టీ టీడీపీలో ఎవర్నీ నమ్మక్కర్లేదు

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు వరుసగా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. మొన్నటికి మొన్న కూకట్‌పల్లి శాసనసభ్యుడు మాధవరం కృష్ణారావు చంద్రబాబు నమ్మకాన్ని వమ్ము చేస్తూ కీలకమైన ఎమ్మెల్సీ ఎన్నికల ముందు టీఆర్ఎస్‌లోకి చేరిపోయారు. ఆయన  పార్టీ మారడం వల్ల తెలుగుదేశం పార్టీ ఒక ఎమ్మెల్యేని కోల్పోవడంతోపాటు గెలవాల్సిన ఎమ్మెల్సీ సీటును కూడా కోల్పోయింది. ఆయన పార్టీ మారడం కారణంగానే మరో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి లంచం ఇవ్వజూపిన కేసులో చిక్కుకోవలసి వచ్చింది. పదవులకు రాజీనామా చేయకుండానే పార్టీ మారడం, పార్టీ మారిన వాళ్ళను పదవుల్లోంచి తొలగించే విషయంలో స్పీకర్ ఎంతమాత్రం పట్టించుకోకుండా వుండటం... విషయం కోర్టు వరకూ వెళ్ళడం, కోర్టు హెచ్చరికలు జారీ చేయడం... ఇవన్నీ చూస్తుంటే ఇవి భవిష్యత్ తరాలకు కొత్త రాజకీయ పాఠాలు నేర్పుతాయని అనిపిస్తూ వుంటుంది. వెళ్ళినవాళ్ళు వెళ్ళిపోయారు. ఉన్నవాళ్ళు తెలంగాణ టీడీపీలోనే వున్నారు. ఇప్పుడు టీటీడీపీలో వున్న ఎమ్మెల్యేలందరూ చంద్రబాబు నాయుడితోనే తాము వుంటామని, ఆయన నాయకత్వంలోనే పనిచేస్తామని చెబుతూ వుంటారు. టీఆర్ఎస్ మీద నిప్పులు చిమ్ముతూ వుంటారు. అయితే ఇప్పటి వరకూ టీటీడీపిని విడిచిపెట్టి వెళ్ళినవాళ్ళందరూ గతంలో చంద్రబాబు నాయకత్వం మీద అపారమైన నమ్మకాన్ని వ్యక్తం చేసివారే. టీఆర్ఎస్ తమ పార్టీ ఎమ్మెల్యేలను అన్యాయంగా తమ పార్టీలోకి లాక్కుంటోందని మొత్తుకున్నవారే. చివరికి వారే పార్టీ మారిపోయారు. మరి ఇప్పుడు పార్టీలో వుండి, టీఆర్ఎస్‌ని విమర్శిస్తున్నవారు కూడా ఫ్యూచర్లో పార్టీ మారరన్న గ్యారెంటీ ఏమీ లేదు. ప్రస్తుతం తెలంగాణలో తెలుగుదేశం పార్టీని దెబ్బదీసే ఉద్యమం జరుగుతోంది. ఈరోజు టీఆర్‌ఎస్‌ని తీవ్రంగా విమర్శిస్తున్న వారు రేపు తెల్లవారేసరికి టీఆర్ఎస్ తీర్థం, ప్రసాదం పుచ్చుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఫలానా ఎమ్మెల్యే నైతిక విలువలు వున్న వ్యక్తి, అతను పార్టీకి ద్రోహం చేయడు అనుకోవాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. ఈ మానసిక స్థితికి ప్రజలు ఏనాడో వచ్చేశారు. ఈ స్థితికి రావల్సింది  పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే. ఆయన టీటీడీపీలో వున్న ఏ ఎమ్మెల్యేని నమ్మాల్సిన అవసరం లేని స్థితిని, ఫలానా ఎమ్మెల్యే పార్టీలోనే వుంటాడని భరోసాగా వుండాల్సిన పరిస్థితిని ఇప్పటి వరకు పార్టీని వీడిన ఎమ్మెల్యేలు తెచ్చారు.

రేవంత్ కేసు నిలబడుతుందా?

  తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వం పన్నిన పద్మవ్యూహంలో చిక్కుకుపోయి, అభిమన్యుడి పరిస్థితికి చేరుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు విచారణను ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి చర్లపల్లి కారాగారంలో వున్నారు. కొంతమంది ఈ కేసు విషయంలో ఏదేదో జరిగిపోతుందని భావిస్తున్నప్పటికీ, న్యాయ నిపుణులు మాత్రం ఈ కేసు న్యాయస్థానాల్లో నిలబడేంత బలంగా లేదని భావిస్తున్నారు. ఇది తెలంగాణ తెలుగుదేశం వర్గాలకు ఊరట ఇస్తోంది. లంచం ఇవ్వజూపడం నేరం అయినప్పుడు  అలా లంచం ఇవ్వడానికి ప్రయత్నించేలా ప్రేరేపించడం కూడా నేరమే అవుతుందని, ఈ కేసు న్యాయస్థానాల ముందుకు వస్తే పథకం ప్రకారం లంచం అడిగిన స్టీఫె‌న్ మీద కేసు ఎందుకు నమోదు చేయలేదన్న ప్రశ్న ఎదురయ్యే అవకాశం వుందని అంటున్నారు. అలాగే, అవినీతి అక్రమాలను బట్టబయలు చేసే ప్రయత్నమంటూ ఒక వ్యక్తిని ట్రాప్ చేసి ఆ వ్యవహారం మొత్తాన్నీ రహస్య కెమెరాలతో చిత్రీకరించడం (స్టింగ్ ఆపరేషన్) చట్ట సమ్మతమైన విధానం కాదగనం గతంలోనే సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇదే విధానంలో ఇరుక్కుపోయారు. మరి ఈ కేసు కోర్టు ముందు ఎంతవరకు నిలబడుతుందనేది సందేహమేనని న్యాయ నిపుణులు అంటున్నారు. రేవంత్ రెడ్డి ఈ కేసులో ఇరుక్కున్నప్పుడు కంపించిన తెలంగాణ తెలుగుదేశం వర్గాలు ఇప్పుడు న్యాయ నిపుణుల క్లారిఫికేషన్‌తో స్థిమితపడ్డాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ కేసును కోర్టు ముందుకు తీసుకువెళ్ళేలోపు పకడ్బందీ ఆధారాలతో సిద్దమవడానికి కసరత్తు చేస్తోంది.

