చంద్రబాబు పై బాంబు దాడి, ఇద్దరికి ఏడేళ్ళు జైలు

 

2003 అక్టోబర్ 1 తేదీన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పై మావోయిస్టులు జరిపిన బాంబుదాడి కేసులో నాగార్జున, రామస్వామి అనే ఇద్దరికి ఏడేళ్ళు జైలు శిక్ష విధిస్తూ తిరుపతి నాల్గో అదనపు జడ్జి ఈశ్వరరావు తీర్పు ఇచ్చారు. ఈ కేసులో మరో ఇద్దరు మావోయిస్టునేత సాగర్ అలియాస్ (పాండురంగారావు), గంగిరెడ్డిలను నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. అయితే సాగర్‌పై ఇతర కేసులు ఉన్నందున ఆయనను అదుపులోకి తీసుకోవాల్సిందిగా పోలీసులకు కోర్టు ఆదేశించింది.

 

 

 

2003 అక్టోబర్ 1న నాటి ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై తిరుపతిలోని అలిపిరి వద్ద మావోయిస్టులు బాంబు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో బాబుతో పాటు పార్టీ సీనియర్ నేతలు సజ్జల గోపాలకృష్ణ రెడ్డి, చదలవాడ కృష్ణమూర్తి తదితరులు గాయపడ్డారు.



2004లో దీనిపై ఛార్జీషీటు నమోదయింది. ఈ కేసుకు సంబంధించి 2004లో 33 మందిపై పోలీసులు కేసు నమోదుచేస్తూ చార్జీ షీటు దాఖలు చేశారు. అందులో 24 మంది ఆచూకి పోలీసులు కనుగొనలేకపోయారు. మిగిలిన ఐదుగురిలో కేసు విచారణలో ఉండగా ఒకరు మృతి చెందారు. నలుగురిలో ఇప్పుడు ఇద్దరికి శిక్ష పడగా మరో ఇద్దరికి విముక్తి కలిగింది.