంటి పార్టీని ఎన్నికలలో ఓడించడానికి బలమయిన క్యాడర్ ఉన్న బీజేపీకి పెద్ద కష్టం కాదని అన్నారు. తమ పార్టీ గురించి ఆయన అంత చులకనగా మాట్లాడతానని కేసీఆర్ చాలా ఆగ్రహం వ్యక్తం చేసారు.   కానీ మొన్న జరిగిన యం.యల్సీ.ఎన్నికలలో తెరాస అభ్యర్ధి జి. దేవీ ప్రసాద రావు బీజేపీ అభ్యర్ధి రామచంద్రారావు చేతిలో ఓడిపోవడంతో ఆనాడు అమిత్ షా తెరాస గురించి చెప్పిన మాటలు నిజమని రుజువయింది. గమ్మత్తయిన విషయం ఏమిటంటే మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కూడా సరిగ్గా అదే అభిప్రాయం వ్యక్తం చేయడం. తమ పార్టీకి సంస్థాగత నిర్మాణం లేకపోవడం వలననే ఎన్నికలలో ఓడిపోయామని, కానీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో తమ సత్తా చూపిస్తామని ఆయన అన్నారు.   తమ పార్టీకి సంస్థాగత నిర్మాణం లేదని అంగీకరిస్తున్నప్పుడు ఆంద్ర ప్రజలు ఎక్కువగా నివసిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం తెరాస ఏవిధంగా విజయం సాధించగలదు? అక్కడ గెలవడం కష్టమని తెలుసు గనుకనే ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రేటర్ హైదరాబాద్ పై మంచి పట్టు ఉన్న తెదేపా యం.యల్యేలను పార్టీలోకి రప్పించుకొన్నారు. అందుకే హడావుడిగా వివిధ కులాలు, మతాలకు ప్రార్ధనా మందిరాలు వగైరా నిర్మించి ఇస్తున్నారు. ఇంకా చాలానే ఏర్పాట్లు చేసుకొంటున్నారు. తెరాసకి సంస్థాగత నిర్మాణం లేదని ప్రతిపక్షాలు కూడా గుర్తించగలిగినప్పుడే తెరాస అధిష్టానం అప్రమత్తమయ్యే బదులు తమ లోపాన్ని ఎట్టి చూపించిన వారిపై ఎదురు దాడి చేయడం వలన చివరికి నష్టపోయింది ఎవరు?

వైకాపా సభ్యులపై సస్పెన్షన్ వేటు తప్పదా?

  వైకాపాకి చెందిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై తెదేపా సభ్యురాలు అనిత ఇచ్చిన హక్కుల ఉల్లంఘన తీర్మానంపై ఈరోజు సభలో చర్చ జరిగినప్పుడు వైకాపా సభ్యులు అందరూ స్పీకర్ పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు క్షమాపణలు కోరారు. స్పీకర్ డా. కోడెల శివప్రసాద్ కూడా వారిని క్షమించినట్లు ప్రకటించారు. కానీ వారి అధినేత జగన్మోహన్ రెడ్డి తను బేషరతుగా క్షమాపణ చెప్పేందుకు సిద్దం అంటూనే గత చరిత్రలు చదవడం మొదలుపెట్టారు. ఆయన తీరు చూస్తే ఆయనలో ఎటువంటి పశ్చాతాపం కనబడటంలేదు, కేవలం తన యం.యల్యేలపై సస్పెన్షన్ వేటు పడుతుందనే భయంతోనే మాట్లాడుతున్నట్లుందని మంత్రి అచ్చెం నాయుడు ఆక్షేపించారు. మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ సభా హక్కుల ఉల్లంఘనపై ఇంకా చర్చ పూర్తవ్వలేదని, తామిచ్చిన నోటీసులను ఇంకా వెనక్కి తీసుకోలేదని అనడం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి తన తీరు మార్చుకోకుంటే బహుశః రేపు తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేస్తారేమో!

‘మా’ ఎన్నికలు.. డోకు...

  మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా జరుగుతున్న తంతును గమనిస్తున్న వారికి డోకు వచ్చే పరిస్థితులు తయారయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సినీ నటులందరూ కలసి ‘మా’ ఎన్నికల ప్రక్రియను ఒక కామెడీ ప్రహసనంగా మార్చేశారు. మాదంతా సినిమా కుటుంబం, మేమంతా ఒక్కటే అని చెప్పుకునే సినీ నటులు ఇప్పుడు ‘మా’ ఎన్నికల పుణ్యమా అంటూ మీడియాకు ఎక్కి పెద్ద పెద్ద డైలాగ్స్ చెబుతున్నారు. ఒకరినొకరు తిట్టిపోసుకుంటున్నారు. ఒక ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలకు ఏ స్థాయిలో రాజకీయాలు నడుస్తాయో, ఆ స్థాయి రాజకీయాలు నడుపుతూ నటులు తమ స్థాయిని తగ్గించుకుంటున్నారు.   అసలు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కి సంబంధించిన పదవుల్లో ఎవరు వున్నా సినిమా రంగంలో ఉన్న పేద నటీనటులను ఉద్ధరించేదేమీ లేదు. ఇంతవరకు అలాంటిదేమీ జరగలేదు కూడా. ఎవరు పదవుల్లో వున్నా ఆ పదవులు అడ్డు పెట్టుకుని ఇండస్ట్రీలో బిల్డప్పు ఇవ్వడం తప్ప ఆకలికి మాడుతున్న, అవకాశాలు లేక అల్లాడుతున్న నటులకు ఒరిగిందేమీ లేదు. గతంలో ఉన్నవాళ్ళు ఉద్ధరించిందేమీ లేదు.. కొత్తగా వచ్చేవాళ్ళు ఉద్ధరించడానికి అవకాశమూ లేదు. ‘మా’ అనేది చాలా తక్కువ విస్తృతి వున్న చాలా చిన్న సంస్థ. ఆ సంస్థలో అధికారం చెలాయించడానికి నటీనటులు పడుతున్న తంటాలు, ఒకరినొకరు తిట్టుకుంటున్న విధానం చూస్తే డోకొస్తోంది. రాజకీయ రంగంలో వున్నవారు పదవుల కోసం ఇలా తిట్టుకుంటే అది ఒక పద్ధతిగా వుంటుంది. మరి సినిమా వాళ్ళు కూడా రాజకీయ నాయకులంటే ఘోరంగా తిట్టుకుంటూ వుండటం చూడ్డానికి చాలా విచిత్రంగా వుంది. ఆ తిట్టుకోవడం కూడా సహజంగా నటనలో పండిపోయినవాళ్ళు కాబట్టి రకరకాల హావభావాలు ప్రదర్శిస్తూ తిట్టుకుంటూ తరిస్తున్నారు. సినిమాల్లో నటన సంగతేమోగానీ ఈ ఎలక్షన్ల సందర్భంగా వీళ్ళు ప్రదర్శిస్తున్న నటన చూస్తుంటే కళ్ళు తిరిగిపోతున్నాయి. ఎందుకూ పనికిరాని, జనాలకి ఎలాంటి సంబంధం లేని ఒక సంస్థకి ఎన్నికలు జరగడమేంటో... దానికోసం వీళ్ళు జుట్టు జుట్టు పట్టుకోవడమేంటో.. దానికి మీడియాలో భారీ కవరేజ్ ఏంటో... ఇప్పటి వరకు తెప్పించిన డోకు చాలు.. ఇక ఆపండయ్యా బాబు...

