Read more!
 Previous Page Next Page 
దీప పేజి 3


    
    దీప ఉలిక్కిపడింది.

 

    "నీ గురించి ఆయనేమంటారో తెలుసా! నువ్వూ ఉన్నావు దేనికి! దీప చూడు చదువు... చదువు... అంటూ పెద్ద చదువులు చదవాలని ఎంత శ్రద్ధ చూపిస్తున్నదో, ఆడవాళ్ళకయినా, మగవాళ్ళకయినా చదువుకోవాలని అభిలాష ఉండాలి. అభిలాషంటూ వుండాలే గాని డబ్బుదేముంది. ఏదో ఓ మార్గాన సమకూర్చుకోవచ్చు. నీ చెల్లెలికున్నంత శ్రద్ధ నీకే వుంటే బి.ఎ., యం.ఏ. ఏదయినా చెప్పిద్దును. చదువుకునే ఆడవాళ్ళంచే నాకెంతో ఇష్టం. దీపతో చెప్పు బాగా చదువుకోమని. ఎంతసేపూ ఆయనకి నీ చదువుగురించే" లలిత చెప్పుకు పోతున్నది.

 

    ఆరోజు బావ ఎదుట జరిగింది గుర్తుకు వచ్చింది దీపకి.

 

    ఫోర్తుఫారం పాస్ అయింది. ఆ రోజు ఇంట్లో అందరూ సంతోషించారు.. ఫిఫ్త్ ఫారం చదవడానికి అభ్యంతరం పెట్టారు. ఆడదానికి పెద్ద చదువెందుకు? అక్కయ్యచూడు ఏదో పేరు. పెళ్ళయ్యేవరకూ చదువుకుంది. అదీ మొదటిక్లాసు ఇంగ్లీషు (ఫస్టఫారం) మంచి సంబంధం వచ్చింది. పెళ్ళయింది. సలక్షణంగా కాపురం చేసుకుంటున్నది. నీకూ సంబంధాలు చూస్తున్నామా? ఓ మంచి సంబంధం చూసి పెళ్ళి చేస్తే" అంటూ ప్రధమ విఘ్నంకి నాంది పలికింది.

 

    ద్వితీయ విఘ్నం నాన్న... "ఇద్దరు మగపిల్లలను చదివించాలి. పెద్దమొగాడిలా చదువో చదువో అంటావేమిటి? చదివి ఉద్ధరించాలా? ఊళ్ళేలాలా? మీ అమ్మేం చదువుకుంది? లలితేం చదువుకుంది? డబ్బెక్కడినుంచి వస్తుంది నువ్వు బి.ఎ. చదువు ఎం.ఎ. వాడిని అల్లుడిగా తెస్తాను. ఎలాగా? నా తల తాకట్టుపెట్టి..." ధూం ధాం అన్నాడు. ఎదురుగుండా అల్లుడున్నాడని తెలిసి కూడా.

 

    తృతీయ విఘ్నం అక్క.

 

    "అదిగాదే దీపా! నీకు చదువుకోవాలని వుంది. నీకు చదువు బాగా వస్తున్నది. కాని నాన్న ఎన్నని చూస్తారు. ఈ సంసారం నాన్న ఒక్కరు ఈడ్చుకొస్తున్నారు. మనం మగ పిల్లలమన్నా కాకపోతిమి. ఈ వయసుకి నాన్నకి సాయంగా వుండేవాళ్ళం. నానిగాడిని చదివించాలి. చిన్నాని చదివించాలి. సుబ్బు చిన్నది, ఎన్ని చూసుకోవాలి?" అంటూ లలితక్క తెలివితక్కువ సమర్ధింపు.

 

    అంతా విని బావ "దీప చదువు విషయం నాకొదిలేయండి. ఆ డబ్బు నే భరిస్తాను. ఫస్టుగా చదివే పిల్లని మధ్యలో ఆటంక పరచటం నిలువునా నరకటం లాంటిది. దీపా! నువ్వు విసుగు పుట్టిందాకా చదువుకో. డబ్బు నే సర్దుతామను" అన్నాడు.

 

    పరాయివాడు బావకున్న శ్రద్ధ ఇంట్లో ఎవరికీ లేదు. బావ సర్దాగా వుంటాడు. మాటకు ముందు నవ్విస్తాడు. బావ మంచివాడు. తనంటే బావకి ప్రేమ. అయినా తను ఆ రోజు "వద్దు బావా! నీ డబ్బులు నాకేం అక్కరలేదు." అనేసింది.

 

    బావ బలవంతంతో అందరూ "నీయిష్టం" వరకూ వచ్చి ఆగారు.

 

    బావ చదివిస్తే చదువుకోటం పూర్తి ఇష్టమూ లేదు. అయిష్టమూ లేదు. ఎందుకో వెంటనే అంగీకరించలేదు. కోపంతో గదిలోకి దూరి తలుపేసుకుంది.

 

    "వింటున్నావా?" అంది లలిత, దీప భుజంమీద చెయ్యి వేసి.

 

    "ఆ...ఆ.... వింటున్నా చెప్పు" అంది దీప గతంలోంచి బయటపడి.