చంద్రబాబు ఏడాది పాలన అభినందనీయం

నవ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతోంది. గత ఏడాది జూన్ 8వ తేదీన చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని, ఇప్పుడున్న పరిస్థితిని పోల్చి చూసకుంటే గణనీయమైన ప్రగతి కనిపిస్తోంది. అయోమయ స్థితి నుంచి అభ్యుదయం వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పయనించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేయగలిగారు. దారుణంగా మోసపోయి నిరాశ, నిస్పృహలతో వున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలలో కొత్త ఉత్సాహం, పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనే మానసిక స్థైర్యం పెరిగేలా చంద్రబాబు నాయుడు చేయగలిగారు. రాష్ట్ర విభజన తర్వాత విపత్కర స్థితిలో పడిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరికి అధికారం ఇస్తే తమకు న్యాయం జరుగుతుందో వారికే అధికారం ఇచ్చి తమ విజ్ఞతను ప్రదర్శించారు. ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం పనితీరు వారి నిర్ణయం సరైనదేనని నిరూపించింది. ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు ఏయే వాగ్దానాలు చేశారు, ఏయే వాగ్దాలనాలను నెరవేర్చారనే చిట్టా పద్దుల పుస్తకం పుస్తకం పట్టుకు తిరిగే పని ప్రతిపక్ష పార్టీ చేస్తోంది.అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే మెతుకు పట్టుకుని చూస్తే చాలనే చందాన ఏపీని అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళాలనే చంద్రబాబు చిత్తశుద్ధినే ప్రజలు గమనించారు... అర్థం చేసుకున్నారు... అభినందిస్తున్నారు.

వైసీపీది పైశాచికానందం

  ఒక మంచి పని చేయడానికి సంకల్పించినప్పుడు సాధారణంగా అడ్డంకులు ఎదురుకావు. ఒకవేళ ఎదురైనా అవి మబ్బుల్లా తొలగిపోతాయి. దీనికి తార్కాణంగా నిలిచే సందర్భం ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వచ్చింది. కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అక్కడి ప్రజలందరూ కొత్త రాజధాని నిర్మాణం కోసం ఎదురుచూస్తున్నారు. రాజధానికి భూ సమీకరణ ఎవరు ఎన్ని అడ్డుపుల్లలు వేసినా సాఫీగా జరిగింది. చిన్న చిన్న సమస్యలు వున్నా అవి క్రమంగా దారిలోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 6వ తేదీన రాజధాని నిర్మాణ పనులను భూమిపూజతో ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.  అలాగే వ్యవసాయ యూనివర్సిటీకి శంకుస్థాపన, 8వ తేదీన బహిరంగ సభ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు వున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.  ఈ సందర్భంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదన్న వార్తలు రావడంతో ఏపీ ప్రజలు నిరాశకు గురయ్యారు. శుభమా అని ఒక మంచి ముందడుగు వేస్తుంటే ఈ ఆటంకం ఏమిటా అని బాధపడ్డారు. అయితే ఆంధ్రప్రదేశ్ నాశనాన్ని కోరుకునే వైసీపీ మాత్రం ఈ సంగతి తెలుసుకుని ఎగిరి గంతేసింది. రాజధాని భూమిపూజ ఆగిపోతోందహో అని ఈ విషయాన్ని ఎంతో ఆనందంగా తన మీడియా ద్వారా ఊదరగొట్టేసింది. తన పైశాచికానందాన్ని ఆ రూపంలో ప్రదర్శించింది. అయితే మంచి పని వెంట భగవంతుడు ఎప్పుడూ వుంటాడు. ఏపీ రాజధాని భూమి పూజ విషయంలో ఎలక్షన్ కమిషన్ తన నిబంధనలను సడలించుకుంది. ఈ కార్యక్రమాలు గతంలో ఎప్పటినుంచో ప్లానింగ్‌లో ఉన్న కార్యక్రమాలు కావడం, ప్రభుత్వం ప్రచారం కోసం చేస్తున్న కార్యక్రమాలు కాకపోవడం, అలాగే ఏపీ ప్రజల మనోభావాలతో ముడిపడి వున్న అంశం కావడంతో ఈ కార్యక్రమాలకు అనుమతి మంజూరు చేసింది. దాంతో ఏపీ ప్రభుత్వంతోపాటు ప్రజలు కూడా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. దాంతో శనివారం నాడు ఒక మంచి కార్యక్రమం జరగనుంది. మరి ఈ విషయంలో ఇప్పటి వరకూ పండగ చేసుకున్న వైసీపీ నాయకులు ముఖం ఎక్కడ పెట్టుకుంటారో.

రేవంత్ ధైర్యం ఏమిటి?

  తెలంగాణ తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి అవినీతి నిరోధక శాఖ అదుపులోకి వెళ్ళడానికి దారితీసిన పరిస్థితుల గురించి అందరికీ తెలిసిందే. అయితే ఆయన అరెస్టు అయిన సమయంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశాలుగా మారాయి. పోలీసులు రేవంత్ రెడ్డి అరెస్టు చేసి కారులో ఎక్కిస్తున్న సమయంలో ఆయన మీసం మెలితిప్పుతూ కేసీఆర్ సంగతి తెలుస్తానని, ఆయన బట్టలు విప్పి రోడ్డు మీద కొట్టిస్తానని శపథం చేశారు. రేవంత్ రెడ్డి ఇంత ఆగ్రహంగా  స్పందించడం వెనుక వున్న ఆయన ధైర్యం ఏమిటన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్‌గా వున్న రేవంత్ రెడ్డి అంటే అధికార టీఆర్ఎస్‌కి కాస్తంత గుబులే. తన లాజిక్కులతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే రేవంత్ రెడ్డి అంటే కాస్తంత బెదురే. అందుకే ఆయన అసెంబ్లీలో మాట్లాడకుండా అధికార టీఆర్ఎస్ అనేక జాగ్రత్తలు తీసుకుంటూ వుంటుంది. కేసీఆర్ కన్ను తనమీద వుందని తెలిసి కూడా రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోవడం ఒక ఆశ్చర్యకరమైన అంశమైతే, అరెస్టు అయిన సమయంలో రేవంత్ రెడ్డి కేసీఆర్‌కి వ్యతిరేకంగా ధైర్యంగా కామెంట్ చేయడం మరో ఆశ్చర్యకరమైన విషయం. ఆరోజు రేవంత్ రెడ్డి ఏదో ఆవేశంలో అలా అన్నారా.. లేక కేసీఆర్‌కి సంబంధించిన గుట్టు ఏదైనా రేవంత్ రెడ్డి దగ్గర వుందా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

ఆ జంతువుల్లో వీళ్ళూ ఉన్నారేమో!

జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గత సంవత్సర కాలంగా జరిపిన పరిశోధనల్లో 176 కొత్త జంతువులను కనుగొన్నట్టు ప్రకటించింది. ఆ జంతువులలో చేపల జాతికి చెందిన 23 రకాలు,  రెండు రకాల పాములు, సాలీడు జాతికి చెందిన 12 రకాల జంతువులతో పాటు పలు ఇతర కొత్త తరహా జంతువులను గుర్తించినట్టు జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఈ సంస్థ గుర్తించిన కొత్త జంతువులలో కొంతమంది రాజకీయ నాయకులు కూడా వున్నారేమోనన్న సందేహాలు ఇప్పుడున్న రాజకీయాలను, రాజకీయ నాయకులను చూసి విసిగిపోయిన వారికి కలుగుతున్నాయి. నిరంకుశంగా పరిపాలించే రాజకీయ నాయకులు, అధికారం కోసం ఎంత దిగజారడానికైనా వెనుకాడని నాయకులు, అధికారంలోకి రావడం కోసం సమాజంలో విభేదాలను పెంచే నాయకులు, ఆస్తుల సంపాదన కోసమే రాజకీయాల్లోకి వచ్చి రాణిస్తున్న నాయకులు. ప్రజా ప్రతినిధులను ప్రలోభపెట్టి తమ పార్టీల్లోకి లాక్కునే రాజకీయ నాయకులు... ఇలాంటి నాయకులు కూడా సదరు కొత్త తరహా జంతువుల లిస్టులో వున్నారేమో.. పూర్తి లిస్టు బయటకి వస్తేగానీ తెలియదు.

జగన్ తీరుతో వైసీపీలో కలవరం

  వైసీపీ నాయకుడు జగన్మోహన్‌రెడ్డి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్‌కి మద్దతు ఇవ్వడం వైసీపీలో కలవరం రేపింది. ఇప్పటికే ఏపీలో అడ్డంగా ఆరిపోయి వున్న తమ పార్టీకి మరింత నష్టం కలిగించే విధంగా జగన్ తీసుకున్న నిర్ణయం వుందని పార్టీ నాయకులు పలువురు భావిస్తున్నారు. రోజురోజుకూ కొడిగడుతున్న వైసీపీ దీపాన్ని కొండెక్కకుండా ఆపడానికి  తాము తాపత్రయ పడుతుంటే, తమ నాయకుడు మాత్రం కొండెక్కుతున్న దీపాన్ని ఉఫ్ఫుమని ఆపేవిధంగా ప్రవర్తిస్తున్నారని పలువురు నాయకులు బాధపడుతున్నారు. కేసీఆర్‌ పార్టీకి  మద్దతు ఇవ్వడం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను తీవ్రంగా గాయపరచడమేనన్న విషయం తెలిసి కూడా జగన్ ఆ నిర్ణయం తీసుకోవడం ఎప్పటికీ దిద్దుకోలేని తప్పు అని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కేసీఆర్ అడ్డుకుంటున్నారన్న భావన ఏపీ ప్రజల్లో వుంది. ముఖ్యంగా ప్రత్యేక హోదాను కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకుంటోందని భావిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పార్టీకి జగన్ మద్దతు ఇవ్వడం కొరివితో తల గోక్కున్నట్టేనని వైసీపీ నాయకులు లబోదిబో అంటున్నారు. చంద్రబాబును అడ్డుకోవడానికే టీఆర్ఎస్‌కి మద్దతు ఇచ్చానని జగన్ ఎంతగా కవరింగ్ చేసుకునే ప్రయత్నాలు చేసినా అవి వర్కవుట్ అయ్యే అవకాశం కనిపించడం లేదని అంటున్నారు.  ఇంత జరిగాక తాము ఏముఖం పెట్టుకుని జనంలోకి వెళ్తామని వారు బాధపడుతున్నారు. జగన్ ఇలాంటి దారుణమైన నిర్ణయాలు తీసుకునేముందు పార్టీలోని నలుగురితో చర్చిస్తే బావుండేదని వారు అంటున్నారు. ఇప్పుడు చేజారిపోయిన పరిస్థితిని మళ్ళీ ఎలా చక్కదిద్దాల్రా దేవుడా అని తలలు పట్టుకుంటున్నారు.