అయోమయంలో జగన్

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ అనుసరిస్తున్న వైఖరిని చూస్తుంటే అదేదో సినిమాలోని ‘‘రాను రానంటూనే చిన్నదీ.. రాములోరి గుడికొచ్చే చిన్నదీ’’ అనే పాటను పాడుకోవాలని అనిపిస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి, అంతకు రెండు రోజుల ముందు నుంచీ జగన్ వ్యవహరిస్తున్న తీరు చూసి రాజకీయ వర్గాలు మాత్రమే కాదు.. జనం కూడా ముక్కున వేలేసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు స్పీకర్ ఏర్పాటు చేసిన సమావేశంలో జగన్ మాట్లాడుతూ, తాను అసెంబ్లీలో అగ్లీగా బిహేవ్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆ తర్వాత తాను హెచ్చరించినట్టుగానే అగ్లీగా ప్రవర్తించారు. తమ నాయకుడే అగ్లీగా ప్రవర్తించినప్పుడు తాము అగ్లీగా ప్రవర్తిస్తే తప్పేం వుండదని అనుకున్నారేమోగానీ, రోజా తదితరులు మరీ అగ్లీగా ప్రవర్తించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన దళిత మహిళా ఎమ్మెల్యేని రోజా కించపరుస్తూ మాట్లాడిన తీరు చూసి జనాలు నోళ్ళు తెరిచారు. సినిమా తెరమీద లలితంగా కనిపించిన రోజా నోటి వెంట ఇలాంటి మాటలు వస్తున్నాయేంటని జనం అదిరిపోయారు. ఇదిలా వుంటే, బడ్జెట్ మీద చర్చ సందర్భంగా జగన్ గొడవ చేస్తూనే వున్నారు. కొందరు సభ్యులు సస్పెండ్ అయ్యాక జగన్ కూడా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆ తీర్మానం మీద చర్చ జరిగినప్పుడే అసెంబ్లీకి వస్తానని, అప్పటి వరకూ అసెంబ్లీలో అడుగు పెట్టనని భీషణ ప్రతిజ్ఞ చేశారు. ఆ తర్వాత మీడియాని పిలిచి రెండున్నర గంటలు మాట్లాడి బుర్రలు వేడెక్కేలా చేశారు.   జగన్ చేసిన భీషణ ప్రతిజ్ఞ ప్రజలకు ఆనందం కలిగించింది. జగన్ అసెంబ్లీకి వెళ్ళకుండా వుంటే అసెంబ్లీ కార్యక్రమాలు సజావుగా జరుగుతాయని, ప్రజా సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావనకు వస్తాయని, వాటికి పరిష్కారాలు దొరుకుతాయని అందరూ ఆశించారు. అసెంబ్లీలో ‘అగ్లీ’గా ప్రవర్తించేవారు లేకపోవడం అందరికీ సంతోషాన్ని కలిగించే విషయమే కదా.. అయితే ప్రజల ఆశల మీద నీళ్ళు చల్లుతూ మంగళవారం నాడు జగన్ అండ్ కో అసెంబ్లీలో ప్రత్యక్షమయ్యారు. విద్యుత్ ఛార్జీల పెంపు విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయడానికే వచ్చామంటూ వివరణ ఇచ్చుకున్నారు. జగన్ మాట మీద నిలబడే రకం కాదు కాబట్టి అసెంబ్లీకి రానని చెప్పిన ఆయన మళ్ళీ వచ్చినా ఎవరూ పెద్దగా షాకవ్వలేదు. అయితే కాసేపటికే మళ్ళీ ఆయన బృందం మొత్తం వాకౌట్ చేసి బయటకి వెళ్ళిపోయింది. దాంతో షాక్ అవడం జనం వంతయింది. ఆయన ఎందుకు వచ్చారో, ఎందుకు వెళ్ళిపోయారో అర్థం కాక జగన్ ‌సృష్టించిన అయోమయంలో జనం గజిబిజి అయిపోయారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడి స్థానంలో వున్న జగన్ గారు తాను అయోమయానికి గురవుతూ, జనాన్ని కూడా అయోమయంలోకి నెడుతున్నారని, ఇప్పటికైనా ఇలాంటి అయోమయం సృష్టించే పనులు మానుకోవాలని పలువురు అంటున్నారు.

తెలంగాణాకి హైకోర్టు ఏర్పాటుపై అందరూ తొందరపడ్డారా?

