Previous Page Next Page 
వెన్నెల వేట పేజి 2

    బోనులో నిల్చున్న ఫణికుమార్ ముఖం పాలిపోయింది. కళ్ళు లోతుకు లాక్కుపోయి . గడ్డం బాగా పెరిగిపోయి, జుట్టు రేగిపోయి పిచ్చివాడిలా ఉన్నాడు. మనిషి ఆందోళనతో నిలువెల్లా వణికిపోతున్నాడు. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడో, ప్రాణాల మీది తీపివల్ల ఆవేదనతో రగిలిపోతున్నాడో తెలియని స్థితిలో ఉన్నాడు ఫణికుమార్.

    కాలేజీ రోజుల్లో అందరినీ అమితంగా ఆకర్షించే 'హర్షిత'ను మనసారా ప్రేమించాడు అతను. కానీ తనతోనే కలిసి తిరుగుతూ ఉండే ఆనందమూర్తి హర్షిత ప్రేమను సంపాదించి పెళ్ళి చేసుకున్నాడు. చదువులోనూ, ప్రేమలోనూ, పెళ్ళిలోనూ తనకంటే పైచేయి అయిన ఆనందమూర్తి ఆ తరువాత డాక్టర్ వృత్తిలో కూడా తనను అదిగమించిపోయి తన మనుగడకే ప్రమాదం ఏర్పడే పరిస్థితిని తెచ్చిపెట్టాడు. అలాంటప్పుడు - మరి అలాంటప్పుడు ఆనందమూర్తిని కడతేర్చాలి కాదు.. కాదు.... కుమిలి, కృశించి అతి దయనీయంగా కుక్కచావు చచ్చేలా చేయాలి. అందుకే హర్షిత మరణిస్తే ఆనందమూర్తి పిచ్చివాడు కావడం ఖాయం. ఆ ప్లాన్ తోనే హర్షితని అతి దారుణంగా హింసించి చంపాడు. హర్షిత చావుని తల్చుకొనేసరికి ఫణికుమార్ కి ఒళ్ళు గగుర్పొడిచింది.

    హర్షిత అంత కిరాతకంగా బాధించి హత్య చేసిన క్షణాలలో తనలోని మానవత్వం ఏమైంది? ఏ మూలకు వెళ్ళి దాక్కుంది? తన మనసులో ప్రేమ మందిరాన్ని నిర్మించుకొని, హర్షితని అందులో ఊహించుకొని ఆరాధించి చివరికి ఎలా హత్య చేయగలిగాడు?

    జడ్జిగారి గొంతు ఖంగుమంది.

    ఫణికుమార్ ఆలోచనల్లోంచి బైటపడి అటువైపు చూశాడు.

    కోర్టుహాలులోని అందరి దృష్టి జడ్జిగారు చెప్పబోయే మాటల మీదే లగ్నమై ఉంది.

    "డాక్టర్ ఫణికుమార్ హర్షిత అనే స్త్రీని అతి దారుణంగా హత్య చేసినట్లు సాక్ష్యాదారాలతో నిరూపించబడింది. మానవత్వాన్ని మంటగలిపి సభ్యసమాజమంతా ఆవేదన చెంది, అతని పట్ల విపరీతమైన వ్యతిరేక భావం ప్రదర్శించే తీరులో ఆ హత్య చేయటాన్ని ఎంతో తీవ్రమైన విషయంగా కోర్టు పరిగణిస్తున్నది.

    ఫణికుమార్ చేసిన హత్య తీవ్రతను దృష్టిలో పెట్టుకొని, డాక్టర్ ఫణికుమార్ కు కోర్టు ఉరి శిక్షను విధిస్తున్నది."

    ఈసారి కోర్టు హాలులో కేరింతలతోపాటు నిరసన నినాదాలు చెలరేగాయి!

    జడ్జిగారికి ఏమీ అర్దం కాలేదు.

    హాలంతా కలియజూశారు.

    "ఫణికుమార్ ని ఎప్పుడో ఉరితీయటం కాదు. వెంటనే మా అందరి ముందు ఉరితీయాలి. ఇప్పుడే ఉరి తీయాలి"

    "ఆర్డర్! ఆర్డర్!"

