తెరాసకు మద్దతు ఇస్తే తప్పేమిటి? జగన్

  ధవళేశ్వరం వద్ద ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారం నాలుగు రోజుల్లో చెల్లించకపోతే విశాఖ కలెక్టరేట్ ని ముట్టడిస్తామని ప్రభుత్వానికి గడువు విధించారు. బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వచ్చిన వ్యక్తి వారిని పరామర్శిస్తే ఎవరూ కాదనరు. వారికి పరిహారం చెల్లించమని ప్రభుత్వాన్ని కోరినా కూడా ఎవరూ తప్పు పట్టరు. కానీ ఆ పనిని ప్రభుత్వం ఎన్ని రోజులలో పూర్తిచేయాలో గడువు పెట్టడం లేకుంటే కలెక్టరేట్ ని ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని బెదిరించడం ఎవరూ హర్షించరు.   ఇక బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వచ్చి ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించడం చూస్తుంటే అసలు అందుకే ఆయన ఈ పరామర్శ యాత్రల కార్యక్రమం పెట్టుకొన్నట్లు అనిపిస్తోంది. ఆయన ఉదేశ్యాలు ఎవయినప్పటికీ ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు ఆయన చాలా ఆసక్తికరమయిన విషయం ఒకటి బయటపెట్టారు. “రెండు రాష్ట్రాలలో తమ పార్టీ కొనసాగుతున్నప్పుడు తాము ఎవరికి మద్దతు ఇచ్చుకొంటే వారికెందుకు?” అని ప్రశ్నించారు.   నిజమే! తెరాసకు వైకాపా మద్దతు ఇచ్చినా, ఆ పార్టీతో పొత్తులు పెట్టుకొన్నా ఎవరూ అభ్యంతరం చెప్పడానికి లేదు. అది ఆ పార్టీల రాజకీయ హక్కు కూడా. కానీ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నామని చెప్పుకొనే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్న తెరాసతో ఎందుకు చేతులు కలుపుతున్నారు? తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలని తెరాసలోకి ఆకర్షించినా ప్రశ్నించకుండా మౌనం వహించడమే కాక మళ్ళీ ఆ పార్టీకే తిరిగి ఎందుకు మద్దతు ఇస్తున్నారు? ప్రజలెన్నుకొన్న తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆ పార్టీ నేతలతో ఎందుకు చేతులు కలిపారని తెదేపా నేతలు ప్రశ్నిస్తున్నారు. కనుక ఆయన తమ పార్టీ తెరాసకు మద్దతు ఇవ్వడం గురించి మాట్లాడే బదులు వారి ప్రశ్నలకు సమాధానం చెపితే బాగుండేది.   వారి వాదోపవాదాలు, వాటి వెనుక ఉద్దేశ్యాలు, వ్యూహాలు ఎలా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న ఆంధ్రా వ్యతిరేక, తెరాస అనుకూల వైఖరి వలన వైకాపా పట్ల రాష్ట్ర ప్రజలలో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకొంటున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాలకు బీజం వేసిన విశాఖనగరంలో నిలబడి రాష్ట్ర విభజనకు కారణమయిన తెరాసకు మద్దతు ఇస్తే ఏమిటి తప్పు? అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడం చూసి రాజకీయ విశ్లేషకులు సైతం విస్మయం చెందుతున్నారు.

గోదావరి తల్లికి ఘనంగా కృతజ్ఞత

  అన్నం పెట్టే అమ్మకి కృతజ్ఞతలు చెప్పడం మానవధర్మం. ఈ ధర్మాన్ని గుర్తు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. గోదావరి తల్లి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజల్ని తన బిడ్డల్లా కాపాడుకుంటూ వస్తోంది. ఆ తల్లి దయవల్ల ఎన్నో జీవితాలు నిలబడుతున్నాయి. మహారాష్ట్ర పుట్టిల్లు అయిన గోదావరి తల్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెట్టినింటికి చేరుతూ వుంటుంది. పుట్టింటి నుంచి మెట్టినింటికి చేరే మధ్యలో ఎన్నో జీవితాలను వెలిగిస్తోంది. నీటితో దీపాలు వెలగడం అంటే ఇదేనేమో. అలాంటి అమ్మకి కృతజ్ఞతలు చెప్పుకోవడం అందరి బాధ్యత. గోదావరి సముద్రుడిలో కలిసేముందు గోదావరికి ప్రతి నిత్యం హారతి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడం, ఆ కార్యక్రమాన్ని వైభవంగా ప్రారంభించడం అభినందనీయమైన విషయం. తన బిడ్డలు తనకు ప్రతినిత్యం హారతి ఇస్తూ ఘనంగా వీడ్కోలు పలుకుతూ వుంటే ఆ తల్లి ఎంతగా సంతోషిస్తుందో... తన బిడ్డలను ఇంకా ఎంత బాగా ఆదరిస్తుందో. గోదావరి మూడు రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. అయితే ఆ గోదావరి తల్లి పేరును పెట్టుకున్న జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వున్నాయి. ఆ తల్లి అంటే ఈ ఆంధ్రజాతికి అంత ప్రేమ. ఆ ప్రేమను చాటుకునే అవకాశం, ఘనంగా కృతజ్ఞతలు తెలుపుకునే అవకాశం దక్కిన ఏపీ ప్రజలు ధన్యులు.

తెలంగాణా ప్రభుత్వమే రేవంత్ రెడ్డిని హీరోని చేస్తోందా?

