శ్రీరాం మొహం చిట్లించాడు.
అది గమనించలేదు అహ్లువాలియా, ఇంకా పేట్రేగిపోయి చెప్పడం మొదలెట్టాడు.
"శ్రీరాం! లాస్ట్ ఇయర్ నేను స్విట్జర్లాండ్ వెళ్ళాను కంపెనీ పని మీద చెప్పాను కదా! అక్కడ స్టీక్ తిన్నాను యార్! లేత ఆవు మాంసం! అందులోనూ వర్జిన్, అంటే కన్యత్వం పోగొట్టుకోని ఆవు మాంసంతోనే చేస్తారు యార్! వండకుండా ఉత్తదే తినెయ్యొచ్చన్నమాట! ఏం రుచి, ఏం రుచి! కన్నె ఆవేకాదు, కన్నెపిల్ల మాంసం కూడా అంత రుచిగా ఉంటుందనుకుంటాను" అంటూ సౌందర్య వైపు వోరగా చూసి, తర్వాత "హ్హ హ్హ హ్హ హ్హ" అని నవ్వాడు.
అతన్ని వెళ్ళిపొమ్మని చెప్పాలనిపించింది శ్రీరాంకి. కానీ బిజినెస్ మొహమాటాలు!
చిరాగ్గా కుర్చీలో అటూ ఇటూ కదిలాడు.
ఇంకాసేపు బోరుకొట్టి, వెళ్ళిపోయాడు అహ్లూవాలియా.
అప్పుడు వర్షించడం మొదలెట్టాయి సౌందర్య కళ్ళు.
శ్రీరాం కంగారుపడ్డాడు.
"సౌందర్యా! సౌందర్యా! వాట్ హాపెన్డ్? వాడు అలా వల్గర్ గా మాట్లాడుతున్నాడని అఫెండ్ అయ్యావా?"
కాదన్నట్లు నెమ్మదిగా తల వూపింది సౌందర్య.
"మరి? చెప్పు!"
కాసేపు మౌనంగా కూర్చుంది సౌందర్య. రెండు కన్నీటి చుక్కలు ఆమె నీలంరంగు టీ షర్ట్ మీదపడి, తడిగా రూపాయి కాసంత మేర వ్యాపించాయి.
"సౌందర్యా!"
కళ్ళు తుడుచుకుంది సౌందర్య. "ఐ యామ్ సారీ బాస్! మనసుని కంట్రోల్ చేసుకోలేకపోయాను ఇవాళ! అహ్లువాలియా మాట్లాడిన దానికి నేనేం నొచ్చుకోలేదు. అలాంటి మాటలు విని విని అలవాటు పడిపోయాను నేను."
"మరి?"
"మా అమ్మకి చాలా సీరియస్ గా ఉంది, బాస్!"
"ఓహ్! ఐయామ్ సారీ!"
"నాకీ లోకంలో అమ్మ తప్ప ఇంకెవరూ లేరు, శ్రీరాం సాబ్! కానీ... కానీ... అమ్మ ఇంకెంతో కాలం బతకదు. నాకు తెలుసు."
"ఛ ఛ! అలాగెందుకనుకోవాలి? ఎంతో సీరియస్ కేసులు కూడా ఆశ్చర్యం కలిగేలా నయమవుతుంటాయి చాలాసార్లు."
తల అడ్డంగా ఆడించింది సౌందర్య. విషాదంగా చిరునవ్వు నవ్వుతూ, "నో యూస్, శ్రీరాం సాబ్! నన్ను వూరడించాలని చూడటం, నాకు ధైర్యం చెప్పాలని అనుకోవడం అనవసరం! డాక్టర్లు మొన్నే చెప్పేశారు, బాస్! అమ్మ మహా అయితే మరో మూడు నెలలు బతుకుతుందని.... మనసు కుదుటబరుచుకుని ఆమె చావుకి - మానసికంగా సిద్దం కమ్మని చెప్పారు డాక్టర్లు!"
శ్రీరాం మనసు చేదుగా అయిపోయింది. ఈ అమ్మాయి చావుని ఎదుర్కోవడానికి మానసికంగా తయారవుతుంటే, అసభ్యమైన మాటలతో ఆమెని ఆకర్షించాలని చూశాడా అహ్లువాలియా? అబ్బ!
"ఈ దుర్వార్తని చేదుమందులా మింగి, జీర్ణం చేసేసుకోగలననుకున్నాను, శ్రీరాం సాబ్! కానీ అమ్మ భయం చూస్తుంటే..."