  తెలంగాణా రాష్ట్రం ఏర్పడినందున దానికి ప్రత్యేక హైకోర్టు కావాలనుకోవడం సహజమే. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విజ్ఞప్తికి కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ కూడా చాలా సానుకూలంగా స్పందించారు. కేసీఆర్ స్వయంగా ఈ విషయం గురించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ సేన్ జ్యోతి గుప్తాతో చర్చించారు కూడా. హైకోర్టు కోసం గచ్చిబౌలీలో ఉన్న ఒక విశాలమయిన భవనాన్ని కేటాయించేందుకు తెలంగాణా ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు కేంద్ర న్యాయశాఖా మంత్రికి ఒకలేఖ అందజేశారు.   ఇక నేడో రేపో తెలంగాణా రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు అవుతుందని అందరూ భావిస్తున్న తరుణంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ సేన్ జ్యోతి గుప్తా, న్యాయమూర్తి సంజయ్ కుమార్ లతో కూడిన ధర్మాసనం ఆ ప్రతిపాదనను నిర్ద్వందంగా వ్యతిరేకించడమే కాక అది ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని (సెక్షన్ 31) ఉల్లంఘన చేసినట్లు అవుతుందని కుండబ్రద్దలు కొట్టినట్లు చెప్పారు. విభజన బిల్లులో తెలంగాణా రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయమని ఎక్కడా పేర్కొనలేదని, ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే ఏర్పాటు చేయవలసి ఉందని, అంతవరకు ఉమ్మడి హైకోర్టునే కొనసాగించవలసి ఉంటుందని విస్పష్టంగా పేర్కొన్నారు.   ఒకవేళ తెలంగాణా రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు చేయదలిస్తే ఆంద్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని సవరించవలసి ఉంటుందని, దానిని సవరించకుండా అందుకోసం ఎటువంటి ప్రయత్నాలు చేసినా అది చట్టాన్ని ఉల్లంఘించినట్లే అవుతుందని ధర్మాసనం తేల్చి చెప్పింది. అంతేకాక తెలంగాణా రాష్ట్రానికి హైకోర్టు కోరుతూ న్యాయవాదులను ఎటువంటి ఆందోళనలు చేయవద్దని, ఎవరయినా ఇందుకు విరుద్దంగా వ్యవహరిస్తే దానిని కోర్టు ధిక్కారంగా పరిగణించి కటిన చర్యలు చేపడతామని హెచ్చరించారు కూడా. హైకోర్టు విభజనపై ఆంద్ర, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాలను కౌంటర్ ఫైల్ చేయమని ధర్మాసనం ఆదేశించింది. అవి చూసిన తరువాతే తన నిర్ణయం ప్రకటిస్తానని తెలిపింది.   విభజన చట్టంలో ఉన్న ఈ అంశాలనన్నిటినీ గమనించకుండానే హైకోర్టు కోసం తెలంగాణా న్యాయవాదులు ఉద్యమించడం, అందుకోసం తెలంగాణా ప్రభుత్వం శాసనసభలో ఒక తీర్మానం చేయడం, తెలంగాణా అడ్వకేట్ జనరల్ కూడా ఈ అంశాన్ని విస్మరించడం, కేంద్రన్యాయశాఖ మంత్రిగా ఉన్న సదానంద గౌడ హైకోర్టు ఏర్పాటుకి హామీ ఇవ్వడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. హైకోర్టు ఏర్పాటుకి చట్టంలో సాంకేతిక సమస్యలున్నప్పుడు వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతూ తమ ప్రయత్నాలకు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నారని తెలంగాణా మంత్రులు ఆరోపణలు చేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.   తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి లేఖ వ్రాసే ముందు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ సేన్ జ్యోతి గుప్తాని కలిసి మాట్లాడారు. కనుక చట్టంలో ఉన్న ఈ సాంకేతిక సమస్యల గురించి ఆయన ముఖ్యమంత్రికి అప్పుడే తెలియజేసే ఉంటారని అనుకొంటే, మరి ఈవిషయంలో తెలంగాణా ప్రభుత్వం ఎందుకు ముందడుగు వేసినట్లు? ఇప్పటికే తెలంగాణా ప్రభుత్వానికి హైకోర్టులో చాలా సార్లు ఎదురు దెబ్బలు తగిలాయి. అయినా కూడా ఎందుకు ముందుకు వెళ్ళినట్లు? ఇప్పుడు ఇంత వరకు వచ్చిన తరువాత తెలంగాణా ప్రభుత్వం ఈ విషయంలో ముందుకు వెళ్లగలదా? వెళ్ళలేకపోతే అందుకు ఎవరిని నిందిస్తుంది?

