లాలూ వెర్సెస్ నితీష్ కుమార్?

  ప్రతీ సార్వత్రిక ఎన్నికల ముందు దేశంలో వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ‘మూడో ఫ్రంట్’ ముచ్చట్లు పెట్టుకోవడం ఎన్నికలయ్యేలోగానే దానిని పక్కనపడేసి ఎవరికీ వారు ఎన్నికలలో పోటీ చేయడం చాలా కాలంగా జరుగుతున్నదే. ఈ ఏడాది నవంబర్-డిశంబర్ నెలల మధ్యలో బీహార్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగబోతున్నాయి కనుక ఈసారి ‘జనతా’ హెడ్డింగులు పెట్టుకొన్న ఆరు పార్టీలు విలీనమయ్యి ఒక్క పార్టీగా అవతరించబోతున్నట్లు క్రిందటి నెల ప్రకటించాయి. దానికి అధ్యక్షుడిగా సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ ని ఎంచుకొన్నారు. పార్టీ పేరు, జెండా,ఎజెండాలను ఖరారు చేసేందుకు ఆరు పార్టీల ప్రతినిధులతో ఒక కమిటీ వేసుకొన్నారు.   ఇల్లలకగానే పండగ కాదన్నట్లు అందరూ కలిసి పెద్ద పొయ్యి వెలిగించుకొన్నారు గానీ నేటికీ ఎవరి పొయ్యిలు వారు చల్లారిపోకుండా జాగ్రత్త పడుతూనే ఉన్నారు. ప్రధానమంత్రి కుర్చీలో కూర్చొని దేశాన్ని ఏలేద్దామని కలలుగన్న నితీష్ కుమార్ అది సాధ్యం కాదని తేలిపోవడంతో తమ జేడీ (యు) పార్టీకే చెందిన బీహార్ ముఖ్యమంత్రి జీతాన్ రాం మంజీ కుర్చీ క్రింద మంట పెట్టి ఆయనను దించేసి ఆ కుర్చీలో తను సెటిల్ అయిపోయేరు.   ఇప్పుడు తమ పార్టీని ఇంకా పేరు ఊరు లేని పార్టీలో విలీనం చేసేసారు కనుక ఆయనకు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా పోటీగా తయారయ్యారు. అయితే గడ్డి కుంభకోణం కేసులో నాలుగేళ్ళు జైలు శిక్షపడినందున ఆయన ఎన్నికలలో పోటీ చేయలేరు. కనుక ముఖ్యమంత్రి కాలేరు. అయినప్పటికీ ఆయన ఇదివరకులాగే తన భార్య రబ్రీ దేవినో లేకపోతే మరొక డమ్మీనో అందులో కూర్చోబెట్టి తను రాజ్యం ఏలాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అది గమనించి నితీష్ కుమార్ కూడా అప్రమత్తమయ్యారు. ఆరు పార్టీలు కలిసి బీహార్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తన పేరునే ప్రకటించాలని ఆయన కోరుతున్నారు.   కానీ ఎల్లప్పుడూ ప్రతిపక్షంలో కూర్చోవడం పాపం లాలూ ప్రసాద్ కయినా చాలా ఇబ్బంది కలిగించే విషయమే కనుక ఆయన కూడా వెనక్కి తగ్గడం లేదు. అందుకే వారిద్దరూ కలిసి తమ కొత్త పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ తో ఈ విషయం గురించి చర్చించడానికి మొన్న డిల్లీ బయలుదేరి వెళ్ళారు.   ముందు ఈవిషయం గురించి ఏదో ఒకటి తేల్చుకొన్న తరువాతే పార్టీ జెండా, అజెండాల గురించి మాట్లాడుకోవడం మంచిదణి వారిరువురూ భావిస్తున్నట్లు సమాచారం. వారిలో ఎవరికి ముఖ్యమంత్రి సీట్ కన్ఫర్మ్ చేసినా రెండవ వ్యక్తి మళ్ళీ తన పొయ్యి రాజేసుకోవడం, మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకోవడం తధ్యం. కనుక జెండా ఎగరవేయక ముందే జనతా పరివార్ కధ ముగిసిపోయినా ఆశ్చర్యం లేదు.

చంద్రబాబు ఓర్పుకు హేట్సాఫ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిలోని రాజనీతిజ్ఞతను చూస్తుంటే ఆయన మీద గౌరవం పెరుగుతూ వుంటుంది. ఒక సామాన్య కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అనేక విజయాలు సాధించిన ముఖ్యమంత్రిగా,  తెలుగువారి జీవితాలను మేలు మలుపు తిప్పిన నాయకుడిగా ఆయన ఎలా ఎదగగలిగారో అర్థమవుతూ వుంటుంది. అదేదో సినిమాలో చెప్పినట్టు... ఎప్పుడు నెగ్గాలో ఎప్పుడు తగ్గాలో బాగా తెలిసిన రాజకీయవేత్త ఆయన. అందుకే ఆయన దేశ రాజకీయాల్లోనే గౌరవప్రదమైన రాజకీయ నాయకులలో ఒకరిగా పేరు తెచ్చుకోగలిగారు. ఇప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావించడానికి గల ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం విషయంలో చంద్రబాబు నాయుడు చూపిస్తున్న ఓర్పు. ఆర్థికంగా ఎంతో క్రుంగిపోయి వున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి తన శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఒకప్పుడు తన మాటతో దేశ రాజకీయాలను శాశించిన ఆయన ఇప్పుడు కేంద్రం ముందు ఎంతో ఓర్పుతో వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన ఎన్నో అంశాల విషయంలో కేంద్రం కొంత జాప్యం చేస్తున్నప్పటికీ, అది ఎంతోమందికి ఆవేశాన్ని కలిగిస్తున్నప్పటికీ చంద్రబాబు నాయుడు ఎంతమాత్రం ఓర్పును కోల్పోకుండా కేంద్రంతో సత్సంబంధాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు ఉన్న స్థానంలో మరో వ్యక్తి ఉన్నటయితే కేంద్రం మీద నిప్పులు చెరిగి, విమర్శలు గుప్పించి పరిస్థితిని మరింత నాశనం చేసి వుండేవారు. అయితే చంద్రబాబు మాత్రం కేంద్రం మీద ఎలాంటి విమర్శలు చేయకుండా కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కి రావలసిన నిధులను, వరాలను సాధించేందుకు ప్రయత్నం చేస్తు్న్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించడం ఆలస్యమైందని కేంద్రం మీద వాగ్బాణాలు సంధిస్తున్న కొంతమంది ఏపీ నాయకులు చంద్రబాబును చూసయినా పాఠాలు నేర్చుకోవాలి. ఆయన ఓర్పుకు హేట్సాప్ చెప్పాలి.

ఇకనైనా చదవండి

తెలంగాణ రాష్ట్రం సిద్ధించేసింది. త్వరలో బంగారు తెలంగాణ కూడా వచ్చేస్తుంది. వచ్చే నాలుగేళ్ళ లోపు బంగారు తెలంగాణను సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రశంసనీయమైన కృషిని చూస్తునే వున్నాం. బంగారు తెలంగాణను సాధించే అంశాన్ని రాజకీయ నాయకులకు వదిలేసి ఇక తెలంగాణ విద్యార్థులు చదువు మీద దృష్టి పెడితే మంచింది. తెలంగాణ రాష్ట్రం ఏ విషయంలోనూ ఏ ఇతర రాష్ట్రంతో పోల్చినా వెనుకబడి వుండకూడదు. ముఖ్యంగా చదువు విషయంలో. అన్నిటికీ చదువే మూలం. చదువులో వెనకబడితే అన్నిట్లోనూ వెనకబడి పోవడం ఖాయం. మొన్నీమధ్య విడుదలైన ఇంటర్మీడియల్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో పొరుగు రాష్ట్రం కన్నా మన రాష్ట్రం వెనుకబడి వుంది. ఇక వచ్చే ఏడాది ఆ పరిస్థితి వుండకూడదు. అందువల్ల తెలంగాణ విద్యార్థి లోకం ఇక చదువు మీద దృష్టి పెట్టాలి. చదువు విషయం ఇంత గట్టిగా చెప్పడానికి గల ముఖ్య కారణం మరొకటి వుంది. మొన్నీమధ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజీవ్ విద్యా మిషన్ (రీమ్యాప్), తెలంగాణ నైపుణ్య సంస్థ (స్కి్ల్ మిషన్) తెలంగాణలోని పలువురు విద్యార్థులకు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలో ఒక్క విద్యార్థి కూడా ఉత్తీర్ణత సాధించలేదు. తెలంగాణ విద్యార్థులు సాధించిన ఈ ఫలితాలను చూసి ఆ రెండు సంస్థల ప్రతినిధులు నోళ్ళు తెరిచారు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మనం చదువుతున్న చదువు చాలదన్న విషయం మనకు స్పష్టంగా అర్థమైపోయింది. అందువల్ల, భవిష్యత్తులో ఇలాంటి ఫలితాలు రాకుండా చూసుకుంటే చాలు. ఇప్పుడున్న విద్యా ప్రమాణాలతో మన తెలంగాణ విద్యార్థులు జాతీయ స్థాయి కాంపిటీషన్‌కి ఎదుర్కోగలరా? ఇప్పుడున్న పద్ధతే కొనసాగితే జాతీయ స్థాయిలో విద్య, ఉద్యోగ అవకాశాలు మన చేజారిపోయే ప్రమాదం వుంది. అందువల్ల తెలంగాణ విద్యార్థిలోకం ఉద్యమాల బాటను విడిచిపెట్టి చదువుల బాట పట్టాలి.