"ఆమెకే చెప్పేశారా డాక్టర్లు?"
"ఉహు!ఁ చెప్పలేదు. తనే గ్రహించింది. ఆమె చావుకి భయపడటం లేదు, బాస్! కానీ హాస్పిటల్లో చేరి ఈ మూడు నెలలూ గడపాలేమో అని గజగజ వణికిపోతోంది. ఆమెకి హాస్పిటలంటే చావుని మించిన భయం!"
"ఎందుకని?"
"హాస్పిటల్ వాతావరణం చూస్తేనే తన మనసు కుంగిపోతుందంటుంది అమ్మ."
"నాకు తెలిసిన లేడీ డాక్టర్లు ఇద్దరున్నారు. వాళ్ళ హాస్పిటల్లో చేరుద్దాం మీ అమ్మగారిని. చాలా జాగ్రత్తగా చూసుకుంటారు వాళ్ళు. నాదీ పూచీ -- వోకే?" అన్నాడు శ్రీరాం. అతని మనసులో శృతీ, ప్రతిమా మెదిలారు.
సౌందర్య మళ్ళీ తల అడ్డంగా వూపింది. "లాభం లేదు, శ్రీరాం సాబ్! మా అమ్మ ఎంత మంచిదో అంత మొండిది కూడా! తను చాలా ఖచ్చితంగా చెప్పింది -- 'సంధూ! నేను ఎలాగా చచ్చిపోయేదాన్నే! నన్ను మాత్రం ఆ హాస్పిటల్ కూపాల్లోకి చేర్చకు. నా బంగారు తల్లి కదూ! నన్నిలాగే పోనియ్!" అని మొండిపట్టు పడితే తను చిన్నపిల్లలకంటే కూడా కష్టం!"
"ఇంటి దగ్గరే ట్రీట్ మెంట్ ఇప్పించకూడదూ పోనీ?"
సౌందర్య సమాధానం చెప్పకుండా మోచేతి పంపులో మొహం దాచుకుంది.
తన ప్రశ్న తనకే అసందర్భంగా ధ్వనించింది శ్రీరాంకి. రోజూ డాక్టర్ని ఇంటికి పిలిపించి తల్లికి ట్రీట్ మెంట్ ఇప్పించేటంత తహతేవుంటే తన దగ్గర అయిదొందల రూపాయలకి ఉద్యోగం ఎందుకు చేస్తుందీ అమ్మాయి?
డబ్బు! డబ్బు!
డబ్బు లేకపోవడమే భయంకరమైన జబ్బు కాబోలు!
"సౌందర్యా! డబ్బే సమస్య అయితే నేను...."
చటుక్కున తలెత్తి చూసింది సౌందర్య. ఆమె కళ్ళలో ఆశ కనబడుతోంది.
"నిజంగానా? నిజంగా మా అమ్మకి ఈ మూడు నెలలూ ట్రీట్ మెంట్ చేయించడానికి తగినంత డబ్బు అడ్వాన్సుగా ఇవ్వగలిగితే, నేను ఆజన్మాంతం క్షణక్షణం మీ పేరు తలుచుకుని నమస్కరిస్తూ బతుకుతాను, శ్రీరాం సాబ్! ప్రతినెలా కొంచెం కొంచెం నా సెలరీలో రికవర్ చేసుకోవచ్చు" అంది సౌందర్య ఆవేశంగా ఆ ఆవేశంలో ఆ అమ్మాయికి తన తల్లి పట్ల ఉన్న ప్రేమ బయటపడి పోతోంది.
"తీర్చడం సంగతి తర్వాత! ఎంత కావాలి చెప్పు!"
సందేహంగా అతని మొహంలోకి చూసింది సౌందర్య. "బహుశా మూడువేలు కావచ్చేమో!" అంది బెదురుగా.
"మూడు వేలా?" అన్నాడు శ్రీరాం విషాదంగా.
భయంగా శ్రీరాం పెదిమలవైపే చూస్తూంది సౌందర్య. ఇక "లేదు" అనే పదాన్ని ఉచ్చరిస్తాయా ఆ పెదవులు? అప్పుడింక అమ్మకి ట్రీట్ మెంటు...
తను నిన్న రేసుల్లో పోగొట్టుకున్న రెండువేల అయిదొందలు గుర్తొచ్చింది శ్రీరాంకి, మొన్న తను రేసుల్లోనే గెలుచుకున్న మూడువేల మూడొందలు గుర్తు వచ్చింది ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే!