జయమ్మా... నీకు తిరుగే లేదు...

అమ్మా జయలలితమ్మా... జాతకమంటే నీదేనమ్మా... సినిమా రంగంలో నీకు ఎలాగూ తిరుగులేకుండా హవా నడిపించావు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా నువ్వు హవా నడిపిస్తున్నావమ్మా. నిన్ను మొట్టమొదట ‘పురచ్చితలైవి’ (విప్లవ నాయకి) అన్నవాడెవడో గాని వాడికి వందనాలమ్మా. ఎంజీఆర్ తర్వాత ఎవరా అని అనుకుంటున్న సమయంలో కొంతకాలం అన్నా డీఎంకేకి దూరంగా వున్నప్పటికీ ఆ తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టావు. తమిళనాడు రాజకీయాల్లో ఎంజీఆర్, కరుణానిధి తర్వాత ఆ స్థాయిని పొందావు. తమిళనాడు అసెంబ్లీలో అవమానానికి గురైనా ఎంతమాత్రం అదరకుండా బెదరకుండా నీ లక్ష్యం వైపు  దూసుకెళ్ళావు. రాజకీయాల్లో కాకలు తీరిన కరుణానిధి లాంటి యోధుడినే మట్టి కరిపించి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఫిక్సయిపోయావు. నీమీద ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా వాటిని ఎంతమాత్రం పట్టించుకోకుండా విజయపథంలో నడుస్తున్నావు. ప్రజల్ని ఆకట్టుకోవాలంటే నీ తర్వాతే ఎవరైనా. ప్రజలకు గిఫ్టులిస్తావు.. ముఖ్యమంత్రి పదవిని గిఫ్టుగా పొందుతూ వుంటావు. ఒకప్పుడు దేశ రాజకీయాలనే శాశించిన మహిళా శక్తివి నీవమ్మా. వాజ్‌పాయ్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన శక్తి స్వరూపిణి నీవమ్మా. అక్రమాస్తుల కేసులో మొన్నామధ్య నీకు శిక్ష పడినప్పుడు నువ్వు ఎమ్మెల్యే పదవిని, ముఖ్యమంత్రి పదవిని వదులకున్నావు. అప్పుడు అందరూ నీ పని అయిపోయిందని అనుకున్నారు. కానీ బూడిదలోంచి పైకి లేచే ఫినీక్స్ పక్షి తరహాలోనే ఎంత గొప్పగా ఆ కేసులోంచి పడ్డావో చూశాక నీకు నువ్వే సాటి అని, ఇక నీకు తిరిగేలేదని అర్థమైపోయిందమ్మా. మరోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్న నీకు అభినందనలు జయమ్మా.

మనవి భలే కోర్టులు

  మొత్తానికి మన దేశంలో కోర్టులు భలే కోర్టులు. ఒక్కోసారి సంవత్సరాలకు సంవత్సరాలు కేసులు విచారిస్తాయి. ఒక్కోసారి లటుక్కుమని తీర్పులు ఇచ్చేస్తాయి. దీనికి సంబంధించిన జ్ఞానం లేనివారికి జ్ఞానోదయం కలిగే విధంగా తాజాగా రెండు తీర్పులు వెలువడ్డాయి. ఒకటి సల్మాన్ ఖాన్ కేసు. మరోటి జయలలిత కేసు. సల్మాన్ ఖాన్ తాగి డ్రైవ్ చేసి ఒకర్ని చంపేశాడనే కేసు, జయలలిత అక్రమాస్తుల కేసు దశాబ్దాల తరబడి విచారణ జరిగి సెషన్స్ కోర్టులు ఇద్దరినీ దోషులుగా నిర్ధారించాయి. అటు ముంబై హై కోర్టు, ఇటు కర్నాటక హైకోర్టు ఇద్దరికీ సపోర్టుగా నిలిచాయి. సల్మాన్ ఖాన్ కేసు విచారణ జరిగా జరగలేదని ముంబై హైకోర్టు ఒక్క రోజులో చెప్పేసింది. మళ్ళీ విచారణ జరగాల్సిన అవసరం వుందని చెప్పి ఇక ఈ కేసు తేలిపోయినట్టేనని చెప్పకనే చెప్పేసింది. ఇక జయలలిత తన ఎమ్మెల్యే పదవిని, ముఖ్యమంత్రి పదవిని వదులుకునేలా సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే నాలుగైదు నెలల్లోనే పెద్దగా విచారణ ఏమీ జరగకుండానే కర్ణాటక హైకోర్టు ఆమెను నిర్దోషిగా ప్రకటించేసింది. వీళ్ళిద్దరినీ దోషులుగా తేల్చడానికి సెషన్స్ కోర్టులకు దశాబ్దాల తరబడి పడితే, గౌరవనీయమైన హైకోర్టులు మాత్రం రోజుల్లోనే వీరిని నిర్దోషులుగా తేల్చేశాయి. ఇంత గొప్పగా పనితీరును కనబరుస్తున్న హైకోర్టులకు వందనం, అభివందనం. ఇలాంటి భలే కోర్టులు మన దేశంలో వున్నందుకు దేశ పౌరులుగా మనం గర్వించాలి.

ఇది ప్రతిపక్షం కాదు.. అతిపక్షం

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడున్నది ప్రతిపక్షం అని చెప్పడానికి ఎంతమాత్రం అర్హత కనిపించడం లేదు. అతిపక్షం అనే మాట ఇప్పుడున్న ప్రతిపక్షానికి అతికినట్టు సరిపోతుంది. నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన ప్రతిపక్షం విధ్వంసాత్మకంగా వ్యవహరిస్తోంది. ప్రతి చిన్న విషయాన్ని కోతి పుండును బ్రహ్మరాక్షసిలా చేసే విధంగా సొంత మీడియాతో నానాయాగీ చేస్తున్న ప్రతిపక్ష నాయకుడి విధానంలో బోలెడంత అతి కనిపిస్తోంది. అందుకనే పై మాట వాడాల్సి వచ్చింది. రాజధాని భూముల విషయంలో, ప్రాజెక్టుల విషయంలో, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష నేత వ్యవహరించిన అతిపక్ష తీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చిరాకు తెప్పించింది. ఏపీ ప్రజలకు ఇప్పటి వరకు ఎన్నో ప్రతిపక్షాలను చూశారు. కానీ ఇప్పుడున్న తరహా ప్రతిపక్షాన్ని మాత్రం ఇంతవరకు ఏపీ ప్రజలు మాత్రమే కాదు.. దేశంలోని ఏరాష్ట్రంలోనూ ఎవరూ చూసి వుండరని చెప్పుకుంటే అతిశయోక్తి కాదు. గతంలో విషయాలు అలా వుంటే, ఇప్పుడు ఆర్టీసీ సమ్మె సందర్భంగా సదరు అతిపక్ష నాయకుడు వ్యవహరిస్తున్న తీరు దారుణంగా వుంది. ఆర్టీసీ ఉద్యోగులు ఆచరణ సాధ్యం కాని కోర్కెలతో సమ్మె చేస్తుంటే ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ప్రజల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని అయినా సమ్మెను వ్యతిరేకించినట్టయితే ఓ పద్ధతిగా వుండేది. అయితే సదరు అతిపక్ష నాయకుడు మాత్రం సమ్మెకు మద్దతు ప్రకటించడం దారుణం. అంటే ప్రజలు ఇబ్బంది పడటాన్ని ఆయన సమర్థిస్తున్నారన్నమాట. ఆయన సొంత మీడియా కూడా సమ్మె ప్రభుత్వ తప్పు అన్నట్టుగా కలరింగ్ ఇస్తూ కథనాలు ఇస్తోంది. మొత్తమ్మీద ఈ అతిపక్ష తీరును ప్రజలు చీదరించుకుంటున్నారు.

