ఈ ‘రవాణా’ కాష్ఠం చల్లారదా?

కరెక్టుగానే చదివారు.. రావణ కాష్ఠం కాదు..  రవాణా కాష్ఠం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇప్పుడు రవాణా కాష్ఠం అంటుకుంది. అది రావణ కాష్ఠంలా మండుతోంది. అది ఎప్పుడు చల్లారుతుందో, అసలు చల్లారుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. తమ రాష్ట్రంలో ప్రవేశించే ఆంధ్రప్రదేశ్ వాహనలు పన్ను చెల్లించాలని అంటూ ఈ కాష్ఠాన్ని మొదట తెలంగాణ ప్రభుత్వమే రగిలించింది. తెలంగాణ ప్రభుత్వం రవాణా పన్ను వసూలు చేస్తున్నప్పుడు మేం మాత్రం ఎందుకు ఊరుకోవాలని అంటూ ఏపీ ప్రభుత్వం కూడా తమ సరిహద్దుల దగ్గర రవాణా పన్ను వసూలు చేయడం ప్రారంభించింది. దాంతో రెండు రాష్ట్రాల ప్రజలకు బాదుడు తప్పడం లేదు. ప్రజల సంగతి ఎలా వున్నప్పటికీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం ఆదాయం సమకూరుతోంది. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల మధ్య అర్ధ శతాబ్దానికి పైగా జరిగిన సంసారబంధం కారణంగా ఒక ప్రాంతం మరో ప్రాంతం మీద ఆధారపడక తప్పని పరిస్థితి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ఈ రాష్ట్రానికి పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ వుంటుంది కాబట్టి తమ రాజధానికి వెళ్ళడానికి తాము రవాణా పన్ను చెల్లించాల్సి రావడమేంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ ప్రశ్నకు తెలంగాణ ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రావడం లేదు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో వుంది. రాజధానికి వెళ్ళడానికి రవాణా పన్ను చెల్లించడం అనేది ఎంతవరకు సమంజసమో గౌరవనీయ న్యాయస్థానం చెప్పాల్సి వుంది. మరి న్యాయస్థానం తన నిర్ణయాన్ని ప్రకటించేలోపు పన్ను వసూళ్ళు అయితే యథావిధిగా జరుగుతూనే వున్నాయి. ఈ రవాణా పన్ను కారణంగా రెండు రాష్ట్రాల్లోనూ నిత్యావసరాల ధరలు పెరిగే అవకాశం వుందని పరిశీలకులు భావిస్తున్నారు. రవాణా పన్ను సాకు చెప్పి వ్యాపారులు అన్ని వస్తువుల ధరలనూ పెంచే ప్రమాదం వుందని అనుమానిస్తున్నారు. రవాణా పన్ను అనేది రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదాయాన్ని ఇచ్చే మార్గంగా వుండొచ్చేమోగానీ, రెండు రాష్ట్రాల ప్రజలూ ఈ విధానం పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఈ రవాణా కాష్ఠం సాధ్యమైనంత త్వరగా చల్లారితే బావుండని కోరుకుంటున్నారు.

మీడియాని నియంత్రించాల్సింది ఇలా...

టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మీడియాని నియంత్రించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోయే తరాల రాజకీయ నాయకులకు ఎన్నో మార్గాలు చూపించారు. కేసీఆర్ మీడియాని నియంత్రించిన తీరు చూసి ఆయన రాజకీయ శత్రువులు కూడా ఆశ్చర్యంతో నోళ్ళు నొక్కుకున్నారు. కర్ర విరగకుండా పాము చచ్చిన చందాన ప్రభుత్వం మీద నేరుగా వేలెత్తి చూపించడానికి అవకాశం లేని విధంగా ఆయన మీడియాని నియంత్రించిన తీరు అమోఘం. గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు మీడియాని నియంత్రించాలని చూశారుగానీ, ఆ ప్రయత్నాలు ఫలించక చేతులు ఎత్తేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో యావత్ మీడియా ప్రభుత్వాన్ని చూసి భయపడుతోంది. కేసీఆర్‌కి, ఆయన ప్రభుత్వానికి  వ్యతిరేకంగా ఒక వార్త రాయాలన్నా, ఒక కథనం ప్రసారం చేయాలన్నా ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితికి మీడియా చేరుకుంది. అధికారం చేపట్టిన వెంటనే రెండు ఛానళ్ళకు తన చేతికి మట్టి అంటకుండా చుక్కలు చూపించిన కేసీఆర్ చతురత సామాన్యమైనది. వాటిలో ఒక ఛానల్ గండం నుంచి గట్టెక్కి బతుకు జీవుడా అనుకుంటూ వుంటే, మరో ఛానెల్ ఎన్నాళ్ళీ సంకెళ్ళు అని ఆవేదనగా ప్రశ్నిస్తోంది. సచివాలయంలోకి మీడియా ప్రతినిధుల ప్రవేశానికి చెక్ పెట్టే ప్రయత్నం కూడా కేసీఆర్‌ మీడియా విషయంలో అనుసరిస్తున్న దృఢ వైఖరికి అద్దం పట్టింది. అయితే మీడియాని నియంత్రించడం అనేది బయటి మీడియా విషయంలో మాత్రమే కాకుండా సొంత మీడియా విషయంలో కూడా అమలు చేస్తే బాగుండేదేమో. టీఆర్ఎస్ సొంత మీడియాలో ప్రభుత్వానికి మాత్రమే అనుకూలంగా కథనాలు రావడం, ఇతర పార్టీలకు, సీమాంధ్రులకు వ్యతిరేకంగా మాత్రమే వస్తున్న కథనాలను చూసి మీడియాను ఈ రకంగా కూడా నడిపించవచ్చా అనే పాఠాలు నేర్పిస్తున్నాయి. ఆ మీడియాకి చెందిన ప్రతినిధులు చేస్తున్న నిర్వాకాలు తెలంగాణ ప్రజలు గతుక్కుమనేలా చేస్తున్నాయి. వెలుగులోకి రాని అంశాల గురించి అలా వుంచితే, ఇటీవల జరిగిన ఒక ఘటన సొంత మీడియాని కూడా కేసీఆర్ అదుపులో పెట్టాలన్న హెచ్చరికగా మిగిలింది. టీఆర్ఎస్‌కి చెందిన మీడియా ప్రతినిధి ఒకరు మరో మీడియా ప్రతినిధితో కలసి ఒక వ్యాపారిని బ్లాక్ మెయిల్ చేస్తూ, పది లక్షల రూపాయలు డిమాండ్ చేయడంతో దిక్కు తోచని వ్యాపారి ఆత్మహత్యా ప్రయత్నం చేసి చావుబతుకుల్లో వున్నాడు. ఈ లెక్కన సర్కారు వారి మీడియా ప్రతినిధులు రాష్ట్రంలో ఏరకంగా రెచ్చిపోతున్నారనడానికి ఈ  శాంపిల్ ఘటన చాలు. ఇప్పటికై ఘనత వహించిన ముఖ్యమంత్రి గారు తన సొంత మీడియాను కూడా నియంత్రించే విషయాన్ని ఆలోచిస్తే అందరికీ బావుంటుంది.

శభాష్ ఇండియా

ఇండియా... అంతర్గతంగా ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా శభాష్ అనిపించుకుంటున్న దేశం. ఒక పక్క పాకిస్థాన్, మరోపక్క చైనా, అన్నిటికీ మించి అమెరికా దేశాలు ఇండియా సహనానికి ఎన్ని పరీక్షలు పెడుతున్నప్పటికీ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకువెళ్తోంది. ప్రపంచ దేశాలతో స్నేహం చేసే విషయంలో, మిత్రధర్మం పాటించే విషయంలో, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడే విషయంలో, ఆపత్కాలంలో ఆదుకునే విషయంలో ఇండియా అనేక దేశాల కంటే ముందు వుంటోంది. ఇటీవల పొరుగు దేశమైన నేపాల్‌లో అత్యంత భయంకరమైన భూకంపం సంభవించినప్పుడు భారతదేశం చూపించిన చొరవ, చేసిన సాయం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. నేపాల్‌లో భూకంపం  సంభవించగానే మొట్టమొదట స్పందించి, ఎవరూ అడగకుండానే సహాయ కార్యక్రమాలను ప్రారంభించిన దేశం ఇండియా. భూకంపం సంభవించిన సమయంలో తక్షణం అందాల్సిన సాయం శిథిలాల నుంచి క్షతగాత్రులను రక్షించడం, ఆ తర్వాత వారందరికీ ఆహారం, వసతి, వైద్య సదుపాయాలు అందించడం, భూకంప ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని ఇతర ప్రాంతాలకు తరలించడం... ఈ పనులన్నీ భారత సైనిక దళాలు విజయవంతంగా నిర్వహించాయి. నేపాల్ వాసులను ఆదుకోవడం మాత్రమే కాకుండా, నేపాల్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించడంలో కూడా భారత సహాయక బృందాలు ఎంతో చాకచక్యంగా వ్యవహరించాయి. నేపాల్ భూకంపం సమయంలో భారత దేశం వ్యవహరించిన తీరుకు అంతర్జాతీయంగా ప్రశంసలు లభిస్తు్న్నాయి. ఇండియాకు ఆగర్భ శత్రు దేశమైన పాకిస్థాన్ నుంచి కూడా ప్రశంసలు అందాయి. పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీప్ మన ప్రధాని నరేంద్ర మోడీకి స్వయంగా ఫోన్ చేసి కొనియాడారంటే ఈ విషయంలో భారతదేశం వేసిన ముందడుగును అర్థం చేసుకోవచ్చు. నేపాల్‌కి అటువైపు సరిహద్దులో వున్న చైనా మొన్నటి వరకూ నేపాల్ మీద లేనిపోని ప్రేమ ప్రదర్శిస్తూ వుంటుంది. నేపాల్‌లో వున్న హిమాలయాను తొలచి నేపాల్‌కి - చైనాకు మధ్య భూగర్బ రైల్వే మార్గాన్ని నిర్మించాలని, తద్వారా ఇండియా మీద దాడి చేసే సులభ మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తోంది. అలాంటి చైనా కూడా భూకంప సమయంలో నేపాల్‌ని ఆదుకున్నది శూన్యం. ఆదుకునే విషయాన్ని అలా వుంచి, నేపాల్‌లో చిక్కుకుపోయిన తన దేశస్థులను తరలించుకునే కార్యక్రమం కూడా చేయలేక చేతులెత్తేసింది.