క్రిమినల్స్ లిస్టులో వుండాల్సింది కాంగ్రెస్‌వాళ్ళే

కేంద్ర ప్రభుత్వం మీద ఏ రకంగా దాడి చేయాలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియడం లేదు. అందుకే ప్రధాని మోడీ మీద ఇష్టమొచ్చిన కామెంట్లు చేస్తూ దొరికిపోతున్నారు. మొన్నటికి మొన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏ అంశమూ దొరకనట్టు నరేంద్ర మోడీ వేసుకునే సూటు మీద పడ్డాడు. మోడీ సూటు ఫలానా అంత ఖరీదైనది... దేశంలో అనేకమంది ఒంటినిండా బట్ట లేక అల్లాడుతుంటే అంత ఖరీదైన సూటు వేసుకోవడం న్యాయమా అని దిక్కుమాలిన లాజిక్కు లాగుతూ మాట్లాడాడు. అయితే ఆయన  దేశంలో అనేకమంది ఒంటిమీద బట్ట లేకుండా అవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మరచిపోయినట్టున్నాడు. రాహుల్ గాంధీ చేస్తున్న విష ప్రచారాన్ని నరేంద్రమోడీ సమర్థంగా తిప్పికొట్టాడు. కాంగ్రెస్ నాయకులు అందుకున్న సూట్ కేసుల కంటే తన సూటే బెటరన్నట్టుగా కౌంటర్ ఇచ్చేసరికి కాంగ్రెస్ నాయకులు కిక్కురుమనకుండా ఊరుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు మరో విష ప్రచారం మొదలుపెట్టారు. గూగుల్‌లో టాప్ 10 క్రిమినల్స్ అని టైప్ చేస్తే నరేంద్రమోడీ ఫొటో కూడా కనిపిస్తోందట. అలా కాంగ్రెస్ పార్టీవాళ్ళే అరేంజ్ చేశారో... మరెవరు అరేంజ్ చేశారోగానీ, అలా కనిపించడం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు పండగొచ్చినట్టుగా వుంది. వెంటనే కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాంఛి రసికుడు అయిన దిగ్విజయ్ సింగ్ దీనిని ఒక పెద్ద ఇష్యూ చేసే బాధ్యతను తన భుజాన వేసుకుని ట్విట్టర్లో ప్రత్యక్షమయ్యాడు. ఇలా టాప్ 10 క్రిమినల్స్ అని టైప్ చేస్తే నరేంద్రమోడీ కనిపించడం అవమానమని, తాను సిగ్గుతో తల దించుకుంటున్నానని ఏవేవో వెటకారం కామెంట్లు పోస్టు చేశాడు. నిజానికి టాప్ టెన్ క్రిమినల్స్‌ లిస్టులో వుండాల్సింది నరేంద్రమోడీ కాదు.. ఇలాంటి చీప్ ప్రాపగాడా చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులే.

మళ్ళీ ఇండియాకి వస్తావా.. వద్దు తల్లోయ్..

ఇండియా నెత్తిన అనేక విదేశీ బండలు వున్నాయి. వాటిలో వివాదాస్పద రచయిత్రి తస్లిమా నస్రీన్ ఒకరు. బంగ్లాదేశ్‌కి చెందిన ఈ రచయిత్రి  వివాదాస్పదమైన తన రచనల కారణంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ముస్లిం తీవ్రవాదులు ఈమెను హత్య చేయడానికి ప్రయత్నాలు చేస్తూ వుండటంతో మన దేశానికి వచ్చి తలదాచుకున్నారు. ఇలాంటి ఉదారమైన పనులు చేయడంలో ఆరితేరిన మన ఇండియా నాయకులు ఆమెకు మన దేశంలో అధికార లాంఛనాలతో ఆశ్రయం కల్పించారు. దశాబ్దానికి పైగా ఆమె మన దేశంలో అతిథి సత్కారాలు అందుకుంటూనే వుంటున్నారు. ఆమెకి, మనదేశానికి ఎలాంటి సంబంధం లేకపోయినా, ఆమె వల్ల మన దేశానికి ఒరిగిందేమీ లేకపోయినా ఆమె అతిథి సత్కారాలు, గౌరవాలు అందుకుంటూనే వున్నారు. ఆమెకు ఆతిథ్యం ఇవ్వడం, భద్రత కల్పించడం తదితర ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి. ఆమె ఎక్కడికైనా వెళ్ళిందంటే అక్కడ ముస్లిం సంఘాలు ప్రత్యక్షమై ఆందోళన చేస్తూ వుంటాయి. ఆ సందర్భంలో ఆమెకు రక్షణ కల్పించడం స్థానిక పోలీసులకు తలనొప్పిగా మారుతోంది. ఈ నేపథ్యంలో తస్లిమా నస్రీన్ హఠాత్తుగా మాయమైపోయింది. ఈ మహాతల్లి ఎక్కడికి వెళ్ళిందా అని ఆరా తీస్తే, అమెరికాకి వెళ్ళిపోయినట్టు తెలిసింది. తనకు ఇండియాలో భద్రత లేదని ఆమెకి అర్థమైందట. అందుకే ఓ ఫైన్ మార్నింగ్ అమెరికాకి వెళ్ళిపోయిందట. ఆమెకు తన స్వదేశంలో భద్రత లేదు... అప్పనంగా అతిథి సత్కారాలు అందించిన ఇండియాలో భద్రత లేదు. ఇప్పుడు అమెరికాలో అయితే భద్రత లభిస్తుందని అక్కడకు వాలిపోయింది. సంతోషం.. ఆమె అక్కడే సెటిలైపోతే మనకి మరీ సంతోషం. ఖర్చులైనా తగ్గుతాయి. అయితే తస్లిమా నస్రీన్ మనకు ఆ సంతోషాన్ని కూడా మిగిల్చేట్టు లేరు. మళ్ళీ తాను ఎప్పటికైనా ఇండియాకి తిరిగి వచ్చేస్తానని ఆవిడగారు అమెరికా నుంచి సందేశం పంపించారు. ఇండియాలో వుంటే తనకు ప్రాణహాని వుండదని అనిపించినప్పుడు తాను తప్పకుండా ఇండియాకి వస్తానని ఆమె ఏదో మనల్ని ఉద్ధరిస్తున్నట్టు ప్రకటించారు. తాను ఎప్పుడు ఇండియాకి వచ్చినా ఇండియా తనకు భద్రత కల్పిస్తుందన్న నమ్మకం వుందని కూడా ఆమె చెప్పారు. అవును... మనకి ఇలాంటి వాళ్ళకి భద్రత కల్పించడం తప్ప మరో పని వుంటేగా... అందుకే తస్లీమా మేడమ్.. మీరు దయచేసి అమెరికాలోనే సెటిలవ్వండి.. లేకపోతే మీ బంగ్లాదేశ్‌కి వెళ్ళిపొండి. అంతేగానీ మా ఇండియాకి మాత్రం రాకండి. అసలు... రాకోయీ అనుకోని అతిథీ అనే పాట తస్లిమా నస్రీన్ లాంటివాళ్ళని ఉద్దేశించే రాసి వుంటారు.

