సితార కోసమే తను పుట్టాడు.
ఇది యింకో విధంగా జరగడానికి వీల్లేదు గాక వీల్లేదు.
శేషుగాడితో పెళ్ళి అనగానే అమ్మాయిగారి మొహం తుమ్మల్లో పొద్దు గూకినట్టూ, పెసరట్టు మాడినట్టూ ఎట్టా అయిపోయిందో!
అది గమనించేశాడు తను.
అది చాలు.
తనో వశీకరణ మంత్రం వేశాడు.
తనకి వశమైపోతుంది ఇంక. త్వరలోనే! తప్పదు! తప్పదు! తప్పదు!
గబగబ గబగబ నడిచి ఇంటికెళ్ళిపోయింది సితార.
వెళ్ళేలోపల మూడుసార్లు కర్చీఫ్ తో కళ్ళు తుడుచుకుంది.
నాలుగుసార్లు చీదింది.
ఇంటికివెళ్ళి పుస్తకాలు గిరవాటేసింది. ఆ తర్వాత మూడంగల్లో మేడమెట్లు ఎక్కేసింది. మేడమీద వాటా వాళ్ళది.
ఆ మేడకెదురుగానే సగం కూలిపోయి, మిగతా సగం కూలడానికి సిద్దంగా వున్న ఓ చిన్న పెంకుటిల్లు వుంది.
కూలిపోవడానికి రెడీగా వున్న భాగంలో శేషు అద్దెకుంటున్నాడు.
కప్పు కుప్పకూలిపోయిన మొదటి సగభాగంలో ఎలుకలూ, పందికొక్కులూ, పిల్లులూ, కుక్కలూ, మేకలూ, బ్రహ్మజెముడు డొంకలూ మొదలైన సమస్త చరాచర జీవులు ఐకమత్యంగా కలిసి వుంటుంటాయి.
పైనుంచి ఆ దృశ్యాన్ని చూస్తూ దుఃఖంగా నిలబడివున్న సితారకి అప్పుడే యింటికి వస్తున్న శేషు కనబడ్డాడు.
ఈసారి రెండు అంగల్లోనే మెట్లుదిగి వచ్చేసింది సితార.
శేషుని వాళ్ళింటి గుమ్మందగ్గరే నిలేసింది.
"ఏం? వళ్ళెట్లావుంది?" అంది రౌద్రంగా.
అమ్మతల్లిలా వున్న సితారను చూసి అదిరిపడ్డాడు శేషు.
"ఏమిటి? ఏమయ్యింది?" అన్నాడు కంగారుగా.
"నంగనాచి తుంగబుర్రులా మాట్లాడకు."
"నాకేం అర్ధం కావట్లేదు."
"దేశద్రోహిగాడితో ఏం చెప్పావు నువు?"
"దేశద్రోహి ఎవరు?"
"అదే ఆ ఆలీబాబా!"
"వాడెవడు?"
"నీకు విశేష్ అని పేరు పెట్టిందెవరు?"
"వాడే!"
"ఎవడు?"
"మనవాడే!"
"మన అనకు ముందే చెప్తున్నా!"
"మావాడే!"
"సరే! వాడితో ఏం చెప్పావు?"
"దేన్ని గురించి?"
"మన పెళ్లి గురించి."
"ఏంటీ. మన పెళ్లా?" అని కొయ్యబారిపోయాడు శేషు.
"నంగనాచితుంగబుర్రలా నటించకు."
"ఇందాకోసారి అదే మాట అన్నావ్. లేటెస్టు తిట్లురావా?"
"నోట్లోవేలుపెడితే కొరకలేని వాడిలా......"
"విషయం చెప్పు" అన్నాడు విశేష్ విసుగ్గా.
"నిన్ను నా తమ్ముళ్ళా చూసుకుంటున్నానా లేదా?" అంది సితార జాలిగా చూస్తూ.
"కాదని ఎవరన్నారు?"
"మొన్న నీకు పాత చింతకాయ పచ్చడి నూరి ఇవ్వలేదూ?"
"అటుమొన్న పచ్చిపులుసు కూడా పంపించావ్" అన్నాడు విశేష్ కృతజ్ఞతాభారంతో కృంగిపోతూ.
"అప్పుడెప్పుడో నీకు జ్వరం వచ్చి నువు బెడ్ మీంచి లేవలేక పోయినప్పుడు బ్రెడ్డు కాల్చి యివ్వలేదూ?"
"లిస్టు చాలా వుందిలేగానీ విషయమేమిటి?"
"నాతో నీకు పెళ్ళేంటి?"
"అవును! నిజమే నీతో నాకు పెళ్ళేంటి?"
"మరివాడిచేత ఎందుకలా అడిగిచ్చావ్?"
"ఎవడిచేత?"
"జెయ్ చంద్రచేత."
"నువ్వు పజిల్ లా మాట్లాడ్డం మానేసి జరిగింది చెప్పు."
జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పింది సితార.
ఆమె అలా చెబుతున్నంతసేపూ నోరెళ్ళబెట్టి విన్నాడు శేషు.
"ఇంకచాల్లే నోర్మూసుకో!" అంది సితార.
శేషు ఠక్కున నోరు మూసేసి, మళ్ళీ అంతలోనే మళ్ళీ తెరిచి అన్నాడు "వాడట్లా అంటే నువ్వు నమ్ముతావా?"
"నమ్మకపోవడానికేం, మాయరోగమా?"
ఉన్నట్లుండి వరదొచ్చినట్లు నవ్వడం మొదలెట్టాడు శేషు.
"మహాఘనకార్యం చేసినట్లు నవ్వుతావేం? సిగ్గులేదూ?" అంది సితార చిరచిర లాడుతూ.
అష్టకష్టాలూ పడి నవ్వాపుకున్నాడు విశేష్.
"జెయ్ గాడు నీమీద మంత్రమేశాడు."
"ఏమంత్రం? పాం మంత్రం" అంది సితార ఈసడింపుగా.
"అబ్బేకాదు! వశీకరణ మంత్రం" అన్నాడు విశేష్.
"అంటే?"
"నీలోవున్న అహంభావం అన్న బెలూన్ని నాతో పెళ్ళి అనే గుండుసూదితో గుచ్చి గాలి తీసేశాడు."
"ఎందుకూ?"
"ఇకనుంచి నువ్వు పగలస్తమానం వాడిని గురించిన ఆలోచనల్లో వుండాలని."
"అది కేవలం వాడి భ్రమ."