  ఊహించినట్లే రేవంత్ రెడ్డి బెయిల్ రద్దు చేయమని కోరుతూ ఎసిబి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఒకవేళ సుప్రీంకోర్టు ఎసిబి విన్నపాన్ని మన్నించితే రేవంత్ రెడ్డిని మళ్ళీ జైలుకి పంపించవచ్చు. అలాకాక ఒకవేళ సుప్రీంకోర్టు కూడా రేవంత్ రెడ్డికి బెయిలు మంజూరు చేయడాన్ని సమర్ధిస్తే ఇక ఆయనని అడ్డుకోవడం తెలంగాణా ప్రభుత్వానికి చాలా కష్టం అవుతుంది. కనుక మున్ముందు ఏ మునిసిపాలిటీవాళ్ళో లేక ఆదాయపన్ను శాఖ వాళ్ళో లేకపోతే ఏ విద్యుత్ శాఖ వాళ్ళో మరొకరో ఏదో ఒక తప్పు కనిపెట్టి ఆయనపై చర్యలు తీసుకొన్నా ఆశ్చర్యం లేదు. బహుశః ఆ ప్రయత్నంలో భాగంగానే అందరూ ఊహించినట్లే ఆయన మీద హైదరాబాద్ పోలీసులు కొత్తగా మరో మూడు కేసులు నమోదు చేసారు.   ఆయన చర్లపల్లి జైలు నుండి నిన్న సాయంత్రం విడుదలయిన తరువాత పోలీసుల అనుమతి లేకుండా భారీ ఊరేగింపు నిర్వహించడం, ఆ కారణంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం, ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగించారనే ఆరోపణలతో ఆయనపై మల్కాజిగిరి, కుషాయిగూడా పోలీస్ స్టేషన్లలో సెక్షన్స్ 341, 188, 506, 509 క్రింద కేసులు నమోదు చేసారు. ఒకవేళ రేపు సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడాన్ని సమర్ధించినట్లయితే వీటిలో ఏదో ఒక కేసుతో మళ్ళీ ఆయనని జైలుకి పంపిస్తారేమో?   ఇదివరకు జగన్మోహన్ రెడ్డి జైలు నుండి విడుదలయినప్పుడు ఇంతకంటే చాలా భారీ ఊరేగింపు నిర్వహించారు. కానీ అప్పుడు ఆయనపై ఎటువంటి కేసులు నమోదు చేయలేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద మాత్రం కేసులు నమోదు చేస్తున్నారు. ఏమంటే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక దానితో తమకు సంబంధం లేదని తెలంగాణా ప్రభుత్వం వాదించవచ్చును. కానీ  ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇటువంటివి జరిగినప్పుడు ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది. కానీ వారు కూడా అప్పుడు దానిని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం పట్టించుకొంటున్నారు? ఎందువల్ల?   రేవంత్ రెడ్డిపై ఇటువంటి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పూనుకొన్న తెలంగాణా ప్రభుత్వమే ఆయనను 'తెలంగాణా హీరో'గా ఎదిగేందుకు తోడ్పడిందని తెదేపా నేతల వాదనలో ఎంతో కొంత నిజం లేకపోలేదు. రేవంత్ రెడ్డి ఈ కేసులో దోషా నిర్దోషా అనే విషయాన్ని పక్కనబెట్టి చూస్తే తెలంగాణా ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు, ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నందుకే ఆయనను ఈకేసులో ఇరికించారని సామాన్య ప్రజలు సైతం అభిప్రాయ పడుతున్నారు. ఆ కారణంగా ప్రజలలో ఆయన పట్ల కొంత సానుభూతి ఏర్పడింది. ఆ కేసు సంగతి తేలక ముందే ఇప్పుడు మళ్ళీ మరో మూడు కేసులు నమోదు చేయడంతో తెలంగాణా ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే ఆయనపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందనే భావన ప్రజలలో వ్యాపించేందుకు అవకాశం కలుగుతోంది. తెలంగాణా ప్రభుత్వం ఆశిస్తున్నది ఒకటయితే జరుగుతున్నది మరొకటి.        

కేసీఆర్ని రేవంత్ రెడ్డి ఏరకంగా తిట్టాడంటే...

జైలు నుంచి బెయిల్ మీద విడుదలైన రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ని ఎలా తిట్టాడంటే... * నాకు బెయిల్ వచ్చేసరికి కేసీఆర్‌కి జ్వరం వచ్చింది. * కేసీఆర్‌కి జ్వరం రావడం మాత్రమే కాదు... లాగూ తడుస్తోంది. * కేసీఆర్ అబద్ధాలని శాసనసభ సాక్షిగా నిలదీసినందుకే నామీద కేసు * కేసీఆర్ సన్నాసి. * టీఆర్ఎస్ మంత్రులందరూ సన్నాసులు. పాత చెప్పుతో కూడా సమానం కానివాళ్ళు. * కేసీఆర్ తాగుబోతు. * కేసీఆర్ దుబాయి ఏజంటు. కేసీఆర్ బతుకేంటో హరీష్ రావు తన కన్నతల్లిని అడిగి తెలుసుకోవాలి. * కేసీఆర్ తెలంగాణ జాతిపితా? ఆ జాతిపితకి మందు వాసనే తెలియదు. కానీ ఈ కేసీఆర్ సన్నాసి రెండు వేస్తేగాని లేవడు.. నాలుగు వేస్తేగాని కోర్చోడు. అట్లాంటోడు తెలంగాణకు జాతిపిత అవుతాడా? *  కేసీఆర్ అవినీతి పురాణం చదవడానికి జైల్లో అవకాశం దొరికింది. * కేసీఆర్ని గద్దె దించడం కోసమే ఇక పనిచేస్తా. * కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు కాళ్ళతో తొక్కేట్టు చేస్తా. * కేసీఆర్‌లో ప్రవహించేది తెలంగాణ రక్తమే అయితే, ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్‌లో చేర్చుకున్న సన్నాసుల చేత రాజీనామాలు చేయించాలి. * హరీష్ రావు సన్నాసి మెదడు మోకాల్లో వుంది. * సన్నాసి, బద్మాష్ కేసీఆర్ తెలంగాణ తెచ్చాడంట.. ఢిల్లీలో సన్నాసులు తెలంగాణ ఇచ్చారంట.. అలా అయితే తెలంగాణ కోసం చనిపోయిన 1200 మంది ఎవరి బిడ్డల్రా?

మీడియాకి ధైర్యం వచ్చింది

  తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకూ మీడియా పిరికిదైపోయింది. అధికారంలో వున్న టీఆర్ఎస్‌కి వ్యతిరేకంగా ఏ వార్త రాయాలన్నా, ఏ కథనాన్ని ప్రసారం చేయాలన్నా మీడియా భయపడిపోయేది. ఎందుకంటే టీవీ9, ఏబీఎస్ ఛానెళ్ళ మీద లోపాయికారీగా విధించిన నిషేధం మీడియా మీద బాగా ప్రభావాన్ని చూపించింది. మీడియా మొత్తం హైదరాబాద్‌లో కేంద్రీకృతమైన నేపథ్యంలో, మీడియా మొత్తం ఆంధ్రపదేశ్‌తోపాటు తెలంగాణలో కూడా విస్తరించిన నేపథ్యంలో, మీడియాకి కూడా అర్థిక అవసరాలు వుంటాయి కాబట్టి మీడియా కేసీఆర్‌కి వ్యతిరేకంగా కథనాలు ఇవ్వడానికి భయపడేది. పొరపాటునో, గ్రహపాటునో ఏదైనా కథనం రాస్తే తమకు కూడా టీవీ9, ఏబీఎన్‌ ఛానెళ్ళకు పట్టిన గతే పడుతుందేమోనని మీడియా భయపడింది. టీవీ9 టీఆర్ఎస్‌తో రాజీకి వచ్చి తనమీద వున్న నిషేధాన్ని తొలగించుకున్నప్పటికీ, ఏబీఎన్ మాత్రం ఇప్పటికీ నిషేధ కోరల్లో వుంది. ఇలాంటి పరిస్థితుల్లో లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకని మీడియా చాలా బేలన్సింగ్‌గా వ్యవహరిస్తూ వస్తోంది. ఆర్థిక పునాదుల మీద దెబ్బకొట్టే టీఆర్ఎస్‌తో పెట్టుకోవడం ఎందుకని సర్దుకుపోతూ వస్తోంది. కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే తమ మీద ‘ఆంధ్రా మీడియా’ అనే ముద్ర వేసి అణిచేస్తే, మళ్ళీ పైకి లేవగలమో లేదోనన్న భయంతో బతుకుతూ వస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి తప్పులు చేసినా, కేసీఆర్ ఎంత పచ్చిగా ఆంధ్రావాళ్ళను తిట్టినా వాటిని విమర్శించకుండా నెట్టుకొస్తోంది. ఏనుగును కొంతకాలం గొలుసుతో కట్టేయడం అలవాటు చేసి, ఆ తర్వాత కాలికి గొలుసు వుంచి బంధించకపోయినా ఆ ఏనుగు తాను బందీగానే వున్నాననుకుని అక్కడి నుంచి కదలడట. మొన్నటి వరకూ తెలుగు మీడియా పరిస్థితి అలాగే వుండేది. అయితే ఓటుకు నోటు వ్యవహారం, ట్యాపింగ్ వ్యవహారం తర్వాత తెలుగు మీడియా ఎందుకో భయాన్ని వదిలేసింది. ఇప్పుడు అనేక ఛానళ్ళలో, వార్తా పత్రికలలో కేసీఆర్‌కి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కథనాలు వస్తున్నాయి. టీఆర్ఎస్, వైసీపీ ఆశీస్సులతో నడిచే మీడియాలో మినహా మిగతా మీడియా అంతటా టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేక కథనాలు వస్తూనే వున్నాయి. మీడియాకి వచ్చిన ఈ ధైర్యం కలకాలం కొనసాగాలి.

హేట్సాఫ్ టీడీపీ

  తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ  నాయకులు, కార్యకర్తలు మనస్పూర్తిగా హ్యాట్సాఫ్ చెబుతున్నారు. చాలా రాజకీయ పార్టీలు కార్యకర్తలను, నాయకులను కూరలో కరివేపాకులా వాడుకుని అవతల పారేస్తూ వుంటాయి. అయితే మొదటి నుంచి తెలుగుదేశం పార్టీది కార్యకర్తలను, నాయకులను గుండెలో పొదువుకుని కాపాడుకునే పార్టీ. అందుకే తెలుగుదేశం పార్టీని తాలు, వేస్టేజీ లాంటి నాయకులు వదలి వెళ్ళిపోయారే తప్ప అసలైన నాయకులు, కార్యకర్తలు పార్టీకి ఎప్పుడూ వెన్నంటే వున్నారు. తెలుగుదేశం పార్టీ పట్ల కృతజ్ఞతను కనబరుస్తూనే వున్నారు. పార్టీ పదేళ్ళపాటు అధికారంలో లేని సమయంలో కూడా పార్టీ జెండాలు భుజాన పెట్టుకుని మోశారు. అధికార పార్టీల కుయుక్తులను ఎదుర్కుంటూ పోరాటాలు చేశారు. అలాంటి కార్యకర్తలు, నాయకుల పట్ల తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కృతజ్ఞతా భావాన్ని ప్రదర్శిస్తూనే వుంటుంది. అందుకే పార్టీ నాయకత్వానికి, పార్టీ శ్రేణులకు మధ్య వున్న ఆత్మీయతానుబంధం నిరంతరం పెరుగుతూనే వుంటుంది. పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తల కోసం, వారి రక్షణ కోసం తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రపంచంలోని ఏ పార్టీ చేయడం లేదని చెప్పుకోవచ్చు. పార్టీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ ఎంత అండగా వుంటుందో తాజాగా జరిగిన రేవంత్ రెడ్డి ఉదంతం ఒక ఉదాహరణగా నిలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా పన్నిన కుట్రలో రేవంత్ రెడ్డి ఇరుక్కున్న సమయంలో తెలుగుదేశం పార్టీ ఆయనకు, ఆయన కుటుంబానికి అండగా నిలిచిన తీరు ఆ పార్టీ కార్యకర్తల చేత హేట్సాఫ్ చెప్పించుకుంటోంది. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మద్దతు కారణంగానే రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబం ఎంతో ధైర్యంగా సమస్యను ఎదుర్కొన్నారు. పార్టీ ఇచ్చిన ధైర్యమే రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పన్నిన పద్మవ్యూహంలోంచి పాక్షికంగా బయటపడటానికి కారణమైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి బెయిల్ ద్వారా విడుదలైన శుభ సందర్భంలో కార్యకర్తలు అందరూ తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డికి అండగా నిలిచిన తీరును గుర్తు చేసుకుంటున్నారు. జైలు నుంచి బయటకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్లో కూడా ఆయనకు తెలుగుదేశం పార్టీ మీద వున్న కృతజ్ఞతాభావం ఎంతో స్పష్టంగా కనిపించింది.

ఇక స్క్రాప్ మీద టీఆర్ఎస్ దృష్టి

  ఆపరేషన్ ఆకర్ష పథకం ద్వారా మొన్నటి వరకూ తెలుగుదేశం, కాంగ్రెస్, వైసీపీ తదితర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను గుంజుకున్న టీఆర్ఎస్ భవిష్యత్తులో మరికొంతమంది ఎమ్మెల్యేల మీద ఆకర్ష పథకాన్ని ప్రయోగించే అవకాశం లభించడం లేదు. రేవంత్ రెడ్డి వ్యవహారం తర్వాత టీఆర్ఎస్‌లోకి ఎమ్మెల్యేల వలస ఇక నిలిచిపోయినట్టేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఎమ్మెల్యేని తమ పార్టీలోకి జంప్ చేయించుకున్నా అది తెలంగాణ ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపే అవకాశం వుందని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ ప్రజల్లో టీఆర్ఎస్ అమలు చేసిన ఆకర్ష పథకం మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రేవంత్ రెడ్డి చేసింది నేరం అయితే, ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు నిధులు ఆశ చూపించి తమ పార్టీలోకి లాక్కున్న టీఆర్ఎస్ నాయకులు చేసింది కూడా నేరమేనన్న అభిప్రాయాన్ని తెలంగాణ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే, రేవంత్ రెడ్డి చేసింది తప్పే అయితే, టీఆర్ఎస్ చేసింది అంతకు వందల రెట్లకు మించిన తప్పు అని తెలంగాణ ప్రజలు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను కాకుండా వివిధ పార్టీల్లో మిగిలిపోయిన డి.శ్రీనివాస్ లాంటి స్క్రాప్‌ని టీఆర్ఎస్‌లోకి తీసుకోవడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. వైసీపీకి చెందిన ఒక లేడీ మాజీ ఎమ్మెల్యేగారు కూడా త్వరలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఇదే తరహాలో వివిధ పార్టీల్లో పనీపాటా లేకుండా, పదవి లేకుండా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చున్న రాజకీయ నిరుద్యోగులను భారీ సంఖ్యలో టీఆర్ఎస్‌లోకి చేర్చుకోవాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తున్నట్టు పరిశీలకులు చెబుతున్నారు.