 

    "ఆయనన్నారు దీపని బాగా చదువుకున్న వాడికిచ్చి పెళ్ళి చేద్దాం అని... నీవంటే ఆయనకి..."

 

    దీప చటుక్కున మంచంమీదనుంచి లేచింది.

 

    "అబ్బ వళ్ళంతా చీదరగా వుంది. స్నానంచేసి వస్తాను. భోంచేసి, వెన్నెల్లో ఆరుబైట మంచాలేసుకుని పడుకుని కావలసినన్ని కబుర్లు చెప్పుకుందాం. కాసేపు విశ్రాంతిగా పడుకో అక్కా! ప్రయాణం చేసి అలసిపోయి వున్నావు."

 

    "నువ్వు స్నానం చేయాలన్నమాట మరచే పొయ్యాను. వెళ్ళు వెళ్ళు మీ బావన్నట్లు, మాటల్లో పడితే మనుషులు పరిసరాలు గుర్తే వుండవు" అంది లలిత.

 

    "రామనామ జపంలా బావనామ జపం ఈ అక్కకి. బావకి నాపై ప్రేమ ఎంతమాయకంగా చెపుతున్నది? అక్క ఉత్తపిచ్చిది. బావ...హూ..." దీప స్నానం చేయటానికి గదిలోకి వెళుతూ అనుకుంది.

 

                                                                 3

 

    రాత్రి తొమ్మిదయినా వెంకట్రావు ఇంటికి రాలేదు.

 

    తీసుకెళ్ళిన డబ్బు అయిపోతే వెంటనే, వస్తుంటే ధనలక్ష్మి విషయం తాడో పేడో తేల్చుకుని గాని ఇంటి ముఖం చూసే అలవాటు వెంకట్రావుకి లేదు. ఈ విషయం వెంకట్రావుకి తెలుసో తెలియదో గాని ఇంట్లోమాత్రం అందరికీ తెలుసు."

 

    వస్తాడన్న నమ్మకం లేకపోయినా తొమ్మిది గంటల దాకా చూసి ఆదిలక్ష్మమ్మ బలవంతంతో అందరూ భోజనాలకి కూర్చున్నారు. ఆదిలక్ష్మమ్మ కంచాల్లో కూర, పచ్చడి వడ్డించింది. వెంకట్రావు వచ్చాడు.

 

    "ఉండండి, ఉండండి, మీ నాన్నగారు కూడా వచ్చారు. అందరూ కల్సి తిందురుగాని." అంటూ ఆదిలక్ష్మమ్మ లలిత వచ్చిన సంగతి భర్తతో చెప్పి పీటవాల్చి కంచం, మరచెంబుతో మంచినీళ్ళు పెట్టింది.

 

    కాళ్ళూ చేతులు కడుక్కుని భుజంమీద తువ్వాలతో చేతులు తుడుచుకుంటూ వంటింట్లోకివచ్చి లలితని పలకరించాడు వెంకటరావు.

 

    "సాయంత్రం వచ్చావని సాయంత్రమే తెలిసింది. ఎంత తొందరగా పనులు ముగించుకుని వద్దామన్నా ఈ వేళయింది. కులాసాగా వున్నావా లలితా?"

 

    "పనులు గాదు పేకాట... పేకాటలో ముందే తొంటి చెయ్యి ఎదురయి వుంటుంది" దీప చిన్నగా అన్నా అటు వెంకట్రావుకి ఇటు లలితకి స్పష్టంగా వినపడింది.

 

    వెంకట్రావు కోపంగా దీపవైపు చూసి వెంటనే లలిత వైపు చూపు మరల్చుకున్నాడు.

 

    "ఊరుకో నాన్న వింటే బాధపడతారు" అంది లలిత తగ్గు స్వరంతో.

 

    "నాన్నకి పేకాటలో వేలుపోతేనే బాధలేదు. నే అంటే బాధవుంటుందా? ఊహూ...నేనమ్మను" తేలికగా నాలుక చప్పరించేసింది దీప.

 

    దీప మాటలు ఎక్కడ తండ్రి కినబడతాయో అని లలిత "కులాసాగానే ఉన్నాను నాన్నా! మీరొస్తారని ఇంతవరకూ చూసి ఇప్పుడే భోజనాలకి కూర్చున్నాము. నాన్నా! ఆయనకి మీరంటే ఎంత గౌరవమో, మీ కిష్టమని గుర్తుంచుకుని పంపారు. మంచి కంపెనీ చుట్టలు రెండు కట్టలు కొనిచ్చారు." అంది.

 

    "నాన్నా! మరి బావ నాకు బొమ్మపిస్తోలు, చిన్నకి రైలుబండి, సుబ్బుకి గౌను, చాక్ లెట్లు, బిస్కెట్లు చాలా పంపించాడు" నాని గుర్తుగా వరసక్రమం తప్పకుండా గబగబ చెప్పాడు.

 

    "మధుసూదనం బుద్ధి, మా దొడ్డ బుద్ధి, అందుకే అతనంటే నాకు చేతికందొచ్చిన కొడుకుపై వుండే ప్రేమలాంటిది నాకుంది.

 

    "దొందూ దొందే" దీప గొణిగింది.

 

    "నాన్నా!"

 

    "ఏంటి తల్లీ?"

 Previous Page Next Page