వారుణి
- యామినీ సరస్వతి
సాయంకాలం దాదాపు అయిదు గంటల సమయం. వేసవి గాలులు యింకా చల్లబడనేలేదు.
ఉండి ఉండి వీచే గాలులు వెచ్చని సెగలే మోసుకొస్తున్నాయి. ఫ్యాను గాలి కూడా నిప్పుసెగనే విరజిమ్ముతోంది! తపన! తపన!
బయట వేడి! మనస్సులో వేడి! ఉక్రోషం! సామ్రాజ్యం చేజారిపోయే వేళలో చక్రవర్తుకు పడే మధన. గుండె నిండా కుంపటి నిప్పులు.
"ఇది నా కొడుకుతో కాపురం చేస్తుందా!" కోపంగా అంది సుబ్బరత్నమ్మ. ఇంట్లో అడుగుపెడుతూ వుండగానే కోడలని ఒక్క చూపులో తేరిపార చూసి ఒక్క చూపుతో బేరీజు వేసినట్టుగా అందామె.
"ఏం?" ఖంగు తిన్నట్టుగా అడిగారు నారాయణగారు. ఆయనది సర్దుకుపోయే మనస్తత్వం. రత్నమైన, రాయైనా చేజారిపోయాక విలువ అంతా ఒకటేనని ఆయన ఉద్దేశ్యం. అలాంటి దానిని గురించి విచారించటం అవివేకం అనికూడా అనుకుంటారాయన.
"చూడండి ఆ హొయలు- ఆ షోకు- ఆ కిలాడితనం- ప్చ్-లాభం లేదు. వాడి బ్రతుకు నాశనమైనట్టె-మంచి సంబంధం చూసుకుని, కులం గుణం వున్న అమ్మాయిని చేసుకుని వుంటే ఎంతో సుఖపడేవాడు, కొడుకుపై ప్రేమ, కొత్త కోడలిపై ఆక్రోశం ఆ మాటల్లో వెళ్ళగక్కింది సుబ్బ రత్నమ్మ తన స్త్రీ సహజమైన ఆలోచనలతో.
నారాయణ మనస్సు నొచ్చుకున్నాడు.
నీవు అలా అనకూడదు అన్నట్టుగా భార్య వైపు చూశాడు.
కానీ అలా చూపులతో శాంతించేది కాదు సుబ్బరత్నమ్మ.
"మనిషిని ఒకసారి చూస్తే చాలు తొలిచూపులోనే బేరీజు వేయగలను నేను. అది_దాని హొయలు దాని కిలాడి తనం_"
ఆమె వాక్ప్రవాహం ఆగేట్టులేదు.
చప్పున అన్నాడు నారాయణ "ఛ! ఊరుకో! ఆ అమ్మాయి యింట్లో అడుగుపెట్టిందో లేదో అప్పుడే సొద ప్రారంభించావు శుభమాని వాడు పెళ్ళి చేసుకుని యింటికి వస్తే ఆశీర్వదించవలసిందిపోయి అపశకునం మాటలు మాటాడుతున్నావా? ఛ! ఛ! ఏం మనిషివి? ఆ అమ్మాయి వింటే ఏమనుకుంటుందోనన్న పరిజ్ఞానం కూడా నశించింది నీలో_"
"ఏమనుకుంటుంది?" కరుగ్గా ప్రశ్నించింది.
ఆ క్షణంలో ఆయనకి భార్యపై ప్రేమ జనించింది. "ఎంత అమాయకురాలు" అనుకున్నాడు.
"మీరు తెలుసుకోలేకపోయారు. అది కోళ్ళను గెలిచిన కోడి! కోస్తాలు గెలిచొచ్చిన వస్తాదు. దేశం తిరిగిన దిమ్మరి!"
"రత్నం !" విసుగ్గా అన్నారాయన.
"మీరూరుకోండి మీకేం తెలీదు దానికేం? ఎగ్గా? సిగ్గా? అన్నిటికి తెగించి వీడితో వచ్చేసింది? అటు తండ్రిని కాదనుకుంది. ఇటు మనల్ని లెక్క చేయలేదు. ఎంత తెంపరితనం వుండాలి యిలా వచ్చెయ్యాలంటే?" తనలోని ఉక్రోషాన్నంతా వెలిగక్కుతోంది సుబ్బరత్నమ్మ.
స్త్రీకి స్త్రీయే మొదటి శత్రువు. అంతేకాదు పరమ శత్రువు కూడా అనుకున్నారాయన. ఒక్క క్షణం జాలిగా చూసి యిలా లాభం లేదనుకున్నారు. అప్పటికప్పుడే మనస్సులో స్ఫురించిన ఆలోచన వెంటనే "పోనీ_ అబ్బాయి వింటే ఏమనుకుంటాడు? తనని, తన ప్రేమని_ తన ఆదర్శ వివాహాన్ని తల్లిదండ్రులే అంగీకరించి ఆదరించలేకపోయారు అనుకోడా? రత్నం! కాలం మారుతోంది. కాలం వెంట మనుషులూ మారుతున్నారు. తద్వారా సంఘం ఎంతో మారిపోతోంది. మన తరానికి_ నిన్నటి తరానికి_ యీ తరానికి_ రేపటి తరానికి భావనలో- ఆచరణలో- ఆదర్శంలో ఎంతో మార్పుంది. మనం ఈ మార్పుని సహజంగా ఆమోదించి అంగీకరించాలి, అంతే!"