జగమంత కుటుంబం నాది

 

బీసీసీఐ అధ్యక్షుడు యన్.శ్రీనివాసన్ ఇండియా సిమెంట్స్ కంపెనీ అధిపతి కూడా కావడంతో సముద్రంలో ఉప్పుకి చెట్టు మీద కాయకి సంబంధ కుదిరినట్లుగానే, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో విడదీయరాని లంకె ఏర్పడింది. అయితే ఇది కూడా షరా మామూలుగానే మాజీ ముఖ్యమంత్రి డా. రాజశేఖర్ రెడ్డి హయాంలోనే ఏర్పడిందే కానీ కొత్తగా ఏర్పడింది కాదు గనుక, వాళ్ళ అనుబంధం గురించి ఎవరూ అనుమానించనక్కరలేదు. అందుకు సీబీఐ, కోర్టులు ఉన్నాయి.

 

మహానుభావుడు ఏ లోకంలో ఉన్నాడో కానీ జగన్కి జగమంత కుటుంబాన్నిఅందులో శ్రీనివాసన్, విజయ సాయి రెడ్డి వంటి పెద్దమనుషులను చాలా మందినే ఇచ్చిపోయాడు. అందుకే జగన్ జైల్లో అంత కాలం ఉన్నా ఏనాడు కూడా ఒంటరిగా ఉండే సమస్య ఏర్పడలేదు. జగమంత ఈ కుటుంబంలో అందరినీ చంచల్ గూడా జైల్లో ఉన్నంత కాలం రోజు పలకరించుకోవడం వీలుపడుతుంది. గానీ ఉమ్మడి కుటుంబంలా సాగుతున్న ఆ అనుబంధాలు అందరికీ బెయిలు రావడంతో దూరమయిపోక తప్పలేదు.

 

ఒకసారి బయట ప్రపంచంలో పడ్డాక నిరాహార దీక్షలు, ధర్నాలు, శంఖాలు, ఊదుకోడాలు వగైరా వగైరా సవాలక్ష వ్యవహారాలుంటాయి గనుక ఒకరినొకరు ఇది వరకులా రోజూ పనిగట్టుకొని  పలుకరించుకోవాలంటే వీలుపడదు. అంత మాత్రాన్నవిశ్వసనీయత ఉన్నవాళ్ళేవరూ కూడా తమ మమతలు, అనుబందాలు ఎన్నడూ మరిచిపోరు. ఏ పూర్వజన్మ సుకృతాల వల్లనో ఈ జన్మలో మానవులకు అన్ని బంధాలు, అనుబంధాలు ఏర్పడుతాయని పెద్దలు చెపుతారు. అలా ఏర్పడిన మరో బంధమే శ్రీనివాసన్ రూపంలో నేడు కోర్టు మెట్లు దగ్గర ఎదురయితే మడమ తిప్పని వంశంలో పుట్టిన జగన్ ఆయనని పలుకరించకుండా వెళ్లిపోతారని అనుకోవడం కేవలం ప్రతిపక్షాలకే సాధ్యం.

 

వీలయితే కాఫీ, నాలుగు మాటలు అని ఆ ఇద్దరూ కమ్మగా కాసేపు కబుర్లు చెప్పుకొన్నారుట! దానిని చూసి ఓర్వలేని వాళ్ళు పాపం! ఆ మంచి మనసుల కలయిక గురించి కూడా ఏవేవో వ్రాసేస్తున్నారు పాపం!

 

అయినా వారేమి ఇద్దరు ముగ్గురవ్వాలి, ఈ ముగ్గురు రేపు నలుగురవాలి. ఆనక ఐదు ఆరవ్వాలి అని ఆశించడం లేదు కదా? లోకులు కాకులు. పొడుస్తూనే ఉంటారు. అలా ఎందుకు కలిసారని పిచ్చి ప్రశ్నలు అడుగుతుంటారు. చాలా బాధగా ఉంటుంది. తప్పదు. అనుమానాలు, అపోహలు మొగుడు పెళ్ళాల మధ్యే తప్పవు. ఇక జగమంత కుటుంబలో సభ్యులు ఒకరిద్దరు కోర్టు మెట్లు దగ్గిర కలిస్తే కలగకపోవు. నిజమే చాలా బాధగా ఉంటుంది. తప్పదు. ఈ లోకంలో మంచి వాళ్ళకే అన్ని కష్టాలు. చాలా బాధ కలుగుతుంది నిజంగా చాలా బాధ కలుగుతుంది.