బొత్స... ఉండాల్సినోడే!

బొత్స సత్యనారాయణ ఒకప్పుడు అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా తనహవా నడిపించిన వ్యక్తి. ఉత్తరాంధ్ర రాజకీయాలన్నీ ఆరోజుల్లో ఆయన కనుసన్నల్లో నడిచేవి. ఆయన మాట వేదంలా చెలామణీ అయ్యేది. అయితే చేసిన తప్పులు ఆయన పీకకు చుట్టుకున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో ఆయన చేసిన పొరపాట్లు ప్రజల శాపాల రూపంలో ఆయనకు తగిలాయి. చివరికి ఆయనతో సహా ఆయన ఫ్యామిలీ, సన్నిహితులు అందరూ ఎన్నికలలో తుక్కు తుక్కుగా ఓడిపోయారు.చీపురుపల్లి ప్రజలయితే ఆయన్ని చీపురుతో ఊడ్చేశారు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి ఇప్పుడు ఇంత దారుణమైన స్థితికి పడిపోయిన్పటికీ, బొత్స సత్య నారాయణ తన ధోరణిని మార్చుకోలేదు. రాజకీయాల్లో తాను అనుసరిస్తున్న పాత తరహా ధోరణిలోనే వెళ్తున్నారు. ఈ మహానుభావుడు రాజకీయాల్లో ఉండాల్సినోడే అనిపించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోగానే బొత్స చూపు తెలుగుదేశం పార్టీ మీద పడింది. అయితే తెలుగుదేశం పార్టీలో ఆయన్ని పట్టించుకున్నవారు, పిలిచినవారు లేకపోవడంతో కొంతకాలం ఎదురుచూసిన ఆయన ఆ తర్వాత బీజేపీ తలుపులు తట్టారు. ఏపీలో కాస్తంత పేరున్న నాయకుడు ఎవరు తలుపు తట్టినా బార్లా తెరిచేయాలని అనుకున్న బీజేపీ తలుపులు తీయబోయింది. అయితే ఏపీలోని బీజేపీ నాయకుడు బొత్సను పార్టీలో చేర్చుకుంటే హైటెన్షన్ కరెంట్ తీగను పట్టుకున్నట్టేనని భయపెట్టడంతో బీజేపీ బొత్సకు తలుపులు తెరవకుండా గడియ మరింత గట్టిగా వేసేసింది. దాంతో బొత్స తాను అంతకుముందు వరకూ నోటికొచ్చినట్టు తిట్టిపోసిన జగన్ పార్టీలోకి జంప్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. వైసీపీ నాయకుడు జగన్ బొత్స పార్టీ ప్రవేశానికి అనుకూలంగా వున్నారన్న వార్తలు రాగానే ఉత్తరాంధ్ర వైసీపీ వర్గాల్లో కలవరం, కలకలం రేగి ఎమ్మెల్యేల రాజీనామా వరకు పరిస్థితి వెళ్ళింది. ప్రస్తుతం జగన్ తన పార్టీ నాయకులకు సర్దిచెప్పి, బొత్సని ఆహ్వానించాలనే ఆలోచనలో వున్నారు. రేపో మాపో బొత్స వైసీపీలో చేరడం దాదాపుగా ఖరారైపోయింది. ఈ స్టేజ్‌లో బొత్స బుద్ధిగా ఇంటిపట్టున కూర్చోకుండా, కాంగ్రెస్ పార్టీ గుంటూరులో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీకి కేంద్రం అర్జెంటుగా ప్రత్యేక హోదా ఇచ్చేయాలంటూ డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులంతా కలసి చేసిన దీక్ష అది. ఆ దీక్షలో పాల్గొన్న బొత్స ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మీద విమర్శలతో విరుచుకుపడ్డారు. ఈ విమర్శలన్నీ చంద్రబాబు నాయుడిని నేను ఇంత ఘాటుగా విమర్శించగలను అని జగన్‌కి తెలియచెప్పడం కోసమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తన విమర్శల ఘాటును విని జగన్ తనను అర్జెంటుగా పార్టీలోకి తీసుకుంటాడనేదే బొత్స ప్రణాళిక అని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ వైసీపీలో చేరడం కోసం కాంగ్రెస్ పార్టీ వేదికను విజయవంతంగా వినియోగించుకున్న బొత్స తెలివితేటలే తెలివితేటలని పరిశీలకులు అంటున్నారు.

ఎర్ర దొంగలకు అంతే లేదా?

ప్రతివాడికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తేరగా దొరికినట్టున్నారు. అందుకే ఆంధ్రులతో ఆటలాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు తమిళనాడుకు చెందిన ఎర్రచందనం దొంగల పరిస్థితి, తమిళనాడు రాజకీయ నాయకుల పరిస్థితి ఇలాగే తయారైంది. దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు్గా వాళ్ళ తీరు వుంది. ఈ కంత్రీగాళ్ళ తీరు చూసి దేశమంతా పకపకా నవ్వుతున్నా ఆ ఎడ్డిగాళ్ళకి సిగ్గూ శరం రావడం లేదు. తమ దారుణమైన ప్రవర్తనతో రౌడీల్లాగా వ్యవహరించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ మీద పైచేయి సాధించాలని అనుకుటున్నారు. మొన్నామధ్య వరకూ తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు కంటినిండా కునుకు లేకుండా చేసిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ వెనుక వున్నది ఘనత వహించిన తమిళనాడు రాజకీయ నాయకులే అన్నది జగమెరిగిన సత్యం. అవసరం తీరిన తర్వాత అల్లుడు... అన్నట్టుగా వీరప్పన్‌తో అవసరం తీరిన తర్వాత అతన్ని చాకచక్యంగా మట్టుబెట్టేశారు. వీరప్పన్ వీరమరణంతో అనాథలైపోయిన అతగాడి అనుచర స్మగ్లర్ బ్యాచ్ అంతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద, ఆంధ్రప్రదేశ్‌ అడవుల్లోని ఎర్రచందనం చెట్లమీద పడింది. గత పది సంవత్సరాలుగా లక్షలాది ఎర్రచందనం చెట్లను నరికేశారు. పనిలోపనిగా అడ్డు వచ్చిన అధికారులనూ నరికేస్తూ వచ్చారు. అలాంటి నరహంతక స్మగ్లర్లు 20 మందిని మొన్నామధ్య ఏపీ పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడం వీళ్ళ ఉన్మదానికి ఆజ్యం పోసినట్టు అయింది. తమిళనాడులో వున్న ఆంధ్రప్రదేశ్ సంస్థలు, బస్సులపై దాడి చేయడం లాంటి హింసాత్మక ఘటనలతో తమ బుద్ధిని మరోసారి  బయటపెట్టుకున్నారు. ఎన్‌కౌంటర్ జరిగింది కదా అని ఎర్ర స్మగ్లర్లు ఆగారా... లేదు... ఎన్‌కౌంటర్ జరిగిన మూడోరోజే దాదాపు మూడు వందల మంది స్మగ్లర్లు చిత్తూరు జిల్లా అడవుల్లో దొరికిపోయారు. పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఎర్రదొంగలు ఇప్పుడున్న పరిస్థితిని తట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికీ చిత్తూరు జిల్లా అడవుల్లో ప్రతిరోజూ ఇద్దరుముగ్గురయినా ఎర్రచందనం దొంగలు దొరుకుతున్నారు. వాళ్ళ తెంపరి తనాన్ని అర్థం చేసుకోవడానికి దీనికి మించిన ఉదాహరణ వుంటుందా? వీళ్ళు చిత్తూరు జిల్లా అడవులను మంచి ఆదాయాన్నిచ్చే టూరిస్టు ప్లేస్‌లా భావిస్తున్నారు. ఈ ధోరణికి మరింత బలంగా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం వుంది.

