Previous Page Next Page 
ప్రేమ పురాణం పేజి 7


    
    "కావచ్చు కాని వాడి ఊహలన్నీ ఎప్పుడూ నిజమవుతూనే వుంటాయి."
    
    "ఇది మాత్రం చచ్చినా కాదు."
    
    "ఏమో! ఎవరు చూడొచ్చారు?"
    
    "ఇంతకీ నువు వాడి పక్షమా? నా పక్షమా?"    

 

    "ఎవరు కరెక్టయితే వాళ్ళపక్షం" అన్నాడు విశేష్ గంభీరంగా.
    
    "ఎవరది కరెక్టు?"
    
    "వాడిదే కరెక్టు."
    
    "ఎందువల్ల?"
    
    "వాడు నిన్ను చచ్చేట్లు ప్రేమిస్తున్నాడు గనుక."
    
    "కానీ నేను వాడిని చచ్చేట్లు ప్రేమించట్లేదు."
    
    "దటీజ్ యువర్ ఫ్యూనరల్!"
    
    "అంటే?"
    
    "అది నీ ఖర్మ అని తర్జుమా చెయ్యొచ్చు. అస్సలర్ధం అయితే "నీ కర్మకాండ" అని చెప్పవచ్చు. కర్మకాండ అంటే ఒక మనిషి చనిపోయినప్పుడు చేసేతంతు. ఈ విశేషానికి దగ్గరగా వుండే తిట్లు నీ బొంద, నీ శ్రాద్ధం పెట్టు, నీ పాడె, నిన్ను తగలెయ్య. నిన్ను పాతెయ్య, నీ పిండం పిల్లులకి పెట్ట, వగైరా వగైరా! వీటిని సమయానుకూలంగా వాడవచ్చును."
    
    ఈ తిట్లన్నీ నువు తిడుతున్నావా?" అంది సితార నిదానంగా.
    
    "లేదు! దటీజ్ యువర్ ఫ్యూనరల్" అన్నాడు.
    
    "అంటే....."
    
    "అంటే....." అని ఆగి, భుజాలుచరిచి, "ఇంక అది వదిలెయ్" అన్నాడు శేషు.
    
    "నేను వాడిని చచ్చేట్లు ఎందుకు ప్రేమించట్లేదని అడగవేం?" అంది సితార.
    
    "ఎందుకో నాకు తెలుసు గనక."
    
    "చెప్పుకో చూద్దాం."
    
    "నీకు డబ్బున్న వాళ్ళంటే బొత్తిగా గిట్టదు."
    
    "ఎందుకో తెలుసా?"
    
    "నువ్వు పరమ బీదదానివి కాబట్టి."    

 

    "నువ్వు నాలాగా బీదవాడివేగా!"
    
    "కానీ నాకు నీలాగా ఓర్వలేనితనం    లేదు."
    
    "యూఆర్ ఏ బ్లడీఫూల్" అంది సితార కోపంగా.
    
    "ఎందుకని?" అన్నాడు శేషు ప్రశాంతంగా.
    
    "నాకు ఉన్నదీ ఓర్వలేనితనం కాదు. డబ్బున్న వాళ్ళు ఎంత ఛీప్ ఫెలో సో నాకు స్వయంగా తెలుసు కాబట్టే వాళ్ళంటే అస్సలు పడదు." 

   

    ఏదో గుర్తొచ్చినట్లు "నువ్వు కమ్యూనిస్టువా?" అని అడిగాడు శేషు.
    
    "కాదు.....హ్యూమనిస్టుని."
    
    "సరే! జరిగింది చెప్పు."
    
    "సరిగ్గా పదేళ్ళ క్రిందట...." అని మొదలెట్టింది సితార.
    
    "అంటే అప్పట్లో నీకు పదేళ్ళన్నమాట" అన్నాడు విశేష్.
    
    "అవును! సరిగ్గా నా పదో ఏట, అప్పట్లో మా తమ్ముడు రాంపండుకి ఏడేళ్ళూ, మా నాన్నకి ముఫ్ఫయి మూడూనూ, మా అమ్మకి ఇరవై తొమ్మిది......"
    
    "డిటెయిల్స్ తగ్గించరాదూ?"
    
    "అప్పుడో రోజున మా అమ్మకి హఠాత్తుగా ఒంట్లో నలతగా అనిపించింది."
    
    "వెంటనే జెయ్ చంద్ర వాళ్ళమ్మ డాక్టర్ సుందరి దగ్గరకు తీసుకెళ్ళారు. ఔనా?"
    
    "ఔను! ఆవిడకి బోల్డెంత డబ్బు వుంది. అయినా కూడా ఆవిడ డబ్బుపిశాచే. పేషెంట్ల రక్తాన్ని కూల్ డ్రింక్ లా తాగేస్తుంది. మా అమ్మని ఆవిడ దగ్గరికి తీసుకెళ్ళాక ఆరుగంటలు వెయిటింగులో పెట్టి, తర్వాత అరనిమిషంలో పరీక్షచెయ్యడం ముగించేసింది."
    
