ఫణికుమార్ కి ప్రజా సమూహం ముందు ఉరిశిక్ష విధించటమే!
ఆలస్యం చేస్తే పరిస్థితి చెయ్యిదాటిపోతుంది.
మరుక్షణం జడ్జి ఒక నిర్ణయం తీసుకున్నారు.
"ఆర్డర్! ఆర్డర్!"
ఆ హెచ్చరికతో సద్దు మణిగింది.
"ప్రజావెల్లువ ఎంతో శక్తివంతమైంది. ఆ ప్రజల్లో ఫణికుమార్ తను చేసిన హత్య మూలంగా ఎలాంటి ముద్ర వేసుకున్నాడో అర్ధం అవుతోంది. వారి ఆవేశాన్ని అర్ధం చేసుకున్నాను. ఆ ఆవేశంలో వారు తమ ప్రాణాలు బలిదానం చేయడానికి కూడా వెనుకాడకుండా ఉద్రేకంతో ఉరకలు వేస్తు్నారు. ఇలాంటి పరిస్థితిలో అనేకమంది ప్రాణాలకి ముప్పువాటిల్లే ప్రమాదాన్ని తప్పించటానికి తప్పనిసరి పరిస్థితుల్లో నేనొక నిర్ణయాన్ని తీసుకోవలసి వచ్చింది.
"భారతీయ శిక్షా స్మృతిలో 'పబ్లిక్ హ్యాంగింగ్' లేకపోయినా 'కోడ్ ఆఫ్ ఎథిక్స్' పాటించాల్సిన ఒక నాగరికుడైన వైద్యుడు అనాగరికంగా ప్రవర్తించటంతో పాటు నరరూప రాక్షసుడిలా ఒక స్త్రీని అతి కిరాతకంగా హత్య చేయటాన్ని మానవ మాత్రులెవ్వరూ క్షమించరు. ప్రజాభీష్టం మేరకు నేను సాహసం చేసి చారిత్రాత్మకమైన తీర్పుని ఇస్తున్నాను. ఫణికుమార్ ని ప్రజా సమూహం ముందు ఉరి తీయటానికి ఆదేశిస్తున్నాను. పబ్లిక్ హ్యాంగింగ్ చేసి శిక్ష అమలుపరచటం జరుగుతుంది."
జడ్జిగారు లేచి నిలబడ్డారు.
కోర్టు హాలులో హర్షధ్వానాలు మిన్నుముట్టాయి.
క్షణంలో ఈ వార్త బైటికి పరుగెత్తింది.
అంత -
ఆనందోత్సాహలతో ప్రజావాహిని కేరింతలు కొడుతోంది.
"జడ్జిగారికి జై!" అంటూ జయజయధ్వానాలు చేయసాగారు.
జడ్జిగారు భారంగా నిట్టూర్చి అక్కణ్ణుంచి కదిలారు.
బోనులో నిలబడ్డ ఫణికుమార్ ఉన్న పళంగా కుప్పకూలిపోయాడు.
ప్రేక్షకుల్లో కూర్చుని వున్న ఆనందమూర్తి లేచి నిలబడ్డాడు. అతని కళ్ళనుండి కన్నీటి బొట్లు జలజలా రాలాయి.
ఒక్కసారిగా గతం అతని కళ్ళ ముందు కదిలింది.
0 0 0
వెన్నెల రాత్రి వెండి పౌడరు అద్దుకుంది.
ఆకాశపు కొలనులో విరిసిన వెండిపువ్వులా వెలిగిపోతున్నాడు చంద్రుడు.
మత్తును వెదజల్లుతున్నట్టున్న ఆ చల్లని వెన్నెల్లోని ఆనందాన్ని ఆస్వాదిస్తూ కబుర్లు చెప్పుకొంటున్నారు వాళ్ళిద్దరూ.
వాళ్ళు ప్రేమికులు కాదు.
ప్రేమ సాగరంలో జలకాలాడుతున్న భార్యాభర్తలు
ఆనందమూర్తి - హర్షిత!
అప్పుడు సరిగ్గా రాత్రి పది గంటల పది నిముషాలు అయింది.
ఆనందమూర్తి పేరు పొందిన డాక్టర్
తనను నమ్ముకున్న మనుషుల్ని తను నమ్ముకున్న వృత్తినీ ప్రేమించే మనిషి.
ప్రేమించి పెళ్ళి చేసుకున్న హర్షితకు తన ప్రేమను పంచి ఇచ్చే ఉత్తమ పురుషుడు.
పేషంట్ల పాలిటి పెన్నిధి!
తోటి డాక్టర్లకు ఆత్మీయుడు, మార్గదర్శి.
డాక్టర్ ఆనందమూర్తి అంతకు ముందే డిస్పెన్సరీ నుంచి వచ్చి భోజనం చేసి, భార్యతో కబుర్లలో పడ్డాడు.
అంతలో ఫోన్ మోగింది.
ఆనందమూర్తి లేచి ఫోన్ దగ్గరికి వెళ్ళాడు
డిస్పెన్సరీ నుంచి ఫోన్!
నైట్ డ్యూటీ నర్స్ మాట్లాడింది.