ఇది చదివితే మీకు నిద్రపట్టకపోవచ్చు...

మీరు మీ ఇంట్లో గుండెల మీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోతున్నారా? అయితే ఈ వాస్తవాలు చదివిన తర్వాత మీకు నిద్రపట్టకపోవచ్చు. మనం గుండెల మీద చేతులు వేసుకుని హాయిగా నిద్రపోగలుగుతున్నామంటే ప్రధాన కారణం సరిహద్దుల్లో నిరంతరం పహారా కాస్తూ వుండే మన సైనికులే. అయితే మారిన పరిస్థితుల్లో వారి పహారా మనకు ఎంతవరకు రక్షణ కల్పిస్తుందో చెప్పలేని పరిస్థితి. ఈ విషయంలో మన సైనికుల శక్తి సామర్థ్యాల విషయంలో మనం ఎలాంటి సందేహాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. వారి దగ్గర వున్న ఆయుధ సంపత్తి విషయంలోనే మనం భయపడాల్సి వస్తోంది. ఇప్పటికప్పుడు ఏ శత్రుదేశమో మన సరిహద్దులను దాటడానికి భారీ స్థాయిలో ప్రయత్నాలు చేస్తే, మన సైనికులు వారిని కేవలం 10 రోజులు మాత్రమే నిలువరించగలరు. ఆ తర్వాత చేతులు ఎత్తేయడం మినహా వారు చేయగలింది ఏమీ వుండదు. గతంలో అయితే 40 రోజులపాటు ఏకధాటిగా యుద్ధం చేయడానికి సరిపడే ఆయుధ సామగ్రి సరిహద్దుల్లో సైనికుల దగ్గర వుండేది... ఇప్పుడు ఆ ఆయుధాల నిల్వ సామర్థ్యం 10 రోజులకు పడిపోయింది. ఈ విషయాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వెలుగులోకి తెచ్చింది. ఈ సమస్య భారత సైనికులను 1999 నుంచి వేధిస్తోంది. మందుగుండు నిల్వలను పెంచుకోవాలని అప్పటి నుంచి సైన్యం ప్రయత్నిస్తున్నా ఇప్పటి వరకు సైన్యానికి పూర్తిస్థాయి నిల్వలు సమకూరలేదు. ఇంతే కాకుండా, ఇప్పుడు మన సైన్యం దగ్గర ఉన్న చాలా ఆయుధాలు ఔట్ డేటెడ్ అయిపోయాయి. వాటిని ప్రస్తుతం ఉపయోగించే పరిస్థితులు లేవు. అలాగే అనేక ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పేల్చడానికి ఉపయోగించే పరికరాలు రిపేరుకు వచ్చాయి. వేల కోట్ల రూపాయల ఖరీదైన ఈ పరికరాలకు రిపేర్ చేయించకపోవడం వల్ల అవన్నీ మూలన పడి వున్నాయి. ఇండియన్ ఆర్మీలో వున్న ఇలాంటి పరిస్థితులను తక్షణం సరిదిద్దాల్సిన అవసరం వుందని కాగ్ సూచించింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం హాయిగా నిద్రపోగలమా?

మావోలకి మోడీ సందేశం వేస్ట్

మావోయిస్టుల సిద్ధాంతానికి, రాజకీయ నాయకుల సిద్ధాంతానికి చాలా తేడా, దూరం వున్నాయి. ఈ రెండు వ్యవస్థలూ ఎప్పటికీ కలవని రైలు పట్టాల్లాంటివి.ఈ విషయం గతంలో ఎన్నోసార్లు రుజువైంది. మావోయిస్టులను జన జీవన స్రవంతిలో కలవాలని ఎన్నో వందలమంది రాజకీయ నాయకులు పిలుపులు ఇచ్చారు. ఏవేవో ఆశలు చూపించారు. అయితే అవి ఎప్పుడూ సత్ఫలితాన్ని ఇవ్వలేదు. చివరికి కొన్ని సందర్భాలలో మావోయిస్టులు ఆయుధాలని వదలాలని అనుకుంటే, అవి వారికే బెడిసికొట్టి భారీ నష్టాలను మిగిల్చాయి. మొత్తమ్మీద ఇప్పుడున్న పరిస్థితుల్లో మావోయిస్టులు - రాజకీయ నాయకులకు సయోధ్య కుదిరే అవకాశమే లేదు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఈ విషయం తెలియదని అనుకోలేం. అయితే ఆయన ఛత్తీస్‌గఢ్ పర్యటన సందర్భంగా మావోయిస్టులు ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని పిలుపు ఇచ్చారు. ఆయన పిలుపు అయితే ఇచ్చారుగానీ, ఆ పిలుపు ఫలించడం మాత్రం కలలో మాట. మావోయిస్టులకు ప్రథమ శత్రువులు రాజకీయ నాయకులు. అలాంటి నాయకులుచెప్పిన మాటలు విని మావోయిస్టులు తుపాకులను వదిలేసే ప్రసక్తే వుండదు. వారు తుపాకులు వదిలేసి, ప్రభుత్వాలతో చర్చలు జరిపిన ప్రతిసారీ నష్టపోతూనే వచ్చారు. ఏపీ విషయానికి వస్తే,  అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పిలుపు మేరకు తుపాకులు విడిచిపెట్టి చర్చలకు వచ్చిన మావోయిస్టులు ఘోరంగా దెబ్బతిన్నారు. ఏపీలో మావోయిస్టులు దాదాపుగా తుడిచిపెట్టుకుని పోవడానికి ఆ సందర్భం ముఖ్య కారణంగా మారింది. ఇలాంటి పాఠాలు గతంలో కూడా మావోయిస్టులు నేర్చుకున్నారు. అందుకే మరోసారి అలాంటి పొరపాటు చేయరు. రాజకీయ, మావోయిస్టు వ్యవస్థల మధ్య నిరంతర ఘర్షణ అలా కొనసాగాల్సిందే. మోడీ ఛత్తీస్‌గఢ్ పర్యటనను పురస్కరించుకుని 250 మందిని మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఒకరిని చంపేశారు. అదృష్టం బాగుండి కిడ్నాప్ చేసిన మిగతా వారిని విడిచిపెట్టేశారు. ఇలా ప్రభుత్వాలకు సవాల్ విసురుతున్న మావోయిస్టులకు మోడీగారు శాంతిపాఠాలు నేర్పించే ప్రయత్నాలు చేయడం, శాంతి సందేశాలు ఇవ్వడం వేస్ట్.

ఎన్నికలంటే టీఆర్ఎస్‌కి భయమా?

