కాంగ్రెస్ పార్టీకి పరోక్ష సాయం చేసిన కేసీఆర్
posted on Jan 30, 2013 5:41AM
కేసీఆర్ ఏమి ఆశించి నెహ్రు కుటుంబం, ప్రధాన మంత్రిపై అంత చులకనగా మాట్లడేడోగానీ, అతను ఆశించినట్లే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమయిన ప్రతిస్పందనలు వెల్లువెత్తాయి. సాక్షాత్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సైతం ప్రతిస్పందించక తప్పనిపరిస్థితిని అతను సృష్టించాడు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల అతనికి వ్యతిరేఖంగా అనేక పోలీసు స్టేషన్లలో ఒకేరోజున అనేక పిర్యాదులు నమోదు చేయబడ్డాయి. ఇక, కాంగ్రెస్ శాసనసభ్యుడు తూరుపు జయప్రకాశ్ రెడ్డి స్వయంగా గాంధీ నగర్ పోలీసు స్టేషన్లో కేసీర్, ప్రొఫసర్ కోదండరాంలు ఇరువురూ కూడా తమ ప్రసంగాలతో ప్రజలమద్య విద్వేషం రెచ్చ గోడుతున్నారని, దేశ నాయకులను అగౌరవరపరిచి దేశ ద్రోహానికి పాల్పడ్డారని కేసు వేసారు.
ఈ కేసుల సంగతి ఎలా ఉన్నపటికీ, కేసీఆర్ చేసిన ప్రేలాపనలవల్ల ప్రజల, కాంగ్రెస్ వాదుల మనసులు చాలా నొచ్చుకొన్నాయని చెప్పకతప్పదు. తద్వారా ఇంతవరకు, ఎవరికీ వారే యమునా తీరే అన్న రీతిలో సాగుతున్న కాంగ్రెస్ నేతలందరూ, చాలా రోజుల తరువాత ఐకమత్యం ప్రదర్శిస్తూ తెరాస నేతలను ధీటుగా ఎదుర్కొన్నారు. ఒక విదంగా కేసీఆర్ తన ప్రేలాపనలా ద్వారా వారికి పరోక్షంగా చాలా సహాయం చేసాడని చెప్పవచ్చును. ఇంతవరకూ తెరాస నేతలతో భుజాలు రాసుకొని తిరుగుతున్న తెలంగాణా కాంగ్రెస్ నేతలకు కేసీర్ మాటలతో కనువిప్పు కలిగించాయని కూడా చెప్పుకోవచ్చును. తెలంగాణా కోసం కాంగ్రెస్ పార్టీని వీడి, అతని పంచన జేరితే తమ బ్రతుకులు ఎంత దారుణంగా మారుతాయో కేసీర్ మాటలతో వారికి స్పష్టంగా అర్ధమయి ఉంటుంది. గనుక, ఇంతవరకు సందిగ్ధంలో ఉన్న వారెవరయినఉంటే, వారిప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్చ, సుఖం అర్ధం చేసుకొని ఉంటారు గనుక, కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఇచ్చినా ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టే దైర్యం చేయరు.
మరో ఆసక్తికరమయిన పరిణామం ఏమంటే, కేసీఆర్ ప్రేలాపనలవల్ల, తెలంగాణా కాంగ్రెస్ వాదులకు రాష్ట్రంలో మొట్ట మొదటిసారిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రూపంలో ఒక పెద్ద అండ కూడా దొరికింది. వారిని వెనకేసుకు వస్తూ నిన్న కిరణ్ కుమార్ మాట్లాడిన తీరు వారికి కేసీఆర్ ని ఎదిరించి నిలవగలిగే దైర్యం ఇస్తుందని చెప్పవచ్చును.