Read more!
Next Page 
పన్నీటి కెరటాలు పేజి 1

                                 


                    పన్నీటి కెరటాలు
    
                                           ----కురుమద్దాలి విజయలక్ష్మి


                    
    
    టక్ టక్
    టక్........టక్ టక్
    "అర్దరాత్రి అంకమ్మ సివాలన్నట్లు ఈ చప్పుళ్ళు ఏమిటి?"
    తువ్వాలు పరచుకుని మెట్లమీద అడ్డంగా పడుకొన్న సింహాచలానికి రాత్రి రెండుకావస్తున్నా నిద్రపట్టలేదు. పడుకునే కాలుమీద కాలువేసుకొని బీడీతాగుతూ గతించిన రోజులు గురించి ఆలోచిస్తున్న సింహాచలానికి గుడిలోపలనుంచి టక్ టక్ మన్న శబ్దం వినపడింది.
    "తను శబ్దం నిజంగా విన్నాడా! లేక మాగన్నుగా నిద్రపట్టిందా?" అనుకుంటూ బీడీ అవతల పారేసి చెవి వొగ్గాడు సింహాచలం.
    ఆగి ఆగి
    టక్ టక్ మన్న శబ్దం మళ్ళీ వినవచ్చింది.
    "అమ్మనాయనోయ్! గుడిలో భూతప్రేతగణాలు ఇనపచెప్పులు వేసుకొని నడవటంలేదుకదా?" భయంతో అనుకొన్నాడు సింహాచలం.
    "థూ.....నీబుద్ధి తగలడ. పవిత్రమైన గుడిలోకి దెయ్యాలు భూతాలు ఎలా వస్తాయి?"
    "ఎందుకు రావులే, ఇది పరమేశ్వరీ ఆలయం అయినా ఆయమ్మ భర్త ఈశ్వరుడేకదా! శంకరుడికి చుట్టాలా పక్కాలా భూత ప్రేతగణాలు తప్ప! ఆమ్మవారు వున్నచోట అయ్యవారు ఉంటారు, అయ్యవారికోసం భూతాలు ప్రేతాలు శాకిని ఢాకిని___
    గుడిలోంచివచ్చే చప్పుళ్ళ గురించి సింహాచలం అలా ఆలోచిస్తుండగానే రెండుమూడుసార్లు టార్చీలైటు వెలిగి ఆరటం ఆ ఫోకస్ కంట పడ్డాయి.
    సింహాచలం చటుక్కుని లేచికూర్చున్నాడు.
    సింహాచలం మరీ పల్లెటూరివాడు కాదు. అలాఅని బస్తీలో ఏ రిక్షాయో లాక్కుంటూవుండే పట్నవాసం మనిషి కాదు. అటు బస్తీ ఇటు మరీ పల్లెటూరుకాని ఊళ్ళో ఉంటున్నాడు. తెలుగు సినిమాలు బాగా చూడటంవల్ల ఊసరవిల్లిలా రంగులు మార్చే రాజకీయాలగురించి ప్రతి నిమిషం ప్రజలు మాట్లాడుకోవడం వినివుండటంవల్ల ఎంతో కొంత ప్రపంచజ్ఞానం అలవడింది.
    సింహాచలంకి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చిన తరువాతనే లేచి కూర్చోటం జరిగింది.
    పరమేశ్వరీ ఆలయం కొండమీద వుంది. విజయవాడలోని కనకదుర్గమ్మవారి కొండకన్నా పెద్దకొండ ఇది.
    పరమేశ్వరి అంటే పార్వతీదేవి. ఆమె భర్త పక్కన ఉండాల్సిందే కదా!
    పరమేశ్వరీ ఆలయంలో పరమేశ్వరుడు కూడా ఉన్నాడు. పరమేశ్వరీ పక్కగదిలో చిన్న పానుపట్టము లింగము నాగరాజు నాట్యమయూరుడు నటరాజు. పరమేశ్వరీ విగ్రహమే ఆ గుడిలో పెద్దది. అందుకని గుడిలో పెద్దగదిలో అమ్మవారి విగ్రహం ఉంటుంది. పట్టుచీర, పట్టురవిక. వళ్ళంతా ఆభరణాలు. ఇవిగాక పూలమాలలు పాదాలచెంత పూజ చేసిన కుంకుమరాసి. విగ్రహంలో సజీవమైన జీవకళ ఉట్టిపడుతూ చూడగానే కొట్టొచ్చేలా అందంగా గంభీరంగా ఆకర్షణీయంగా కానవస్తుంది.
    భక్తులు అమ్మవారి దర్శనం తర్వాతనే అయ్యవారి దర్శనం చేస్తారు.
    పూజలు మొక్కుబడులు అర్చనలు కోరికలు కోరటం అవి తీర్చుకోవటం అన్నీ ఆ గుడిలో అమ్మవారికే.
    కొండ ఎక్కాలంటే మెట్లు ఎక్కి వెళ్ళాల్సిందే. మెట్లవేపు తప్ప మిగతా అన్నివేపులా అన్నికొండల్లాగానే చెట్లు చేమలు ఎగుడు దిగుడు రాళ్ళతో ఉంటుంది. కొండపైన ఒకటి రెండు కొట్లు ఉన్నాయి. కుంకుమ పూజ ద్రవ్యాలు టెంకాయలు అమ్మే కొట్లు కొండదిగువన నడిచేమార్గానికి అటూ ఇటూ ఉన్నాయి.
    కొండకి మూడువేపులా చేలు ఓ పక్కన అదైనా కొద్దిదూరాన ఊరు అసిరిపల్లె ఉంది.
    కొండమీద భక్తులకి చెప్పుకోతగ్గ సౌకర్యాలు (హోటలు షాపులు రాత్రిళ్ళువుండే వసతి) లేకపోయినా అమ్మవారి శక్తివల్ల ఎక్కడెక్కడి వాళ్ళూ వచ్చివెళుతుంటారు.
    పరమేశ్వరీ అమ్మవారికి కూడా తప్పలేదు. గిల్టునగలు ఉత్సవాలప్పుడు తప్ప ఎప్పుడూ అసలైన నగలు పెట్టరు. ఆ దేవాలయ అధికారులు పూజారులు కొండదిగువున ఇళ్ళలో ఉంటారు. రాత్రిళ్ళు పైన ఎవరూ ఉండరు. గుడితలుపులు రాత్రి పదితర్వాత మూస్తారు. తిరిగి తెల్లారి ఐదు గంటలకల్లా తెరుస్తారు. కరెంటు ఉండటంవల్ల మెట్లమీద గుడిలోను రాత్రిళ్ళు మొత్తం నాలుగులైట్లు ఉంటాయి.
    గుడి కాపలాకి రాత్రిళ్ళు ఒక వాచ్ మెన్ మాత్రం ఉంటాడు. అదైనా గుడిలోకాదు. గుడిబైట తలుపుల దగ్గర చాలామంది బిచ్చగాళ్ళ నివాసం గుడిమెట్ల మీదనే రాత్రింబవళ్ళు వాళ్ళక్కడనుంచి కదలరు.

Next Page