Previous Page Next Page 
విరిజల్లు పేజి 2


    ముందుగా వాళ్ళిద్దరే కనిపించారు. రానురాను మెల్లిమెల్లిగా వాళ్ళిద్దరికీ ఎదురుగా ఎవరు కనిపిస్తున్నారు. అతడు కనిపిస్తూనే వాడినవ్వు మరీ భయంకరంగా మారి ఎక్కువయింది. అత్యధికమైన సంతోషంతో విరగబడి నవ్వుతున్నాడు. నవ్వు...నవ్వు...అబ్బ ఎంత భయంకరం! చూడలేక కళ్ళు మూసుకున్నాడు.
    ఆమె ఎవరు? ఎక్కడనో చూసినట్లు, ఏనాడో పరిచయం ఉన్నట్లు మనస్సుకి గుర్తుకి అందకుండా ఉంది...అసలు వాడెవరు? ఆమెను ఎందుకలా బాధిస్తున్నాడు? అర్ధంకాని ఆలోచనలతో సతమత మవుతున్నాడు. వారు యెందుకు అక్కడ ఉన్నారు. తనూ అక్కడే ఎందుకున్నాడో వేణుకి అర్ధంకావడంలేదు. వారికీ తనకీ వున్న సంబంధం యేమిటో వేణుకి అంతుచిక్కడం లేదు.
    ఆమె బాధ చూస్తూవుంటే ఒకవేపు జాలీ, మరోవేపు దుఃఖమూ కలుగుతున్నాయి. అయినా ఏమీ చేయలేకపోతున్నాడు.
    అతనేదో అన్నాడు. ఆమె అర్ధంకానట్టుగా నావేపు చూసింది. ఆ ముఖంలో ఆశ్చర్యం తాండవిస్తోంది. ఏదో తెలియనితనం అమాయకత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. విప్పారిన విశాలమైన కళ్ళతో నమ్మలేనట్టు చూస్తోంది.
    అతను వేణు. మధుపర్కాల్ని మెడలో పచ్చగా తళతళమని మెరుస్తూ వ్రేలాడే యజ్ఞోపవీతాన్ని, పగడాలదండనీ, ఒంటిపోరా బంగారు గొలుసునీ చూపెడుతున్నారు. నమ్మలేనట్టు, నమ్మమన్నట్టు తలాడించింది.
    బిగ్గరగా నవ్వాడు. ఆ గదంతా దద్దరిల్లేట్టు, వినేవారి కర్ణపుటాలు భేదించేట్టు, బాధించేట్టు నవ్వాడు.
    కళ్ళనిండుగా కాటుక కరిగేట్టు పొంగేయి. నీళ్ళు...నాసాపుటాలు ఉద్వేగంగా ఉబ్బేయి. పెదవులు అదురుతున్నాయి. ఉచ్చ్వాస నిశ్వాసలు తీవ్రంగా వస్తున్నాయి. ఆమె ముఖంలో కోపంకన్నా దగాచెందినవారి ముఖంలో కనుపించే దుఃఖబాధ, అసహ్యత కనిపిస్తున్నాయి.
    అంతవరకూ ఆమె ఎవరో-అతనెవరో అతనలా ఆమెను ఎందుకు వేధిస్తున్నాడో, తనని ఆమెకి యెందుకు చూపెడుతున్నాడో, ఆమె ఎందుకు వేదనపాలౌతున్నదో ఆవగింజంతయినా వేణుకి అర్ధంకావడంలేదు. వేదనతో తెలియరాని దుఃఖంతో ఆలోచనలతో వారిని చూస్తూ ఉండిపోయాడు.
    ".... .... ...."
    ఆమెని పిలిచాడు.
    పేరేమిటో స్పష్టంగా అతనికి వినబడలేదు. ఆమె పలుకలేదు.
    "వి....ర....జా...."
    వి....ర....జ__
    ఉలికిపాటు చెందాడు. ఎవరీ విరజ! ఎక్కడిదీ పేరు?
    ఆమె తలెత్తి చూసింది. సుదీర్ఘమైన సొంపయిన నాసికాగ్రం నుండి అతను మండిపోయేంత కోపంగా చూసింది.
    "నన్నలా పిలవ్వద్దు__"
    పిడుగుపాటులా గర్జించాడా మాటకి.
    "ఎందుకు?"
    ఏమిటో బొత్తిగా అర్ధంకాకుండా వుంది వేణుకి....ఇంతకీ యెవరామె? ఏమిటా పేరు? ఎక్కడో విన్నట్టు? అసలింతకీ ఏమిటీ కథ? అని మధనపడసాగాడు.
    మళ్ళీ అతను గర్జిస్తున్నాడు. కాళరాత్రిలో భయంకరంగా ఉరుమిరిమి పిడుగును వర్షించినట్టుందా నవ్వు. నవ్వు కాదది మెరుపులాంటి ఆమెని కౄరంగా వెన్నాడుతూ తరిమే ఉరుము.
    "చూడు__నేను చెప్పేది నిజం కాదా?"
    బొంగురు కంఠంతో స్పష్టంకాని స్వరంతో గొంతంతా చించుకుని గట్టిగా అరుస్తున్నాడు.
    ఏమిటా నిజం? ఆ నిజంతో అతడికీ ఆమెకీ ఉన్న బంధమూ, అనుబంధమూ ఏమిటి? అర్ధంకాని ఆలోచనల్లో మునిగాడు వేణు.
    కాదు....నిజం కాదు.... అది నీవు కల్పించిన అబద్ధం-స్కౌండ్రల్ పో.... ఇక్కడనుంచి-నా ఎదురుగా అబద్ధాలు చెప్పి బాధ కలిగించి నా మనసు ఏదో మార్చి ఏదో సాధిద్దామనుకున్నావేమో? అది అసాధ్యం వెళ్ళు...."
    ఈ పర్యాయం విస్పష్టంగా విన్నాడామె గొంతుకని. పరిచితమై కాలం మాటున దాగిపోయినట్టుంది....ఎన్నడో ఎక్కడో ఎప్పుడో ఎంతో మధురిమని వెదజల్లిన స్వరంలా మనస్సుకి తట్టింది కానీ, మృగ తృష్ణకు ఆ భావన వేణు స్మృతికి అందకుండా పోతోంది.
    "అబద్ధమా? ఎదురుగా కనిపిస్తున్నదాన్నికూడా అబద్దమంటావా? అటు చూడు-"
    అయిష్టంగా అటు చూసింది ఆమె. అనుకోకుండా తనూ చూశాడు.
    ఇదేమిటి? సా-వి-త్రి.
    తననే కాకుండా తన జీవిహ భాగస్వామినికూడా ఆమెకు చూపటంలో ఉద్దేశ్య మేమిటి? ఇంతకీ ఈ చిత్రకథలో వున్న విచిత్రమైన ఆ రహస్యమేమిటి?
    విస్మయంగా చూస్తోంది.
    "ఆవిడే ఆవిడ అనటానికి గుర్తేమిటి? ఓడిపోవటానికి సిద్ధంగా వుంది. చావు సమీపంగావున్నా ఇంకా శతృ సైనికుడిమీదికి నిష్ప్రయోజనమైన బాణాన్ని వదిలే సైనికుడిలా అంది.
    బిగ్గరగా నవ్వుతూ జవాబు చెప్పాడు.
    "అవును గుర్తులేదు...వెళ్ళి చూడు తెలుస్తుంది. అక్కడికి వెళ్ళి అడుగు వినిపిస్తుంది. ఇలా దూరంగా వుండి నమ్మననీ, నమ్మబోననీ, నమ్మలేననీ అర్ధంలేని ప్రశ్నలు వేస్తూవుంటే నీకు జరిగేది ఏమీలేదు.... నీవు కట్టుకున్న స్వర్గం నేల కూలింది.... అది నీది కాదు.... మరొకరి సొత్తు. దానిపై హక్కు ఏ మాత్రము లేదు. మాటాడ వద్దు.
    మెల్లగా ముఖం చేతుల్లో దాచుకొని రోదించసాగింది.
    మధ్య మధ్య వెక్కిళ్ళు తప్ప మరేమీ వినిపించటం లేదు. తన ఆసక్తత ఆమె అసహాయత వేణుని మరీ మరీ బాధిస్తున్నాయ్.
    అతను దగ్గరగా వెళ్ళి ఆమె తలపై చేయివేసి నిమరబోయాడు. విసురుగా ఛీత్కారంతో అతని చేతిని ప్రక్కకు తోసేసింది. అయినా అతను కోపాన్ని ఏమాత్రం ప్రదర్శింపకుండా అన్నాడు.