దావూద్ ఫొటోని అయినా పట్టుకోండి

ముంబైలో తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించినప్పుడు దావూద్ ఇబ్రహీంని ఎవరూ పట్టుకోలేదు. డి-కంపెనీని ధూమ్‌ధామ్‌గా నిర్వహించినప్పుడు అతని జోలికి ఎవరూ వెళ్ళలేదు.  ముంబైలో బాంబు పేలుళ్ళు జరగడానికి కారకుడైనప్పుడు ఎవరూ పట్టుకోలేదు. బాంబు పేలుళ్ళు జరిగిన తర్వాత ఎంచక్కా పాకిస్థాన్‌కి వెళ్ళిపోతున్నప్పుడు ఎవరూ పట్టుకోలేదు. పాకిస్థాన్‌లో దావూద్ ఇబ్రహీం ఎంచక్కా హాయిగా జీవిస్తున్నాడు. ఆయన సోదరులు, బంధువులు ముంబైలోనే విలాస జీవితాన్ని గడుపుతున్నారు. దావూద్ ఇబ్రహీం కూతురి పెళ్ళి పాకిస్థాన్ క్రికెటర్ మియాందాద్ కొడుకుతో మొన్నామధ్య వైభవంగా జరిగింది. అప్పుడూ అతగాడిని ఎవరూ పట్టుకోలేదు. ఇండియాకి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన దావూద్ ఇబ్రహీం‌ని ఇంతవరకు ఇండియా పోలీసులు, సీబీఐ, ఇతర సంస్థలు పట్టుకోలేకపోవడం  మనం సిగ్గుపడాల్సిన అంశం. ఇప్పటి వరకు పట్టుబడని దావూద్ ఇబ్రహీం‌ని భవిష్యత్తులో పట్టుకుంటామన్న నమ్మకం కూడా లేదు. దావూద్‌ని పట్టుకోవడం సంగతి అటు వుంచి, అతని లేటెస్ట్ ఫొటోని కూడా మనవాళ్ళు పట్టుకోలేకపోయారు. ఇక మనిషిని ఏం పట్టుకుంటారు. గూగుల్లో దావూద్ ఇబ్రహీం అని ఇమేజెస్ కోసం సెర్చ్ చేస్తే, ఎప్పుడో పాతికేళ్ళ వయసులో వున్న దావూద్ ఫొటో కనిపిస్తుందే తప్ప దాదాపు 60 ఏళ్ళ వయసు వచ్చిన అతని ఫొటో కనిపించదు. అసలు ఇప్పుడు దావూద్ ఇబ్రహీం ఎలా వున్నాడో. మన సీబీఐ చీఫ్‌కి ఇప్పుడు దావూద్ ఎదురుపడి టైమెంతైంది గురూ అని అడిగినా గుర్తుపట్టలేనట్టు వున్నాడేమో. అసలు దావూద్ ఎవరూ గుర్తుపట్టలేని విధంగా మారిపోయి ఇండియాలోనే హాయిగా బతికేస్తున్నాడేమో. ఈమధ్య మన దేశంలో దావూద్ గురించి దుమారం రేగుతోంది. దావూద్ లొంగిపోతానని అప్పట్లో అన్నాడని ఒక సీబీఐ పెద్దాయన చెప్పాడు. దావూద్ ఎక్కడున్నాడో తెలుసా అని పార్లమెంట్‌ సభ్యులు హోంశాఖ సహాయమంత్రిని ప్రశ్నిస్తే ఆయన కూడా తనకు తెలియదని సమాధానం ఇచ్చేశారు. మొత్తమ్మీద ఏమిటంటే, దావూద్‌ని పట్టుకోవడం మనవల్ల కాదుగానీ, ఆయన లేటెస్ట్ ఫొటోని అయినా మన దర్యాప్తు సంస్థలు సంపాదిస్తే అదే పదివేలు.

ఉద్యోగుల మధ్య భలే ఐకమత్యం

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగిన సమయంలో రెండు ప్రాంతాలకు చెందిన ప్రభుత్వోద్యోగులు ఎంతలా తిట్టుకున్నారో, ఒకరి మీద మరొకరు ఎంతలా కయ్యానికి కాలు దువ్వుకున్నారో అందరికీ తెలిసిందే. ఇరువర్గాల వారు ప్రదర్శించిన ఆవేశ కావేషాలు చూసి బాబోయ్... భవిష్యత్తులో వీరు ఎప్పటికీ కలవలేరు... ఒక మాట మీద నిలబడలేదని అందరికీ అనిపించింది. ఉద్యోగుల మధ్య ఇంతలా విభేదాలు తలెత్తిన నేపథ్యంలో, మానసికంగా ఇద్దరూ విడిపోయిన  పరిస్థితుల్లో ఇక రాష్ట్రం విడిపోవడమే  మంచిదని అనిపించింది. అందరికీ అనిపించిందే జరిగింది. రాష్ట్రం విడిపోయింది. విడిపోయి కలిసుందామని ఏ మహానుభావుడి నోటి వెంట మొదటిసారి వచ్చిందోగానీ, ఆ మాట  రెండు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులు, ప్రజల విషయంలో ఎలా వున్నా ఉద్యోగుల విషయంలో మాత్రం బాగా వర్కవుట్ అవుతోంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వోద్యోగులు విడిపోయిన తర్వాత భలే కలసి వుంటున్నారు. ఎన్నటికీ కలవటం అసాధ్యం అనుకున్నవాళ్ళే ఇప్పుడు కలసి మెలసి వుంటున్నారు. ఇంతకీ రెండు రాష్ట్రాల ఉద్యోగులు కలసి మెలసి వుంటోంది ఏ విషయంలో అనుకుంటున్నారు... సమ్మెలు చేసే విషయంలో,  ప్రభుత్వాల ముందు డిమాండ్లు పెట్టి వాటిని సాధించుకునే విషయంలో. రెండు రాష్ట్రాల్లో ఏదైనా ఒక రాష్ట్రంలో ఏ విభాగం ఉద్యోగులైనా ఒక డిమాండ్ పెట్టారంటే, రెండో రాష్ట్రంలోని అదే విభాగం ఉద్యోగులు సేమ్ డిమాండ్ తమ ప్రభుత్వం ముందు వుంచుతున్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు ఏదైనా ఉపయోగపడే పనిచేస్తే, రెండో రాష్ట్రంలోని ఉద్యోగులు తమకు కూడా ఆ ప్రయోజనం కలిగించాల్సిందేనని తమ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆర్థికంగా బలంగా వున్న తెలంగాణ ప్రభుత్వం మొన్నామధ్య ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటిస్తే, ఆర్థికంగా ఆరిపోయి వున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులు  తమకు కూడా 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టి సాధించుకున్నారు. లేటెస్ట్‌గా ఆర్టీసీ సమ్మె కూడా కలసి మెలసి  చేస్తున్నారు. రెండు రాష్ట్రాల ఉద్యోగులు ఏ డిమాండ్ అయినా కలసికట్టుగా చేస్తున్నారు. మరి  రెండు రాష్ట్రాల ప్రభుత్వోద్యోగుల మధ్య బాగా బలపడిన ఈ ‘ఐకమత్యం’ రెండు రాష్ట్రాలను ఎక్కడకి తీసుకెళ్తుందో చూడాలి.