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉప ఎన్నికలంటే, జీహెచ్ఎంసీ ఎన్నికలంటే టీఆర్ఎస్ భయపడుతోందా? ఠాఠ్... అలాంటిదేమీ లేదు... టీఆర్ఎస్ పాలన చూసి ప్రజలు మురిసిపోయి ముగ్ధులైపోతున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం తమ పూర్వ జన్మ సుకృతమని ప్రజలు భావిస్తున్నారు. ఏ ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్‌‌ని గెలిపించేస్తారు అని టీఆర్ఎస్ నాయకులు పైకి చెబుతూ వుండొచ్చుగానీ, వాస్తవ పరిస్థితి వారు చెబుతున్నట్టుగా లేదని, అందుకే ఉప ఎన్నికలకు, జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధం కావడానికి టీఆర్ఎస్ వెనుకడుగు వేస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలతోపాటు పలు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలను టీఆర్ఎస్ ఎదుర్కోవలసి వుంది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు హైదరాబాద్‌లో ఎక్కువగా వుండటం వల్ల ఇక్కడ టీఆర్ఎస్ విజయం అంత సులభం కాదు. అయినప్పటికీ ఆక్రమించుకున్న స్థలాలను క్రమబద్ధీకరించడం, ముస్లింలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేయడం, ఎంఐఎంతో దోస్తీ చేయడం తమకు ఉపయోగపడుతుందని టీఆర్ఎస్ నేతలు పైకి చెబుతున్నప్పటికీ  లోపల ఏవో సందేహాలు వారిని పీడిస్తున్నాయి. సీమాంధ్రులను దువ్వే ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించిన దాఖలాలు కనిపించడం లేదు. అందుకే జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వెనుకాడుతూ వచ్చింది. అయితే కోర్టు ఆదేశాల కారణంగా ఎన్నికలు జరపక తప్పని పరిస్థితి వచ్చింది. అలాగే టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లోకి చేరిన తలసాని వంటి ఎమ్మెల్యేలు, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కడియం శ్రీహరి కూడా తన ఎంపీ స్థానానికి  రాజీనామా చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాల్సి వుంది. అలాగే కడియం రాజీనామా చేసిన ఎంపీ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరపాల్సి వుంది. అలాగే అవసరమైతే టీఆర్ఎస్‌లో చేరిన ఇతర పార్టీల ఎమ్మెల్యేల స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరపాల్సి వుంటుంది. ఈ ఎన్నికలలో ఏ స్థానంలో అయినా టీఆర్ఎస్ ఓడిపోయిన పక్షంలో అది టీఆర్ఎస్‌కి షాక్ ఇచ్చే అవకాశం వుంది. అందుకే అసలు ఉప ఎన్నికలు జరగకుండా తప్పించుకునే మార్గాలను టీఆర్ఎస్ అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ చూస్తుంటే ఎన్నికలంటే టీఆర్ఎస్ భయపడుతోందని భావించాల్సి వస్తోందని పరిశీలకులు అంటున్నారు.

మోడీ గారికి ఏపీ ప్రజల లేఖ

  భారత ప్రధాని నరేంద్రమోడీకి బాగా విసిగిపోయి వున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాసుకుంటున్న లేఖ. ఏపీ ప్రజలు రాసిన లేఖ అనగానే ఏ ప్రత్యేక హోదా కోసమో రాసిన లేఖ అనో, కష్టాల్లో వున్నాం ఆర్థికంగా ఆదుకోండి మహాప్రభో అని మొరపెట్టుకునే లేఖో అనుకున్ని  ఎప్పట్లాగే చెత్తబుట్టలో విసిరేయకండి. ఇది అలాంటి లేఖ కాదు.. మీకు అలాంటి లేఖలు ఎన్ని రాసినా ఉపయోగం వుండదని మాకు అర్థమైపోయింది. కాబట్టి మీకు అలాంటి లేఖలు రాయబోం. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అర్జెంటుగా మీ పార్టీలో విలీనం చేసుకోండని విజ్ఞప్తి చేసే లేఖ. పీకల్లోతు కేసుల్లో కూరుకుపోయి వున్న వైసీపీ నాయకుడు జగన్ మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ పంచన వున్నారు. ఇప్పుడు మీ పంచన చేరాలని తహతహలాడుతున్నాడు. ఆయన పార్టీని మీ పార్టీలో విలీనం చేసేసి తన కేసుల నుంచి పూర్తిగా తప్పించుకునే ప్లాన్‌లో వున్నాడు.  బీజేపీ నాయకుడిగా మారిపోయి ఏపీలో హడావిడి చేసి, టీడీపీకి, బీజేపీకి మధ్య చిచ్చు పెట్టి తాను లాభం పొందాలని అనుకుంటున్నాడు. ఆయన మొన్నటి వరకు టీడీపీ - బీజేపీ ఫ్రెండ్ షిప్ ఎప్పుడు కట్టయిపోతుందా, నా పార్టీ టీడీపీ ప్లేసులోకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూశారు. అందుకు తెరవెనుక  ప్రయత్నాలు కూడా చేశారు. అయితే అది వర్కవుట్ కాలేదు. అందుకే ఇప్పుడు పార్టీని విలీనం చేస్తే ఓ పనైపోతుందని భావిస్తున్నారు. సొంత పార్టీ ద్వారా ఎలాగూ సీఎం కాలేకపోయాను... బీజేపీలో చేరితే అయినా సీఎం అయిపోతానని కలలు కంటున్నారు. మీ పార్టీ కూడా ఏపీలో పాతుకుపోవాలని, వచ్చే ఎన్నికలలో అధికారం సంపాదించాలని కలలుకంటోంది. మీ రెండు పార్టీల మనసులలో కలసిపోవాలని కలలున్నప్పటికీ, ఆ కలలకు టీడీపీకి - బీజేపీకి మధ్య వున్న దోస్తీ అడ్డం వస్తోంది. అయితే టీడీపీ - బీజేపీ దోస్తీ వల్ల ఏపీకి ఎలాంటి లాభం లేదని అందరికీ అర్థమైపోయింది. అంచేత ఈ ముసుగులో గుద్దులాటలు మానేసి వైసీపీని మీ పార్టీలో కలిపేసుకోండి. అప్పుడు ఆటోమేటిగ్గా టీడీపీతో మీ దోస్తీ కట్ అయిపోతుంది. ఇప్పటి వరకూ మీతో మిత్రధర్మం పాటిస్తూ వస్తున్న టీడీపీ అప్పటి నుంచయినా యాక్టివ్ అయిపోయి ఏపీ హక్కుల సాధనలో కేంద్రంతో నిర్దాక్షిణ్యంగా వ్యవహరించగలుగుతుంది. అంచేత అందరికీ ఆనందాన్నిచ్చే బీజేపీలో వైసీపీ విలీనం సాధ్యమైనంత త్వరగా జరిగిపోవాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు. తమరు ఈ విషయాన్ని పరిశీలించల్సిందిగా విజ్ఞప్తి.

