Next Page 
వైరం పేజి 1

                                 


                                             వైరం

                                        మైనంపాటి భాస్కర్

                          

                                 ది ఎండ్?

    తన చెవులని తానే నమ్మలేనట్లుగా వింటున్నాడు సూరజ్.
    తను వింటున్నది తన గొంతే!
    "నిన్ను మర్చిపోవడానికి ఒక్క మూడునెలల టైము కావాలి అరుణా! ఒక్క మూడు నెలలే! ఒక్కసారిగా నా గుండెల్లో గుచ్చేసినట్లుగా అట్లా కట్ చేసేయకు అరుణా! ప్లీజ్! ఒక్క మూడు నెలలు టైము ఇవ్వు! అప్పటిదాకా నాతో మామూలుగానే ఉండు అరుణా! ప్లీజ్!"
    గంటకి వెయ్యి కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోంది విమానం.
    కాదు కాదు!
    గంటకి వెయ్యి కిలోమీటర్ల వేగంతో అరుణకి దూరమైపోతున్నాడు సూరజ్.
    పారిపోతున్నాడు!
    విమానం తాలూకు పబ్లిక్ అడ్రెస్ సిస్టంలో అతనికి అతని గొంతే వినబడుతోంది.
    "నాకు ఒక్క మూడు నెలల టైం ఇవ్వు అరుణా - నిన్ను మర్చిపోవడానికి!"
    ఎవరో తట్టి లేపినట్లు చటుక్కున స్పృహ వచ్చింది అతనికి.
    ఈ విమానంలో తన గొంతు తనకే ఎట్లా వినబడుతుందీ?
    అంతా తన భ్రమ!
    అవి తను అరుణతో పలికిన మాటలు! తన వేడికోలు!
    తన మాటలు తన్నే వెన్నాడుతున్నాయి గానీ, అరుణ వీటిని అప్పటికప్పుడే మర్చిపోయి వుంటుంది.
    అప్పుడు మనసుకెక్కింది అతనికి.
    పబ్లిక్ అడ్రెస్ సిస్టంలో వినబడుతున్నది పైలట్ గొంతు.
    అది చెన్నై నుంచి ఫ్రాంక్ ఫర్ట్ కి వెళుతున్న ఫ్లయిటు.
    హెవీగా జర్మన్ యాస వినబడుతున్న ఇంగ్లీషులో చెబుతున్నాడు పైలట్.
    "వెల్ కమ్ ఎబ్రాడ్! బోయింగ్ 747 జెట్ విమానం. మనం ఇప్పుడు భూమికి ముప్ఫయ్ మూడువేల అడుగుల -అంటే దాదాపు మూడు కిలోమీటర్ల ఎత్తున గంటకి వెయ్యి కిలోమీటర్ల వేగంతో ఫ్రాంక్ ఫర్ట్ కి వెళ్తున్నాం. ఇప్పుడు బయటి ఉష్ణోగ్రత పదిహేను డిగ్రీల సెంటి గ్రేడు వుంది. అంతా సవ్యంగా వుంటే..." అని ఆగిపోయాడు పైలట్.
    'అంత సవ్యంగా వుంటే' అన్న ప్రయోగం అతనికే అపశకునంలా తోచి ఉండాలి. బాడ్ ఓమెన్! అసలు ఈ ఎయిర్ క్రాఫ్ట్ చెన్నైలో టేకాఫ్ కావడమే కాస్త లేటు! టెయిల్ లైట్లు ఫెయిలయిపోయాయి. టాయిలెట్లలో ఒకటి సరిగా పనిచేయటం లేదు! అన్నీ ఆల్ రైట్ కావడానికి ఓ గంట పైనే పట్టింది.
