అలా ముందుకు పోతున్నారు!



రాష్ట్ర విభజనపై తుది రూపునకు రంగులు, హంగులు అద్దుతున్న కేంద్రం నేడు అధికారులతో, రేపు, ఎల్లుండు రాష్ట్ర పార్టీలతో, 18న రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులతో.. ఇలా వరుస సమావేశాలు, చర్చలతో జీవోం బిజీ,బిజీ! 21నాటికి టి-బిల్లు ముసాయిదా క్యాబినెట్ లో సమర్పించే అవకాశం స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. జీవోయం ఒకొక్క దశను  దాటి ముందుకు వెళ్ళిపోతోంది. ఎవరేమనుకున్నా, ఎవరెన్నిశాపనార్థాలు పెట్టినా పట్టించుకోకుండా తాను అనుకున్న దారిలో ముందుకు వెళుతోంది.

 

ఈ చర్చల ఆధారంగానే ముసాయిదా బిల్లుకు తుది రూపునిచ్చే పనిలో పడ్డారు. ఇక నుంచి 10రోజుల వరకు విభజన సెగ ఢిల్లీని తాకనుంది. ఈ మధ్యలో ట్విస్ట్ ఏమిటంటే రాష్ట్ర పార్టీల ప్రతినిధుల సమావేశానికి టీడీపీ వెళ్లకపోవడం. ఇదిలా ఉంటే జీవోం నిర్వహించే నేటి సమావేశానికి కేంద్ర ప్రభుత్వంలోని 9 ప్రధాన శాఖల ముఖ్యకార్యదర్శులు పాల్గొననున్నారు.

 

ముఖ్యంగా హైదరాబాద్, నదీజలాలు, ఉద్యోగులు, ఆస్తులు, అప్పుల పంపిణీ, విద్యుత్ కేటాయింపులు , హైదరాబాదులో శాంతి భద్రతలు , హైదరాబాదు ఆదాయం.. ఇలా ఎన్నో విభాజనాంశాలను చర్చించనున్నారు. మరోవైపు రాష్ట్ర పార్టీలతో సమావేశాలకి కాంగ్రెస్ నుంచి దామోదర రాజ నరసింహ, వట్టి వసంత్ కుమార్లకు పిలుపు వచ్చింది. ఇంకో ఎండ్ నుంచి దానం నాగేందర్, ముఖేష్ గౌడ్ లను రమ్మనమని దిగ్విజయ్ సింగ్ కబురుపెట్టారు.

 

చివరి ఆశనైనా నెరవేర్చుకోవాలని హైదరాబాదుని యూటీ చేయాలనే డిమాండుతో ప్రధానిని నేడు కలిసేందుకు సీమాంద్ర కేంద్రమంత్రులు రెడీ అవుతున్నారు. ఇలా ఎవరికీ తోచిన దారిలో వారు అలా ముందుకుపోతున్నారు.