Previous Page Next Page 
వెన్నెల మెట్లు పేజి 7

 

    శంకర్ నోటిదాకా తీసుకెళ్ళిన ముద్దను తిరిగి కంచంలో పెట్టేస్తూ, తండ్రిని వింత జంతువుని చూసినట్లు చూశాడు.
    
    "ఏమిటీ? ఫ్యూన్ గానా? నన్నా? అదేం కోరిక నీకు?"
    
    "కోరిక కాదోయ్! రేపటినుంచీ తిండి గడిచే విధానం వెతుక్కో నువ్వు!"
    
    "నా తిండి నేను సంపాదించుకుంటానుగానీ, నన్ను ఫ్యూన్ గా చెయ్యాలనీ, శవాలని మోసేవాడిగా తయారు చెయ్యాలనీ మహా సరదా పడుతున్నావ్ చూడు! ఆ బోడి సరదా మాత్రం తీరనివ్వను నేను!" అని తల్లివైపు తిరిగాడు శంకర్.
    
    "చూశావా, అమ్మా! మొదట్నుంచీ కూతుర్ని చదివించుకోవడంతోనే ఆయన టైమంతా గడిచిపోయింది గానీ, కొడుకు సంగతి పట్టించుకున్నాడా అసలు? నాకు లెక్కలు రావు దేవుడో ట్యుటోరియల్ కాలేజీలో చేరుతానంటే గింజుకుచచ్చాడే!"
    
    "నువ్వు ఆ ట్యుటోరియల్ కాలేజీలో చేరడం చదువు కోసం కాదని తెలుసురా! శాస్త్రిగారి అమ్మాయి ఆ కాలేజీలో చేరినప్పటినుంచీ ట్యుటోరియల్ కాలేజీ అని కలవరించిపోతున్నావ్! నీ వెధవ్వేషాలు నా దగ్గరెయ్యకు!"
    
    వెంటనే సుందరమ్మ కూడా రంగంలోకి దూకింది.
    
    "ఏమిటండీ - ఇందాకట్నుంచీ చూస్తున్నాను! బిళ్ళ బంట్రోతు ఉద్యోగం చెయ్యడానికి నా కొడుకేం తేరగా ఉన్నాడా? ప్యూనుట! ప్యూను! సిగ్గూ శరం లేదూ? ఎలాంటి వంశం నాది! మా తాత రావు సాహెబు! ఉన్నదీ మట్టి కొట్టుకుపోయి ఈ కాపీనపు కొంపలో వచ్చిపడ్డాను గానీ - ఇక ప్యూనూ గీనూ అనబోకండి! వాడు ట్యుటోరియల్ కాలేజీలో చేరతాడు, ఏ ఇంటర్మెట్టో పాసయి కలెక్టరీ చేస్తాడు. ఆడకుంకనే చదివించగా లేనిది మగపిల్లాడి చదువుకి మొహాలు చూసుకుంటామా?"
    
    "పళ్ళు రాలగొడతాను!" అన్నాడు కేశవరావు. తల్లీ కొడుకుల అజ్ఞానం చూస్తుంటే అతనికి తిక్కరేగిపోతోంది. దొరికితే ఫ్యూన్ ఉద్యోగమయినా చెయ్యడానికి పోస్టు-గ్రాడ్యుయేట్లు కూడా చాలామంది తయారుగా ఉన్నారనీ, కనీసం ఫ్యూన్ ఉద్యోగమన్నా లేకపోతే ఇక ముందు ఇల్లు జరగదనీ అతనికి తెలుసు.
    
    వెంటనే శంకర్ విసురుగా కంచాన్ని తోసేశాడు. అది కేరంబోర్డు స్ట్ర్రయికర్ లా వెళ్ళి ఏ పాపమూ ఎరగని ప్రతిమ కంచాన్ని కొట్టింది. పచ్చడి చింది ప్రతిమ కళ్ళలో పడింది.
    
    సుందరమ్మ శోకాలు మొదలెట్టింది --
    
    "ఒరే, నాయనా! నువ్వు రైలెక్కించూ! నే వెళ్ళిపోతానూ! ముందు వెళ్ళి అమ్మమ్మకి టెలిగ్రామ్ ఇచ్చిరా! రేపు వచ్చేస్తున్నాననీ!" అంటూ.
    
    ఇందాకటినుంచీ కేశవరావుకి కడుపులో తిప్పుతోంది. రమ్ముకీ, కోపానికీ, భయానికీ, దిగులుకీ --- అన్నిటికీ చోటు చాలడం లేదు కడుపులో.
    
    అన్నిటినీ కలిపి కక్కేశాడు ఆయన, బండ బూతులు తిడుతూ.
        
    ఆ అసహ్యంలో, ఆ ఏడుపులో, ఆ తిట్ల మధ్య, కంట్లో చిందిన కారం భగభగ మండిస్తుండగా ప్రతిమ ఒక నిశ్చయానికొచ్చేసింది.
    
    పెళ్ళి చేసుకొని వెళ్ళిపోవాలి, తక్షణం!
    
    శ్రీరాంనే అని కాదు, ఎవరినైనా సరే! కుంటివాడినయినా, గుడ్డివాడినయినా సరే, తనని ఈ పిచ్చి ఆసుపత్రిలోనుంచీ బయటపడేసే వాడిని ఎవరినైనా సరే సంతోషంగా పెళ్ళాడుతుంది తను.
    