మెగాస్టార్ కి అభిమానులే శ్రీరామరక్ష

  చిరంజీవి తనకున్న విశేష జనాధారణను చూసుకొనే ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాజకీయాలలో ప్రవేశించారు. కానీ ఏ అభిమానుల అండతో ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి అవుదామనుకొన్నారో వారినే ఎన్నికల సమయంలో విస్మరించడంతో ఆయన అభాసుపాలయ్యారు. ఆ తరువాత నుండి చేసినవన్నీ స్వయంకృతాపరాదాలే. కనీసం కేంద్రమంత్రిగా నిలద్రొక్కుకొన్నప్పుడయినా ఆయన మళ్ళీ తన అభిమానులకు దగ్గరయ్యే ప్రయత్నం చేసి ఉండి ఉంటే నేడు ఆయన పరిస్థితి వేరేలా ఉండేదేమో! కానీ చేతులు కాలే వరకు కూడా ఆయన మేల్కొనలేదు. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ మీద ఆంద్రప్రదేశ్ ప్రజలు కోపంతో రగిలిపోతున్నారనే సంగతిని గ్రహించకుండా లేదా గ్రహించనట్లుగా నటిస్తూ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసి వారి ఆగ్రహానికి గురయ్యారు.   ఆ కారణంగానే చాలా మంది అభిమానులు కూడా ఆయనకి దూరమయ్యి, కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకే కంకణం కట్టుకొన్న పవన్ కళ్యాణ్ వైపు మళ్ళారు. కనీసం అప్పుడయినా చిరంజీవి మేల్కొని తమ్ముడితో చేతులు కలిపి ఉండి ఉంటే నేడు వారిరువురి రాజకీయ భవిష్యత్ మరియు రాష్ట్ర రాజకీయాలు మరోలా ఉండేవేమో? కానీ ఒకప్పుడు లక్ష్మణుడిలా తన వెన్నంటి సేవ చేసిన తమ్ముడితో చేతులు కలిపే బదులు అతని జనసేన పార్టీకి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేయడంతో ప్రజలు పూర్తిగా ఆయనకు దూరమయ్యారు.   రాజకీయాలపై ఎటువంటి అవగాహనలేకపోయినా చిరంజీవి కేంద్రమంత్రి స్థాయికి ఎదగగలిగారు. కానీ ప్రజాధారణ కోల్పోతే రాజకీయాలలో రాణించలేరనే సంగతి తెలుసుకొనేందుకు ఆయనకి చాలా కాలమే పట్టింది. ఒకప్పుడు రాజకీయ ఆరంగ్రేటం చేయడానికి అభిమానుల భరోసాయే కారణం. ఇప్పుడు మళ్ళీ తన ప్రతిష్టని పునరుద్దరించుకోవడానికీ మళ్ళీ ఆయనకి వారి సహాయసహకారాలే అవసరమయ్యాయి.   ఆయన ఇంతకాలం తన అభిమానులతో ఎలా వ్యవహరించినప్పటికీ, వారు మాత్రం మళ్ళీ ఆయనకు అండగా నిలబడేందుకు సిద్దమయ్యారు. ఆయనకు సోషల్ నెట్ వర్క్ సైట్ల ద్వారా మద్దతు కూడగట్టి ఆయన పుట్టిన రోజునాడు పెద్ద ఎత్తున సమాజసేవా కార్యక్రమాలు చేయాలని నిశ్చయించుకొన్నట్లు తెలుస్తోంది. ఆయన కూడా పోయిన చోటే ఉంగరం వెతుక్కోవాలన్నట్లు రాజకీయాలలో చేరిన తరువాత తను దూరం చేసుకొన్న అభిమానులను, పోగొట్టుకొన్న ప్రతిష్టను మళ్ళీ సినీపరిశ్రమ ద్వారానే పొందాలనుకొంటున్నారు.   అయితే ఒక రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల కోసం పార్లమెంటులో మాట్లాడాలనే చిన్న విషయం విస్మరించి, సినిమాల ద్వారా ప్రజలను మెప్పించాలనుకోవడం చాలా హాస్యాస్పదం. రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించవలసిన తరుణంలో ఆయన తన భవిష్యత్ గురించి ఆలోచించడమే కాకుండా అందుకు తను ఒకనాడు దూరంగా ఉంచిన అభిమానుల సహాకారం కూడా కోరుతున్నారు. ఆయన సినిమాలలో ఉన్నప్పుడు వేసుకొన్న మేకప్ రాజకీయాలలోకి వచ్చిన తరువాత పూర్తిగా తొలగిపోవడంతో ఆయన అసలు వ్యక్తిత్వం ఎటువంటిదో అర్ధం చేసుకొనే అవకాశం ప్రజలకి దక్కింది. మళ్ళీ ఇప్పుడు ఆయన మేకప్ వేసుకొని ప్రజలను మెప్పించేందుకు వస్తున్నారు.