లోకేష్ వ్యాఖ్యలతో శత్రు శిబిరంలో వణుకు

  తండ్రి చంద్రబాబు నాయుడిలోని రాజకీయ పరిణతి నారా లోకేష్ ప్రతి అడుగులోనూ కనిపిస్తూ వుంటుంది. ఆయన మాట్లాడే ప్రతి మాటలోనూ చంద్రబాబు మాటలాగానే ఎంతో లోతు వినిపిస్తూ వుంటుంది. తాజాగా నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ‘శత్రు శిబిరం’లో వణుకునుపెంచాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పేరు చెబితేనే ఉలిక్కిపడుతూ వణికిపోతున్న ‘శత్రు శిబిరం’ నాయకులు తాజాగా లోకేష్ చేసిన వ్యాఖ్యలు విని కెవ్వుమంటున్నారు. కుట్రపూరితంగా పన్ని పథకాలతో తెలుగుదేశం పార్టీని అప్రతిష్టపాలు చేయాలని ప్రయత్నించిన ఆ శత్రువులు ఇప్పుడు తాము పన్నిన కుట్రల బురదలో తామే చిక్కుకుని విలవిలలాడుతున్నారు. చంద్రబాబును బద్నాం చేసే సంగతి, తెలుగుదేశం పార్టీని వేధించే సంగతి తర్వాత.. ముందు తాము వున్న బురదలోంచి, ఊబిలోంచి ఎలా బయటపడాలా దేవుడా అని గుర్తొచ్చిన దేవుళ్ళందర్నీ వేడుకుంటున్నారు. తాజాగా నారా లోకేష్ కార్యకర్తలతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ‘శత్రు శిబిరం’ మీద బలమైన ప్రభావాన్ని చూపించాయి. తమ నాయకుడు చంద్రబాబు నాయుడికి శత్రు శిబిరం నుంచి నోటీసులు వస్తే అది చంద్రబాబు నెత్తిన పాలు పోసినట్టుగా తాము భావిస్తామని, నోటీసులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నామని ఆయన అన్నారు. ఆ మాటల్లోని ఆత్మవిశ్వాసమే చెబుతోంది... శత్రు శిబిరంలో వున్నవారి పిలకలు ఏపీ ప్రభుత్వం చేతిలో వున్నాయని. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబుకు నోటీసులకు పంపే దుస్సాహసం చేసే దమ్ము సదరు శత్రువులకు వుండదు. నారా లోకేష్ చేసిన ఈ కామెంట్లు తెలుగుదేశం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాయి. పనిలో పనిగా శత్రు శిబిరంలో వణుకును పెంచాయి.

కేసీఆర్‌కి థాంక్స్ చెప్పాలి.. ఎందుకంటే...

  కేసీఆర్‌కి తెలంగాణ ప్రజలు, తెలంగాణ తెలుగుదేశం నాయకులు మనస్పూర్తిగా థాంక్స్ చెప్పాలి. అదేంటీ.. తన విధానాల ద్వారా ప్రజలకు టెన్షన్ పుట్టిస్తున్న కేసీఆర్‌కి తెలంగాణ ప్రజలు ఎందుకు థాంక్స్ చెప్పాలి? అలాగే తమను సాధిస్తూ, వేధిస్తున్న కేసీఆర్‌కి తెలంగాణ తెలుగుదేశం నాయకులు ఎందుకు థాంక్స్ చెప్పాలి అనే సందేహం వచ్చింది కదూ? అవును... పైన పేర్కొన్న ఇద్దరూ నిజంగానే కేసీఆర్‌కి థాంక్స్ చెప్పాలి... ఎందుకంటే, తెలంగాణ తెలుగుదేశం నాయకుడు రేవంత్ రెడ్డి రాజకీయంగా పవర్ ఫుల్‌గా మారడానికి కారణం కేసీఆర్ కారణం కావడం వల్లే... రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అనే నమ్మకాన్ని ప్రజల్లో బలంగా నాటుకునేలా చేసిన వ్యక్తి కేసీఆర్ కావడం వల్లే... కేసీఆర్ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత వున్న వ్యక్తి ఎవరా అనే అన్వేషణలో వున్న తెలంగాణ ప్రజలకు ‘రేవంత్ రెడ్డి’ అనే పేరును స్పష్టంగా తెలియజేసినందువల్లే కేసీఆర్‌కి థాంక్స్ చెప్పాలి. మొన్నటి వరకూ.... అంటే, కుట్రపూరితంగా రేవంత్ రెడ్డిని జైలుకు పంపేంత వరకూ రేవంత్‌రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ పవర్ ఫుల్ అనుకుంటే, ఈ ఓటుకు నోటు వ్యవహారం తర్వాత రేవంత్ రెడ్డి థౌజండ్ పర్సెంట్‌గా ప్రజల దృష్టిలో ఎదిగిపోయారు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు రేవంత్ రెడ్డిలో తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రిని చూస్తున్నారు. ఆ ఊహను నిజం చేయాలన్న ఆసక్తి కూడా ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో ఏర్పడింది. నిజానికి తన ఇమేజ్‌ని అమాంతం పెంచేసిన కేసీఆర్‌కి రేవంత్ రెడ్డి కూడా థాంక్స్ చెప్పాలి.

మ్యావ్ అన్న ‘బొబ్బిలిపులి’

  మొన్నటి వరకూ గాండ్రించిన ‘బొబ్బిలిపులి’ ఇప్పుడు మ్యావ్ అంటూ వినయాన్ని ప్రకటిస్తోంది. ఇంతకీ ‘బొబ్బిలిపులి’ అంటే ఇదేదో బొగ్గు కుంభకోణంలో ఇరుక్కుపోయిన దాసరి నారాయణరావుకు సంబంధించిన మేటర్ అనుకోకండి.. బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావుకు సంబంధించిన మేటర్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సుజయ కృష్ణ గత కొంతకాలంగా పార్టీ నాయకత్వం మీద ఆగ్రహంగా వున్నారు. అప్పట్లో బొత్స సత్యనారాయణను పార్టీలోకి తీసుకురావాలన్న ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ఆయన ఆగ్రహం ప్రారంభమైంది. బొత్స అంటే తనకు ఎంతమాత్రం పడదని, ఆయన్ని పార్టీలోకి తీసుకుంటే తాను పార్టీకి రాజీనామా చేస్తానని ఆయన బెదిరించారు. ఆయన ఎంత బెదిరించినా పార్టీ నాయకత్వం ఎంతమాత్రం పట్టించుకోలేదు. తమ ఎమ్మెల్యే మాటలను పెడచెవిన పెట్టి మరీ బొత్సని పార్టీలోకి తీసుకున్నారు. అప్పటి నుంచి సుజయ కృష్ణ ఆగ్రహంతో గాండ్రిస్తున్నారు. నేడో రేపో ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పడం ఖాయమని అందరూ అనుకున్నారు. వైసీపీలోని నాయకులు చాలామంది ఈ పరిణామం జరగటం ఖాయమని ఫిక్సయిపోయారు. సుజయ కృష్ణ అనుచరులందరూ పార్టీకి గుడ్ బై చెప్పాల్సిందేనని ఫిక్సయిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన్ని పార్టీ అధ్యక్షుడు జగన్ పిలిపించి చర్చలు జరిపారు. జగన్ని కలసినప్పుడు సుజయ్ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటిస్తారని, పులిలా గాండ్రిస్తారని అందరూ అనుకున్నారు. అయితే జగన్ని కలిసి బయటకి వచ్చిన తర్వాత ఆయన తాను వైసీపీని వీడబోనంటూ పిల్లిలా మ్యావ్ అన్నారు. సుజయ్ ప్రదర్శించిన ఈ ధోరణి ఆయన అనుచరులకే నచ్చడం లేదు.

మోడీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ మాన్ సూన్ ఆఫర్

  సాధారణంగా వ్యాపారులు మాత్రమే పండగలు, వివిధ సీజన్లలో ప్రజలను ఆకట్టుకొనేందుకు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తుంటారు. కానీ రాజకీయ పార్టీలు కూడా మంత్రి పదవులు, రాజ్యసభ టికెట్లో లేక ఏదో ఒక బంపర్ ఆఫర్లు ఇచ్చి ఎదుటపార్టీ నేతలని ఆకర్షిస్తుంటాయి. అటువంటివెన్ని చేసినా అవి నైతికమయినవేనని కానీ దొరికిపోతే మాత్రం చాలా తీవ్ర నేరం చేసినట్లేనని ఒక నిశ్చితాభిప్రాయంతో ఉంటాయి.   ఇక విషయంలోకి వస్తే ఈనెల 21నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలవుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మోడీ ప్రభుత్వానికి ఒక బంపర్ ఆఫర్ ఇస్తోంది. అదేమిటంటే ఆర్ధిక నేరస్తుడు లలిత్ మోడీకి సహాయపడినందుకు రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుందర రాజే, విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ ఇరువురినీ పదవులలో నుండి తొలగించినట్లయితే, తమ పార్టీ మోడీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (జి అండ్ బి)బిల్లు ఆమోదానికి సహకరిస్తుందని సూచించింది. లేకుంటే ఈ వర్షాకాల సమావేశాలలో ప్రతిపక్ష పార్టీలతో కలిసి వారిరువురి రాజీనామాకి పట్టుబట్టడం ఖాయమని సూచించింది.   ఇంతకు ముందు మోడీ ప్రభుత్వం ఈ జి అండ్ బి బిల్లుని ప్రవేశపెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ దానిలో ఐదు సవరణలు సూచించింది. 1.ఈ బిల్లులో పొగాకు మరియు విద్యుత్ పరికరాలపై పన్ను చేర్చడం. 2. అందుకు పరిహారంగా సదరు ఉత్పత్తులు చేస్తున్న రాష్ట్రాలకు 1 శాతం పన్ను మినహాయింపు. 3. ఈ పరిహార విధానాన్ని బిల్లులో పొందు పరచడం. 4. ఇదివరకు తొలగించిన వివాదాల పరిష్కార యంత్రాంగాన్ని తిరిగి ఈ బిల్లులో పొందు పరచడం. 5. వివిధ కేటగిరీలకు గరిష్ట పన్ను పరిమితిని ఈ బిల్లులో పొందుపరచడం.   మోడీ ప్రభుత్వం ఈ బిల్లును చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది కానీ రాజ్యసభలో దానిని ఆమోదింప జేసుకోనేందుకు ఎన్డీయే కూటమికి తగినంత సంఖ్యా బలం లేదు కనుక కాంగ్రెస్ ఇస్తున్న ఈ బంపర్ ఆఫర్ చాలా ఆలోచించదగ్గదే. కానీ అందుకు అంగీకరిస్తే కాంగ్రెస్ పన్నిన వలలో చిక్కుకొన్నట్లే అవుతుందని మోడీ ప్రభుత్వానికి తెలుసు. కాంగ్రెస్ కోరినట్లుగా ఇరువురు మంత్రులను తొలగిస్తే తన నేరాన్ని ఒప్పుకొన్నట్లవుతుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో దేశ వ్యాప్తంగా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేబట్టి మరింత అప్రదిష్టపాలు చేస్తుంది.   ఇక పార్టీలో సీనియర్ నేతలయిన సుష్మా, రాజేలను బలవంతంగా పదవులలో నుండి తొలగిస్తే వారు అసంతృప్తికి గురవుతారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుందరా రాజే అయితే తిరుగుబాటు చేసేందుకు కూడా సిద్దమని సంకేతాలు ఇదివరకే పంపారు. కనుక ఎట్టి పరిస్థితులలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న బంపర్ ఆఫర్ ని మోడీ ప్రభుత్వం స్వీకరించే ప్రసక్తే లేదు.   కాంగ్రెస్ పార్టీ సూచించిన జి అండ్ బి బిల్లులో సూచించిన సవరణలపై అధ్యయనం చేయడానికి ఇదివరకే రాజ్యసభ సభ్యులతో కూడిన ఒక స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేయడం అయింది. ఆ కమిటీ ఆమోదం తెలిపితే బిల్లులో కాంగ్రెస్ సూచించిన సవరణలు చేసే అవకాశంశం ఉంది. అప్పుడు ఎలాగూ కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలు ఆ బిల్లుకి మద్దతు తెలుపవచ్చునని బీజేపీ భావిస్తోంది.

కేసీఆర్ విందుకు వెళ్తే బాగుండేది

రేవంత్ రెడ్డి బెయిల్ దెబ్బకి కేసీఆర్‌కి జ్వరం వస్తే  వచ్చింది... రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ నరసింహన్ ఏర్పాటు చేసిన విందుకు సతీసమేతంగా వెళ్ళి వుండాల్సిందని టీఆర్ఎస్ వర్గాలు అనుకుంటున్నట్టు సమాచారం. ఇప్పుడు కేసీఆర్ ఆ విందుకు హాజరు కాకపోవడం వల్ల... ఆయనకు నిజంగానే జ్వరం వచ్చిందో... లేక చంద్రబాబును ఫేస్ చేయలేకే ఆయన జ్వరం వచ్చిందన్న సాకు చెప్పారోనని గిట్టని వారు అనడం తమకు బాధను కలిగిస్తోందని వారు వాపోతున్నారట. వారికి ఇంకా బాధను కలిగిస్తున్న అంశాలు ఇంకా చాలా వున్నాయి. మొగుడు కొట్టినందుకు కాదు.. తోడికోడలు నవ్వినందుకే అన్నట్టుగా, కేసీఆర్ ఆ విందుకు వెళ్ళని విషయం అలా వుంచితే, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆ విందుకు వెళ్ళారు... అదీ అసలు సమస్య. రాష్ట్రపతిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళిన కేసీఆర్ దఢేల్మని ఆయన కాళ్ళమీద పడిపోయారు అంతవరకూ ఓకే. రాష్ట్రపతి విమానం దిగిన హకీంపేట జీహెచ్ఎంసీ పరిధిలో లేదు కాబట్టి, అక్కడ తనకు సరైన స్థాయిలో గౌరవం లభించదు కాబట్టి చంద్రబాబు రాష్ట్రపతిని రిసీవ్ చేసుకోలేకపోయారు. అయితే ఆ తర్వాత చంద్రబాబు రాష్ట్రపతిని ప్రత్యేకంగా కలిశారు. గవర్నర్ విందు సందర్భంగా మరోసారి కలిశారు. రాష్ట్రపతి తిరుపతి పర్యటన సందర్భంగా ఇంకోసారి కలుస్తారు. వీలయితే మరో రెండుమూడుసార్లు రాష్ట్రపతిని కలిసే అవకాశం వుంది. ఈ భేటీల్లో చంద్రబాబు రాష్ట్రపతిని ఇంప్రెస్ చేసి కేసీఆర్ కంటే ఎక్కువ మార్కులు కొట్టేస్తే ఎలా అనే బాధ ఇప్పుడు టీఆర్ఎస్ వర్గాలను పీడిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే జ్వరం నిజంగానే వచ్చిందో లేదో తెలియదుగానీ, ఒకవేళ నిజంగానే జ్వరం వచ్చినా పారాసెట్మాల్ టాబ్లెట్ వేసుకుని అయినా విందుకు వెళ్తే బాగుండేదన్న అభిప్రాయాలు టీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

దాసరికి ఇది పద్ధతేనా?

ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు గతంలో మంచి మంచి సినిమాలు తీశారు. దర్శకుడిగా ఆయన ఈమధ్యకాలంలో వరుసగా ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్నప్పటికీ, ఆయన దర్శకుడిగా ఒక లెజెండ్. శతాధిక చిత్ర దర్శకుడిగా తెలుగు సినిమా రంగానికి అంతర్జాతీయ గౌరవం తెచ్చిన దర్శకుడు. తెలుగు సినిమా రంగం భారతీయ సినిమా రంగం ముందు తలెత్తుకుని నిలబడే విధంగా సినిమాలు తీసిన దర్శకుడు. అంతవరకూ ఓకే.. రాజకీయాల విషయానికి వస్తే మాత్రం ఆయన వైఖరి, వ్యవహారశైలి ఎంతమాత్రం సమర్థనీయం కాదు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి, ప్రజలకు రాజకీయంగా ఎంత సేవ చేశారో తెలుగు ప్రజలకు ఒక్క ముక్క కూడా తెలియదుగానీ, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియాగాంధీ మాత్రం ఆయన చేసిన ‘సేవను’ గుర్తించేసి ఆయనకు రెండుసార్లు రాజ్యసభ ఎంపీ పదవి, ఒకసారి కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. సరే, ఆయనకు పదవులు ఎందుకు ఇచ్చారన్న విషయం పక్కన పెడితే, బొగ్గు శాఖ సహాయమంత్రిగా ఆయన పనిచేసిన తీరు మాత్రం అక్షేపణీయం అయింది. బొగ్గు క్షేత్రాల కుంభకోణంలో ఆయన పాత్ర కూడా వుందని, ఆయన అవినీతికి పాల్పడినందువల్లే ఆయనకు చెందిన సంస్థలో ఆయన ద్వారా లాభం పొందిన వారు పెట్టుబడులు పెట్టారన్నది ఆయనపై వచ్చిన ఆరోపణలు. ఈ విషయంలో సీబీఐ దాసరి నారాయణరావుతోపాటు మొత్తం 14 మంది మీద చార్జిషీటు దాఖలు చేసింది. సాక్షాత్తూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ని కూడా సీబీఐ విచారించింది. తాజాగా దాసరి నారాయణరావును మరోసారి సీబీఐ విచారించింది. ఆయన మంగళవారం నాడు ఢిల్లీలోని సీబీఐ కోర్టుకు హాజరై తన వాదన వినిపించారు. కుంభకోణంతో తనకు ఎంతమాత్రం ప్రమేయం లేదని, ప్రధానికి తెలియకుండా తానేమీ చేయలేదని, తాను కేవలం సహాయమంత్రిగానే పనిచేశానని, బొగ్గు శాఖకు ప్రధానమంత్రే ఇన్‌ఛార్జ్ మంత్రిగా వున్నారని చెప్పారు. ఇది దాసరి ఈ కేసును పూర్తిగా మన్మోహన్ సింగ్ మీదకి నెట్టేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోందని రాజకీయ పరిశీకులకులు అంటున్నారు. కేంద్ర మంత్రిగా హోదా అనుభవించిన దాసరి ఇప్పుడు కేసుల విషయానికి వచ్చేసరికి తనకెంతమాత్రం సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేయడం దారుణమని అంటున్నారు.

అడ్డెడ్డే.. ఇంతలోనే జ్వరమా?

  సాధారణంగా కొంతమందికి గుండె గుభేల్‌మంటే, హఠాత్తుగా ఉలిక్కిపడేతే జ్వరం వచ్చేస్తూ వుంటుంది. మరి తెలంగాణ ప్రభుత్వం ఎంతగా ప్రయత్నించినా రేవంత్ రెడ్డికి బెయిల్ వచ్చిందంటే, ముఖ్యమంత్రి కేసీఆర్‌కి గుండె గుభేల్‌మని, ఆయన హఠాత్తుగా ఉలిక్కిపడినట్టున్నాడు. అందుకే ఆయనకు జ్వరం వచ్చేసింది. రేవంత్ రెడ్డికి బెయిల్ వచ్చిందన్న వార్త బయటకి వచ్చిన కాసేపటికే కేసీఆర్‌కి జ్వరం వచ్చిందన్న వార్త వచ్చింది. దీన్నిబట్టి కేసీఆర్‌కి జ్వరం రావడానికి రేవంత్ రెడ్డికి బెయిల్ రావడమేనని అర్థం చేసుకోవాల్సి వస్తోంది. అయినా కేసీఆర్ లాంటి ఘటికుడు ఈమాత్రం దానికే జ్వరం తెచ్చుకోవడమేంటో. ఇంత చిన్న విషయానికే జ్వరం తెచ్చుకుంటే, భవిష్యత్తులో ఎదురయ్యే అనేక విషయాలను ఎలా తట్టుకుంటారో ఏంటో. రేవంత్ రెడ్డిని ఏసీబీ అరెస్టు చేసినప్పుడు ఆయన మీసం మెలిపెడుతూ చేసిన ప్రతిజ్ఞ కేసీఆర్‌కి గుర్తుండే వుంటుంది. మరి ఇప్పుడు బెయిల్ లభించిన రేవంత్ రెడ్డి తనకు జరిగిన దానికి అంతకు అంత ప్రతీకారం తీర్చుకోకుండా వుంటారా? మామూలుగానే రేవంత్ రెడ్డి అంటే అధికార పక్షానికి గుండెలో గుబులు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దెబ్బతిన్న పులి. ఆయన భవిష్యత్తులో ఎలా స్పందించబోతున్నారో... ఏమేం చేయబోతున్నారో.. మరి ఆ పరిణామాలన్నిటికీ కేసీఆర్‌ జ్వరం ఇంకా ఎన్ని డిగ్రీలు పెరిగిపోతుందో!

అక్కడ బొత్స ఇక్కడ డీయస్ జంపు

  మాజీ సమైక్య ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తనకు మళ్ళీ రెండవసారి యం.యల్సీ పదవి ఇవ్వనందుకు పార్టీపై అలిగారు. తన పదవీ కాలం పూర్తయ్యి నెల రోజులయినా ఇంతవరకు పార్టీ అధిష్టానం తనను పట్టించుకోలేదని, ఈ విషయం గురించి మాట్లాడేందుకు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తనను డిల్లీకి రమ్మని ఆహ్వానించలేదని ఆయన ఆవేదన చెందుతున్నారు. తనకు బీజేపీ, తెరాసల నుండి ఆహ్వానాలు అందాయని కానీ ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని అన్నారు. తెరాసలో చేరితే ఆయనకి యం.యల్సీ పదవి కానీ రాజ్యసభ సభ్యత్వం గానీ ఇవ్వవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. కనుక త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరే అవకాశాలు కనబడుతున్నాయి. ఆయన మాటలు కూడా అదే సూచిస్తున్నాయి. అదే జరిగితే ఆంధ్రా నుండి ఒకరు తెలంగాణా నుండి ఒకరు చొప్పున ఇద్దరు మాజీ కాంగ్రెస్ అధ్యక్షులు (బొత్స సత్యనారాయణ, డీ.శ్రీనివాస్) కాంగ్రెస్ పార్టీ నుండి జంప్ అయినట్లవుతుంది.

