మాటకు కట్టుబడి.. పవన్ ఇప్పటం పర్యటన
posted on Dec 24, 2025 @ 2:50PM
మాట తప్పను, మడమ తిప్పను అని పదే పదే చెప్పుకున్న జగన్ అధికారం దక్కి మాట నిలుపుకునే అవకాశం వచ్చినప్పుడు ముఖం చాటేశారు. ప్రజల కష్టాల సంగతి సరే, వారి ముఖం చూడటం కూడా ఇష్టం లేదన్నట్లుగా రోడ్లకు ఇరువైపులా పరదాలు కట్టుకుని మరీ పర్యటలను సాగించారు. అందుకు భిన్నంగా జనసేనాని పవన్ కల్యాణ్ మాటకు కట్టుబడి నడుచుకుంటున్నారు. తాను అధికారంలో లేనప్పుడు ఇచ్చిన మాటను అధికారంలోకి వచ్చిన తరువాత నెరవేర్చారు.
విషయమేంటంటే.. 2022 నవంబర్ లో అప్పటి వైసీపీ సర్కార్ రోడ్డు విస్తరణ పేరుతో మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం అనే కుగ్రామంలో ఇళ్ల ను కూల్చివేసింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ గ్రామాన్ని సందర్శిస్తానని అప్పట్లో మాట ఇచ్చారు. ఆ మాటను ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో నిలబెట్టుకున్నారు. బుధవారం (డిసెంబర్ 24) ఆయన ఇప్పటం గ్రామంలో పర్యటించారు.
ఈ పర్యటనలో భాగంగా ఆయన బండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలి ఇంటికి వెళ్లారు. ఆమె తన కష్టాలను పవన్ కు కన్నీటితో తెలియజేశారు. గతంలో ఇప్పటంలో పర్యటించిన సమయంలో పవన్ క ల్యాణ్ ఆమెకు ధైర్యం చెప్పారు. తాను తిరిగి వస్తాననీ, ఖచ్చితంగా ఆదుకుంటాననీ ఆమెకు మాట ఇచ్చారు. ఈ పర్యటనలో తాను నాడు ఆమెకు ఇచ్చిన హామీని నెరవేర్చారు. నాగేశ్వరమ్మకు ఆమె ఇంటి పెద్దకొడుకుగా తాను అండగా నిలుస్తానని మాట ఇచ్చారు.
అన్నట్లుగానే తన జీతం నుంచి ఆమెకు నెలనెలా ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించారు. అలాగే మూగవాడైన నాగేశ్వరమ్మ మనవడి చదువుకు అవసరమైన ఆర్థిక సాయం అందించడమే కాకుండా, చదువు పూర్తయిన తరువాత ఉద్యోగం కూడా ఇప్పిస్తానని చెప్పారు. ఇక అనారోగ్యంతో బాధపడుతున్న నాగేశ్వరమ్మ కుమారుడి వైద్యం కోసం లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పటం గ్రామానికి వచ్చి పవన్ ఆత్మీయత చాటారని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక జనసేన శ్రేణులైతే పవన్ కల్యాణ్ ది రాజకీయ పర్యటగా కాక బాధ్యత కలిగిన నేతగా పవన్ కల్యాణ్ మానవత్వాన్ని చాటుకున్న తీరుగా అభివర్ణిస్తున్నారు.