తప్పులెన్నువారు...

  ఈరోజుల్లో బోడి గుండుకి మొకాలుతో ముడిపెడుతూ మాట్లాడటం వస్తే చాలు రాజకీయాలలో చేరేందుకు ప్రాధమిక అర్హత ఉన్నట్లే భావించవచ్చును. ఈ విషయంలో తెరాస, వైకాపా నేతలకున్న ప్రతిభ మరొకరికి ఉండబోదని చెప్పవచ్చును.   అసెంబ్లీలో తనను మాట్లాడేందుకు అనుమతించడం లేదంటూ గంటలు గంటలు ప్రసంగాలు చేసే జగన్మోహన్ రెడ్డి ఆ వంకతో అసెంబ్లీని బహిష్కరించివెళ్ళిపోతే, ప్రతిపక్షం లేకుండానే చంద్రబాబు నాయుడు అసెంబ్లీని నిర్వహించేస్తున్నారంటూ, తెలంగాణా అసెంబ్లీ నుండి 11 మంది తెలంగాణా తెదేపా సభ్యులను బడ్జెట్ సమావేశాల నుండి బహిష్కరించి చేతులు దులుపుకొన్న ఆ రాష్ట్ర శాసనసభా వ్యవహారాల మంత్రి హరీష్ రావు ఆక్షేపించడం విచిత్రం. తెలంగాణాలో నిరంకుశపాలన సాగుతోందని ప్రతిపక్షాలన్నీ ముక్త కంఠంతో ఘోషిస్తున్నాయి. అదే విధంగా మీడియాపై కూడా ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఆ సంగతి విస్మరించి, చంద్రబాబు నాయుడు నిరంకుశ పాలన సాగిస్తున్నారని మంత్రి హరీష్ రావు ఆరోపించడం మరో విచిత్రం.   వైకాపా సభ్యులు వారంతటవారే శాసనసభ సమావేశాలను బహిష్కరించి వెళ్ళిపోయారు. ప్రజల తరపున శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీయవలసిన బాధ్యత కలిగిన ప్రధాన, ఏకైక ప్రతిపక్షం వైకాపా చాలా బాధ్యతారాహిత్యంగా కీలకమయిన బడ్జెట్ సమావేశాలను బహిష్కరించి వెళ్ళిపోతే అందుకు వైకాపాను దాని అధినేత జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం మాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని హరీష్ రావు విమర్శించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.   ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ని ఖరారు చేసేందుకు శాసనసభ బిజినస్ అడ్వయిజరీ కమిటీ సమావేశమయినప్పుడు, తమ పార్టీ సూచిస్తున్న అంశాలను అజెండాలో చేర్చకపోయినట్లయితే సభలో “అగ్లీ సీన్స్ క్రియేట్’ చేస్తామని వైకాపా ప్రతినిధులు ముందే హెచ్చరించారు. చెప్పినట్లే సభలో అగ్లీ సీన్స్ క్రియేట్ చేసి సభను బహిష్కరించి వెళ్ళిపోయారు. మళ్ళీ సభలో అడుగుపెట్టబోమని శపథం చేయడమే కాకుండా బస్సు యాత్ర చేయబోతున్నట్లు కూడా ప్రకటించారు. అంటే అన్ని ముందుగా అనుకొన్నట్లే ఒక పధకం ప్రకారమే వైకాపా వ్యవహరించిందని స్పష్టం అవుతోంది. ఈవిధంగా వైకాపా ఏదో ఒక రాజకీయ వ్యూహ ప్రకారం సభను బహిష్కరించి బయటకు వెళ్ళిపోతే, కీలకమయిన బడ్జెట్ సమావేశాలను బహిష్కరించి బస్సు యాత్రలు చేయబోతున్న జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించవలసిన మంత్రి హరీష్ రావు చంద్రబాబు నాయుడుని ఎందుకు నిందిస్తున్నారో?   తెలంగాణా అసెంబ్లీ నుండి బహిష్కరించబడిన తెదేపా సభ్యులు తమపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేసి మళ్ళీ తమను బడ్జెట్ సమావేశాలలో పాల్గొనేందుకు అనుమతించమని కోరుతున్నా వారిని తెలంగాణా ప్రభుత్వం అనుమతించడం లేదు. వారు తమ తప్పును అంగీకరించి క్షమాపణ చెప్పేందుకు కూడా సంసిద్దత వ్యక్తం చేసారు. అయినా కూడా వారిని సభలోకి అనుమతించడం లేదు. వైకాపా సభ్యులు వారంతట వారుగా సభను బహిష్కరించి వెళ్లిపోతే, తెదేపా తెలంగాణా సభ్యులు తిరిగి సభలోకి రావడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నా అనుమతించడం లేదు. చంద్రబాబు నాయుడులో తప్పులెంచుతున్న మంత్రి హరీష్ రావు తన ప్రభుత్వం చేసింది మాత్రం తప్పుగా భావించక పోవడం విచిత్రం. అయినా వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి శాసనసభలో అడుగుపెట్టమని ప్రకటించి బస్సు యాత్రలు చేయదలచుకొన్నప్పుడు చంద్రబాబు నాయుడు మాత్రం ఏమి చేయగలరు? స్పీకర్ డా. కోడెల శివప్రసాద్ పై వైకాపా సభ్యులు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చించడానికి సిద్దంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు చెపుతున్నారు. కానీ వారికి సమావేశాలలో పాల్గొనే ఉద్దేశ్యాలు లేవని స్పష్టం చేస్తున్నారు.    

