మెహబూబ్ నగర్ జిల్లాలో వజ్రాల గనులు
మెహబూబ్ నగర్ పేరు చెప్పగానే ఎవరికయినా ముందు గుర్తుకు వచ్చేది ఆ జిల్లా నుండి ఇతర జిల్లాలు, రాష్ట్రాలు, గల్ఫ్ దేశాలకు వలసలు పోతున్న అక్కడి జనం గురించే! కారణం ఆ జిల్లాలో వ్యవసాయానికి నీటి వసతి లేకపోవడంతో పంటలు పండక ఎప్పుడూ కరువు కాటకాలు తాండవిస్తూ ఉండటమే! కనీసం జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి జరిగినా ఈ దుస్థితి నెలకొని ఉండేది కాదు. అందుకే తెలంగాణాలో మెహబూబ్ నగర్ జిల్లా నుండి వలసలు చాలా ఎక్కువగా కనబడుతుంటాయి. కానీ ఆ జిల్లా ఇప్పుడు యావత్ తెలంగాణకే అక్షయపాత్ర వంటి వజ్రాల గని అని గత కొంత కాలంగా జరుగుతున్నా పరిశోధనలలో తేలింది.
ఉస్మానియా విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ ఎక్స్ ప్లోరేషన్ విభాగానికి చెందిన కొందరు పరిశోధకులు చేసిన పరిశోధనలో జిల్లాలో కనీసం 21 ప్రాంతాలలో అపారమయిన వజ్రాల గనులున్నాయని కనుగొన్నారు. ముఖ్యంగా కర్నాటకకు చెందిన గుల్బర్గా పట్టణానికి ఆనుకొని జిల్లాకు చెందిన ప్రాంతాలలో ఈ వజ్రాల గనుల నిక్షేపాలు అధికంగా ఉన్నాయని కనుగొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన మరో ఆరు సంస్థలకు చెందిన పరిశోధకులు కూడా ప్రస్తుతం జిల్లాలో వజ్రాల ఆన్వేషణలో ఉన్నారు.
మెహబూబ్ నగర్ జిల్లాలో నారయణపేట్, గుర్మత్కల్, అమ్మిరెడ్డిపల్లి, దామరగిడ్డ మరియు నాయుడుగుర్తి, కోయిల్ కొండ, మద్దూర్, కోటకొండ, పదిరీ పహాడ్, దేవరకొండ ప్రాంతాలలో ఈ వజ్రాల గనులు నిక్షిప్తం అయ్యి ఉన్నట్లు తాము కనుగొన్నామని ఆయన తెలిపారు. ఆంధ్రాలో కూడా అనంతపురం, కడప, గుంటూరు, ప్రకాశం, కృష్ణ, మరియుకర్నూల్ జిల్లాలో కొన్ని ప్రాంతాలలో ఈ వజ్రాల గానులున్నట్లు కనుగొన్నామని తెలిపారు. ఇవి కొన్నిచోట్ల భూమికి సుమారు 1.2 కిమీ. లోతులోను మరికొన్ని చోట్ల కేవలం 400 మీటర్ల లోతులోను ఈ వజ్రాల గనులు నిక్షిప్తం అయ్యి ఉన్నాయని ప్రొఫెసర్ రామదాస్ తెలియజేశారు. ప్రభుత్వం కూడా పరిశోధకులు కనిపెట్టిన ఈ వజ్రాల గనులను వెలికి తీసేందుకు నడుం బిగిస్తే మెహబూబ్ నగర్ జిల్లాయే తెలంగాణకు తలమానికంగా ఎదిగే అవకాశం ఉంది.