కాంగ్రెస్ మేధోమథన సదస్సు ప్రారంభ౦

 

త్వరలో మరికొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. లోకసభ ఎన్నికలు ము౦దస్తుగా జరగొచ్చన్న ఉహాగానాలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీనీ పటిష్టం చేసేందుకు బలహీనంగా ఉన్న స్థానాల్లో బలాన్ని పుంజుకునే౦దుకు మేధోమథనం అవరసమని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. ఇందుకోసం సూరజ్‌కుండ్‌లో భారీ సదస్సును ఏర్పాటు చేసింది.


ఢిల్లీ శివారులోని సూరజ్‌కుండ్‌లోకాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలంతా సమావేశమౌతున్నారు. యూపీఏ-2 అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి పూర్తిస్థాయి అంతర్మథనమిది. ఈ సదస్సులో ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, యువ నేత రాహుల్,19 మంది సీడబ్ల్యూసీ సభ్యులు, 16 మంది ప్రత్యేక ఆహ్వానితులు, 23 మంది కేంద్ర కేబినెట్ మంత్రులు, 12 మంది స్వతంత్ర హోదా ఉన్న సహాయ మంత్రులతో పాటు మొత్తం 70 మంది పాల్గొంటారని పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీ తెలిపారు.



దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితిపై సోనియా గాంధీ కీలకమైన ఉపన్యాసం చేస్తారు. దాని ఆధారంగానే చర్చ మొదలౌతుంది. తర్వాత ప్రధాని ప్రసంగిస్తారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు లాకులు ఎత్తడం, డీజిల్ ధర పెంపు, గ్యాస్ సిలిండర్ల కోత వంటి కఠిన నిర్ణయాలపై వివరణ ఇస్తారు. అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక మాంద్యం విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో దేశానికీ ఇది పరీక్షా సమయమని, విధిలేని పరిస్థితుల్లోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని వివరించనున్నారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి చిదంబరం ప్రసంగం ఉంటుంది.