రేవంత్ రెడ్డి వ్యవహారంలో ఏసీబి తొందరపడిందా?
posted on Jun 5, 2015 @ 11:17PM
తెదేపా యం.యల్యే. రేవంత్ రెడ్డిని ఏదో విధంగా ఉచ్చులో బిగించాలని తొందరలో ఏసీబి అధికారులు, వారికి వెనుక నుండి వత్తాసు పలుకుతున్నవారు కొన్ని విషయాలు విస్మరించడం వలన చివరికి వారు త్రవ్విన గోతిలో వారే పడే పరిస్థితి కనిపిస్తోంది. ఈ వ్యవహారం అంతా ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో జరిగింది. కనుక ప్రజాప్రతినిధి అయిన రేవంత్ రెడ్డిపై నిఘా పెట్టేముందు ఏసీబి అధికారులు తప్పనిసరిగా ఎన్నికల కమీషన్ కి ముందుగా తెలియజేసి, దాని అనుమతితోనే చేప్పట్టవలసి ఉంటుంది. కానీ ఎన్నికల కోడ్ ని పట్టించుకోకుండా ఏసీబి అధికారులు ప్రజాప్రతినిధి అయిన రేవంత్ రెడ్డిపై నిఘా పెట్టడం, నిర్బందించడం రెండూ కూడా తప్పేనని, ఆవిధంగా చేసినందుకు ఒకవేళ ఎన్నికల కమీషన్ ఏసీబి అధికారులపై చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.
ఇక ఏప్రిల్, 2014లో ఆప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పి.సదాశివం, జస్టిస్ రంజన్ గోగయ్ మరియు జస్టిస్ యన్.వి. రమణలతో కూడిన ధర్మాసనం “స్టింగ్ ఆపరేషన్లపై” ఇచ్చిన ఒక తీర్పులో “ఒక నేరస్తుడిని సాక్ష్యాధారాలతో పట్టుకొనే ప్రయత్నంలో స్టింగ్ ఆపరేషన్స్ నిర్వహించడం నైతిక విలువలను ప్రశ్నార్ధకంగా మార్చుతాయి. ఒకవేళ నిందితుడికి నేరం చేయాలనే ఉద్దేశ్యం, ఆలోచనా లేకపోయినప్పటికీ, తను నేరం చేసినా ఎవరూ కనుగొనలేరనే భావన అతనిలో కల్పించడం, తద్వారా అతనిని నేరానికి ప్రోత్సహించడం ఏవిధంగా సమర్ధనీయం కాదు. అటువంటి పరిస్థితి నెలకొని ఉందని తెలిసుంటే బహుశః నిందితుడికి నేరం చేయాలనే ఆలోచన చేయకపోవచ్చును. అటువంటప్పుడు ఒక అమాయకుడయిన వ్యక్తిని ఈవిధంగా నేరం చేయడానికి ప్రేరేపించి నేరస్తుడిగా నిరూపించే ప్రయత్నం ఎంత మాత్రం సమర్ధనీయం కాదు. అతను నేరం చేయడానికి అనువయిన పరిస్థితులను స్వయంగా కల్పించి, నేరం చేసినా ఎవరూ కనుగొనలేరనే అభిప్రాయం అతనికి కలిగించి, నేరం చేయడానికి పరోక్షంగా ప్రేరేపించి, అతను నేరం చేస్తున్నపుడు ఈ విధంగా స్టింగ్ ఆపరేషన్స్ చేసి ఒక వ్యక్తిని దోషిగా నిరూపించే ప్రయత్నం కూడా నేరమే! కనుక నైతిక విలువలకు విరుద్దమయిన ‘స్టింగ్ ఆపరేషన్స్’ ద్వారా సేకరించిన ఆధారాలను సాక్ష్యాలుగా స్వీకరించలేము,” అని పేర్కొంది సుప్రీం కోర్టు ధర్మాసనం.
అదే విధంగా రిసాల్ సింగ్ వెర్సస్ హర్యానా ప్రభుత్వం కేసుతో సహా అటువంటి అనేక ఇతర కేసులలో సుప్రీంకోర్టు ‘స్టింగ్ ఆపరేషన్’ నిర్వహించడాన్ని తప్పు పట్టడమే కాకుండా వాటి ద్వారా సేకరించిన సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకోవడానికి నిరాకరించింది. కనుక రేవంత్ రెడ్డిపై ఏసీబీ అధికారులు నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ కూడా కోర్టులు పరిగణనలోకి తీసుకోవని భావించవచ్చును.