సమ్మెలను తట్టుకునే శక్తి కావాలి

కార్మికుల హక్కుల గురించి నినదించడానికి, సమస్యల గురించి నిరసన వ్యక్తం చేయడానికి ప్రారంభమైన ‘సమ్మె’ అనే ఆయుధం ఇప్పుడు మారణాయుధంగా మారింది. స్వార్థమే పరమావధిగా, ప్రభుత్వాలకు వున్న సమస్యల గురించి మాకెలాంటి సంబంధం లేదన్నట్టుగా, ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడితే మాకేంటి అన్నట్టుగా ‘సమ్మె’ ఎదిగింది. నాలుగు రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మెని మాత్రమే దృష్టి పెట్టుకుని చెబుతున్న మాటలు కావు ఇవి. అనేక ప్రభుత్వ సంస్థలు కావచ్చు... ప్రైవేటు కంపెనీలు కావచ్చు... ఎక్కడైనా సమ్మె అనేది వికృతరూపం దాల్చింది. అమలుకు సాధ్యం కాని కోరికలు కోరడం... వాటికి యాజమాన్యాలు అంగీకరించకపోతే సమ్మెకు దిగిపోవడం. తమ సమ్మె విజయవంతం అయింది అనిపించుకోవడం కోసం ధర్నాలు, ప్రదర్శనలు జరపడం, పోలీసులు లాఠీ ఛార్చ్ చేసే వరకూ పరిస్థితిని తీసుకురావడం. ఎవరైనా గాయపడితే పెద్ద ఇష్యూ చేయడం. వీరు సమ్మె చేస్తున్నారు కదా అని ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటే భౌతిక దాడులకు దిగడం... ఇదీ ఇప్పుడు సమ్మె అనే వ్యవస్థ చేరుకున్న స్థితి. సమ్మె కారణంగా కోట్లాదిమంది ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా ఎంతమాత్రం పట్టించుకోకుండా వుండే కఠినత్వానికి సమ్మెలు చేస్తు్న్నవారు చేరుతున్నారు. సరే, నేటి మన వ్యవస్థలో ఎవరూ ఎవరినీ అదుపు చేసే స్థితిలో లేరు. ఎవరు ఎవరికి నీతులు చెప్పినా వినే పరిస్థితి అంతకన్నా లేదు. సమ్మెల విషయంలో కూడా ఇదే సూత్రం. మా సమ్మె మా ఇష్టం... మధ్యలో అడగటానికి నువ్వెవరివని సామన్య ప్రజలను ప్రశ్నిస్తే వారి దగ్గర సమాధానం లేదు. అందుకే ఇప్పుడు అలాంటి సామాన్యులందరి తరఫున ఆ భగవంతుడు అనేవాడు ఒకడు వుంటే ఆయన్ని కోరుకునేది ఒక్కటే... స్వామి... ఎవరి సమ్మెలను వారిని చేసుకోనివ్వు.. కానీ ఆ సమ్మెలను తట్టుకునే శక్తిని మాకు ఇవ్వు. ఏ వ్యవస్థ సమ్మెలోకి దిగినా ఆ వ్యవస్థ లేకుండానే ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుని జీవన మార్గంలో ప్రయాణించే అవకాశమివ్వు. ఇప్పుడు జరుగుతున్న ఆర్టీసీ సమ్మెని ఇలాగే సుదీర్ఘకాలం కొనసాగించేలా చేయి. ఎంత సుదీర్ఘ కాలం అంటే... ఆర్టీసీ బస్సులు ఎక్కకపోయినా జనజీవనం మామూలుగానే గడిచిపోయేంత అలవాటైపోయే వరకూ. ప్రజలకు ఆర్టీసీ అనే వ్యవస్థతో అవసరం లేని మానసిక స్థితి వచ్చినప్పుడు, సమ్మె జరిగితే ఏంటంట... బస్సులు తిరిగితే ఏంటంట అనుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఈ సమ్మెలు జనజీవనాన్ని ఎంతమాత్రం ప్రభావితం చేయలేవు. అయితే ఇది అత్యాశ అని తెలుసు... కానీ దురాశ మాత్రం కాదు... ఎవరు లేకపోయినా ప్రకృతి తన పని తాను చేసుకుని పోతున్నట్టుగా ఏ వ్యవస్థ లేకపోయినా ప్రజల జీవనంలో ఎలాంటి ఒడిదుడుకులు రాని రోజు రావాలి.

ఇలాంటి విమర్శలు తగునా?

తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌కి చెందిన మీడియా తెలంగాణకు చెందిన మీడియాలా కాకుండా టీఆర్ఎస్ పార్టీకి చెందిన సొంత మీడియాలా వ్యవహరిస్తోందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ సొంత మీడియా విషయంలో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని అయినా సదరు మీడియా, ఆ మీడియాకి నాయకత్వం వహిస్తున్నవారు తమ వైఖరిని మార్చుకుంటే బాగుండేది. తెలంగాణ అభివృద్ధి కోసం అన్నట్టు కాకుండా టీఆర్ఎస్ అభివృద్ధి కోసమే పనిచేస్తున్నట్టుగా వుందన్న విమర్శలు ఇటీవలి కాలంలో బాగా వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో తాజాగా సదరు మీడియాలో వచ్చిన ఒక విమర్శ లాంటి వార్త రాజకీయ పరిశీలకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇలాంటి విమర్శలు తగునా అని అందరూ ముక్కు వేలేసుకునేలా సదరు కథనాలు వున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే హామీ విభజన బిల్లు ఆమోదం సమయంలో లభించింది. అయితే ఆ హామీ ఇప్పుడు నీరుగారిపోయింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం నాయకులు కొందరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ప్రధానికి ఒక విజ్ఞాపన పంపించారు. దానిమీద తెలంగాణ రాష్ట్రానికి చెందిన టీడీపీ ఎంపీ మల్లారెడ్డి, పలువురు నాయకులు సంతకాలు చేశారు. ఇలా తెలంగాణకు చెందిన ఎంపీ, నాయకులు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ప్రధానిని కోరడం అన్యాయం, దారుణం, తెలంగాణకు ద్రోహం చేయడం అన్నట్టుగా కథనాలు సదరు మీడియాలో రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పొరుగు రాష్ట్రం బాగుండాలని కోరుకుంటూ సంతకాలు చేసిన నాయకుల ఔదార్యం చాలా గొప్పది. ఈ విషయం నుంచి కూడా రాజకీయ లబ్ధి పొందాలన్న కోణంలో కథనాలు రాయడం మంచిది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా్యి. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా వస్తే తెలంగాణకు వచ్చే నష్టమేమిటన్న ప్రశ్నకు సమాధానం చెప్పేవారెవరూ లేరు. ఇప్పటికే ఇరు ప్రాంతాల ప్రజల మధ్య అంతరం బాగా పెరిగింది. అది తీవ్రమైన విద్వేషంగా మారకుండా చూసుకోవాల్సిన అవసరం వుంది. రెండు రాష్ట్రాలూ బాగుండాలి. సదరు మీడియా ఈ విషయాన్ని గ్రహిస్తే అందరికీ మంచింది.

మోడీని బాగానే దువ్వుతున్నారు

ప్రధాని అయిన తర్వాత నరేంద్ర మోడీ తల చాలా నీట్‌గా కనిపిస్తోంది. ఆయన తన తలను బాగా దువ్వుకుంటూ వుండొచ్చు. ఒకవేళ మోడీ దువ్వుకోకపోయినా, ఆయనను దువ్వేవారు చాలా ఎక్కువైపోయారు. మోడీని దువ్వడానికి రాజకీయ నాయకులు క్యూలు కడుతున్నారు. ఎదుకంటే ప్రస్తుతం ఆయన హవా నడుస్తోంది. ఇంకా నాలుగేళ్ళపాటు ఆయన హవా ఇలాగే ఖాయంగా నడుస్తుంది. ఆయన్ని మంచి చేసుకునే ప్రయత్నంలో చాలామంది ఆయన్ని బాగా దువ్వుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోడీ గారిని దువ్వేపనిలో నిమగ్నమై వుంటారు. ఎందుకంటే పాపం చంద్రబాబు నాయుడి పరిస్థితి అలాంటిది. విభజన కారణంగా దారుణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ని గట్టెక్కించాలంటే మోడీని దువ్వాలి... కేంద్రంలో అధికారం చెలాయించే ఎవర్నయినా దువ్వాలి. ఇప్పుడు ఈ దువ్వే విషయంలో చంద్రబాబుతో పోటీ పడేవారు ఇప్పుడు కొత్తగా మరికొందరు బయల్దేరారు. వారెవరో కాదు. తెలంగాణలో అధికారంలో వున్న టీఆర్ఎస్ నాయకులు. మొన్నటి వరకు మోడీ, గీడీ అని పుల్లను తీసి పారేసినట్టు నిర్లక్ష్యంగా మాట్లాడిన  తెలంగాణ సీఎం కేసీఆర్ గారు అప్పట్లో మోడీ బ్రెయిన్ ఛైల్డ్ ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని కూడా ఎంతమాత్రం పట్టించుకోలేదు. అయితే మెల్లమెల్లగా ఆయనకు అసలు విషయం బోధపడింది. ప్రధాని మోడీతో మంచిగా వుండకపోతే సీన్ సీతారైపోతుందని అర్థమైంది. దాంతో అప్పటి నుంచి మోడీతో రాసుకు పూసుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేశారు. ప్రధానితో ముఖ్యమంత్రుల మీటింగ్‌కి వెళ్ళి గ్రూఫ్ ఫొటోలో మోడీ పక్కనే నిల్చుని ఫొటో దిగి తాను మోడీకి చాలా క్లోజ్ అన్నట్టుగా కలరింగ్ ఇచ్చారు. లేటెస్ట్‌గా స్వచ్ఛ భారత్ అడుగు జాడల్లో నడుస్తూ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించేశారు. తండ్రి కేసీఆర్ మోడీ పక్కన నిల్చుని ఫొటో దిగి మురిసిపోతే ఆయన కుమార్తె, ఎంపీ కవిత గారు మాత్రం మోడీతో కలసి సెల్ఫీ దిగే ముచ్చటని తీర్చుకున్నారు. ఇవన్నీ మోడీని దువ్వే ప్రయత్నాల్లో భాగమేనని ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం వున్నవారికైనా తెలిసే విషయాలు. అయితే అవసరం తీరిన తర్వాత మోడీని బోడి అనకుండా వుండే విజ్ఞత వుందని ఆశించడం దురాశేనేమో.

