వరంగల్ సీటు బీజేపీకే?

  కడియం శ్రీహరి ఖాళీ చేసిన వరంగల్ యంపీ స్థానానికి త్వరలోనే ఉపఎన్నికలు జరగడం తద్యం కనుక రాజకీయ పార్టీలన్నీ అప్పుడే హడావుడి పడిపోతున్నాయి. అందరికంటే ముందు ప్రయత్నాలు మొదలుపెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఆదిలోనే అపశకునం ఎదురయింది. ఆ స్థానం నుండి మాజీ యంపీ జి.వివేక్ ను పోటీచేయమని కోరితే అందుకు ఆయన నిరాకరించడంతో గత ఎన్నికలలో ఓడిపోయిన రాజయ్యనే ఆ స్థానం నుండి పోటీచేయించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం.   ఇక తెరాస అధికారంలో ఉంది కనుక సహజంగానే దానికి విజయావకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. కనుక అభ్యర్ధులు కూడా చాలా మందే ఉంటారు. ప్రస్తుత పరిస్థితులలో వరంగల్ నుండి తెదేపా పోటీ చేయడం కంటే బీజేపీ పోటీ చేయడమే తెదేపా-బీజేపీలకు అన్నివిధాల మంచిది. పంతానికి పోయి పోటీ చేసి, ఒకవేళ తెరాస అభ్యర్ధి చేతిలో ఓడిపోయినట్లయితే, తెలంగాణాలో తెదేపాకి అది చావుదెబ్బ క్రింద పరిణమించే ప్రమాదం ఉంది. కనుక ఈ ఉపఎన్నికలలో తెదేపా పోటీ చేయకపోవడమే మంచిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కనుక తెదేపా వెనక్కి తగ్గి బీజేపీకి అవకాశం ఈయవచ్చును.   బీజేపీ అభ్యర్ధికి మద్దతు ఇచ్చి తెరాస అభ్యర్ధిని ఓడించగలిగినట్లయితే, తెరాస మీద ప్రతీకారం తీర్చుకొన్నట్లవుతుంది కూడా. గత ఏడాది కాలంగా రాష్ర్ట బీజేపీ నేతలు తెరాస ప్రభుత్వంతో యుద్ధం చేస్తున్నారు. అదే విధంగా మోడీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకొన్న తరువాత కూడా జాతీయ స్థాయిలో మంచి మార్కులే సంపాదించుకోగలిగింది. కనుక తెలంగాణా ప్రజలపై కూడా మోడీ ప్రభావం బాగానే ఉంటుందని భావించవచ్చును. కనుక వరంగల్ నుండి బీజేపీ పోటీ చేసి తన సత్తా చాటుకొనేందుకు ఉత్సాహం చూపవచ్చును. ఒకవేళ బీజేపీ అభ్యర్ధిని రంగంలో దింపినట్లయితే, తెరాస కేంద్రంతో సఖ్యత కోరుకొంటున్న కారణంగా పేరుకి ఒక డమ్మీ అభ్యర్ధిని నిలబెట్టి, బీజేపీ అభ్యర్ధి విజయానికి పరోక్షంగా సహకరించవచ్చును. లేదా ఒకవేళ ఓటుకు నోటు కేసులో కేంద్ర ప్రభుత్వం తమపై ఒత్తిడి తెచ్చినట్లయితే, బలమయిన అభ్యర్ధిని నిలబెట్టి తెదేపా-బీజేపీలను ఓడించి వాటి మీద ప్రతీకారం తీర్చుకొనే ప్రయత్నం చేసినా ఆశ్చర్యం లేదు.   ఇంకా ఉపఎన్నికకు షెడ్యూల్ కూడా విడుదల కాలేదు. కనుక ఈలోగా మారే రాజకీయ పరిస్థితులను బట్టి పార్టీల వ్యూహాలు, ఆలోచనలు కూడా మారవచ్చును.

మొట్టి కాయలు పడుతున్నా ఎందుకో ఆ దూకుడు?

  ఈరోజు తెలంగాణా ప్రభుత్వానికి హైకోర్టులో మళ్ళీ మరో ఎదురు దెబ్బ తగిలింది. జెన్‌కో ట్రాన్ప్‌కోలో పనిచేస్తున్న (ఆంద్రప్రదేశ్) స్థానికత ఉన్న1100 మంది ఉద్యోగులను అకస్మాత్తుగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పగిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుని నిలిపివేసింది. ఇది తెలంగాణా ప్రభుత్వానికి తల ఒంపులు తెచ్చే ఆదేశాలేనని చెప్పవచ్చును. అయితే తెలంగాణా ప్రభుత్వం ఇంత హడావుడిగా ఎందుకు అటువంటి జీ.ఓ జారీ చేసిందని ఆలోచిస్తే అందుకు కనబడుతున్న కారణం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.   ఇటీవల రెండు రాష్ర్ట ప్రభుత్వాల మధ్య యుద్ధం తీవ్రతరమయిన తరువాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడటంతో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి హైదరాబాద్ లో తన నివాసం వద్ద పనిచేస్తున్న తెలంగాణాకు చెందిన పోలీస్ సిబ్బందిని తప్పించి వారి స్థానంలో ఆంధ్రాకు చెందిన పోలీసులను నియమించుకోవడం తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అవమానకరంగా భావించడమే అందుకు కారణంగా కనిపిస్తోంది. అయితే తెలంగాణా ప్రభుత్వం తనపై కూడా నిఘాపెడుతోందనే అనుమానం కలిగినందునే చంద్రబాబు నాయుడు ఆ నిర్ణయం తీసుకొన్నట్లు అర్ధమవుతోంది.   కానీ ఏకంగా 1100 మంది ఉద్యోగులను బలమయిన ఏ కారణం చూపకుండా వారి బాధ్యతల నుండి తప్పించడం, అది కూడా కేవలం వారి స్థానికత ఆధారంగా చేయడం, పొరుగు రాష్ట్రానికి అప్పజెప్పాలనుకోవడం అన్నీ కూడా ఆహేతుకంగానే ఉన్నాయని ఎవరికయినా అర్ధం అవుతుంది. కానీ ఇవేవీ గమనించకుండా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన పనికి అంతే దీటుగా బడులివ్వాలనుకొన్నారో ఏమో గానీ చాలా హడావుడిగా ఒక జీ.ఓ. ఒకటి జారీ చేసారు. కానీ కేసీఆర్ ఒకటనుకొంటే జరిగింది మరొకటి. ఆ ఉద్యోగులు అందరూ రాష్ర్ట ప్రభుత్వం జారీ చేసిన ఆ జీ.ఓ.ను కోర్టులో సవాలు చేయడంతో దానిని నిలిపివేస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.   సుదీర్ఘ కాలంగా ఒక ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులను అవసరమయితే వేరే జిల్లాకో, విభాగానికో బదిలీ చేయడం సహజమే, కానీ వారిని స్థానికత ఆధారంగా వేరే రాష్ట్రానికి అప్పజెప్పడం సాధ్యం కాదనే చిన్న విషయం తెలంగాణా ప్రభుత్వానికి తెలియకపోవడం చాలా ఆశ్చర్యకరమే!   ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదో దూకుడు మీద అనాలోచితంగా నిర్ణయాలు తీసుకొంటుంటే మరి సంబంధిత మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారులు, న్యాయ సలహాదారులు ఏమి చేస్తున్నారో...ఆయనకు సరయిన సలహా ఎందుకు ఇవ్వలేకపోతున్నారో...లేకపోతే ఆయనే వారిని సంప్రదించడం లేదో...ఏమో తెలియదు కానీ ఆయన ప్రదర్శిస్తున్న ఈ దూకుడు వలన తెలంగాణా ప్రభుత్వం తరచూ కోర్టులో మొట్టికాయలు వేయించుకోకతప్పడం లేదు. ఒక్క ఏడాదిలోనే ఇటువంటి సంఘటనలు కనీసం ఐదారు జరిగి ఉంటాయి. అయినా ఆచితూచి నిర్ణయాలు తీసుకోకుండా ఈవిధంగా దూకుడు ప్రదర్శించడం చాలా ఆశ్చర్యకరంగానే ఉంది!

గుమ్మడికాయల దొంగ అంటే...

