చంద్రబాబు.. విజన్ ఎహెడ్.. 2047 అండ్ బియాండ్!
posted on Dec 25, 2025 @ 11:51AM
అందరూ రేపటి గురించి ఆలోచిస్తే.. చంద్రబాబు రెండు దశాబ్దాల ముందు గురించి ఆలోచిస్తారు. అదీ ఆయన విజన్. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ రోజే ప్రణాళికలు రూపొందిస్తారు. అదీ ఆయన దూరదృష్టి. అందుకే రెండు దశాబ్దాలకు ముందు ఆయన విజన్ 2020 అన్నారు. ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది.
ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులూ కూడా చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ ను, దూరదృష్టినీ ప్రశంసిస్తారు. రాజకీయ విభేదాలతో మరుగుల పడేయాలని ప్రయత్నించిన నేతలూ ఉన్నారనుకోండి. వారి ప్రయత్నాలు విఫ లమై వారే మరుగుల పడే పరిస్థితికి రావడం మనం చూస్తున్నాం. సంక్షోభాల నుంచీ అవకాశాల అన్వేషించే అభివృద్ధికాముకుడు చంద్రబాబు. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు, సృజన, ఆలోచనలు, సంస్కరణలతో అందరినీ అబ్బుర పరుస్తుంటారు. ప్రభుత్వ కార్యాలయాలలో కంప్యూటర్లు, బయోమెట్రిక్ అటెండన్స్ ఇవన్నీ చంద్రబాబు ముందు చూపునకు నిదర్శనాలే. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలను, పథకాలను ప్రజలకు అరచేతిలో పెట్టిన ఘనత కూడా చంద్రబాబుదే. ఇప్పుడు తాజాగా మరింత మెరుగ్గా ప్రజలకు సేవలు అందించేందుకు స్పీడ్ అఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానాన్ని తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు చంద్రబాబు.
ఇందు కోసం కార్యాచరణ కార్యాచరణ రూపొందించాలని ఉన్నతాధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. స్వర్ణాంధ్ర లక్ష్యాలు, 10 సూత్రాల అమలుపై సచివాలయంలో సిఎస్ విజయానంద్ పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులతో బుధవారం (డిసెంబర్ 24) భేటీ అయిన చంద్రబాబు స్పీడ్ అఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానంపై వారికి దిశా నిర్దేశం చేశారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానం ద్వారా పౌరులకు వేగంగా, మెరుగైన సేవలు అందించాలన్న ఆయన ఆ మేరకు కార్యాచరణ రూపొందించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
సుస్థిర అభివృద్ధి, అదే సమయంలో స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధన కోసం తీసుకోవలసిన చర్యలపై ఉన్నతాధికారులతో చర్చించిన చంద్రబాబు, ప్రభుత్వ శాఖల మధ్య మెరుగైన సమన్వయం ఉండాలని, తక్కువ ఖర్చుతో ఇంధనం, విద్యుత్, రవాణా, నీటి భద్రత వంటి సేవలను అందించడమే లక్ష్యంగా ప్రణాళికల రూపకల్పన తదితర అంశాలపై అధికారులకు స్పష్ట మైన లక్ష్యాలను నిర్దేశించారు. జీరో పావర్టీ, మానవ వనరుల అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, టెక్నాలజీ వంటి అంశాల ఆధారంగా లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అధికారులను ఆదేశించారు.