Previous Page Next Page 
ప్రేమ పురాణం పేజి 8


    
    "ఇవి చాలవా?"    

 

    "ఇవీ వ్యసనాలే అని నువ్వనుకుంటే, ఓ సితారా! నిన్ను ఆ దేవుడే రక్షించాలి."
    
    "మరి ఎప్పుడూ ఆడాళ్ళతో తిరుగుతుంటాడు. ఇతగాడు వద్దు అనొచ్చుగా?"
    
    "వద్దనొచ్చు! కానీ వాళ్ళు నొచ్చుకోరా?"
    
    "ఏది ఏమయినా సరే వాడంటే నాకు అలర్జీ"
    
    "ఏం చేస్తాం యీ అలర్జీకి మందు లేదు" అన్నాడు శేషు.
    
    "పోతేపోనియ్! నాకేం నష్టం" అని విసురుగా మేడ మెట్లెక్కేసింది సితార.
    
                                                                  * * *
    
    ఈ కథాసంగ్రహం అంతా వివరంగా విశేష్ నోటి వెంట విన్న జెయ్ చంద్ర మొహం చేటలా విప్పారింది.
    
    "యురేకా! అదా సంగతి" అన్నాడు కేన్సర్ కి మందు కనిపెట్టిన శాస్త్రజ్ఞుడి లెవెల్లో.    
    
    అతని ఉత్సాహం శేషుకి విస్మయం కలిగించింది.
    
    "ఆ పిల్ల అలా అడ్డు అదుపూ లేకుండా అవాకులూ, చెవాకులూ, వాగేస్తుంటే నువ్వింత ఉత్సాహ పడిపోవడమేమిటీ?" అన్నాడు వింతగా చూస్తూ.
    
    "ఆ అమ్మాయి కోపానికి కారణం తెలిసిందిగా! ఇంక విరుగుడు చెయ్యడం ఈజీ" అన్నాడు జెయ్ చంద్ర.
    
    "విరుగుడా! ఏం చేస్తావ్?"
    
    "డబ్బున్నవాళ్ళంటే ఆ అమ్మాయికి గొంతుదాకా కోపం గదా?"
        
    "అవుననుకో! అయితే?"
    
    "అందుకని నేను నా ఆస్తికి తిలోదకాలు యిచ్చేస్తా"
    
    "ఏం కాలూ?"
    
    "తిలోదకాలు"
    
    "అంటే?"
    
    "తిలోదకాలు"
    
    "అంటే?"
    
    "తిలోదకాలంటే తెలీనివాడివి శవాలనెట్లా మోస్తావురా?"
    
    "శవాలా? ఏ శవాలు? ఎవరు మోస్తారు?" అన్నాడు శేషు బిత్తరపోయి.
    
    "డిగ్రీ అయ్యాక నువ్వు శవాలు మోసి సంపాదించి పెళ్ళాం పిల్లల్ని పోషిస్తావని దానితో చెప్పాలే."
    
    "ఒరేయ్! నేను నీకు బాల్యస్నేహితున్ని. ఇది నీకు తగదు. నేను ఎమ్మెస్సీ చదవాలనుకుంటున్నా" అన్నాడు శేషు గుడ్లెంబడి అర బక్కెట్ నీళ్ళు కక్కుకుంటూ.
    
    "ఊరికే అన్నాలేరా! అనగానే అయిపోయిందేమిటి?" అన్నాడు జెయ్ చంద్ర ఊరడింపుగా.
    
    "నీ నోటితో చెడు పలికితే అది జరిగి తీరుతుందిరా. చాలాసార్లు అబ్జర్వ్ చేశా" అన్నాడు శేషు దిగులుగా.
    
    "ఏమిటామాటలు? డొక్కచింపి డోలుకడతా" అన్నాడు జెయ్ కోపంగా.
    
    "నిజంగానే! నన్ను నమ్ము"
    
    "సరె సర్లే! నే వెళుతున్నా"
    
    "ఎక్కడికి?"
    
    "ఆస్తి వదిలేస్తున్నానని అమ్మతో చెప్పడానికి."
    
    "ఆగు ఆలోచించుకుని మరీ ప్రొసీడయితే మంచిది."
    
    "ఆలోచించడానికింకేమీ లేదు."
    
    "అంతేనా?"
    
    "ముమ్మాటికీ అంతే"
    
    "అయితే నీ యిష్టం"
    
    "జెయ్ సితారా!" అంటూ అక్కన్నుంచి వెళ్ళిపోయాడు జెయ్ చంద్ర.
    
    తన గుహలోకి దూరిపోయి వంట ప్రయత్నాలు మొదలెట్టాడు శేషు.
    
                                                                      * * *
    
    మర్నాడు -
    
    కాలేజీలో -
    
    ఆరోజు కూడా మామూలుగానే కాలేజీకి వెళ్ళింది సితార.
    
    (మామూలుగానే వెళ్ళానని తను అనుకుంటోందిగానీ ఆమె మనసులో ఓ మెగాటన్ను బరువుకి సమానమయిన టెన్షన్ వుంది.)
    
    వెళ్ళీ వెళ్ళగానే రోజూ ఆమెకి మొట్టమొదట దర్శనమిచ్చేది జెయ్చంద్ర, అతని ఫ్రెండ్సూ, అతని భుజం మీద వాలిపోతున్నట్లుండే ముగ్గురు మూర్ఖుణులే. అది ప్రతిరోజూ కనబడే ట్రేడ్ మార్కు దృశ్యం.
    
    కానీ యివాళ జెయ్ చంద్ర లేడు.
    
    ఆ గ్రూపు ఫోటోలో అతను లేకపోయేసరికి చప్పున ఓ అనుమానం ఘోరంగా తోచింది సితారకి.
    
    నిన్న తను తిట్టినతిట్లకి ఇన్సల్టుఫీలై ఆత్మహత్యగానీ చేసేసుకున్నాడా ఏం?
    
    ఒక్క క్షణంలో ఆమెకి వళ్ళంతా చెమటలు పట్టేసినట్లయ్యింది.
    
    మళ్ళీ అంతలోనే మరో ఆలోచన తోచింది కూడా.
    
    ఇంతలోనే ఆత్మహత్య చేసుకునేంత సెన్సిటివ్ కాదులే అతను.
    
    ఎన్ని తిట్టినా దున్నపోతు మీద వాన కురిసినట్లే.
    
    ఎన్నిసార్లు ఎంతమందితో పోట్లాడాడూ!
    
    ఎన్నిసార్లు మళ్ళీ కల్సిపోయాడూ!
    
    ఎన్ని కొట్లాటలు!
    
    ఎన్ని రాజీలు!
    
    అలాంటివాడు ఒక్కసారి ఛీ అని ఛీత్కరిస్తే చచ్చిపోతాడా?
    
    ఏంకాదు!
    
    ఏమో? ఏదీ చెప్పలేం.
    
    మనిషి మనసు అగాధం అన్నారు.
    
    ఏ మాట ఎవరిమీద ఎప్పుడెలా రియాక్షన్ చూపిస్తుందో చెప్పలేం.
    
    కొంపదీసి ఏమైనా అఘాయిత్యం చేసేసుకున్నాడా ఏం?
    
    అతనేమైతే తనకేంగానీ ఓ మనిషి చావుకి తను కారణమైతే మాత్రం నరకానికెళ్ళాల్సి వస్తుందేమోనని జంకు. అంతే! యింకేం లేదు. సత్యప్రమాణంగా యింకేం లేదు.

 Previous Page Next Page