ఇక ఇటువంటి వ్యవహారాలలో ఏసీబీ అధికారులు స్వయంగా సేకరించిన ఆధారాలకు తప్ప మూడవ వ్యక్తి అందజేసిన ఆధారాలు అంటే నామినేటడ్ యంయల్యే స్టీఫన్ సన్ లేదా మరొకరో తమ ఫోన్ లో రికార్డు చేసిన సంభాషణలు వంటివి కోర్టులు సాక్ష్యాలుగా స్వీకరించవని న్యాయ నిపుణులు తెలుపుతున్నారు. ఇక రేవంత్ రెడ్డి వ్యవహారంలో జరిగిన మరొక పొరపాటు ఏమిటంటే ఏసీబీ అధికారులు చిత్రీకరించిన ఆడియో వీడియో క్లిప్పింగులను వారికి తెలిసో, తెలియకుండానో ఎవరో బహిర్గతం చేయడం. ఏసీబీ అధికారులు కేవలం నేరస్తుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొనే ఉద్దేశ్యంతోనే రికార్డు చేసిన ఆడియో, వీడియో క్లిప్పింగులను కేవలం నేర విచారణ కోసమే వినియోగించాలి తప్ప మీడియాకు విడుదల చేయకూడదు. కానీ విడుదల చేయబడ్డాయి. అంటే రాజకీయ దురుదేశ్యంతోనే ఎవరో పనిగట్టుకొని ఈ పని చేసినట్లు స్పష్టమవుతోంది.
వాటిని తాము మీడియాకు విడుదల చేయలేదని ఏసీబీ డీజీపి యంఏ.ఖాన్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి ప్రకటించారు. అంటే ఏసీబీ అధికారులు కాకుండా వేరేవరయినా కూడా రికార్డు చేసేందుకు ఏసీబీ అధికారులు అనుమతించారా? లేకపోతే వారే స్వయంగా ఎవరికో అందజేసి మీడియాకు విడుదల చేసి తమకుతెలియదని చెపుతున్నారా? అనే ప్రశ్నకు ఏసీబీ అధికారులు కోర్టులో జవాబు చెప్పవలసి రావచ్చును. ఇక వారు రికార్డు చేసిన ఆడియో, వీడియో టేపులను మీడియాకు విడుదల చేయడం ద్వారా ఒక ప్రజాప్రతినిధిని రాజకీయంగా దెబ్బ తీయాలనే ప్రయత్నం జరిగినట్లు స్పష్టం అవుతోంది కనుక సదరు వ్యక్తులని, ఏసీబీ అధికారులను కూడా కోర్టులు బాధ్యులను చేసే అవకాశమున్నట్లు న్యాయ నిపుణులు చెపుతున్నారు.
ఇక మరో ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే స్టింగ్ ఆపరేషన్ ద్వారా సేకరించిన ఆడియో, వీడియో సాక్ష్యాలను కోర్టులు పరిగణనలోకి తీసుకోవనే చిన్న విషయం నేరస్తులను కనిపెట్టే ఏసీబీ అధికారులకు గానీ, వారిని వెనుక నుండి ప్రోత్సహిస్తున్న వారికి గానీ తెలియకపోవడం. ఏమయినప్పటికీ రేవంత్ రెడ్డి కేసులో అతనిని నేరస్తుడిగా నిరూపించే ప్రయత్నం కంటే ఆయనను, ఆయన పార్టీని రాజకీయంగా దెబ్బతీయాలనే ప్రయత్నమే ఎక్కువగా కనబడుతోంది. ఏసీబి అధికారులు నేర నిరూపణ చేయకముందే వారు రికార్డు చేసిన ఆడియో వీడియోలను మీడియాకు తక్షణమే విడుదల చేయడం, ఏసీబి అధికారులు మాట్లాడవలసిన సాక్ష్యాలు ఆధారాలు వంటి విషయాల గురించి రాజకీయ నాయకులు మాట్లాడటం, కోర్టులు తీర్పు చెప్పకముందే తామే తీర్పులు చెపుతుండటం వంటివన్నీ నిశితంగా గమనిస్తే ఇది రాజకీయ దురుదేశ్యంతో జరిగిందనే అనుమానం కలుగక మానదు.