తెదేపాలోకి కొణతాల రామకృష్ణ?

  సార్వత్రిక ఎన్నికల తరువాత వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో విభేదించి పార్టీ నుండి బయటకు వచ్చిన కొణతాల రామకృష్ణ నేటి వరకూ కూడా ఏ పార్టీలో చేరకుండా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన బీజేపీలో చేరే ప్రయత్నాలు చేస్తున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఆయన కాంగ్రెస్ లేదా తెదేపాలలో చేరే అవకాశం ఉందని వార్తలు వినిపించాయి. మళ్ళీ కొన్ని రోజుల క్రితం ఆయన తిరిగి వైకాపాలోకి చేరవచ్చునని, ఆయనకి విశాఖ నుండి యం.యల్సీ. సీటు కేటాయించే అవకాశాలున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆయన ఇంతవరకు ఏ పార్టీలో చేరలేదు.   ఆ సీటును త్వరలో వైకాపాలో చేరబోతున్న బొత్స సత్యనారాయణకి కేటాయించాలని వైకాపా భావిస్తునందున ఇక కొణతాల రామకృష్ణ వైకాపాలోకి తిరిగి వెళ్ళకపోవచ్చును. పైగా బొత్స సత్యనారాయణని విశాఖ జిల్లా పార్టీ-ఇన్-చార్జ్ గా నియమించాలని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి భావిస్తునందున ఒకవేళ కొణతాల మళ్ళీ చేరినా ఆయనకు ఆ పార్టీలో ఎటువంటి ప్రాధాన్యం ఉండబోదు.   దాడి వీరభద్రరావు నిష్క్రమణతో ఆయన స్థానంలో మరొక బలమయిన నాయకుడుని నియమించుకోవలసిన అవసరం తేదేపాకు ఏర్పడింది. కనుక అంతటి సమర్దుడయిన కొణతాల రామకృష్ణను పార్టీలోకి ఆహ్వానించి విశాఖలో ఉన్న రెండు యంయల్సీ. స్థానాలలో ఒకటి ఆయనకు కేటాయించాలని తెదేపా అధిష్టానం భావిస్తున్నట్లు తాజా సమాచారం. ఒకవేళ ఆయన ఇప్పటికిప్పుడు తెదేపాలో చేరకపోయినా, ఆయన విశాఖ నుండి యంయల్సీగా పోటీ చేస్తే ఆయనకు మద్దతు ఇవ్వాలని తెదేపా భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ కొణతాల రామకృష్ణను పార్టీలో చేర్చుకోవడాన్ని కొందరు జిల్లా నేతలు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. యంయల్సీ. ఎన్నికలకు నామినేషన్లు వేయడానికి జూన్ 16వ తేదీ వరకు గడువు ఉంది కనుక ఈలోగానే ఆయన తెదేపాలో చేరబోతున్నారా లేదా అనే విషయం తేలిపోవచ్చును.

ఒకవైపు వడదెబ్బ.. మరోవైపు కోర్టు దెబ్బ..

తెలంగాణ శాసనసభ స్పీకర్‌ మధుసూదనాచారికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన మంగళవారం నాడు అచ్చివచ్చినట్టు కనిపించడం లేదు. తెలంగాణ ఆవిర్భవించినందువల్లే తనకు శాసనసభ స్పీకర్ అయ్యే అవకాశం లభించిందన్న ఆనందంలో ఆయన వుండగానే ఆయనకు వరుసగా రెండు దెబ్బలు తగిలాయి. వాటిలో ఒకటి వడదెబ్బ, రెండోది హైకోర్టు దెబ్బ. వడ దెబ్బకు గురైన ఆయన నిమ్స్‌లో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. బుధవారం నాటికి ఆయన పూర్తి ఆరోగ్యం పొందే అవకాశం వుంది. మరి కోర్టు కొట్టిన దెబ్బ నుంచి ఆయన ఎలా కోలుకుంటారో చూడాలి. తెలుగుదేశం, కాంగ్రెస్, వైసీపీల నుంచి పలువురు శాసనసభ్యులు తమ పార్టీని ఫిరాయించి టీఆర్ఎస్‌లో చేరారు. చట్టప్రకారం వారి మీద అనర్హత వేటు విధించాలి. ఈ విషయంలో శాసనసభ స్పీకర్ ఎలాంటి స్పందన తెలియజేయడం లేదు. ఈ విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ అంశంలో హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. పార్టీ ఫిరాయించిన వారి విషయంలో ఇంతవరకు స్పీకర్ ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నించింది. ఈ విషయంలో అడ్వకేట్ జనరల్‌ని నిలదీసింది. స్పీకర్‌కి వారం రోజుల గడువు ఇస్తున్నామని, పార్టీ ఫిరాయింపుల మీద ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటారో ఆయన చెప్పాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. స్పీకర్ నిర్ణయం తీసుకోకుంటే కోర్టు నిర్ణయం తీసుకుంటుందని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది. మరి ఇప్పుడు మధుసూదనాచారి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ఇక కపటనల్లో నటించకండి...