    పద్దెనిమిది మంది భారతసైనికులను పొట్టన పెట్టుకొన్న నాగా ఉగ్రవాదులు పొరుగు దేశమయిన మయన్మార్ అడవులలో తలదాచుకొన్నట్లు తెలియగానే భారత ప్రభుత్వం తన ఆర్మీ కమెండోలను పంపించి భారత సరిహద్దుకి అవతల దాగి ఉన్నవారినందరినీ మట్టు బెట్టించి ప్రతీకారం తీర్చుకొంది. ఇంత కాలంగా ఉగ్రవాదులు భారత్ పై దాడులు చేస్తున్నా, సరిహద్దుల వద్ద పాక్ సైనికులు మన సైనికుల తలలు నరికి తీసుకుపోతున్నా ఇంతవరకు అధికారంలో ఉన్న యూపీయే ప్రభుత్వం కేవలం వాటిని ఖండించడమే తప్ప ఏనాడు ఈవిధంగా ప్రతిచర్యలు చేప్పట్టలేదు. కానీ ప్రధాని మోడీ అనుమతించడంతో భారత కమెండోలు తమ సహచరులను పొట్టనపెట్టుకొన్న ఉగ్రవాదులను వేటాడి మట్టుబెట్టారు. అందుకు భారతీయులు అందరూ చాలా సంతోషిస్తున్నారు.   మయన్మార్ దేశంలో జరిపిన ఈ సైనిక చర్య గురించి రక్షణ శాఖా మంత్రి మనోహర్ పారికర్ మీడియాకు క్లుప్తంగా వివరిస్తూ “ఇది మనపై దాడులు చేయాలని చూస్తున్న పొరుగుదేశాలకు ఒక హెచ్చరిక వంటిది. ప్రభుత్వ ఆలోచనా విధానంలో కలిగిన మార్పు ప్రకారం భారత సైనికులు కూడా అందుకు అనుగుణంగా వ్యవహరించారు. కనుక భారత్ పై దాడులు చేద్దామని ఆలోచిస్తున్న పొరుగు దేశం ఈ మార్పును గుర్తిస్తుందని ఆశిస్తున్నాము,” అని అన్నారు.   ఆ మాటలు పాకిస్తాన్ ఉద్దేశ్యించి చేసిన హెచ్చరికలేనని వేరేగా చెప్పనవసరం లేదు. అందుకే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నట్లుగా పాకిస్తాన్ మాత్రమే స్పందించింది. “అటువంటి పనులు మయన్మార్ చేయవచ్చునేమో కానీ పాక్ భూభాగంలో సాధ్యం కాదని భారత్ గుర్తిస్తే మంచిది,” అని పాక్ ఘాటుగా బదులిచ్చింది.   దానికి మళ్ళీ మనోహర్ పారికర్ “మయన్మార్ లో జరిగిన సైనిక చర్యను చూసి ఉలిక్కిపడి భయపడినవారే స్పందించారు” అని పాకిస్తాన్ ప్రభుత్వానికి చిన్న చురక వేసారు.   పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తన మంత్రివర్గాన్ని సమావేశపరిచి “భారత్ చేస్తున్న ప్రకటనలు చాలా కవ్వించేవిగా ఉన్నాయి. దాని వలన ఇరుదేశాల మధ్య శాంతి ప్రక్రియకు భంగం కలుగుతోంది. భారతదేశంతో సహా అన్ని ఇరుగుపొరుగు దేశాలతో పాక్ చక్కటి స్నేహ సంబంధాలే కోరుకొంటోంది. కానీ భారత్ పెద్దన్న పాత్ర పోషిస్తూ మామీద కర్రపెత్తనం చేయాలని ప్రయత్నిస్తోంది. పాక్ సార్వభౌమత్వాన్ని భారత్ సవాలు చేస్తే సహించబోము,” అని ఒక తీర్మానం చేసి ఆమోదించుకొన్నారు. అది పాక్ ప్రజలకు, అంతర్జాతీయ సమాజానికి చెప్పుకోవడానికి ఉపయోగపడవచ్చునేమోగానీ, భారత్ దానిని పరిగణనలోకి తీసుకోదని వారికీ తెలుసు. ఎందుకంటే నవాజ్ షరీఫ్ ఈ శాంతి సందేశం మీడియా ముందు చదువుతున్న సమయంలోనే జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల వద్ద పాక్ సేనలు భారత సైనికులపై కాల్పులు జరుపుతున్నాయి.   ఇప్పుడు భారత ప్రభుత్వ ఆలోచనా విధానం మారింది కనుక ఇదివరకులా భారత్ చేతులు ముడుచుకొని కూర్చోదని, పాక్ చేసే ప్రతీ చర్యకి భారత్ నుండి ప్రతిచర్య తప్పనిసరిగా ఎదుర్కోవలసి ఉంటుందని రక్షణమంత్రి మనోహర్ పారికర్ ప్రకటించడం తప్పు కాదు. ఎవరిపైనా కర్ర పెత్తనం చేయాలనే ఉద్దేశ్యంతో చేసినదీ కాదు. పాక్ భూభాగంలో భారత్ సేనలు ప్రవేశిస్తే ఎదుర్కొంటామని ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ఏవిధంగా చెప్పారో అదేవిదంగా భారతదేశంలో ప్రవేశించి అల్లకల్లోలం సృష్టించాలని చూసే ఉగ్రవాదుల పట్ల తాము చాలా కటినంగా వ్యవహరిస్తామని మనోహర్ పారికర్ కూడా చెప్పారు. అందుకు పాక్ ఆ విధంగా ప్రతిస్పందించడం ఊహించదగ్గదే.   కానీ ‘అత్త కొట్టినందుకు కాదు ఏడ్చింది తోడి కోడలు నవ్వినందుకే ఏడ్చానన్నట్లు’ పారికర్ మాటలకి పాకిస్తాన్ తో బాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఉలిక్కిపదినది. దేశంపై ఉగ్రవాదులు, పాక్ సైనికులు దాడులు చేస్తున్నా యూపీయే ప్రభుత్వం చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చొందని, తమదొక చేతకాని అసమర్ధ ప్రభుత్వమని, దేశభద్రత విషయంలో కూడా రాజీపడిందని, మనోహర్ పారికర్ దేశ ప్రజలకు చెపుతున్నట్లుగా ఆ పార్టీ అర్ధం చేసుకొని ఆయనపై తీవ్రంగా విరుచుకుపడింది.   కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ మీడియాతో మాట్లాడుతూ, “రక్షణమంత్రి పారికర్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడటం అలవాటు చేసుకొంటే మంచిది. ఆయనతో సహా మరికొందరు మంత్రులు, అధికారులు తామేదో గొప్ప ఘనకార్యం చేసినట్లు దీని గురించి చాలా గొప్పలు చెప్పుకొంటున్నారు. అటువంటి వారందరికీ ప్రధాని మోడీ అదుపు చేస్తే బాగుంటుంది. నేపాల్ దేశంలో భూకంపం వచ్చినప్పుడు, ఇటువంటి గొప్పలకు పోవడం వలననే ఆ దేశానికి సహాయపడటానికి వెళ్ళినపుడు భారత్ కు చేదు అనుభవం ఎదురయిందని గుర్తుంచుకొంటే ఈవిధంగా మాట్లాడరు,” అని ఘాటుగా విమర్శించారు.   దట్టమయిన మయన్మార్ అడవులలో ప్రవేశించి భారత సైనికులు ప్రదర్శించిన ఆ అపూర్వ సాహాసాన్ని భారత ప్రజలు అందరూ ప్రశంసిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం విమర్శిస్తోంది. ప్రభుత్వాన్ని మెచ్చుకాకపోయినా కనీసం ఆ వీర సైనికులను మెచ్చుకొన్నా వారు సంతోషించేవారు. కానీ ఆవిధంగా చేస్తే తన అసమర్ధతను తనే స్వయంగా ఒప్పుకొన్నట్లవుతుందని, ఇప్పటికే ఈ చర్యతో మోడీ గురించి ప్రపంచ దేశాలు కూడా మాట్లాడుకొంటుంటే, తాము కూడా ఆయన గొప్పదనాన్ని అంగీకరించినట్లవుతుందని కాంగ్రెస్ పార్టీ భావించిందే తప్ప ఒక్క చిన్న అభినందనతో భారత సైనికుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించవచ్చని ఆలోచించలేదు.   బిన్ లాడెన్ పాకిస్తాన్ భూభాగంలో తలదాచుకొన్నాడని పసిగట్టిన అమెరికా, తన కమెండోలని పంపించి అతనిని మట్టుబెట్టినప్పుడు యావత్ ప్రపంచ దేశాలు దాని గురించి ఎంతో గొప్పగా కధలుకధలుగా వర్ణించి చెప్పుకొన్నాయి. అమెరికా దేశంలో ప్రతీ పౌరుడు కూడా తమ దేశంపై దాడి చేసి వేలాది ప్రజలను పొట్టనబెట్టుకొన్న ఆ ఉగ్రవాదిని స్వయంగా తన చేతులతో చంపినంతగా ఆనందపడ్డాడు. అమెరికాలో అధికార, ప్రతిపక్షాలన్నీ పండగ చేసుకొన్నాయి.   కానీ భారత సైనికులను పొట్టనబెట్టుకొన్న నాగా ఉగ్రవాదులను భారత కమెండోలు వెంటాడి మట్టుబెడితే కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది! తనకు చేతకాని పనిని మోడీ ప్రభుత్వం చేసి చూపుతోందనే అసూయే అందుకు కారణమని అర్ధమవుతోంది. అయితే పార్టీ రాజకీయ ప్రయోజనాలు, వ్యూహాలు, ప్రభుత్వాలను పాలించే వ్యక్తుల కీర్తి ప్రతిష్టలన్నిటి కంటే కూడా దేశ ప్రయోజనాలు, దేశ సార్వభౌమత్వమే మిన్న దానికే అందరూ ప్రాధాన్యం ఇవ్వాలి. అందులో భిన్నాభిప్రాయలకి తావు లేదు, ఉండకూడదని ఇంతకాలంగా దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ అంగీకరించకపోవడమే చాలా విచిత్రం. చాలా దురదృష్టకరం.

త్వరలో గవర్నర్ మార్పు..నరసింహన్ తెలంగాణాకే పరిమితం?

  రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరిస్తున్న నరసింహన్ తెలంగాణా ప్రభుత్వం వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారని ఆంద్రప్రదేశ్ మంత్రులలో చాలా మంది అభిప్రాయపడుతున్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన అనేక వినతి పత్రాలపై ఆయన ఎటువంటి చర్య చేప్పట్టకపోవడమే కాకుండా తెలంగాణా ప్రభుత్వానికి కొంత అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కొందరు మంత్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెదేపాకు చెందిన యంయల్యేలను ముఖ్యమంత్రి తెరాసలోకి ఆకర్షించి వారిలో తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటివారికి మంత్రి పదవులు కట్టబెడుతుంటే, అటువంటి రాజ్యాంగ విరుద్దమయిన చర్యలను గవర్నర్ అడ్డుకోకపోగా వారిచేత ప్రమాణస్వీకారం కూడా చేయించడాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు.   విభజన బిల్లులో సెక్షన్ 8 ప్రకారం ఆయన ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో అన్ని ప్రభుత్వ వ్యవస్థలపై పూర్తి నియంత్రణ కలిగి ఉండాలి. కానీ తెదేపా యంయల్యే రేవంత్ రెడ్డిపై ఎసిబి నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ గురించి ఆయనకి ఎటువంటి ముందస్తు సమాచారం లేనట్లు తెలుస్తోంది. అదే విధంగా ఆ తరువాత బయటపడిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి కూడా ఆయనకు ఇంతవరకు సమాచారం లేకపోవడంతో ఆయనకు హైదరాబాద్ నగరంలో ఏమి జరుగుతోందనే విషయంపై సరయిన సమాచారం కానీ, అవగాహన గానీ లేదనే విషయం రుజువయిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.   గవర్నర్ నిర్లిప్తత పట్ల ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అసంతృప్తిగా ఉన్నారనే విషయం నిన్న మొట్టమొదటిసారిగా బయటపడింది. తమ పార్టీ యం.యల్యేగా కొనసాగుతున్న తలసానికి ఆయన ఏవిధంగా పదవీ ప్రమాణం చేయించారని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఉమ్మడి రాజధానిలో సంపూర్ణాధికారాలు గవర్నర్ కే కట్టబెట్టాలని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నప్పటికీ ఆయనను మార్చితే బాగుంటుందని కేంద్ర ప్రభుత్వం వద్ద అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.   ఈ పరిస్థితులలో మరి ఆయనని మార్చుతుందో లేకపోతే ఆయనను తెలంగాణాకు పరిమితం చేసి ఆంధ్రాకు మరో గవర్నర్ నియమిస్తుందా? లేక ఆయననే కొనసాగిస్తుందా...అనేది త్వరలోనే తెలియవచ్చును. కానీ నిన్న హోంమంత్రి రాజ్ నాద్ సింగ్ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు తారసపడినప్పుడు, ఆయనని పిలిచి మరీ ఫోటో తీయించుకొన్నారు ఎందుకో...? ఆయన హైదరాబాద్ లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు నిత్యం ఏదో ఒకపని మీద వచ్చి కలుస్తూనే ఉంటారు. అలా కలిసినప్పుడల్లా మీడియా వాళ్ళు నిత్యం వారి ఫోటోలు తీస్తూనే ఉంటారు. మరి అటువంటప్పుడు డిల్లీలో చంద్రబాబు ఎదురపడినప్పుడు పనిగట్టుకొని ఆయనతో ఫోటో ఎందుకు తీయించుకొన్నారనే సందేహం కలగడం సహజం. బహుశః కేంద్ర ప్రభుత్వం ఆయనని మార్చబోతున్నట్లు ఏమయినా సంకేతాలు ఇచ్చినందునే ఆయన ఫోటో దిగారా? లేక కేవలం యాదృచ్చికంగానే ఆవిధంగా చేసారా? అనే విషయం కూడా త్వరలోనే తెలియవచ్చును.   ఆంద్ర, తెలంగాణా ప్రభుత్వాల మధ్య ప్రస్తుతం నెలకొన్న యుద్ద వాతావరణ గురించి మీడియా అడిగిన ఒక ప్రశ్నకు ఆయనిచ్చిన సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంది. ‘త్వరలోనే అన్నీ సర్దుకొంటాయి,’ అని చెప్పారు. ఆయన జవాబు వింటే ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య కేంద్ర ప్రభుత్వం రాజీ కుదుర్చుతుందని సూచిస్తున్నట్లుంది. లేకుంటే ఇంతవరకు వచ్చిన తరువాత అన్నీ త్వరలోనే సర్దుకోవడం అసంభవమని అందరికీ తెలుసు. ఏమయినప్పటికీ మరొక్క వారం రోజులలోనే కేంద్రప్రభుత్వం తన వైఖరిని మెల్లగా బయటపెట్టవచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అన్ని అరిష్టాలకు మూల కారణం ఆ పార్టీయేనా?

  రాష్ట్ర విభజన జరిగి రెండు రాష్ట్రాలలో వేర్వేరు ప్రభుత్వాలు ఏర్పడిన నాటి నుండి నేటి వరకు వాటి మధ్య జరుగుతున్నగొడవలన్నీ ఒక ఎత్తయితే, రేవంత్ రెడ్డి కేసు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలపై వాటి మధ్య జరుగుతున్న యుద్ధం ఒక్కటీ మరొక ఎత్తని చెప్పవచ్చును. ఇంతవరకు జరుగుతున్న యుద్దాలకు ఇది పరాకాష్టగా చెప్పుకోవచ్చును. అయితే వీటన్నిటికీ కాంగ్రెస్ పార్టీనే నిందించవలసి ఉంటుంది. గత పదేళ్ళుగా తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమాలు జరుగుతున్నా పట్టించుకోకుండా కూర్చొన్న కాంగ్రెస్ అధిష్టానం, ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేవలం ఆరు నెలలలోనే విభజించేసి చేతులు దులుపుకొంది.   రాష్ట్రంలో ఆర్టీసీ వంటి ఒక సంస్థను రెండుగా విభజించడానికి ఏడాదిగా పట్లు పడుతున్నా సాధ్యం కాక ఇరు రాష్ట్రాలు తలలు పట్టుకొని కూర్చొన్నాయి. అటువంటి కొన్ని వందలు సంస్థలు, వ్యవస్థలు సమ్మిళితమయిన ఒక రాష్ట్రాన్ని ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేయగలగడం నిజంగా చాలా ఆశ్చర్యకరమయిన విషయమే. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసామని చాల గొప్పలు చెప్పుకొంది కానీ అది చేసిన పనికి తెలంగాణా ప్రజలయినా సంతోషించారా? అంటే అదీ లేదని ఎన్నికలలో రుజువు చేసారు.   ఇక అది చేసిన ఈ నిర్వాకానికి ఆంద్రప్రదేశ్ ప్రజలు ఆ పార్టీని ఏవిధంగా శిక్షించారో ఆ పార్టీ నేతలకి కూడా తెలుసు. ప్రజలు శిక్షించక మునుపే అనేక సీనియర్ నేతలు అస్త్ర సన్యాసం చేయవలసి వచ్చింది..కన్నా లక్ష్మి నారాయాణ, కావూరి, బొత్స వంటి సీనియర్ నేతలు పార్టీని విడిచిపెట్టి పారిపోయారు. గత పదేళ్ళుగా తెలంగాణా కోసం అనేక వేలమంది బలిదానాలు చేసుకొన్నా కాంగ్రెస్ అధిష్టానికి చీమ కుట్టినట్లయినా అనిపించలేదు. కానీ రాహుల్ గాంధీ ఒక్కడి రాజకీయ భవిష్యత్ కాపాడటం కోసం, కనీసం తెలంగాణాలో అయినా తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎంతో కొంత మేలు జరుగుతుందనే ఆలోచనతోనే ఎన్నికల ముందు ఆఘమేఘాల మీద రాష్ట్ర విభజన చేసేసింది. కానీ వ్రతం చెడినా ఫలం దక్కలేదు.   కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినందుకు రెండు రాష్ట్రాలలో ప్రజలెవరూ బాధపడలేదు. కానీ అది చేసిపెట్టిన ఈ నిర్వాకానికి నిత్యం ఆ పార్టీని తిట్టుకొంటూ నానాబాధలు పడుతున్నారు. అందుకే రెండు రాష్ట్రాల ప్రజలు, ప్రభుత్వాలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, పార్టీలు అందరూ కూడా ఏదో ఒక అంశం మీద కాంగ్రెస్ పార్టీని తిట్టుకొంటూనే ఉన్నారు. రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద సమస్యను తీర్చే ప్రయత్నంలో అనేక వందల వేల సమస్యలను సృష్టించిపోయింది. ఇన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని ఎంతో ఆదరించిన తెలుగు ప్రజలు ఇకపై మరికొన్ని దశాబ్దాల పాటు దానిని ఇలాగే తిట్టుకొంటారేమో?

