గుమ్మడికాయల దొంగ అంటే...
posted on Jun 12, 2015 @ 10:50AM
పద్దెనిమిది మంది భారతసైనికులను పొట్టన పెట్టుకొన్న నాగా ఉగ్రవాదులు పొరుగు దేశమయిన మయన్మార్ అడవులలో తలదాచుకొన్నట్లు తెలియగానే భారత ప్రభుత్వం తన ఆర్మీ కమెండోలను పంపించి భారత సరిహద్దుకి అవతల దాగి ఉన్నవారినందరినీ మట్టు బెట్టించి ప్రతీకారం తీర్చుకొంది. ఇంత కాలంగా ఉగ్రవాదులు భారత్ పై దాడులు చేస్తున్నా, సరిహద్దుల వద్ద పాక్ సైనికులు మన సైనికుల తలలు నరికి తీసుకుపోతున్నా ఇంతవరకు అధికారంలో ఉన్న యూపీయే ప్రభుత్వం కేవలం వాటిని ఖండించడమే తప్ప ఏనాడు ఈవిధంగా ప్రతిచర్యలు చేప్పట్టలేదు. కానీ ప్రధాని మోడీ అనుమతించడంతో భారత కమెండోలు తమ సహచరులను పొట్టనపెట్టుకొన్న ఉగ్రవాదులను వేటాడి మట్టుబెట్టారు. అందుకు భారతీయులు అందరూ చాలా సంతోషిస్తున్నారు.
మయన్మార్ దేశంలో జరిపిన ఈ సైనిక చర్య గురించి రక్షణ శాఖా మంత్రి మనోహర్ పారికర్ మీడియాకు క్లుప్తంగా వివరిస్తూ “ఇది మనపై దాడులు చేయాలని చూస్తున్న పొరుగుదేశాలకు ఒక హెచ్చరిక వంటిది. ప్రభుత్వ ఆలోచనా విధానంలో కలిగిన మార్పు ప్రకారం భారత సైనికులు కూడా అందుకు అనుగుణంగా వ్యవహరించారు. కనుక భారత్ పై దాడులు చేద్దామని ఆలోచిస్తున్న పొరుగు దేశం ఈ మార్పును గుర్తిస్తుందని ఆశిస్తున్నాము,” అని అన్నారు.
ఆ మాటలు పాకిస్తాన్ ఉద్దేశ్యించి చేసిన హెచ్చరికలేనని వేరేగా చెప్పనవసరం లేదు. అందుకే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నట్లుగా పాకిస్తాన్ మాత్రమే స్పందించింది. “అటువంటి పనులు మయన్మార్ చేయవచ్చునేమో కానీ పాక్ భూభాగంలో సాధ్యం కాదని భారత్ గుర్తిస్తే మంచిది,” అని పాక్ ఘాటుగా బదులిచ్చింది.
దానికి మళ్ళీ మనోహర్ పారికర్ “మయన్మార్ లో జరిగిన సైనిక చర్యను చూసి ఉలిక్కిపడి భయపడినవారే స్పందించారు” అని పాకిస్తాన్ ప్రభుత్వానికి చిన్న చురక వేసారు.
పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తన మంత్రివర్గాన్ని సమావేశపరిచి “భారత్ చేస్తున్న ప్రకటనలు చాలా కవ్వించేవిగా ఉన్నాయి. దాని వలన ఇరుదేశాల మధ్య శాంతి ప్రక్రియకు భంగం కలుగుతోంది. భారతదేశంతో సహా అన్ని ఇరుగుపొరుగు దేశాలతో పాక్ చక్కటి స్నేహ సంబంధాలే కోరుకొంటోంది. కానీ భారత్ పెద్దన్న పాత్ర పోషిస్తూ మామీద కర్రపెత్తనం చేయాలని ప్రయత్నిస్తోంది. పాక్ సార్వభౌమత్వాన్ని భారత్ సవాలు చేస్తే సహించబోము,” అని ఒక తీర్మానం చేసి ఆమోదించుకొన్నారు. అది పాక్ ప్రజలకు, అంతర్జాతీయ సమాజానికి చెప్పుకోవడానికి ఉపయోగపడవచ్చునేమోగానీ, భారత్ దానిని పరిగణనలోకి తీసుకోదని వారికీ తెలుసు. ఎందుకంటే నవాజ్ షరీఫ్ ఈ శాంతి సందేశం మీడియా ముందు చదువుతున్న సమయంలోనే జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల వద్ద పాక్ సేనలు భారత సైనికులపై కాల్పులు జరుపుతున్నాయి.
ఇప్పుడు భారత ప్రభుత్వ ఆలోచనా విధానం మారింది కనుక ఇదివరకులా భారత్ చేతులు ముడుచుకొని కూర్చోదని, పాక్ చేసే ప్రతీ చర్యకి భారత్ నుండి ప్రతిచర్య తప్పనిసరిగా ఎదుర్కోవలసి ఉంటుందని రక్షణమంత్రి మనోహర్ పారికర్ ప్రకటించడం తప్పు కాదు. ఎవరిపైనా కర్ర పెత్తనం చేయాలనే ఉద్దేశ్యంతో చేసినదీ కాదు. పాక్ భూభాగంలో భారత్ సేనలు ప్రవేశిస్తే ఎదుర్కొంటామని ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ఏవిధంగా చెప్పారో అదేవిదంగా భారతదేశంలో ప్రవేశించి అల్లకల్లోలం సృష్టించాలని చూసే ఉగ్రవాదుల పట్ల తాము చాలా కటినంగా వ్యవహరిస్తామని మనోహర్ పారికర్ కూడా చెప్పారు. అందుకు పాక్ ఆ విధంగా ప్రతిస్పందించడం ఊహించదగ్గదే.
