Previous Page Next Page 
విరిజల్లు పేజి 4


    మేస్టారుతో తను లెక్కలు చేయలేదనీ, అది వేణు పుస్తకమనీ, తాను చూడటానికి తీసుకున్నాననీ చెప్పింది. మౌనం వీడలేదు వేణు. మేస్టారు మరేమీ ప్రశ్నించకుండానే నిజం తెల్సుకున్నాడు. అయినా ఆ అమ్మాయి అతనిమీద అలా అభిమానం చూపటం పైగా తప్పును తనమీద వేసుకోవటంచూసి సహించలేకపోయాడు.
    తప్పుని శిక్షించకుండా వదలకూడదనే సిద్ధాంతంపై ఆయన శిక్షించాడు.
    విరజ చెంపమీద ఎర్రగా కంది బాగా గుర్తుతేలిన వ్రేళ్ళ చారలని చూస్తూ తన మనస్సుమీద సమ్మెటలాగా అవి తగులుతూ బాధపెడుతున్నా విద్యార్ధుల్లో క్రమశిక్షణ పెంపొందించాలని మౌనంగా ముందుకు సాగిపోయాడు. మనసు ఒకవేపు తనను కాల్చుతున్నా!    
    వేణుకి శిక్ష తప్పింది.
    కానీ మాష్టారు వెడుతూ వెడుతూ అతనివేపు చూసిన చూపు అతనికి రంపపుకోతలా భరించుకోరానిదైంది.
    పాఠశాల వదిలాక ఒక్కమాటకూడా మాట్లాడకుండా వచ్చేశాడు. కానీ మామిడితోపులోకి ప్రవేశించాక ప్రశ్నించకుండా వుండలేకపోయాడు.
    మెల్లిగా అంది విరజ. "అబద్ధమో నిజమో అదేమో నాకు తెలియదు వేణూ! ఆయన నిన్ను కొడతారేమోనని బాధపడ్డానేగానీ, నన్ను కొడతారేమోనన్న వూహరాలేదు, అందుకే అబద్ధం ఆడాను. మేస్టారు గ్రహించుకోలేరని కాదు."
    మెల్లిగా భుజంమీద చేయివేసి నిమురుతూ అన్నాడు.
    "పిచ్చి అభిమానం విరజా! కాదంటే ఏమిటిది? ఒక్క దెబ్బ తినివుంటే అంతమాత్రానికే నేనేమయ్యేవాడిని? ఇటు చూడు యెలా బూరెలా వాచిపోయిందో?"
    నవ్వింది అతని మాటలకి. "మీ అమ్మకి తీసికెళ్ళి ఇస్తాను యీ బూరెని సరేనా?"
    అతనూ నవ్వుతూ అన్నాడు. "మీ అమ్మగారికి ఈవిషయం తెలిస్తే అబ్బో_ఇంకేమైనా వుందా? మేస్టార్ని ఏమైనా అంటుంది. వద్దు వద్దు. అనవసరంగా అదో గొడవ-పోనీ ఇంతటితో అయినా. ఈ మేస్టార్లే అంత! ఎందుకలా కొట్టాలి."
    అతని నోటిని మెల్లగా మందార పువ్వులాంటి తన చేత్తో మూస్తూ అంది.
    "తప్పు వేణూ! అలా అనొద్దు. వాళ్ళు కొట్టేట్టు మన మెందుకలా చేయాలి? మన ధర్మం మనం చేస్తే వారెందుకు శిక్షిస్తారు? తప్పు మనది. అయినా మనం వారిని గురించి అనుకుంటూ బయటకు వచ్చాక మనకూ తెలుస్తుంది. తప్పు మనదేనని.... కాని అది ఒప్పుకోబుద్ధికాక వాళ్ళను నిందిస్తాం, ఒకప్రక్క మనసు పీకుతున్నా__"
    "ఇంకే మేస్టారూ ఏమీ అనంది ఈయన ఒక్కడికే పట్టిందా మన బాగోగులు" ఉక్రోషంగా అడిగాడు. అది ఆయనపై ఉక్రోషం కాదు, తను చేసిన తప్పుమీద. తన విరజ తనవల్ల దెబ్బతినిందే అన్న విషయంమీద.