    తనని తాను కరెక్ట్ చేసుకుంటూ అన్నాడు పైలట్.
    "....వాతావరణం అనుకూలంగా వుంటే మనం షెడ్యూల్డ్ టైంకే ఫ్రాంక్ ఫర్ట్ చేరుకుంటాం."
    ఆ తర్వాత పైలట్ గొంతు మారి తన మాటలే తనకు వినబడుతున్నట్లుగా మళ్ళీ భ్రమ మొదలయింది సూరజ్ కి.
    "నిన్ను మర్చిపోవడానికి ఒక్క మూడునెలల టైం కావాలి అరుణా..."
    గట్టిగా తల విదిలించాడు సూరజ్.
    "భ్రమ..భ్రమ..
    ఈ భ్రమలు ముదిరి తన మతి కూడా భ్రమిస్తుందా?
    'ప్రేమా...పిచ్చీ...ఒకటే...' అనికదా కవి వాక్యం!
    ఒకవేళ తనకి నిజంగా పిచ్చిపడితే, కనీసం అప్పుడయినా అరుణని మర్చిపోగలడా?
    అట్లా అయితే- ఓహ్ గాడ్! ప్లీజ్ మేక్ మీ మాడ్!
    మళ్ళీ పైలట్ గొంతు వినబడుతోంది.
    "ఇప్పుడొక వెరీ వెరీ స్పెషల్ అనౌన్స్ మెంట్! అన్నాడు పైలట్ ఎంతో డ్రమెటిక్ గా - మరెంతో ఎగ్జయిటెడ్ గా! అతని గొంతులో మామూలుగా వుండే పెద్దమనిషి తరహాకి బదులుగా, ఆటవిడుపుగా కొంచెం కొంటెతనం వినబడుతోంది.
    "చెన్నై నుంచి ఫ్రాంక్ ఫర్ట్ వెళ్ళే ఈ ఫ్లయిట్ లో ట్రావెల్ చేస్తున్న రెగ్యులర్ ఇండియన్ పాసింజర్స్ కి మా సునయన బాగా తెలిసే వుండాలి."
    "సునయన" అన్న పేరు వినగానే చాలామంది ప్రయాణీకుల మొహాల్లో చిరునవ్వు కనబడింది.
    వాళ్ళకి తెలుసు!  
    సునయన అనే అమ్మాయి ఆ జర్మన్ ఎయిర్ లైన్స్ లో పనిచేసే ఇండియన్ ఎయిర్ హోస్టెస్. అమరశిల్పి జక్కన చెక్కిన సజీవ శిల్పంలా వుంటుంది. చాలా ఎఫిషెయెంటు! చాలా ఫ్రెండ్లీ గర్ల్!
    మళ్ళీ ఆ జర్మన్ పైలట్ గొంతు.
    "మా సునయన సాధించిన ఘనవిజయం ఏమిటో మీలో కొంతమందికయినా ఇప్పటికే తెలిసి వుంటుంది. ఇంకా తెలియనివాళ్ళ కోసం, వెల్! టీవీ స్క్రీన్లమీద రీప్లే చూడండి!"
    విమానంలో అందరికీ కనబడేలా కొన్నిచోట్ల చిన్న సైజు టీవీలు వున్నాయి. అవి కాకుండా, ప్రతి సీటుకీ వెనుక భాగంలో మినియేచర్ టీవీ స్క్రీన్ లు ఫిట్ చేసి వున్నాయి. అంటే ఒక వరసలో కూర్చున్నవాళ్ళు తమ ముందు సీటువైపు చూస్తే అక్కడి స్క్రీన్ కనబడుతుందన్నమాట! అందులో దృశ్యాలు మారుతున్నాయి. 'మిస్ యూనివర్స్' 'విశ్వసుందరి' పోటీ తాలూకు ప్రెజెంట్ జరుగుతోంది.
    మళ్ళీ పైలట్ గొంతు వినబడటం మొదలెట్టింది. తను కాస్త ఎక్కువే మాట్లాడేస్తున్నానని ఆ పైలట్ కి తెలుసు. మామూలుగా అయితే అతను చాలా రిజర్వుడు. చాలా బిజినెస్ లైక్. పైలట్లు ప్రయాణీకులని ఎంతవరకూ గ్రీట్ చేయాలీ, ఎంతవరకూ జనరల్ ఇన్ ఫర్మేషన్ చెప్పాలీ అన్న పరిధులని దాటడు.
