Read more!
 Previous Page Next Page 
దీప పేజి 2


    
    "చంప...చంప..." చెంప తడుముకుంటూ అన్నాడు మోహన్.

 

    "ఊ సరేలే. బాగా చదువు కుంటున్నావా?"

 

    "ఓ దానిలో మార్పులేదు"

 

    "మంచిది మనూ! అవకాశం వున్నవాళ్ళు చదువునెప్పుడూ వృధా చేసుకోకూడదు" దీప రాతి మీద నుంచిలేస్తూ అంది.

 

    "అదేం అప్పుడే లేస్తున్నావ్! నా మాటలు బోర్ కొడుతున్నాయా?"

 

    "ఉహు, ఇది మాట్లాడుకుంటూ కూర్చునే చోటేనా? అవతల చీకట్లు ముసురుతున్నాయి. చెరువుకొచ్చి చాలా సేపయింది. చూసిన వాళ్ళేమనుకుంటారు?"

 

    "భయమా?" బిందె ఎత్తి దీప కందిస్తూ అన్నాడు మన్ మోహన్.

 

    "నేను పిరికిదాన్ని కాదు మనూ! కాని ఆడపిల్లను. ఇదెలా మరిచిపోతాను? శలవులకి కదూ వచ్చావ్ వుంటావుగా?" అంతలోనే మాట మారుస్తూ అంది దీప.

 

    "నెల రోజులుంటాను. రేపు మా ఇంటికి నువ్వొస్తావా? నేనే మీ ఇంటికి రానా?"

 

    "నేను మీ ఇంటికొస్తే ఆ పూట నీవు మా ఇంటికి రాకూడదని లేదే! రేపురా"

 

    "అలాగే, అలాగే"

 

    "రేపొస్తావుగా మాట్లాడుకుందాం. ఇప్పటికే ఆలస్యం అయింది వస్తా."

 

    మన్ మోహన్ తో చెప్పి దీప నాలుగడుగులేసింది. చటుక్కున ఆగి వెనుదిరిగింది. దీపని అలా చూస్తూ నుంచుండి పోయాడు మన్ మోహన్.

 

    "మనూ! ఏమనుకోకు చూడంగానే గుర్తుపట్టలేదు అంతే."

 

    మన్ మోహన్ చెంపమీద చేయివేసుకుని నిమురుకుంటూ "ఓ అదా? స్వీట్ గా వుంది" అన్నాడు.


    దీప తనలో తాను నవ్వుకుంటూ ముందుకు సాగింది.

 

                                                                 2

 

    దీపకి వాకిట్లోనే చిన్న ఎదురొచ్చాడు.

 

    "అక్కా! మరి... మరి... ఊరినుండి పెద్దకొచ్చిందేవ్, మిఠాయి తెచ్చింది." అన్నాడు చేతిలో వున్న సగం తిన్న లడ్డుండ చూపుతూ.

 

    దీప ఏమీ అనలేదు. నిట్టూర్పు విడిచి ఇంట్లోకి అడుగుపెట్టింది.

 

    "వచ్చావా? ఊరు నుంచి లలిత వచ్చింది. పెరట్లో విశ్రాంతిగా పడుకుంది వెళ్ళు." హడావిడి పడిపోతూ దీప చేతిలోంచి బిందె అందుకుంటూ అంది ఆదిలక్ష్మమ్మ.

 

    "ఆయనగారు కూడా వచ్చారా అమ్మా?"

 

    దీప స్వరంలో వ్యంగ్యం గుర్తించలేదు ఆదిలక్ష్మమ్మ. ఆవిడది అదో ధోరణి పూర్వకాలం మనిషి ఆచారాలు, పూజలు, తడి మడి.

 

    "బావగారు రాలేదమ్మా! ఆయనకేదో పనులున్నాయట ఆగిపొయ్యారు. అక్కడ బస్సెక్కించారుట ఇదొక్కతే వచ్చింది."

 

    "ఓహో!" అంటూ దీప పెరట్లోకి నడిచింది.

 

    "అక్కా!"

 

    ఆలోచిస్తూ పడుకున్న లలిత, దీప పిలుపుతో మంచం మీద నుంచి లేచి కూర్చుంది.

 

    "ఏమిటే దీపా! ఇంతాలశ్యం అయింది? ఎలా వున్నావ్? బాగా చదువుకుంటున్నావా?" తన పక్కనే కూర్చున్న దీప చెయ్యి నిమురుతు అడిగింది.