జూలు విదిల్చిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి గురించి తెలిసిన వాళ్ళు ఈ మధ్యకాలంలో ఆయన చాలా కొత్తగా కనిపిస్తున్నారు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో చాలామంది గుండెల్లో సింహస్వప్నంలా నిలిచిన ఆయన పదేళ్ళ ప్రతిపక్షానుభవం తర్వాత కొంత మారారు. తన క్రమశిక్షణను కొంత సడలించుకున్నారు. గతంలో ఎలాంటివారితో అయినా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా వ్యవహరించే ఆయన చాలా ఓర్పును అలవరుచుకున్నారు. ఎదుటివారిలో భారీగా లోపాలు వున్నాయని తెలిసినప్పటికీ, గతంలో  మాదిరిగా వారికి పనిష్మెంట్ విధించడం కాకుండా ఓర్పుగా వారిని దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. సంవత్సరం క్రితం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత కూడా ఆయన తన ఓర్పును ప్రదర్శిస్తూనే వున్నారు. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటి వ్యవహార శైలికి, ఇప్పటి వ్యవహార శైలికి స్పష్టమైన తేడాను అందరూ గమనిస్తున్నారు. అయితే సింహం గర్జించకుండా, జూలు విదల్చకుండా, పంజా విసరకుండా ఓర్పు వహిస్తూ వుంటే దారిన పోయే ఎలుక కూడా ఆ సింహం  మీసాలతో ఆడుకుంటుంది. నిన్న మొన్నటి వరకూ చంద్రబాబు విషయంలో కూడా కొందరు అలాగే వ్యవహరిస్తూ వచ్చారు. తెలుగు ప్రజల మధ్య స్నేహ సంబంధాలు దెబ్బతినకూడదన్న ఉద్దేశంతో చంద్రబాబు సహనంగా వుంటూ వస్తే, ఆ సహనాన్ని అసమర్థతగా భావించి ఆయనతో ‘గేమ్స్’ ఆడే ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు చంద్రబాబు నాయుడిలో మార్పు తెచ్చిన సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన మళ్ళీ జూలు విదిల్చినట్టే కనిపిస్తున్నారు. ఇప్పుడు ఆయన మాట తీరులోగానీ, వ్యవహార శైలిలోగానీ, ముఖంలోగానీ మునుపటి సీరియస్‌నెస్ కనిపిస్తోంది. ‘‘నన్ను తక్కువ అంచనా వేశారు కదూ... మీ సంగతి తేలుస్తా’’ అనే  హెచ్చరిక ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడాయన జూలు విదిల్చిన సింహంలా వున్నారు. మరి ఆయన పంజా వేటు పరిణామాలు ఎలా వుంటాయో వేచి చూడాలి.

బాలకృష్ణ సచివాలయానికి అందుకే వచ్చేరుట!

  ఈరోజు నందమూరి బాలకృష్ణ జన్మదినం. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు అందరూ ఆయన జన్మదిన వేడుకలని ఘనంగా జరుపుకొన్నారు. ఆయన అనంతపురం జిల్లాలో హిందూపురం నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో జిల్లా మంత్రి పరిటాల సునీత ఆయనను సచివాలయంలో తన ఛాంబర్ కు ఆహ్వానించారు. జిల్లా నేతల సమక్షంలో కేక్ కట్ చేసి వారితో కలిసి ఆయన తన పుట్టిన రోజు వేడుకని జరుపుకొన్నారు.   కానీ అన్నిటినీ తన దృక్కోణం నుండే చూపిస్తూ ప్రజలను త్రప్పు ద్రోవపట్టించే అలవాటున్న వైకాపా ఆయన సచివాలయానికి రావడంపై కూడా చకచకా ఒక కధ అల్లేసి చేతిలో ఉన్న మీడియాతో జనాల మీదకు వదిలిపెట్టింది. వైకాపా నేత వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాక్ష్యాధారాలతో సహా పట్టుబడ్డారు. కనుక నేడో రేపో ఆయనపై ఎసిబి అధికారులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించడం ఖాయంగా కనిపిస్తోంది. కనుక చంద్రబాబు నాయుడు తన పదవికి రాజీనామా చేస్తే బాలకృష్ణ ఆ పదవి చేప్పట్టే ఉద్దేశ్యంతో ఉన్నట్లున్నారు. బహుశః అందుకే ఆయన సచివాలయంలో మంత్రులతో చర్చించేందుకు వచ్చేరేమో? చంద్రబాబు నాయుడు నేడు కాకపోతే రేపయినా రాజీనామా చేయక తప్పదు. కనుక ఆయన స్థానంలో మరొకరిని నియమించవలసి ఉంటుంది. కనుక తెదేపా మంత్రులతో ఆవిషయం గురించే చర్చిస్తే అందులో తప్పు లేదు,’ అని అన్నారు.   ఇంతకు ముందు ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టి హరికృష్ణ, జూ.యన్టీఆర్ లని పార్టీ నుండి దూరం చేసినట్లే ఇప్పుడు బాలకృష్ణ ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడని వైకాపా నేతలు ప్రచారం మొదలుపెట్టి తెదేపాలో అపోహలు, అనుమానాలు సృష్టించి మరొక మైండ్ గేమ్ మొదలుపెట్టినట్లున్నారు. ఇటువంటి సమయంలో తెదేపా నేతలు కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిది.

గవర్నర్‌ చేతికి హైదరాబాద్?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యతలు గవర్నర్ నరసింహన్‌కి అప్పగించడానికి పావులు కదులుతున్నట్టు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించిన స్పష్టమైన ఆదేశాలు కేంద్రం నుంచి వెలువడే అవకాశం వుందని పలువురు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం నాడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. అలాగే పలువురు ఉన్నతాధికారులను ఆయన కలిశారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, డీజీపీ కేంద్ర హోంశాఖ కార్యదర్శితో సమావేశమయ్యారు. అలాగే ఉమ్మడి గవర్నర్ నరసింహన్ బుధవారం మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో, ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో, హోంశాఖ కార్యదర్శితో కూడా భేటీ అయ్యారు. చకచకా, చాలా సీరియస్‌గా జరుగుతున్న ఈ భేటీలను చూస్తుంటే త్వరలో హైదరాబాద్‌ శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యతలను గవర్నర్ నరసింహన్ చేతిలో పెట్టే అవకాశం వుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో పోలీసు వ్యవస్థ, శాంతిభద్రతల బాధ్యతను పదేళ్ళపాటు ఉమ్మడి గవర్నర్ నిర్వహించాలని విభజన చట్టంలో వుంది. రాష్ట్ర విభజన చట్టంలోని 8 ప్రకారం  ఉమ్మడి రాజధాని శాంతిభద్రతల బాధ్యత గవర్నర్‌‌దే. విభజన చట్టంలో  వున్న అనేక అపరిష్కృత అంశాలలో ఈ అంశం కూడా ఒకటి. రాష్ట్ర విభజన జరిగి ఒక సంవత్సరం దాటినప్పటికీ ఈ అంశంలో కేంద్రం, గవర్నర్ ఇంతవరకు ఎలాంటి చొరవ చూపిన దాఖలాలు కనిపించలేదు. అయితే రేవంత్ రెడ్డి వ్యవహారం, చంద్రబాబు నాయుడు మాట్లాడినట్టు చెబుతున్న ఫోన్ సంభాషణల ఉదంతం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చేతిలోనే పోలీసు వ్యవస్థ వుండటం వల్ల ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా జరుగుతున్నాయని, కేసీఆర్ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను తన చేతిలో పెట్టుకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం నాడు ఢిల్లీలో జరిగిన పరిణామాలు గవర్నర్ చేతికి హైదరాబాద్‌ శాంతిభద్రతలు అందబోతున్నాయన్న సూచనలను ఇస్తున్నాయి.

జగన్ కి బొత్సతోడయ్యారిప్పుడు

  ఇంతవరకు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే తెలంగాణా ప్రభుత్వం తరపున గట్టిగా వాదిస్తున్నారు. వైకాపాలో మిగిలిన నేతలు కూడా తెదేపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ వారెవరూ కూడా తెరాస, తెలంగాణా, కేసీఆర్ ప్రసక్తి రాకుండా చాలా జాగ్రత్తపడుతూ కేవలం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలకు మాత్రమే పరిమితమవుతూ తెదేపాను విమర్శిస్తూ కాలక్షేపం చేసేస్తున్నారు. కానీ ఇప్పుడు బొత్స సత్యనారాయణ కూడా జగన్మోహన్ రెడ్డికి తోడయ్యారు.   తెలంగాణా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ ని వెనకేసుకువస్తూ, ఆయన కూడా చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. “కేసీఆర్ అంతటివాడిని పట్టుకొని చంద్రబాబు నాయుడు ‘కబడ్ధార్’ అని హెచ్చరిస్తారా...” అంటూ చంద్రబాబుపై బొత్స తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. “తప్పు చేస్తున్నారని అనుమానంకలిగితే ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ చేసినా తప్పులేదని” తెలంగాణా ముఖ్యమంత్రిని వెనకేసుకు వచ్చారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చెలరేగిన సమస్యలను చంద్రబాబు ప్రజాసమస్యగా అభివర్ణిస్తూ రెండు రాష్ట్రాల ప్రజల మధ్య వైషమ్యాలు పెంచాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. మా జగన్ బాబు చెప్పినట్లుగా తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి నిజాయితీని నిరూపించుకొమ్మని హితవు పలికారు.   రాష్ట్ర విభజన సమయంలో ఆయన వ్యవహరించిన తీరు చూసి, ఆయన స్వంత జిల్లా ప్రజలే తిరగబడ్డారనే సంగతి ఆయన అప్పుడే మరిచిపోయినట్లున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకొనేందుకు ఆయనతో కలిసి తెలంగాణా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ ని వెనకేసుకువస్తూ ఇదే విధంగా మాట్లాడినట్లయితే ఈసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన పట్ల వ్యతిరేకత పెంచుకోవచ్చునని గ్రహిస్తే మంచిది. గత ఏడాది కాలంగా మీడియాకు దూరంగా ఉన్న ఆయన ఇప్పుడు వైకాపాలో ప్రవేశించిన ఆయన మళ్ళీ తన సత్తా చూపించి ప్రజలను, జగన్మోహన్ రెడ్డిని ఆకట్టుకోవాలనుకోవడం సహజమే. కానీ అందుకోసం ఈవిధంగా మాట్లాడితే మొదటికే మోసం రావచ్చును.   ఇదివరకు ఎన్నికల ముందు ‘కాంగ్రెస్ పార్టీతో వైకాపా కలిసి పనిచేస్తుంది’ అని నోరు జారినందుకు సబ్బం హరిని పార్టీలో చేరకముందే తలుపులు వేసేసి బయటకు గెంటేసారు. కనుక బొత్స సత్యనారాయణ కూడా పార్టీలో మిగిలిన నేతలలాగే రాష్ట్ర సమస్యలతో సరిపెట్టుకోవడం మంచిదేమో?