ఇప్పుడు అనేక ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ వస్తున్న ప్రకటనల్ని ‘ప్రకటనలు’ అనడం కంటే, లేని విషయాన్ని ఉన్నట్టుగా చెప్పే కపటత్వం కలిగి వుంటున్నాయి కాబట్టి వాటిని ‘కపటనలు’ అనడం కరెక్టేమో. ఇలాంటి ప్రకటనల్లో నటించడానికి సినిమా నటీనటులు చాలా ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ వుంటారు. కారణం.. బోలెడంత డబ్బు వస్తుంది.. తాము జనం కళ్ళముందు కదులుతూ వుండొచ్చు... ఇలా అనేక లాభాపేక్షలు సినిమా తారలను ప్రకటనల్లో నటించడానికి ఉత్సాహాన్ని ఇస్తూ వుంటాయి. పలానా ఉత్పత్తిని వాడండని చెప్పే తారలు వ్యక్తిగతంగా ఆ ఉత్పత్తులను  ఉపయోగిస్తారా అంటే... పొరపాటున కూడా ఉపయోగించరు. చెప్పడానికే తప్ప  ఆచరణ ఎంతమాత్రం వుండదు. తాము ఉపయోగించడానికే ఇష్టపడని ఉత్పత్తులను జనం చేత కొనిపించడానికి తారలు ప్రేరేపిస్తూ వుంటారు. ఇప్పుడు అదే వారి పీకకు చుట్టుకుంటోంది. ఒక బహుళజాతి సంస్థ తయారు చేసే నూడిల్స్‌ని మీరు తినండి, మీ పిల్లల చేత తినిపించండి.. రెండు నిమిషాల్లో తయారైపోయే ఈ నూడిల్స్ మాంఛి టేస్టుగా వుండటంతోపాటు మీకు సమయాన్ని కూడా ఆదా చేస్తాయని చెప్పే ప్రకటనల్లో నటించిన పాపానికి, బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించిన పాపానికి బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, ప్రీతీ జింటా ఇప్పుడు కేసులను ఎదుర్కోవాల్సి వస్తోంది. విషతుల్యమైన పదార్ధాలు మోతాదు మించి వున్న సదరు నూడిల్స్‌లో ఉన్నప్పటికీ తినండంటూ జనాన్ని ప్రేరేపించిన పాపం ఇప్పుడు వారిని వేధిస్తోంది. వీరిని చట్టం ఎలా శిక్షించబోతోందో, లేక ప్రస్తుతానికి క్షమించి వదిలేస్తుందోగానీ, భవిష్యత్తులో ఇలాంటి ఉత్పత్తుల ప్రకటనల్లో నటించే తారలకు భారీ శిక్షలు వేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యావజ్జీవ కారాగార శిక్ష విధించే విధంగా చట్టం తెచ్చే ఆలోచనలో వున్నామని కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ చెబుతున్నారు. ఈ చట్టమే అమల్లోకి వస్తే దిక్కుమాలిన ఉత్పత్తులకు ప్రచారం చేసే తారలు ఇక జైల్లో కాలక్షేపం చేయాల్సి రావచ్చు. అంచేత తారలూ... అలాంటి ఉత్పత్తుల కపట ప్రకటనల్లో నటించడం మానుకోండి.

మాధవరం ద్రోహమే ఇంతా చేసింది...

తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై కొట్టి తెరాస తీర్థం పుచ్చుకున్న కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలంగాణ టీడీపీకి చేసిన ద్రోహమే ఆ పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. తన నియోజకవర్గంలో వున్న పేదల సంక్షేమం కోసమే పార్టీ మారుతున్నానని, చంద్రబాబు, లోకేష్ తనను క్షమించాలని మాధవరం కృష్ణారావు సెంటిమెంటల్‌ డైలాగ్స్ చెప్పినప్పటికీ, ఆయన చేసిన ద్రోహం ఆయనకు రాజకీయ బిక్ష పెట్టి, ఎమ్మెల్యేగా అందలం ఎక్కించిన తెలుగుదేశం పార్టీకే ఆయన వెన్నుపోటు పొడిచారని రాజకీయ పరిశీకులకు విశ్లేషిస్తున్నారు. సరిగ్గా ఎమ్మెల్సీ ఎన్నికల ముందే ఆయన పార్టీ మారడం తెలంగాణ తెలుగుదేశాన్ని ఇబ్బందుల్లోకి నట్టింది. అనేక పరిణామాలకు ఆయన పార్టీ మారడం కారణమైంది. ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ అభ్యర్థిని గెలిపించుకోవాలన్న పట్టుదలతో వున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీకి మాధవరం కృష్ణారావు పార్టీ మారడం పెద్ద షాక్ అయింది. ఆయన పార్టీలో వున్నట్టయితే తెలుగుదేశం అభ్యర్థి కూడా విజయం సాధించేవారు. ఆయన పార్టీ మారడంతో తెలుగుదేశం బలం తగ్గిపోయింది. అలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి చేయకూడని దుస్సాహసానికి ఒడిగట్టాల్సి వచ్చింది. దాని పరిణామాలు ఆయన ఏసీబీకి దొరికే పరిస్థితి వచ్చింది. పార్టీ మారిన మాధవరం కృష్ణారావు హ్యాపీగా వున్నారు. ఆయన చేసిన పనిని ఇప్పుడు ఎవరూ ప్రశ్నించడం లేదు. పార్టీ కోసం దుస్సాహసం చేసిన రేవంత్ రెడ్డే మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తోంది.

అయినా కేసీఆర్‌కి ఆనందం లేదు...

తెలంగాణ రాష్ట్రం సిద్ధించి సంవత్సరం గడిచింది. మంగళవారం నాడు తెలంగాణ ఆవిర్భావ వేడుకలను తెలంగాణ ప్రభుత్వం వైభవంగా నిర్వహించింది. అలాగే అంతకుముందు  రోజున తన రాజకీయ ప్రత్యర్థి, తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని విజయవంతంగా ‘ఆపరేషన్ రేవంత్’ ద్వారా ఇరికించేయడం జరిగింది. దాంతోపాటు ఎమ్మెల్సీ ఎన్నికలలో తాను నిలబెట్టిన ఐదుగురు అభ్యర్థులూ విజయం సాధించారు. ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంతోషాన్ని కలిగించే అంశాలు. అయితే ఇన్ని విజయాలు సాధించిన ఆయనకు కొన్ని అంశాలు పూర్తి స్థాయి ఆనందం కలగకుండా అడ్డుకుంటున్నాయి. శరీరమంతా ఆరోగ్యంగా వున్నప్పటికీ, కంట్లో వున్న చిన్న నలుసు ఎంతగా ఇబ్బంది పెడుతుందో, ఆ అంశాలు ఆయన్ని అలా ఇబ్బంది పెడుతున్నాయి. తెలంగాణ పోరాటంలో కేసీఆర్‌కి అండగా నిలిచిన తెలంగాణ ఉద్యోగులు గత కొంతకాలంగా కేసీఆర్‌కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మంగళవారం నాడు తెలంగాణ ఆవిర్భావ వేడుకలలో పాల్గొన్నప్పటికీ అక్కడ కూడా తమ వ్యతిరేక గళాన్ని వినిపించారు. తెలంగాణ వచ్చినప్పటికీ తమకు ఎంతమాత్రం సంతోషం కలగడం లేదని, ఆంధ్రా అధికారుల ఆధ్వర్యంలోనే పనిచేయాల్సి వస్తోందనేది వారి ఆవేదన. దానితోపాటు అనేక అంశాల మీద వారు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఉస్మానియా విద్యార్థులు ముఖ్యమంత్రికి పూర్తి వ్యతిరేకంగా వున్నారు. తెలంగాణ ఆవిర్భావం రోజున కూడా వాళ్ళు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించి అరెస్టయ్యారు. తమకు ఉద్యోగాలు ఇవ్వడం లేదన్న ఆగ్రహానికి తోడు ఉస్మానియా స్థలాల్లో పేదలకు ఇళ్ళు కట్టించే విషయంలో కేసీఆర్ ప్రదర్శిస్తున్న పట్టుదల కూడా వారి ఆగ్రహానికి కారణమయ్యింది. అలాగే తెలంగాణ పోరాటంలో కేసీఆర్‌కి అండగా నిలిచిన అనేకమంది కవులు, కళాకారులు, మేధావులు ఈ ప్రథమ ఆవిర్భావ దినోత్సవ నాటికి కేసీఆర్ వెంట లేకుండా పోయారు. అది కూడా కేసీఆర్‌కి పూర్తి స్థాయి ఆనందాన్ని కలగకుండా వుండటానికి ఒక కారణమైంది.