వాళ్ళందరి నోళ్ళు కేసీఆరే మూయించాలి

తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ ఏం మాట్లాడినా దాన్ని కామెడీగా చూడటం, కామెంట్లు చేయడం చాలామందికి అలవాటైపోయింది. కేసీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలు, ఆచరణ సాధ్యం కాని మాటలు చెబుతూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఒకపక్క కేసీఆర్ బంగారు తెలంగాణను సాధించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్నారు. దీనికి అర్థం చేసుకోలేని చాలామంది ఆయన మాట్లాడిన మాటలకు పెడర్థాలు తీస్తూ ఆనందిస్తున్నారు. అలాంటి వారినోళ్ళు మూయించాల్సిన అవసరం ముఖ్యమంత్రి కేసీఆర్ మీద వుంది. ఆమధ్య కేసీఆర్ ఒక్క ఎకరం భూమిలో వ్యవసాయం చేసి కోటి రూపాయలు సంపాదించవచ్చని తన ఫామ్ హౌస్ సాక్షిగా చెప్పినా నమ్మకుండా ఎటకారంగా, ఏళాకోళంగా కామెంట్లు చేశారు. ఈ వేసవిలో హుస్సేన్ సాగర్ని ఖాళీ చేయిస్తానని అంటే అది అయ్యేపని కాదని అన్నారు. సచివాలయాన్ని మారుస్తానంటే అర్థంలేని పని అన్నారు. అసలు ఇలాంటివాళ్ళ ఉద్దేశమేంటి? కేసీఆర్ ఏం మాట్లాడినా దాంట్లోంచి పెడర్థాలు తీయడమేనా? లేటెస్ట్‌గా కేసీఆర్ తాను 70 వేల నుంచి 80 వేల పుస్తకాలు చదివానని చెప్పగానే ఈ విమర్శకులు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. కేసీఆర్ చెప్పిన ఈ మాటను పట్టుకుని ప్రతిపక్ష నాయకులు ప్రెస్‌మీట్లు పెట్టి మరీ ఎటకారంగా మాట్లాడుతున్నారు. పుట్టిన దగ్గర్నుంచి రోజుకో పుస్తకం చదివినా అన్ని పుస్తకాలు చదవడానికి వీలు కాదని అంటున్నారు. కేసీఆర్ చెప్పిన వందలాది అబద్ధాలలో మరో అబద్ధం చేరిందని విమర్శిస్తున్నారు. ఇలా విమర్శించడం అన్యాయం, దారుణం, ఘోరం. కేసీఆర్ని విమర్శించేవారు 70 నుంచి 80 వేల పుస్తకాలు చదవలేరేమోగానీ, కేసీఆర్ చదవగలరు. ఆయనకు ఆ శక్తి వుంది. ‘రోబో’ సినిమాలో రజనీకాంత్‌లా చదివే శక్తి ఆయనకు వుందేమో. ఆయన్ని విమర్శించేవాళ్ళకు ఈ విషయం తెలియకపోవచ్చు కదా. కేసీఆర్ నిజంగానే 70 నుంచి 80 వేల పుస్తకాలు చదివే వుంటారు. నో డౌట్ ఎందుకంటే, ఆయన ప్రదర్శించే అపారమైన జ్ఞానం, చక్కని మాటతీరు, సంస్కారబద్ధంగా వుండే ప్రవర్తన, ఇతరులను గౌరవించే తీరు... ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చి వుంటాయనుకుంటున్నారు? ఆయన చదివిన 70 నుంచి 80 వేల పుస్తకాల నుంచే వచ్చి వుంటాయి. అంచేత, కేసీఆర్ని విమర్శిస్తు్న్నవాళ్ళు ఇప్పటికైనా తమ తప్పు  తెలుసుకోవాలి. కేసీఆర్ శక్తిని తక్కువ అంచనా వేయడం మానుకోవాలి. కేసీఆర్ గారూ, మీరు విమర్శకులను ఎంతమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీకిప్పుడు 65 సంవత్సరాలు. మీరు నిండు నూరేళ్ళు బతుకుతారు. బ్యాలన్స్ వున్న ఈ 35 ఏళ్ళలో మిగిలిన ఆ 20 నుంచి 30 వేల పుస్తకాలు కూడా చదివేసి, మొత్తం లక్ష పుస్తకాలు చదివిన ఘనతని సొంతం చేసుకోండి. విమర్శకుల నోళ్ళు మూయించండి.

సల్మాన్ ఖాన్ కోరుండి ఆ తప్పు చేయలేదు: చిరంజీవి

  ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ని ‘హిట్-అండ్-రన్’ కేసులో ముంబై సెషన్స్ కోర్టు దోషిగా నిర్ధారించి, ఐదేళ్ళు జైలు శిక్ష విధించడంపై బాలీవుడ్ లో చాలా మంది విచారం వ్యక్తం చేసారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుండి అందరి కంటే ముందుగా కాంగ్రెస్ యంపీ చిరంజీవి స్పందించారు.   ఆయన మీడియాతో మాట్లాడుతూ, సల్మాన్ ఖాన్ కి జైలు శిక్ష పడటం తనకు చాలా విచారం కలిగిస్తోందని అన్నారు. అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదానికి, ఉద్దేశ పూర్వకంగా చేసిన దానికి తేడా చూడాలని ఆయన అన్నారు. సెషన్స్ కోర్టులో శిక్ష పడినప్పటికీ హైకోర్టులో అప్పులు చేసుకొని బెయిలు పొందుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు.   సాటి నటుడిగా చిరంజీవి ఆవిధంగా మాట్లాడటం సహజమే అయినా కోర్టు దోషిగా నిర్ధారించిన సల్మాన్ ఖాన్ నేరం చేయలేదన్నట్లు మాట్లాడటం చాలా పొరపాటేనని చెప్పక తప్పదు. ఎందుకంటే సల్మాన్ ఖాన్ తప్పత్రాగి కారు నడిపినప్పుడు అది అదుపు తప్పి ఫుట్ పాత్ మీద నిద్రిస్తున్న ఐదుగురు వ్యక్తుల మీద నుండి వెళ్ళడంతో ఒకరు అక్కడికక్కడే మరణించగా మిగిలిన నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అయినప్పటికీ ఆయన కారు ఆపకుండా వెళ్ళిపోయారు. ఆ తరువాత ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి, కోర్టుకి రప్పించినప్పుడు కూడా తను నిర్దోషినని వాదించారు. తనకున్న అర్ధబలంతో గత 13ఏళ్లుగా కేసును సాగదీసుకొంటూ ఇంతకాలం శిక్ష పడకుండా తప్పించుకొన్నారు. అంతే కాదు ఆయన చివరికి కోర్టును కూడా త్రప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసారు. ఆ ప్రమాదం జరిగినప్పుడు తన కారును తన డ్రైవరు నడుపుతున్నాడని బుకాయించే ప్రయత్నం చేసారు.   అంటే మొదట ప్రమాదం జరిగినప్పుడు తప్పించుకొందామని ప్రయత్నించిన సల్మాన్ ఖాన్ అది సాధ్యం కాకపోవడంతో ఆ ప్రమాదం తన కారు వలననే జరిగిందని అంగీకరించినట్లయింది. కోర్టును త్రప్పు ద్రోవ పట్టించే ప్రయత్నంలో సల్మాన్ ఖాన్ అన్యాయంగా తన డ్రైవరును తన కేసులో ఇరికించే ప్రయత్నం కూడా చేసి మరో నేరానికి పాల్పడ్డారు. కానీ ప్రమాదం జరిగిన సమయంలో అతనే తప్ప త్రాగి కారు నడుపుతూ ఒకరి మరణానికీ, నలుగురు గాయపడటానికి కారకుడయ్యాడని కోర్టు ద్రువీకరించినప్పుడు, తను చేసిన సమాజసేవలను దృష్టిలో పెట్టుకొని శిక్షను తగ్గించమని కోరడం గమనిస్తే ‘దొరికితే దొంగలు దొరకకపోతే దొరలూ’ అన్నట్లు ఇంతకాలం ఆయన వ్యవహరించినట్లు అర్ధమవుతోంది.   ఆయన ఉద్దేశ్యపూర్వకంగా ఈ ప్రమాదం చేసి ఉండకపోవచ్చును. కానీ ఆ తరువాత శిక్షను తప్పించు కోవడానికిగాను వరుసగా తప్పు మీద తప్పు చేసుకొంటూ వెళ్ళారు తప్ప ఏనాడు నిజాయితీగా కోర్టులో తన నేరాన్ని అంగీకరించలేదు. కనుక ఏనాడూ తనను క్షమించి విడిచిపెట్టమని ఆయన కోర్టుని ప్రాదేయపడలేదు. కానీ ఇప్పుడు కోర్టు శిక్ష ఖరారు చేయబోతుంటే ఆయన తను చేసిన తప్పుకి క్షమించమని అడుగుతున్నారు అటువంటి వ్యక్తిని చిరంజీవి వెనకేసుకు వస్తున్నారు. ఆ ప్రమాదం తరువాత సల్మాన్ ఖాన్ అనేక సమాజ సేవా కార్యక్రమాలు చేసి ఉండవచ్చును. కానీ అంతమాత్రాన్న ఆయన చేసిన ఈ నేరం నేరం కాకుండాపోదు. ఒకవేళ అటువంటి సమాజాసేవా కార్యక్రమాలు చేసినందుకు దోషులకు కోర్టులు శిక్షలు వేయకుండా వదిలిపెట్టడం మొదలుపెట్టినట్లయితే చాలా మంది అటువంటి మినహాయింపు పొందడానికి అవకాశం ఉంది. అటువంటి వ్యక్తులతో మంచి స్నేహసంబందాలున్నవారు వారిని అభిమానించేవారు సానుభూతి వ్యక్తం చేయడంలో అసహజమేమీ లేదు. కానీ వారిని వెనకేసుకు వచ్చే ప్రయత్నంలో కోర్టు తీర్పును తప్పుపట్టినట్లు మాట్లాడటమే పెద్ద తప్పు. రాజకీయాలలో ఉన్న చిరంజీవికి ఈ విషయం తెలిసే ఉంటుందని అందరూ అనుకొన్నారు. కానీ...