ఫోన్ ట్యాపింగ్ ఒక్క తెదేపాకే పరిమితమా లేకపోతే...

  ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా అనేక మంది మంత్రులు, రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారుల ఫోన్లను తెలంగాణా ప్రభుత్వం ట్యాపింగ్ చేయించిందని తెదేపా మంత్రులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ వారు చేస్తున్న ఆరోపణలు రుజువు చేయగలిగితే, ఇంతవరకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంతో చెలగాటమాడుతున్న తెలంగాణా ప్రభుత్వానికి తీవ్ర సమస్యలు ఎదుర్కోక తప్పదు. కానీ తాము ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేయలేదని తెలంగాణా ఎసిబి డిజిపి ఎకె ఖాన్ తెలిపారు. కానీ ఒకవేళ తెదేపా మంత్రులు ఆరోపిస్తున్నట్లుగా ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే అది కేవలం తెదేపాకు మాత్రమే కాకుండా తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్, మజ్లిస్, వామ పక్షాల ఫోన్లకు వర్తింపజేసినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో తెరాసకు మరొక పార్టీ పోటీ ఉండకూడదనుకొంటున్నప్పుడు ఆ మాత్రం రిస్క్ తీసుకోక తప్పదు మరి. కనుక రాష్ట్రంలో అన్ని పార్టీలు ఈ విషయంలో జాగ్రత్తపడటం మంచిది. లేకుంటే వారికి కూడా ఏదో ఒకనాడు ఇటువంటి పరిస్థితే దాపురించవచ్చును.

ఆయన బ్రదర్ అనిల్ కి బందువుట!

  ఆంద్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి అచ్చెం నాయుడు ఈరోజు సరికొత్త విషయం ఒకటి బయటపెట్టారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఈ స్టీఫెన్ సన్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి బావ బ్రదర్ అనిల్ కి బంధువు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ కుట్రలో జగన్మోహన్ రెడ్డి కూడా తోడ్పడినట్లు మాకు అనుమానాలున్నాయి. అందుకే కేసీఆర్ కి మద్దతుగా జగన్ మాట్లాడుతునట్లున్నారు,” అని ఆరోపించారు.   “కేవలం చంద్రబాబు నాయుడు, మంత్రులు, అధికారుల ఫోన్లు మాత్రమే కాకుండా తెలంగాణాలో తెదేపా ముఖ్యనేతలందరి ఫోన్లు కూడా తెలంగాణా ప్రభుత్వం ట్యాప్ చేసి ఉండవచ్చనే అనుమానం కలుగుతోంది. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఏదయినా హాని తలపెడితే ఆయన అంతకు పదింతలు చెల్లించుకోవలసివస్తుందని హెచ్చరిస్తున్నాము,” అని అన్నారు.   అచ్చెం నాయుడు ఆరోపిస్తున్నట్లుగా ఒకవేళ ఈ కుట్రలో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొని ఉన్నట్లు రుజువయితే దాని వలన అందరి కంటే ఎక్కువ నష్టపోయేది వైకాపాయే. ప్రజలెన్నుకొన్న తెదేపా ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని, మళ్ళీ త్వరలోనే మనకి మంచి రోజులు వస్తాయని...ఆయన ఇదివరకు చాలాసార్లు అన్నప్పటికీ ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ నేతలు ఆవిధంగా మాట్లాడటం సహజమేనని ఎవరూ వాటిని సీరియస్ గా తీసుకోలేదు. కానీ, ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఆరోజు ఏదో కాకతాళీయంగా చెప్పిన మాటలు కావని అర్ధం అవుతోంది. తెదేపా ప్రభుత్వం కూల్చివేసేందుకు తెర వెనుక చాలా కాలంగా కుట్రలు జరుగుతున్నాయని ఇప్పుడు అర్ధమవుతోంది. అయితే దేశముదురు రాజకీయ నేతలమని గొప్పలు చెప్పుకొనే తెదేపా నేతలు దీనిని గ్రహించలేకపోవడమే విడ్డూరం. కనీసం ఇప్పటికయినా మేల్కొనకపోతే చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొని ఏమీ ప్రయోజనం ఉండదు.

పార్టీ ఫిరాయించేవాళ్లకే పదవులా?

అనేక అనుమానాలు, ఊహాగానాల మధ్య బొత్సా సత్యనారాయణ ఎట్టకేలకు వైకాపాలో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అనుభవించిన బొత్సకు ఆయన కుటుంబసభ్యులకు రాష్ట్ర విభజన జరిగిన తరువాత కాంగ్రెస్ కు ప్రజలలో అంత ఆదరణ లేకపోయేసరికి ఏ ఒక్కరికీ ఒక్క డిపాజిట్ కూడా దక్కలేదు. దీంతో ఎప్పుడూ బిజీబిజీగా ఉండే బొత్సా ఖాళీగా ఉండలేక ఆఖరికి పార్టీ ఫిరాయించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే అప్పట్లో ఆయన కాంగ్రెస్ ను వీడి అటు బీజేపీ లోకో ఇటు వైకాపా లోకో చేరే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగింది. కానీ బొత్సా ఈ వార్తలకు ఫులుస్టాప్ పెట్టి వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. అసలు ఎప్పుడో వైకాపాలో చేరాల్సిన బొత్సా అప్పట్లో బేర సారాలు కుదరక పార్టీ మారలేదు. అప్పట్లో 8 ఎమ్మెల్సీ సీట్లు డిమాండ్ చేసిన బొత్సా దానికి వైకాపా అధ్యక్షుడు జగన్ అంగీకరించకపోవటం.. తరువాత 4 సీట్లతో పాటు బొత్సాను ఎమ్మెల్సీ ఫ్లోర్ లీడర్ ను చేసేలా ఒప్పందం కుదుర్చుకొని ఫార్టీ ఫిరాయించారు. మరోవైపు గత సార్వత్రిక ఎన్నికల్లో విశాఖజిల్లాలో అనుకున్న ఫలితాలు రాకపోయేసరికి అక్కడ ఓ బలమైన నాయకుడిని నిలబెట్టాలని జగన్ చూస్తున్న నేపథ్యంలో బొత్స ఇదే అదను చూసుకొని వైకాపాలోకి జంప్ చేశారు. కానీ బొత్సా రాక వైకాపా అధ్యక్షుడు జగన్ కు ఆనందాన్నిచ్చినా ఆపార్టీలో కొంత మంది ఆసంతృప్తిగా ఉన్నారన్న దానిలో ఎటువంటి సందేహం లేదు.   మరోవైపు బొబ్బిలి రాజవంశానికి చెందిన సుజయ్ రంగారావు సోదరులు విజయనగరంజిల్లా నుండి వైకాపా పార్టీ స్థాపించినప్పటి నుండి పార్టీకోసమే పనిచేసి ఎంతో సేవ చేసిన నాయకులు. వైకాపా లో బొత్సా చేరుతున్నారు అన్న వార్త తెలిసినప్పటి నుండే అలకపాన్పుకెక్కారు ఈ సుజయ్ సోదరులు. మరి ఒకే ఒరలో రెండు కత్తులు ఉండగలవా.. అసలే గతం నుండే బొత్సా, సుజయ్ రంగారావు సోదరుల మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమనే పరిస్థితి... ఈ నేపథ్యంలో బొత్స చేరికకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. బొత్స పార్టీలో చేరటంతో జగన్ మీద పూర్తి వ్యతిరేక భావంతో ఉన్నారు సుజయ్ సోదరులు. పార్టీ లో ఉండి పార్టీకి పనిచేసిన వారికి పదవులు ఇవ్వలేదుకాని, బయటి పార్టీ నుండి వచ్చిన వాళ్లకు పదవులు కట్టబెడతారని వారికి మంటెక్కి వైకాపా నుండి తెలుగుదేశం పార్టీకి మారే యోచనలో ఉన్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ సుజనా రంగారావు సోదరుడికి ఎమ్మెల్సీ సీటుకూడా కేటాయించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.   మొత్తానికి రాజకీయాలు ఎలా మారిపోయాయంటే ఎవరు ఏ పదవి ఇస్తానంటే ఆ పార్టీలోకి చేరిపోయి ప్రజల కోసం కాకుండా తమ స్వార్థం కోసం ఉపయోగించుకునేలా తయారయాయి. పార్టీ అధ్యక్షులు కూడా ఎంతోకాలం పార్టీలో నమ్మకంగా ఉండి పార్టీ అభివృద్ధికి పాటుపడి ఉన్నవారికి మాత్రం పదవులు ఇవ్వకుండా పార్టీలు జంప్ చేసేవారికి ఇవ్వడం కూడా ఆశ్చర్యకరం. అసలు జగన్ పార్టీ స్థాపించినప్పుడు దోచుకున్నదే దోచుకోవడానికి పార్టీ పెడుతున్నాడని జగన్ ను విమర్శించిన బొత్సా.. ఇప్పుడు అదే పార్టీలో చేరడం.. జగన్ బొత్సాకు ఆహ్వానం పలకడం చూస్తుంటే రాజకీయమంటే ఇదేనేమో అనిపిస్తుంది. మరోవైపు బలమైన సామాజిక వర్గానికి చెందిన సుజయ్ పార్టీని వీడితే, తమకు భారీ నష్టం తప్పదని కూడా ఆ పార్టీ వర్గాలు అంచనా వేసి సుజయ్‌ని శాంతపరిచేందుకు ఆ పార్టీ నేతలు ఇప్పటికే రంగంలోకి దిగారు.