    "పిచ్చి విరజా! నీ వేణు నీవాడు కాదు. అతను నిన్ను మరచిపోయి చాలాకాలం అయింది. మరిచిపోయిన వాళ్ళను గురించి మధనపడి మనస్సుని పాడుచేసుకునే అలవాటు మంచిదికాదు. పైగా అలా ప్రవర్తించటం వ్యర్ధంకూడా__ నామాట విని అతన్ని గురించి ఇక ఆలోచించకు.
    అసహ్యత అంతా ఉట్టిపడే కంఠంతో అంది. "దూరంగా వెళ్ళు దగ్గరికి రాకు. నన్ను ముట్టుకునే హక్కు నీకు లేదు. దుర్మార్గుడా! అన్యాయం చేసింది నీవు-మరచిపోయేట్టు చేయించింది నీవు.... మమ్మల్ని విడదీసింది నీవు.... నిన్ను.... నిన్ను...."
    కోపం అధికమై ఆవేశంతో మాటలు దొర్లక ఏడ్వసాగింది.
    సిగరెట్ వెలిగించి పెదవులు బిగించి పొగని వక్రంగా వదుల్తూ అన్నాడు.
    "నమ్మలేనివారిని నమ్మించడం కష్టం. నమ్మించాలని ప్రయత్నించటం కూడా వ్యర్ధమేనేమో! అనవసరంగా నేను శ్రమపడుతున్నానేమో?"
    "విధి! విధిని నీవు కాదనలేవు విరజా....నీవే కాదు. నేనూ మనం అంతా.... మనుషులం అందరమూ__ విధిని కాదనలేం. ఆ రోజు ఆ సంఘటన జరగకుంటే నా జీవితం ఎలా అయ్యేదో నీ జీవితం ఎలా అయ్యేదో ఎవరు ఏదారిన పడిపోయేవారో మన ఊహకి మాటే అందని విషయం.
    కానీ ఈనాడు నీ వేణుగోపాలుడు చదువు పూర్తిచేసుకొని డాక్టరై శుభ్రంగా తల్లిదండ్రులు చెప్పినట్లు మూన్నాళ్ళక్రిందటే మరదలు సావిత్రిని పెళ్ళాడి లక్షణంగా భార్యతో జీవించాలని కలలు కంటున్నాడు. అతనికి నీవు గుర్తులేవు_ నీ పేరే గుర్తులేదు_ కలలో కూడా కనిపించాలనికూడా అనుకోవటం లేదు-అనుకోడు- అతనికి_నీ పేరుకూడా వినిపించే అవకాశం లేదు- అవసరమూలేదు. నిన్ను అంతగా మరచిపోయిన అతన్ని గురించి గుర్తుచేసుకుని బాధపడటం దేనికి? ఈ ఆరాటమంతా దేనికోసం?
    ఆమె మౌనం సమాధానంగా, ఏడ్వటమే విద్యుక్తధర్మంగా నిర్లిప్తతే కర్తవ్యంగా వుంది.
    వేణు మనస్సులో ఎక్కడో ఓ బాణం దూసుకుపోయింది. బాధగా మూల్గింది మనస్సు. ఎన్ని విషయాల్లోనో ఎంతగానో గాయపడిన అతని గుండెల్లో మరోగాయం అయింది. గాయానికి కట్టు కట్టి బాగుపరచటం అతని వృత్తి అయినా చెందుని తొలగించటంమాత్రం ఎవరికీ సాధ్యంకావటం లేదు__     
    గుండెల్లో ఎన్నో రకాలుగా ఎన్నెన్నో రంధ్రాలు పడుతున్నాయ్. పడ్డాయ్-వాటికి మౌనంగా తలవంచుకుని విధీ, స్వాంతన, కర్మ అనే బంకమట్టిని మందుగా మెత్తటం తప్ప మరేమీ చేయలేక పోతున్నాడు.
    అతని వర్ణన అక్షరాలా తనకే సరిపోతోంది-తను డాక్టరు-తన మరదలు సావిహ్రి-మూన్నాళ్ళ క్రిందటే పెళ్ళి చేసుకున్నాడు-విచిత్రంగా అవి అన్నీ తన విషయాలే. మరి-మరి-ఏమిటిది?

 Previous Page Next Page