పండగ చేసుకోండి
posted on Nov 2, 2013 8:48AM
వెంటనే గ్యాసు, డీసిల్, పెట్రోల్,కిరోసిన్ ధరలను పెంచకపోతే వేల కోట్లు నష్టాలు వచ్చేస్తాయని నిత్యం పాట పాడే ఆయిలు కంపెనీలు, తమ ఉద్యోగులకు బోనసులు, ఇంక్రిమెంట్లు వగైరా ప్రతీ ఏటా ఘనంగా ఇస్తూనే ఉంటాయి. అంటే అవి నష్టాలకి బోనస్ అనుకోవాలేమో!
మరి వాటికి నిన్నఏ స్వామీజీ అయినా తనకు కలలో కనిపించిన పెట్రోల్, గ్యాసు బావుల ఆచూకి తెలిపి, వాటిని బకెట్ వేసి తోడుకోమని చెప్పాడో ఏమో తెలియదు, కానీ నిన్న అర్ధరాత్రి నుండి నుండి గృహ వినియోగ దారుల వంటగ్యాస్ సిలిండర్ పై రూ.53.50, వ్యాపార వినియోగదారులకి రూ.90లు తగ్గించేసి, ప్రజలని (దీపావళి) పండగ చేసుకోమన్నారు. రెండు రోజుల క్రితమే పెట్రోల్ పై లీటర్ కి రూ.1.15 తగ్గించడం చూస్తే ‘స్వామీజీ ఆయిల్ బావుల కలలు’ నిజమేననిపిస్తుంది.
అయితే తరుగుట పెరుగుట కొరకేనని పెద్దలు చెపుతారు. ఐదు రాష్ట్రాలలో (మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్తాన్, మిజోరం, డిల్లీ) శాసనసభ ఎన్నికలు నవంబర్, డిశంబర్ నెలలో జరగబోతున్న ఈ తరుణంలో ఇటువంటి ఆకస్మిక వరాల వానలు సహజమేనని రాజకీయ నిపుణులు చెపుతున్నారు. అయితే ఇది తుఫాను వచ్చే ముందు కురిసే చిరు జల్లుల వంటివని, అందువల్ల ఈ ప్రశాంతతని చూసి ఏమరపాటుగా ఉండవద్దని పదేపదే వారు గట్టిగా హెచ్చరిస్తున్నారు.
ఎందుకంటే ఏదో ఫరేక్ కమిటీ అట! ఒక్కో గ్యాస్ సిలిండర్ మీద కనీసం రూ.250 పెంచకపోతే ఆయిలు కంపెనీలు తమ ఉద్యోగులకు బోనసులు, ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఏర్పడుతాయని కేంద్రాన్ని గట్టిగా హెచ్చరించింది. అందువల్ల ఈ ఎన్నికలేవో అయిపోగానే ఇప్పుడు తగ్గించిన రూ.53.50X5=267.50లలో రూ.17.50 నష్టాన్ని భరించయినా సరే, సిలిండరుకి కేవలం రూ.250 మాత్రమే పెంచి మళ్ళీ (సంక్రాంతి) పండుగ చేసుకోమని చెప్పే అవకాశం బాగా ఉంది.
గానీ అప్పుడు సాధారణ ఎన్నికలు వస్తాయి కదా? అని ఎవరయినా అమాయకులు ప్రశ్నించవచ్చును. కానీ ప్రజలకి ‘గజినీ లాగా షార్ట్ టైం మెమొరీ ప్రాబ్లెం’ ఉందని పాపం వాళ్ళకి కూడా తెలియదు. గానీ ప్రభుత్వానికి, దానిని నడిపిస్తున్నకాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసు. గనుక ఎన్నికలకి మూడు నాలుగు నెలల ముందే గ్యాస్ ధరలు పెంచేస్తే, ఎన్నికల సమయానికి దానిని మరిచిపోవడమే కాక దానికి బాగా అలవాటు పడిపోతారు కూడా. అటువంటి సమయంలో మళ్ళీ ఓట్లు దండుకోవడానికి మళ్ళీ సిలిండర్ మీద పదో పాతికో తగ్గిస్తే వెర్రి బాగుల ప్రజలు అల్పసంతోషంతో మళ్ళీ హస్తం గుర్తు మీదే ‘దభీ దభీ’మని గుద్దేస్తారు.
ఒకవేళ కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రాబోదని గ్రహిస్తే పోతూపోతూ సిలిండర్ ధరలో ఏకంగా ఐదారు వందలు తగ్గించేసి, తరువాత వచ్చే మోడీ కుర్చీ క్రింద గ్యాస్ బాంబు అమర్చిపెట్టి వెళ్ళిపోయినా వెళ్లిపోవచ్చును. అయితే దీపావళి పండుగ పూట మనం అంత దూరం ఇప్పుడు ఆలోచించడం వల్ల ఏ ఉపయోగము ఉండదు. సిలిండర్ ఉన్నపుడే పండుగ చేసుకోవాలంటారు పెద్దలు. గనుక సిలిండర్ ధర తగ్గినప్పుడే తెచ్చేసుకొని ప్రజలందరూ ఆనందంగా దీపావళి పండుగ చేసుకోవాలని విజ్ఞప్తి. ఎందుకంటే రేపటి రోజు మన ‘హస్తం’ లోఉంటుందని గ్యారంటీ లేదు.