Previous Page Next Page 
వెన్నెల మెట్లు పేజి 6

 

    అర్ధరాత్రి అప్పటికప్పుడు పెట్టెలు దడదడ సర్దేసి, పుట్టింటి కెళ్ళిపోతానని శోకాలు పెడుతుంది అమ్మ. ముప్పయ్యేళ్ళు కాపరం చేశాక ఇప్పుడు!
    
    నాన్నగారు జంధ్యాలు తెంపేసుకుని. సన్యాసుల్లో కలిసిపోతున్నానని చెప్పి, అప్పటికప్పుడు ఇంట్లోనుంచి వెళ్ళిపోతారు.
    
    అమ్మ గొల్లున ఏడుస్తూ, బావిలో దూకేస్తానని చెప్పి నూతిగట్టున కూర్చుంటుంది. తను గుబగుబలాడే గుండెతో ఆమెకి కాపలాగా కూర్చుంటుంది.
    
    తెల్లవారగానే నాన్నగారు తిరిగి వస్తారు...రాత్రంతా క్లబ్బులో పేకాడి!
    
    ఇదంతా నిరసనగా చూసి, "కాట్ల కుక్కలు" అని అసహ్యించుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు అన్నయ్య.    

    
    ప్రతిమకి కూడా ఆ వాతావరణంలో నుంచీ బయటపడి ఎక్కడికన్నా పారిపోవాలనిపించేది. కానీ ఆడపిల్ల ఎక్కడికెళ్ళగలదు? అన్నయ్య మగాడు కాబట్టి రోడ్డుమీద అలా గంటసేపు నిలబడి వచ్చినా ఏమీ ఎవరూ ఏమీ అనుకోరు. అదే తనలాంటి అమ్మాయి సెంటరులో ఒక అయిదు నిమిషాలు నిలబడితే, అందరి చూపులకీ తనే సెంటరు అవుతుంది.
    
    ఈ ఇంట్లో మనిషిగా ఉండే బదులు, నిజంగానే పుస్తకాల పురుగుగా పుట్టినా బాగుండును. ఏ లైబ్రరీలోనో ప్రవేశించి, నెమ్మదిగా ఎవరూ గమనించకుండా, ఎవరితో ప్రమేయం లేకుండా పుస్తకాలు నమిలి, మింగేస్తూ, ఆ పుస్తకాల పేజీల మధ్య ఒక అధ్యాయం ముగింపు దగ్గర తన జీవితం చాలించేస్తే ---
    
    నిజంగానే తను పుస్తకాల పురుగైపోతే బాగుండును, ఇలా ఏమీ చెయ్యలేని ఆడపిల్లలా కాకుండా!
    
    ఈ పిచ్చాసుపత్రి లాంటి ఇంట్లోనుంచీ బయటపడాలంటే పెళ్ళొక్కటే మార్గం!
    
    శ్రీరాం తనని పెళ్ళి చేసుకుంటానని ప్రపోజు చేశాడు.
    
    అతనికి రేపు సమాధానం చెప్పాలి తను!
    
                                                          * * * * *
    
    శ్రీరాం దగ్గర, మరి కొంతమంది సాక్షుల దగ్గర స్టేట్ మెంట్లు రికార్డ్ చేసుకున్నాడు దీపక్.
    
    తడబడే అడుగులతో ఆఫీసరు రూమ్ లోకి వెళ్ళాడు కేశవరావు, ఆయన పిలుపు అందుకుని.
    
    "మీ మీద విచారణ పూర్తి అయ్యేదాకా లీవు పెట్టండి" అన్నాడు ఆఫీసరు.
    
    కేశవరావు ఒక్క గంటలో ముసలాడైపోయినట్లు కనబడుతున్నాడు.
    
    "సార్! ఆడపిల్ల తండ్రిని. కూతురికి పెళ్ళి చేయాలి. నాకు వయసయిపోతోంది. ఇప్పుడీ ఉద్యోగం పోతే..." అని ప్రాధేయపడటం మొదలెట్టాడు. కళ్ళలో నీటిపొర నిలుస్తోంది.
    
    "ఆ బుద్ది లంచాలు పట్టేటప్పుడే ఉండాలి. ఇప్పుడేడిస్తే నేనేం చెయ్యను? తిరుగులేని కేసు బనాయించారు మీమీద! ఆ కుర్రాడు అఖండుడే!"
    
    బక్క కోపంతో శ్రీరాంని లక్ష విధాలుగా మనసులో శాపనార్ధాలు పెట్టాడు కేశవరావు. మహా మహా వాళ్ళనే పిలక పట్టుకు ఆడించిన తను ఈ పిల్లకాకికి దొరికిపోవడమా?
    
    తన ఉద్యోగం వూడటం ఖాయమేనా?
    
    జైలుశిక్ష కూడా పడుతుందా?
    
    ఇంక ఎలా బతుకుతాడు తను? ఏం తిని బతుకుతాడు ఇక ముందు?
    
    పై సంపాదన ధారాళంగా ఉన్నా, అదంతా పై పై ఖర్చులకే సరిపోయింది. దమ్మిడీ వెనకెయ్యలేదు తను. భార్యకొక్క నగ చేయించలేదు. గజం స్థలం కొనలేదు.
    
    తను చేసిన ఒకే ఒక్క మంచి పని ప్రతిమని మెడిసిన్ చదివించడం. ఇంకో నెల రోజుల్లో హౌస్ సర్జెన్సీ కూడా పూర్తయిపోతుంది.
    