ఈ బెయిల్ ఊహించిందే

మొత్తానికి రేవంత్ రెడ్డికి బెయిల్ వచ్చింది. అధికార టీఆర్ఎస్‌ ముద్దు బిడ్డ అయిన ఏసీబీ రేవంత్ రెడ్డికి బెయిల్ రాకుండా చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఎన్ని పాచికలు వేసినా పారలేదు. మంగళవారం నాడు హైకోర్టు రేవంత్ రెడ్డికి బెయిల్ ఇస్తుందని కొద్ది రోజుల క్రితం హైకోర్టులో రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చిన సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలను విన్నప్పుడే అనిపించింది. హైకోర్టు మంగళవారి నాటికి ఈ కేసును వాయిదా వేసినప్పుడు, మంగళవారం నాడు రేవంత్‌కి బెయిల్ రావడం ఖాయమని అందరూ ఊహించారు. అధికారంలో వున్న టీఆర్ఎస్, టీఆర్ఎస్ అధీనంలో వున్న ఏసీబీ కూడా ఈ విషయాన్ని ఊహించే వుండవచ్చు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం తన మెట్టు దిగలేదు. సోమవారం నాడు ఏసీబీ కోర్టు రేవంత్ రెడ్డి రిమాండ్‌ని పొడిగించింది. సోమవారం నాడే ఏసీబీ కోర్డు రేవంత్ రెడ్డికి బెయిల్ఇచ్చి వుంటే దానికి కాస్తంత గౌరవం దక్కి వుండేది. ఇప్పుడు హైకోర్టు రేవంత్‌కి బెయిల్ మంజూరు చేయడం ఏసీబీకి, ఏసీబీ వెనుక వున్న ప్రభుత్వానికి తల కొట్టేసినట్టు వుండే విషయమేగా! మంగళవారం నాడు హైకోర్టులో జరిగిన వాదనల్లో తెలంగాణ ప్రభుత్వ ఏజీ రేవంత్‌కి బెయిల్ రాకుండా చేయడానికి గత కొంతకాలంగా వినిపిస్తున్న వాదననే వినిపించారు. అయితే హైకోర్టు ఆ వాదనను ఎంతమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. న్యాయ ప్రకారం అయితే రేవంత్ రెడ్డి ఈ కేసులో ఇరుక్కున్న వెంటనే బెయిల్ ఇవ్వాల్సి వుంది. అయితే ఏసీబీ కోర్టు విచారణ అంటూ అదంటూ ఇదంటూ తాత్సారం చేసి నెల రోజులపాటు రేవంత్‌ని జైలులో వుంచింది. విచారణకు సహకరిస్తానని చెప్పినా జాలి లేకుండా ఆయన్ని సాధించింది. ఇప్పుడు నెలరోజుల తర్వాత కూడా కరుణ చూపకుండా ఆయన్ని ఇంకా కొంతకాలం జైల్లో వుంచడానికి ప్రయత్నించింది. ఏసీబీ వ్యవహరిస్తున్న ధోరణి రాజకీయ వర్గాలకు, ప్రజలకు ఎంతమాత్రం నచ్చలేదు. చివరకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఆదేశాలు అందరికీ ఆనందాన్ని కలిగించాయి.

రేవంత్‌కి బెయిల్.. కేసీఆర్‌కి జ్వరం...

ఎందుకోగానీ, తెలంగాణ తెలుగుదేశం నాయకుడు, దక్షిణ తెలంగాణ ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి అంటే టీఆర్ఎస్ నాయకులకు మొదటి నుంచీ దడ. రేవంత్ రెడ్డి నోరు విప్పితే అధికార టీఆర్ఎస్‌కి వణుకు మొదలవుతూ వుంటుంది. అందుకే అసెంబ్లీలో ఆయన నోరు విప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వుంటుంది. టీఆర్ఎస్ నాయకులకు మాత్రమే కాదు... టీఆర్ఎస్ అగ్ర నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కి కూడా రేవంత్ రెడ్డి అంటే ఎక్కడో ఏదో భయం వున్నట్టే అనిపిస్తూ  వుంటుంది. అందుకే రేవంత్ రెడ్డి మీద ఆయన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతూ వుంటారు. ఎవరి విషయంలో చూసీ చూడనట్టు వున్నా, రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వుంటారు. రేవంత్ రెడ్డిని దెబ్బతీయడం కోసం చాలాకాలంగా వేచివున్న కేసీఆర్‌ ఓటుకు నోటు వ్యవహారంలో రేవంత్‌రెడ్డిని ఎలా ఇరికించారో చూశాంగా... రేవంత్ రెడ్డికి బెయిల్ రాకుండా వుండటానికి టీఆర్ఎస్ ప్రభుత్వం తన శాయశక్తులా ప్రయత్నించింది. తన పెంపుడు పిల్లి లాంటి ఏసీబీని ఆ పనిలో పూర్తిగా నిమగ్నం చేసింది. అయితే న్యాయం అనేది ఒకటి వుంది.. అది ఎప్పటికైనా జరిగి తీరుతుంది. ఆ న్యాయమే రేవంత్ రెడ్డికి హైకోర్టు రూపంలో బెయిల్ మంజూరు చేసింది. అదేంటోగానీ, రేవంత్‌రెడ్డికి అలా బెయిల్ మంజూరు అయిందో లేదో, ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఇలా జ్వరం వచ్చేసింది. జ్వరం వచ్చిందంటూ మంగళవారం నాడు కేసీఆర్ తన కార్యక్రమాలన్నిట్నీ రద్దు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి బయట వున్నప్పుడు పులిలా వుండేవారు. ఆయన్ని ప్రభుత్వం కేసులో ఇరికించిన తర్వాత ఆయన ఇమేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు శక్తి పెరిగిన పులి రూపంలో రేవంత్ రెడ్డి బయటకి వస్తున్నారు. మరి ఇలాంటప్పుడు కేసీఆర్‌కి జ్వరం రావడం న్యాయమే కదా.

