కిరణ్ వాదనలు కూడా నాటకంలో భాగమేనా?
posted on Nov 11, 2013 7:10AM
కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన చేస్తున్నట్లు ప్రకటించిననాటి నుండి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానాన్ని దిక్కరిస్తూ గట్టిగా సమైక్యవాదం వినిపిస్తూ సీమాంధ్ర ప్రజలలో మంచిపేరు సంపాదించుకొంటున్నారు. ఒకే దెబ్బకి రెండు పిట్టలన్నట్లు, ఆయన అధిష్టానాన్ని ధిక్కరిస్తున్న కారణంగా మంచి దైర్యవంతుడని, కొత్త పార్టీ పెట్టగల సమర్ధుడని ప్రజలలో ఒక భావన కలిగిస్తూ, సమైక్యవాదం గట్టిగా వినిపిస్తున్న కారణం చేత అతనే బెస్ట్-సమైక్యవాదని, అందువలన రాష్ట్రాన్ని విభజిస్తున్నకాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాటం చెప్పాలంటే, ఆయన నేతృత్వంలో ఏర్పడే కొత్త పార్టీకే మద్దతు ఇవ్వవలసి ఉంటుందనే భావనని కూడా చాలా సమర్ధంగా ప్రజలలోకి జొప్పించగలిగారు.
ఇదంతా బాగానే ఉంది. కానీ, ఇదే సమయంలో ఆయన రాష్ట్ర విభజన ప్రక్రియకు ఎన్నడూ కూడా అడ్డుపడలేదనే సంగతిని గ్రహించవలసి ఉంది. ఆయన మనస్పూర్తిగా రాష్ట్రం విడిపోకూడదని కోరుకొంటూ ఉండవచ్చు గాక! కానీ కేవలం అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి అధిష్టానానికి వ్యతిరేఖంగా మాట్లాడటం తప్ప రాష్ట్రం విడిపోతుంటే ఆపేందుకు ఆయన చేసిన ప్రయత్నమేదీ కనబడలేదు.
అందువల్లే రాష్ట్రానికి సంబంధించిన విభజన ప్రక్రియ రాష్ట్రంతో ఎటువంటి సంబంధము, సమ్మతి లేకుండా ఎక్కడో డిల్లీలో చకచకా జరిగిపోతోంది. అయితే కిరణ్ కుమార్ రెడ్డి వైఖరి వలన కాంగ్రెస్ అధిష్టానం ఈ ప్రక్రియను ఏవిధంగా గట్టెకించాల అనే సందిగ్ధంలో ఉన్నట్లు మీడియా చెపుతోంది తప్ప, కాంగ్రెస్ అధిష్టానంలో ఎవరూ కూడా అటువంటి భయాలు వ్యక్తం చేయలేదు. అంతే గాక సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రే అభ్యంతరం చెపుతున్నారు గనుక రాష్ట్ర విభజన ప్రక్రియను నిలిపివేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఎన్నడూ కూడా భావించలేదు.
కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ అధిష్టానం నేతలు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకొంటూ మీడియాకి, తద్వారా ప్రజలకి మంచి కాలక్షేపం కలిగిస్తూ, అందరినీ చాలా తెలివిగా పక్కదారి పట్టిస్తున్నారని చెప్పక తప్పదు.
ఒకసారి కిరణ్ పై చాకో, మరోసారి మనిష్ తివారి, ఇంకోసారి షిండే, దిగ్విజయ్ సింగ్ ఒకరి తరువాత మరొకరు వంతులు వేసుకొన్నట్లు మీడియా ముందుకు వచ్చి స్పందిస్తుంటారు. గత మూడు నాలుగు రోజులుగా కిరణ్ కుమార్ రెడ్డి, దిగ్విజయ్ సింగులమధ్య జరుగుతున్న భాగోతం గమనిస్తే అది స్పష్టమవుతుంది.
ఇంత రాద్ధాంతం జరుగుతున్నపటికీ తెరవెనుక విభజన ప్రక్రియ మాత్రం సజావుగా సాగిపోతూనే ఉంటుంది. మరో పక్క అందుకు అవసరమయిని ఫైళ్ళు, వివరాలు, సమాచారం అంతటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది. ఈ నేపద్యంలో కేంద్రం రచించిన నాటకంలో భాగంగానే కిరణ్ కుమార్ రెడ్డి తన పాత్ర తను సమర్ధంగా పోషిస్తున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను నమ్మవలసి వస్తోంది.
చివరికి ఆయనని నిత్యం విమర్శిస్తూనే మళ్ళీ ఆయనతో సమావేశాలవుతున్న టీ-కాంగ్రెస్ నేతలని కూడా అనుమానించక తప్పదు. అంటే, కాంగ్రెస్ అధిష్టానం తయారు చేసి ఇచ్చిన స్క్రిప్టు ప్రకారమే రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలందరూ ఒకరినొకరు దూషించుకొంటూ, ప్రజలని పక్కదారి పట్టిస్తూ విభజన ప్రక్రియను సజావుగా ముందు తీసుకుపోతున్నారనుకోవలసి ఉంటుంది.