ఆంద్రప్రదేశ్ రాజధాని పేరు అమరావతి

  ఆంద్రప్రదేశ్ రాజధానికి గొప్ప చారిత్రిక నేపధ్యం కలిగిన ‘అమరావతి’ పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖరారు చేసినట్లు తాజా సమాచారం. అచ్చమయిన తెలుగుదనం ఉట్టిపడుతున్న అమరావతి గురించి కవులు, సాహితీవేత్తలు తమ రచనలలో అనేకవిధాలుగా వర్ణించారు. అంతేగాక ‘అమరావతి’ యావత్ రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితమయిన పేరు. దానితో ప్రజలు చక్కటి అనుబంధం కలిగి ఉన్నారు. ఇక అమరావతి పేరు వెనుకున్న బౌద్ధ నేపధ్యం వలన రాష్ట్ర రాజధాని నగరానికి, తద్వారా రాష్ట్రానికి కూడా ప్రపంచ దేశాలలో చాలా త్వరగా గుర్తింపు ఏర్పడుతుందనే అభిప్రాయంతోనే చంద్రబాబు నాయుడు ఈపేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. నిజానికి మొన్న తుళ్ళూరులో ఉగాది వేడుకలు జరుపుకొన్నప్పుడే చంద్రబాబు నాయుడు రాజధాని పేరు ప్రకటించాలనుకొన్నారు. కానీ ముందుగా అధికారికంగా అసెంబ్లీలో ప్రకటించి సభ్యుల ఆమోదం పొందిన తరువాతే బయట ప్రకటించడం మంచిదనే ఆలోచనతో ఆ ఆలోచన విరమించుకొన్నట్లు తెలుస్తోంది. కానీ ఈ విషయం ఎలాగో మీడియాకు తెలియడంతో ఇంకా అధికార ప్రకటన వెలువడక ముందే ప్రజలకు తెలిసిపోయింది. కనుక చంద్రబాబు నాయుడు ఈరోజే అసెంబ్లీలో అధికారికంగా ప్రకటించవచ్చును.

