అమరావతిలో వాజ్ పేయి విగ్రహం.. ఆవిష్కరించిన చంద్రబాబు
posted on Dec 25, 2025 @ 10:49AM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని ముఖ్య మంత్రి చంద్రబాబు గురువారం (డిసెంబర్ 25) ఆవిష్కరించారు. డిసెంబర్ 25న వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని అమరావతిలోని వెంకటపాలెంలో చంద్రబాబు ఆవిష్కరిం చారు. రాజకీయాలలో అజాతశత్రువుగా గుర్తింపు పొందిన వాజ్‌పేయి విగ్రహాన్ని అమరావతిలో తొలి విగ్రహంగా నెలకొల్పడం.. ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరింత సమన్వయం పెరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలతో కూడిన పాలనకు, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలాంటి అరమరికలూ లేకుండా మిత్రధర్మాన్ని తప్పకుండా నడపిన వాజ్ పేయి స్ఫూర్తిగా ముందుకు సాగాలన్న సంకేతాన్ని ఈ విగ్రహావిష్కరణ ద్వారా చంద్రబాబు ఇచ్చారని అంటున్నారు.
వాజ్ పేయీ శతజయంతి ఉత్సవాలలొ భాగంగా ఆయన జయంతి రోజున వెంకటపాలెంలో వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు. వాజ్ పేయితో తనకు ఉన్న అనుబంధాన్ని నమరువేసుకున్నారు. వాజ్ పేయి హయాంలో ఆంద్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన అందించిన సహాయ సహకారాలను గుర్తు చేసుకున్నారు.
14 అడుగుల ఎత్తులో అమరావతిలో ఏర్పాటు చేసిన ఈ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు భూపతి శ్రీనివాస్ వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, శివ రాజ్ సింగ్ చౌహాన్, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.