కారుతో నక్కని తొక్కించి వుంటాడు

  బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తప్పతాగి డ్రైవ్ చేసి ఒక నిండు ప్రాణం పోవడంతోపాటు నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడటానికి కారణమయ్యాడు. 2002లో జరిగిన ఈ కేసుకు సంబంధించి పదమూడేళ్ళ తర్వాత తీర్పు వెలువడింది. సల్మాన్ ఖాన్ తప్పతాగి డ్రైవ్ చేశాడని, అందువల్ల అతనికి ఐదేళ్ళ కారాగార శిక్ష విధిస్తున్నానని సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే సల్మాన్‌కి కోర్టు ఇలా శిక్ష విధించిందో లేదో అలా నెత్తిన నీటి కుండలు పెట్టుకున్నట్టుగా కన్నీరు కార్చేవారు, సానుభూతితో ముక్కులు చీదేవారు ఎక్కువైపోయారు. బోలెడంత మంది బాలీవుడ్ నటీనటులు, దారినపోయే దానయ్యలు... వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా సల్మాన్‌కి శిక్ష పడటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. వారి ధోరణి చూస్తే సల్మాన్ ఇంకో పదిమంది మీదకి కారు ఎక్కించి చంపేసినా క్షమించేయాల్సిందేనని, ఆయన మానవాతీతుడని అన్నట్టుగా వుంది. ఇలాంటి సానుభూతిపరుల ముక్కు చీదుళ్ళు, మూతి విరుపులు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అనుకుంటున్న సమయంలో ముంబై హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. సల్మాన్ కేసును సెషన్స్ కోర్టు సరిగా విచారించలేదని, ఈ కేసును సరిగా విచారించాల్సి వుందని చెప్పింది. సల్మాన్‌కి సాధారణ బెయిల్ కూడా మంజూరు చేసింది. తద్వారా ఈ కేసును మళ్ళీ విచారించాలని చెప్పేసింది. సెషన్స్ కోర్టు పదమూడేళ్ళపాటు విచారణ జరిపి సల్మాన్ ఖాన్ దోషి అని ఖరారు చేసి శిక్ష విధించింది. అయితే గౌరవనీయమైన ముంబై హైకోర్టు మాత్రం ఒకే ఒక్కరోజులో ఈ కేసు విచారణ సరిగా జరగలేదని డిసైడ్ చేసేసింది. ఇంత గొప్పగా అసలు వాస్తవాన్ని కనుక్కొన్న ముంబై హైకోర్టుకు హేట్సాఫ్ చెప్పడం ప్రతి భారతీయ పౌరుడి కర్తవ్యం. ఇంత గొప్పగా, ఇంత త్వరగా న్యాయాన్ని, అన్యాయాన్ని గ్రహించగలిగే గొప్ప న్యాయ వ్యవస్థ మనకు వున్నందుకు మనందరం గర్వపడాలి. అయితే కేసు విచారణ మళ్ళీ మొదలైతే, ఈ కేసులో కీలక సాక్షిగా వున్న రవీంద్ర పాటిల్‌ ఇప్పటికే చనిపోయారు. గతంలో ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని ఇప్పుడు పరిగణనలోకి తీసుకుంటారో లేదో. మరి పరిగణనలోకి తీసుకోకపోతే ఆయన ఇప్పుడు మళ్ళీ సాక్ష్యం ఇచ్చే అవకాశం లేదు కదా.. అయినా ఇవన్నీ ఘనత వహించిన చట్టాలు, న్యాయాలు, కోర్టులు తేల్చాల్సిన విషయం. మనలాంటి సామాన్య పౌరులకు అర్థమయ్యే విషయం కాదు. అన్నట్టు సల్మాన్ ఖాన్ ఎప్పుడో ఒకసారి తన కారుతో ఏ నక్కనో తొక్కి వుంటాడు. అందుకే లక్కు ఇలా దరిద్రం పట్టినట్టు పట్టింది.

జంపింగ్ సీన్ రివర్స్ అవుతోంది

రాజకీయాలలో ఒక్కోసారి ఒక్కోరకం సీజను నడుస్తూ వుంటుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే మొన్నటి వరకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ఎంతో ఉత్సాహం చూపించేవారు. టీఆర్ఎస్ ప్రయోగిస్తున్న ‘ఆకర్ష’ పథకం పుణ్యమా అని తెలంగాణలో ఇప్పటికే అనేకమంది టీడీపీ కార్యకర్తలు, నాయకులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక కాంగ్రెస్ నాయకుల సంగతి సరేసరి. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులతో కిటకిటలాడిపోతోంది. ఎంతమంది ఎక్కినా ఒక్కరికి స్థానం వుండే మాయా తివాచీ తరహాలో టీఆర్ఎస్ అనునిత్యం ‘ఆకర్ష’ పథకాన్ని అమలు చేస్తోంది. ఎవరు టీఆర్ఎస్‌లోకి జంప్ చేసినా, అందరి నోట ఒకటే మాట.. టీఆర్ఎస్ అద్భుత పరిపాలన చూసి పార్టీ మారాను. నా నియోజకవర్గం అభివృద్ధి కోసం పార్టీ మారాను. ఇక తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ మినహా మిగిలిన పార్టీలు బతికి బట్టకట్టడం కష్టమేమో అనే అనుమానాలు ఇప్పుడిప్పుడే కలుగుతున్న తరుణంలో లేటెస్ట్‌గా సీన్ రివర్స్ అయింది. కొంతమంది టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తమ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్‌లో చేరారు. అది కూడా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు సొంత జిల్లా అయిన మెదక్ జిల్లా నుంచి. మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గానికి చెందిన కొంతమంది నాయకులు, కార్యకర్తలు శనివారం నాడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. టీఆర్ఎస్ నియంతృత్వ పాలనను భరించలేకే టీడీపీలో చేరామని వారు స్పష్టంగా చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ నుంచి కొంతమంది టీడీపీలో చేరడం అనేది వింతల్లోకెల్లా వింత అనే చెప్పాలి. అలాగే ఈ చేరికలను మారుతున్న పరిస్థితులకు సంకేతంగా భావించవచ్చని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టీఆర్ఎస్ పరిపాలన మీద ప్రతిపక్షాలతోపాటు అనేక వర్గాలు వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్న ఈ తరుణంలో జరిగిన ఈ చిన్న ఘటన భవిష్యత్తులో భారీ పరిణామాలకు నాందిగా భావించవచ్చని కూడా వారు అంటున్నారు.

ఆర్టీసీ చర్చలు విఫలం అవడానికి ఎవరు కారణం?

