రాహుల్ గాంధీ జగన్ని మేల్కొలిపినట్లే ఉంది!

  ఇంతవరకు ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఏర్పాటు వంటి కేంద్రంతో సంబంధం ఉన్న అంశాలపై పెద్దగా స్పందించని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, రాహుల్ గాంధీ చేసిన విమర్శలతో జ్ఞానోదయం పొందారో లేక మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి దగ్గరవ్వాలని అనుకొంటున్నారో ఏమో తెలియదు కానీ ఇకపై ప్రత్యేక హోదా కోసం మరింత ఉదృతంగా పోరాటం చేస్తానని ప్రకటించారు. అవసరమయితే డిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్షలు చేసయినా సరే కేంద్రం మెడలు వంచి మరీ ప్రత్యేకహోదా సాధిస్తామని ఆయన చెప్పడం విశేషం. ఎన్నికలకు మునుపు ఆయన చాలా సార్లు కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి రావలసిన అన్నిటినీ రాబడతానని జగన్ ధాటిగా చెప్పేవారు.   కాంగ్రెస్, బీజేపీలలో దేనికీ పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం లేదని, కనుక వాటిలో దేనికి అధికారం చేప్పట్టే అవకాశం ఉంటే ఆ పార్టీ మద్దతు కోసం తప్పనిసరిగా తన కాళ్ళ ముందు సాగిలపదతాయని బహుశః జగన్ అంచనా వేసినందునే అంత ధాటిగా అని ఉండవచ్చును. కానీ ఎన్నికలలో తన పార్టీ ఓడిపోవడం, అటు కేంద్రంలో ఎన్డీయే కూటమి పూర్తి మెజారిటీతో అధికారంలోకి రావడంతో ఇక తన పార్టీ మద్దతే అవసరం లేకుండా పోయింది. దానితో జగన్ ఈ “మెడలు వంచుడు” మాటలని పూర్తిగా ఉపసంహరించుకొని, మోడీ ప్రభుత్వాన్ని మంచి చేసుకొనే పనిలో పడ్డారు. బహుశః అందుకే ఆయన ఇంతకాలం మోడీ ప్రభుత్వాన్ని పల్లెత్తుమాటనలేదు.   కానీ రాహుల్ గాంధీ వేసిన చురకలతో మళ్ళీ ఆయనలో వేడి పుట్టి ఉండవచ్చును. అందుకే కేంద్రం పట్ల తను అనుసరిస్తున్న మెతక వైఖరిని పునరాలోచించుకొని, మళ్ళీ మెడలు వంచుడు కార్యక్రమాన్ని మొదలుపెడతానని అంటున్నట్లున్నారు. కానీ ఆయన కేంద్రం మెడలు వంచుతారో లేక కేంద్రమే ఆయన మెడలు వంచుతుందో ఎవరయినా చాలా తేలికగానే ఊహించవచ్చును. ఇదంతా బాగానే ఉంది కానీ రాహుల్ గాంధీ తన కాంగ్రెస్ పార్టీని ఉత్సాహపరచాలని వస్తే, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మేల్కొన్నారేమిటో విడ్డూరం కాకపోతే!

జగన్మోహన్ రెడ్డికి ముద్దు ప్రశ్న?

  ఓటుకి నోటు కేసులో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎంతగా రెచ్చిపోయారో అందరికీ తెలుసు. ఆయన శ్రమ అనుకోకుండా డిల్లీ వెళ్లి రాష్ట్రపతి, హోంమంత్రి, ఆర్ధికమంత్రి చివరికి ఇందన వనరుల శాఖామంత్రి పీయూష్ గోయల్ కి కూడా ఈ వ్యవహారం గురించి పిర్యాదు చేసి వచ్చారు. కానీ చివరికి మళ్ళీ నిరాశే ఎదురయింది. అంతేకాక ప్రజలెన్నుకొన్న తమ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు పొరుగు రాష్ట్రంలో రాజకీయపార్టీతో చేతులు కలిపి కుట్రలు పన్నారనే తెదేపా నేతల ఆరోపణలకు సంజాయిషీలు చెప్పుకోవలసిన దుస్థితి ఏర్పడింది.   ఓటుకి నోటు కేసులో అంతగా రెచ్చిపోయిన జగన్మోహన్ రెడ్డి టెలీఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి ఎందుకు మాట్లాడటం లేదు? అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని రాజీనామా చేయాల్సిందే అని వాదించిన జగన్, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని రాజీనామా చేయమని ఎందుకు నిలదీయడం లేదు? అని తెదేపా ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణం నాయుడు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొందరు ప్రముఖుల ఫోన్లను ట్యాపింగ్ చేసామని ముగ్గురు మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు స్పష్టంగా చెప్పిన తరువాత కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉండిపోయారు? ఆ పార్టీ నేతలెవ్వరూ కూడా దీనిపై ఎందుకు స్పందించడం లేదు? టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం నేరం కాదని జగన్ భావిస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు.

ఆ సినిమాను పక్కనబెట్టి ప్రత్యేక హోదా కోసం పోరాడోచ్చు కదా!

  మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకి వేర్వేరు ఆశయాలు, సిద్దాంతాలు, పార్టీలు ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో వారిరువురు ఒకేలా వ్యవహరిస్తుంటారు. ఇద్దరూ కూడా ఎన్నికల ముందే రాజకీయపార్టీలు పెట్టారు. కాకపోతే చిరంజీవి తన అభిమానుల అండదండలతో డైరెక్టుగా ముఖ్యమంత్రి అయిపోదామని కలలుగంటూ తన రాజ్యాన్ని స్థాపిస్తే, అసలు తనకు రాజ్యమూ వద్దు...అధికారమూ వద్దు...జస్ట్ ప్రశ్నించడానికే కనబడని సైన్యాన్ని వెంటేసుకొచ్చానని చెప్పుకొన్నాడు బ్రదర్ పవన్ కళ్యాణ్. కానీ, ఆ ఇద్దరు  బ్రదర్స్ తమ రాజ్యాన్ని, సైన్యాన్ని వేర్వేరు పార్టీలలో కలిపేసి ఎన్నికలయిపోగానే మళ్ళీ సినిమాలలోకి వెళ్ళిపోయారు. ఇద్దరూ కూడా ఖాళీ ఉన్నప్పుడు రాజకీయాలు, రాష్ట్రోద్దారణ గురించి మాట్లాడుతుంటారు.   మొన్న ఆ మధ్యనెప్పుడో సడన్ గా మెలకువ వచ్చినప్పుడు పవన్ బాబు ప్రత్యేక హోదా గురించి ఏవో కొన్ని ప్రశ్నలు అడిగి వెళ్లిపోయారు. ఈరోజు మెగా బ్రదర్ చిరంజీవి కూడా ప్రత్యేక హోదా గురించి అధికార తెదేపాని మీరేం చేస్తున్నారు అంటూ నిలదీశారు. గత పదేళ్ళ కాంగ్రెస్ పరిపాలనలో సమైక్య ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో, దేశ వ్యాప్తంగా అనేక వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నప్పుడు నోరు మెదపని ఆయన ఇప్పుడు రైతులకు భరోసా కల్పించేందుకే రాహుల్ గాంధీ శ్రమ అనుకోకుండా పాదయాత్రలు చేస్తున్నారని వెనకేసుకు వచ్చేరు.   రాష్ట్ర విభజన కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఆయనకీ తెలుసు. రెండు రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న వివాదాలను చూస్తూనే ఉన్నారు. కానీ వాటి గురించి మాట్లాడకుండా తమ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ దానిని కేంద్రం అమలు చేయడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రాన్ని గట్టిగా నిలదీయడం లేదని తెగ ఆవేదన పడిపోయారు. కానీ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆయనే స్వయంగా రాజ్యసభకి వెళ్లి కేంద్రాన్ని నిలదీయకుండా తన 150 సినిమా గురించి మాత్రమే ఎందుకు ఆలోచిస్తున్నారో ఆయనకే తెలియాలి.

టీఆర్ఎస్-ఎంఐఎం దోస్తీ ముగిసినట్టేనా?