నిర్మాత ఆస్కార్ రవి చంద్రన్ ఆస్తులు జప్తు చేసిన బ్యాంక్

  పెద్ద హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే తీసే నిర్మాతలు, కేవలం అటువంటి సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించేందుకు ఆసక్తి చూపే దర్శకులు మన సినీ పరిశ్రమలో చాలా మందే ఉన్నారు. ఆ సినిమాలు హిట్ట్ అయితే అందరి కంటే ముందు ఆ సినిమాలో నటించిన హీరో, ఆ తరువాత దాని దర్శకుడు, సంగీత దర్శకుడు ఆ క్రెడిట్ మొత్తం క్లైమ్ చేసుకొంటారు. వారి తరువాతే ఆ సినిమాకు పెట్టుబడి పెట్టిన నిర్మాత పేరు వినిపిస్తుంది. చివరికి అందరూ కలిసి పండగ చేసుకొంటారు. కానీ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం దానిని చేయడం కోసం కోట్లు పిండుకొన్న వారందరూ కూడా ఆ తప్పును ఎదుటవాడి మీదకి తోసేసి చల్లగా తప్పుకొని వెళ్ళిపోతే ఆ సినిమాకు పెట్టుబడి పెట్టిన నిర్మాత, (సదరు హీరో, దర్శకులపై అపార నమ్మకంతో) సినిమాను తీసుకొన్న డిస్ట్రిబ్యూటర్లే రోడ్డున పడతారు. ఈ విషయం ఎన్నోసార్లు రుజువయింది. మళ్ళీ తమిళ చిత్ర నిర్మాత ఆస్కార్ ఫిలిమ్స్ సంస్థ అధినేత వి. రవి చంద్రన్ మరోమారు మన కళ్ళ ముందు సజీవ ఉదాహరణగా నిలుస్తున్నారు.   కమల్ హాసన్ నటించిన దశావతారం, విక్రమ్ నటించిన అన్నియన్, ‘ఐ’ వంటి పలు భారీ చిత్రాలను నిర్మించిన ఆయన వాటి నిర్మాణం కోసం తన ఆస్తులను చెన్నైలో గల ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో కుదువ బెట్టి అప్పులు తీసుకొన్నారు. కానీ ఆయన తీసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవడంతో బ్యాంకులో తీసుకొన్న అప్పును తిరిగి తీర్చలేకపోయారు. ఆ మొత్తం వడ్డీతో కలిపి రూ.97 కోట్లకు చేరుకొంది. ఆ అప్పును తీర్చమని రవిచంద్రన్ కు ఎన్నిసార్లు నోటీసులు పంపించినా ఆయన తీర్చలేకపోవడంతో ఆయన కుదువ బెట్టిన థియేటర్లను, భవనాలను, ఇళ్ళను, కార్యాలయాలను అన్నిటినీ బ్యాంక్ అధికారులు జప్తు చేసారు.   బ్యాంక్ అధికారులతో తాము చర్చలు జరుపుతున్నామని, త్వరలోనే ఆ అప్పులన్నీ తీర్చివేస్తామని, ఆస్కార్ ఫిలిమ్స్ సంస్థ ప్రతినిధులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. కానీ ఇప్పటికిప్పుడు రూ.97 కోట్లు కాదు కదా కనీసం 9కోట్లు కూడా తీర్చలేని పరిస్థితిలో రవిచంద్రన్ ఉన్నట్లు తమిళ సినిమా పరిశ్రమలో చెప్పుకొంటున్నారు. ఆ సినిమాలు చేయడం కోసం కోట్లు పిండుకొన్న హీరోలు కానీ దర్శకులు కానీ కష్టకాలంలో నిర్మాతను ఆదుకొనేందుకు ముందుకు రాలేదు.   గత ఆరు దశాబ్దాలుగా సినిమాలలో కమర్షియల్ ఫార్ములా సినిమాలు విజయవంతంగా ఆడుతున్నట్లే, సినీ పరిశ్రమలో ఇటువంటి నిర్మాతల ట్రాజెడీ స్టోరీలు నిత్యం బయటపడుతూనే ఉంటాయి. అయినా ఎవరూ గుణపాఠం నేర్చుకోరు. కొత్త బకరాలు పుట్టుకొస్తునే ఉంటాయి. ఆ బకరాలు హీరోలను, వారి మనుమలు, వారి మునిమనుమలను పెంచి పోషిస్తూనే ఉంటాయి. ఇదొక అంతులేని వింత రంగుల కధ.

ముచ్చటగా మూడు తీర్పులు

ఏపీ, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు శుక్రవారం నాడు ఇచ్చిన మూడు తీర్పులు నిజంగా ముచ్చటైన తీర్పులు... ఆయా అంశాలలో ఇప్పటి వరకు నెలకొన్ని గందరగోళ పరిస్థితికి ఫుల్‌స్టాప్ పెట్టే తీర్పులు.  వీటిలో ఒకటి హైకోర్టును ఏపీ, తెలంగాణలకు విభజించాలనే వివాదానికి సంబంధించిన తీర్పు. హైకోర్టును అర్జెంటుగా విభజించాలని తెలంగాణ ప్రభుత్వ వర్గాలతోపాటు తెలంగాణ లాయర్లు కూడా చాలాకాలంగా భావిస్తున్నారు. ప్రభుత్వం ఏపీ హైకోర్టును హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి తనవంతు సహకారం అందిస్తానని చెబుతూ వస్తోంది. ప్రభుత్వ సానుభూతిపరులైన కొందరయితే హైకోర్టు విభజన జరగకుండా ఏపీ ప్రభుత్వం, వెంకయ్య నాయుడు అడ్డుపడుతున్నారని అనధికారికంగా కామెంట్లు చేస్తూ వచ్చారు. తెలంగాణ లాయర్ల విషయం అయితే బోలెడంత చెప్పుకోవచ్చు. తీవ్రస్థాయిలో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. ఆంధ్రప్రాంతానికి చెందిన న్యాయమూర్తిని కూడా అడ్డుకునే సాహసం చేశారు. ఇలాంటి ధోరణులు ఇంకా ముదరకముందే హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఏపీలో హైకోర్టు ఏర్పడే వరకూ ఇప్పుడున్న హైకోర్టు విభజన జరగదని స్పష్టం చేసింది. ఈ తీర్పు నేపథ్యంలో అయినా ఈ అంశంలో ఆందోళనలు ఇకనైనా ఆగుతాయని ఆశించడం అత్యాశ కాకూడదు. అలాగే హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పార్లమెంటరీ కార్యదర్శుల విషయంలో కూడా తీర్పు వెల్లడించింది. కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, టీటీడీపీ ఎమ్మెల్యే దాఖలు చేసిన కేసులో ఈతీర్పు వచ్చింది. తెలంగాణ రాష్ట్ర పార్లమెంటరీ కార్యదర్శులుగా డి.వినయభాస్కర్, జి.కిషోర్ కుమార్, జలగం వెంకట్రావు, వి.శ్రీనివాస్ గౌడ్, జి.కిషోర్ కుమార్, కోవా లక్ష్మిలను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. చట్ట విరుద్ధంగా ఈ నియామకాలు జరిగాయని పేర్కొంటూ, ఇలాంటి నియామకాలను ఇకపై జరపరాదని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నియామకాల ద్వారా తెలంగాణ ప్రభుత్వం తమ పరిధిని దాటిందన్న విషయం స్పష్టమైంది. ఇక మూడో తీర్పు తెలంగాణ భూ భాగంలో వున్న ఉన్నత విద్యామండలి మీద అధికారాలు తెలంగాణ ప్రభుత్వానికే ఉన్నాయని తెలిపే తీర్పు.  బ్యాంకు ఖాతా నిర్వహణ అధికారం కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఉంటుందని, ఈ విషయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్చించి సముచితమైన నిర్ణయం తీసుకోవాలనే తీర్పు. మొత్తమ్మీద హైకోర్టు ఒకేరోజున మూడు కీలకమైన తీర్పులు ఇవ్వడం ద్వారా ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా తన ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి వీల్లేదని, కోర్టులు, చట్టాలకు లోబడే పనిచేయాల్సి వుంటుందనే విషయాన్ని స్పష్టం చేసింది. ఇప్పటికైనా ఈ మూడు అంశాలలో ప్రభుత్వాలు వివాద రహితంగా వ్యవహరిస్తే బావుంటుంది.

తెలంగాణ భూములు ఫర్ సేల్

తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాల్లో  వున్న ప్రభుత్వ భూముల అమ్మకానికి సర్వ సన్నాహాలూ జరుగుతున్నాయి. మిగతా ఎనిమిది జిల్లాల విషయంలో పెద్దగా శ్రద్ధ వున్నా లేకపోయినా, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని భూములను అమ్మే విషయంలో మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆసక్తిని చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే మిగతా జిల్లాల్లో ఎకరాల్లో భూములు అమ్మినా రాని డబ్బు ఈ రెండు జిల్లాల్లో గజాల్లో అమ్మినా వస్తుంది మరి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు, పథకాల అమలుకు డబ్బు చాలా అవసరమై కూర్చుంది. వీటి అమలు కోసం ఇప్పటికే కొన్ని ప్రభుత్వ ఆర్థిక సంస్థల నుంచి టీ సర్కార్ అప్పులు చేసింది. అయితే ఆ డబ్బు కూడా చాలకపోవడంతో భూములు అమ్మి గట్టెక్కడమే తరుణోపాయమని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి చకచకా పావులు కదుపుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి బడ్జెట్‌లో భూములను అమ్మడం ద్వారా 6500 కోట్లను ఆదాయంగా పొందాలని ప్రతిపాదించారు. అయితే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఢమాల్ అనడంతో గిట్టుబాటు కాదనే ఉద్దేశంతో గత ఏడాది భూములు అమ్మడానికి వీలు లేకుండా పోయింది. అయితే ఈ ఏడాది బడ్జెట్‌లో కూడా భూములను అమ్మడం ద్వారా 13,500 కోట్ల రూపాయలను పొందాలని ప్రతిపాదించారు. గత సంవత్సరం ఎలాగూ భూములను అమ్మలేదు కాబట్టి, ఆ ఏడాదిది, ఈ ఏడాదిది కలిపి ఒకేసారి అమ్మేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. భూములు అమ్మకపోతే పథకాలు, కార్యక్రమాలు ఒక్క అడుగు కూడా ముందుకు వేసే పరిస్థితి లేకపోవడంతో  ఇక భూముల అమ్మకం తప్పనిసరి అయింది. తెలంగాణలోని పది జిల్లాల్లో వున్న ప్రభుత్వ భూముల వివరాలు ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఇప్పుడు సిద్ధంగా వున్నాయి. వీటిలో న్యాయపరమైన చిక్కులు వున్న భూములను పక్కన పెట్టి, ఎలాంటి సమస్యల లేని భూముల్ని అర్జెంటుగా అమ్మేసే ఆలోచనలో ప్రభుత్వం వుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రెండు వందల గజాల వైశాల్యం వున్న భూముల దగ్గర నుంచి ఎకరాల వరకు అమ్మకానికి ప్రభుత్వం సిద్ధంగా వుంది. గతంలో వైఎస్సార్ హయాంలో ప్రభుత్వం భూముల్ని ఎలా హాట్ కేకుల్లా అమ్మిందే అదే తరహాలో అమ్మి క్యాష్ చేసుకోవాలని ప్రభుత్వం ఆశిస్తోంది. మరి ప్రభుత్వం ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో వేచి చూడాలి.