  ఆర్టీసీ విభజన ఇంకా పూర్తి కాకపోవడంతో రెండు రాష్ట్రాలలో ఆర్టీసీ సంస్థకు సాంభశివరావు మేనేజింగ్ డైరక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన నిన్న ఆంధ్రా, తెలంగాణా ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానించి, “ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగులకు మాత్రమే 27 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వగలమని కానీ తెలంగాణా ఉద్యోగులకు ఎంత ఇచ్చేది ఇప్పుడే చెప్పలేమని ఎందుకంటే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే ఈ విషయంలో స్పందించిందని తెలంగాణా ప్రభుత్వం ఇంకా ఈ విషయంపై ఎటువంటి నిర్ణయము తీసుకోలేదని” చెప్పడంతో అటువంటప్పుడు తమను ఎందుకు చర్చలకు పిలిచారంటూ తెలంగాణాకు చెందిన ఉద్యోగ సంఘాల నేతలు అశ్వత్థామ, కె. పద్మాకర్‌, పలిశెట్టి దామోదరరావు, కొమిరెల్లి రాజిరెడ్డి తదితరులు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. అది వారి మధ్య తీవ్ర వాగ్వాదానికి దారి తీయడంతో ఆయన ఉద్యోగులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్చల మధ్యలోనే బయటకి వెళ్ళిపోయారు. ఆయన చాల నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని, ఆంధ్రాకు చెందిన ఆయనతో తాము ఇకపై చర్చలకు కూర్చోబోమని తెలంగాణాకు చెప్పడంతో ఆయన కూడా అంతే ఘాటుగా ప్రతిస్పందించారు.   ఆయన తక్షణమే ఆర్టీసీ బస్ భవన్ లో ఆంధ్రాకు కేటాయించిన ‘ఏ’ బ్లాకులోకి తన చాంబర్ ని మార్పించుకొన్నారు. అంతే కాదు ఇకపై తెలంగాణాకు చెందిన ఉద్యోగ సంఘాల నేతలు జేఎండీ రమణారావుతోనే చర్చించుకోవాలని, తను ఇకపై తెలంగాణా ఆర్టీసీ వ్యవహారాలలో కలుగజేసుకోనని ప్రకటించారు. ఈనెల 14 నుండి ఆంధ్రా, తెలంగాణా ఆర్టీసీలు బస్ భవన్ లో ‘ఏ’ ‘బి’ బ్లాకుల నుండి వేర్వేరుగా నిర్వహించుకొనేందుకు నిర్ణయించుకొన్నాయి. కానీ ఆర్టీసీ విభజన ఇంకా పూర్తి కానందున ఆంధ్ర, తెలంగాణా ఆర్టీసీ సంస్థలు రెండింటికీ ఆయనే మేనేజింగ్ డైరక్టర్ గా కొనసాగుతున్నారు.   నిన్న జరిగిన పరిణామాలతో కలత చెందిన ఆయన స్వచ్చందంగా తెలంగాణా బాధ్యతల నుండి తప్పుకొంటున్నట్లు ప్రకటించడం చాలా ఆశ్చర్యకర పరిణామమేనని చెప్పక తప్పదు. ఉద్యోగులు వేతనాల పెంపు గురించి మొదలయిన చర్చలు ఈవిధంగా ప్రాంతీయ బేధాలకు దారి తీయడం ఆశ్చర్యమే కానీ అది అనివార్యమవుతుందని ఊహించడం పెద్ద కష్టం కాదు. ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల పెంపుగురించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకొంటునప్పుడు ఉద్యోగ సంఘాల నేతలతో వేర్వేరుగా చర్చలు జరుపకుండా అందరితో ఒక్కసారే మాట్లడాలనుకోవడం ఆర్టీసీ యాజమాన్యం చేసిన తప్పయితే, వేతన సవరణ గురించి చర్చించడానికి వచ్చిన ఉద్యోగ సంఘాల నేతలు ఆ విషయం గురించి మాట్లాడకుండా వేరే విషయాల గురించి మాట్లాడటం కూడా అంతే తప్పు. ఈ సమస్య మరిన్ని చిక్కు ముడులు పడకూదనుకొంటే ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల ఆర్టీసీ విభజన ఎలాగూ జరుగుతోంది కనుక సంబంధిత అధికారులు, మంత్రులే తమ తమ రాష్ట్ర ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు కొనసాగిస్తే మంచిది.

బొత్సతో వైసీపీ బేరం ఫిక్స్

పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బేరం ఫిక్స్ చేసుకుంది. ఈ బేరం సారాంశం ఏమిటంటే, బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీకి జెల్ల కొట్టి వైసీపీలోకి జంప్ అవుతారు. దానికి ప్రతిఫలంగా బొత్సకు వైసీపీ తరఫున ఏపీ శాసనమండలిలో స్థానం ఇస్తారు. ఈ మేరకు బొత్స, జగన్ మధ్య ఒప్పందం ఖరారు అయినట్టు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో బొత్స వైసీపీలో చేరబోతున్నారు. జంప్ జిలానీ అయిన బొత్సకు ఎమ్మెల్సీ పదవిని జగన్ బంగారు పళ్ళెంలో పెట్టి అందించబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెట్టుకుని పోవడానికి బొత్స సత్యనారాయణ కూడా ఒక కారణం. గత ఎన్నికలలో చీపురుపల్లి నుంచి ఓడిపోయిన తర్వాత బొత్సవారు ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీలోంచి జంప్ అయిపోవాలా అని ఎదురుచూస్తున్నారు. బీజేపీతో బేరం విఫలమైన తర్వాత ఆయన చూపు వైసీపీ వైపు మళ్ళింది. ఇప్పటికే దుకాణం సర్దేసే స్థితిలో వున్న వైసీపీకి బొత్స రాక మేలు చేస్తుందని పార్టీ నాయకుడు జగన్ భావిస్తున్నారు. వైసీపీని బీజేపీలో విలీనం చేసేసి, కేసుల నుంచి తప్పించుకోవాలని, ఆ తర్వాత బీజేపీ నాయకుడిగా ముఖ్యమంత్రి పీఠం మీద ఎక్కాలన్నది జగన్ కంటున్న కల. అయితే ఈ కలను కార్యరూపంలో పెట్టాలంటే బీజేపీతో రాయబారాలు నడపగల ఒక మధ్యవర్తి అవసరం వుంది. కేంద్రంలోని సీనియర్ బీజేపీ నాయకులతో సత్సంబంధాలు వున్న బొత్స అయితే ఈ మధ్యవర్తి పదవికి న్యాయం చేయగలరన్న నమ్మకంతోనే ఆయనకు పార్టీ తీర్థంతోపాటు ఎమ్మెల్సీ సీటు కూడా ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఏ పనీలేకుండా ఖాళీగా వున్న బొత్స వైసీపీలో చేరిన తర్వాత ఆ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి తనవంతు కృషి చేస్తారన్నమాట. ఏ పార్టీలో అయినా పార్టీకి ఎప్పటినుంచో సేవ చేసిన వారిని కాకుండా జంప్ జిలానీలను అందలం ఎక్కించడం అనేది సంప్రదాయంగా మారింది. వైసీపీ కూడా అదే బాటలో నడుస్తోంది. తప్పో ఒప్పో పార్టీకి సేవ చేసిన వాళ్ళు ఎంతోమంది వున్నప్పటికీ కాంగ్రెస్ నుంచి జంప్ అయి వస్తున్న బొత్సకు ఎమ్మెల్సీ స్థానం రిజర్వ్ చేయడం పట్ల వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బొత్స పార్టీలోకి రాబోతున్నారన్న విషయం తెలుసుకున్న ఉత్తరాంధ్ర వైసీపీ వర్గాలు తీవ్ర ఆగ్రహంతో వున్నాయి. బొబ్బిలి ఎమ్మెల్యేగా వున్న వైసీపీ నాయకుడు రంగారావు బొత్సను పార్టీలోకి తీసుకుంటే తాను రాజీనామా చేస్తానని బెదిరించారని కూడా సమాచారం. అయితే ఎవరు ఎన్నిరకాలుగా బెదిరించినా, తన పార్టీని బీజేపీలో విలీనం చేసే కలను కంటున్న జగన్ ఆ కలను నిజం చేసే వ్యక్తి బొత్స వారేనని భావిస్తున్నారు. అందుకే ఆయనకు పార్టీలోకి సాదర స్వాగతం పలుకుతున్నారు. మరి బొత్సగారు వైసీపీలో చేరిన తర్వాత జగన్ కల నిజమవుతుందో, లేక పార్టీలో అసంతృప్తి జ్వాలలు రేగి పరిస్థితి ఇప్పుడున్నదానికంటే ఇంకా దిగజారుతుందో కాలమే తేల్చాలి.