కొన్ని కొన్ని స్నేహాలు ఎందుకు మొగ్గ తొడుగుతాయో... అంతలోనే ఎందుకు అకస్మాత్తుగా వాడిపోతాయో ఎంత ఆలోచించినా అర్థంకాని విషయం. ఈమధ్య మొదలై అంతలోనే ముగిసిన టీఆర్ఎస్ - ఎంఐఎం పార్టీల మధ్య స్నేహం కూడా ఈ కోవలోకే వస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం జరిగిన సందర్భంలో ఈ రెండు పార్టీలు కలసి పనిచేసిందే లేదు. ఇస్తే రాయల తెలంగాణ ఇవ్వండి.. లేకపోతే తెలంగాణ అసలే వద్దు అనే స్టాండ్‌కి ఎంఐఎం మొదటి నుంచీ కట్టుబడి వుంది. అయితే ఎంఐఎం అభీష్టా్నికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత టీఆర్ఎస్ - ఎంఐఎం పార్టీల మధ్య స్నేహ సుమం వికసించింది. టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఒవైసీ సోదరుల ఇంటికి వెళ్ళి స్నేహహస్తం చాచారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య స్నేహం మూడు పువ్వులు  - ఆరు కాయల్లాగా వర్ధిల్లింది. నిన్న మొన్నటి వరకూ వీరిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ కొనసాగింది. ఈ రెండు పార్టీలు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలలో కలసి పోటీ చేస్తాయనే అందరూ భావించారు. కేసీఆర్ స్నేహహస్తం వెనుక జీహెచ్ఎంసీ ఎన్నికలే ప్రధాన కారణం అని కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే రెండు పార్టీల మధ్య ఏమైందోగానీ, రంజాన్ మాస ప్రారంభంలోనే వీరిమధ్య స్నేహం కటీఫ్ అయిపోయినట్టు అర్థమవుతోంది. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలలో తమ పార్టీ ఏ ఇతర పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ స్పష్టంగా ప్రకటించడంతో ఈ రెండు పార్టీల మధ్య స్నేహం ముగిసిందని అర్థమైంది. ముస్లిం ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికి టీఆర్ఎస్ సొంతగా వ్యూహాలు పన్నుతూ వుండటమే వీరిమధ్య దూరం పెరగడానికి కారణమని తెలుస్తోంది. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోమని ఒవైసీ ప్రకటిస్తే, అదేంటి భయ్యా అని టీఆర్ఎస్ నాయకులు మరోసారి స్నేహహస్తం చాచకుండా, లైట్‌గా తీసుకున్న ధోరణిలో వ్యహరించారు. ముస్లింలకు ఇఫ్తార్ విందులు ఇస్తూ, కానుకలను అందిస్తూ వారిని మంచి చేసుకునే ప్రయత్నంలో ముమ్మరమైపోయారు. ఆ విందులకు, కానుకల కార్యక్రమాలకు ఎంఐఎం నేతలను ఆహ్వానించిన దాఖలాలు కూడా కనిపించలేదు. అంటే, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలలో టీఆర్ఎస్ కూడా ఒంటరిగానే పోటీ చేయాలని డిసైడ్ అయిందన్నమాట. ఇలా ముగిసిన దోస్తీ పర్యవసానాలు ఎలా వుంటాయో వేచి  చూడాలి.

వైకాపా వితండ వాదన

  ఇంతవరకు తెదేపా నేతలు వైకాపాని పిల్ల కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేసేవారు. కానీ ఇప్పుడు వైకాపాయే తల్లి కాంగ్రెస్ పార్టీని ‘పిల్ల తెదేపా’ అని విమర్శిస్తోంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు తమ ఓట్లన్నిటినీ తెదేపాకి మళ్ళించి చంద్రబాబు అధికారంలోకి రావడానికి తోడ్పడ్డారని వైకాపా అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తాజాగా ఆరోపిస్తున్నారు.   రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ “పిల్ల తెదేపా”లా వ్యవహరిస్తోందని ఆమె ఆరోపించారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంత ఘోరంగా ఓడిపోయిందో, ఎందుకు నామ రూపాలు లేకుండా పోయిందో అందరికీ తెలుసు. తమ అభీష్టానికి విరుద్దంగా రాష్ట్రాన్ని విడదీసిన కాంగ్రెస్ పార్టీని ఓడించాలనే పంతంతో, విభజనతో పూర్తిగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గాడిన పెడతారనే నమ్మకంతోనే ప్రజలు తెదేపాకి పట్టం కట్టారని అందరికీ తెలుసు. ప్రజలలో నెలకొన్న కాంగ్రెస్ వ్యతిరేకత తనకూ అనుకూలిస్తుందని ఆశించిన జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ గెలుపుపై చాలా ధీమా ప్రదర్శించారు. కానీ చివరికి ప్రజలు చంద్రబాబు నాయుడు వైపే మ్రోగ్గు చూపారు. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ గురించి ఒక్క ముక్క మాట్లాడని వైకాపా ఇప్పుడు రాష్ట్రంలో కనబడకుండా పోతున్న కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ‘పిల్ల తెదేపా’ అని అభివర్ణించడం విడ్డూరంగా ఉంది.

ఓటర్ కార్డులు.. ఎన్నో అనుమానాలు

  గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలు త్వరలో వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన ఒక ప్రక్రియ, దాని మీద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు ఎన్నో అనుమానాలు కలిగిస్తున్నాయి. ప్రతి ఓటరూ తన ఓటరు కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలని ఎన్నికల కమిషన్ భావించింది. దీనికి సంబంధించి కొద్ది నెలల క్రితం రంగంలోకి దిగింది. అయితే ప్రభుత్వోద్యోగుల నిర్వాకం పుణ్యమా అని ఆ పని ఆశించిన రీతిలో  జరగలేదు. ఇంటింటికీ తిరిగి ఓటరు కార్డులకు ఆధార్ కార్డులతో అనుసంధానం చేయాల్సిన సదరు ఉద్యోగులు ఏవో కాకిలెక్కలు రాసేసి ఎలక్షన్ కమిషన్ ముఖాన పారేశారు. వారు ఇచ్చిన కాకి లెక్కల ప్రకారం ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటే ఎన్నో  లక్షల మంది ఓట్లు గల్లంతు అయిపోయేవి. అయితే ఉద్యోగుల నిర్వాకాన్ని కనిపెట్టిన ఎన్నికల సంఘం ఈ విషయంలో మరోసారి రంగంలోకి దిగింది. త్వరలో ఎన్నికలు వచ్చే అవకాశం వున్న హైదరాబాద్‌లో అన్ని ఓటర్ కార్డులూ ఆధార్ కార్డులతో  అనుసంధానం చేయాలని  ప్రయత్నిస్తోంది. ఆధార్‌తో అనుసంధానం కాని ఓటర్లను తొలగిస్తామని కూడా ఎన్నికల కమిషన్ చెబుతోంది. అయితే ఎన్నికల కమిషన్‌కి సంబంధించిన ఈ వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుని మాట్లాడ్డం ఎన్నో అనుమానాలను తావు ఇస్తోంది. హైదరాబాద్‌లో గెలిచి తీరాలన్న ఉద్దేశంలో వున్న కేసీఆర్ తమకు అనుకూలం కాని వారి ఓట్లను రద్దు చేయించడానికే రంగంలోకి దిగారని ఆయనంటే గిట్టని వారు అనుమానపడుతున్నారు. హైదరాబాద్‌లోని సీమాంధ్రులు టీఆర్ఎస్‌కి ఎలాగూ ఓటు వేయరు కాబట్టి ఓటర్ల రద్దులో ఎక్కువశాతం సీమాంధ్రుల ఓట్లు ఎగిరిపోయే అవకాశాలు వున్నాయనే భయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఎన్నికల కమిషన్‌ని కేసీఆర్ ప్రభుత్వం ప్రభావితం చేసే అవకాశాలు ఎంతమాత్రాలూ లేవన్న నిజాన్ని పలువురు విస్మరిస్తున్నారు. ఈ నిజం కంటే వారిలోని భయమే వారి మీద పట్టు సాధిస్తోంది. హైదరాబాద్‌లోని సీమాంధ్రుల ఈ భయాన్ని తొలగించడానికి ఎన్నికల కమిషన్ చొరవ తీసుకుంటుందో, కేసీఆర్ చొరవ తీసుకుంటారో చూడాలి.