    కూర్చున్న చోటునుంచి లేస్తూ అంది. "ఆ విషయం వదిలెయ్ ఇక. పైగా ఆయన సబ్జెక్టులోవున్న కష్టం మరెవ్వరికీ లేదు. మనం శ్రద్ధ తీసుకోకుంటే చెడిపోతామని-మన శ్రద్ధని పెంపొందించాలనీ శ్రమిస్తున్నారాయన. ఇక పద.పైగా ఆ వంతెనవద్దకూడా కూర్చోవాలికదా. లేకపోతే నీవు రాత్రి నిద్రపోయేదేముంది?"
    గలగలా నవ్వేస్తూ అన్నాడు. "అదీ నిజమేలే అయినా ఈరోజు కొంచెం ఆలస్యంగా వెడదాం. పొద్దుకూకేక వెడితే మరీ మంచిది. లేకపోతే మీ అమ్మగారు యీ బూరెని చూస్తే...."
    మనసులోవున్న వేదనని కొంచెం తగ్గించుకున్నట్టయి ముందుకు సంతోషంగా సాగారు.
    వాగులో కూర్చొని తినుబండారములు తింటూ స్వంత కబుర్లు చెప్పుకోసాగారు.
    అస్తమించబోతున్న సూర్యుని కాంతి కరిగిన బంగారంలా. ఇసుక మీద మెరుస్తూ ప్రవహిస్తోంది. నిశ్శబ్దంగా పారుతున్న బంగారు ముద్దలా కనిపిస్తున్నాడు సూర్యుడు.
    మెల్లిగా లేచి నడక సాగించారు. సూర్యాస్తమయం అయ్యేసరికి వూరి ముందుకు చేరుకున్నారు.
    విడిపోబోతూ అంది విరజ. "వేణూ! ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు, మరిచిపోవద్దు."
    అలాగేనన్నట్టు తలూపి నవ్వుకుంటూ చేతిలోని క్యారియర్ ని ఊగించుకుంటూ ఇంటివేపు దారితీశాడు వేణు.


                                                              2


    జాగ్రత్తగా తను తెచ్చుకున్న తినుబండారాల మూటను విప్పి ఇద్దరి మధ్య పెట్టింది విరజ. వేణు ఎటో చూస్తున్నాడు. మెల్లిగా ప్రక్కగా వున్న ఓ చిన్న కర్రపుల్లను తీసుకొని అరికాలిని గీరింది-ఉలికిపడి చూశాడు.
    లడ్డూలు, కారపు బూంది, పకోడీలు....విడివిడిగా ఒక్కొక్క పొట్లంలో వున్నాయ్. ఓ లడ్డూని తీసికొని తుంచి సగం నోట్లో వేసుకొని మిగతా సగం ఆమె నోట్లో పెట్టాడు.
    మెల్లిగా నములుతూ మౌనంగా ఇసుకలో వెర్రిగీతలు గీయసాగింది. మనస్సులో ఎక్కువ ఆలోచనలు దొర్లినపుడు, బొత్తిగా ఆలోచనలు దొర్లనపుడు మనిషి పేపరుపై అర్ధంలేని గీతలు గీస్తూ వుంటాడు. లేదా నదీతీరాల్లో కూర్చునివుంటే ఇసుకలో వెర్రివెర్రి గీతలు గీస్తూ వుంటాడు.
    లడ్డూని తినేశాక కారపు బూంది కొంచెం తీసుకొని తను నోట్లో వేసుకుని ఆమెనుకూడా తినమని మళ్ళీ ఆలోచనలో మునిగిపోయాడు. మెల్లిగా ఒక్కొక్కటే నములుతూ మెల్లగా నిశ్శబ్దంగా పోలేని నీటి పాయను చూస్తున్నాడు.
    అర్ధం లేనట్టుగా ముసురుకుంటున్న ఆలోచనల్ని ప్రక్కకి పారద్రోలుతూ తిరిగి చూశాడు విరజవేపు.
    ఆమె ఎటో చూస్తూ కూర్చుంది.
    'విరజా !"