బాబు మాటలని నిజం చేసి చూపిన ఎసిబి

  ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న మంగళగిరిలో జరిగిన సభలో మాట్లాడుతూ “ఎవరింట్లో అయినా శుభకార్యం జరుగుతుంటే బుద్దున్నవాడు ఎవడూ కూడా దానిని పాడు చేయాలనుకోడు. కానీ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఒకవైపు ట్యాంక్ బ్యాండ్ మీద తెలంగాణా సంభరాలు జరుపుకొంటూనే మరోవైపు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకొన్న శుభసందర్భంగా ఏర్పాటు చేసుకొంటున్న ‘మహాసంకల్ప దీక్ష’ బహిరంగ సభను చెడగొట్టాలని ప్రయత్నించారు,” అని విమర్శించారు. ఆయన ఆరోపణలకు బలం చేకూర్చుతున్నట్లుగా ఈరోజు ఎసిబి అధికారులు రేవంత్ రెడ్డి, మిగిలిన ముగ్గురు నిందితుల ఇళ్ళలో ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. రేవంత్ రెడ్డి భార్య గీతను ఎసిబి అధికారులు ప్రశ్నించారు. మరొక రెండు రోజుల్లో రేవంత్ రెడ్డి దంపతుల కుమార్తె వివాహ నిశ్చితార్ధం జరుగబోతోంది. ఇటువంటి సమయంలో భర్త అరెస్ట్ కావడంతో చాలా కలత చెంది ఉన్న ఆమె, ఇప్పుడు ఎసిబి అధికారులు తమ ఇంట్లో సోదాలు చేయడం, తనపై ప్రశ్నల వర్షం కురిపించడంతో మరింత క్రుంగిపోయారు. వారి ఇంట్లో శుభ కార్యం జరుగబోతున్న విషయం అందరికీ తెలుసు.   ఎసిబి అధికారుల సోదాలతో తమ ప్రభుత్వానికి ఎటువంటి సంబందమూ లేదని తెరాస మంత్రులు వాదించవచ్చు. కానీ ఇటువంటి పరిస్థితులలో రేవంత్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించి ఆయన భార్యా పిల్లలను భయబ్రాంతులను చేయడం ఎవరూ హర్షించరు. ఎసిబి అధికారులు ప్రదర్శిస్తున్న ఈ అత్యుత్సాహం వలన ఒకవేళ వారి ఇంట్లో జరుగబోయే శుభకార్యానికి ఆటంకాలు ఏర్పడితే వారిని ప్రజలు కూడా క్షమించరని గ్రహిస్తే మంచిది. రాజకీయాలను పార్టీల వరకే పరిమితం చేసుకొంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని సదరు నేతల కుటుంబాలను ఈ విధంగా వేధింపులకి గురి చేయడాన్ని ఎవరూ కూడా హర్షించరని గ్రహిస్తే మంచిది.

చంద్రబాబుపై పిర్యాదుకు జగన్ డిల్లీ పయనం

  సార్వత్రిక ఎన్నికలలో తన పార్టీకి అధికారం దక్కకుండా చేసి, తన ముఖ్యమంత్రి కలలను భగ్నం చేసినందుకు వైకాపా అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర ప్రతీకారంతో రగిలిపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఊహించని విధంగా రేవంత్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు ఆయనకి ఒక ఆయుధంగా దొరకడంతో దానిని పట్టుకొని ఆయన, వైకాపా పార్టీ నేతలు చెలరేగిపోతున్నారు. సాక్షి మీడియాలో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శిస్తూ రకరకాల కధనాలు ప్రసారం చేస్తోంది. రేవంత్ రెడ్డి మరియు చంద్రబాబు నాయుడులపై ఇదివరకే గవర్నర్ కి ని కలిసి పిర్యాదు చేసిన జగన్, రేపు సాయంత్రం చంద్రబాబు నాయుడు డిల్లీ వెళ్ళబోతున్న సంగతి తెలియగానే, ఆయన కంటే ముందు జగన్మోహన్ రెడ్డి కూడా హడావుడిగా ఈరోజు సాయంత్రం డిల్లీ బయలుదేరిపోతున్నారు. అక్కడ రాష్ట్రపతిని, హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని కలిసి చంద్రబాబు నాయుడుపై పిర్యాదు చేయబోతున్నారు.   డిల్లీ వెళ్ళినప్పుడల్లా జాతీయ మీడియాతో రాష్ట్ర ప్రభుత్వం గురించి ఏదో ఒకటి చెడుగా మాట్లాడటం ఆనవాయితీగా పాటిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈసారి మరింత రెచ్చిపోవచ్చును. తద్వారా రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిల్లీ వెళ్ళినప్పుడు కేంద్ర ప్రభుత్వం, జాతీయ మీడియాల ముందు ఆయనకి ఇబ్బందికర పరిస్థితులు కల్పించాలని తహతహలాడుతున్నారేమో? ముఖ్యమంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా ధర్నాలు చేపట్టబోతోంది. అయితే ఇవే పనులు ఆయన తెలంగాణాలో చేసి ఉండి ఉంటే దాని పరిణామాలు ఏవిధంగా ఉంటాయో తెలుసుకోవాలంటే గత ఏడాది కాలంగా తెలంగాణాలో జరిగిన సంఘటనలన్నిటినీ నెమరు వేసుకొంటే చాలు.

రేవంత్ రెడ్డి కేసు చివరికి దేనికి దారి తీస్తుందో?

  రేవంత్ రెడ్డి వ్యవహారంలో అవినీతిని బయటపెట్టాలనే తపన కంటే తెదేపాను, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేసుకొని రాజకకీయమే ఎక్కువగా కనిపిస్తోందని ఇప్పుడు సర్వత్రా మాటలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డిపై నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ ఆడియో, వీడియో టేపులను మీడియాకు బహిర్గతం చేయడం, తెలంగాణా హోంమంత్రి నాయిని నరసింహా రెడ్డి చంద్రబాబు నాయుడు మాట్లాడిన ఫోన్ సంభాషణల రికార్డ్ తమ వద్ద ఉందని, దానిని సరయిన సమయంలో బయటపెడతామని చెప్పడం, ఆ తరువాత మళ్ళీ చిన్నబాబయినా, పెద్దబాబయినా....ఏబాబునీ విడిచిపెట్టబోమని చెప్పడం, ముందు చెప్పినట్లుగానే చంద్రబాబు నాయుడు నామినేటడ్ యంయల్యే స్టీఫెన్ సన్ తో మాట్లాడినట్లు చెప్పబడుతున్న ఫోన్ సంభాషణలను మీడియాకు విడుదల చేయడం అన్నీ కూడా రాజకీయ ఉద్దేశ్యంతో చేస్తున్నట్లుగానే కనబడుతున్నాయని రాజకీయ వర్గాలలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఆ అత్యుత్సాహంలో పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు స్వయంగా బయటపెట్టుకొన్నట్లయింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న గవర్నర్ నరసింహన్ని కలిసినప్పుడు పిర్యాదు చేసినట్లు సమాచారం. అదే విధంగా ఈ విషయం గురించి కేంద్ర ప్రభుత్వానికి పిర్యాదు చేసేందుకు ఆయన స్వయంగా రేపు డిల్లీ వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన కారణంగా రెండు ప్రభుత్వాలు చాలా విషయాలలో గొడవలు పడుతున్నాయి. ఇప్పుడు ఈ గొడవ ఏ విపరీత పరిణామాలకు దారి తీస్తుందో ఎవరూ ఊహించలేకపొతున్నారు.

అందుకే వైకాపాలో చేరారుట!