ఆర్టీసీ ఉద్యోగులకు రాక్షసత్వం తగదు

  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. విధులకు హాజరు కావడం లేదు. దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. పరీక్షలకు హాజరు కావలసిన విద్యార్థులయితే ఎంతో టెన్షన్ పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన 43 శాతం ఫిట్‌మెంట్ తమకూ ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగులు పట్టుపడుతున్నారు. 27 శాతం వరకు ఫిట్‌మెంట్ ఇవ్వడానికి ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించినప్పటికీ మెట్టు దిగని ఆర్టీసీ సిబ్బంది సమ్మెకు దిగారు. అయితే ఇటీవలి కాలంలో ఆర్టీసీ ఉద్యోగులు చీటికి మాటికి సమ్మెకు దిగుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. దాంతో ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పుడు జరుపుతున్న సమ్మెలో భాగంగా కొంతమంది ఆర్టీసీ సిబ్బంది అదుపు తప్పి వ్యవహరిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాక్షసంగా వ్యవహరిస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కారణంగా ఆర్టీసీ యాజమాన్యం ఒప్పంద ఉద్యోగులతో బస్సులను నడిపే ప్రయత్నాలు చేస్తోంది. అయితే అలాంటి బస్సులను ఆర్టీసీ ఉద్యోగులు అడ్డుకుంటున్నారు. ప్రజల సమస్యలు తమకు ఎంతమాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అక్కడితే ఆగితే పర్లేదని అనుకోవచ్చు. బస్సులను నడపడానికి వచ్చిన ఒప్పంద ఉద్యోగుల మీద రాక్షసంగా దాడులు చేస్తున్నారు. నంద్యాలలో ఒక ఒప్పంద ఉద్యోగిని చావగొట్టారు. అలాగే తూర్పు గోదావరి జిల్లాలో ఒప్పంద ఉద్యోగి నడుపుతున్న బస్సు మీద ఆర్టీసీ ఉద్యోగులు రాళ్ళతో దాడి చేశారు. ఈ దాడిలో బస్సు ధ్వంసం కావడం మాత్రమే కాకుండా, బస్సు నడుపుతున్న ఒప్పంద ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డాడు. ఆర్టీసీ ఉద్యోగులు ఇలాంటి రాక్షసత్వాన్ని విడిచిపెట్టాలి.

‘ఎర్ర’ ముద్ర పోయేదెలా?

వైసీపీ మీద ఇప్పుడు ఎర్రటి ముద్ర పడింది. ఆ ముద్రను ఎలా వదిలించుకోవాలా అని ఆ పార్టీ ఇప్పుడు తంటాలు పడుతోంది. ఈ తాజా గండం నుంచి తప్పించుకోవాలని శాయశక్తులా ప్రయత్నిస్తోంది. అయితే ఎంత ప్రయత్నించినా ఆ ‘ఎర్ర’ ముద్ర చెరిగిపోవడం లేదు... కాలం గడిచేకొద్దీ ఆ ముద్ర సైజు పెరిగిపోతూ వస్తోంది. ఇంతకీ ఆ ‘ఎర్ర’ ముద్ర ఏమిటంటే ఎర్రచందనం ముద్ర. ఎర్ర చందనం స్మగ్లర్ల కారణంగా వైసీపీ మీద పడిన ముద్ర. అంతర్జాతీయ స్థాయి ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డికి, వైసీపీకి వున్న అనుబంధం చాలా దృఢమైనదన్నదన్న విషయం అందరికీ తెలిసిందే. ఇంటర్‌పోల్ చేతికి చిక్కిన ఈ స్మగ్లర్‌ని ఏపీకి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గంగిరెడ్డి ఏపీ పోలీసులకు చిక్కి, ‘సత్కారం’ లభిస్తే ఎవరి పేర్లు వెల్లడి అవుతాయో అన్న ఆందోళన సదరు పార్టీ వారికి వున్నాయి. అలాగే మొన్నీమధ్య దొరికిపోయిన స్మగ్లర్ మస్తాన్ వలీ కూడా వైసీపీ ముద్దుబిడ్డే. మస్తాన్ వలీ మూడో భార్య, హీరోయిన్ అయిన నీతూ అగర్వాల్ మీద పోలీసుల దృష్టి పడిన తర్వాత ఆమె పోలీసులకు లొంగిపోవాలని అనుకుంది. ఆ విషయాన్ని కొంతమంది ఎమ్మెల్యేలకు ఫోన్ చేసింది. వాళ్ళు లొంగిపోతే మంచిది కాదని ఆమెకు సలహా కూడా ఇచ్చారు. సదరు  ఎమ్మెల్యేలు కూడా ఘనత వహించిన వైసీపీ ఎమ్మెల్యేలే అని సమాచారం అందుతోంది. ఇన్ని రకాలుగా ఎటు తిప్పినా ఎర్రచందనం స్మగ్లర్ల ఇష్యూ వైసీపీకి చుట్టుకుంటూ వుండటం ఆ పార్టీ వర్గాలకు ఆందోళన కలిగిస్తోంది.

పార్లమెంటు ముట్టడి ఎందుకట?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం తన నిస్సహాయతను ప్రదర్శించింది. ఏ విషయంలో అయితే బీజేపీ రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం విషయంలో పట్టుబట్టిందో, ఇప్పుడు అదే బీజేపీ అదే విషయంలో వెనకడుగు వేసింది. ఇలా వెనకడుగు వేయడానికి అనేక కారణాలు వున్నాయి. రాజ్యాంగ పరమైన ఆ కారణాలన్నిటినీ అధిగమించే శక్తి లేకపోవడం వల్లే బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతోంది. మరి భవిష్యత్తులో తనకు అవకాశం లభిస్తే తన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుందేమో! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒత్తిడి పెంచితే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఇస్తుందేమో. పార్లమెంటులో అన్ని పార్టీల సహకారం లభిస్తే ఏపీకి ప్రత్యేక హోదా దక్కే ఛాన్సుందేమో. ఇలాంటి ఎన్నో మార్గాలు, అవకాశాలు వుండగా పార్లమెంటును ముట్టడిచేసే కాలం చెల్లిన ఐడియాతో ఢిల్లీకి వెళ్ళిన వాళ్ళని ఏమనాలి? కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వలేదంటూ ఏపీకి చెందిన కొంతమంది ఢిల్లీ బయల్దేరి వెళ్ళారు. అక్కడ నలుగురైదుగురు గుమిగూడి పార్లమెంటును ముట్టడి చేయడానికి వెళ్తున్నాం అని ప్రకటించి బయల్దేరారు. పోలీసులు సహజంగానే వాళ్ళని అరెస్టు చేసి, ఆ తర్వాత విడిచిపెట్టారు. సాయంత్రానికి పార్లమెంటును ముట్టడిస్తాం అని వెళ్ళినవారు ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు. పడుతూ లేస్తూ ఢిల్లీ వెళ్ళి వీళ్ళు సాధించిందేమిటి? ఫలానావాళ్ళు ఢిల్లీకి వెళ్ళి పార్లమెంటును ముట్టడించారన్న వార్త మీడియాలో రావడం. ఇంతకంటే వీళ్ళు సాధించిందేమీ లేదు. ఆ.. మరోటి సాధించారు.. వాళ్ళ పేర్లు మీడియాలో కనిపించాయి, వినిపించాయి. ఈ ప్రయోజనం అయితే దక్కింది.  ప్రస్తుతం ఏపీ చాలా సమస్యలలో వుంది. ప్రత్యేక హోదా రాకపోవడం కూడా ఒక సమస్యే. ఆ సమస్యను పరిష్కరించుకునే మార్గం మాత్రం ఇదికాదు. నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. కేంద్రాన్ని ఒక పద్ధతి ప్రకారం ఒప్పించే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు ఢిల్లీ వెళ్ళి పార్లమెంటును ముట్టడి చేస్తాం అంటూ హడావిడి చేస్తే దేశ రాజధానిలో పోయేది ఏపీ ప్రజల పరువే.

