ఎవరీ విరజ?
"ఏమిటీ సంబంధం??
విరజ-విరజ-
హఠాత్తుగా గుండెల్లో ఎక్కడో ఓ సింహం గర్జించింది.
అదే స్మృతి!
అవును విరజ-విరజ
విరజ- తన ఆరోప్రాణం_విరజలేంది తను లేడు, తను వినా విరజ లేదు.
వేణు....విరజ విడదీయరాని విడదీయబడని విరిసీ విరియని పూలజంట....తీగలా మ్రానుతో పెనువేసుకునిపోయిన జంట, వీణలో అతికిపోయిన తీగలా కలసిపోయినవారు. రాగంలో గీతంలా మిశ్రితమైన స్వర బద్ధమైన శృతిప్రేయమైన జంట నామం.
కానీ ఓ సుడిగాలి ఒకేకొమ్మనవున్న పూలని విడిపోయేట్టు చేసింది. ఓ కఠోరహస్తం వీనిని మొరటుగామీటి తీగను తెంచింది. ఓ కుకవిహస్తం ఆ కృతిని పాడుచేసింది.
వి....ర....జా....
వి....ర....జా....
గట్టిగా అరిచాడు.
ఉలికిపాటుతో మళ్ళీలేచాడు వేణు....కుర్చీలో భారంగా కదిలాడు.... స్వప్నం అంతా మళ్ళీ కళ్ళముందు మెదలటంతో ఆలోచనా దుఃఖం రెండూ ఎక్కువయ్యాయి.
గుండెలు బరువెక్కాయి.... మెల్లిగా కళ్ళు విప్పాడు.... ఎదురుగా బృహస్పతి వియద్గోళంలో విరాజిల్లుతున్నాడు. అలతి అలతి కాంతులతో విరాజిల్లే శుక్రుడికన్నా తనే గొప్పవాడినని గర్వం.
మనుషులోనేకాదు. మాకుల్లో మునులలో హెచ్చుతగ్గు అనేవాటిని గురించి గీర్వాణం పెంచుకోవటం అనాదిగా వుంది. అయినా అందరూ అదే గుణానికి మానవుడిని తప్పుపడుతున్నారు. ఎంత చిత్రం!
వేసవిరాత్రులు రాకముందే ఫాల్గుణమాసం అంత్యంనుండే వేసవి ఛాయలు మొదలయ్యాయి. గాలి ఆడటంలేదు.
విసనకర్రతో మెల్లిగా వీచుకోవటం ప్రారంభించాడు. చేయి నొప్పెట్టిందేగాని మనసుకి విశ్రాంతి కలగటం లేదు. ఎప్పుడూకూడా స్వాభావికత చేకూర్చిన హాయి కృత్రిమం కలిగించలేదు.
సాయంత్రం తెంపేటప్పుడు ఆకుల మధ్యన దాక్కుని తప్పించుకున్న మల్లెపూలు మెల్లిమెల్లిగా మధురమైన సువాసనలు వెదజల్లుతున్నా గంధవాహుని కదలికలేక ఘ్రోణ తృప్తి కలగడంలేదు.
తోటమాలి దయతో తల్లి చెట్టుకు మిగలాలని విడిచిన ఎర్రని సూర్యకాంతంపూలు చంద్రుని లేత వెలుగులో మరో నక్షత్ర మండలాన్ని సృష్టించేట్టుగా మెరుస్తానంటున్నాయి. ప్రకృతి కొంత పరిశీలనలో మనస్సు వెనక్కి పరిగెత్తటం మొదలుపెట్టింది. వేణు మనస్సులో విరజ స్మృతులు ఒకటొకటే కదలాడసాగాయి.
విరజ....విరజ....
* * *
పాఠశాల అప్పుడే వదిలారు.
బిలబిల మంటూ పిల్లలందరూ బయటికి వచ్చేస్తున్నారు. ఇళ్ళ కెడుతున్నామన్న సంతోషం ముఖాల్లో ప్రస్పుట మవుతున్నా ఉదయంనించీ శ్రమనే కలిగిన అలసట బాగా కనిపిస్తూనే వుంది. భుజాలమీద వ్రేలాడే సంచులలో నిండుగా పుస్తకాలు పేర్చుకుని, ఓ చేత్తో దాన్ని ఊగకుండా పట్టుకుని మరో చేత్తో భోజనం తెచ్చుకున్న క్యారియర్ ని పట్టుకుని ఊపుకుంటూ వేగంగా నడుస్తున్నారు.
స్థానికంగా తమ వూళ్ళల్లో బళ్ళు లేక వేరువేరు గ్రామాలనుండి వచ్చిన విద్యార్ధులు అందరికంటే ముందుగా బయలుదేరి వేగంగా వెళ్ళిపోతున్నారు. ఎప్పుడెప్పుడు ఇళ్ళకి వెడదామా? ఉదయంనుంచీ విడిచివచ్చిన తల్లి దండ్రుల్ని, తోబుట్టువుల్నీ కలుసుకుందామా అనే ఆరాటంతో ఆశతో ఉవ్విళ్ళూరుతూ ఆతురతతో వెడుతున్నారు కొందరు. కొందరు తమ బాల్యస్నేహితుల్ని కలుసుకొని ఎప్పుడెప్పుడు మిగిలిన ఆ కొద్ది కాలాన్నీ ఆటలు ఆడుకుంటూ, వాళ్ళకి తమ బడి కబుర్లు చెప్పుకుంటూ వారిని వూరిస్తూ గడుపుదామా అనే కుతూహలంతో వెడుతున్నారు.
ఎప్పుడూ ఈ ప్రపంచంలో సార్వజనీనమూ సహజము అయిన వాటిని కాదని ప్రత్యేకంగా తమ బాటలో పయనించేవాళ్ళు ఏ కొద్దిమందయినా సరే వుంటారు.
ఇద్దరే ఇద్దరు వీటికన్నిటికీ అతీతంగా, ఇలాంటి కోర్కెలూ, ఆశలూ, ఆకాంక్షలూ లేనట్టు మెల్లిగా తమ దారిన వెడుతున్నారు.
వారెప్పుడూ అంతే__ఉదయం వచ్చేప్పుడు కానీ, సాయంకాలము వెళ్ళేప్పుడు గానీ ఒకే వేగంతో వస్తారు. ఒకే వేగంతో పోతారు. ఒకరిజోలి అవసరంలేదు. మరొక నేస్తం అక్కర్లేదు.
హాయిగా, గమ్మత్తుగా కబుర్లు చెప్పుకుంటూ ఏవేవో తినుబండారాల్ని తింటూ_కులాసాగా నవ్వుకుంటూ ఒకరినొకరు గేళి చేసుకుంటూ పరిసర ప్రకృతిని గమనిస్తూ మామిడి తోపులు వచ్చినపుడు ఆగి వాటిచుట్టూ తిరిగి ఆడుకుంటూ, వేగులు ఎదురైనపుడు వంతెనమీద నుంచి దిగి వెళ్ళి ఇసుకలో కాసేపు కూర్చొని గులకరాళ్ళు యేరుకుంటూ నీటిపాయల్లో ఆడుకుంటూ వెడుతుంటారు.
తోటి అబ్బాయిలు "అదేమిటోయ్, అమ్మాయిలా ఆమెవెంట పడతావ్? మావెంట ఒక్కసారైనా రారాదూ మజా అంటే ఏమిటో చూపుతాం" అంటే చెయ్యెత్తి నమస్కారం పెట్టేవాడతను నవ్వుతూ.
తోటి అమ్మాయిలు "మగవాడిలా అతనితోటి నడకేమిటీ మావెంట రారాదూ, ఎంచక్కా గుజ్జనగూళ్ళు ఆడుకుంటూ వామన గుంటలు ఆడుతూ తమాషాగా వెడతాం" అంటే మెల్లిగా అటూఇటూ చూసి వెక్కిరించి పరుగెత్తేదా అమ్మాయి.
ప్రతిరోజూ బడి మొదటిగంట మ్రోగుతూ వుండగా, అంతకు కొంచెం ముందుగానే బళ్ళో ప్రవేశించటం, సాయంకాలం సూర్యాస్తమయానికి అటూఇటుగా వూరిముందు వాళ్ళు విడిపోవటం వాళ్ళకి అలవాటు.
ఆ కార్యక్రమంలో ఋతుప్రభావంగానీ, కాలప్రభావంగానీ ఉండదు. వర్షంరానీ, వేసవి ఎండల్ని చెరుగుతూవుండనీ హిమంతం శరీరాల్ని కొరికి వేస్తుండనీ వాళ్ళ అలవాటుమాత్రం మారదు.