    అయినా హాలులో సద్దుమణగలేదు. ఇంకా గొడవ గొడవగానే ఉంది. కోర్టు ఆవరణలో మళ్ళీ అల్లరి మొదలైంది.

    "ఆ కిరాతకుణ్ణి పబ్లిక్ హ్యాంగింగ్ చేయాలి"

    "మా అందరి కళ్ళముందు ఉరి తీయాలి"

    "అలా చేయకపోతే మూక ఉమ్మడి ఆత్మహుతులకి పాల్పడుతాం"

    ఆవేశపూరితమైన నినాదాలతో ఆ ప్రాంతమంతా అట్టుడికిపోయింది. అప్పటికే పది మంది స్త్రీలు, పురుషులు ఒంటిమీద కిరోసిన్ గుమ్మరించుకున్నారు.

    ఒంటికి నిప్పంటించుకోవటానికి సిద్దమయ్యారు.

    పోలీసుల వల్ల పరిస్థితి అదుపులోకి రాలేదు. ప్రజలు లాఠీచార్జీని లెక్క చెయ్యటం లేదు.

    పోలీసులు నిర్మించిన వలయాన్ని ఛేదించుకొని కోర్టులోకి జొరబడటానికి ముందుకు దూసుకువస్తున్నారు.

    పరిస్థితి విషమించింది.

    మరుక్షణంలో స్టేట్ సాయుధ దళం (ఎస్.ఎ.ఆర్) ధళం దిగింది. లారీలోంచి కిందికి దూకి జనంలోకి దూసుకువెళ్ళారు పోలీసులు.

    చేతికి దొరికిన వారిని లాఠీ లతో నిర్దాక్షిణ్యంగా బాదుతున్నారు.

    హాహాకారాలు మిన్నుముట్టాయి.

    అందర్నీ కంట్రోల్ చేయటం కష్టసాధ్యమని అర్దమయింది.

    వారిని భయభ్రాంతులను చేస్తేగానీ, ప్రాణాల మీద భీతి కలిగేలా చేస్తేగాని వారు మాట వినరని అనిపించింది.

    మెజిస్ట్రేట్ నుంచి ఫైరింగ్ ఆర్డర్స్ వచ్చాయి.

    గాలిలోకి కాల్పులు జరిపారు!

    అల్లకల్లోలంగా జనం పరుగెత్తసాగారు.

    అదెంతసేపు!

    ఒక్క నిముషంలో మళ్ళీ ధైర్యం కూడగట్టుకున్నారు. జనం ఎదురు తిరిగారు.

    ఆత్మాహుతికి సిద్దపడిన వారికి ఫైరింగ్ అంటే భయమెందుకు ఉంటుంది?

    "ఫణికుమార్ ని అందరి సమక్షంలో ఉరి తీయాలి!"

    "ఆ కర్కోటకుణ్ణి పబ్లిక్ హ్యాంగింగ్ చేయాలి"

    "శిక్షాస్మృతిని తిరగరాయాలి!"

    "ఇలాంటి రాక్షసుల్ని బతకనీయకూడదు"

    జనం ఆవేశం కట్టలు తెంచుకు ప్రవహిస్తోంది.

    ఎస్.ఎ.ఆర్. దళాన్ని తప్పించుకొని కోర్టులోకి ప్రవేశించటానికి పరుగులు తీస్తున్నారు జనం!

    సరిగ్గా అదే సమయానికి.

    కోర్టులో న్యాయపీఠంలో ఆశీనులై ఉన్న జడ్జి గంభీరంగా అందరినీ పరికించి చూశారు.

    బయటి పరిస్థితి ఆయనకి అర్ధమయింది. ఆవేశంతో రెచ్చిపోతున్న వారిని శాంతింప చేయటానికి ఒక్కటే మార్గం!

    ఆత్మాహుతులతో, కాల్పుల వల్ల అనేక ప్రాణాలు బలికాకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం!

    ఆ సమయంలో ప్రజల ఉద్రేకానికి న్యాయస్థానం గౌరవం మంటగలిసిపోకుండా నిలపాలంటే ఒక్కటే మార్గం!

    పబ్లిక్ హ్యాంగింగ్!!

 Previous Page Next Page