ఇక జగన్ మైక్ ని ఎవరూ కట్ చేయలేరు!

  వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికు శాసనసభలో మొన్న గంటసేపు మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం ఇచ్చేరు. ఆ తరువాత కూడా ఆయన ఇంకా తన పిర్యాదుల పంచాంగం అనర్గళంగా చదివే ప్రయత్నం చేసినప్పుడు ఇక ముగించమని స్పీకర్ చెపుతున్నా వినకపోవడంతో స్పీకర్ ఆయన మైక్ కట్ చేసారు. దానితో జగన్ ఇగో దెబ్బతింది. అది చూసి వైకాపా సభ్యుల ఇగో దెబ్బతింది. అప్పుడు వారందరూ స్పీకర్ మీద విరుచుకుపడ్డారు. స్పీకర్ వారిని సభ నుండి 3 రోజులపాటు స్పస్పెండ్ చేసారు. అప్పుడు జగన్ ‘మీకో దణ్ణం!’ అంటూ స్పీకర్ అనుమతి తీసుకోకుండానే, సభ నుండి వాక్ అవుట్ చేస్తున్నట్లు ప్రకటించకుండానే వాకవుట్ చేసేసారు. పోతూపోతూ స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెడుతున్నామంటూ అసెంబ్లీ కార్యదర్శి చేతిలో ఒక లేఖ పెట్టి చక్కాపోయారు.   ఆ తరువాత తన లోటస్ పాండ్ లో సిద్దంగా ఉన్న తన మీడియా సాక్షిగా తను శాసనసభలో మళ్ళీ అడుగుపెట్టనని భీకర శపథం చేసేసారు. స్పీకర్ కోడెల శివ ప్రసాద్ పై తాము ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసును సభలో చర్చకు అనుమతిస్తామని చెప్పినప్పుడే తిరిగి సభలో కాలుపెడతానని శపథం చేశారు. ఆ తరువాత దాదాపు రెండు గంటలసేపు మీడియా ముందు తన ఆవేదనంతా ఒలకబోసుకొన్నారు. ఇంకా ఒలకబోసేవారేనేమో గానీ ఇంక ఓపికలేకపోవడంతో ముగించినట్లున్నారు. బడ్జెట్ సమావేశాలకి తను హాజరు కానప్పటికీ దానిపై తన అమూల్యమయిన అభిప్రాయాలు తెలుసుకోగోరే ప్రజలు మీడియాలో చూసుకోమని ఒక ఉచితసలహా ఇచ్చేరు.   అసెంబ్లీలో స్పీకర్ అధికార పార్టీకి చెందినవారు కనుక తనకు తృప్తిగా మాట్లాడనివ్వకుండా మైక్ కేట్ చేసేవారు. కానీ ఇప్పుడు తన స్వంత ఇంట్లో స్వంత మీడియా ముందు కూర్చొని ఎన్ని గంటలు కావాలంటే అన్ని గంటలు నిరభ్యంతరంగా, అనర్ఘళంగా నచ్చినట్లు మాట్లాడుకోవచ్చును. అసెంబ్లీని ఇడుపులపాయో, లోటస్ పాండో అన్నట్లు సభలో వ్యవహరిస్తే కుదరదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదివరకు ఒకసారి హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి ఆయన హెచ్చరికలో అసలు అర్ధం గ్రహించలేకపోయినా, దానిలో నుండి మంచి ‘క్లూ’ మాత్రం పొందినట్లున్నారు. అందుకే లోటస్ పాండ్ నుండే తన ప్రసార కార్యక్రమాలు మొదలుపెట్టేసారు. ఇప్పుడు ఎవరూ కూడా ఆయన మైక్ కట్ చేయలేరు. కనుక ఎన్ని గంటలు ఓపిక ఉంటే అన్ని గంటలూ మాట్లాడుకోవచ్చును. చూసేవాళ్ళు చూస్తారు, లేని వాళ్ళులేదు.