మరో జేఏసీ ఏర్పాటుకి రంగం సిద్ధం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన పోరాటంలో పొలిటికల్ జేఏసీ (జాయింట్ యాక్షన్ కమిటీ)  నిర్వహించిన పాత్ర ఏమిటో అందరికీ తెలిసిందే. ప్రొఫెసర్ కోదండరామ్‌ ఆధ్వర్యంలో పనిచేసిన ఈ కమిటీ టీఆర్ఎస్ మినహా మిగతా రాజకీయ పార్టీలను ఉతికి ఆరేసింది. రాజకీయ పార్టీల ఐక్యవేదిక పేరుతో స్థాపించిన ఈ వేదిక రాజకీయ పార్టీలనే ఒక ఆట ఆడించింది. అబ్బే అలాంటిదేమీ లేదు అని ఆ వేదికకు నాయకత్వం వహించినవారు చెబుతూ వచ్చినప్పటికీ, కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌కి ఈ వేదిక కొమ్ముకాస్తూ వచ్చింది. టీఆర్ఎస్ ఒక్కటే తెలంగాణ కోసం కృషి చేస్తున్నట్టు, మిగతా పార్టీలన్నీ గోడమీద పిల్లుల్లా వ్యవహరిస్తున్నట్టు పొలిటికల్ జేఏసీ ప్రజల ముందు బాగా ప్రొజెక్ట్ చేయగలిగింది. అందుకే అన్ని పార్టీలూ తెలంగాణ కోసం పోరాడినప్పటికీ ఆ క్రెడిట్ మాత్రం టీఆర్ఎస్‌కి మాత్రమే దక్కింది. తనకు రాజకీయంగా అంత సహకరించిన పొలిటికల్ జేఏసీ రుణం కూడా టీఆర్ఎస్ బాగానే తీర్చుకుంది. కన్వీనర్ కోదండరామ్‌‌కి మినహా  చాలామందికి బాగానే ఉపయోగపడుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏర్పడిన  అనంతరం పొలిటికల్ జేఏసీ నిర్వీర్యం అయిపోయిందని, అధికార టీఆర్ఎస్ జేబు సంస్థ అయిపోయిందని తెలంగాణలోని కొన్ని ఉద్యమ శక్తులు ఆరోపిస్తున్నాయి. దేన్ని ఆశించి తెలంగాణ ఉద్యమం చేశామో, అది తెలంగాణ ఏర్పడినప్పటికీ నెరవేరలేదని ఆ ఉద్యమ శక్తులు భావిస్తున్నాయి. అందుకే, ఇప్పుడు నిర్వీర్యంగా మారిపోయిన జేఏసీని పక్కన పెట్టి, కొత్తగా ఒక ‘తెలంగాణ ఉద్యమకారుల వేదిక’ను ఏర్పాటు చేయాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. పొలిటికల్ జేఏసీలో క్రియాశీలకంగా పనిచేసి, తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాధాన్యం లభించని శక్తులు, కవులు, కళాకారులు, రాజకీయ శక్తులూ అన్నీ ఒక తాటి మీద నిలిచి ఈ తెలంగాణ ఉద్యమకారుల వేదికను ముందుకు నడిపించాలని భావిస్తు్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు సాధించిన తెలంగాణ తాము కోరుకున్న తెలంగాణ కాదని, తాము కోరుకున్న నిజమైన తెలంగాణ సాధించే దిశగా ఈ వేదిక పనిచేయనుందని తెలుస్తోంది. తెలంగాణలో అధికారంలో వున్న టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపే విధంగా, సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే విధంగా ఈ వేదిక పనిచేస్తుందట. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వం నుంచి ప్రాధాన్యం లభించని ఉద్యమ శక్తులను ఒక్క తాటి మీదకు తెచ్చే పని వేగంగా జరుగుతోంది. త్వరలో ఈ వేదికకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయని తెలుస్తోంది.

పోలవరం పనుల్లో కొత్త ట్విస్టు

పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇప్పటికే విధులు నిర్వర్తిస్తున్న పీపీఎ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)ని ఆ బాధ్యతలను ఇప్పటి నుంచి తాము సూచిస్తున్న మరో సంస్థ నిర్వహిస్తుందని  కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన జాతీయ జల వనరుల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఇకమీద పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పనులన్నిటినీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే యాక్సిలర్డ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ (ఏఐబీపీ) నిర్వహిస్తుందని కేంద్ర ప్రభుత్వం ఆ సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. ఏఐబీపీని పదేళ్ళ క్రితం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి దేశంలోని అనేక ప్రాజెక్టుల పనులు ఈ సంస్థ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. ఏఐబీపీ ఆధ్వర్యంలోకి పోలవరం ప్రాజెక్టు వెళ్ళిందంటే, ఇప్పటి వరకూ ఆ సంస్థ పనిచేసిన తీరులోనే పోలవరం ప్రాజెక్టు పనులు కూడా జరుగతాయని భావించవచ్చు. ఏఐబీపీ నిబంధనల ప్రకారం పోలవరం ప్రాజెక్టు పనులు జరగాలంటే, ప్రాజెక్టుకు సంబంధించిన ఖర్చులను మొత్తం మొదట రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. ఆ తర్వాత ఆ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. ముక్కు ఎక్కడుందీ అంటే చేతిని తలచుట్టూ తిప్పి చూపించినట్టుగా వ్యవహారం వుంటుందన్నమాట. కేంద్ర జలవనరుల శాఖ జారీ చేసిన సర్క్యులర్ ఏపీ వర్గాలను అయోమయంలో పడేసింది. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏఐబీపీ రంగంలోకి దిగిందంటే, ఇప్పటి వరకూ అమల్లో వున్న పోలవరం ప్రాజెక్టు అధారిటీ పరిస్థితి ఏమిటో ఆ సర్క్యులర్‌లో స్పష్టంగా చెప్పలేదని ప్రభుత్వం వర్గాలు అంటున్నాయి. పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేసిన 249 కోట్లు పీపీఏ బ్యాంకు అకౌంట్లోనే వున్నాయి. మరి ఆ నిధులను ఎలా మళ్ళించాలి, ఎలా ఖర్చు చేయాలనే స్పష్టత లేదు. అలాగే ప్రాజెక్టును నిర్మించాలంటే మొదట రాష్ట్ర ప్రభుత్వం డబ్బు ఖర్చుచేయాలి. ఆ తర్వాత కేంద్రం వాటిని తిరిగి ఇస్తుంది. ప్రాజెక్టు పనులను పర్యవేక్షించే ఏఐబీపీ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పనిచేయదు. కేంద్రం ఆధ్వర్యంలోనే పనిచేస్తుంది. ఇలాంటి అనేక గందరగోళాలను కేంద్రం కొత్తగా జారీ చేసిన సర్క్యులర్ సృష్టించింది. వీటన్నిటి విషయంలో కేంద్రం మరింత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం వుందని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు.

జాతీయ హోదా వస్తేనే పండగ కాదు...