  ఈరోజు వైకాపాలో చేరిన బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ తాము తెలుగుదేశం పార్టీపై ప్రజాక్షేత్రంలో పోరాటం చేసేందుకే వైసీపీలోకి చేరామని చెప్పారు. ఉత్తరాంధ్రలో వైకాపాను బలోపేతం చేసేందుకు సాయశక్తుల కృషి చేస్తామని ఆమె తెలిపారు. అయితే బొత్స సత్యనారాయణ వైకాపాలో చేరడం ఖాయం అయిన తరువాత తాము కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడవలసివస్తోందో స్వయంగా బయటపెట్టారు. రాష్ట్ర విభజన తరువాత ఏడాది పాటు ఎంతగా ప్రయత్నించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిలో ఏ మాత్రం మెరుగుదల కనబడటంలేదని, కనుకనే పార్టీని వీడవలసివస్తోంది తప్ప పార్టీవల్ల తనకు ఎటువంటి ఇబ్బందీ లేదని ఆయనే స్వయంగా చెప్పారు. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ అగమ్యగోచరంగా అంధకారంగా కనబడుతున్నందున అటువంటి పార్టీని పట్టుకొని ఇంకా వ్రేలాడటం వలన తమ రాజకీయ భవిష్యత్ కూడా దెబ్బ తింటుందనే ఆలోచనతోనే బొత్స సత్యనారాయణ సకుటుంబ సపరివారంగా సమేతంగా వైకాపాలో చేరిపోయి తమ దారి తాము చూసుకొన్నారనే విషయం స్పష్టమవుతోంది.   అధికారమే పరమావధిగా భావించే సగటు రాజకీయ నాయకులు ఏవిధంగా ప్రవర్తిస్తారో బొత్స సత్యనారాయణ కూడా సరిగ్గా అదేవిధంగా వ్యవహరించారని ప్రజలు అభిప్రాయపడితే అందులో అసహజమేమీ లేదు. పదవీ, అధికారాలే ప్రాతిపదికన చూసుకొన్నట్లయితే, బొత్స సత్యనారాయణ చాలా సరయిన నిర్ణయమే తీసుకొన్నారని భావించవచ్చును. కానీ తెలుగుదేశం పార్టీపై ప్రజాక్షేత్రంలో పోరాటం చేసేందుకే వైకాపాలో చేరామని చెప్పుకోవడమే హాస్యాస్పదం. కాంగ్రెస్ టోపీ, కండువా రెండూ పక్కన పడేసి, ఆయన ఇప్పుడు వైకాపా కండువా కప్పుకొన్నారు కనుక ఉత్తరాంధ్రలో వైకాపాను బలోపేతం చేసేందుకు సాయశక్తుల కృషి చేస్తామని చెప్పడం సహజమే. కానీ ఇంతవరకు తనను అందలం ఎక్కించిన కాంగ్రెస్ పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు దానిని ఆదుకొని దాని రుణం తీర్చుకోకుండా వదిలిపెట్టి బయటకి వచ్చిన వ్యక్తి, వైకాపాకు మాత్రం ఏదో ఒరగబెడతారని లేదా మళ్ళీ ఎన్నికల ముందు పార్టీ మారబోరనే నమ్మకం ఏమిటి? అనే సందేహం కలుగకమానదు.   కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరుదామని ప్రయత్నించి విఫలమయిన తరువాత వేరే గత్యంతరం లేకనే ఆయన వైకాపాలో చేరిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ ఆయనకే బీజేపీలో చేరే అవకాశం కలిగి ఉంటే, బహుశః అప్పుడు జగన్ అవినీతి గురించి మాట్లాడేవారేమో? కానీ ఇప్పుడు వైకాపాలో చేరడం వలన ఆ పార్టీ అధిష్టానం అభిప్రాయానికి అనుగుణంగా తెదేపా ప్రభుత్వంపై పోరాటం చేస్తామని చెపుతున్నారనుకోవలసి ఉంటుంది అంతే.   ఇప్పుడు రాజకీయాలలో ప్రతీ పనికి, ప్రతీ మాటకి ఒక నిర్దిష్ట ఫార్ములా ఉంది. కనుక రాజకీయ నేతలు పార్టీలు మారినప్పుడు పలకవలసిన ఇటువంటి కొన్ని పడికట్టుపదాలను పలుకుతుంటారు. అది విని ప్రజలు నవ్వుకొంటారు. నవ్వితే నవ్విపోయెదురు గాక మాకేటి సిగ్గు? అని నేతలు తమ పని తాము చేసుకుపోతుంటారు. పదవి, అధికారం అనే రెంటికి తప్ప మరే సిద్దాంతాలను నమ్మని అటువంటి వ్యక్తులతోనే మన రాజకీయ వ్యవస్థ నిండి ఉంది. కనుక రాజకీయపార్టీలు కూడా వారిలో నుండే తమకు అవసరమయిన వ్యక్తిని ఎంచుకోవలసి ఉంటుంది. కనుకనే వైకాపా ఆయనను పార్టీలోకి ఆహ్వానించిందని భావించవచ్చును. కనుక వైకాపా వలన బొత్స సత్యనారాయణ లబ్ది పొందుతారా? లేక ఆయన వలన వైకాపా జిల్లాలో బలపడి లబ్ది పొందుతుందా? అనేది మాత్రమే ఆలోచిస్తే సరిపోతుంది. ఆ సంగతి రానున్న నాలుగేళ్ల కాలంలో తేలిపోతుంది.

ఆర్తి అగర్వాల్ మృతి

  ప్రముఖ తెలుగు సినీ నటి ఆర్తి అగర్వాల్ శనివారం ఉదయం అమెరికాలోని న్యూజెర్సీలో గల ఆట్లాంటిక్ ఆసుపత్రిలో మరణించారు. ఆమె వయసు 31. ఆమె గుండె పోటుతో మరణించినట్లు ఆమె మేనేజర్ తెలిపారు. ఆమె 2001 సం.లో నువ్వు నాకు నచ్చావ్ అనే సినిమాతో తన విజయ ప్రస్తానం మొదలుపెట్టి వరుసగా నువ్వు లేక నేను లేను , అల్లరి రాముడు, ఇంద్ర, నీ స్నేహం, బాబీ, వీడే, అడవి రాముడు, అందాల రాముడు, నేనున్నాను, చత్రపతి, నరసింహుడు, సోగ్గాడు, సంక్రాంతి, గోరింటాకు వంటి అనేక సూపర్ హిట్ సినిమాలలో ప్రముఖ హీరోల సరసన నటించారు.   కానీ ఆమె ఉజ్వల్ అనే యన్.ఆర్.ఐ.తో జరిగిన ఆమె వివాహం విఫలం అయిన తరువాత ఆమె జీవితం ఒక ట్రాజడీ సినిమాలా మారిపోయింది. వివాహానికి ముందు వరకు ఆమె తెలుగు సినీ ప్రపంచాన్ని ఏలినప్పటికీ వివాహం విఫలమయిన తరువాత ఆమెను సినీ పరిశ్రమ పట్టించుకోలేదు. దానితో ఆమె చిన్నచిన్నసినిమాలకే పరిమితమయింది. కానీ అవీ హిట్ అవకపోవడంతో ఆమెకు ఆ సినిమా అవకాశాలు కూడా క్రమంగా తగ్గిపోయాయి. అప్పటికే జీవితంలో అనేక ఆటుపోటులను ఎదుర్కొన్న ఆమె దానితో మరింత క్రుంగిపోయింది. బహుశః ఆ కారణంగానే ఆమె బరువు కూడా పెరిగిపోయి ఉండవచ్చును.   లైపో సక్షన్ సర్జరీ ద్వారా బరువు తగ్గించుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఆమె అమెరికా వెళ్ళినట్లు తెలుస్తోంది. ఆ సర్జరీ విఫలమయినందునే ఆమె మరణించి ఉండవచ్చని అందరూ భావిస్తున్నారు. కానీ గుండెపోతూ కారణంగానే ఆమె మరనించినట్లు ఆమెమేనేజర్ తెలిపారు. ఏమయినప్పటికీ తెలుగు ప్రేక్షకులను తన అందం, నటనతో ఎంతగానో రంజింప జేసినా ఆర్తి అగర్వాల్ ఇంత చిన్న వయసులోనే మరణించడం చాలా బాధాకరం.

రేవంత్ రెడ్డి వ్యవహారంలో ఏసీబి తొందరపడిందా?