ప్రతిపక్షానాం రోదనం బలం

  బాలానాం రోదనం బలం అనేది నానుడి. చిన్న పిల్లలు ఎంత ఎక్కువగా ఏడిస్తే వాళ్ళకు అంత బలం అనే విషయాన్ని చెబుతూ ఆ నానుడి ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయాలను చూస్తుంటే, ‘‘ప్రతిపక్షానాం రోదనం బలం’’ అనే కొత్త నానుడి కాయినింగ్ చేయాలని అనిపించడం సహజం.  అయితే ఇక్కడ చిన్న ఛేంజ్ ఏమిటంటే, ప్రతిపక్షాలు ఏడ్వటం వల్ల ఆ ప్రతిపక్షాలకు బలం రాదు... అధికారంలో వున్న తెలుగుదేశం పార్టీకే బలం పెరుగుతోంది. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాలు ఇంకా బాగా ఏడవాలి.. ఆ ఏడుపు పుణ్యమా అని తెలుగుదేశం ప్రభుత్వం విజయపథంలో మరింత ముందుకు దూసుకుపోవాలి. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబుకు అధికారం ఇవ్వడం తాము చేసిన గొప్పపనిగా ప్రజలు భావిస్తున్నారు. అలాగే వైసీపీకి అనవసరంగా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామే అనే భావన కూడా ప్రజల్లో బాగా పెరిగింది. టీఆర్ఎస్‌ పార్టీకి బహిరంగంగా మద్దతు ప్రకటించిన తర్వాత ఆ పార్టీ విషయంలో ఏపీ ప్రజల్లో వ్యతిరేకత భారీగా పెరిగిపోయింది. వైసీపీ ఏడవ తలచుకుంటే ఏపీలో తమ పార్టీ విలువ పోయినందుకు ఏడ్వాలి. అలా కాకుండా... ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఆ పార్టీ భోరున ఏడుస్తోంది. ఆ ఏడుపుకు పక్క వాయిద్యాల మాదిరిగా  కాంగ్రెస్ పార్టీ, ఇతర ఎర్ర పార్టీలు కూడా గొల్లుమని ఏడుస్తున్నాయి. నీ ఏడుపే నా అభివృద్ధి అన్నట్టుగా, ఈ పార్టీలు ఎంత ఏడ్చేకొద్దీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంత నమ్మకం పెరుగుతోంది. తమకోసం పాటుపడుతున్న నాయకుడిని ప్రతిపక్ష నాయకులు ఎలా విమర్శిస్తున్నదీ చూస్తున్న ఏపీ ప్రజలు ఆ పార్టీల మీద తీవ్ర వ్యతిరేకతను పెంచుకుంటున్నారు. అంచేత తమ ఏడుపు ద్వారా తెలుగుదేశం ప్రభుత్వ బలం పెంచుతున్న వైసీపీ తదితర ప్రతిపక్షాలకు ధన్యవాదాలు.

మంత్రా? వీధి రౌడీనా?

  తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం పార్టీ ద్వారా లభించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే మంత్రి పదవిలో వైభోగం అనుభవిస్తున్నారన్నది ఆయనపై తాజాగా వచ్చిన ఆరోపణ. ఆయన  తాను రాజీనామా చేసినట్టుగా నాటకం ఆడి రాజ్యాంగాన్ని అవమానించారని ప్రతిపక్ష టీడీపీ, కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ఈ రెండు పార్టీలూ అలుపెరుగని పోరాటం చేయడానికి పూర్తిగా ప్రిపేర్ అయి వున్నాయి. దీంట్లో భాగంగానే టీటీడీపీ నేతలు మంగళవారం నాడు గవర్నర్ని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ మంగళవారం నాడే మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన మాటలు ఆయన ఒక రాష్ట్రానికి మంత్రా? లేక ఒక వీధి రౌడీనా అనే సందేహాలు కలుగుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒక మంత్రిగారిని వీధి రౌడీతో పోల్చడం న్యాయం కాదు కదా అని ప్రశ్నిస్తే, ఒక్కసారి మంత్రిగారు మాట్లాడిన తీరును పరిశీలించండని అంటున్నారు. తాను ఉత్తుత్తి రాజీనామా చేసి రాజ్యాంగాన్ని అవమానించినట్టు ఆరోపణలు వచ్చినప్పుడు ఆ విషయంలో తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఒక మంత్రిగా ఆయన మీద వుంది. మంగళవారం నాడు జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఏదో ఒక కాగితాన్ని చూపించి నేను ఏనాడో రాజీనామా చేశానని అంటున్నారే తప్ప... ఆ విషయంలో స్పష్టంగా మాట్లాడలేదు. తన రాజీనామాకు సంబంధించిన పూర్తి వివరాలను ఆధారాలతో సహా స్పష్టంగా బయటపెడితే ఈ విషయంలో పోరాటం చేస్తున్న టీటీడీపీ, కాంగ్రెస్ నాయకులు చల్లబడేవారు. అయితే తలసాని అలా చేయకుండా తన హోదాను మరచిపోయి మాట్లాడారని పలువురు అంటున్నారు. తన జోలికి వస్తే ఖబడ్దార్ అని, తన జోలికి వచ్చిన వారి ఒక్కొక్కళ్ళ బతుకు బయట పెడతానని, తాను రాజకీయాలు వద్దని అనుకుంటే పరిస్థితి వేరే రకంగా వుంటుందని అనడం ప్రతిపక్ష నాయకులను ఒక వీధి రౌడీ తరహాలో బెదిరించినట్టే వుందని అంటున్నారు. అయితే ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో వున్న వ్యక్తిని వీధి రౌడీతో పోల్చడం మాత్రం న్యాయం కాదు. తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను వీధి రౌడీ అని అంటున్నవాళ్ళు అలాంటి కామెంట్లు చేయకుండా వుంటే పద్ధతిగా వుంటుంది.

రాజీనామా చేయకుండా రాద్దాంతమేల?

  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా వ్యవహారంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకి ఆయన చాలా ధీటుగానే బదులిచ్చారు. కానీ నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేసానని గొప్పగా చెప్పుకొంటున్న ఆయన వారడిగిన ప్రశ్నకు సూటిగా బదులీయకుండా తనను ప్రశ్నించిన వారిపై ఎదురుదాడి చేయడం, అందరి బాగోతాలు బయటపెడతానని బెదిరించడం విస్మయం కలిగిస్తోంది. పైగా ఇటువంటి పొరపాటుని అన్ని రాజకీయపార్టీలు చేస్తున్నాయి కనుక తను చేయడం తప్పు కాదన్నట్లుంది ఆయన వాదన. అటువంటప్పుడు నైతిక విలువల గురించి చెప్పుకోవడం ఎందుకు?   స్పీకర్ కి ఇచ్చిన రాజీనామా లేఖను తను జేబులో పెట్టుకొని తిరుగుతున్నానని ఆయన చెపుతున్నారు. కానీ ఒకపక్క తను ఎప్పుడో రాజీనామా చేసానని చెప్పుకొంటూ దానిని 8 నెలలయినా ఆమోదింపజేసుకోనప్పుడు ఇక దానికి అర్ధం ఏముంటుంది? దానిని జేబులో పెట్టుకొని తిరగడం వలన ప్రయోజనం ఏముంటుంది? అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. నైతిక విలువలకి కట్టుబడి ఉన్నానని తలసాని ప్రకటించుకొన్నప్పుడు, తను ఇతరులకి ఆదర్శంగా ఉండాలి. కానీ అందరూ చేస్తున్న తప్పునే ఆయన చేయాలనుకొంటే ఇక నైతిక విలువల గురించి మాట్లాడటమే అనవసరం.   ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ చేతికి ఇచ్చేనని చెపుతుంటే, అసెంబ్లీ డిప్యూటీ కార్యదర్శి తమకు ఆయన రాజీనామా చేరలేదని కాంగ్రెస్ నేత గండ్ర వెంకట రమణారెడ్డికి లికిత పూర్వకంగా తెలియజేసారు. మరయితే ఆయన రాజీనామా లేఖ ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నట్లు? అని గండ్ర అడుగుతున్న ప్రశ్నకు స్పీకర్ ద్వారా జవాబు చెప్పించగలిగితే బాగుండేది. కానీ అలా చేస్తే అప్పుడు “ఇంతకాలం తలసాని రాజీనామా లేఖను ఎందుకు ఆమోదించలేదు?” అనే ప్రశ్నకు స్పీకర్ సంజాయిషీ చెప్పుకోవలసి వస్తుంది.   తను మళ్ళీ ఎమ్మేల్యేగా గెలవగలననే ధీమా ఉన్నందునే తను ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయలేదని తలసాని చెప్పుకొన్నారు. తెదేపా ఎమ్మేల్యే ఎర్రబెల్లి దయాకర్ రావుని తనతో సనత్ నగర్ నియోజక వర్గం నుండి పోటీ చేసి గెలవమని, ఒకవేళ తను ఓడిపోతే రాజకీయల నుండి తప్పుకొంటానని తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాలు విసిరారు. కానీ అసలు ఇంతవరకు తన రాజీనామానే ఆమోదింపజేసుకోకుండా ఆయన తన ప్రత్యర్ధులకు ఇటువంటి సవాళ్ళు చేయడం అర్ధరహితమనే చెప్పక తప్పదు.   ఇక రెండు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన “రెండు రోజులు రాజకీయాలను కాదనుకొంటే...నాలుగు రోజులు ప్రభుత్వం లేదనుకొంటే నేనేమిటో చెపుతాను” అని మాట్లాడటం బాధ్యతారాహిత్యమేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కానీ ఆయన ఇవన్నీ మాట్లాడకుండా స్పీకర్ చేత తక్షణమే తన రాజీనామాను ఆమోదింపజేసుకొని ఉంటే ప్రతిపక్షాలకు గట్టి జవాబు చెప్పినట్లు ఉండేది. కానీ ఆ పని చేయకుండా ఈవిధంగా వాదోపవాదాలు చేయడం వలన ఆయనే స్వయంగా ప్రతిపక్షాలకు ఆయుధాలు అందిస్తున్నట్లవుతోంది. దాని వలన ఆయనకి, తెరాస ప్రభుత్వానికి మరింత అప్రదిష్ట కలుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఆ కోణంలోనూ ఆలోచించండి గురూ

  తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన టీడీపీ ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు వెలగబెడుతున్నారని, ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందకి వస్తుందని, ఆయన్ని ముఖ్యమంత్రి వెంటనే బర్తరఫ్ చేయాలని లేకపోతే గవర్నర్ అయినా ఆయన్ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ ఉత్తుత్తి రాజానామా వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ నాయకుడు గండ్ర వెంకట రమణారెడ్డి. అయినప్పటికీ ఈ విషయంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా యాక్టివ్ అయిపోయింది. మిగతా విషయాల్లో ఎలా వున్నప్పటికీ తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ టీడీపీ నాయకులు తలసాని విషయంలో మాత్రం ఒకే మాటగా ముందుకు సాగుతున్నారు. టీటీడీపి ఈ విషయంలో మరింత చురుగ్గా వ్యవహరించి గవర్నర్ దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు కూడా చేసింది. కాంగ్రెస్ నాయకులు కూడా ఈ విషయంలో సాధ్యమైనంత రచ్చ చేయాలని భావిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ విషయంలో ఈ రెండు పార్టీల నాయకులు ఆలోచించాల్సిన విషయాలు కొన్ని వున్నాయి. గండ్ర సమాచార హక్కు చట్టం ద్వారా శాసనసభ కార్యాలయానికి దరఖాస్తు చేసుకుంటే తలసాని రాజీనామా లేఖ తమ దగ్గర లేదని సమాధానం వచ్చింది. అయితే ఆ లేఖ స్పీకర్ కార్యాలయం దగ్గర వుండవచ్చు కదా. స్పీకర్ కార్యాలయం ఆ లేఖకు సంబంధించిన వివరాలను శాసనసభకు అందించకపోయి వుండవచ్చు కదా. అలా అందించి తీరాలనే నిబంధనలు ఒకవేళ ఉన్నప్పటికీ ‘‘స్పీకర్‌కి వుంటే అపరిమిత, విశేష అధికారాలు’’ ఆధారంగా సదరు లేఖను శాసనసభ కార్యాలయానికి పంపించి వుండకపోవచ్చు కదా. కొంతమంది స్పీకర్ కార్యాలయానికి కూడా ఈ లేఖ రాలేదని అంటున్నారు. ఒకవేళ తలసాని తన రాజీనామా లేఖను స్పీకర్‌కి ఇచ్చి వుండొచ్చు. ఆయన తనకున్న విశేష అధికారాలను వినియోగించుకుంటూ ఆ లేఖను ఎక్కడకీ పంపకుండా తన దగ్గరే వుంచుకుని వుండొచ్చు...... ఇలాంటి తిరకాసులు, మతలబులు ఈ అంశం చుట్టూ వున్నాయి. అందువల్ల ఈ విషయంలో రెండు పార్టీలూ అన్ని కోణాల్లోనూ ఆలోచించి ముందడుగు వేయాలి. లేకపోతే ఈ పోరాటం చివర్లో తుస్సుమనే ప్రమాదం వుంది.

భలే మంచి గవర్నర్ గారు

మొత్తానికి మన గవర్నర్ నరసింహన్ భలే మంచివారు. ఇలాంటి గవర్నర్ మనకు దొరకడం, అది కూడా ఐదేళ్ళతో ఆగకుండా ఎక్స్‌టెన్షన్ కావడం, అందులోనూ రెండు రాష్ట్రాలకూ ఈయనగారే గవర్నర్ గా వుండటం తెలుగు ప్రజలు చేసుకున్న ఏ పుణ్యఫలమో అనిపిస్తూ వుంటుంది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఎన్నో విషయాలలో జుట్టూ జుట్టూ పట్టుకుంటున్నా మహానుభావుడు ఉలకరు, పలకరు. తన రాష్ట్రానికి అనేక విషయాలలో అన్యాయం జరుగుతోందని ఏపీ ప్రభుత్వం ఎంత మొత్తుకున్నా ఆయన అర్ధ నిమీలిత నేత్రాలతో ప్రశాంతంగా చూస్తారే తప్ప ఏమాత్రం స్పందించరు. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలను అధికార టీఆర్ఎస్ గుంజుకుందని మొరపెట్టుకున్నా ‘‘ఆ విషయం కోర్టులో వుంది కదా’’ అని ప్రశాంతంగా ఎదురు ప్రశ్నిస్తారు. టీడీపీకి రాజీనామా చేయకుండానే చేసినట్టుగా భ్రమింపజేసి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి పదవి పొందారని ఫిర్యాదు చేయడానికి మంగళవారం నాడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ సభ్యులు గవర్నర్‌ గారికి ఫిర్యాదు చేయడానికి వెళ్ళారు. అక్కడ టీటీడీపీ సభ్యులతో ఆయన మాట్లాడిన తీరు చూస్తే ఇంత గొప్ప గవర్నర్ని మనం పొందడం మన అదృష్టం అనిపించడం ఖాయం. టీటీడీపీ సభ్యులు తలసాని విషయాన్ని ఫిర్యాదు చేసినప్పుడు... తాను ఈ విషయంలో స్పందించాల్సిన అవసరం లేదన్నట్టుగా ‘‘పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశం కోర్టులో వుంది కదా’’ అని తప్పించుకునే ప్రయత్నం చేశారు. దానికి టీటీడీపీ సభ్యులు ఆ అంశం వేరు. ఈ అంశం వేరని, అది ఫిరాయింపుల అంశం... ఇది రాజీనామా చేయకుండానే చేసినట్టుగా చెప్పారనే విషయం అని వివరించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన ఈ అంశానికి సంబంధించిన అనేక సందేహాలను అమాయకంగా వ్యక్తం చేశారు. వాటికి టీటీడీపీ సభ్యులు ఓపిగ్గా వివరణలు ఇవ్వాల్సి వచ్చింది. రావుల చంద్రశేఖరరెడ్డి అయితే గవర్నర్ అధికారాలు, విధుల గురించి సుదీర్ఘంగా మాట్లాడాల్సి వచ్చింది. హనుమంతుడికి తన శక్తి ఏమిటో తనకే తెలియకపోతే, ఆయన ఎంత శక్తివంతుడో గుర్తు చేసిన చందంగా, గవర్నర్‌కి ఎలాంటి అధికారాలు వుంటాయో టీటీడీపీ సభ్యులు గుర్తు చేయాల్సి వచ్చింది. ఇంత చేసినా గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా గవర్నర్ ఎలా స్పందించారో అలాగే ‘‘చూస్తా’’ అనే స్పందనే ఎదురైంది. గతంలో ఎన్నో అంశాలలో ఆయన ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు ఈ విషయంలో అయినా స్పందిస్తారని ఆశించడం దురాశ అవుతుందేమో!