ఇంతకీ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినం ఎప్పుడో? ప్రశ్నిస్తున్న వైకాపా

  ప్రశ్నించడానికే తను పుట్టుకొచ్చానని చెప్పుకొన్న పెద్దమనిషి పత్తా లేకుండా పోవడంతో ఆలోటును వైకాపా భర్తీ చేసే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఎప్పుడు జరుపుకోవాలని మంచి ప్రశ్నే వేసింది. ఎందుకంటే ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో జూన్ 2ని నవ నిర్మాణ దినంగా పాటించాలని ఆరోజు నుండి వారం రోజులపాటు నవ నిర్మాణ దీక్ష పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు సభలు నిర్వహించి రాష్ట్రాభివృద్ధికి ప్రజలను పునరంకితం అయ్యేందుకు ప్రోత్సహించాలని నిర్ణయించింది. జూన్ 2న నవ నిర్మాణ దినంగా పాటించడం ద్వారా రాష్ట్ర విభజన జరిగిన తీరు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా వంచించింది...తదనంతర సమస్యలు, సవాళ్లు, పరిణామాలను అన్నిటినీ ప్రజలు సదా గుర్తుకు చేసుకొంటూ రాష్ట్రాభివృద్ధికి కసిగా పనిచేయాలనే ఉద్దేశ్యంతోనే జూన్ 2న నవ నిర్మాణ దినంగా జరుపుకోవాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సార్లు అన్నారు.   జూన్ 2న నవ నిర్మాణ దినంగా పాటించే మాటయితే మరి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినం ఎప్పుడు నిర్వహించుకోవాలని వైకాపా ప్రశ్నిస్తోంది. లేకపోతే ఆంద్రప్రదేశ్ అవతరణ దినానికే తెదేపా ప్రభుత్వం నవ నిర్మాణ దినమనే కొత్త పేరు పెట్టిందా? అని ప్రశ్నిస్తోంది.   క్రిందటి ఏడాది జూన్ 9న రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన చంద్రబాబు నాయుడు రాష్ట్రం విడిపోయిన జూన్ 2నే రాష్ట్ర అవతరణ దినంగా పాటిద్దామని చేసిన ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయానికే కట్టుబడి ఉండటం చేత సాధారణంగా ప్రతీ ఏట నవంబర్ ఒకటిన జరుపుకొనే ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినం వేడుకలను జరుపుకోలేదు. తెదేపా జూన్ 9న రాష్ట్రంలో అధికారం చేప్పట్టడం చేత, రాష్ట్ర విభజన తరువాత వచ్చిన మొట్టమొదటి రాష్ట్ర అవతరణ దినం జూన్ 2న ఎటువంటి వేడుకలు జరుగలేదు. కనుక ఈసారి రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2న అట్టహాసంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తుందని ప్రజలు భావించడం చాలా సహజం. కానీ ఆరోజును నవ నిర్మాణ దినంగా జరుపుకొంటూ వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు సభలు నిర్వహించుకొందామని రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించడంతో ఇంతకీ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అధికారికంగా నిర్వహిస్తుందా లేదా? రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలలో ఆరోజున రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోవాలా వద్దా? అని వైకాపా ధర్మసందేహం వ్యక్తం చేసింది.

క్లాసు తీసుకునే వరకూ మారరా?

తాజాగా జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో సరిగా పనిచేయని వారికి క్లాసు తీసుకున్నారని, నవ్వుతూనే హెచ్చరించారని వచ్చిన వార్తలు చూసి నవ్వుకోని వారు వుండరు. ఎందుకంటే, చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి నాయకత్వంలో పనిచేస్తూ, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఆయనతోపాటు ఉత్సాహంగా పనిచేయాలి. కానీ అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం అవుతున్నా ఇప్పటికీ ఇంకా నేర్చుకునే స్థితిలోనే, ముఖ్యమంత్రి చేత వార్నింగులు ఇప్పించుకునే స్థితిలోనే ఏపీ మంత్రులు వున్నారంటే వారిని ఏమనాలి? చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకూ ఎన్నోసార్లు పలువురు మంత్రుల్ని పని సరిగా చేయడం లేదంటూ హెచ్చరించారు. తాజాగా నవ్వుతూనే క్లాస్ తీసుకున్నారు. మంత్రులందరూ బాగానే చదువుతున్నారు. కానీ ఎంత బాగా చదివినా చివరకు పరీక్షల్లో పాసవ్వాలి. పాసవ్వకుండా ఎంత చదివినా ఏం లాభం అని ముఖ్యమంత్రి మంత్రులతో అన్నారంటే పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. అసలు ముఖ్యమంత్రి ఇంత మాట అనేంత వరకూ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి. ఇప్పటికీ చంద్రబాబు నాయుడితో సమానంగా పనిచేసే మంత్రులు ఏపీ మంత్రివర్గంలో  లేరు అని చెప్పుకోవడానికి ఎంతమాత్రం వెనకాడాల్సిన అవసరం లేదు. నష్టాల్లో వున్న రాష్ట్రాన్ని ఆదుకోవడం కోసం చంద్రబాబు చేస్తున్న కృషిలో యాభై శాతం కృషి చేయగలిగినా ముఖ్యమంత్రిగా చేదోడుగా వున్నట్టు వుంటుంది. శ్రమించడానికి ఎవర్నో ఉదాహరణగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అందరికంటే పెద్ద ఉదాహరణగా ముఖ్యమంత్రి చంద్రబాబే కనిపిస్తున్నారు. అలాంటి చంద్రబాబు నాయుడి నాయకత్వంలో పనిచేస్తూ కూడా ఆయన్ని ఫాలో అవకుండా వున్న మంత్రులను ఏమనాలి? మంత్రివర్గం ఏర్పాటులో వివిధ సమీకరణాల కారణంగా కొంతమంది ప్యాసింజర్ రైళ్ళకు కూడా మంత్రి పదవులు దక్కాయి. సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లాంటి ముఖ్యమంత్రి పనితీరును వీళ్ళు అందుకోలేకపోతున్నారు. వారికి ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినా వేగాన్ని పెంచుకోలేకపోతున్నారు. అలాంటి మంత్రుల తీరు ఇలాగే కొనసాగితే ఆ ప్యాసింజర్ రైళ్ళను చంద్రబాబు పట్టాలు తప్పించే అవకాశం లేకపోలేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. సరైన పనితీరు ప్రదర్శించని మంత్రులు తమ వర్కింగ్ స్టైల్‌ని మెరుగు పరుచుకుని ముఖ్యమంత్రికి తగ్గ మంత్రులుగా ప్రశంసలు పొందితే అందరికీ ఆనందమే.

ఏపీలో బీజేపీకి దూకుడు అవసరమా?

భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ పుణ్యమా అని రాకరాక కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు పుణ్యమా అని ఆంధ్రపదేశ్‌లో మంత్రివర్గంలో స్థానం సంపాదించుకుంది. అయితే అన్నప్రాశన రోజునే ఆవకాయ తినేయాలని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికలలో అధికారంలోకి వచ్చేయాలని కలలు కంటున్నారు. అందుకోసం ఇప్పటి నుంచే దూకుడు ప్రదర్శిస్తున్నారు. అధికారం కోసం ఇప్పటి నుంచే విత్తనాలు వేస్తున్నారు. ఏపీకి చెందిన కొంతమంది బీజేపీ నాయకులు అప్పుడప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న కామెంట్లు, ఏపీలో రాజకీయ నిరుద్యోగంలో వున్న అనేకమందిని పార్టీలో చేర్చుకోవడం దీనినే సూచిస్తున్నాయి. అవసరమైతే వైసీపీతో దోస్తీ చేయాలని కూడా కొంతమంది బీజేపీ నాయకుల బుర్రలో ఆలోచనలు పుడుతున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయాలను ప్రదర్శించడం మొదలుపెడితే 2019 ఎన్నికల నాటికి ఏపీలో అధికారాన్ని సొంతం చేసుకోవచ్చన్నది అలాంటి నాయకుల ఆలోచన. అయితే ఏపీలో ఇంత దూకుడుగా వ్యవహరించడం బీజేపీకి అవసరమా అని ఆ పార్టీ నాయకులు ఆలోచించుకోవాల్సి వుంది. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన పాపం బీజేపీ ఖాతాలో కూడా వుంది. అయితే, తెలుగుదేశం పార్టీతో స్నేహం చేసిన పుణ్యమా అని ఏపీ ప్రజలు బీజేపీని క్షమించారు. కొన్ని స్థానాల్లో గెలిపించారు. ఏపీ ప్రభుత్వంలో భాగస్వామి అయ్యేలా చేశారు. అయితే ఇదంగా తన బలం కాదయా... టీడీపీతో స్నేహం వల్ల వచ్చిన బలమేనయా అనే విషయాన్ని మాత్రం కొంతమంది బీజేపీ నాయకులు మరచిపోయి వ్యవహరిస్తున్నారు. బీజేపీ మీద మొన్నటి వరకూ ఏపీలో కొంత సానుకూల అభిప్రాయమే వుండేది. అయితే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో మాట తప్పడం, ప్రత్యేక హోదా అడిగిన వాళ్ళని శత్రువులను చూసినట్టుగా చూడటం, ప్రత్యేక హోదా కోసం ఉద్యమించిన పాపానికి బీజేపీలోనే వున్న నటుడు శివాజీ గురించి చులకనగా మాట్లాడ్డం... ఇవన్నీ ప్రజలు గమనిస్తు్న్నారు. ఇవే కాకుండా ఏరకంగా చూసినా ఏపీలో బీజేపీ ప్రధాన పార్టీగా నిలబడే అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. అంచేత బీజేపీ నాయకులు 2019లో ఏపీలో అధికారంలోకి వచ్చే పగటి కలలను కనడం, దానికోసం రాజకీయాలు ప్రదర్శించడం మానుకుని తెలుగుదేశం ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా వుంటూ అభివృద్ధిలో భాగస్వామిగా కొనసాగితే అందరికీ మంచిది.

