తెలంగాణ ఎంపీల రాజీనామా ఎఫెక్ట్: ఢిల్లీ నుంచి పిలుపు

 

 

 

 

తెలంగాణ అంశంపై రాజీనామాలకు సిద్దమయిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు అధిష్టానం నుండి పిలుపు వచ్చింది. ఎంపీలందరూ ఢిల్లీకి రావాలని ఆదేశాలు జారీ చేశారు. బుధవారం ఢిల్లీకి వెళ్లేందుకు ఎంపీలు సిద్దమవుతున్నారు. పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఎంపీలు కేకే నివాసంలో భేటీ అయ్యారు. రాజీనామా లేఖలను సోనియాకు అందించి వారం రోజుల గడువు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖలు సిద్దమయ్యాయని ఎంపీలు ప్రకటించారు. తెలంగాణ విషయంలో స్పష్టత ఇవ్వకుంటే రాజీనామాలు ఆమోదించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


అదిష్టానం నుంచి పిలుపు వచ్చినట్లు ఎంపీ మధుయాష్కి తెలిపారు. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని అధిష్టానం సూచించిందని, రేపు ఢిల్లీలో  సోనియాను కలిసి పరిస్థితిని వివరిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఐక్యంగా ఉద్యమిస్తున్నామని కేకే నివాసంలో భేటీ ముగిసిన అనంతరం ఎంపీలు తెలిపారు.  తెలంగాణ ఏర్పాటు తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు. బుధవారం ఉదయం ఢిల్లీకి వెళ్లి తమ నిర్ణయాన్ని అధిష్టాన పెద్దలకు వివరిస్తామని వారు చెప్పారు. ఇప్పటికే అధిష్టానంపై ఒత్తిడి పెంచామని, తమకు వయలార్ రవి, గులాం నబీ ఆజాద్ ఫోన్ చేశారని తెలిపారు.