కానీ ‘అత్త కొట్టినందుకు కాదు ఏడ్చింది తోడి కోడలు నవ్వినందుకే ఏడ్చానన్నట్లు’ పారికర్ మాటలకి పాకిస్తాన్ తో బాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఉలిక్కిపదినది. దేశంపై ఉగ్రవాదులు, పాక్ సైనికులు దాడులు చేస్తున్నా యూపీయే ప్రభుత్వం చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చొందని, తమదొక చేతకాని అసమర్ధ ప్రభుత్వమని, దేశభద్రత విషయంలో కూడా రాజీపడిందని, మనోహర్ పారికర్ దేశ ప్రజలకు చెపుతున్నట్లుగా ఆ పార్టీ అర్ధం చేసుకొని ఆయనపై తీవ్రంగా విరుచుకుపడింది.
కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ మీడియాతో మాట్లాడుతూ, “రక్షణమంత్రి పారికర్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడటం అలవాటు చేసుకొంటే మంచిది. ఆయనతో సహా మరికొందరు మంత్రులు, అధికారులు తామేదో గొప్ప ఘనకార్యం చేసినట్లు దీని గురించి చాలా గొప్పలు చెప్పుకొంటున్నారు. అటువంటి వారందరికీ ప్రధాని మోడీ అదుపు చేస్తే బాగుంటుంది. నేపాల్ దేశంలో భూకంపం వచ్చినప్పుడు, ఇటువంటి గొప్పలకు పోవడం వలననే ఆ దేశానికి సహాయపడటానికి వెళ్ళినపుడు భారత్ కు చేదు అనుభవం ఎదురయిందని గుర్తుంచుకొంటే ఈవిధంగా మాట్లాడరు,” అని ఘాటుగా విమర్శించారు.
దట్టమయిన మయన్మార్ అడవులలో ప్రవేశించి భారత సైనికులు ప్రదర్శించిన ఆ అపూర్వ సాహాసాన్ని భారత ప్రజలు అందరూ ప్రశంసిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం విమర్శిస్తోంది. ప్రభుత్వాన్ని మెచ్చుకాకపోయినా కనీసం ఆ వీర సైనికులను మెచ్చుకొన్నా వారు సంతోషించేవారు. కానీ ఆవిధంగా చేస్తే తన అసమర్ధతను తనే స్వయంగా ఒప్పుకొన్నట్లవుతుందని, ఇప్పటికే ఈ చర్యతో మోడీ గురించి ప్రపంచ దేశాలు కూడా మాట్లాడుకొంటుంటే, తాము కూడా ఆయన గొప్పదనాన్ని అంగీకరించినట్లవుతుందని కాంగ్రెస్ పార్టీ భావించిందే తప్ప ఒక్క చిన్న అభినందనతో భారత సైనికుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించవచ్చని ఆలోచించలేదు.
బిన్ లాడెన్ పాకిస్తాన్ భూభాగంలో తలదాచుకొన్నాడని పసిగట్టిన అమెరికా, తన కమెండోలని పంపించి అతనిని మట్టుబెట్టినప్పుడు యావత్ ప్రపంచ దేశాలు దాని గురించి ఎంతో గొప్పగా కధలుకధలుగా వర్ణించి చెప్పుకొన్నాయి. అమెరికా దేశంలో ప్రతీ పౌరుడు కూడా తమ దేశంపై దాడి చేసి వేలాది ప్రజలను పొట్టనబెట్టుకొన్న ఆ ఉగ్రవాదిని స్వయంగా తన చేతులతో చంపినంతగా ఆనందపడ్డాడు. అమెరికాలో అధికార, ప్రతిపక్షాలన్నీ పండగ చేసుకొన్నాయి.
కానీ భారత సైనికులను పొట్టనబెట్టుకొన్న నాగా ఉగ్రవాదులను భారత కమెండోలు వెంటాడి మట్టుబెడితే కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది! తనకు చేతకాని పనిని మోడీ ప్రభుత్వం చేసి చూపుతోందనే అసూయే అందుకు కారణమని అర్ధమవుతోంది. అయితే పార్టీ రాజకీయ ప్రయోజనాలు, వ్యూహాలు, ప్రభుత్వాలను పాలించే వ్యక్తుల కీర్తి ప్రతిష్టలన్నిటి కంటే కూడా దేశ ప్రయోజనాలు, దేశ సార్వభౌమత్వమే మిన్న దానికే అందరూ ప్రాధాన్యం ఇవ్వాలి. అందులో భిన్నాభిప్రాయలకి తావు లేదు, ఉండకూడదని ఇంతకాలంగా దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ అంగీకరించకపోవడమే చాలా విచిత్రం. చాలా దురదృష్టకరం.