లక్కు అంటే కేసీఆర్ సార్‌దే!

నిజంగా లక్కు అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారిదే. చకచకా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చేసేశారు... అలా సోనియా గాంధీ చెవిలో క్యాలీఫ్లవర్ పెట్టేసి ఇలా తెలంగాణ సాధించేశారు. ఎలక్షన్లలో మాంఛి మెజారిటీ సాధించి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు. ఎన్నికల ముందు తాను ఇచ్చిన వాగ్దానాలకు భంగం కలిగినా వాటి గురించి ప్రశ్నించిన వాళ్ళను విజయవంతంగా నోళ్ళు మూయించగలుగుతున్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీడియాతో సహా ఎవరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి లేదు. ఇలాంటి గొప్ప అవకాశం గతంలో ఏ ముఖ్యమంత్రికైనా వచ్చిందా... కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి మాత్రమే దక్కింది. అందుకే లక్కు అంటే కేసీఆర్‌దేనని చెప్పుకోవాల్సి వచ్చింది. తాజాగా అనేక విషయాలలో ఆయనకు లక్కు లక్కలా అతుక్కుపోయింది. అలాంటి  రెండు విషయాలను ఇప్పుడు ప్రస్తావించుకుందాం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కేసీఆర్ మదిలోకి ప్రవేశించిన రెండు విషయాలు... అసాధ్యమైనా అమలు చేయాలని అనిపించిన అనేక విషయాల్లో రెండు ముఖ్యమైన విషయాలు... ఒకటి హుస్సేన్ సాగర్ని ఖాళీ చేసి మంచినీటి సరస్సుగా మార్చడం. రెండోది సచివాలయాన్ని ఉన్నచోట నుంచి తరలించి ఎర్రగడ్డకి తరలించడం. ఈ రెండు విషయాలనూ ప్రతిపక్షాలు, ప్రజలు, ప్రజా సంఘాలు ఎంత వ్యతిరేకించినా కేసీఆర్ ఎంతమాత్రం వెనకడుగు వేయలేదు. ఒక దశలో ఈ రెండు పనులనూ చేసి తీరతానని ఆయన మొండి పట్టుదలతో వ్యవహరించారు. ఆ పట్టుదల ఎంతవరకూ వెళ్ళిందంటే, ఈ రెండు అంశాలూ అసాధ్యాలని ఆయనకే అర్థమైపోయినా వెనకడుగు వేయలేనంత పట్టుదలను ప్రదర్శించారు. అయితే, ఈ రెండు విషయాల్లో ఆయన వెనకడుగు వేసినట్టు కాకుండా, చట్టం ఒప్పుకోలేదు అందుకే ఈ రెండు పనులనూ చేయలేకపోయానని ఆయన చెప్పుకోవడానికి వీలుగా ఆయనకు గోల్డెన్ ఛాన్స్‌లు వచ్చాయి. ఎర్రగడ్డలో సచివాలయాన్ని నిర్మించడానికి పౌర విమాన యాన శాఖ అభ్యంతరం తెలిపినట్టు సమాచారం. అందువల్ల సికింద్రాబాద్‌లో మిలటరీ ఆధ్వర్యంలో వున్న జింఖానా, పరేడ్ మైదానాల్లోకి సచివాలయాన్ని తరలించాలని ఆయన భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కేసీఆర్ ఆలోచనలకు మిలటరీవాళ్ళు ఎలాగూ ఒప్పుకోరు. కాబట్టి సచివాలయాన్ని తాను అనుకున్నట్టుగా తరలించలేకపోయానని కేసీఆర్ చెప్పుకోవచ్చు. అలాగే హుస్సేన్ సాగర్ ఖాళీ చేసే పనులు మొన్నీమధ్యే ప్రారంభమయ్యాయి. ఈ ఎండాకాలం లోపు హుస్సేన్ సాగర్ ఖాళీ చేయడం అనేది దేవుడు దిగి వచ్చినా అయ్యే పని కాదు. కేసీఆర్ హుస్సేన్ సాగర్ని ఖాళీ చేయించలేకపోయాడనే విమర్శలు రాకుండా ఆయన్ని చట్టం కాపాడుతోంది. చెన్నైలోని సదరన్ గ్రీన్ ట్రిబ్యూనల్ హుస్సేన్ సాగర్ని ఖాళీ చేయడం తక్షణం ఆపేయాలని ఆదేశించింది. ఇప్పుడు ఈ విషయంలో కూడా గ్రీన్ ట్రిబ్యునల్ తమకు అడ్డు పడిందని కేసీఆర్ తప్పించుకోవచ్చు. లక్కు అంటే ఇలా వుండాలి.

బాబూ రాహుల్... జర భద్రం

రాహుల్ గాంధీ ఈమధ్య భారీ స్థాయిలో రిస్కులు చేస్తున్నారు. తాను జనాల్లో కలిసిపోయే నాయకుడిని అని నిరూపించుకోవడానికి ఆయన పదే పదే ప్రయత్నిస్తున్నారు. ఆయన తండ్రి రాజీవ్ గాంధీ ఏ విధంగా సెక్యూరిటీ నిబంధనలను అధిగమించి జనాల్లోకి వెళ్ళేవారో అందరూ చూశారు. చివరికి ఆ జనాల్లో కలసిపోయే తత్వం శ్రీ పెరంబదూరులో ఎలా వికటించిందో కూడా అందరూ చూశారు. అయితే తన తండ్రి అనుభావాల నుంచి పాఠాలను నేర్చుకోని రాహుల్ గాంధీ తన తండ్రిలాగానే జనాల్లో కలసిపోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎక్కడైనా పబ్లిక్ మీటింగ్ జరిగితే సడెన్‌గా జనాల్లోకి వెళ్ళిపోతున్నారు. యుపీఏ అధికారంలో ఉన్న సమయంలో ఆయన ఓసారి సికింద్రాబాద్‌లోని ఓ హోటల్‌కి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా వచ్చి బిర్యానీ తిని వెళ్ళారు. అది ఆయనకు బాగానే వుండొచ్చుగానీ, ఆయన సెక్యూరిటీ బాధ్యతలు చూసేవారికి మాత్రం చెమటలు పడుతున్నాయి. అధికారం కోల్పోయిన తర్వాత మొన్నీమధ్యే ఎవరికీ చెప్పాపెట్టకుండా, ఎక్కడకి వెళ్తున్నాడో కూడా చెప్పకుండా నెలలకు నెలలు గాయబ్ అయిపోయారు. ఇప్పుడు చేస్తున్న పాదయాత్రల సంగతి సరేసరి. ఇలాంటి రిస్కులు చేయడం అలవాటు అయిపోయిన ఆయన ఇప్పుడు మరో రిస్కు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ రిస్కు... ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి విద్యార్థులతో సమావేశం కావడం. రాహుల్ గాంధీ త్వరలో తెలంగాణలో పర్యటించబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏపీలో చచ్చిపోయింది. తెలంగాణలో చిక్కి శల్యమై చావడానికి సిద్ధంగా వుంది. అలాంటి పార్టీకి ప్రాణం పోసే ప్రయత్నంలో భాగంగా రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నారట. ఈ సందర్భంగా మా యూనివర్సిటీకి కూడా రండి సర్ అని ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన కొన్ని విద్యార్థి సంఘాల నాయకులు ఆహ్వానించారట. అంచేత ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చి విద్యార్థులను కలిసే ఆలోచనలో వున్నారట. అయితే,  ఉస్మానియాలో చాలా విద్యార్థి సంఘాలు వున్నాయి. కొన్ని సంఘాలు పిలిచాయని వెళ్తే, మిగతా సంఘాలు ఏమంటాయో ఊహించడం చాలా కష్టం. ప్రస్తుతం ఉస్మానియా విద్యార్థులు ఉద్యోగాలు దొరకవన్న నిస్పృహలో వున్నారు. అసలే విద్యార్థులు సున్నిత హృదయం వున్నవారు. రాహుల్ గాంధీ వచ్చి నాలుగు మంచి మాటలు చెబితే చప్పట్లు కొట్టే స్థితిలో ఎంతమాత్రం లేరు. వారివి కల్లాకపటం ఎరుగని మనసులు కాబట్టి ఎలాగైనా రియాక్ట్ అవుతారు. గతంలో అనేకమంది ప్రముఖ నాయకులకు వాళ్ళు దేహశుద్ధి చేస్తే, దేహశుద్ది చేయించుకున్నవాళ్ళు కూడా ఉస్మానియా విద్యార్థుల ఆవేదనను సానుభూతితో అర్థం చేసుకోవడం మినహా ఏమీ చేయలేకపోయారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొన్నటి వరకూ వారి దృష్టిలో ఒక హీరో. అలాంటి హీరోనే ఇంతవరకు ఉస్మానియా  క్యాంపస్‌లోకి వెళ్ళే సాహసం చేయలేదు. మరి ఆ సాహసం రాహుల్ గాంధీకి ఎందుకట?