పాపం... లగడపాటి

పాపం లగడపాటి రాజగోపాల్. ఎలా వుండేవాడు ఎలా అయిపోయాడో. ఒకప్పుడు సీమాంధ్ర సింహంగా గర్జించిన లగడపాటి ఇప్పుడు తెలంగాణలో పుణ్యస్నానం చేసి మ్యావ్ అని మూలుగుతున్నారు. లగడపాటిని ఈ స్థితిలో చూసిన వారు ఎవరికైనా ఆయన మీద బోలెడంత జాలి కలగడం ఖాయం. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంగా సమైక్యవాది హోదాలో లగడపాటి చేసిన వీరోచిత పోరాటాన్ని గుర్తు చేసుకునే వారు కొంతమంది బాధపడటం కూడా ఖాయం. ఆ రోజుల్లో సీమాంధ్రులందరికీ ఒక రోల్ మోడల్‌గా నిలిచిన ఆయన్ని కాలం ఎంతలో ఎంతలా మార్చేసిందో చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. తెలంగాణ వచ్చే వరకూ తెలంగాణ వాదులకు, టీఆర్ఎస్ నాయకులకు లగడపాటి పెద్ద శత్రువు. లగడపాటి పెద్ద దోపిడీదారుడు. తెలంగాణ వచ్చిన తర్వాత లగడపాటి తాను ప్రకటించిన విధంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా వుంటున్నారు. అయితే పరోక్షంగా ఆయన తెలంగాణ పాలకులకు దగ్గరయ్యారు. తెలంగాణ పాలకులతో కరెంటు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కొంతమంది తెలంగాణ కీలక నాయకులతో వ్యాపార సంబంధాలు కూడా ఈమధ్యకాలంలో బాగా అభివృద్ధి చెందాయట. తెలంగాణ రాకముందు లగడపాటి వ్యాపారాలు వర్ధిల్లాయి... తెలంగాణ ప్రజలకు శత్రువుగా ప్రొజెక్టు అయిన లగడపాటి ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా లాభం పొందుతున్నారు. ఇప్పుడు లగడపాటిని తెలంగాణ నాయకులెవరూ తిట్టిపోయడం లేదు. లగడపాటి కూడా తెలంగాణ నాయకులు తిట్టే విధంగా కాకుండా లోపాయికారీగా వాళ్లతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నారు. అయితే లోపల లోపల ఎంత స్నేహం వున్నా పర్లేదు. ఎన్ని వ్యాపార బంధాలున్నా ఓకే. కానీ లగడపాటి లాంటి వ్యక్తి మీడియా మైకుల ముందు నిల్చుని కేసీఆర్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని కితాబు ఇవ్వడమే ఆయన మీద జాలి కలిగించే విషయం. మొన్న కరీంనగర్ జిల్లా కాళేశ్వరానికి కుటుంబ సమేతంగా పుష్కర స్నానానికి వెళ్ళిన లగడపాటి పుష్కర ఏర్పాట్లు అద్భుతంగా వున్నాయని, కొత్త రాష్ట్రమైనా పుష్కర ఏర్పాట్లు అద్భుతంగా చేశారని అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని, కేసీఆర్ని పొగడ్తల్లో ముంచెత్తారు. ఇది ఎవరూ ఊహించని పరిణామం. ఈ సందర్భంగా చాలామంది లగడపాటిని చూసి జాలిపడుతున్నారు. ఎంత వీర సమైక్యవాది అయినా వ్యాపారం కోసం ఇలా మాట్లాడక తప్పని పరిస్థితి ఆయనది అని సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

అందుకేనా తెరాస మళ్ళీ కేంద్రంతో కటీఫ్?

  ఆ మధ్యన కేసీఆర్ కుమార్తె (నిజామాబాద్ యంపీ) కవిత ప్రధాని మోడీతో కలిసి సెల్ఫీ తీయించుకొని తమ పార్టీ మోడీ ప్రభుత్వంతో చాలా సన్నిహితంగా మెలుగుతోందనే సంకేతాలు పంపారు. అంతకు ముందు “మోడీలేదు...గీడీలేదు...” అని అన్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హటాత్తుగా తన వైఖరిని మార్చుకొని ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని హడావుడిగా మొదలుపెట్టేసారు. తన కుమార్తె కవితకు కేంద్రమంత్రిగా చేసేందుకే ఆయన తన వైఖరి మార్చుకొన్నారని ప్రతిపక్షాలు విమర్శించాయి. వారి ఆరోపణలు కేవలం ఊహాగానాలని మొదట కొట్టిపారేసిన కవిత, మళ్ళీ కొన్ని రోజుల తరువాత “మోడీ ఆహ్వానిస్తే కేంద్రంలో మంత్రిగా చేరేందుకు తాను సిద్దమే”నని ప్రకటించడంతో వారి ఆరోపణలు, అనుమానాలు నిజమేనని ద్రువీకరించినట్లయింది.   మోడీ ప్రభుత్వం నేటికీ నిలకడగానే వ్యవహరిస్తోంది కానీ తెరాస నేతల వైఖరి మాత్రం మళ్ళీ అకస్మాత్తుగా మారిపోయింది. బహుశః కవితకు కేంద్రమంత్రి మంత్రి ఇవ్వకపోవడం వలననే వారు తమ వైఖరి మార్చుకొన్నారేమో తెలియదు కానీ, ఇంతకు ముందు మోడీతో కలిసి సెల్ఫీ తీయించుకొన్న కవిత కూడా ఇప్పుడు ఆయనపై నిప్పులు కక్కుతున్నారు. మోడీ ప్రభుత్వం మొదటి నుండి కూడా తెలంగాణా పట్ల వ్యతిరేకత, సవతి తల్లి ప్రేమ కనబరుస్తోందని కానీ ఆంధ్రా పట్ల చాలా ఉదారంగా వ్యవహరిస్తోందని ఆమె ఆరోపించారు. ఏడాది గడిచినా ఇంకా హైకోర్టు విభజించకపోవడం, పుష్కరాలలో తెలంగాణా కంటే ఆంధ్రాకు ఎక్కువగా నిధులు కేటాయించడం, తమ అనుమతి తీసుకోకుండా బేగంపేట విమానాశ్రయాన్ని ఆర్మీకి అప్పజెప్పాలని నిర్ణయించుకోవడం వంటి అనేక కారణాలు ఆమె చూపుతున్నారు. ఆమె కేంద్రంపై నేరుగా విరుచుకుపడటంచూస్తే, బహుశః అందుకే మొన్న డిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి కేసీఆర్ దుమ్మ కొట్టి ఉంటారని అనుమానించవలసి వస్తుంది.   కానీ హైకోర్టు విభజనలో ఉన్న న్యాయపరమయిన అంశాల గురించి తెలిసి కూడా ఆమె కేంద్రాన్ని తప్పుపట్టడం అనుచితమేనని చెప్పకతప్పదు. ఆంద్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు నిర్మించుకొనే వరకు హైదరాబాద్ లో ఉన్న హైకోర్టు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుగా కొనసాగుతుందని చాలా స్పష్టంగా పేర్కొనబడింది. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించబోతున్న రాజధాని అమరావతి నగరంలో హైకోర్టుని ఏర్పాటు చేయాలని నిశ్చయించుకొంది. రాజధాని నిర్మాణం మొదలయ్యి అందులో హైకోర్టుకి శాశ్విత భవనాలు, ఇతర సౌకర్యాలు అన్నీ కల్పించే వరకు ఉమ్మడికోర్టు కొనసాగక తప్పదని స్వయంగా హైకోర్టు ధర్మాసనమే స్పష్టం చేసింది. అంతవరకు ఎవరూ ఆందోళనలు చేయడానికి వీలులేదని, చేస్తే చట్ట ప్రకారం వారిపై తగిన చర్యలు తీసుకోవలసి వస్తుందని కూడా హెచ్చరించింది.   కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సాంకేతిక అవరోధం గమనించిన తరువాతనే తెలంగాణకు హైకోర్టు ఏర్పాటు చేయలేకపోయింది. లేకుంటే మూడు నెలల్లోనే తెలంగాణకు హైకోర్టు ఏర్పాటు చేస్తామని న్యాయశాఖామంత్రి సదానంద గౌడ ఇదివరకే ప్రకటించారు. ఇవన్నీ తెరాస ఎంపీ కవితకు తెలియవని భావించలేము. కానీ తెలియనట్లు ఆమె మోడీ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. అంటే ఆమె అక్కసుకి వేరే ఇతర కారణాలున్నాయని అనుమానించవలసి వస్తుంది. ఆమెకు కేంద్రమంత్రి ఇవ్వకపోవడం, ఓటుకి నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, సెక్షన్: 8 అమలు తదితర అంశాలలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి తెరాస ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం చెంది ఉండటం అందుకు ప్రధాన కారణాలు కావచ్చును.   కానీ ఎన్డీయే కూటమిలో భాగస్వామి కూడా కాని తెరాస, కేంద్రమంత్రి పదవిని ఏవిధంగా ఆశిస్తోందో తెలియదు. ఒకవేళ ప్రధాని మోడీ తన మంత్రివర్గాన్ని విస్తరించాలనుకొంటే అందులో మొట్టమొదట తన పార్టీకి చెందిన నేతలకు, ఆ తరువాత ఎన్డీయే కూటమిలో భాగస్వామి పక్షాలకు కేంద్రమంత్రి పదవులు ఇచ్చుకొంటారే కానీ తెరాసని, కేసేఆర్ ని మంచి చేసుకోవడానికి కవితకు కేంద్రమంత్రి పదవి కట్టబెడతారని అనుకోవడం అత్యాశే. అయినా మోడీతో సెల్ఫీలు తీసుకొన్నంత మాత్రాన్న కేంద్రమంత్రి పదవి ఆశించేయడమేనా? కొన్ని రోజులు కేంద్రంతో సన్నిహితంగా మెలగడం, మళ్ళీ మరికొన్నాళ్ళు కత్తులు దూస్తూ తెరాస ప్రభుత్వం నిలకడలేని వ్యవహారశైలి ప్రదర్శిస్తోంది. దాని వలన తెలంగాణా రాష్ట్రానికి లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది. కేంద్రంపై ప్రస్తుతం కవిత చేస్తున్న ఆరోపణలు చూస్తే ఆ సంగతి అర్ధమవుతుంది.

తెలుగు రాష్ట్రాలపై దృష్టి సారించిన రాహుల్ గాంధీ

  ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితికి తను తానే నిందించుకోవలసి ఉంటుంది. కారణాలు అందరికీ తెలిసినవే. ఏడాదిగా రెండు రాష్ట్రాలలో తమ పార్టీని దానితో ముడిపడున్న తమ నేతల రాజకీయ భవిష్యత్ ని కూడా వారి అధిష్టాన దేవతలు పట్టించుకోలేదు. అందుకే రెండు రాష్ట్రాలలో చాలా మంది సీనియర్ నేతలు పార్టీని విడిచి పెట్టి వేరే పార్టీలలోకి వెళ్ళిపోయారు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొన్నట్లుగా ఇప్పుడు రాహుల్ గాంధీ మేల్కొని రెండు రాష్ట్రాలలో పీసీసీ అధ్యక్షులని, సీనియర్ నేతలని డిల్లీకి పిలిపించుకొని పార్టీ పరిస్థితిని సమీక్షించారు.   రెండు రాష్ట్రాలలో పార్టీని మళ్ళీ బలోపేతం చేయాలని, సభ్యత్వనమోదు ప్రక్రియను ఈనెలాఖరులోగా పూర్తి చేయాలని ఇరు రాష్ట్రాల నేతలని ఆయన ఆదేశించారు. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలో పార్టీ నేతలు చురుకుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఇటీవల రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చిచ్చు రగిలించిన ఓటుకి నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసుల గురించి అడిగి తెలుసుకొన్నారు. ఆ అంశాలపై పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలనుకొంటున్నట్లు తన నేతలకు తెలిపారు. ఆ తరువాత పార్టీలో సీనియర్ నేతలయిన బొత్స, డి.యస్ తదితరుల నిష్క్రమణ గురించి చర్చిస్తున్నప్పుడు జానారెడ్డిని ఉద్దేశ్యించి “మీరు పార్టీలో ఉంటున్నారా లేక త్వరలోనే వెళ్ళిపోతున్నారా?” అని రాహుల్ గాంధీ సూటిగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అంటే పార్టీలో ఎవరు ఉంటారో ఎవరు ఎప్పుడు వెళ్లిపోతారో తెలుసుకోలేని పరిస్థితిలో రాహుల్ ఉన్నట్లు అర్ధమవుతోంది. కానీ ఇప్పటికయినా ఆయన చొరవ తీసుకొని పార్టీ పరిస్థితి గురించి అడిగి తెలుసుకోవడం పార్టీ నేతలకి కూడా సంతృప్తి కలిగించింది.   తెలంగాణా ఇచ్చినందున కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్రంలో ప్రజలు ఆదరించవచ్చును. కానీ అక్కడా ఆ పార్టీ గెలవలేకపోగా కనీసం అధికార తెరాస ధాటికి నిలబడి గట్టిగా పోరాటం చేసే పరిస్థితిలో లేదు. పార్టీ నేతలని తెరాసలోకి ఆకర్షిస్తుంటే ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ “వాళ్ళు పోయినంత మాత్రాన్న పార్టీకి ఏమీ నష్టం లేదు” అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించవలసి వస్తోంది. ఎంతో కొంత అనుకూలతలున్న తెలంగాణాలోనే కాంగ్రెస్ పార్టీ గట్టిగా నిలద్రొక్కుకోలేనప్పుడు ఇక నేటికీ ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఆంధ్రాలో తన పార్టీని బలపరుచుకోవాలని రాహుల్ గాంధీ ఏవిధంగా ఆశిస్తున్నారో తెలియదు.   ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, తప్పితే చిరంజీవి అన్నట్లు తయారయింది. మిగిలిన వారందరూ ప్రజలకి మొహం చాటేసి తమతమ వ్యాపారాలు చక్క బెట్టుక్కొంటున్నారు. ఉన్న ఆ ఇద్దరిలో చిరంజీవి తన 150వ సినిమా నిర్మాణంపై కనబరుస్తున్న శ్రద్ధ పార్టీని బలోపేతం చేయడం చూపడం లేదనే మాట వాస్తవం. మరి ఇటువంటి దయనీయమయిన పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ ఏవిధంగా రక్షించుకొంటారో చూడాలి.

రాహుల్ గాంధీ పర్యటనకి తెదేపా ప్రచారం?

  ఇంతకు ముందు తెలంగాణాలో పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ ఈనెల 24న ఆంధ్రాలో (అనంతపురం జిల్లాలో) పాదయాత్ర చేయడానికి వస్తున్నారు. కానీ ఆయనని ఆంధ్రాలో అడుగుపెట్టనీయమని జిల్లాకు చెందిన కొందరు నేతలు హెచ్చరిస్తున్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర విభజన చేసి, రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినందుకు ముందుగా ఆయన రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పిన తరువాతనే రాష్ట్రంలో అడుగుపెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అందుకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, వి.హనుమంతరావు వంటి వీరవిధేయులు గట్టిగా జవాబిస్తున్నారు. ఈవాదోపవాదాల వలన రాహుల్ గాంధీకి, ఆయన పాదయత్రకి అనవసర ప్రాధాన్యం ఇచ్చినట్లవుతుందనే సంగతి తెదేపా నేతలు విస్మరించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ విషయం బాగానే గ్రహించినట్లున్నారు. అందుకే వారు మరింత ధీటుగా తెదేపా నేతలకు బదులిస్తున్నారు. ఈ అంశంపై కాంగ్రెస్, తెదేపా నేతల మధ్య ఎంత వాగ్వాదాలు జరిగితే అంత ఫ్రీ పబ్లిసిటీ దొరుకుతుందని కాంగ్రెస్ నేతలకి అర్ధమయింది. కానీ తెదేపా నేతలకి ఇంకా అర్దమయినట్లు లేదు.   ఈ విషయంలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా చక్కగా వ్యవహరించారని చెప్పక తప్పదు. రాహుల్ గాంధీ ఆదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర చేయబోతున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, “గాంధీలు వస్తుంటారు వెళుతుంటారు. వారిని పట్టించుకోనవసరం లేదు,” అని చెప్పడం ద్వారా రాహుల్ గాంధీ జిల్లా పర్యటనకి తను ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని స్పష్టం చేసారు. అంతే కాదు తెరాస నేతలెవరూ కూడా ఆయన పర్యటన గురించి అసలు పట్టించుకోకుండా చేసారు. దానితో కేసీఆర్ చెప్పినట్లే ‘రాహుల్ గాంధీ వచ్చేరు..వెళ్ళేరు అంతే!” అన్నట్లు చాలా చప్పగా పూర్తయింది ఆయన పాదయాత్ర.   కానీ ఆంధ్రాలో తెదేపా నేతలు రాహుల్ గాంధీ పాదయాత్ర గురించి మాట్లాడుతూ ఆయన పర్యటనకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్వయంగా ప్రకటించుకోవడమే కాకుండా ఆయన పర్యటనకి వారే ఉచిత ప్రచారం చేసి రాష్ట్ర ప్రజలందరి దృష్టి ఆయన పర్యటనపై పడేలా చేస్తున్నారు. కానీ తెదేపా నేతలు కూడా ఆయన పాదయత్రని పట్టించుకోకుండా ఊరుకొంటేనే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ నష్టం జరుగుతుందని తెలుసుకోలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయినా రాహుల్ గాంధీ మారధన్ రేసులో పాల్గొంటున్నట్లు హడావుడిగా జిల్లాలో పాదయాత్ర చేసినంత మాత్రాన్న జీవచ్చవంలా ఉన్న కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ బ్రతికి బట్ట కడుతుందని ఎవరూ కూడా అత్యాశకి పోవడం లేదు.

వైకాపా నేతల ఆ ధోరణి ఏమిటో?

  పచ్చ కామెర్ల వ్యాధి ఉన్నవాడికి లోకం అంతా పచ్చగా కనిపించినట్లే వైకాపా నేతలకి తమ ఆలోచనా విధానానికి, స్థాయికి తగ్గట్టుగానే మాట్లాడటం, ప్రతీ అంశాన్ని చూడటం, దానిని తమ కోణంలో నుండే ప్రజలకి కూడా చూపించాలని విఫలయత్నాలు చేయడం అలవాటుగా మారిందని తెదేపా నేతలు అభిప్రాయపడుతున్నారు.   రాజమండ్రిలో నిన్న జరిగిన దుర్ఘటనపై వైకాపా నేతలు చేస్తున్న శవరాజకీయాలు చూసి రాజకీయ నేతలందరూ సిగ్గుతో తలలు దించుకోవలసి వస్తోందని తెదేపా నేతలు అంటున్నారు. సామాన్య భక్తులకోసం కేటాయించిన కోటగుమ్మం పుష్కర ఘాట్ లో చంద్రబాబు నాయుడు స్నానం చేయడం వలననే బయట రద్దీ పెరిగిపోయి త్రొక్కిసలాట జరిగిందని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తే, ఆపార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మరొక్క మెట్టు క్రిందకు దిగి, పుష్కరాలకు లక్షలాది జనం తరలివచ్చారని చూపించి, చంద్రబాబు నాయుడుకి మరింత ప్రచారం కల్పించేందుకే పోలీసులు రాజమండ్రికి చేరుకొంటున్న ప్రజలను బలవంతంగా కోటగుమ్మం పుష్కర్ ఘాట్ వైపు పంపించారని, రాష్ట్ర ప్రభుత్వం దానిని లఘుచిత్రం (షార్ట్ ఫిలిం)గా చిత్రీకరించిందని, ఆ కారణంగానే 35మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.   ఆమె ఆరోపణలకు తెదేపా నేతలు కూడా అంతే ధీటుగా స్పందించారు. “ఇంత నీచమయిన ఆలోచన కేవలం వైకాపా మాత్రమే చేయగలదని” విమర్శించారు. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి క్రీష్టియన్ మతస్తుడు అయినప్పటికీ పుష్కరాలలో స్నానాలు చేయడం, తండ్రికి పిండ ప్రదానాలు చేయడం వంటివన్నీ ప్రజలను ఆకట్టుకోవడానికేనని వారు ఆరోపిస్తున్నారు. అత్యంత రద్దీ సమయంలో ప్రజలను ఆకట్టుకోవడానికి ఇటువంటి డ్రామాలు ఆడుతూ, ఇటువంటి శవ రాజకీయాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి పుష్కర స్నానం వలన కలిగిన పుణ్యం కూడా లేకుండా చేసుకొంటున్నారని తెదేపా నేతలు విమర్శిస్తున్నారు. ఇటువంటి సమయంలో పుష్కరాలకు వస్తున్న ప్రజలకు అండగా నిలబడి, వారి యాత్రలు సజావుగా పూర్తి చేసుకొనేందుకు సహకరించవలసింది పోయి, ప్రభుత్వాన్ని మరింత అప్రదిష్ట పాలు చేసేందుకే ప్రజలలో మరింత భయాందోళనలను పెంచే విధంగా వైకాపా నేతలు ఆరోపణలు చేస్తున్నారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. ఏమయినప్పటికీ ఇకపై ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా పుష్కరాలను ప్రశాంతంగా, దిగ్విజయంగా నిర్వహిస్తామని తెదేపా నేతలు శపథం చేస్తున్నారు.   వారి ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలా ఉన్నప్పటికీ ఇంతవరకు కేవలం తెలంగాణాలో జరిగే పుష్కరాల గురించి, వాటి కోసం తెరాస ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్ల గురించి మాత్రమే జగన్మోహన్ రెడ్డికి చెందిన మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. అది ఎంతగా అంటే అసలు ఆంధ్రాలో పుష్కరాలే జరగడం లేదన్నట్లు, కేవలం తెలంగాణాలో మాత్రమే గోదావరి పుష్కరాలు జరుగుతున్నంతగా! అది చూసి రాష్ట్ర ప్రజలు కూడా చాలా ఆశ్చర్యపోయారు. జగన్ కి చెందిన మీడియాలో రాజమండ్రిలో జరుగబోతున్న గోదావరి పుష్కరాల గురించి, వాటి కోసం గత నెలరోజులుగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని గురించి ఏనాడు పెద్దగా ప్రస్తావించలేదు. కానీ ఇప్పుడు ఈ దుర్ఘటన జరిగిన మరుక్షణం నుండి పదేపదే దాని గురించి కధనాలు ప్రసారం చేస్తూ ప్రజలను భయబ్రాంతులని చేసే ప్రయత్నాలు చేయడం చాలా శోచనీయం. ఈ విధంగా ప్రతీ అంశాన్ని కూడా రాజకీయం చేయాలని ప్రయత్నించి వైకాపా ఇదివరకు చాలా సార్లు భంగపడింది. బహుశః మళ్ళీ ఈ వ్యవహారంలో కూడా దానికి మరొక్కమారు భంగపాటు తప్పదేమో?

పుష్కర ఘటనలు పునరావృతం జాగ్రత్త పడవచ్చు

  ఈ మహా పుష్కరాల గురించి ప్రభుత్వాలు, మీడియా చేసిన అతి ప్రచారం వలననే ఊహించిన దాని కంటే చాలా భార్గీ ప్రజలు తరలివస్తున్నారని చెప్పవచ్చును. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ ఊహించని స్థాయిలో లక్షలాదిగా తరలి వస్తున్న ప్రజలను నియంత్రించడం అధికారుల వలన కాలేదు. అందుకే ఈరోజు ఈ దుర్ఘటన జరిగిందని చెప్పవచ్చును. నిజానికి ప్రభుత్వం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 27 ఘాట్స్ ఏర్పాటు చేసినప్పటికీ ప్రజలను వాటి వైపు మళ్ళించకుండా రాజమండ్రిలోకి అనుమతించడం కూడా ఈ ప్రమాదానికి ఒక కారణంగా చెప్పవచ్చును.   పుష్కరాలలో మొదటి రోజయిన మంగళవారంనాడు రాజమండ్రిలో ఇసుకవేస్తే రాలనంత జనం కనిపిస్తే, అక్కడికి కొన్ని మైళ్ళ దూరంలో పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం వద్ద ఏర్పాటు చేసిన ఘాట్ వద్ద చాలా పలచగా జనం కనిపించారు. నది తీరం అంతా ఖాళీగా కనబడింది. రెండు జిల్లాలలో ఖాళీగా ఉన్న అటువంటి ఘాట్స్ ఇంకా చాలానే ఉన్నాయి. అధికారులు ముందు నుండే ప్రజలను వాటి వైపు మరలించే విధంగా ప్రణాళికలు, ఏర్పాట్లు చేసుకొని ఉండి ఉంటే ఈ దుర్ఘటన జరిగేదే కాదేమో?   కనుక ఇకనయినా ప్రభుత్వం ఏఏ ఘాట్స్ వద్ద ఖాళీ ఉంది? ఇంచుమించుగా అక్కడ ఎంతమంది స్నానాలు చేస్తున్నారు? అక్కడికి చేరుకోవడానికి దగ్గర మార్గం ఏది? అక్కడికి చేరుకోవడానికి ఎటువంటి రవాణా సౌకర్యాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేసింది? వంటి వివరాలను రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండ్లలో డిజిటల్ టీవీల ద్వారా, టీవీ చాన్నాళ్ళలో ఇంటర్నెట్ లో విరివిగా ప్రచారం చేసినట్లయితే ఈ రద్దీని నియత్రించవచ్చును. ఈ పుష్కరాలను నిర్వహిస్తున్న స్థానిక అధికారులే స్వయంగా ప్రజలను వేర్వేరు ఘాట్స్ వైపు మళ్ళించడం మంచిది. ప్రజలు కూడా రాజమండ్రిలోనే పుష్కర స్నానాలు చేయాలనుకోకుండా మిగిలిన 12 రోజుల్లో ఖాళీగా ఉన్న వేర్వేరు ఘాట్స్ స్నానాలు చేయడం మంచిది.   పుష్కర ఘాట్స్ లో ఖాళీ ఉందని రూడీ చేసుకొంటే తప్ప చిన్న పిల్లలను, వృద్ధులను తీసుకు వెళ్ళకపోవడమే మంచిది. పుష్కరాలకు వెళ్ళలేని వాళ్ళ కోసం పోస్టల్ శాఖ గోదావరి పుష్కర జలాలను ప్యాకెట్ల ద్వారా ఇంటికే అందిస్తోంది. పుష్కర మంత్రం చదువుకొని ఆ నీళ్ళను నెత్తిన జల్లుకొన్నా చాలని వేదపండితులు చెపుతున్నారు. కాశీ వెళ్లి గంగలో మునగలేక పోయినవారు అక్కడికి వెళ్లి వచ్చే తమ బంధు, మిత్రుల ద్వారా కాశీ నుండి గంగను తెప్పించుకొని, ఇంట్లో ఉంచుకొని అవసరమయినప్పుడు అదేవిధంగా చేయడం హిందువులు అందరికీ తెలిసిన విషయమే. కనుక గోదావరి పుష్కరాలకు వెళ్ళలేని వారు కూడా ఈ పద్ధతినే ఆశ్రయించడం మంచిది.

