న్యాయం చేయండి లేకుంటే ఆత్మహత్యకి అనుమతించండి
సుమారు ఒకటిన్నర దశాబ్దాలుగా మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో వ్యాపం కుంభకోణాలు, వాటిపై దర్యాప్తులు, సుమారు రెండు వేలమందికిపైగా నిందితుల అరెస్టులు, వరుసగా కొనసాగుతున్న అనుమానాస్పద మరణాలు...ఏవీ కూడా ఆగడం లేదు. అన్నీ కూడా దేని దారి దానిదే అన్నట్లు సాగుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం సీబీఐ అధికారులు ఇప్పుడు ఆ కేసులనన్నిటినీ తమ చేతుల్లోకి తీసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో అరెస్టయిన వారిలో అన్ని రంగాలకి చెందినవారున్నారు. వారిలో 70 మంది వైద్యులు, వైద్య విద్యార్ధులు చాలా కాలంగా గ్వాలియర్ జైల్లో ఉన్నారు. ఈ కుంభకోణాలపై దర్యాప్తులు పూర్తయ్యి ఈ కేసులు ఇంకా ఎప్పటికి తేలుతాయో, తామెప్పుడు జైల్లో నుండి బయటపడుతామో, అసలు జీవితంలో జైల్లో నుండి బయటపడుతామా లేదా? అని వారందరూ ఆందోళన చెందుతున్నారు.
వారు ప్రధానికి, రాష్ట్రపతికి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి, మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, జాతీయమానవ హక్కుల సంఘానికి లేఖలు వ్రాశారు. ఈ కేసుల విచారణ కోసం ఎదురుచూస్తూ తాము జీవితాంతం జైల్లోనే బ్రతకడం కంటే ఆత్మహత్య చేసుకోవడమే మంచిదని భావిస్తున్నామని, కనుక తమకు తక్షణమే న్యాయం చేయలేకపోతే కనీసం ఆత్మహత్య చేసుకొనేందుకయినా తమందరికీ అనుమతి ఇవ్వమని వారు కోరారు. న్యాయవిచారణ కోసం ఏళ్ల తరబడి తమను జైల్లో ఉంచడం మనవహక్కుల ఉల్లంఘన కాదా? అని వారు ప్రశ్నించారు.
సమాజంలో గౌరవప్రదంగా జీవిస్తున్న తమను ఈవిధంగా నెలల తరబడి జైల్లో ఉంచడం వలన తాము మానసికంగా చాలా క్రుంగి పోతున్నామని, తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని, తాము జైల్లో మ్రగ్గుతుండటం వలన బయట తమ కుటుంబాల ఆర్ధిక, సామాజిక పరిస్థితి నానాటికీ దారుణంగా తయారవుతోందని కనుక తమకు తక్షణమే న్యాయం చేయాలని లేఖలు వ్రాశారు. ఒకవేళ అలాగా వీలుకాదని భావిస్తే తమందరికీ ఆత్మహత్యలు చేసుకొనేందుకు అనుమతించాలని వారు కోరారు.
వారు వ్రాసిన ఈ లేఖలు వారి మనోవేదనకు, దైన్యస్థితికి అద్దం పడుతున్నాయి. ఇంతవరకు ఈ కేసులో వివిధ రంగాలకు చెందిన సుమారు 2000 మందికి పైగా అరెస్టయ్యారు. అరెస్టయిన వారందరూ దోషులు కావచ్చు, కాకపోవచ్చును. కానీ కేసులు దర్యాప్తు, న్యాయ విచారణ పేరిట వారిని ఏళ్ల తరబడి జైళ్లలో ఉంచడం వలన చివరికి వారిలో నిర్దోషులుగా తేలినవారికి ఇంతకాలం అన్యాయంగా జైల్లో ఉంచి వారికి, వారి కుటుంబాలకి కూడా తీవ్ర మనోవేదన కలిగించినట్లే అవుతుంది.
ఇది ఒక వ్యాపం కుంభకోణాలకు సంబంధించిన కేసులలోనే కాదు దేశంలో నిత్యం నమోదయ్యే వేలాది ఇతర కేసుల్లో అరెస్టయినవారి పరిస్థితి కూడా ఇదే. కనుక న్యాయవ్యవస్థే దీనికి పరిష్కారం చూపించవలసి ఉంటుంది. అజ్మల్ కసాబ్, అఫ్జల్ గురు, యాకుబ్ మీమన్ వంటి ఉగ్రవాదులకి పొరపాటున కూడా అన్యాయం జరగకూడదనుకొనే మన చట్టాలు, న్యాయవ్యస్థలు వ్యాపం కుంభకోణంలో అరెస్టయిన ఈ 70 మంది వైద్యులు, వైద్య విద్యార్ధుల పట్ల ఎంత ఉదాసీనత ప్రదర్శిస్తోంది?