  తెదేపా యం.యల్యే. రేవంత్ రెడ్డిని ఏదో విధంగా ఉచ్చులో బిగించాలని తొందరలో ఏసీబి అధికారులు, వారికి వెనుక నుండి వత్తాసు పలుకుతున్నవారు కొన్ని విషయాలు విస్మరించడం వలన చివరికి వారు త్రవ్విన గోతిలో వారే పడే పరిస్థితి కనిపిస్తోంది. ఈ వ్యవహారం అంతా ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో జరిగింది. కనుక ప్రజాప్రతినిధి అయిన రేవంత్ రెడ్డిపై నిఘా పెట్టేముందు ఏసీబి అధికారులు తప్పనిసరిగా ఎన్నికల కమీషన్ కి ముందుగా తెలియజేసి, దాని అనుమతితోనే చేప్పట్టవలసి ఉంటుంది. కానీ ఎన్నికల కోడ్ ని పట్టించుకోకుండా ఏసీబి అధికారులు ప్రజాప్రతినిధి అయిన రేవంత్ రెడ్డిపై నిఘా పెట్టడం, నిర్బందించడం రెండూ కూడా తప్పేనని, ఆవిధంగా చేసినందుకు ఒకవేళ ఎన్నికల కమీషన్ ఏసీబి అధికారులపై చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.   ఇక ఏప్రిల్, 2014లో ఆప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పి.సదాశివం, జస్టిస్ రంజన్ గోగయ్ మరియు జస్టిస్ యన్.వి. రమణలతో కూడిన ధర్మాసనం “స్టింగ్ ఆపరేషన్లపై” ఇచ్చిన ఒక తీర్పులో “ఒక నేరస్తుడిని సాక్ష్యాధారాలతో పట్టుకొనే ప్రయత్నంలో స్టింగ్ ఆపరేషన్స్ నిర్వహించడం నైతిక విలువలను ప్రశ్నార్ధకంగా మార్చుతాయి. ఒకవేళ నిందితుడికి నేరం చేయాలనే ఉద్దేశ్యం, ఆలోచనా లేకపోయినప్పటికీ, తను నేరం చేసినా ఎవరూ కనుగొనలేరనే భావన అతనిలో కల్పించడం, తద్వారా అతనిని నేరానికి ప్రోత్సహించడం ఏవిధంగా సమర్ధనీయం కాదు. అటువంటి పరిస్థితి నెలకొని ఉందని తెలిసుంటే బహుశః నిందితుడికి నేరం చేయాలనే ఆలోచన చేయకపోవచ్చును. అటువంటప్పుడు ఒక అమాయకుడయిన వ్యక్తిని ఈవిధంగా నేరం చేయడానికి ప్రేరేపించి నేరస్తుడిగా నిరూపించే ప్రయత్నం ఎంత మాత్రం సమర్ధనీయం కాదు. అతను నేరం చేయడానికి అనువయిన పరిస్థితులను స్వయంగా కల్పించి, నేరం చేసినా ఎవరూ కనుగొనలేరనే అభిప్రాయం అతనికి కలిగించి, నేరం చేయడానికి పరోక్షంగా ప్రేరేపించి, అతను నేరం చేస్తున్నపుడు ఈ విధంగా స్టింగ్ ఆపరేషన్స్ చేసి ఒక వ్యక్తిని దోషిగా నిరూపించే ప్రయత్నం కూడా నేరమే! కనుక నైతిక విలువలకు విరుద్దమయిన ‘స్టింగ్ ఆపరేషన్స్’ ద్వారా సేకరించిన ఆధారాలను సాక్ష్యాలుగా స్వీకరించలేము,” అని పేర్కొంది సుప్రీం కోర్టు ధర్మాసనం.   అదే విధంగా రిసాల్ సింగ్ వెర్సస్ హర్యానా ప్రభుత్వం కేసుతో సహా అటువంటి అనేక ఇతర కేసులలో సుప్రీంకోర్టు ‘స్టింగ్ ఆపరేషన్’ నిర్వహించడాన్ని తప్పు పట్టడమే కాకుండా వాటి ద్వారా సేకరించిన సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకోవడానికి నిరాకరించింది. కనుక రేవంత్ రెడ్డిపై ఏసీబీ అధికారులు నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ కూడా కోర్టులు పరిగణనలోకి తీసుకోవని భావించవచ్చును.   ఇక ఇటువంటి వ్యవహారాలలో ఏసీబీ అధికారులు స్వయంగా సేకరించిన ఆధారాలకు తప్ప మూడవ వ్యక్తి అందజేసిన ఆధారాలు అంటే నామినేటడ్ యంయల్యే స్టీఫన్ సన్ లేదా మరొకరో తమ ఫోన్ లో రికార్డు చేసిన సంభాషణలు వంటివి కోర్టులు సాక్ష్యాలుగా స్వీకరించవని న్యాయ నిపుణులు తెలుపుతున్నారు. ఇక రేవంత్ రెడ్డి వ్యవహారంలో జరిగిన మరొక పొరపాటు ఏమిటంటే ఏసీబీ అధికారులు చిత్రీకరించిన ఆడియో వీడియో క్లిప్పింగులను వారికి తెలిసో, తెలియకుండానో ఎవరో బహిర్గతం చేయడం. ఏసీబీ అధికారులు కేవలం నేరస్తుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొనే ఉద్దేశ్యంతోనే రికార్డు చేసిన ఆడియో, వీడియో క్లిప్పింగులను కేవలం నేర విచారణ కోసమే వినియోగించాలి తప్ప మీడియాకు విడుదల చేయకూడదు. కానీ విడుదల చేయబడ్డాయి. అంటే రాజకీయ దురుదేశ్యంతోనే ఎవరో పనిగట్టుకొని ఈ పని చేసినట్లు స్పష్టమవుతోంది.   వాటిని తాము మీడియాకు విడుదల చేయలేదని ఏసీబీ డీజీపి యంఏ.ఖాన్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి ప్రకటించారు. అంటే ఏసీబీ అధికారులు కాకుండా వేరేవరయినా కూడా రికార్డు చేసేందుకు ఏసీబీ అధికారులు అనుమతించారా? లేకపోతే వారే స్వయంగా ఎవరికో అందజేసి మీడియాకు విడుదల చేసి తమకుతెలియదని చెపుతున్నారా? అనే ప్రశ్నకు ఏసీబీ అధికారులు కోర్టులో జవాబు చెప్పవలసి రావచ్చును. ఇక వారు రికార్డు చేసిన ఆడియో, వీడియో టేపులను మీడియాకు విడుదల చేయడం ద్వారా ఒక ప్రజాప్రతినిధిని రాజకీయంగా దెబ్బ తీయాలనే ప్రయత్నం జరిగినట్లు స్పష్టం అవుతోంది కనుక సదరు వ్యక్తులని, ఏసీబీ అధికారులను కూడా కోర్టులు బాధ్యులను చేసే అవకాశమున్నట్లు న్యాయ నిపుణులు చెపుతున్నారు.   ఇక మరో ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే స్టింగ్ ఆపరేషన్ ద్వారా సేకరించిన ఆడియో, వీడియో సాక్ష్యాలను కోర్టులు పరిగణనలోకి తీసుకోవనే చిన్న విషయం నేరస్తులను కనిపెట్టే ఏసీబీ అధికారులకు గానీ, వారిని వెనుక నుండి ప్రోత్సహిస్తున్న వారికి గానీ తెలియకపోవడం. ఏమయినప్పటికీ రేవంత్ రెడ్డి కేసులో అతనిని నేరస్తుడిగా నిరూపించే ప్రయత్నం కంటే ఆయనను, ఆయన పార్టీని రాజకీయంగా దెబ్బతీయాలనే ప్రయత్నమే ఎక్కువగా కనబడుతోంది. ఏసీబి అధికారులు నేర నిరూపణ చేయకముందే వారు రికార్డు చేసిన ఆడియో వీడియోలను మీడియాకు తక్షణమే విడుదల చేయడం, ఏసీబి అధికారులు మాట్లాడవలసిన సాక్ష్యాలు ఆధారాలు వంటి విషయాల గురించి రాజకీయ నాయకులు మాట్లాడటం, కోర్టులు తీర్పు చెప్పకముందే తామే తీర్పులు చెపుతుండటం వంటివన్నీ నిశితంగా గమనిస్తే ఇది రాజకీయ దురుదేశ్యంతో జరిగిందనే అనుమానం కలుగక మానదు.

జగన్ సొంత దర్యాప్తు సంస్థ

వైసీపీ నాయకుడు జగన్ ఎవరికీ ఉపయోగపడని రాజకీయాలు నడపడంతోపాటు  తనకు కావలసిన విధంగా రిపోర్టులు అందించే దర్యాప్తు సంస్థ లాంటిదాన్ని ఏర్పాటు గానీ చేసుకున్నాడా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఆ దర్యాప్తు సంస్థలు మాంఛి క్రియేటివిటీ వున్న రైటర్లు కూడా వున్నారా అనే డౌట్లు వస్తున్నాయి. ఎందుకంటే, ఆయన సొంత మీడియాలో చంద్రబాబుకు వ్యతిరేకంగా అనేక కథనాలు వస్తూ వుంటాయి. ఆ కథనాల్లో ప్రతి విషయం మీద సీబీఐ లాంటి  పెద్ద దర్యాప్తు సంస్థ పరిశోధించిన లెవల్లో వివరాలు ఇస్తూ వుంటారు. కాకిలెక్కలు, ఇదిగో పులి అంటే అదిగో తోక  అనే వివరాలు కూడా సదరు కథనాల్లో కనిపిస్తూ వుంటాయి. మొన్నటి వరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చురుగ్గా వ్యవహరించిన సదరు దర్యాప్తు సంస్థ ఇప్పుడు తెలంగాణలో కూడా తన దర్యాప్తును ప్రారంభించినట్టు అనిపిస్తోంది. మొన్నీమధ్య రేవంత్ రెడ్డి వ్యవహారం జరిగినప్పటి నుంచి జగన్ దర్యాప్తు సంస్థ చాలా యాక్టివ్ అయిపోయింది. ఆ కేసును దర్యాప్తు చేస్తున్న ఏసీబీ కంటే వేగంగా దర్యాప్తు చేసేస్తున్నట్టుంది. అందుకే ఈ అంశం మీద జగన్ మీడియాలో రోజుకు రెండు మూడు కథనాలు వండి వార్చి వడ్డించి కనిపిస్తున్నాయి. ఆ కథనాలు ఎవరైనా అమాయకులు చదివారంటే ముందూవెనుకా ఆలోచించకుండా నమ్మేసేంత పకడ్బందీగా వుంటున్నాయి. ఈ ఇష్యూలో ఉపయోగించిన డబ్బు  హైదరాబాద్‌లోని ఏ బ్యాంకులో డ్రా చేశారు. ఎంత డ్రా చేశారు. ఆ డబ్బు ఎవరి ఇంట్లో పెట్టారు. మిగతా డబ్బు ఏమైంది... ఇలా అసలు జగన్ దర్యాప్తు సంస్థ ప్రతినిధిని దగ్గర పెట్టుకుని ఈ వ్యవహారమంతా నడిపారా అనిపించేంత పకడ్బందీగా పులిహోర కథనాలు అందిస్తున్నారు. జగన్ ఇలా చంద్రబాబు మీద తలాతోకా లేని దర్యాప్తులు చేయకుండా తనమీద సీబీఐ జరుపుతున్న దర్యాప్తుకు సహకరిస్తే బాగుంటుందని పలువురు అంటున్నారు.