 

    "నాకేం నిక్షేపంలా ఉన్నాను. నువ్వెలా ఉన్నావన్నదే బెంగ. ఉత్తరాలు చూడబోతే పొడి పొడిగా రాస్తావు. అవును మళ్ళీ...?"

 

    "ఊ ఇప్పుడు ఆరోనెల" లలిత సిగ్గుపడుతూ చెప్పింది.

 

    "ఈ తఫా అయినా డాక్టరుకి చూపించాడా బావ?"

 

    "బావకి తీరుబడి ఎక్కడిదే దీపా! ఆ మాయదారి బిజినెస్ రాత్రింబవళ్ళు తీరుబడే వుండదు."

 

    "అవునవును మగవాళ్ళకి వెయ్యి పనులు. ఆడపని మగ పని వాళ్ళెక్కడ చూసుకుంటారు? మనమే చూసుకోవాలి. ప్చ్, బావనని ఏం ప్రయోజనం. కొన్ని మనమే చూసుకోవాలి"

 

    "మంచి మాటన్నావు" మెచ్చుకోలుగా అంది లలిత.

 

    "అమ్మ, అక్క ఇద్దరూ ఇద్దరే బోళా మనుషులు. వీళ్ళని మార్చటం ఆ దేముడి తరం కాదు" అనుకుంది దీప.

 

    "వేడి నీళ్ళు పెట్టాను పోసుకురా, ప్రయాణం బడలిక తీరుతుంది" అంది ఆదిలక్ష్మమ్మ పెరట్లోకి వచ్చి.

 

    లలిత నీళ్ళు పోసుకు రావటానికి వెళ్ళింది.

 

    లలిత ఖాళీ చేసిన మంచం మీద అడ్డంగా పడుకుంది దీప కళ్ళకి చెయ్యి అడ్డంగా పెట్టుకుని.

 

    "నాన్న కీ సంసారం పట్టదు. రాత్రింబవళ్ళు పేకాడటం తప్ప. "భర్తంటే దేముడు భర్తని ఏమీ అనకూడదు" అంటూనే మరో పక్క ఇంకో రకంగా సాధిస్తుంటుంది అమ్మ. ఉదయం మడితో వంట రాత్రికి మైలతో వంట. అదేమంటే, "బ్రాహ్మల కొంప మడి లేని వంటేమిటి?" అంటుంది. "మరి రాత్రిళ్ళు మైలతో వండుతా వేమిటే? అమ్మా" అంటే "బాగుందేనీ ప్రశ్న! దేముడి దీపం పెట్టాలి కాబట్టి మడి, అయినా ఇలాంటి పనికిమాలిన ప్రశ్నలు అడుగుతావేమే దీపా?" అంటూ సన్నసన్నగా చివాట్లు పెడుతుంది. "వెధవ చీట్లాట పిల్ల దాని పెళ్ళి పట్టదు, సంసారం పట్టదు" అని ఎదురుగా ఆయన్ని సాధించేది. ఎవరైనా అదే మాటంటే మగాడికి కాకపోతే ఆడదానికా అలవాట్లు?" అంటుంది. అమ్మ పోలికలే వచ్చాయి అక్కకి.

 

    "దీపా!"

 

    స్నానం చేసి వచ్చినట్లుంది లలిత మంచం మీద కూర్చుని పిలిచింది.

 

    "స్నానం అయిందా అక్కా?"

 

    "ఆ... నువ్వెళ్ళి చేసిరా!?"

 

    "చేస్తా తొందరేముంది. కాసేపు కబుర్లు చెప్పుకుందాం"

 

    "నువ్వే చెప్పు. అన్నట్లు మరిచేపొయ్యా, బావ నిన్ను మరీ మరీ అడిగానని చెప్పమన్నారు. మధ్యలో చదువు ఆపవద్దు. బాగా చదువుకోమని కూడా చెప్పారు"

 


    "అహ, ఇంకే చెప్పాడేం?"

 


    బావ మధుసూధనం పేరెత్తితే చిర్రెత్తుకొస్తుంది దీపకి. అక్క మనస్సు నొచ్చుకుంటుందేమో అని సహనంతో మాట్లాడుతున్నది.

 

    "బావకి నువ్వంటే ఎంత ప్రేమో?" అంది లలిత అమాయకంగా.

 Previous Page Next Page