ఉల్లిపాయలున్నవి జాగ్రత్త!

 

మహిళలు బజారు నుండి తిరిగివచ్చేటప్పుడు జర భద్రం! మీ బ్యాగులో వంద గ్రాముల కంటే ఎక్కువ ఉల్లిపాయలుంటే మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే ఉల్లిపాయల కోసం మిమ్మల్ని ఎవరయినా కిడ్నాప్ చేసినా ఆశ్చర్యం లేదు.

 

రంగా రెడ్డి జిల్లా, కడిచర గ్రామంలో ఉల్లిపాయల వద్ద రాత్రి కాపలాగా ఉన్న ఊరడి ఎల్లయ్య (65) అనే వృద్దుడిని బుధవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు చంపి, ఉల్లిపాయల బస్తాలు దొంగిలించుకుపోయారు.

 

అదేవిధంగా తమిళనాడు నుండి ఉత్తరప్రదేశ్ లో జవున్పూర్ కు ఉల్లిపాయల లోడుతో వెళుతున్నలారీ డ్రైవర్ని, క్లీనర్నికొందరు దుండగులు రెండు కారుల్లో వెంబడించి వారిని చంపి లారీతో సహా ఉల్లిపాయలను ఎత్తుకు పోయారు. కానీ వారు పోలీసులకి దొరికిపోయారు. గతంలో కూడా తాము ఇలాగే ఒక టొమేటోల లోడుతో వెళుతున్న లారీ డ్రైవర్ని చంపామని కానీ క్లీనర్ మాత్రం తప్పించుకు పోయాడని వారు చెప్పారు. అయితే టొమేటోలు చాలా త్వరగా కుళ్ళిపోవడంతో ఇకపై నిలువ ఉండే దుంపలు, ఉల్లిపాయలు వంటి వాటినే దోచుకోవాలని నిశ్చయించుకొన్నామని వారు చెప్పారు.

 

అందువల్ల మహిళలు బహు పరాక్! వృద్దులు బహు పరాక్! తల్లులు మీ పిల్లలని పక్కనున్న కూరల కొట్టుకి వెళ్లి ఉల్లిపాయలు కొని పట్టుకొని రమ్మని మాత్రం దయచేసి పంపకండి. తల్లి చేసిన మేలు ఉల్లి కూడా చేయదంటారని గుర్తుంచుకొండి. అదేవిధంగా దయచేసి బయటకి వెళ్ళేటప్పుడు ఉల్లిపాయలు పట్టుకు వెళ్ళకండి. ఉల్లిపాయలు ధర కిలో వందకి రూపాయలకి పడిపోయిందని తొందరపడి వందేసి గ్రాములు కొనేయకండి. కొని ప్రాణాల మీదకు తెచ్చుకోవదని మనవి. ఆనక హెచ్చరించలేదని బాధపడకండి. అదేవిధంగా మీరు బయట ఊళ్లకు వెళుతున్నపుడు ఉల్లిపాయలను మీ బ్యాంక్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్రీజర్ లాకర్లో పెట్టుకోవడం మరిచిపోకండి. ఒకవేళ అలా వీలుకానిచో బయట ఊళ్లకు వెళ్ళేటప్పుడు మీ దగ్గరలో ఉన్న పోలీసులకి మీ ఇంట్లో ఎన్ని గ్రాములు ఉల్లిపాయలు దాచారో వివరంగా తెలియజేయండి మరిచిపోకుండా.

 

కేంద్ర ప్రభుత్వం త్వరలోనే స్పెషల్ ఉల్లి టాస్క్ ఫోర్స్ లను అన్ని రాష్ట్రాలకు పంపనుంది. కనీసం అంతవరకయినా విచ్చలవిడిగా వందేసి, రెండేసి వందల గ్రాములు ఉల్లిపాయలు కోనేయోద్దని మనవి. బ్రతికుంటే ఉల్లికాడలు తినయినా బ్రతకొచ్చునని గుర్తుంచుకోండి. జరా భద్రం!