ఆకాష్ అదరహో

భారత శాస్త్రవేత్తలు రూపొందించిన సరికొత్త క్షిపణి ‘ఆకాష్’. ఆకాష్... పేరు మూడు అక్షరాలు. పేరుకు తగ్గట్టు శత్రు దేశాల వారిని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించగల సత్తా వున్న అస్త్రం. శత్రుదేశాలకు చెందిన విమానాల అతి సూక్ష్మమైన లక్ష్యాలను ఛేదించగలదు. 25 కిలోమీటర్ల దూరంలో వున్న లక్ష్యాన్ని 35 క్షణాల్లో పేల్చేయగలదు. ఒకేసారి నాలుగు లక్ష్యాల మీద ఎనిమిది క్షిపణులను ప్రయోగించవచ్చు. లాంచింగ్ ప్యాడ్ ద్వారా ప్రయోగించడానికి ఎక్కడి నుంచి ఎక్కడికైనా తరలించడానికి అనువుగా వుంటే క్షిపణి.  రాడార్ అనుసంధానంతో పనిచేస్తుంది. ఇన్ని ప్లస్ పాయింట్లు వున్న క్షిపణి మన పొరుగు దేశాలైన పాకిస్థాన్, చైనాలకు కూడా లేదు. అంటే ఇప్పుడు మన అమ్ములపొదిలో ఆకాష్ చేరింది కాబట్టి ఈ రెండు దేశాలు అదిరిపోవడం ఖాయం. అయితే మన దేశం ఆత్మ రక్షణ కోసం మాత్రమే ఈ క్షిపణిని తయారు చేసింది కాబట్టి ఆ దేశాలు భయపడాల్సిన అవసరం లేదు.. మనతో జాగ్రత్తగా వుంటే చాలు. ‘ఆకాష్’ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఆయుధం. 600 కోట్ల వ్యయంతో, 18 ఏళ్ళ పరిశోధనతో ఈ ఆయుధం రూపకల్పన జరిగింది. దేశంలోని దాదాపు రెండు వందల సంస్థలు ఈ క్షిపణుల తయారీలో భాగస్వాములు అయ్యాయి. దాదాపు 5,500 మంది శాస్త్రవేత్తలు ఆకాష్ క్షిపణిని తయారు చేయడానికి శ్రమించారు. ఇప్పటికి ఎన్నోసార్లు ఈ క్షిపణిని పరీక్షించారు. అన్నిసార్లూ నిర్దేశించిన లక్ష్యాన్ని ఆకాష్ ఛేదించగలిగింది. మంగళవారం నాడు ఈ క్షిపణిని ఆర్మీకి అందజేసింది. ఆకాష్ లాంటి క్షిపణి మన ఆర్మీ చేతికి చేరింది. ఇక మనం ఎప్పటిలాగే గుండెల మీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోవచ్చు.

లోక్ సభలో అల్లరి చేస్తే హైకోర్టు విభజన జరుగుతుందా?

  ఉమ్మడి హైకోర్టును విభజనకు కేంద్రమే చొరవ చూపి తక్షణమే విభజించాలని లోక్ సభలో తెరాస యంపీలు ఈరోజు గట్టిగా వాదించారు. నినాదాలతో సభను హోరెత్తించారు. అంతకు ముందు పార్లమెంటులో గాంధీ విగ్రహం వద్ద బైటాయించి నిరసన ప్రదర్శన కూడా చేసారు. అయితే వారందరికీ కూడా కేంద్రం కూడా హైకోర్టు విభజనకు సుముఖంగానే ఉందని కానీ హైకోర్టులో దాఖలయిన ఒక పిటిషన్ కారణంగానే ఆలస్యం అవుతోందని తెలుసు. కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ కూడా వారికి అదే విషయం చెప్పి హైకోర్టు విభజనకు మరికొంత సమయం పడుతుందని చెప్పినప్పటికీ వారు తమ ఆందోళనను విరమించలేదు.   ఇంతకు ముందు హైకోర్టు విభజనపై దాఖలయిన ఒక పిటిషనుపై విచారణ జరుగుతున్నప్పుడు ఒకవేళ ఉమ్మడి హైకోర్టుని విభజించి తెలంగాణా రాష్ట్ర హైకోర్టుని వేరేచోటికి తరలించాలంటే విభజన చట్టాన్ని సవరించవలసి ఉంటుందని హైకోర్టు ధర్మాసనం కుండబ్రద్దలు కొట్టినట్లు తేల్చి చెప్పింది. కొద్ది రోజుల క్రితమే ఆ పిటిషనుపై హైకోర్టు ధర్మాసనం తన తుది తీర్పు వెలువరించింది. అందులో రాష్ట్ర విభజన చట్ట ప్రకారం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికే హైకోర్టు ఏర్పాటు చేయవలసి ఉంటుంది తప్ప తెలంగాణా రాష్ట్రానికి కాదణి విస్పష్టంగా పేర్కొనబడి ఉంది. ప్రస్తుతం రెండు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుగా కొనసాగుతున్నప్పటికీ అది తెలంగాణకే చెందుతుంది. కనుక హైదరాబాద్ లో వేరేచోట తెలంగాణా హైకోర్టుని తరలించడం లేదా తెలంగాణా గడ్డ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టును ఏర్పాటు చేయడం రెండూ కూడా విభజన చట్ట ప్రకారం వీలుపడదు. కనుక ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు భవనాలు నిర్మించుకొని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అక్కడికి తరలించేవరకు కూడా ఉమ్మడి హైకోర్టు కొనసాగవలసిందేనని,” స్పష్టంగా పేర్కొంది.   కనుక ఒకవేళ తెరాస యంపీలకు నిజంగా హైకోర్టు విభజన జరగాలని కోరుకొంటున్నట్లయితే వారు ముందుగా విభజన చట్ట సవరణకు పట్టుబట్టాలి. కానీ వారు ఆపని చేయకుండా సభలో రాద్ధాంతం చేస్తున్నారు.మరి కొద్ది రోజులలో పార్లమెంటు సమావేశాలు ముగిసిపోతాయి. కనుక ఈలోగానే వారు చట్ట సవరణకు కేంద్రంపై ఒత్తిడి తెస్తే ఏమయినా ప్రయోజనం ఉంటుంది.

