ఇక నరసింహావతారమే..!
posted on Nov 9, 2012 @ 11:36AM
మరోసారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిని నమ్మించి దగా చేసిందని కేసీఆర్ విరుచుకుపడ్డారు. రాష్ట్ర సాధనకు ఇకపై డెడ్ లైన్లుండవని, పూర్తిగా డెత్ లైన్లే ఉంటాయని హెచ్చరించారు. టిఆర్ ఎస్ ని కాంగ్రెస్ లో విలీనం చేస్తామని చెప్పినా ఆ పార్టీ అధిష్ఠానంనుంచి కనీస స్పందన కరువయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ దెబ్బతో టిఆర్ఎస్ కి కాంగ్రెస్ శని వదిలిపోయిందని, నల్గొండజిల్లా సూర్యాపేట సభలో ఆ పార్టీకి నీళ్లొదులుతామని కేసీఆర్ ప్రకటించారు. కరీంనగల్ లో జరిగిన రెండు రోజుల మేధోమథనంలో పార్టీ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారని కెసిఆర్ చెప్పుకొచ్చారు. రాబోయే సాధారణ ఎన్నికల తర్వాత తెలంగాణ ఏర్పాటుని ఎవరూ ఆపలేరంటూ సవాల్ చేశారు.
2014 ఎన్నికల్లో సిపిఐతో సహా ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకోకుండా నేరుగా ఎన్నికల్లో నిలబడతామని కెసీఆర్ తేల్చి చెప్పారు. ఇకపై కాంగ్రెస్ లో టిఆర్ ఎస్ విలీనం గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదని కుండబద్దలు కొట్టారు. “ కేసీఆర్ మౌనం వీడి మార్కెట్లో రిలీజైండు. ఇగ నరసింహావతారం చూస్తరు, రోజూ కార్యక్రమాలుంటయ్.. తెలంగాణ భవన్ ల సందడే సందడి “ అంటూ ఉత్సాహంగా సమరనాదం చేశారు.