మన తెలుగులో ఒక మంచి సామెత వుంది... ఇల్లలకగానే పండగ కాదు అని... ఈ సామెత నుంచి ప్రతి తెలుగువారు పాఠాన్ని నేర్చుకోవచ్చు... ఇప్పుడు జాతీయ హోదాను సాధించాలని ఉవ్విళ్ళూరుతున్న తెలుగుదేశం పార్టీ కూడా ఈ సామెత నుంచి పాఠాన్ని నేర్చుకోవలసిన అవసరం వుంది. మూడు దశాబ్దాల క్రితం విస్తరించి, తెలుగు ప్రజల జీవితంలో మమేకం అయిపోయిన తెలుగుదేశం పార్టీ ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో విస్తరించి వుంది. ఇంకా మరో రెండు రాష్ట్రాల్లో కూడా విస్తరింపజేసి తెలుగుదేశం పార్టీకి జాతీయ పార్టీ హోదా పొందాలన్న ఆలోచనలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, యువ నేత నారా లోకేష్ వున్నారు. అయితే, ఇల్లలకగానే పండగ కాదన్నట్టుగా... పార్టీ అభివృద్ధి చెంది, మరింత అభ్యున్నతిలోకి వెళ్ళాలంటే కేవలం జాతీయ పార్టీ హోదా వస్తే చాలదు... పార్టీ ఆలోచనలలో కొత్తదనం రావాలి, పార్టీ కార్యకర్తలలో ఉత్సాహం పెరగాలి, కొత్త ఆలోచనలలో, కొత్త రక్తంతో ముందుకు దూసుకువెళ్ళాలి... అప్పుడే పార్టీకి సరైన పండగ.  తెలుగుదేశం పార్టీ ముందు  ఇప్పుడు అనేక సవాళ్ళు వున్నాయి. తెలుగుదేశం పార్టీ మీద ఎంతో నమ్మకంతో అధికారం అప్పగించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభ్యున్నతి పథంలో నడిపించాలి. అధికారం కోల్పోయి, ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ బారి నుంచి కాపాడుకునే పరిస్థితిలో వున్న తెలంగాణ రాష్ట్రంలో పుంజుకోవాలి... మళ్ళీ అధికారాన్ని సంపాదించాలి. అయితే లక్ష్యాలు భారీగా వున్నాయి. పార్టీని అ లక్ష్యాలకు చేర్చేవారే తక్కువగా వున్నారు. పల్లకినీ ఎక్కేవారే తప్ప, మోసేవారు తక్కువగా వున్నారు. అదే పార్టీకి పెద్ద సమస్య. పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు లోకేష్ పార్టీ కోసం రోజుకు 20 గంటలు శ్రమిస్తున్నారు. అయితే వారిద్దరి శ్రమ సరిపోతుందా... వారు రోజుకు 20 గంటలు పనిచేస్తుంటే, వారు పదవులిచ్చి ప్రోత్సహించినవారు మాత్రం రోజుకు రెండు గంటలు కూడా పనిచేయలేని పరిస్థితిలో వున్నారు. ఇప్పుడు పార్టీలో, ప్రభుత్వంలో పదవులు పొందిన చాలామంది చంద్రబాబు వేగాన్ని అందుకోలేక చతికిలపడ్డారు. ఇతర పార్టీల నుంచి గోడదూకి వచ్చినవారు, వయసు మళ్ళినవారు, దర్జాగా తిరగడమే తప్ప చెమటోడ్చడం తెలియనివారు, పాత చింతకాయ పచ్చడి లాంటి నాయకులు, మా తాతలు నేతులు తాగారని చెప్పుకుంటూ ఆ వారసత్వంతో పదవులు పొందిన నాయకులు... ఇలాంటి తాలు విత్తనాలు పదవుల్లో దర్జా వెలగబెడుతున్నారు. తాలు విత్తనాలతో పంట పండుతుందా? ఇలాంటి వారిని నమ్ముకుని పార్టీని జాతీయ స్థాయికి తీసుకెళ్ళాలని అనుకుంటే దేనితోకో పట్టుకుని గోదారి ఈదాలని అనుకోవడమే అవుదా? తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు నడిపిన బాటలో పార్టీని నడపటమే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ‘శ్రీరామరక్ష’ అవుతుంది. పాతతరం నాయకులనే నమ్మకుని, వారికే బాధ్యతలు అప్పగించే పొరపాటు ఇప్పుడు అలవాటుగా మారింది. ముఖ్యంగా దాన్ని మార్చుకోవాలి. ఎన్టీఆర్ కొత్తతరం నాయకులను ఎంతో ప్రోత్సహించేవారు. చురుకైన, ఉత్సాహవంతులైన, పార్టీకోసం ప్రాణంపెట్టే యువ నాయకులను పదవులిచ్చి ప్రోత్సహించేవారు. ఆయన ప్రోత్సహించిన వారే ఇప్పుడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయంగా ఉన్నత స్థానాల్లో వున్నారు. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలో ఉత్సాహవంతులైన, ప్రతిభావంతులైన కార్యకర్తలు, నాయకులకు కొదువ లేదు. అలాంటి వారి సేవలను వినియోగించుకోవాలి. వారి పనితీరును, పాతతరం నాయకుల పనితీరును బేరీజును వేసుకుంటే ఇంతకాలం ఈ విషయంలో పార్టీ చేసిన పొరపాటు ఏమిటో అర్థమవుతుంది. పార్టీ నాయకత్వం ఇంతకాలం చేసిన పొరపాటును సరిదిద్దుకుని కొత్తరక్తాన్ని ఉపయోగించుకుంటే తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిని పొందడమే కాదు... మరోసారి జాతీయ స్థాయిలో తన సత్తాను చాటే అవకాశం వుంటుంది.

ఎమ్మెల్యేలకి ఫోన్ చేసిన హీరోయిన్ నీతూ...

ఎర్రచందనం స్మగ్లర్ మస్తాన్ వలీ కేసులో ఒక్కో విషయం మెల్లమెల్లగా బయటపడుతున్నాయి. మస్తాన్ వలీ చేతికి చిక్కి, మూడో భార్యగా మారి, హీరోయిన్ వేషం వేసి చివరికి పోలీసుల చేతికి చిక్కిన నీతూ అగర్వాల్ పోలీసుల విచారణలో అనేక విషయాలను బయటపెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రిమాండ్‌లో వున్న నీతూ అగర్వాల్‌ను పోలీసులు కోర్టు అనుమతితో ఇంటరాగేషన్ కోసం తమ అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇంటరాగేషన్‌లో నీతూ అగర్వాల్ వెల్లడించిన విషయాలను చూసి పోలీసులే నోళ్ళు వెళ్ళబెట్టారు. మొత్తం ఈ ఇష్యూలో కొంతమంది ఎమ్మెల్యేల ఇన్వాల్వ్‌మెంట్ కూడా వున్నట్టు బయపడింది. అయితే ఆ ఎమ్మెల్యేలు కూడా మస్తాన్ వలీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలేనని సమాచారం. గుజరాత్ రాష్ట్రానికి చెందిన నీతూ అగర్వాల్‌కి తన సోదరుడిగా చెప్పే ఒక వ్యక్తి ద్వారా మస్తాన్ వలీ పరిచయం అయ్యాడు. మస్తాన్ వలీ బిల్డప్పు, డబ్బు చూసి ఆమె ఇంప్రెస్ అయింది. ఆ ఇంప్రెస్‌ని మస్తాన్ వలీ పెళ్ళిగా మలిచాడు. ఆమెను తన మూడో భార్యగా చేసుకున్నాడు. ఆమెతో ‘ప్రేమ ప్రయాణం’ అనే సినిమా కూడా తీశాడు. నీతో అగర్వాల్ అతనికి మూడో భార్య అయి కొంతకాలం ‘ప్రయాణం’ చేశాక అతని అసలు స్వరూపం ఆమెకు మెల్లమెల్లగా అర్థమవుతూ వచ్చింది. దాంతో ఆమె అతని నుంచి దూరమైపోవాలన్నా వెళ్ళలేని పరిస్థితికి ఆమె చేరుకుంది. మస్తాన్ వలీ తన అక్రమ లావాదేవీలను నీతూ అగర్వాల్ పేరుతో ఓపెన్ చేసిన అకౌంట్ ద్వారా  జరిపేవాడు. అందువల్లో ఆమె ఈ కేసులో ఇరుక్కుపోయింది. బ్యాంక్ లావాదేవీల కారణంగానే ఆమెకు ఎర్రచందనం స్మగ్లర్ల ముఠాలతో సంబంధం వుందన్న విషయం బయపడింది. మస్తాన్ వలీని పోలీసులు అరెస్టు చేసిన తర్వాత, తన గురించి కూడా మీడియాలో వచ్చేసిన తర్వాత నీతూ అగర్వాల్ బెదిరిపోయింది. ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు. ఈ స్మగ్లర్ల ఉచ్చులో తాను ఇరుక్కుపోయానని అర్థం చేసుకుంది. మస్తాన్ వలీ డబ్బు చూసి మోసపోయానని తెలుసుకుంది. అయితే మీడియాలో వస్తున్న కథనాలు, ఆమె కోసం పోలీసులు జరుపుతున్న వేట ఆమెలో ఒత్తిడి పెంచాయి. పోలీసులకు లొంగిపోవాలని నిర్ణయించుకున్న ఆమె కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. తనకు ఒత్తిడి పెరిగిపోతోందని, తాను ఎక్కువకాలం అజ్ఞాతంలో ఉండలేనని, పోలీసులకు లొంగిపోతానని ఆమె సదరు ఎమ్మెల్యేలకు చెప్పినట్టు సమాచారం. దానికి ఆ ఎమ్మెల్యేలు నువ్వు లొంగిపోతే పోలీసులు రకరకాల ప్రశ్నలతో నిన్ను వేధిస్తారు. అందువల్ల లొంగిపోవద్దనే సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకే ఆమె లొంగిపోకుండా ఆగిపోయింది. చివరికి పోలీసులే ఆమెను వెతికి పట్టుకున్నారు.  అయితే ఆ ఎమ్మెల్యేలు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మాత్రం కాదు.. కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అని తెలుస్తోంది. సదరు ఎమ్మెల్యేల పేర్లు మాత్రం పోలీసు వర్గాలు వెల్లడించడం లేదు. నీతూ అగర్వాల్‌ని ప్రాథమికంగా ఇంటరాగేషన్ చేసిన పోలీసులు త్వరలో మరోసారి ఆమెను ఇంటరాగేట్ చేస్తారని, ఆమెతోపాటు మస్తాన్ వలీని కూడా ఇంటరాగేట్ చేయబోతున్నారు. ఈ జాయింట్ ఇంటరాగేషన్‌లో ఈ జంట మరెన్ని విషయాలు వెల్లడి చేస్తుందో చూడాలి.

నేపాల్‌తో ఈ వెటకారాలేంటి?

నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపం కారణంగా ఆ దేశం ఎప్పటికి కోలుకుంటుందో ఊహించడానికి కూడా వీల్లేనంతగా నష్టపోయింది. ఇప్పటికే మృతుల సంఖ్య ఆరు వేలను దాటింది. ఈ సంఖ్య పదివేలను దాటే ప్రమాదం వుందని అధికారవర్గాలు చెబుతూ వుంటే, ఆ సంఖ్య పదిహేను వేలను కూడా చేరే ప్రమాదం వుందని పరిశీకులు భావిస్తున్నారు. ఇలాంటి అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ప్రపంచంలో ఎవరైనా స్పందించి నేపాల్‌‌కి అందించాల్సింది ఆహారం, ఆసరా, మేమున్నామనే భరోసా. ఈ విషయంలో అనేక దేశాలు ముందడుగు వేసి నేపాల్‌ని ఆదుకుంటూ వుండటం అభినందనీయమైన విషయం. అయితే పాలకుండలో విషపు బొట్టుల్లాంటి కొన్ని ఘటనలు కూడా జరుగుతూ ఆ ఘటనలకు కారణమైన వాళ్ళు మనుషులేనా అనే అనుమానాలు కూడా కలుగుతూ వున్నాయి. ఈమధ్య వేలంవెర్రిలా మారిన సెల్ఫీల పిచ్చి నేపాల్‌లో కూడా ముదిరినట్టుంది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంతో తమ ఆస్తులను, ఆప్తులను కోల్పోయి గుండెలు అవిసేలా రోదించే వారు లక్షల మంది వుంటే, భూకంప శిథిలాల దగ్గర నిల్చుని సెల్ఫీలు తీసుకుంటున్న వారిని ఏమనాలి? ఇది ఒక  ఉదాహరణ అయితే, ఇంతకంటే దారుణమైన ఉదాహరణలు మరికొన్ని వున్నాయి. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుటకలతోకానీ పోదని అంటారు.. ప్రస్తుతం పాకిస్థాన్ పరిస్థితి అలాగే వుంది. తన ఇల్లు చక్కదిద్దుకోవడం తెలియని పాకిస్థాన్ ప్రపంచాన్ని ఉద్ధరిస్తానంటూముందుకు వచ్చింది. నేపాల్ భూకంప బాధితులకు తనవంతు సహాయంగా కొన్ని ఆహార పదార్ధాలను పంపింది. ఆ పదార్ధాలను చూసి నేపాల్ వాసులు నోళ్లు తెరిచారు. ఆకలికి చచ్చిపోయినా పర్లేదుగానీ, వీటిని తినమని చెప్పేశారు. పాకిస్థాన్ విమానాల నిండుగా పంపిన గొడ్డుమాంసాన్ని వాళ్ళు ముట్టుకోను కూడా ముట్టుకోలేదు. హిందూ దేశమైన నేపాల్లో గొడ్డుమాంసం ముట్టుకోరు. అలాంటి నేపాల్‌కి ఏరికోరి గొడ్డుమాంసమే పంపిన పాకిస్థాన్‌ని ఏమనాలంటారు? ఇక గిడియన్స్ అనే క్రైస్తవ సంస్థ తీరు మరీ విచిత్రం. గిడియన్స్ సంస్థ నేపాల్ భూకంప బాధితుల విషయంలో వ్యవహరించిన తీరు చూసి క్రైస్తవులే తప్పు పడుతున్నారు. గిడియన్స్ సంస్థ నేపాల్‌కి పంపించిన విమానంలో ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా లక్ష బైబిళ్ళు వున్నాయి. బైబిళ్ళు తప్ప విమానంలో మరేమీ రాలేదు. ఇది నేపాల్ వాసులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఆహారం, బట్టలు పంపించాల్సిన నేపాల్‌కి ఈ సమయంలో బైబిళ్ళు పంపడమేంటి... అది కూడా ఒక హిందూ దేశానికి! ఈ అతి తెలివితేటల్ని ఏమనాలి? హిందూ దేశమైన నేపాల్‌లో క్రైస్తవ మతాన్ని బాగా వ్యాప్తిలోకి తేవాలన్నది గిడియన్స్ ఉద్దేశం. దీనికోసం ఆ సంస్థ ఇప్పటికే తనవంతు కృషి చేస్తోంది. ఇప్పుడు భూకంపం రూపంలో వచ్చిన అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడానికి బైబిళ్ళు పంపించింది. దీనికి నేపాల్ ప్రధాని ఘాటుగానే స్పందించారు. మేం బైబిళ్ళు తినం అని ఆయన స్పష్టంగా చెప్పారు. గిడియన్స్ సంస్థ చేసిన పనిని ప్రపంచమంతా విమర్శిస్తుంటే, మన తెలుగు మీడియా సంస్థలో మాత్రం నేపాల్‌లో క్రైస్తవులను నిరాదరించడం వల్లే భూకంపం వచ్చిందని అన్యాపదేశంగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి వాళ్ళను చూస్తున్నప్పుడే మానవత్వం మీద నమ్మకం సడలుతూ వుంటుంది.

కేసీఆర్‌కి ఉగ్ర, మావో ముప్పు

రాజకీయ నాయకులు ప్రజల్ని కాపాడే సంగతి అలా వుంచితే, అధికారంలోకి వచ్చిన వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడంతోనే సరిపోతుంది. ఇది ఏ ఒక్క పార్టీకి చెందిన రాజకీయ నాయకుల పరిస్థితో కాదు.. దేశవ్యాప్తంగా అధికారంలో వున్న నాయకులందరి పరిస్థితీ ఇలాగే వుంది. తమకు ఎటువైపు నుంచి ఏ ముప్పు వస్తుందో అర్థంకాని పరిస్థితుల్లో సెక్యూరిటీ మీద పూర్తిగా ఆధారపడే పరిస్థితికి దేశంలోని రాజకీయ నాయకులు చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు సంవత్సరం క్రితం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన కేసీఆర్ పరిస్థితి కూడా ఇలాగే మారింది. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచే ఆయనకు జడ్ ప్లస్ సెక్యూరిటీ అమలు అవుతోంది. ఆ భద్రతా ఏర్పాట్లు ఒక సంవత్సర కాలానికే ఎంతో భారీగా పెరిగిపోయాయి. ఈ సంవత్సర కాలంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి సంగతి ఎలా వున్నా, ముఖ్యమంత్రి కేసీఆర్‌ భద్రతా ఏర్పాట్ల విషయంలో మాత్రం భారీ అభివృద్ధి జరిగింది. దీనికి కారణం... ఉగ్రవాదుల నుంచి, మావోయిస్టుల నుంచి ఆయనకు ముప్పు వుందన్న సంకేతాలు అందడమే. తెలంగాణలో బాగా ప్రాబల్యం వున్న మావోయిస్టులు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని ఆకాంక్షించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వారి ఆకాంక్ష నెరవేరి తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. అయితే ఆ తర్వాత వారికి కేసీఆర్ ప్రభుత్వం పనితీరు కూడా నచ్చలేదు. కేసీఆర్ నిరంకుశంగా పరిపాలన చేస్తు్న్నారని మావోయిస్టులు ఎన్నో సందర్భాలలో ప్రకటించారు. దీనికితోడు ఏడాది క్రితం వరకూ బలం తగ్గుతూ వచ్చిన మావోయిస్టులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బలం పుంజుకున్నారు. తెలంగాణలో తమ సంఖ్యను బాగా పెంచుకున్నారు. ఏదైనా బలమైన ఘటనను నిర్వహించడం ద్వారా తమ ఉనికిని మరింత బలంగా చాటుకోవాలన్న ఆలోచనలో వున్నారు. అలాంటి ఆలోచనలో వున్నవారికి ‘ముఖ్యమంత్రి’ని మించిన టార్గెట్ మరొకటి వుంటుందా? అలాగే ఉగ్రవాది వికారుద్దీన్ బృందం ఎన్‌కౌంటర్ తర్వాత ఉగ్రవాదుల కన్ను కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపేవారి మీద పడింది. వారు కూడా వీలు దొరికితే ప్రతికారాన్ని తీర్చుకోవాలన్న ‘కసి’తో వున్నారు. వీటికి తోడు ముఖ్యమంత్రి భద్రత విషయంలో జాగ్రత్తగా వుండాలంటూ ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కూడా హెచ్చరికలు అందాయి. దాంతో ఇటీవలి కాలంలో కేసీఆర్ భద్రతను మరింత పెంచారు. సరికొత్త భద్రతా వాహనాలను కొనుగోలు చేశారు. దీనికితోడు కేసీఆర్ రాష్ట్రంలో పర్యటించాలంటే రోడ్డు మార్గంలో వెళ్ళడం మంచిది కాదని, కేవలం హెలికాప్టర్ మాత్రమే ఉపయోగించాలని కూడా భద్రతా వర్గాలు స్పష్టం చేశాయి. ఏది ఏమైనప్పటికీ బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తున్న కేసీఆర్‌ మీద ఉగ్రవాదులు, మావోలు దృష్టి కేంద్రీకరించడం మంచి పరిణామం కాదు. ఆయన సంపూర్ణ భద్రతతో వుండాలని కోరుకుందాం.

కాంగ్రెస్‌ని క్షమించాలా... సిగ్గు లేదా?