టీడీపీ: త్యాగాలకు సరైన గుర్తింపు లభించాలి

త్వరలో హైదరాబాద్‌లో తెలుగుదేశం పార్టీ మహానాడు జరగబోతోంది. తెలుగుదేశం పార్టీ పదేళ్ళ తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చి సంవత్సరం కావొస్తున్న సందర్భంగా జరిగే ఈ మహానాడును చాలా కీలకమైన మహానాడుగా భావించాల్సి వుంటుంది. ఈ మహానాడు జరిగేలోపలే ఇప్పటి వరకు పెండింగ్‌లో వున్న నామినేషన్ పోస్టుల భర్తీని కూడా పూర్తి చేయాలని తెలుగుదేశం నాయకత్వం భావిస్తూ వుండటం తెలుగుదేశం నాయకులలో, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని పెంచింది. పదేళ్ళుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ పార్టీ జెండాను భుజాన మోయడంతోపాటు ఎన్నో త్యాగాలు చేసిన కార్యకర్తలు, నాయకులకు మహానాడు లోపు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోలెడన్ని నామినేషన్ పోస్టులు ఖాళీగా వున్నాయి. ఈ పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారా అని తెలుగుదేశం క్యాడర్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇటీవల జరిగిన టీటీడీ పాలకమండలి నియామకం ఈ పోస్టుల భర్తీకి శుభారంభం అని కేడర్ భావిస్తోంది. అలాగే రాష్ట్రంలోని అనేక దేవాలయాలకు ఛైర్మన్లు, పాలక మండలి సభ్యులను త్వరలో నియమించబోతున్నారు. రాష్ట్రంలోని 109 మార్కెట్ కమిటీల్లో ఇప్పటి వరకు 51 కమిటీలకు మాత్రమే నియామకాలు జరిగాయి. మిగతా కమిటీలకు కూడా నియామకాలు పూర్తి చేయనున్నారు. పార్టీ కార్యక్రమాల కమిటీలు, గ్రంథాలయ సంస్థల ఛైర్మన్లు, అనేక కార్పొరేషన్ల పదవులను భర్తీ చేయబోతున్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం పాటుపడుతున్న నాయకులు ఎంతోమంది వున్నారు. వారు పార్టీకోసం ఎన్నో త్యాగాలు చేశారు. వారి త్యాగాలకు సరైన గుర్తింపు ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీ సందర్భంగా లభించాలని వారు కోరుకుంటున్నారు. గత ఎన్నికలలో పలు నియోజకవర్గాల్లో గెలిచే సామర్థ్యం, స్థానికంగా ప్రజాబలం ఉన్న కొంతమంది నాయకులు పార్టీ నుంచి టిక్కెట్ ఆశించారు. అయితే వివిధ రాజకీయ సమీకరణాల కారణంగా వాళ్ళు పోటీ నుంచి తప్పుకుని, పార్టీ నిలబెట్టిన అభ్యర్థి గెలుపు కోసం చిత్తశుద్ధిగా కృషి చేశారు. ఆ సమయంలో వారు చేసిన త్యాగం కారణంగానే పలు నియోజకవర్గాలలో తెలుగుదేశం అభ్యర్థులు గెలవగలిగారు. ఆ నాయకులు చేసిన త్యాగాలే పదేళ్ళ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కారణమయ్యాయి. ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీలో వారికి సరైన ప్రాధాన్యం, సముచిత స్థానం ఇవ్వాలన్న అభిప్రాయాలు కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నాయి. పార్టీ కోసం శ్రమించిన వారికి సరైన గౌరవం ఇస్తే వారు మరింత ఉత్సాహంగా పనిచేసి పార్టీకి మరింత మంచి పేరు తెస్తారని కార్యకర్తలు అంటున్నారు. అయితే, ఇప్పటి వరకు పార్టీ కొన్ని పదవుల కోసం కొంతమందిని ఎంపిక చేసిన తీరు విషయంలో కార్యకర్తలు కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీటీడీ బోర్డు ఛైర్మన్ పోస్టును తెలంగాణకు చెందిన దళిత నాయకుడు మోత్కుపల్లి నర్సింహులుకు ఇస్తే బావుండేదని భావిస్తున్నారు. దళితులకు దేవాలయ ప్రవేశం అనేది ఇప్పటికీ కొన్నిచోట్ల దురాచారంగా అమల్లో వుంది. అలాంటి పరిస్థితుల్లో దేశంలోనే ప్రముఖ దేవాలయం బోర్డు ఛైర్మన్‌గా ఒక దళితుడిని నియమిస్తే దాని ప్రభావం ఈ సమాజం మీద ఎంతో వుండేదని, దళితులకు ఒక మనోధైర్యం ఇచ్చినట్టు వుండేదన్న అభిప్రాయాన్ని కార్యకర్తలు వ్యక్తం చేశారు. అలాగే పార్టీకి ఎలాంటి సంబంధం లేని పరకాల ప్రభాకర్‌ని పార్టీ మీడియా సలహాదారుడిగా నియమించడం, ఎన్నారై కూచిభొట్ల ఆనంద్‌ని కూచిపూడి నాట్యారామం అధ్యక్షుడిగా ఎంపిక చేయడం, వేరే పార్టీ నుంచి వచ్చిన తిప్పేస్వామిని ఎమ్మెల్సీ చేయడం, గుడివాడలో పార్టీ అభ్యర్థిని గెలిపించలేకపోయిన పిన్నమనేని వెంకటేశ్వరరావుకు ఆప్కాబ్ ఛైర్మన్ పదవి కట్టబెట్టడం... ఇలాంటి వాటిని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. మొదటి విడత నామినేటెడ్ పోస్టుల భర్తీ సందర్భంగా దొర్లిన ఇలాంటి పొరపాట్లు మరోసారి జరగకుండా పార్టీకోసం శ్రమించిన వారికి న్యాయం జరిగేలా చూడాలని వారు కోరుకుంటున్నారు.

వైసీపీ కష్టాలు ఇన్నిన్ని కావయా...

జగన్ గారి వైసీపీ అసలే కష్టాల కడలిలో కొట్టుకుపోతోంది. పార్టీ నాయకుడు జగన్ ఎప్పుడు అరెస్టు అవుతాడో అనే భయం అందరి గుండెల్ని గుబగుబలాడిస్తోంది. దీనికితోడు జగన్ గారి ఆస్తులన్నీ వరుసగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చేతిలో ఇరుక్కుపోతున్నాయి. అలాగే పార్టీ ఎమ్మెల్యేలలో చాలామంది ఎప్పుడెప్పుడు వైసీపీని విడిచిపెట్టి వెళ్ళిపోవాలా అని ఉవ్విళ్లూరుతున్నారు. మొన్నామధ్య జగన్ ప్రాజెక్టుల యాత్ర చేసిన సమయంలో 40 మంది ఎమ్మెల్యేలు జగన్‌కి జలక్ ఇవ్వబోయారు. చివరికి జగన్ వాళ్ళని గడ్డం పట్టుకుని బతిమాలడంతో శాంతించారు. అయితే పేలడానికి సిద్ధంగా వున్న అగ్నిపర్వతం తాత్కాలికంగా శాంతించినా, ఏదో ఒకరోజు భళ్ళున బద్దలవక మానదు. ఈ 40 మంది ఎమ్మెల్యేల విషయంలో జగన్‌కి ఆ భయం తప్పదు. ఈ కష్టాలు చాలవన్నట్టుగా వైసీపీకి మరో కొత్త కష్టం వచ్చిపడింది... అది.. ఎర్రచందనం దొంగలతో వైసీపీ ఎమ్మెల్యేలకు లింకులు వున్నట్టు ఆధారాలు లభించడమే. ఎర్రచందనం స్మగ్లర్ మస్తాన్‌వలీ కర్నూలు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆయనగారు లేటెస్ట్‌గా పోలీసులకు దొరికిపోయారు. ఒక సినిమా కూడా తీసిన అతగాడు ఆ సినిమా హీరోయిన్‌ని మూడోపెళ్ళి చేసుకున్నాడు. ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారంలో మస్తాన్ వలీ పాత్ర మాత్రమే కాకుండా స్థానికంగా వుండే ఛోటామోటా వైసీపీ నాయకుల హస్తం కూడా వున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఎర్రచందనం బిగ్‌బాస్ గంగిరెడ్డికి, వైసీపీకి వున్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా ఇలా వుంటే, మస్తాన్ వలీ మూడో భార్య, హీరోయిన్ నీతూ అగర్వాల్ పోలీసులకు దొరికిపోయే ముందు కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసిందని, ఆమె పోలీసులకు లొంగిపోతానని అంటే వైసీపీ ఎమ్మెల్యేలు వద్దని వారించారని వచ్చిన వార్తలు పార్టీ గుండెలో రాయి పడేలా చేశాయి. అయితే పోలీసు వర్గాలు మాత్రం అధికారికంగా వైసీపీ ఎమ్మెల్యేల పేర్లు బయటపెట్టలేదు. పూర్తిస్థాయి విచారణ జరిపిన అనంతరం సదరు ఎమ్మెల్యేల పేర్లు బయటపెట్టే అవకాశం వుందని తెలుస్తోంది. మరి వైసీపీ నాయకత్వం ఈ గండం నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి.

టీ సర్కారు మెడలో ‘ఒప్పంద’ పాము

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కోరికోరి మెడలో వేసుకున్న ‘ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ’ పాము ఇప్పుడు ఆయనకే పెద్ద సమస్యగా మారింది. తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన అనేక హామీలు, వాగ్దానాల్లో ఒప్పంద కార్మికుల క్రమబద్ధీకరణ కూడా ఒకటి. తెలంగాణ ఏర్పడటం ఆలస్యం రాష్ట్రంలో వున్న ఒప్పంద కార్మికులందర్నీ క్రమబద్ధీకరించేస్తాం అని ఆయన హామీ ఇచ్చారు. దాంతో ఒప్పంద ఉద్యోగులు కూడా తెలంగాణ ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత బోలెడన్ని ఉద్యోగాలు ఖాళీ అయిపోతాయని, ఆంధ్రావాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనకు ఉద్యోగాలే ఉద్యోగాలు అంటూ ఉద్యమ సమయంలో చెప్పిన మాటలు అందరి మీద బాగా పనిచేశాయి. ముఖ్యంగా అప్పటికే ఒప్పంద ఉద్యోగుల హోదాలో వున్నవాళ్ళ మీద బాగా పనిచేశాయి. ఖాళీ అయిన ఉద్యోగాల్లో తమనే తీసుకుంటారని వారు భావించారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హామీ ఇచ్చినంత వేగంగా పని జరగలేదు. దీనికితోడు ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణను విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు ఉద్యమం చేసింది తామయితే, తమకు ఉద్యోగాలు రాకుండా ఒప్పంద ఉద్యోగులు చేస్తున్నారంటూ విద్యార్థులు ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణను వ్యతిరేకించారు. ఒకవైపు విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు... మరోవైపు ఒప్పంద ఉద్యోగులు తమను క్రమబద్ధీకరించాల్సిందేనని పట్టుదలతో వున్నారు. దాంతో కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా కేసీఆర్ ప్రభుత్వం పరిస్థితి తయారైంది. దీనికితోడు తాజాగా విద్యుత్  శాఖలో వున్న వేలాది మంది ఒప్పంద ఉద్యోగులు తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని అంటూ ఆందోళన కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టారు. దీంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో వున్న వేలాది మంది ఉద్యోగులను పర్మినెంట్ చేయడం అంటే మామూలు విషయం కాదు... అలాగని ఇచ్చిన హామీ నుంచి వెనక్కి వెళ్ళే పరిస్థితీ లేదు. ఒకవేళ ఇచ్చిన మాట మీద నిలబడితే విద్యా్ర్థులు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. దీనికితోడు ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అధికారులు ఏమంటారో, ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుందో లేదో... మరి ముఖ్యమంత్రి గారు తన మెడకు చుట్టుకుని వున్న ఈ పామును చాకచక్యంగా వదిలించుకుంటారో... మరి ఇంకా ఏం జరుగుతుందో చూడాలి.