చంద్రబాబును ఇరికించే దమ్ముందా?

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరును ఇరికించడానికి వైసీపీ నాయకుడు జగన్ చేస్తున్న ప్రయత్నాలు నవ్వురాని కామెడీ ఎపిసోడ్‌ను తలపిస్తున్నాయని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. ఈ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పేరును కూడా చేర్చాలని జగన్ గవర్నర్ నరసింహన్‌ని కలసి వేడుకోవడం జగన్ రాజకీయ దుర్బుద్ధికి అద్దం పడుతోందని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. ఎలాంటి చిన్న అవకాశం దొరికినా తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించే జగన్ చేస్తున్న మరో విఫల యత్నమిదని తెలుగుదేశం వర్గాలు విమర్శిస్తున్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈ వ్యవహారంలో జగన్ చూపించిన అత్యుత్సాహాన్ని చూసి చిరాకుపడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్‌కి మద్దతు పలికిన జగన్ పేరు చెబితేనే ఏపీ ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పుడు కొత్తగా సంబంధం లేని వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు పేరును ఇరికించే ప్రయత్నాలు చేయడం ఏపీ ప్రజలకు జగన్ మీద ఆగ్రహాన్ని పెంచుతోంది. రేవంత్ రెడ్డి వ్యవహారంలో చంద్రబాబు పేరును ఇరికించే దమ్ము ఎవరికీ లేదని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. ఇందులోకి చంద్రబాబును ఇరికించే ప్రయత్నాలు చేసేవారు వాళ్ళే ఇరుక్కుపోతారని హెచ్చరిస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య స్నేహ సంబంధాలను కోరుకుంటున్న చంద్రబాబును టార్గెట్ చేయడం మంచి పరిణామం కాదని వారు అంటున్నారు.

జగన్ ఆరాటమంతా అందుకేనా?

  ఈరోజు ఉదయం 11 గంటలకు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలను వెంటబెట్టుకొని వెళ్లి గవర్నర్ నరసింహన్‌న్ని కలవబోతున్నారు. తెలంగాణా శాసనమండలి ఎన్నికలలో తెదేపా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యేను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించినందుకు తెదేపాపై పిర్యాదు చేయడానికి గవర్నర్ ని కలవబోతున్నారు. కానీ ఈ సంఘటన జరిగి ఇప్పటికి మూడు రోజులయింది. ఎసిబి అధికారులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడం, ఆయనకి కోర్టు రెండు వారాలు జ్యూడిషియల్ రిమాండ్ విధించడం, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఇరువురూ కూడా గవర్నర్ ని కలిసి ఈ వ్యవహారం గురించి మాట్లాడటం అన్నీ జరిగిన తరువాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నర్ కి మళ్ళీ కొత్తగా పిర్యాదు చేయడం దేనికంటే బహుశః తెదేపాను అప్రదిష్టపాలు చేసే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదనే ఆరాటంతోనేనని చెప్పవచ్చును. తెలంగాణాలో జరిగిన ఈ వ్యవహారం గురించి ఆయన అంత ఆసక్తి చూపడమే అందుకు నిదర్శనం. రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్ర పోరాటాలు చేసిన వైకాపా నిన్న జరిగిన తెలంగాణా మండలి ఎన్నికలలో తెరాసకు మద్దతు ఇవ్వడం గమనిస్తే ఆ పార్టీ ద్వంద విధానాలు కళ్ళకు కట్టినట్లు కనబడుతాయి. ప్రతీ అంశాన్ని తన రాజకీయ లబ్ది కోసమే మలుచుకొనే ప్రయత్నాలు చేస్తున్న వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఈ అంశాన్ని కూడా అందిపుచ్చుకోవాలనే ఆరాటంతోనే గవర్నర్ ని కలుస్తున్నట్లుంది తప్ప మరే కారణం కనబడటం లేదు.