    జవాబు చెప్పలేదు. తల త్రిప్పలేదు-అర్ధంకాక దగ్గరగా జరిగి ఆమె ముఖాన్ని బలవంతంగా తనవేపు త్రిప్పుకుని చూశాడు.
    నిండుగా నిండిన నీటితో కళ్ళు రెండూ వర్షించటానికి సిద్ధంగా వున్నాయ్. అందుకు ఒక్క వీచిక చాలు.
    "ఏమిటిది విరజా?"
    ఆమె చేసేదేమిటో, ఆమె మనసులో దేమిటో అర్ధంకాక అడిగాడు ఆ అమ్మాయి ఏమీ జవాబు చెప్పలేదు. కాగితం పొట్లంలోని బూందీ కారంగా ఎర్రగా నవ్వుతోంది.
    కొద్దిగా చేతిలోకి తీసుకొని బలవంతంగా నోరు తెరిచిపోశాడు బొటబొటమని కన్నీరు అప్రయత్నంగా రాలింది. చేతితో తుడుస్తూ అన్నాడు.
    "అబ్బే! మరీ ఇంత సున్నితమైతే ఎలా విరజా?" ఏదో నేను పొరపాటు చేసినదానికి ఇంతగా ఇదవ్వాలా?"
    అతని జవాబుతో తృప్తిపడినదానిలా అతని ముఖంలోకి సూటిగా చూసింది. మరేమీ అనకుండా తలవంచుకున్నాడు.
    కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ప్రవహించే కాలప్రవాహానికి తోడయ్యారు. మెల్లిగా ఆర్ద్రమైన కంఠంతో అన్నాడు క్షమాపణ చెప్పుకుంటున్నట్టుగా.
    "పొరపాటైంది విరజా! పూవుకన్నా సున్నితమైన నీ కోమల హృదయాన్ని నొప్పించాను. మన్నించు....ఏదో ధ్యాసలో ఆలోచనల్లో పడి అలా అయింది. అంతేకాని మరేమీ లేదు__"
    ఆ అమ్మాయి ఏమీ జవాబు చెప్పలేదు. మనస్విని అయిన స్త్రీ బాలిక అయినా ప్రౌఢ అయినా ఒకటే. నిశ్శబ్దమనే కత్తితో అతన్ని శిక్షిస్తూ కూర్చుంది విరజ.
    పకోడీ పొట్లం విప్పి ఒక్కొక్కటే తను తింటూ ఆమెచేత తినిపిస్తూ వచ్చాడు. ఒక్కమాట కూడా మాట్లాడకుండా అతను చెప్పినట్టే చేసింది. ప్రక్కనేవున్న పాయలోకి లోతుగా వెళ్ళి మడిమకూడా దాటని ఆ నీటిలో వంగి దోసిలినిండా నీరు ముంచుకు తెచ్చి ఆమెకు త్రాగించాడు. తను కడుపునిండా త్రాగి త్రేన్చి నిలబడ్డాడు.
    ఒక్క క్షణం అటూ ఇటూ చూసి లేచి నిలబడుతూ అంది. "నే వెడుతున్నా."
    అతనికి కోపం వచ్చి నిశితంగా ఆమె ముఖంలోకి చూశాడు కానీ, ఆమె సూటిగా అతనివేపు చూడటంలేదు. ఇంత చిన్న తప్పుకి యెంత పెద్ద శిక్ష?
    "పో__"
    గట్టిగా అరిచాడు.
    ఏడుస్తూ పరుగెత్త సాగింది. అతని హృదయం మూల్గింది. ఆ అమ్మాయి ఓ యాభై గజాలు పరుగెత్తింది. అలాగే చూస్తూ నిలబడ్డాడు. అతనిని మనస్సు హెచ్చరించింది.
    "విరజా__ఆగు__"
    హఠాత్తుగా గట్టిగా అరచి వెంటనే బయలుదేరాడు అందకుండా పరిగెడుతుంది. వేగం హెచ్చించాడు. తిరిగిచూస్తూ అతనికి అందకుండా తప్పించుకుని పోవాలని పరుగెడుతూంది ఏడుస్తూ. మధ్య మధ్య ఆమె వెక్కుతూ వుండడం కూడా అతనికి వినిపిస్తోంది. 

 Previous Page Next Page