ఫిబ్రవరి 6 నుంచి షర్మిలా మరో ప్రజాప్రస్థానం
posted on Jan 30, 2013 @ 12:49PM
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల వచ్చే నెల 6వ తేదీ నుండి, రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్ పాదయాత్రను పునః ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మీడియాకి తెలియజేసారు.
ఆక్టోబర్ 18, 2012న ఇడుపులపాయ నుంచి మొదలుపెట్టిన ఆమె పాదయాత్ర 57 రోజుల పాటు 5 జిల్లాల్లో 24 నియోజకవర్గాల్లో 10 మునిసిపాల్టీలు దాదాపు నాలుగు వందల గ్రామాల గుండా సాగింది. ఆమె మొత్తం 822 కి.మీ నడిచారు. కానీ, డిసెంబర్ 15న మోకాలికి గాయం అవడంతో మద్యలో పాదయాత్రను ఆపివేశారు. రంగారెడ్డి జిల్లా ఎల్‌బీ నగర్ నియోజకవర్గంలోని డిసెంబర్ 14వ తేదీన జరిగిన బీఎన్ రెడ్డి బహిరంగసభలోఆమె కుడి మోకాలికి గాయమైంది. ఆ కారణం చేత ఆమె పాదయాత్ర వాయిదా వేసుకోకతప్పలేదు. డిసెంబర్ 18న మోకాలికి శస్త్ర చికిత్స అనంతరం, ఇంతకాలం విశ్రాంతి తీసుకొని మళ్ళీ వచ్చే నెల 6వ తేది నుండి షర్మిల తన పాదయాత్రను ఆగిపోయిన చోటునుండే అంటే రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్ తిరిగి ప్రారంబించనున్నారు.
అయితే, మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆమె తెలంగాణా నుండే తన పాదయాత్రను ప్రారంబించాలను కోవడం, తెరాసను సవాలు చేసినట్లే అవుతుంది. తెలంగాణా ఈయనందుకు ఆగ్రహావేశాలతో ఉన్న తెరాస నేతలు, తమకు స్పష్టమయిన మద్దతు ఈయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన షర్మిల పాదయాత్రను సజావుగా సాగానిస్తారని అనుకోలేము. ఈ లోపుగానే వారు ఆమె పాదయాత్ర పై స్పందించే అవకాశం ఉంది. ఒకేవేళ వారు ఆమెను తెలంగాణాలోకి అడుగుపెట్టనీయమని ప్రకటిస్తే, అప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా కొనసాగిస్తామని ప్రకటిస్తే, అప్పుడు ఆ రెండు పార్టీల మధ్య తీవ్రమయిన ఘర్షణలు తప్పవు. ఈ పరిస్థితులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏవిధంగా అధిగామించాలనుకుంటున్నదో త్వరలోనే స్పష్టం అవవచ్చును.
షర్మిల పాదయాత్ర ద్వారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో తన పార్టీ శ్రేణులను బలపరుచుకోవడమే గాకుండా, తెలంగాణా లో తన బలాన్ని కూడా స్వయంగా అంచనావేసుకొంటూనే, తెరాసకు కూడా తన బలం ఏమిటో చూపే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, కుంటిసాకులు చెప్పి మద్యలో పాదయత్ర విరమించారని తమను విమర్శిస్తున్న తెరాస, తెదేప, కాంగ్రెస్ పార్టీలకు మళ్ళీ తెలంగాణా లోనే షర్మిల పాదయాత్ర మొదలుపెట్టడం ద్వారా సరయిన జవాబు ఇచ్చినట్లు ఉంటుందని కూడా ఆ పార్టీ ఉదేశ్యం కావచ్చును. అందువల్లనే, షర్మిల తన పాదయాత్రను వేరే ప్రాంతం నుండికాక, మళ్ళీ తెలంగాణాలోనే మొదలు పెడుతున్నారని భావించవచ్చును.