    "తర్వాత ఎవరో స్పెషలిస్టు దగ్గరికి రిఫర్ చేసి వుంటుంది" అన్నాడు అతడు.
    
    "అవును! ఎన్నో రకాల టెస్టులు చేయించుకోమని రాసిచ్చింది. ఆ స్పెషలిస్టులకీ, ఆ డయాగ్నోస్టిక్ సెంటర్లకీ ఆమెతో లాలూచీ వుందట. ఎవరికి దొరికినంత వాళ్ళు పీక్కు తినేశారు. అమ్మకి జబ్బేమిటో ముందే కనిపెట్టేసింది డాక్టర్, కానీ వాళ్ళ వాళ్ళందరికీ దండిగా ముట్టచెప్పడానికే టెస్టులన్నీ.
    
    ఈలోగా రోజులు గడచిపోయాయి.    
    
    అమ్మకేమో జబ్బుబాగా ముదిరిపోయింది.
    
    అప్పుడు ఆపరేషన్ చేస్తానంది డాక్టర్ సుందరి.
    
    నాన్న అన్నేళ్ళనుంచి కష్టపడి కూడబెట్టుకున్న డబ్బంతా ఈ టెస్టులకే సరిపోయింది. ఇంక ఆపరేషన్ కి డబ్బెక్కడిదీ? అవునా?
    
    అంచేత దీనాతిదీనంగా ఆమెని బతిమలాడుకున్నాడు మా నాన్న.
    
    ఇప్పటికి ఆపరేషన్ చేసి గట్టెక్కిస్తే తర్వాత ఎట్లాగొట్లా ఆ అప్పు తీర్చుకుంటానని కాళ్ళా వేళ్ళా పడ్డాడు.
    
    ఛీ కొట్టింది డాక్టరు, చీదరించుకుంది. డబ్బుతెస్తేగానీ ఆపరేషన్ చెయ్యనంది.
    
    పాపం మా నాన్న తిరిగాడు డబ్బు కోసం.
    
    ఈలోగానే ఓ అర్దరాత్రి అమ్మకి ప్రాణాలమీదికి ముంచుకొచ్చేసింది. నేను నిద్ర లేచేలోగానే శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయింది అమ్మ.
    
    నేను కనీసం గుడ్ బై కూడా చెప్పలేకపోయాను అమ్మకి. ఆ లోపలే మమ్మల్నందర్నీ వదిలేసి దూరంగా వెళ్ళిపోయింది. చివరిసారిగా నన్ను ముద్దు పెట్టుకునే టైముకూడా లేకపోయింది అమ్మకి.
    
    అప్పట్నుంచీ నాన్న పూర్తిగా పిచ్చోడైపోయాడు.
    
    మా తమ్ముడు రాంపండుకేమో అప్పట్నుంచీ నేనే తల్లినీ, తండ్రినీ అయిపోయాను.
    
    మరి నాకేమో యింకెవరూ దిక్కు లేరు.
    
    మా ట్రాజెడీ విన్నావ్ గదా! ఇప్పుడు చెప్పు.
    
    ఆ లేడీ డాక్టరు రాక్షసా కాదా?
    
    ఆ రాక్షసి కడుపున పుట్టిన ఈ దేశద్రోహి కంపల్సరీగా బ్రహ్మరాక్షసుడై వుంటాడు.
    
    వీళ్ళందరూ డబ్బుకోసం గడ్డితినే మనుషులు.
    
    ఛఛ ఛఛ!" అంది.
    
    ఉద్వేగంతో ఆమె వళ్ళంతా విపరీతంగా ఒణికిపోతోంది.
    
    ఆమెవైపు సానుభూతిగా చూశాడు శేషు "సీతారామలక్ష్మీ! నీ బాధ నాకు బాగా అర్ధమయ్యింది. కానీ డబ్బున్నవాళ్ళందరూ వెధవలే అన్న నీ అభిప్రాయం మాత్రం శుద్ద తప్పు. అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు."

    

    "అంటే?" అంది సితార అనుమానంగా.
    
    "జెయ్ చంద్ర మొగాళ్ళలో పురుషోత్తముడిలాంటివాడు. వాడు తాగడు. (అంటే బ్రాందీ, విస్కీ, జిన్నూ, సోడా, బీరు మొదలైనవి.) మంచినీళ్ళు, కూల్ డ్రింకులూ మాత్రం తాగుతాడు. సిగరెట్లు కూడా తాగడు. కనీసం వక్కపొడి కూడా వేసుకోడు. హోటల్ కెళ్ళి మసాలా దోశె, ఉప్మా పెసరట్టు తినడం, మంచి బట్టలేసుకోవడం, సినిమాలు, వీడియో చూడటం, స్టీరియోలో ఇంగ్లీషు పాటలు వినడం తప్ప వాడికి వేరే వ్యసనాలేం లేవు."

 Previous Page Next Page