పాక్ మళ్ళీ మాట మార్చింది

  రెండు రోజుల క్రితం భారత్, పాకిస్తాన్ ప్రధాన మంత్రులు రష్యాలో సమావేశమయినప్పుడు, పాకిస్తాన్ లో స్వేచ్చగా తిరుగుతున్నముంబై ప్రేలుళ్ళ సూత్రధారి జాకి ఉర్ రెహమాన్ న్ని శిక్షించేందుకు సహకరించాలని ప్రధాని మోడీ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ని కోరినప్పుడు అందుకు ఆయన అంగీకరించారు. ఆ తరువాత ఇరు దేశాల విదేశీ కార్యదర్శులు కలిసి ఇదే విషయం దృవీకరిస్తూ ఒక ప్రకటన కూడా చేసారు. కానీ నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ చేరుకోగానే షరా మామూలుగానే మాట మార్చారు. ముంబై ప్రేలుళ్ళ కేసును విచారిస్తున్న రావాల్పిండి కోర్టు నిందితుని గొంతును గుర్తించేందుకు వాయిస్-సాంపిల్స్ సేకరించే చట్టం ఏదీ పాకిస్తాన్ రాజ్యాంగంలో లేదని నాలుగేళ్ల క్రితమే తేల్చి చెప్పిందని, కనుక మళ్ళీ దాని కోసం కోర్టులో కొత్తగా మరో పిటిషన్ వేసే ఆలోచన తమకు లేదని ప్రభుత్వ ప్రాసిక్యూషన్ ప్రధాన న్యాయవాది చౌదరి అజహర్ తేల్చి చెప్పారు. నిందితుడు తనంతట తానుగా వాయిస్-సాంపిల్స్ ఇచ్చేందుకు అంగీకరిస్తే తప్ప భారత ప్రభుత్వం కోరినట్లు లక్వీ వాయిస్-సాంపిల్స్ ఇవ్వలేమని తేల్చి చెప్పారు.   పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కాశ్మీర్ అంశం గురించి చర్చల్లో ఎక్కడా ప్రస్తావించకుండా, మోడీ కోరినట్లు లక్వీకి శిక్ష పడేందుకు సహకరిస్తామని చెప్పడం, అదే విషయాన్ని భారత్, పాక్ విదేశంగా కార్యదర్శులు మీడియాముందు ప్రకటించడంతో పాకిస్తాన్ లో ప్రతిపక్షాలు, ప్రభుత్వం మీద పెత్తనం చేస్తున్న కొందరు సైన్యాధికారులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆ విధంగా చేయడం ద్వారా ముంబై ప్రేలుళ్ళకు పాల్పడిన ఉగ్రవాదిని పాక్ ప్రభుత్వమే రక్షిస్తోందని, అతనికి శిక్ష పడాల్సిన అవసరం కూడా ఉందని యావత్ ప్రపంచం ముందు పాకిస్తాన్ ఒప్పుకొన్నట్లయిందని పాకిస్తాన్ లో ప్రతిపక్షాలు పాక్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నాయి. ఉగ్రవాదం గురించి కూడా పాకిస్తాన్ విదేశంగా కార్యదర్శితో ప్రకటన చేయించడంలో మోడీ కృతకృత్యుడయ్యారు. కానీ పాక్ ప్రధాని కాశ్మీర్ అంశం గురించి భారత విదేశంగా కార్యదర్శితో ప్రకటన చేయించలేకపోయారని పాకిస్తాన్ లో ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మోడీ మాయలో పడి నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ దేశాన్ని యావత్ ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టారని అందరూ నవాజ్ షరీఫ్ పై విరుచుకుపడుతున్నారు.   నేరకపోయి లక్వీకి శిక్ష పడేందుకు సహకరిస్తామని ప్రకటించినందుకు ఇప్పుడు పాక్ ప్రభుత్వం లెంపలు వేసుకొంటూ రావల్పిండి కోర్టు వ్యాఖ్యలు, పాకిస్తాన్ చట్టాలని అడ్డుపెట్టుకొని మాట మార్చింది. కానీ ఇరు దేశాల విదేశంగా కార్యదర్శుల ప్రకటనతోనే జరగవలసిన నష్టం జరిగిపోయింది. అయినా ముంజేతి కంకణాన్ని చూసుకొనేందుకు అద్దం ఎందుకన్నట్లుగా పాకిస్తాన్ ఉగ్రవాదులని పెంచి పోషిస్తోందని నొక్కి చెప్పడానికి ఇటువంటి ప్రకటనలు అవసరమా?పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్ర భూతానికి ఆ దేశ ప్రజలు చిన్నారులే బలయిపోతున్న సంగతి లోకానికి తెలుసు. కానీ పాక్ ప్రభుత్వంపై సైమ్యం కర్ర పెత్తనం చేస్తునంత కాలం పాక్ తీరు మారదు.

జి.హెచ్.యం.సి. ఎన్నికల తరువాతే తలసాని రాజీనామా?

  హైదరబాద్ లో సనత్ నగర్ నియోజక వర్గం నుండి తెదేపా టికెట్ మీద అసెంబ్లీ కి ఎన్నికయిన తలసాని శ్రీనివాస్ యాదవ్, తను నైతిక విలువలకి చాలా ప్రాధాన్యం ఇచ్చేవాడినని అందుకే పార్టీకి, తన ఎమ్మేల్యే పదవికి కూడా రాజీనామా చేసిన తరువాతనే తెరాసలో చేరుతున్నానని చాలా గొప్పగా చెప్పుకొన్నారు. కానీ ఏడు నెలలు గడిచిపోయినా స్పీకర్ ఆయన రాజీనామాను ఆమోదించలేదు. ఆయన ఆమోదించక పోతే ఆ తప్పు తనది కాదని తలసాని వాదిస్తున్నారు కానీ నైతిక విలువల గురించి మాట్లాడిన ఆయన తన రాజీనామాను ఆమోదింప జేసుకొనే ప్రయత్నం చేయలేదు. ఇతర పార్టీలకి నీతులు చెప్పే తెరాస ఆ నీతి తనకు వర్తించదని అనుకొందో ఏమో తెలియదు కానీ నేటికీ ఆయన తెరాస ప్రభుత్వంలో తెదేపా ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. స్పీకర్ కి తెదేపా ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఆయన వాటిని పట్టించుకోలేదు. కనుక తెదేపా హైకోర్టులో పిటిషన్ వేయవలసి వచ్చింది. ఇటువంటి అనైతిక పద్దతులను అమలుచేస్తున్నప్పుడు వాటిని నియంత్రించవలసిన వారు కూడా పట్టించుకోకపోవడం వలన అదే ఒక సంప్రదాయంగా మారే అవకాశాలున్నాయి.   ఏదో చీమ కదా చెప్పుకొన్నట్లుగా అయితే తలసాని రాజీనామాను ఎప్పుడు ఆమోదిస్తారు? అంటే జి.హెచ్.యం.సి. ఎన్నికల తరువాత అని తెరాస వర్గాల నుండి జవాబు వినిపిస్తోంది. అయితే ఉపఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు అంటే వార్డుల పునర్విభజన జరిగిన తరువాత అంటున్నారు. వార్డుల పునర్విభజన ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుంది అంటే వచ్చే జనవరి నాటికవుతుందేమో? అనే చెపుతున్నారు. కనుక తలసాని రాజీనామా కూడా ఆ తరువాతే అంటే ఏ మార్చి, ఏప్రిల్ నెలలోనో ఆమోదిస్తారేమో?   ఒకవేళ ఆయన ఇప్పుడు రాజీనామా చేసినట్లయితే ఆరు నెలలలోగా ఉపఎన్నికలలో గెలవవలసి ఉంటుంది. కానీ జి.హెచ్.యం.సి. ఎన్నికలలో ఎలాగయినా గెలవాలని తెరాస చాలా పట్టుదలగా ఉంది కనుక అవి పూర్తయ్యేవరకు ఆయన చేత అటువంటి ప్రయోగాలు చేయడం అంత మంచి ఆలోచన కాదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ దైర్యం చేసి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సిద్దపడినా ఆయన ఒకవేళ గెలవలేకపోతే ఆ ప్రభావం జి.హెచ్.యం.సి. ఎన్నికల మీద పడుతుంది. ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయవలసి వస్తుంది. అది తెరాస ప్రభుత్వానికి చాలా నష్టం కలిగిస్తుంది కనుకనే ఈ జి.హెచ్.యం.సి. ఎన్నికల కార్యక్రమం ఏదో ముగించిన తరువాత అప్పుడే ఆయన రాజీనామా గురించి ఆలోచించవచ్చని తెరాస భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఒకవేళ ఈ లోగా గవర్నర్ లేదా హైకోర్టు ఆయన రాజీనామాను ఆమోదించమని స్పీకర్ ని కోరితే ఏమి చేస్తారో? తలసానిని పార్టీలో చేర్చుకొన్నంత మాత్రాన్న ఆ నోయోజక వర్గ ప్రజలు కూడా తెదేపా నుండి తెరాసకు ఆయనంత విజీగా షిఫ్ట్ అయిపోతారా? అని పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్న కూడా ఆలోచించదగ్గదే.