ప్రపంచ కుబేరుడు థాయ్‌లాండ్ రాజు... రూ.4.5 లక్ష కోట్ల ఆస్తులు
posted on Jan 8, 2026 @ 8:18PM
ప్రపంచంలోని కుబేరుల గురించి మాట్లాడుకుంటే మనకు ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ వంటి పేర్లు గుర్తుకు వస్తాయి. కానీ.. ఏ వ్యాపార సామ్రాజ్యంతో సంబంధం లేకుండా.. కేవలం వారసత్వంగా వచ్చిన ఆస్తులు, వాటిని తెలివిగా పెట్టుబడులు పెట్టి ఒక రాజు ఏకంగా రూ. 4.5 లక్షల కోట్ల సంపదను కలిగి ఉన్నారు. ఆయనే థాయ్‌లాండ్ రాజు మహా వజ్రాలాంగ్‌కోర్న్ ( కింగ్ రామ 10). ఆయన తన తండ్రి కింగ్ భూమిబోల్ అదుల్యాడేజ్ (కింగ్ రామ 11) మరణం తరువాత 2016లో సింహాసనాన్ని అధిష్టించారు. 2019లో అధికారికంగా పట్టాభిషేకం జరిగింది.
ఆయనకు ఉన్న ఇళ్లల్లో రోజుకో ఇంటికి వెళ్లి బస చేసినా.. తిరిగి మొదటి ఇంటికి చేరుకునేందుకు 47 ఏళ్లు పడుతుందట. థాయ్‌లాండ్ రాజు సంపద అక్షరాలా 50 బిలియన్ డాలర్లు.. అంటే సుమారు రూ. 4.5 లక్షల కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఆయన విలాసవంతమైన లైఫ్‌స్టైల్ చూస్తే ప్రపంచంలో ఉన్న కుబేరులు కూడా ఆశ్చర్యపోవాల్సిందే. మహా వజ్రాలాంగ్‌కోర్న్ రాజు పేరు మీద థాయ్‌లాండ్‌లో వేల సంఖ్యలో భవనాలు, రాజప్రాసాదాలు ఉన్నాయి.
ఇక థాయ్‌లాండ్ రాజు వద్ద 38 ప్రైవేట్ జెట్‌లు, విమానాలు ఉన్నాయి. వీటితో పాటు 300కు పైగా అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు అయిన రోల్స్ రాయిస్, బెంట్లీ వంటివి ఉన్నాయి. ఆయన వద్ద పడవలు కూడా ఉన్నాయి. మొత్తం 52 బంగారు పూత పూసిన పడవలు ఉన్నాయంటే ఆయన సంపద ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద కట్ వజ్రం అయిన గోల్డెన్ జూబ్లీ డైమండ్ కూడా మహా వజ్రాలాంగ్‌కోర్న్ రాజు వద్దే ఉండటం విశేషం. మహా వజ్రాలాంగ్‌కోర్న్ రాజు ఆదాయానికి ప్రధాన వనరు థాయ్‌లాండ్ దేశంలోని భూములేనని సంబంధిత వర్గాలు చెబుతాయి.
థాయిలాండ్ దేశవ్యాప్తంగా ఆయన ఆధీనంలో సుమారు 16 వేల ఎకరాల భూమి ఉంది. ఒక్క బ్యాంకాక్ నగరంలోనే 17 వేలకు పైగా ప్రాపర్టీలు ఉన్నాయి. వాటి నుంచి వచ్చే అద్దె రూపంలోనే ఏటా వేల కోట్ల రూపాయలు ఆయన సంపదలోకి వచ్చి చేరతాయి. కార్పొరేట్ పెట్టుబడుల ద్వారా కూడా థాయిలాండ్ రాజు ఆస్తులు పెరుగుతున్నాయి. థాయ్‌లాండ్‌లోని అతిపెద్ద బ్యాంక్ అయిన సియామ్ కమర్షియల్ బ్యాంక్‌లో 23 శాతం మహా వజ్రాలాంగ్‌కోర్న్ రాజు వాటాలను కలిగి ఉన్నారు. అంతేకాకుండా అతిపెద్ద ఇండస్ట్రియల్ గ్రూప్ సియామ్ సిమెంట్‌లో కూడా 33 శాతం వాటాలు ఈయనకే ఉన్నాయి.