స్ఫూర్తిదాయకంగా ఏపీ నవనిర్మాణ దీక్ష

  ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం నాడు నవనిర్మాణ దీక్షను స్ఫూర్తిదాయకంగా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నవనిర్మాణ దీక్షను విజయవాడలో నిర్వహిస్తు్న్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో కూడా నవ నిర్మాణ దీక్షకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికోసం సచివాలయంలో సాధారణ పరిపాలనా శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. సచివాలయ ఉద్యోగులు ఈ దీక్షలో పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ నిర్వహించుకున్న ఈ నవ నిర్మాణ దీక్ష రాష్ట్ర ప్రజలకు, నాయకులకు ఒక స్ఫూర్తిని ఇచ్చే విధంగా వుండాలన్న ఆకాంక్ష వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఉద్దేశంతోనే నవనిర్మాణ దీక్షకు రూపకల్పన చేశారు. ప్రస్తుతం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులకు ఎదుర్కొంటున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఆశలు ఎంతో ఆశాజనకంగా వున్నాయి. ఎన్నో లక్ష్యాలు రాష్ట్రం ముందు వున్నాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఆ లక్ష్యాలను చేరుకుంటున్నందన్న నమ్మకం అందరిలోనూ వుంది. ప్రజల నుంచి మాత్రమే కాకుండా ప్రతిపక్షం నుంచి కూడా ప్రభుత్వానికి సహకారం అందినట్లయితే ఆంధ్రప్రదేశ్ నవ నిర్మాణం అత్యంత ప్రశంసనీయంగా జరిగే అవకాశం వుంది. అయితే ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్షంగా వున్న వైసీపీ నుంచి అలాంటి సహకారాన్ని ఆశించడం దురాశే అవుతుంది. అయితే పరిస్థితులు ఎలా వున్నా, ఎన్ని అవరోధాలు ఎదురైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రజలు కలసికట్టుగా ఆంధ్రప్రదేశ్‌ని కొత్తగా నిర్మించుకోవాల్సిన అవసరం వుంది. ఆ అవసరాన్ని మరోసారి గుర్తు చేయడంతోపాటు, ఇప్పటికే వున్న స్ఫూర్తికి మరింత ఉద్దీపన కలిగించే విధంగా ఈ నవ నిర్మాణ దీక్ష వుంటుందని భావించవచ్చు.

తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు భారీ ఏర్పాట్లు

  తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సంవత్సరం గడచిన సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. వస్తుందా రాదా అని ఊరించిన తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంతోపాటు, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ సందర్భాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం ద్వారా టీఆర్ఎస్ తన విజయోత్సాహాన్ని చాటబోతోంది. ఈ సంవత్సర కాలంలో ఏ విషయంలోనూ వెనక్కి తగ్గకుండా ప్రభుత్వాన్ని నడిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఆవిర్భావ వేడుకలను అత్యంత భారీగా నిర్వహించడం ద్వారా యావత్ దేశాన్ని ఆకర్షించే లక్ష్యంతో వున్నారు. హైదరాబాద్‌లో మాత్రమే కాకుండా దేశ రాజధానిలో కూడా తెలంగాణ ఆవిర్భావ వేడుకలను నిర్వహించడానికి ఏర్పాట్లు జరిగాయి. హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌లో భారీగా ఆవిర్భావ వేడుకలు జరపబోతున్నారు. అలాగే హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఆవిర్భావ వేడుకలను వైభవోపేతంగా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మామూలుగానే ఆవిర్భావ వేడుకలను అట్టహాసంగా నిర్వహించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం సంకల్పించింది. దీనికితోడు సోమవారం నాడు వెలువడిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలలో టీఆర్ఎస్ తాను కోరుకున్నట్టుగానే ఐదు స్థానాలను గెలుచుకోవడంతో పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. ఈ ఉత్సాహం కూడా ఈ వేడుకలలో ప్రతిఫలించే అవకాశం వుంది. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే ప్రధాన వేడుకలను అత్యంత భారీగా నిర్వహించనున్నారు. పలువురు కళాకారులు ఇప్పటికే రిహార్సల్స్‌ పూర్తి చేసుకుని తమ ఉత్సాహాన్ని మంగళవారం నాడు ప్రదర్శించబోతున్నారు. ఇక ధూంధాంలు వుండనే వుంటాయి. ఈ సందర్భంగా ప్రదర్శన కోసం పలు శకటాలను కూడా సిద్ధం చేశారు. రిపబ్లిక్ డే ఏ రకంగా జరుగుతుందో ఆ స్థాయిలో తెలంగాణ ఆవిర్భవ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు.

ఎమ్మెల్యేలా? కోడి పిల్లలా?

ఎమ్మెల్యేలను చూస్తుంటే గౌరవాభిమానాలు పోయి చాలాకాలం అయింది. మొన్నామధ్య వరకు వారిని చూస్తుంటే మనుషులను చూసినట్టయినా వుండేది, అయితే ప్రస్తుతం రాజకీయ పోరాటంలో, ఆధిపత్య పోరాటంలో భాగంగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఎమ్మెల్యేలు వెన్నెముక ఉన్న మనుషులా... లేక కోడిపిల్లలా అనే సందేహం కలుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా, అంతకుముందు పలు పార్టీలు అధికార పార్టీ నుంచి తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను చూస్తుంటే గద్దల బారి నుంచి తన పిల్లలను కాపాడుకోవడానికి తంటాలు పడే కోడి గుర్తుకు వస్తోంది. ఎమ్మెల్యేలు కోడి పిల్లల మాదిరిగా అనిపిస్తున్నారు. కోడి ఎన్ని తంటాలు పడినా అప్పుడప్పుడు కొన్ని కోడి పిల్లలు గద్ద బారిన పడినట్టే ఎమ్మెల్యేలు కూడా హాంఫట్ అయిపోతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష పార్టీలో తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి పడుతున్న తంటాలను చూస్తుంటే నవ్వొస్తోంది. ఎన్నికలకు ముందు రోజు నుంచి తమ ఎమ్మెల్యేలందరితో క్యాంప్ ఏర్పాటు చేసుకోవడం, ఒక్క ఎమ్మెల్యే కూడా గూడులోంచి బయటపడకుండా జాగ్రత్తలు తీసుకోవడం. అందరూ  ఒకేచోట వుండేలా చూసుకోవడం. అందరూ కలసి ఒకేసారి వచ్చి ఓటుహక్కు వినియోగించుకోవడం... అభద్రతాభావంతో కూడిన ఈ చర్యలన్నీ చూస్తుంటే ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎలాంటి దుస్థితి వచ్చిందిరా భగవంతుడా అని బాధపడాల్సి వస్తోంది. మరి మనం మళ్ళీ మన ఎమ్మెలను కోడి పిల్లల్లా కాకుండా వెన్నెముక వున్న మనుషుల్లా ఎప్పటికైనా చూడగలుగుతామో... లేదో!