బీజేసీ సమైక్య రాగం?
posted on Nov 1, 2013 @ 5:06PM
కేంద్రంలో తన ప్రభుత్వం వున్న సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వని బీజేపీ, అధికారం కోల్పోయిన తర్వాత సరుకు లేని చిన్న రాష్ట్రాల సిద్ధాంతంతో తెలంగాణకు మద్దతు ఇచ్చింది. సీమాంధ్రలో బలంలేని బీజేపీ తెలంగాణలో అయినా పాగా వేద్దామని పథకం వేసి తెలంగాణ రాష్ట్రం కోసం జరిగే ఉద్యమానికి జై కొట్టింది. తీరా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తున్నట్టు ప్రకటించి హడావిడి చేస్తున్న తర్వాత బీజేపీ ధోరణిలో మార్పు వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.
త్వరలో బీజేపీ సమైక్యానికి జై కొట్టే అవకాశం వుందని పరిశీలకులు భావిస్తున్నారు. దీనికి తెలంగాణ వచ్చినా భారతీయ జనతాపార్టీకి ఒరిగేదేమీ లేని పరిస్థితులు ఏర్పడటం ఒక కారణమైతే, మరొకటి బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఎంపికైన నరేంద్రమోడీ ఆలోచనా విధానం. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం వచ్చినా ఆ క్రెడిట్ తమదంటే తమదంటూ ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ జుట్టూ జుట్టూ పట్టుకుంటున్నాయి. ఆ రెండు పార్టీల మధ్యలోకి బీజేపీ ఎంటరయ్యే ఛాన్స్ కనుచూపు మేరలో కనిపించడం లేదు. సీమాంధ్రలో బీజేపీ అడ్రెస్ ఆల్రెడీ గల్లంతయింది. ఇప్పుడు తెలంగాణకి జై కొట్టిన పుణ్యమా అని ఆ గల్లంతు కంటిన్యూ అవ్వనుంది.
ఇలాంటి పరిస్థితుల్లో తనకు ఏ రాజకీయ ప్రయోజనం కలగనప్పుడు తానెందుకు తెలంగాణకి మద్దతివ్వాలన్న అతర్మథనం బీజేపీలో పెరిగినట్టు తెలుస్తోంది. దీనితోపాటు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ వ్యవహార శైలి కూడా తెలంగాణ విషయంలో బీజేపీలో మార్పు తెస్తోంది. గతంలో బీజేపీ కేవలం తెలంగాణ సంక్షేమం గురించే మాట్లాడేది. హైదరాబాద్‌లో జరిగిన సభలో పాల్గొన్న మోడీ తనకు తెలంగాణతోపాటు సీమాంధ్ర కూడా ముఖ్యమేనని తేల్చి చెప్పారు. ఈమధ్యకాలంలో మోడీ నోటి వెంట ఐక్యతకి సంబంధించిన మాటలే వస్తున్నాయి. తాజాగా దేశం ఐక్యంగా ఉండాలంటూ వల్లభాయ్ పటేల్ చెప్పిన మాటలను మోడీ ఉదహరిస్తున్నారు. అలాగే తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకాలను నిశితంగా గమనిస్తున్న బీజేపీ నాయకత్వం ఆ నాటకాటనే సాకుగా చూపించి సమైక్యం వైపు మళ్ళే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.