కాంగ్రెస్ నాయకులకు సిగ్గు, శరం, రోషం, పౌరుషం ఏ కోశానా ఉన్నట్టు కనిపించడం లేదు. అసలు రాజకీయ నాయకులలో ఇలాంటి లక్షణాలను ఆశించడం అత్యాశ... అది కూడా కాంగ్రెస్ నాయకులలో వీటిని ఆశించడం కేవలం అత్యాశ మాత్రమే కాదు... ఎన్నటికీ నెరవేరని దురాశ. అధికారం సాధించడం కోసం, ప్రజల నెత్తిన గుదిబండల్లా కూర్చోవడం కోసం కాంగ్రెస్ నాయకులు ఎన్ని నాటకాలు అయినా ఆడతారు. ఒక్కసారి అధికారం వాళ్ళ చేతికి వచ్చిందా... ఇక వాళ్ళ ఆటలకు, ఆగడాలకు అంతమే వుండదు... పదేళ్ళుగా దేశంలో, అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీలో ఈ దుర్మార్గాన్ని చూసిన తెలుగువారు తరించారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి, అక్రమాల గురించి రాసుకుంటూ వెళ్తే పెద్ద గ్రంథమే తయారవుతుంది. కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక విధానాలకు ఉదాహరణగా ఏదైనా చెప్పాలని అనుకుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడ్డగోలు విభజన ఒక్కటి చాలు. ఈ దారుణమైన విభజన కారణంగా అటు ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ రాష్ట్రం కూడా ఎన్నో ఇబ్బందులు పడుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు.. అందుకే కాంగ్రెస్ పార్టీకి రెండు రాష్ట్రాల్లో ప్రజలు చెప్పుదెబ్బలు కొట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో అయితే కాంగ్రెస్ పార్టీని తన్ని తరిమేశారు. ఆ స్థాయిలో తప్పు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ ఏపీ ప్రజలను బుట్టలో వేసుకోవడానికి నక్కజిత్తులు వేస్తోంది. దొంగ ఏడుపులు ఏడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదేళ్ళపాటు ప్రత్యేక హోదా ఇస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పి రాజ్యసభలో విభజన బిల్లును ఆమోదింపజేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ హామీకి చట్టబద్ధత కల్పించలేదు. దాంతో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాంకేతికంగా సమస్యగా మారింది. ఏపీకి అర్జెంటుగా ప్రత్యేక హోదా ఇచ్చేయాలని పార్లమెంటులో హడావిడి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, తన నాటకాలు చూసి ఏపీ ప్రజలు నమ్మేస్తారని ఆశిస్తే అది ఆ పార్టీ అమాయకత్వమే. ఇప్పుడు ఆ పార్టీకి చెందిన నాయకుడు, జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సూరజ్ హెగ్డే కొత్త పాట మొదలుపెట్టాడు. రాష్ట్రాన్ని విభజించినందుకు తమ పార్టీని క్షమించాలని ఆయన మొత్తుకున్నాడు. ఇటీవల విజయవాడలో జరిగిన ఒక సమావేశంలో పాల్గొన్న ఆయన రాష్ట్ర విభజన చేసినందుకు క్షమించండి అంటూ లబోదిబో అన్నాడు. చూడు నాయనా సూరజ్ హెగ్డే, నువ్వు కాదు... నిన్ను పంపించిన సోనియాగాంధీ వచ్చి మొత్తుకున్నా కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్రజలు ఎప్పటికీ క్షమించరు. క్షమించడానికి మీ పార్టీ చేసింది చిన్నా చితకా నేరం కాదు... ఏపీ ప్రజల  గుండెల్లో నిర్దాక్షిణ్యంగా గునపం దించారు. అయినా ఏపీ ప్రజల్ని క్షమించమని అడగటానికి మీకు, మీ పార్టీకి సిగ్గు లేదా?

సింహాచలానికి రాజయోగం

విశాఖ సమీపంలోని సింహాచలం ప్రాంతానికి రాజయోగం పట్టినట్టు అనిపిస్తోంది. రాష్ట్ర విభజన పుణ్యమా అని ఇప్పుడు ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయి. సమైక్య రాష్ట్రంగా వున్న సమయంలో అభివృద్ధి అంతా హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమైంది. అందుకే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కి అప్పులు మాత్రం మిగిలాయి. అయితే ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, భవిష్యత్తులో జరగబోతున్న అభివృద్ధి అక్కడి ప్రజలలో నూతనోత్సాహం నింపుతోంది. ఆ ఆభివృద్ధిలో అగ్ర తాంబూలం అందుకునే దిశగా ఉత్తరాంధ్ర ప్రాంతం పయనిస్తోంది. విశాఖపట్టణం ఇప్పటికే సాఫ్ట్‌వేర్, విద్యా రంగాల్లో మరింత అభివృద్ధి సాధించబోతుంది. విశాఖపట్నం సమీపంలోనే వున్న సింహాచలం ప్రాంతం కూడా ఇప్పుడు ఊహించని స్థాయి అభివృద్ధిని అందుకోబోతోంది. స్వామినారాయణ్ ట్రస్ట్ నిర్మించే అక్షర్‌ధామ్ దేవాలయాల గురించి అందరికీ తెలిసిందే. గుజరాత్‌లో ఒక దేవాలయం వుంది. ఢిల్లీలో మరో దేవాలయం వుంది. ఇప్పుడు సింహాచలంలో కూడా ఒక దేవాలయాన్ని నిర్మించడానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. స్వామినారాయణ్ ట్రస్ట్ ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించడం, ప్రభుత్వం అందుకు సానుకూలంగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం చకచకా జరిగిపోయాయి. దేవాలయ నిర్మాణానికి అవసరమైన 10 ఎకరాల అన్ని వసతులూ వున్న భూమి కోసం  అన్వేషణ జరుగుతోంది. ఇప్పుడు సింహాచలానికి మరో రూపంలో రాజయోగం పట్టబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. సింహాచలంలో ‘ఆయుష్’ యూనివర్సిటీని నిర్మించాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. ఈ ప్రాంతంలో ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియో వైద్యాల సమ్మేళనం. వీటితోపాటు ప్రకృతివైద్యం కూడా ఇందులో భాగంగా వుంటుంది. ‘ఆయుష్‌’కి సంబంధించిన విశ్వవిద్యాలయం, ఆస్పత్రి, పరిశోధనా సంస్థ, నర్సుల శిక్షణా కేంద్రం, పారామెడకల్ సిబ్బంది శిక్షణా కేంద్రాలను సింహాచలంలో ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. ఈ మేరకు ఆయుష్ కమిషనర్ ఇటీవల సింహాచలం దేవాలయం ఇ.ఓ.ను కలసి తమ ప్రతిపాదనాలను వెల్లడించారు. ఆయుష్ యూనివర్సిటీ, పరిశోధనా కేంద్రం, ఆస్పత్రి,  శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయడానికి 100 ఎకరాల భూమి అవసరం అవుతుంది. ఈ భూమి ఈ ప్రాంతంలో సింహాచలం దేవాలయానికి వున్నాయి. సింహాచలం దేవాలయానికి చెందిన ఆ భూములను ఆయుష్‌కి కేటాయించినట్టయితే దేవాలయం సమీపంలోనే విద్యాలయం, వైద్యాలయాలు కూడా ఏర్పాటు అయ్యే అవకాశం వుంటుంది. సింహాచలం ప్రాంతంలోని ప్రకృతి ఒడిలో విద్య, వైద్యాలయాలతోపాటు స్వామినారాయణ్ దేవాలయం కూడా ఏర్పాటు అయితే, వీటన్నిటికి పెద్దదిక్కుగా సింహాచలం అప్పన్న దేవాలయం ఉంటే... ఈ ప్రాంతం వైభవాన్ని చూడటానికి రెండు కళ్ళూ చాలవేమో.

ఒకే నాలికతో ఎన్ని మాటలో...

  తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మొన్న హైదరాబాద్ లో జరిగిన తెరాస బహిరంగ సభలో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి చాలా చులకనగా మాట్లాడి మళ్ళీ తన నోటి దురుసు ప్రదర్శించుకొన్నారని చాలా మంది అభిప్రాయపడ్డారు.   ఇటీవల జరిగిన పార్టీ ప్లీనరీ సభలో కేసీఆర్ మాట్లాడుతూ “ప్రస్తుతం ఆయన (చంద్రబాబు నాయుడు) ఒక రాజధాని, అసెంబ్లీ కనీసం ఒక హైకోర్టు కూడా లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రి. తెలంగాణా రాష్ట్రానికి చెందిన భవనాలలో ఉంటూ తన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు,” అని చంద్రబాబు నాయుడుని ఉద్దేశ్యించి అన్నారు.   అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఇంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఆంధ్రా మంత్రులు, ఉద్యోగులు అందరూ మనకి అతిధులవంటి వారు. వారిని మనం ఎంత బాగా చూసుకొంటే వారు అంతకాలం ఇక్కడ ఉంటూ మనకి పన్నులు చెల్లిస్తుంటారు. కనుక వారిని మనం చాలా జాగ్రత్తగా, గౌరవంగా చూసుకోవాలి,” అని హితబోధ చేసారు. అటువంటప్పుడు మళ్ళీ “ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రికి హైదరాబాద్ లో ఏమి పని?” అంటూ ప్రశ్నించడం ఎందుకని ప్రజలు అడుగుతున్నారు.   ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి పట్ల కేసీఆర్ కి ఎటువంటి అభిప్రాయం ఉన్నప్పటికీ, ఆయనకి ఇష్టమున్నా లేకపోయినా ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకి హైదరాబాద్ మరో 9 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగానే ఉంటుందనేది ఎవరూ కాదనలేని సత్యం. ఒకవేళ అంతవరకు కూడా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్ నుండే రాష్ట్రాన్ని పరిపాలించాలనుకొంటే దానికి ఎవరు కూడా అభ్యంతరం చెప్పడానికి వీలులేదు. ఈ సంగతి అపార రాజకీయ అనుభవమున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కి తెలియదనుకోలేము. అయినా కూడా ఆయన ఆవిధంగా మాట్లాడటం వలన ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే ప్రమాదం ఉంది. సాటి ముఖ్యమంత్రి, ఒకప్పుడు తనకి రాజకీయ గురువు అయిన చంద్రబాబు నాయుడుని ఉద్దేశ్యించి “ఆయనొక రాజధాని, అసెంబ్లీ, హైకోర్టు లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రి” అని కేసీఆర్ హేళన చేయడం సబబు కాదని రాజకీయ వర్గాలలోనే ఒక అభిప్రాయం వ్యక్తం అవుతోంది.   వాస్తవిక దృష్టితో దీనిని చూసినట్లయితే ఇందులో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కానీ, ఉద్యోగులని గానీ నిందిచడానికి ఏమీ లేదని అర్ధమవుతుంది. తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్ చేస్తున్న ఉద్యమాల కారణంగా, తరుముకొస్తున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ అధిష్టానం హడావుడిగా రాష్ట్ర విభజన చేసింది. రాష్ట్ర విభజన అనివార్యమని తెలిసి ఉన్నప్పటికీ ఈ వ్యవహారాన్ని పదేళ్ళపాటు నాన్చిన కాంగ్రెస్ అధిష్టానం అదే సమయంలో ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధానిని, హైకోర్టును, అసెంబ్లీ తదితర భవనాలను ఏర్పాటు చేసి ఉండి ఉంటే నేడు ఇటువంటి దుస్థితి ఉండేది కాదు. కనీసం విభజన చేసే ముందయినా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించినా బహుశః ఇటువంటి అవహేళనలు ఎదుర్కోవలసిన అగత్యం ఉండేది కాదు. కానీ యూపీఏ ప్రభుత్వం ఎంత త్వరగా ఈ వ్యవహారం నుండి చేతులు దులుపుకొని తప్పు కొందామా..అని ఆలోచిందే తప్ప దాని పర్యవసానాల గురించి ఆలోచించదానికి కూడ ఇష్టపడలేదు. కనుక యూపీయే ప్రభుత్వం చేసిన తప్పులకి ఇప్పుడు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, మంత్రులను, ఉద్యోగులను గురించి చులకనగా మాట్లాడటం వలన ఇరురాష్ట్రాల మధ్య మరింత దూరం పెరుగుతుందే తప్ప వేరే ప్రయోజనం ఏమీ ఉండబోదని చెప్పవచ్చును.   అయినా ఆంద్రప్రదేశ్ రాజధాని నిర్మాణం పూర్తయ్యేలోగానే విజయవాడకు తరలిపోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఉద్యమాల సమయంలో తన లక్ష్యాన్ని చేరుకోవడానికి అటువంటి మాటాలు మాట్లాడవలసి వచ్చింది తప్ప ఆంద్ర ప్రజలు, ఉద్యోగులు అంటే తనకి చాలా గౌరవమని కేసీఆరే స్వయంగా చెప్పుకొన్నారు. ఆ మాటలు నిజమనుకొంటే ఆయన లేదా మంత్రులు గానీ ఈవిధంగా మాట్లాడటం అనవసరం. ఒకవేళ తెదేపాతో ఇబ్బంది ఉన్నట్లయితే దానిని రాజకీయంగా ఎదుర్కోవడమే మంచి పద్ధతని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మోడీకి రాహుల్ ఉచిత సలహా

  దాదాపు రెండు నెలలు రాజకీయాల నుండి శలవు తీసుకొని విదేశాలకు వెళ్లి సేద తీరివచ్చిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, రైతుల సమస్యలపై లోక్‌సభలో మాట్లాడుతూ “నరేంద్ర మోడీ తన విదేశీ పర్యటనలు కాస్త తగ్గించుకొని దేశంలో వివిధ రాష్ట్రాలలో పర్యటించి రైతుల కష్టసుఖాల గురించి తెలుసుకొనే ప్రయత్నం చేస్తే బాగుంటుందని” ఉచిత సలహా ఇచ్చేరు. ఆయన చేసిన సూచనకు కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ చాలా ధీటుగా బదులిచ్చారు. “గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ ఈ విషయం గురించి ఎందుకు ప్రశ్నించలేదు?”అని నిలదీశారు.   రాహుల్ గాంధీ తలుచుకొంటే గత పదేళ్ళలో రైతులకు మేలు కలిగించే పనులు అనేకం చేసి ఉండవచ్చును. కానీ అప్పుడు రైతుల కోసం ఆయన చేసిందేమీ లేదు. యూపీఏ ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకుపోతున్నా కూడా ఆయన చేతులు ముడుచుకొని కూర్చొన్నారే తప్ప ఎన్నడూ అడ్డుపడలేదు. కనీసం ప్రశ్నించలేదు. గత పదేళ్లుగా ఆయన కోసమే ప్రధానమంత్రి కుర్చీని ఆయన తల్లి సోనియాగాంధీ రిజర్వు చేసి పెట్టినా అందులో కూర్చొనే సాహసం చేయలేకపోయారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఓడిపోయినా తరువాత కూడా ఆయన లోక్ సభ వెనుక బెంచీలలో కూర్చొని కునుకు తీసారే తప్ప రైతుల కోసం మాట్లాడలేదు.   ఒక ప్రధాన జాతీయ పార్టీకి ఉపాధ్యక్షుడుగా ఉన్న రాహుల్ గాంధీ కీలకమయిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు విదేశాలలో చక్కర్లు కొట్టి వచ్చిన తరువాత ఇప్పుడు తనకంటే ఎన్నో రెట్లు సమర్ధుడు, అనుభవజ్ఞుడు, పరిపాలనాదక్షుడయిన ప్రధాని మోడీని విదేశీ పర్యటనలు తగ్గించుకొని, రైతుల గురించి ఆలోచించమని ఉచిత సలహాలు ఇవ్వడం చాలా హాస్యాస్పదం. బహుశః మోడీని విమర్శించగలిగితేనే తనకు చాలా దైర్యం, నాయకత్వ లక్ష లక్షణాలు ఉన్నాయని నిరూపించదలచుకొన్నారో ఏమో?   గత పదేళ్ళుగా రైతులను పట్టించుకోని రాహుల్ గాంధీ ఇప్పుడు రైతుల కోసం మొసలి కన్నీరు కార్చుతూ ఓ వందమంది భద్రతా సిబ్బందిని వెంటబెట్టుకొని జనరల్ బోగీలో ప్రయాణాలు చేస్తూ, రైతులను పరామర్శించేందుకు పాదయాత్రలు మొదలుపెట్టారు. దాని వలన రైతుల కష్టాలు తీరకపోయినా రాహుల్ గాంధీకి మాత్రం కావలసినంత ఉచిత పబ్లిసిటీ దొరుకుతుంది.

నేపాల్‌కి మూగ జీవాల ఉసురు తగిలిందా?

నేపాల్‌లో సంభవించిన భూకంపం ప్రపంచం మొత్తం నిర్ఘాంతపోయేలా చేసింది. భూకంపం సంభవించిన నాటి నుంచి రోజు రోజుకూ మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. మొత్తమ్మీద  భూకంప మృతుల సంఖ్య పదివేలు దాటే అవకాశం వుందని నేపాల్ అధికారవర్గాలే చెబుతున్నాయి. ఈ సంఖ్య పదిహేను వేలు దాటే అవకాశం వుందని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రతిరోజూ వేలాదిమంది మృతదేహాలను సామూహికంగా దహనం చేస్తున్నారు. భూకంపం ధాటికి ఇప్పటికే నేపాల్ ఎంతో నష్టపోయింది. రాబోయే రోజుల్లో ప్రకృతి నేపాల్ మీద మరింతగా పగబట్టే ప్రమాదం వుందని పరిశీలకులు భావిస్తున్నారు. త్వరలో నేపాల్‌లో భారీ వర్షాలు కురవబోతున్నాయట. ఈ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడే ప్రమాదం వుందని భావిస్తున్నారు. ఇప్పటికే నేపాల్‌లో అనేక ప్రాంతాల్లో జనం నిలువ నీడలేక ఆరుబయటే నివసిస్తున్నారు. ఇలాంటి సమయంలో కురిసే భారీ వర్షాలు నేపాల్ ప్రజల పాలిట మృత్యు శాసనాలు అయ్యే ప్రమాదం వుంది. ఇలా వుంటే, నేపాల్‌లో మూగ జీవుల పట్ల చూపించే క్రూరత్వమే ఇప్పుడు ఈ పరిస్థితికి కారణమని కొంతమంది జంతు ప్రేమికులు విమర్శిస్తున్నారు. నేపాల్‌లోని బారా జిల్లాలోని బరియాపూర్‌లో గంధిమాయ్ అనే అమ్మవారి దేవాలయం వుంది. ఈ దేవాలయం ప్రాంగణంలో ఐదు సంవత్సరాలకోసారి పశువులను బలి ఇచ్చే ఉత్సవం జరుగుతుంది. ఈ బలి ఉత్సవంలో ఒకేరోజు లక్షలాది పశువులను బలి ఇస్తారు. నేపాల్‌తోపాటు నేపాల్ సరిహద్దులో వున్న భారతీయ గ్రామాల నుంచి కూడా ప్రజలు భారీ సంఖ్యలో ఇక్కడ పశువులను బలి ఇస్తూ వుంటారు. మొన్నీమధ్య నవంబర్ 23, 2014న ఈ బలి ఉత్సవం జరిగింది. ఒకే రోజున రెండు లక్షల యాభై వేల పశువులను తెగనరికారు. అత్యంత దారుణమైన ఈ దురాచారాన్ని ఆపాలని పెటా లాంటి సంఘాలు నేపాల్ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నాయి. అయితే ఇది సంప్రదాయంతో ముడిపడిన అంశం కావడంతో నేపాల్ ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోంది. ఇలా అయిదేళ్ళకోసారి లక్షల సంఖ్యలో పశువులను బలి ఇవ్వడం వల్లే ఇప్పుడు భూకంపం వచ్చి నేపాల్ అల్లకల్లోలం అయిపోయిందని జంతు ప్రేమికులు అంటున్నారు. నేపాల్‌కి మూగ జీవాల ఉసురు తగిలిందని చెబుతున్నారు.