    కానీ -
    ఇవాళ -
    టుడే ఈజ్ సమ్ థింగ్ స్పెషల్!
    "వెల్! హియర్ కమ్స్ సునయనా!"
    టీవీ స్క్రీన్ మీద మిస్ యూనివర్స్' ప్రెజెంట్ లో పాల్గొంటున్న సునయన కనబడింది.
    సరిగ్గా అదే క్షణంలో -
    విమానం సీట్ల మధ్య వుండే ఐల్ అనబడే సన్నటి ఇరుకు దారే బ్యూటీక్వీన్ లు నడిచే రాంప్ అయినట్లుగా ఫీలవుతూ, ఆనందాన్ని ఆపుకోలేక సతమతమయిపోతున్నా సరేనని - లయబద్ధంగా అడుగులు వేస్తూ వస్తున్న సునయన.
    అటు - అక్కడ బ్యూటీ ప్రెజెంట్ ప్రేక్షకుల మధ్యనా -
    ఇటు - ఇక్కడ విమానంలో ప్రయాణీకుల మధ్యనా కూడా తనే! సునయన!
    'సునయన! ది లేటెస్ట్ మిస్ యూనివర్స్! మా-మీ-మన సునయన నిన్నటిదాకా మామూలు ఎయిర్ హోస్టెస్! తను ఇవాళ మిస్ యూనివర్స్! లేడీస్ అండ్ జెంటిల్మెన్! గివ్ హర్ ఏ బిగ్ హ్యాండ్!" అంటున్నాడు పైలట్!
    మాజీ విశ్వసుందరి అయిన ఒక అమ్మాయి, తాజా విశ్వసుందరి సునయన తలమీద కిరీటాన్ని వుంచటం టీవీ స్క్రీన్ లలో కనబడుతోంది.
    సరిగ్గా అదే క్షణంలో -
    ఆ బ్రహ్మాండమైన బోయింగ్ 747 జెట్. ఒక్కసారిగా తృళ్ళిపడినట్లుగా అయింది.
    పెద్ద కుదుపు!
    "ఎయిర్ టర్ బ్యులెన్స్" అనుకున్నాడు పైలట్. అది రొటీనే! ప్రచండమైన గాలులలో చిక్కుకున్నప్పుడు విమానం అల్లల్లాడినట్లుగా అయిపోతుంది. అలా కొద్ది నిమిషాలు! ఎయిర్ టర్ బ్యులెన్స్ లో నుంచి విమానాన్ని సురక్షితంగా తప్పించడంలోనే పైలట్ల ప్రతిభ కనబడుతుంది.
    విమానంలోని ఫస్ట్ క్లాస్ లో నుంచి బిజినెస్ క్లాసులోకీ, బిజినెస్ క్లాసులోనుంచి సూరజ్ వాళ్ళు కూర్చుని వున్న ఎకానమీ క్లాసులోకీ, అందరి అభినందనలూ అందుకుంటూ నడిచివస్తున్న సునయనకి కూడా తెలుసు.
    ఎయిర్ టర్ బ్యులెన్స్ కొద్ది నిముషాలు! అంతే!
    ఆ తర్వాత అంతా మళ్ళీ మామూలుగానే రొటీన్!
    ఈ పైలట్ చాలా ఎక్స్ పీరియన్స్ వున్నవాడే!
    ఆమె ముందుకి నడుస్తోంది గానీ, ఆలోచనలు మాత్రం వెనక్కి వెళ్తున్నాయి.
    కొద్దిరోజుల క్రితందాకా -
    తను ఒక ఎయిర్ హోస్టెస్! దట్సాల్!
    ఇదే ఇరుకు ఐల్ లో - ఇదిగో- ఇప్పుడు తన మాజీ కొలిగ్సు ఫుడ్ ట్రాలీలని తోసుకుంటూ వస్తున్నారే - అట్లా తను కూడా ట్రాలీని తోసుకుంటూ డ్రింక్సూ, డిన్నరూ సర్వ్ చేస్తూ, ప్రయాణీకుల కంఫర్ట్సు కనిపెట్టి చూస్తూ -
    అదంతా గతం! ఇప్పుడు తను మిస్ యూనివర్స్! 

Next Page