సెక్షన్ 8 అమల్లోనే వుందట

  ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో వున్న ‘సెక్షన్ -8’ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అమలు చేయడానికి వీల్లేదని తెలంగాణ ప్రభుత్వం పట్టుదల మీద వున్న విషయం తెలిసిందే. పాపం రెండు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్ గారికి కూడా హైదరాబాద్‌లో సెక్షన్ 8ని అమలు చేయాలా వద్దా, అధికారాలు తన చేతిలోకి తీసుకోవాలా వద్దా అనే కన్‌ఫ్యూజన్లో వున్నారు. ఈ విషయంలో ఏం చేయమంటారు అని కేంద్రాన్ని అడిగినా అక్కడి నుంచి సరైన స్పందన రాలేదు. ఈ గందరగోళం ఇలా వుంటే, ఈ విషయంలో సోమవారం నాడు ఒక క్లారిటీ వచ్చింది. ఒక్కోసారి రాజకీయ నాయకులకు, రాజ్యాంగబద్ధమైన హోదాల్లో వున్నవారికి రాని క్లారిటీ న్యాయస్థానాలకు వస్తూ వుంటుంది. అందుకే న్యాయవ్యవస్థ మీద అప్పుడప్పుడూ గౌరవం పెరుగుతూ వుంటుంది. సోమవారం నాడు సెక్షన్ 8 విషయంలో హైకోర్టు ఇచ్చిన క్లారిటీ కూడా న్యాయ వ్యవస్థ మీద గౌరవాన్ని పెంచేలాగానే వుంది. సెక్షన్ 8 అమలు చేయాలా వద్దా అని జుట్టు పీక్కుంటున్న వాళ్ళకి హైకోర్టు ఇచ్చిన క్లారిటీ కళ్ళు తెరిపించే అవకాశం వుంది. సెక్షన్ 8 అమలు చేయాలా వద్దా అనే సందేహాలే వద్దు.. హైదరాబాద్‌లో ఆల్రెడీ సెక్షన్ 8 అమల్లోనే వుంది. దీన్ని సమర్థంగా అమలు చేయాల్సిన బాధ్యత గవర్నర్‌దే అని హైకోర్టు స్పష్టం చేసింది. సెక్షన్ 8 అమలు విషయంలో దాఖలైన ఒక పిటిషన్ మీద హైకోర్టు స్పందిస్తూ ఇలా కామెంట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం సెక్షన్ 6లో వున్న విధంగా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే విషయం అమల్లో వున్నప్పుడు, సెక్షన్ 8లోని గవర్నర్‌ చేతికి శాంతిభద్రతలు అనే అంశం కూడా అమల్లో వున్నట్టేనని హైకోర్టు స్పష్టం చేసింది. దీన్నిబట్టి అందరూ అర్థం చేసుకోవాల్సింద ఏమిటంటే, సెక్షన్ 8 అమల్లోనే వుంది. అయితే గవర్నర్ గారు దానిని సమర్థంగా అమలు చేయడం లేదు. హనుమంతుడికి తన శక్తి ఏమిటో ఎవరో ఒకరు చెబితేగానీ తెలిసినట్టు, గవర్నర్ గారికి కూడా తన శక్తి ఏమిటో హైకోర్టు చెబితేగానీ తెలియదో ఏమిటో. హైదరాబాద్‌లో సెక్షన్ 8 అమల్లో వుందని హైకోర్టు చెప్పింది కాబట్టి ఇక గవర్నర్ గారు తన అధికారాల మేరకు పరిపాలనను ముందుకు నడిపితే బాగుంటుంది.

ఈ సస్పెన్స్‌ సినిమా ఏంటి పవనబ్బాయ్?

పవన్ కళ్యాణ్ మొత్తానికి సినిమావాడనిపించాడు. తన స్టేట్‌మెంట్లని కూడా సస్సెన్స్ భరితంగా బయటపెడుతూ జనాలకి లేనిపోని ఉత్కంఠను పెంచుతున్నాడు. అప్పుడెప్పుడో అయ్యగార్ని రాజధాని భూముల విషయంలో కామెంట్లు చేసినప్పుడు చూశాం. ఆ తర్వాత ఆయనని రాజకీయంగా బయట ఎక్కడా చూసిన గుర్తు లేదు. అయితే మనిషి బయట కనిపించకపోయినా, అయినదానికీ కానిదానికీ ఆ ట్విట్టర్ ఒకటి వుంది కదా.. అందులో కనిపిస్తున్నాడు. రెండ్రోజుల క్రితం ట్విట్లర్లో జనాన్ని పలకరించిన ఆయన రాజకీయ నాయకులు నెల్సన్ మండేలాని ఆదర్శంగా తీసుకోవాలని కామెంట్ చేశారు. ఆ కామెంట్ చూసి చాలామంది కామెడీతో పొట్టలు పగిలేలా నవ్వుకుంటున్నారు. ఒక పార్టీని పెట్టి, ఆ పార్టీని ఇంత వరకూ ఒక్క అంగుళం కూడా ముందుకు తీసుకెళ్ళని పవన్ కళ్యాణ్... ఆర్నెల్లకోసారి జనంలోకి వచ్చే పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకులకు నీతి సూత్రాలు చెప్పడాన్ని మించిన కామెడీ ఇంకొకటి వుంటుందా. మొన్న చేసిన కామెడీకే జనాలు నవ్వీ నవ్వీ అల్లాడుతుంటే, పవన్ కళ్యాణ్ మరోసారి ట్విట్టర్లో  కామెడీ, సస్సెన్స్ మేళవించిన సినిమా చూపించారు. పవన్ కళ్యాణ్ తన తాజా ట్విట్స్‌లో మరింత కామెడీ చేశారు. తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే, పిల్లలు కొట్టుకుంటూ లేస్తారట. పాలకులు బాధ్యతలేని ప్రవర్తనతో, మాటలతో ప్రభుత్వాలని నడిపితే భావితరాల మధ్య తిరిగి కోలుకోలేనంత అంతర్యుద్ధాలు సంభవిస్తాయట. ఈ డైలాగు ముక్క ఏ రైటర్ రాసిచ్చాడోగానీ సూపర్‌గా వుంది కదూ. పవన్ కళ్యాణ్ ఇక్కడితో ఆగలేదు. ఓటుకు నోటు కేసు, టెలీఫోన్ ట్యాపింగ్ విషయాల మీద తాను మరో రెండు రోజుల్లో స్పందిస్తాడట. రెండు రోజుల తర్వాత ఆయన ఏ రకంగా స్పందిస్తాడో అని జనం టెన్షన్‌తో నలిగిపోవాలనేది ఆయన ఉద్దేశం కాబోలు. ఓటుకు నోటు, టెలీఫోన్ ట్యాపింగ్ అంశాలు ఎప్పటి నుంచో నలుగుతున్నాయి. వాటిమీద పవన్ కళ్యాణ్ స్పందించదలచుకుంటే ఈపాటికే స్పందించాలి. దానికి మరో రెండు రోజులు టైమ్ ఎందుకో. అయినా పవన్ కళ్యాణ్ ఏ రకంగా స్పందించబోతున్నారో కాస్తంత రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరైనా ఊహించగలరు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలనూ విమర్శిస్తూ, ఈ రెండు ప్రభుత్వాలూ ప్రజలకు అన్యాయం చేస్తున్నాయనే అర్థం వచ్చే విధంగానే ఆయన స్పందిస్తారు. ఎందుకంటే, రెండు ప్రభుత్వాలనూ తిడితేనే కదా మధ్యలో ఆయన హీరో అయ్యేది. రాజకీయంగా పవన్ కళ్యాణ్ చద్ది వ్యూహాలేంటో, ఆయన ఎంత చప్పగా మాట్లాడతాడో అందరికీ తెలిసినవే. అలాంటప్పుడు ఈ సస్సెన్స్‌ సినిమా చూపించడం ఎందుకట?