    సరిగ్గా అదే క్షణంలో కేశవరావు మనసులో కూడా ఒక ఆలోచన మెదిలింది.
    
    తను అనుకున్నట్లే శంకర్ ఫ్యూన్ ఉద్యోగం చెయ్యడు. అంతకంటే మంచి ఉద్యోగం వాడికి రాదు.
    
    ఇకముందు ఇల్లు జరగాలంటే, తామందరూ ప్రతిమ సంపాదన మీద ఆధారపడటం తప్పదు.
    
    నిన్నటిదాకా మనసులో ఒక ఆరాటం ఉండేది - హౌస్ సర్జెన్సీ అయిపోగానే ప్రతిమకి మంచి సంబంధం చూసి, పెళ్ళి చేసి పంపెయ్యాలని.
    
    ఇప్పుడది కుదరదు.
    
    ప్రతిమ పెళ్ళికొన్నాళ్ళు వాయిదా వెయ్యాలి. ఆమె సంపాదన కుటుంబానికి అత్యవసరం ఇప్పుడు!
    
                                                             * * * * *
    
    "నాకు ఇష్టమే!" అంది ప్రతిమ, మర్నాడు శృతితో.
    
    "నాకు తెలుసు!" అంది శృతి నవ్వుతూ.
    
                                                                * * * * *
    
    సౌందర్య శ్రీరాం దగ్గర సెక్రెటరీగా చేరిన తర్వాత అతని ఆఫీసుకి గెస్టుల తాకిడి ఎక్కువైంది. వాళ్ళు తనకోసం రావట్లేదనీ, తనివితీరా సౌందర్యని చూడడానికీ, వీలైతే ఆ అమ్మాయితో మాటలు కలపడానికీ వస్తున్నారని గ్రహించాడు శ్రీరాం. ఒక విధంగా ఇది అతనికి గర్వంగానే ఉంది. కొన్ని విషయాల్లో చిన్నపిల్లవాడి మనస్తత్వం  అతనిది. ఫ్రెండ్సు ఎవరి దగ్గరా లేని చిత్రమైన బొమ్మ తమ దగ్గిర ఉంటే పిల్లలెంత సంతోషిస్తారో, అంత సంతోషం కలుగుతోంది అతనికి సౌందర్యని చూస్తుంటే! ఆమె అతని ఆఫీసుకి అపురూపమైన అలంకారమైంది.
    
    "అనిల్! ఈ అమ్మాయికి మాటల్లో ఉన్నంత చురుకుతనం చేతల్లో లేదు. ఒక లెటరు టైపు చేసిందంటే పది తప్పులుంటాయి. హెల్! ఏం చేద్దామంటావ్!" అన్నాడు శ్రీరాం తన మేనేజర్ తో కానీ అతని గొంతులో కోపం లేదు.
    
    అనిల్ సహనంగా నవ్వాడు.
    
    "మనమేం చెయ్యొద్దు, బాస్! ఆ అమ్మాయిని కూడా ఏం చెయ్యొద్దని చెబుదాం. తను రోజుకో రకం బట్టలేసుకుని, తన పొడుగాటి గోళ్ళు ఫైల్ చేసుకుంటూ కూర్చుంటే చాలు! ఫైళ్ళ జోలికి ఆమె పోనక్కర్లేదు. గాడిద చాకిరీ అంతా చెయ్యడానికి శేషగిరిరావు ఉన్నాడు. ఆ అమ్మాయి రోజూ వచ్చి వూరికే మన ఆఫీసులో కూర్చోవడానికే జీతం ఇవ్వవచ్చు, బాస్! ఆఫీసుకే కళ వస్తుంది. షీ ఈజ్ యాన్ అస్సెట్ టు అవర్ ఆర్గనైజేషన్!"
    
    "అనిల్! ఏమిటి ఇవాళ నీకు కవిత్వం వచ్చేస్తోంది? కూల్ డౌన్, బాయ్! మరీ ఆకాశానికెత్తెయ్యకు ఆ అమ్మాయిని" అన్నాడు శ్రీరాం నవ్వుతూ.
    
    అంతలో అహ్లువాలియా వచ్చాడు. అతను రెండ్రోజుల నుంచీ ముప్పొద్దులా శ్రీరాం వాళ్ళ ఆఫీసుకి వస్తున్నాడు. సౌందర్య ఇచ్చే కాఫీని, ఆమె మాటలతో సహా నంచుకుని తాగేసి వెళుతున్నాడు రోజూ.
    
    ఇవాళ కూడా అంతే!
    
    రాగానే, "అరే యార్ శ్రీరాం! క్యాహోరా!" అని అనాసక్తిగా శ్రీరాంని పలకరించి, "సౌందర్యాజీ! ఒక్క కప్పు కాఫీ! మీ దయ ఉంటే!" అన్నాడు సౌందర్యని మింగేసేలా చూస్తూ.
    
    సౌందర్య మౌనంగా వచ్చి, పేపర్ కప్పుతో కాఫీ అందించింది.
    
    తాగిచూసి, మొహం అదోలా పెట్టాడు అహ్లువాలియా. "సౌందర్యాజీ! కాఫీ మరీ స్ట్రాంగ్ గా ఉంది, పాలు దొరుకుతాయా మన దగ్గర?" అన్నాడు భావగర్భితంగా...అంటూ శ్రీరాం వైపు తిరిగి కన్ను గీటాడు --- 'చూడు! ఎంత సరసంగా మాట్లాడుతున్నానో!' అన్నట్లు.

 Previous Page Next Page