హుస్సేన్ సాగర్ జోలికెళ్తే కొంప మునిగినట్టే...
posted on Feb 19, 2015 @ 12:57PM
అదేమీ విచిత్రమో కానీ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపని మొదలుపెట్టాలనుకొన్నా వెంటనే ఎవరో ఒకరు అభ్యంతరాలు లేవనెత్తుతుంటారు. ఒకప్పుడు స్వచ్చమయిన మంచినీళ్ళతో నిండి ఉండే హుస్సేన్ సాగర్ ఇప్పుడు ఒక పెద్ద మురికి చెరువుగా మారిపోయింది. దానిలో నీటిని, వ్యర్ధ పదార్ధాలను పూర్తిగా తొలగించి మళ్ళీ స్వచ్చమయిన నీళ్ళు నింపుతామని ఆయన ప్రకటించినప్పుడు ప్రజలందరూ హర్షించారు. కానీ ఇప్పుడు దానిపై కూడా కొందరు పర్యావరణవేత్తలు,నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు.
“సేవ్ అవర్ అర్బన్ లేక్స్” అనే హైదరాబాద్ కి చెందిన సంస్థ ప్రతినిధి యల్. శర్వాత్ మీడియాతో మాట్లాడుతూ “ముందు హుస్సేన్ సాగర్ లోకి చుట్టుపక్కల కర్మాగారాల నుండి ప్రమాదకర రసాయనాలతో కూడిన నీటి విడుదల ఆపకుండా చెరువులో నీళ్ళు తోడి బయట పోయడం వలన ఏమి ప్రయోజనం ఉంటుంది? మంచి నీటి వనరులను కలుషితం చేసేవారికి చట్టంలో చాలా కటినమయిన శిక్షలు పేర్కొనబడ్డాయి. అనేక దశాబ్దాలుగా చుట్టుపక్కల పరిశ్రమలు ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తూ హుస్సేన్ సాగర్ నీటిని కలుషితం చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం కూడా పట్టించుకొంటున్నట్లు లేదు. ముందు అటువంటి వారిపై చర్యలు తీసుకొని మళ్ళీ హుస్సేన్ సాగర్ లోకి రసాయన వ్యర్ధాలు విడుదల చేయకుండా నిరోధించిన తరువాతనే ఈ శుద్ధి కార్యక్రమం చేపడితే ఏమయినా ఫలితం ఉంటుంది. లేకుంటే అది ఏట్లో చింతపండు పిసికినట్లే అవుతుంది. మేము త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసి ఒక విజ్ఞప్తి పత్రం ఇవ్వబోతున్నాము. హుస్సేన్ సాగర్ ని కలుషితం చేస్తున్న వారిని ఇక ఎంతమాత్రం ఉపేక్షించ రాదని మేము కోరుతాము.” అని అన్నారు.
ఆయన మరొక అంశం కూడా ప్రస్తావిస్తున్నారు. “అనేక దశాబ్దాలుగా ప్రక్షాళనకు నోచుకోని కారణంగా హుస్సేన్ సాగర్ గర్భంలో కొన్ని వేల క్యూబిక్ మీటర్ల ఘన రసాయనిక వ్యర్థ పదార్ధాలు పోగుపడి ఉన్నాయి. కొన్ని లక్షల గ్యాలన్ల ప్రమాదకర రసాయనిక నీళ్ళు బయటకు తోడిపోయవలసి ఉంటుంది. ఘన వ్యర్ధ పదార్ధాలను మూసీ నది సమీపంలో పడేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. దానివలన అక్కడ వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. దానివలన ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు రోగాల భారిన పడే ప్రమాదం ఉంది. ఇక హుస్సేన్ సాగర్ నుండి తోడి బయటపోసే ప్రమాదకరమయిన నీళ్ళు ఎటు పోతాయి? ఎందులో కలుస్తాయి? అవి ఎందులో కలిసినా ఎక్కడ నిలిచినా ఆ ప్రాంతంలో ఉండే జలవనరులన్నీ కలుషితమయ్యే ప్రమాదం ఉంది. అంటే ఒక సమస్యను పరిష్కరించబోయి ఇంకో సమస్యను సృష్టించుకొన్నట్లే అవుతుంది,” అని అన్నారు.
నిజమే కదా! వారి వాదనలో కూడా అర్ధం ఉంది. మరి వారు లేవనెత్తిన ఈ సమస్యలను ప్రభుత్వం ఏవిధంగా పరిష్కరిస్తుందో తెలియదు. కానీ నగరానికే చెందిన బీవీ. సుబ్బారావు అనే జలవనరుల నిర్వహణ నిపుణుడు దీనిలో మరో కోణం కూడా ఎత్తి చూపుతున్నారు.
“ఇంతవరకు హుస్సేన్ సాగర్ గర్భంలో ఉన్న రసాయన వ్యర్ధాలు నీళ్ళతో కలిసి మెదేయిన్ అనే విషయవాయువు తయారవుతోంది. కానీ హుస్సేన్ సాగర్ లో ఉన్న నీళ్ళు ఆ విష వాయువుని ఒక ఫిల్టర్ మాదిరిగా పట్టి ఉంచి గాలిలో కలవకుండా నిరోధిస్తోంది. ఇప్పుడు ఆ నీళ్ళనన్నిటినీ ఒక్కసారిగా తోడేస్తే ఆ విష వాయువులు గాలిలోకి వ్యాపించడం మొదలవుతుంది. దాని వలన చుట్టుపక్కల నివసించే ప్రజలు, ట్యాంక్ బండ్ మీదుగా నిత్యం రాకపోకలు సాగించేవారు తీవ్ర అనారోగ్యానికి గురవుతారు. కనుక హుస్సేన్ సాగర్ ప్రక్షాళనను ఆషామాషీగా కాకుండా శాస్త్రీయ పద్దతుల ప్రకారమే చేయవలసి ఉంటుంది. లేకుంటే చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది,” అని హెచ్చరించారు.
హుస్సేన్ సాగర్ లో నుండి నీళ్ళు తోడితేనే ఇంత ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నప్పుడు, ఆ ఘన వ్యర్ధాలను మూసీ నది ఒడ్డునో మరొక నిర్జన ప్రాంతంలోనో పోగుపెడితే ఏమవుతుందో ఎవరయినా ఊహించగలరు. కనుక ఈ అంశాలన్నిటినీ కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని అడుగు ముందుకు వేయవలసి ఉంటుంది.