    కానీ ఇకముందు తిండి ఖర్చు ఎలాగ? తిండికంటే కూడా తాగుడు ముఖ్యం తనకి. ఆ 'తీర్ధం' ఖర్చు ఎలాగ?
    
    మొదట్లో... తన దగ్గరికి పనిమీద వచ్చే పార్టీలే "పార్టీలకి" తీసుకెళ్ళేవారు తనని, "థాంక్యూ సార్! మమ్మల్ని గట్టెక్కించారు. అందుకని మిమ్మల్ని ముంచెయ్యాలి - విస్కీలో!" అంటూ.
    
    అప్పట్లో పార్టీలు లాక్కెళ్ళినప్పుడు మాత్రమే వెళ్ళేవాడు బార్ లకి. ఇప్పుడో?
    
    సాయంత్రం కాగానే బార్ ల తలుపులు బార్లా తెరిచి తనని ఆహ్వానిస్తున్నట్లు అనిపించి, జొరబడిపోతాడు.
    
    ఉద్యోగంపోతే ఈ అలవాట్లెలాగ?
    
    రెండు నెలలకి లీవు అప్లికేషను ఇచ్చి తడబడుతూ బయటికి వచ్చేశాడు కేశవరావు.
    
    కాళ్ళు అప్రయత్నంగా బార్ వైపు నడిచాయి.
    
    తాగుడులో ఒక విశేషం ఉంది. ఏదైనా మంచి జరిగినప్పుడూ, మనసు సంతోషంగా ఉన్నప్పుడూ పీకెదాకా తాగేసి సెలబ్రేట్ చేసుకోవాలనిపిస్తుంది.
    
    భరించలేని ఎదురుదెబ్బ తగిలినప్పుడు కూడా ఒళ్ళు మర్చిపోయేలా తాగేసి, బాధని మింగెయ్యాలనిపిస్తుంది.
    
    సుఖదుఃఖాలు చీకటి వెలుగుల్లాగా ఒకదాన్ని ఒకటి తరుముకుని వస్తూనే ఉంటాయి కాబట్టి, తాగాల్సిన సందర్భాలు కూడా అంత రెగ్యులర్ గానే వస్తూంటాయి అలవాటుపడ్డవాళ్ళకి.
    
    చాలామంది మొదటి పెగ్గు కేవలం థ్రిల్ కోసం, లేదా కంపెనీ కోసం, మొహమాటం కోసం తాగుతారు. ఆ మొదటి పెగ్గు తాగుతున్నప్పుడు ఎవరూ కూడా తాము తాగుడుకి దాసులమై పోవాలనీ, తాగుబోతులమైపోవాలనీ కోరుకోరు. ప్రతివాళ్ళకీ తమమీద తమకి అపారమైన నమ్మకం ఉంటుంది. "ఇవాళ వీళ్ళందరూ బలవంత పెడుతున్నారు కాబట్టి సరదాగా తాగుతున్నాను. రోజూ ఇదే పనా నాకు? అయినా ఉగ్గుపాలు తాగినట్లు ఒక పెగ్గు తాగగానే అలవాటైపోతుందేమిటీ?" అన్న భరోసాతో తాగుతారు.
    
    ఆ మొదటి పెగ్గు తాగిన వాళ్ళందరూ విధిగా తాగుబోతులైపోతారని రూలు లేదు. కానీ కొంతమందిలో నిగూఢంగా ఒక గుణం ఉంటుంది. ఏదైనా రుచిచూస్తే, అది అలవాటుగా, వ్యసనంగా మారి దానికి బానిసలైపోయే బలహీనత. మొదట్లో కంపెనీకోసం, సెలబ్రేషన్స్ కోసం అని అప్పుడప్పుడు తాగినా, తర్వాత ఏదైనా మానసిక వ్యధ కలిగినప్పుడు, అది మరిచిపోవడానికి ఏకాంతంగా తాగడంతో, అది "సోషల్ డ్రింకింగ్" స్థాయి దాటిపోయి, వ్యసనంగా మారడం తరచుగా సంభవిస్తుంది.
    
    కేశవరావు ఇవాళ సరదా కోసం కాకుండా, బాధని మరిచిపోవడానికి తాగాలని నిశ్చయించుకోవడంతో, "ఆల్కహాలిజమ్" అనే అడుగు లేని అగాధంవైపు మొదటి అడుగు వేశాడు.
    
                                                               * * * * *
    
    రాత్రికి తండ్రి రాగానే భోజనాలు వడ్డించేసింది ప్రతిమ. శంకర్ కూడా అప్పుడే వచ్చాడు ఇంటికి. సాధారణంగా అతను తండ్రితో సహపంక్తి భోజనం చెయ్యడు. వాళ్ళిద్దరికీ పామూ, ముంగిసల మధ్య ఉండే సహజ వైరం లాంటిది ఉంది. కానీ బాగా పొద్దుపోవడం వల్ల అందరికీ ఒకేసారి కంచాలు పెట్టేసింది ప్రతిమ.        
    
    కేశవరావు అన్నం కలుపుకుంటూ శంకర్ తో పెడసరంగా అన్నాడు- "ఏరా! నీకు టెన్త్ పాసయ్యే యోగం ఎలాగూ లేదు కాబట్టి ఎవరి కాళ్ళో, కడుపో పట్టుకుని ఫ్యూన్ ఉద్యోగం ఇప్పిస్తా! చేస్తావా?"

 Previous Page Next Page