సల్మాన్ మీద సానుభూతి ఎందుకో?

తప్పతాగి కారు నడిపి ఒక వ్యక్తి మరణానికి, కొంతమంది గాయపడటానికి కారణమైన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కి కోర్టు ఐదేళ్ళ జైలుశిక్ష విధించింది. నేరం జరిగిన 13  సంవత్సరాల తర్వాత అయినా కోర్టు తీర్పు ఇచ్చినందుకు ధన్యవాదాలు. అయితే సల్మాన్‌కి శిక్ష పడిందని తెలియగానే చాలామంది సినీ, రాజకీయ ప్రముఖులు చాలా ఫీలైపోతూ ప్రకటనలు చేయడమే మన దేశంలోని దౌర్భాగ్యానికి సంకేతంగా నిలుస్తోంది. సల్మాన్ ఖాన్ వల్ల ఉపయోగం పొందినవాళ్ళో, ఆయన సన్నిహితులో సానుభూతి వ్యక్తం చేస్తే దాన్ని ఒక విధంగా అర్థం చేసుకోవచ్చు. అయితే చిరంజీవి లాంటి  వ్యక్తులు కూడా బోలెడంత ఫీలైపోతూ సల్మాన్‌కి అనుకూలంగా ప్రకటన చేయడం వెగటుగా వుంది. అసలు సల్మాన్‌ఖాన్‌ మీద సానుభూతి ఎందుకు వ్యక్తం చేయాలి? అతను తప్పతాగి యాక్సిడెంట్ చేశాడని కోర్టు నిర్ధారించింది. శిక్ష వేసింది. అంటే సల్మాన్ నేరం చేశారని అందరూ అంగీకరించి తీరాలి. కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ చాలామంది బాధ్యతాయుతమైన వ్యక్తులు కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా కామెంట్లు చేయడమేంటి? ఇంకొంతమంది వ్యవహారం చూస్తే నవ్వాలో ఏడ్వాలో అర్థంకాని పరిస్థితి. సల్మాన్ ఖాన్ ఎన్నో మంచి పనులు, దాన ధర్మాలు చేశాడు కాబట్టి ఆయన్ని వదిలేయాలట. సల్మాన్ ఖాన్ కోర్టులో కన్నీరు పెట్టుకుని శిక్షను తగ్గించాలని కోరుకున్నాడు కాబట్టి శిక్షను తగ్గించేసేయాలట. సల్మాన్ ప్రముఖ హీరో కాబట్టి, ఆయన ఐదేళ్ళు జైల్లో వుంటే సినిమా పరిశ్రమ 250 కోట్లు నష్టపోతుంది కాబట్టి ఆయనకు శిక్ష విధించకుండా వదిలేయాట... ఏంటీ మినహాయింపులు? సల్మాన్ సినిమా స్టారో, దాన కర్ణుడో కాబట్టి ఆయనకు శిక్ష విధించకుండా వదిలేయాలా? ఇలా మినహాయింపులు కోరేవారికి అసలు మానవత్వం అనేది వుందా?  ప్రముఖులు నేరాలు చేసినా వదిలేస్తూ వుండాలా? సల్మాన్ మీద అంత ప్రేమ, అభిమానం వున్నవాళ్ళు ఆయన జైల్లోకి వెళ్ళే సమయంలో గేటు దగ్గర వీడ్కోలు పలకండి. సల్మాన్ జైల్లోంచి విడుదలయ్యే సమయంలో మళ్ళీ వెళ్ళి స్వాగతం పలకండి. అంతేగానీ, సల్మాన్‌కి శిక్ష పడటం దారుణం అన్నట్టుగా మాట్లాడకండి. వినడానికే అసహ్యంగా వుంది.

కేజీ బేసీన్లో మన వాటా పొందాల్సిందే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసిన సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏ నాయకుడు అయితే విభజన బిల్లు  రాజ్యసభలో ఆమోదం పొందిన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పదేళ్ళపాటు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారో, అదే నాయకుడు ఇప్పుడు ఈ విషయాన్ని చాలా లైట్‌గా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారు. ప్రత్యేక హోదా విషయం విభజన బిల్లులో లేదు కాబట్టి తామేమీ చేయలేమని కూల్‌గా చెబుతున్నారు. ఏపీ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆయనే అలా మాట్లాడుతున్నప్పుడు ఏపీ ప్రజలు, నాయకులు ఇక ఆ విషయం గురించి దేబిరించాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ గుప్పిట్లో వున్న అంశాల నుంచి ఎలా ప్రయోజనాలు పొందాలో ఆలోచించాలి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎన్నో అన్యాయాలు జరిగాయి. ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో కూడా మరో అన్యాయం జరిగిందని అనుకుని, జరగబోయే దాని గురించి ఆలోచించాలి. ఏపీలోనే వున్న బంగారు బాతు కేజీ బేసిన్ నుంచి ఎలా ఆదాయం పొందాలో ప్రణాళికలు రూపొందించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో ముందడుగు వేసినందుకు అభినందనలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా గోదావరి బేసిన్ నుంచి కేంద్రం బోలెడంత సహజవాయువును తరలించుకుని వెళ్తోంది. ప్రతి ఏడాది కేజీ బేసిన్ ద్వారా లక్షల కోట్ల ఆదాయాన్ని పొందుతోంది. ఈ ఆదాయంలో ఆంధ్రప్రదేశ్‌కి వాటా ఎంతమాత్రం ఇవ్వడం లేదు. ఈ విషయంలో గతంలో నియమించిన కమిటీలు ఆంధ్రప్రదేశ్‌కి ఆదాయంలో వాటా ఇవ్వాలని చెప్పాయి. ఆయా కమిటీలు ఇచ్చిన రిపోర్టులు ఇంతవరకు ఆమోదాన్ని పొందలేదు. కేంద్ర ప్రభుత్వం వాటిని ఎప్పటి నుంచో పెండింగ్‌లో పెట్టింది. ఆ నివేదికలను ఆమోదించినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏడా 10 వేల కోట్ల రూపాయల  ఆదాయం లభించే అవకాశం వుంది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఆ నివేదికలను ఆమోదించి వెంటనే తమకు కేజీ బేసీన్‌ ఆదాయంలో వాటా ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసింది. కేంద్రం నుంచి దీనికి సానుకూల స్పందన రాకపోతే ఏపీ ఏ విధంగా మెలికలు పెట్టాలో ఆ విధంగా మెలికలు పెడితే సరిపోతుంది. ఏ రాష్ట్రం పరిధిలో వున్న వాటిమీద ఆ రాష్ట్రానికే హక్కులు వుంటాయని గౌరవనీయమైన కోర్టులు కూడా సెలవిస్తున్నాయి. మరి ఏపీ పరిధిలో వున్న కేజీ బేసిన్ ఆదాయం మీద ఏపీ హక్కులు పొందకపోతే కేంద్రం దృష్టిలో ఏపీ అంటే చులకన మరింత పెరిగిపోవడం ఖాయం.