రాకపోకల్లో ఎంతనియమ బద్ధంగా వస్తారో చదువుల్లోనూ అంతే! ఏరోజు పాఠాలు ఆరోజు చదివేయటం, హోంవర్కు లాంటిదేదైనా వుంటే బద్ధకం వహించకుండా చేసెయ్యటంలో ఇద్దరిలో ఎవరికివారేసాటి. అంతేకాకుండా ఒకరికి ఒకరు తీసిపోరు- ఎప్పుడూ అతనిది క్లాసులో ఫస్టుమార్కు, ఆమెది సెకండు.
సూర్యుడు మెల్లమెల్లగా పడమటిదిశను వాలిపోతున్నాడు. చుట్టూరా వున్న మబ్బులకి రంగులు వేస్తున్నాడు. గౌరవర్ణంతో కొన్ని మబ్బులు అక్కడక్కడా చెల్లాచెదురుగా వేగంగా పరుగెడుతున్నాయ్.
అలవాటైన మామిడిచెట్టు మొదట్లో కూర్చుంటూ విరజమొహంలోకి సూటిగా చూస్తూ ప్రశ్నించాడు వేణు.
"ఎందుకలా చేశావ్ విరజా?"
అతని ప్రశ్నకు జవాబేమీ ఇవ్వకుండా మౌనంగా అతని ముఖంలోకి చూస్తూ కూర్చుంది. కానీ అప్పటికే ఆమె కళ్ళంట నీళ్ళు సుళ్ళు తిరుగుతున్నాయ్.
దగ్గరగావచ్చి ఆమె భుజంపై చేయివేశాడు. టపటప మని రాలాయ్ కన్నీళ్ళు. కన్నీటిని తుడుస్తూ అన్నాడు. "ఊరుకో_అనవసరంగా నావల్ల దెబ్బలుతిన్నావ్_చెప్పు విరజా ఎందుకలా చేశావ్?"
ముక్కుపుటాల్ని ఎగరేస్తూ అంది. "ఎందుకో అర్ధంకావటంలేదు వేణూ! మాస్టారు నిన్ను కొడతారేమోనని భయంతో అలా అనాలోచితంగా చేశాను అంతే_"
కళ్ళు ఎర్రగా వచ్చాయ్. పెదవులు అదురుతున్నాయ్. సాయంకాలపు నీరెండపడి ముఖం యింకా ఎరుపుగా కనిపిస్తోంది. దుఃఖంయొక్క ఉద్వేగం యింకాతగ్గలేదు. మేస్టారు కొట్టినదెబ్బలు గుర్తుకువచ్చినపుడల్లా ఓ దుఃఖపు వీచిక అలా వీస్తూనే వుంది.
మేస్టారి అయిదువేళ్ళూ ఆమె చెంపపై గుర్తుతెలి కనిపిస్తూనే వున్నాయ్ ఇంకా. చెంపలంతా ఎర్రగా కందిపోయాయి. మెల్లిగా రాస్తూ అన్నాడు.
"నేనంటే ఎందుకింత అభిమానం విరజా_హోంవర్కు చేయకపోతే శిక్ష అనుభవించవలసినదేకదా__నీవు చేసికూడా నాకోసం ఎందుకు దెబ్బలు తిన్నావ్? పైగా నీవు అబద్ధం చెబుతున్నావని మాస్టారుకి తెలియదూ?"
అసలు జరిగింది:-
ఆరోజు లెక్కల మాస్టారు బోర్డుపై లెక్కవేసి విద్యార్ధుల్ని చేయమన్నారు స్వంతంగా. వేణు మౌనంగా కూర్చున్నాడు, పెన్సిల్ లేకపోవటంవల్ల. అతను మౌనంగా వూరికే వుండిపోవాల్సివచ్చింది.
ఒక్కొక్కరినే వరుసగా చెక్ చేస్తూ వస్తున్న మేస్టారు, వేణు వూరికే కూర్చోవటం, పైగా హోంవర్కు చేసివుండకపోవటం ఆగ్రహం తెప్పించింది. కోపం పట్టలేక దెబ్బలు వేయాలని చేయి పైకెత్తిన మేస్టారికి విరజ పుస్తకం అందించింది.