రాహుల్‌గాంధీ నిర్ణయం కరెక్ట్!

భారత రాజకీయాలలో రాహుల్ గాంధీకి వున్న ‘విలువ’ ఏమిటో అందరికీ తెలిసిందే. గతించిన నాయకులను వదిలేస్తే, సోనియాగాంధీ ముద్దుల కొడుకు కావడం మినహా ఆయనకు వున్న ప్రత్యేకత ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీలో తలపండిన నాయకులెందరో వున్నారు. వారెవరితోనూ పోల్చగలిగే స్థాయి ఆయనకు లేదని అంటాను. తలపండిన నాయకుల సంగతి అలా వుంచితే, కాంగ్రెస్ పార్టీలోని సామాన్య కార్యకర్తకు వున్నంత రాజకీయ పరిజ్ఞానం కూడా రాహుల్ గాంధీకి లేదన్న అభిప్రాయాలు వినిపిస్తూ వుంటాయి. అలాంటి రాహుల్ గాంధీ అనేకసార్లు తన రాజకీయ అపరిపక్వతను నిరూపించుకున్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న భారతీయ జనతా పార్టీ ఆయన్ని ప్రజల ముందు ఒక ‘మొద్దబ్బాయి’గా ప్రొజెక్ట్ చేసి సక్సెస్ అయింది. తన మీద ఇలాంటి ముద్ర వుందని తెలిసినప్పటికీ రాహుల్ గాంధీ దానిని తొలగించుకునే ప్రయత్నం చేయకపోగా, తన మాటలు, చేతలతో ఆ ‘ముద్ర’ మరింత బలపడేలా చేసుకుంటున్నారు. ఇదిలా వుంటే ఆయన ఈమధ్య పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాకుండా ‘సెలవు’ తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎక్కడకి వెళ్ళారో తెలియదు, ఎందుకు వెళ్ళారో తెలియదు. బహుశా ఆయన ఏ దేశంలోనో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళి వుంటారని అందరూ భావించారు. ఇతర రాజకీయ పార్టీలన్నీ ‘రాహుల్ గాంధీ కనిపించడం లేదు’ అని కామెడీ చేసే పరిస్థితి వచ్చింది. యుపీఏ ప్రభుత్వం ఇచ్చిన ఆర్టినెన్స్‌ని చించిపారేయడంతోపాటు అనేక విషయాలలో రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ కాదనే అభిప్రాయాలు వినిపించాయి. అయితే ఇన్నాళ్ళ తర్వాత రాహుల్ గాంధీ ఒక కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకున్నారు. అదే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పాదయాత్ర చేయాలనే నిర్ణయం. ఈ సమయంలో రాహుల్ గాంధీ పాదయాత్ర నిర్ణయం చాలా సమంజసమైన నిర్ణయం. ఎందుకంటే, ఆయన చాలాకాలంపాటు ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకున్నారు. అందువల్ల ఆయన కాస్త లావై వుంటారు. ఇప్పుడు పాదయాత్రలు చేయడం వల్ల విశ్రాంతి తాలూకు ఫ్యాట్ మొత్తం కరిగిపోయే అవకాశం వుంటుంది. తద్వారా ఆయన తన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. భారీ విశ్రాంతి తర్వాత బాగా వాకింగ్ చేయాలనే నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ అభినందనీయుడు.

శివాజీకి రాజకీయ పాఠాలు

సినీ నటుడు, బీజేపీ నాయకుడు (ఆయన బీజేపీ నాయకుడు కాదని బీజేపీ వాళ్ళు అంటున్నారు అది వేరే సంగతి) శివాజీ ఇప్పుడు రాజకీయ పాఠాలు నేర్చుకుంటున్నారు. సాధారణంగా రాజకీయాల్లోకి వచ్చినవాళ్ళు కొంతకాలం ఏ పార్టీలో అయినా చేరి కార్యకర్తగా పనిచేస్తారు. దాదాపు అన్ని పార్టీలూ తమ కార్యకర్తలకు రాజకీయ శిక్షణ ఇస్తూ వుంటాయి. ఇలా సొంత అనుభవాలు, పొందిన శిక్షణ, నేర్చుకున్న గుణపాఠాలతో ఎవరైనా రాజకీయ నాయకుడిగా రాటుతేలుతూ వుంటారు. అయితే నటుడు శివాజీకి రాజకీయాల్లో అనుభవం తక్కువ. నరసరావుపేట నుంచి టీవీ రంగానికి, టీవీ రంగం నుంచి సినిమా రంగానికి, ఆ తర్వాత సినిమాల నుంచి డైరెక్టుగా రాజకీయ రంగానికి వచ్చారాయన. దాంతో ఆయనకు రాజకీయాలంటే ఏమిటి, రాజకీయ నాయకులంటే ఎలా వుంటారు... ఎలా వుండాలి అనే అవగాహన సహజంగానే తక్కువ. అయితే ఆయన విషయంలో ప్రస్తుతం జరుగుతున్న ‘రాజకీయాలు’ ఆయనకు రాజకీయ పాఠాల్లా ఉపయోగపడుతున్నాయి. రాటు తేలేలా చేస్తున్నాయి. మొన్నటి ఎన్నికలలో శివాజీ బీజేపీలో చేరారు. బీజేపీ తరఫున ప్రచారం చేశారు. ఇప్పుడు మంత్రిగా వున్న బీజేపీ నాయకుడు కామినేని శ్రీనివాస్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న రోజునే శివాజీ కూడా ఆయనతోపాటుగా బీజేపీలో చేరారట. ఆ విషయం శివాజీనే చెప్పారు. వీర్రాజు అనే బీజేపీ నాయకుడు అసలు శివాజీ బీజేపీకి చెందిన నాయకుడే కాదని అన్నప్పుడు శివాజీ ఈ వివరణ ఇచ్చారు. తాను బీజేపీ నాయకుడిని కాకపోతే, మంత్రిగా వున్న కామినేని శ్రీనివాస్ కూడా బీజేపీ నాయకుడు కాదని శివాజీ చెప్పారు. ఇప్పుడు లేటెస్ట్ ట్విస్ట్ ఏమిటంటే, మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా శివాజీ ఏ పార్టీలో వున్నాడో తనకు తెలియదని స్టేట్‌మెంట్ ఇచ్చారు. మాజీ కేంద్ర మంత్రిణి పురందేశ్వరి కూడా శివాజీకి, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేశారు. ఇలా బీజేపీలోని నాయకులు ఒకరి తర్వాత ఒకరు పార్టీలో శివాజీకి అస్తిత్వమే లేదని ప్రకటిస్తూ వుండటం శివాజీకి అసలు ‘రాజకీయాలు’ అంటే ఏమిటో అర్థమయ్యేలా చేస్తున్నాయి. శివాజీ బీజేపీ నాయకుడు అవునా, కాదా అనే సందేహం మొన్నటి వరకూ బీజేపీ నాయకులు ఎవరికీ కలగలేదు. ఆయన ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని జలదీక్ష, నిరసన దీక్షలు చేస్తూ వుండే సరికి ఆయన బీజేపీ నాయకుడు కానేకాదని చెబుతున్నారు. శివాజీ గుంటూరు కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్ష చేస్తే చిన్నా చితకా సంఘాల నాయకులే తప్ప ప్రధాన పార్టీల నాయకులెవరూ పట్టించుకున్న పాపాన కూడా పోలేదు. అందరూ ఏపీకి ప్రత్యేక హోదా కావాలని అంటారు. అదే డిమాండ్‌తో శివాజీ దీక్ష చేస్తే మాత్రం ఎంతమాత్రం పట్టించుకోరు. దీన్నే రాజకీయం అంటారు. జరుగుతున్న పరిణామాలన్నీ శివాజీకి రాజకీయ పాఠాలుగా ఉపయోగపడుతూ వుండవచ్చు.